సాక్షి, వరంగల్: పాలకుర్తి మండలం బొమ్మర గ్రామంలో సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడు అదృశ్యమయ్యారు. అత్తారింట్లో నుంచి బుధవారం రాత్రి స్నేహితులు ఫోన్ చేస్తున్నారని, వారితో మాట్లాడి వస్తానంటూ భార్యకు చెప్పి వెళ్లాడు. రాత్రి 8:30 గంటలకు భార్య ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.
ఇంట్లో నుంచి వెళ్లి 42 గంటలవుతున్నా కానీ యువకుడి ఆచూకీ లభించలేదు. గత ఏడాది డిసెంబర్ 26న వివాహం జరగ్గా, యువకుడి భార్య, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం మధ్యాహ్నం పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
కొడుకుపై తండ్రి ఫిర్యాదు
వరంగల్: ఆస్తులు పంచుకొని తన బాగోగులు చూసుకోవడం లేదని కొడుకుపై ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట దొడ్లకుంటకు చెందిన గుజ్జల రాజిరెడ్డికి చెందిన 15 ఎకరాల భూమిలో కుమారుడు వినయ్ రెడ్డి ఏడెకరాల భూమి రాయించుకున్నాడు. ఇటీవల తల్లి అనారోగ్యంతో మరణించగా తండ్రి రాజిరెడ్డి జీవనం ప్రశ్నార్ధకంగా మారింది.
ఇదీ చదవండి: మంగళూరు బ్యాంకులో దోపిడీ.. ఉద్యోగులను గన్‌తో బెదిరించి..
ఆలనా పాలనా చూసుకునే కొడుకే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.. అలాంటి వాడికి తాను కష్టపడి సంపాదించిన భూమిని తనకు అప్ప చెప్పాలని పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులకు తండ్రి రాజిరెడ్డి ఫిర్యాదు చేశాడు. కుమారుడు వినయ్ రెడ్డి నుండి తనను కాపాడాలని తన వల్ల ప్రాణహాని ఉందని రాజిరెడ్డి పోలీసుల వద్ద వాపోయాడు. వృద్ధాప్యంలో ఉన్న తనకు న్యాయం చేసి ఆదుకోవాలని పోలీసుల వద్ద రాజిరెడ్డి అని 63 ఏళ్ల వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment