పునరాలోచించండి
ములాయంకు లాలూ, శరద్ యాదవ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపంకంపై విభేదాలతో లౌకిక కూటమి నుంచి తప్పుకున్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత ములాయం సింగ్‌ను దారిలోకి తెచ్చుకోవడానికి జనతా పరివార్ తిప్పలు పడుతోంది. ములాయంను బుజ్జగించడానికి జేయూడీ చీఫ్ శరద్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లు శుక్రవారమిక్కడ ములాయం ఇంట్లో ఆయనతో భేటీ అయ్యారు. ఎస్పీ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరారు. అయితే ఎస్పీ అధినేత వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదు.
లాలూ రెండు గంటలు ములాయంతో భేటీ అయ్యారు. ఆ సయయంలో శరద్ కూడా అక్కడే ఉన్నారు. భేటీ తర్వాత శరద్, లాలూ మీడియాతో మాట్లాడుతూ కూటమి కొనసాగింపుపై ధీమా వ్యక్తం చేశారు. 'బిహార్‌లో సోషలిస్టు, లౌకిక ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఎస్పీ నిర్ణయంపై పునరాలోంచాలని నేతాజీ(ములాయం)ను కోరాం. చర్చలు సాగుతున్నాయి. మొత్తం 200 సీట్లు(ఆర్జేడీకి కేటాయించిన 100, జేడీయూ కేటాయించిన 100) నేతాజీ, ఎస్పీవే. ములాయం మా సంరక్షుడు. కూటమి కొనసాగింపు బాధ్యత అందరికంటే ఆయనపైనే ఎక్కువ. ఏవో కొన్ని కారణాలతో ఆయన కలతచెంది, కూటమి నుంచి బయటికి రావాలనుకున్నారు. ఈ ఎన్నికలు బిహార్‌కే కాకుండా మొత్తం దేశానికి కీలకం' అని లాలూ అన్నారు. ములాయంతో సీట్ల పంపకంపై చర్చించలేదని, ఒకటి రెండు రోజుల్లో శుభవార్త వింటారని శరద్ అన్నారు.
సమస్యలు పరిష్కారమవుతాయని బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ పట్నాలో అన్నారు. సీట్ల పంపకంలో తమను సంప్రదించకుండా, తమకు 5 సీట్లే కేటాయించారని, కూటమి నుంచి తప్పుకుని ఒంటరిగా పోటీ చేస్తామని ఎస్పీ గురువారం ప్రకటించడం తెలిసిందే. కాగా, ఉత్తరప్రదేశ్‌లో తమకు శత్రువైన కాంగ్రెస్‌తో బిహార్ ఎన్నికల్లో కలసి కనిపించడం ములాయంకు అసౌకర్యంగా ఉందని ఎస్పీ వర్గాలు చెప్పాయి.