'ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తాం'
న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా కేంద్రంలో మూడో కూటమి అడుగులు వేస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 11 పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తెలిపారు. మూడో కూటమి సమావేశం ముగిసిన తర్వాత శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలన్నీ ఇవాళ సమావేశమయ్యాయని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ విధానాల్లో పెద్ద తేడా లేదన్నారు. యూపీఏ పాలన అవినీతిమయమైందని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ అవినీతి పెచ్చురిల్లిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ఓడించడమే తమ ధ్యేయమన్నారు. ఎన్నికల తర్వాత మూడో కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని కారత్ తెలిపారు. ములాయం, జయలలిత, నితీష్ కుమార్ పేర్లు ప్రధాని అభ్యర్థులుగా చర్చకు వచ్చినట్టు సమాచారం. థర్డ్ ఫ్రంట్ భేటీకి బీజేడీ, ఏజీపీ, జేవీఎం దూరంగా ఉన్నాయి.