
కరోనా సమయంలో చెల్లించాల్సిన బకాయిలు, వడ్డీ చెల్లించలేదని షాపుల ధ్వంసం
200 షాపులకు పైగా కూల్చేసిన పోలీసులు, మున్సిపల్ అధికారులు
టీడీపీ సానుభూతిపరుల షాపుల జోలికి వెళ్లని అధికారులు
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని దామోదరం సంజీవయ్య ప్రధాన కూరగాయల మార్కెట్‌లో మంగళవారం పోలీసులు, నగర పాలక సంస్థ అధికారులు బీభత్సం సృష్టించారు. 2019 కరోనా సమయంలో ఉన్న బకాయిలు, వాటిపై వడ్డీ చెల్లించలేదంటూ దుకాణదారులపై విరుచుకుపడ్డారు. తెల్లవారు జామున నాలుగు గంటలకు దుకాణాలు తెరిచి కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుందామని అన్నీ సిద్ధం చేసుకునే సరికి ఒక్కసారిగా అధికారులు, పోలీసులు మార్కెట్‌ను చుట్టుముట్టారు.
తాత్కాలికంగా వేసుకున్న షెడ్డులను కూలదోసేందుకు ముప్పేట దాడి మొదలెట్టారు. ఇదేం దౌర్జన్యం అని అడిగేలోగానే దుకాణాలు నేలమట్టమయ్యాయి. ముందస్తు సమాచారంగానీ, నోటీసులు గానీ ఇవ్వకుండానే దాదాపు 200 మందికి పైగా మార్కెట్‌ను చుట్టుముట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారు. కూరగాయలను బురదపాల్జేశారు. మార్కెట్‌లో దాదాపు 200కు పైగా హోల్‌సేల్, రిటైల్ దుకాణాలున్నాయి.
ఇవి కాక మరో వంద వరకు చిరు వ్యాపారులు నేలపై పట్టలు పరుచుకుని కూరగాయలు అమ్ముకుంటుంటారు. ప్రతి దుకాణంలో రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు కూరగాయలను నష్ట పోయామంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. దుకాణాలను ధ్వంసం చేసిన అధికారులు.. టీడీపీ సానుభూతిపరుల షాపుల జోలికి వెళ్లకపోవడంతో ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాధితుల నిరసన
కూరగాయల మార్కెట్లోని దుకాణాలపై ఉన్న పట్టలు, తడికలకు మంట పెట్టి అందులో కూరగాయలను దహనం చేసి బాధిత వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలకు నిరసనగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
కార్యాలయం ప్రధాన గేటు ముందు కూర్చొని అధికారుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా సమయంలో చెల్లించాల్సిన అద్దెబకాయిలకు రెండింతలు వడ్డీ వేసి మరీ కట్టాలని వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment