ఎన్నికల హామీలేమయ్యాయి?
- కేంద్రంపై ‘జనతా పరివార్’ నేతల ధ్వజం
- ఢిల్లీలో మహాధర్నా
- చేతులు కలిపిన ములాయం, లాలూ, నితీశ్, శరద్‌యాదవ్
సాక్షి, న్యూఢిల్లీ: పాత మిత్రులు ఏకమయ్యారు.. విభేదాలను పక్కనపెట్టి ఒకే వేదికపై కొలువుదీరారు.. గతంలో ‘జనతా పరివార్’లో కీలక భూమిక పోషించిన ఆరు పార్టీలు సోమవారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించాయి.
ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, ఆ పార్టీ ముఖ్యనేత నితీశ్ కుమార్, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ, ఐఎన్‌ఎల్‌డీ నాయకుడు దుష్యంత్ చౌతాలా, ఎన్సీపీ నేతలు తారిక్ అన్వర్, డీపీ త్రిపాఠిలతోపాటు సమాజ్‌వాదీ జనతాపార్టీ(ఎస్‌జేపీ) నాయకుడు కమల్ మొరార్కా తదితరులు పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన మద్దతును తెలుపుతూ పార్టీ నేత డెరిక్ ఓబ్రీన్ ద్వారా ఒక లేఖను పంపారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో గుప్పించిన హామీలను విస్మరించి విభజన రాజకీయాలకు పాల్పడతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. సర్కారును దీటుగా ఎదుర్కోవాలంటే ఒక్కతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని అన్ని పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.
కేంద్రంపై విమర్శల జడి: విభేదాలను పక్కనపెట్టి బలమైన ప్రతిపక్షంగా ఏర్పడేందుకు ఇతర పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం ఉందని జేడీయూ నేత నితీశ్ కుమార్ అన్నారు. ‘‘మనమంతా ఒకే పార్టీగా ఏర్పడాలి. ఇందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరింది. ములాయంసింగ్ విధివిధానాలు రూపొందించాల్సి ఉంది. ఇతర పార్టీలనూ కలుపుకొని పోదాం.’’ అని అన్నారు. లాలూ ప్రసాద్ మాట్లాడుతూ..‘‘నల్లధనాన్ని వెనక్కి తెస్తే ఒక్కో పేదవాడికి రూ.15 లక్షలు ఇవ్వొచ్చని వీరు చెప్పారు.
ఆ హామీ ఎటు పోయిందో అడగండి.’’ అంటూ మండిపడ్డారు. శరద్ యాదవ్ మత మార్పిళ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రతి ఒక్కరూ ఒకే మతాన్ని ఆచరించాలని అనుకుంటే దానిపైనే మళ్లీ ఎన్నికలకు రావాలంటూ మోదీకి సవాలు విసిరారు. గతంలో రెండుసార్లు ఆరు పార్టీల నేతలు సమావేశమై కొత్త కూటమికి పెట్టాల్సిన పేరు, జెండాపై చర్చించారు. ‘సమాజ్‌వాది జనతాదళ్’గా నామకరణం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.