సాక్షి, హైదరాబాద్: హిందువులంటే అదానీ, అంబానీలేనా? అని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కారత్ ప్రశ్నించారు. వారి సంక్షేమం కోసమే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. హిందువుల్లో భాగమైన పేదలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు బీజేపీకి కనిపించరా? అని నిలదీశారు. మతతత్వం, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలనీ, అదానీ, అంబానీల ప్రభుత్వాన్ని కూల్చాలని ఆయన పిలుపునిచ్చారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 17న వరంగల్‌లో ప్రారంభమైన జనచైతన్య యాత్ర ముగింపు సభ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశ్‌కారత్ మాట్లాడుతూ, గతంలో టాటా, బిర్లా ప్రభుత్వం అనే వాళ్లమని, కేంద్రంలో ఇప్పుడున్న సర్కారు అదానీ, అంబానీ ప్రభుత్వంగా మారిపోయిందన్నారు.
అదానీఅక్రమ సంపాదనపై పార్లమెంటులో చర్చించకుండా సమాధానం చెప్పలేక సభను వాయిదా వేస్తున్నారని విమర్శించారు. 2014లో అదానీ ఆస్తులు రూ.50 వేల కోట్లుండేవనీ, మోదీ ప్రధాని అయ్యాక ఇప్పుడు రూ.10.3 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఈ అక్రమ సంపాదనపై దర్యాప్తు సంస్థలు పట్టించుకోవడం లేదనీ, పార్లమెంటులో చర్చకు కేంద్రం అంగీకరించడం లేదని చెప్పారు.
అందుకే రాహుల్‌పై వేటు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలపై, ముఖ్యంగా ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ప్రకాశ్‌కారత్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ముక్త భారత్‌ను మోదీ కోరుకుంటున్నారని విమర్శించారు. అందులో భాగంగానే రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేశారన్నారు. ఆ క్రమంలోనే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. బీఆర్‌ఎస్ నేత కవితలను విచారిస్తున్నారనీ, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేశారని అన్నారు.
కమ్యూనిస్టు పార్టీల మద్దతుతోనే మునుగోడు ఫలితం: తమ్మినేని
మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ అడగడంతో సీపీఎం, సీపీఐ మద్దతు ఇచ్చాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. దీనిపై అప్పట్లో అక్కడక్కడ విమర్శలు వచ్చాయనీ కానీ మునుగోడు ఫలితాలు వచ్చిన తర్వాత సీపీఎం, సీపీఐలు తీసుకున్న వైఖరిపై సానుకూలత వ చ్చిందన్నారు. అక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి కేవలం 10 వేల మెజారిటీతో గెలిచారని, ఈ రెండు పార్టీలు మద్దతు ఇవ్వకపోతే బీఆర్‌ఎస్‌కు ఆ ఫలితం వచ్చేది కాదని తమ్మినేని విశ్లేషించారు.
రాబోయే ఎన్నికల్లో కూడా సీపీఐ, సీపీఎంలతో కలిసి పనిచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో కలిసుంటామా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న కాదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటంలో, ప్రజాసమస్యల పరిష్కారంలో బీఆర్‌ఎస్‌తో కలిసే ఉంటామని స్పష్టం చేశారు. అయితే ఎన్నికలప్పుడు సీట్ల విషయంలో ఎలా ఒప్పందాలు జరుగుతాయో ఇప్పుడే తెలియదన్నారు.
సీట్ల విషయంలో సరిగా ఒప్పందం జరిగితే కలిసి పోటీ చేస్తామని, లేదంటే విడిగా పోటీచేసే అవకాశముందని తమ్మినేని ప్రకటించారు. ఎర్రజెండాలు కలిసి పోటీచేయాలని నిర్ణయించామన్నారు. ఏప్రిల్ 9న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సీపీఐ–సీపీఎం ఆధ్వర్యంలో సంయుక్తంగా పార్టీ శ్రేణులతో సభ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. సభలో సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, సీపీఎం నాయకులు ఎస్.వీరయ్య, పోతినేని సుదర్శన్, జాన్‌వెస్లీ, టి.జ్యోతి, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment