Janata parivar
-
సొంత అస్తిత్వాన్ని వదులుకోవద్దు!
ములాయంకు సూచించిన ఎస్పీ నేతలు న్యూఢిల్లీ: జనతా పరివార్ కోసం సొంత అస్తిత్వాన్ని వదులుకోవడం సరికాదని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్ నేతలు పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్‌కు సూచించినట్టు సమాచారం. బిహార్‌లో మహా కూటమి నుంచి వైదొలగాలని ఎస్పీ నిర్ణయం తీసుకోవడానికి ముందుగా వారీ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 2017లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడంపైనే పార్టీ దృష్టి సారించాలని, జనతా పరివార్ ద్వారా జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే శక్తిగా ఎదగాలన్న ప్రణాళికలను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని వారు ములాయంతో పేర్కొన్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఎస్పీలను ఓడించడంపైనే ఎస్పీ దృష్టి కేంద్రీకృతం కావాలని, మహాకూటమిలో భాగమైతే ఇది సాధ్యం కాదని పార్టీ సీనియర్ నేతలు రాంగోపాల్ యాదవ్, మహమ్మద్ ఆజంఖాన్‌లు నచ్చజెప్ప సఫలీకృతమైనట్టు వివరించాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఎస్పీ దారుణ ఓటమి చవిచూసింది. కేవలం ఐదుసీట్లనే గెలవగలిగింది. -
జనతా పరివార్ నుంచి తప్పుకున్న ములాయం
లక్నో: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌ను ఎదుర్కొనేందుకు ఏర్పాటైన జనతా పరివార్‌లో లుక లుకలు బయటపడ్డాయి. జనతా పరివార్ కు ములాయం సింగ్ యాదవ్ ఝలక్ ఇచ్చారు. మహా కూటమి నుంచి సమాజ్ వాదీ పార్టీ తప్పుకుంది. సమాజ్ వాదీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగనుంది. కాగా సీట్ల విషయంలో తమకు అన్యాయం జరిగిందనే ఆరోపణతో జనతా పరివార్ నుంచి ఎస్పీ తప్పుకున్నట్లు సమాచారం. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టాలని సమాజ్ వాదీ పార్టీ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇదే జరిగితే బీజేపీకి లాభం చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆర్జేడీ, జేడీ(యూ) కలిసి ఏర్పడిన మహా కూటమికి ములాయం క్రమంగా దూరమవుతున్నారు. సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీతో ములాయం సమావేశమైన రెండు రోజుల తర్వాత ఈ భేటీ జరగడం గమనార్హం. పాట్నాలో ఆదివారం మహాకూటమి నిర్వహించిన ర్యాలీలోనూ ములాయం పాల్గొనలేదు. -
'బీజేపీతోనే నా అడుగు'
న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ బీజేపీతో జతకట్టారు. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని బీహార్‌లో గెలవనివ్వకూడదనే ఉద్దేశంతో బీహార్ సీఎం నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్, ములాయం, తాజాగా శరద్ పవార్ అంతా కలిసి జనతా పరివార్ ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. ఇందుకోసం మహాదళిత నాయకుడు అయిన మాంఝీతో చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు ముగిసిన అనంతరం మాంఝీ ఈ విషయాన్ని ప్రకటించారు. -
'మాంఝీ మాతో రండి'
పాట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమతో కలిసి రావాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీని ఆహ్వానించారు. సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్ (యునెటైడ్), రాష్ట్రీయ జనతా దళ్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, జనతాదళ్ (సెక్యులర్), సమాజ్‌వాదీ జనతా పార్టీలు కలిసి జనతా పరివార్ గా ఏర్పడిన విషయం తెలిసిందే. దీనికి ములాయంసింగ్ యాదవ్ అధినేతగా ఉన్నారు. త్వరలోనే బీహార్‌లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కావాల్సిన అన్ని రకాల బలాలను సమీకరించేందుకు ఇప్పుడు జనతా పరివార్ శ్రమిస్తోంది. కాగా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మాంఝీ నిరాకరించిన నేపథ్యంలో ఆయనను జేడీయూ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం ఆయన సొంతంగా హిందుస్థాని అవామ్ మోర్చా అనే రాజకీయ సంస్థను స్థాపించుకున్నారు. దీంతో ఆ సంస్థను కూడా తమతో చేర్చుకొని మరింత బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో లాలూ మాంఝీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. -
కలిసిన ‘దళా’లు
సంపాదకీయం ఏదీ కారణం లేకుండా జరగదు. రాజకీయ పార్టీలు ఆవిర్భవించడానికైనా, విడిపోవడానికైనా, కలవడానికైనా ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం సహేతుకమా, కాదా అనేది వేరే చర్చ. గతంలో జనతాదళ్గా ఉండి అనంతరకాలంలో ఆరు పార్టీలుగా విడిపోయిన పార్టీలన్నీ న్యూఢిల్లీలో బుధవారం మంచి ముహూర్తం చూసుకుని విలీనమయ్యాయి. ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), నితీష్‌కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ (యూ), లాలూ ప్రసాద్ యాదవ్ అధ్యక్షుడిగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), ఓం ప్రకాశ్ చౌతాలాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ), మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు చెందిన జనతాదళ్(ఎస్), కమల్ మొరార్క నేతృత్వంలోని సమాజ్‌వాదీ జనతా పార్టీ (ఎస్జేపీ)లు విలీనమవుతున్నట్టు ప్రకటించాయి. ఇక పార్టీ పేరూ, జెండా, ఎజెండాల ఖరారే తరవాయి. ఈ పార్టీల నేతలు సమావేశం కావడం మొదలెట్టినప్పటినుంచీ మీడియా ‘జనతా పరివార్’ అనే మాటను వాడుకలోకి తెచ్చింది. కుటుంబాన్ని హిందీలో పరివార్ అంటారు. ఈ పార్టీలన్నిటికీ కుటుంబం అనే మాట వర్తిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే వీరంతా గతంలో రాంమనోహర్ లోహియా సిద్ధాంతాలతో, ఆచరణతో ప్రభావితమైనవారు. ఎన్నో ఉద్యమాల్లో పాలుపంచుకున్నవారు. దాదాపు అందరూ సోషలిస్టులు. అధికారానికి చేరువయ్యాక అచ్చం కుటుంబాల్లో జరిగినట్టే వీరిమధ్య పొరపొచ్చాలు రావడం, పరస్పర కలహాలతో వార్తల్లోకెక్కడం, విడిపోయి ఎవరి బతుకు వారు బతకడంవంటివన్నీ జరిగాయి. అయితే జేడీ(యూ), సమాజ్‌వాదీ జనతాపార్టీ మినహా ఈ పార్టీలన్నీ వేటికవే ఇప్పుడు కుటుంబ పార్టీలుగా మారాయి. అందరికీ వారసులొచ్చేశారు. ములాయంతో మొదలుకొని దేవెగౌడ వరకూ అందరి కుమారులూ ఆయా పార్టీల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ పార్టీల్లో బావమరుదులు, ఇతర బంధువుల పాత్ర కూడా ఎక్కువైంది. అధినేతలకున్నట్టు వారసులకు సిద్ధాంతాల బాదరబందీ ఏమీ లేదు. ఆమాటకొస్తే అధినేతలే ఆ సిద్ధాంతాలనుంచి ఎడంగా జరిగి ఇప్పటికి చాలా దూరం ప్రయాణించారు. కనుక వారసులపై వాటి ప్రభావం లేకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు విలీనానికి సిద్ధపడిన పార్టీలన్నిటికీ ఎవరి రాష్ట్రాలు వారికున్నాయి. ఒక్క జేడీ (యూ), ఆర్జేడీలు మాత్రం బీహార్‌లో ఇన్నాళ్లూ ప్రత్యర్థి పక్షాలుగా ఉన్నాయి. ఈ ఆరు పార్టీలను మాత్రమే జనతా పరివార్‌గా లెక్కేస్తే కొన్ని ఇతర పక్షాలకు అన్యాయం చేసినట్టవుతుంది. జార్జి ఫెర్నాండెజ్ నాయకత్వంలో చురుకైన పాత్ర పోషించి, ప్రస్తుతం బ్రహ్మానంద మండల్, జయా జైట్లీ నేతృత్వంలో ఉన్న సమతా పార్టీ, రాంవిలాస్ పాశ్వాన్ ఆధ్వర్యంలోని లోక్ జనశక్తి పార్టీ కూడా పూర్వపు జనతాదళ్నుంచి వచ్చినవే. ఈ రెండు పార్టీలూ ఇప్పుడు ఎన్డీయే ఛత్రఛాయలో పనిచేస్తున్నాయి. ఇప్పుడు కలిసిన ఆరు పార్టీల్లో ఆర్జేడీ, ఆర్ఎల్డీ యూపీఏలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. ఎస్పీ, జేడీ(యూ), జేడీ(ఎస్), ఐఎన్ఎల్డీ, ఎస్జేపీ తృతీయ ఫ్రంట్‌లో భాగస్వాములు. ఒడిశాలోని బిజూ జనతాదళ్ కూడా ఈ ఫ్రంట్‌లో ఉన్నా విలీనంలో పాలుపంచుకోలేదు. గతంలో తప్పులేమి చేశామో, అప్పట్లో ఎందుకు విడిపోవలసి వచ్చిందో ఆత్మావలోకనం చేసుకుని...తాము సన్నిహితం కావడానికి దోహదపడిన చారిత్రక అవసరమేమిటో చెప్పి ఈ పార్టీలన్నీ విలీనానికి సిద్ధపడితే ప్రజలకు కొత్తగా ఏర్పడబోయే పార్టీ నాలుగు కాలాలపాటు వర్థిల్లుతుందన్న విశ్వాసం ఏర్పడేది. తమ సిద్ధాంతాలేమిటో చెప్పివుంటే వీరందరివల్లా ఒక ప్రత్యామ్నాయం రూపుదిద్దుకుం టుందన్న నమ్మకం కలిగేది. కానీ సమావేశానికి హాజరైన నాయకులెవరూ గత జలసేతు బంధనానికిగానీ, ఇతర వివరాల్లోకిగానీ పోలేదు. అయితే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ పొగరుబోతుదనాన్ని బద్దలుగొడతామని మాత్రం ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదగగలమని ఎస్పీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా అవి పైకి చెప్పే మాటలే. ఇప్పటికి ప్రాంతీయ పార్టీలుగానే ఉన్న ఈ పక్షాలన్నీ కలిసినంతమాత్రాన ఏదో జరుగుతుందని ఎవరికీ నమ్మకం లేదు. ఈ ఏడాది చివరిలో జరగాల్సిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ఈ విలీనానికున్న తక్షణ కర్తవ్యం. వారి తదుపరి కార్యక్రమం 2017లో జరిగే యూపీ ఎన్నికల్లో విజయం సాధించడం. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో బలమైన శక్తిగా ఎదగడం అంత సాధ్యం కాకపోవచ్చునని వారికీ తెలుసు. అప్పటివరకూ కలిసి ఉండటమే వారిముందున్న పెద్ద సవాలు. ఈ విలీనానికి ఎస్పీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం దీన్నే సూచిస్తోంది. జనతా పరివార్ పార్టీల సిద్ధాంతాల మాట అటుంచి, వాటి ఆచరణ ఎప్పుడూ నిలకడగా లేదు. తాత్కాలిక ప్రయోజనాలకో, ప్రలోభాలకో లోబడి నిర్ణయాలను తరచు మార్చుకోవడంవల్ల ప్రజలకు ఆ పార్టీలపై నమ్మకం క్రమేపీ సన్నగిల్లడం ప్రారంభమైంది. 542మంది సభ్యులుండే లోక్‌సభలో ఈ పార్టీలన్నిటికీ కలిపి 15 మంది సభ్యుల బలం మాత్రమే ఉండటం అందుకు నిదర్శనం. బీహార్, యూపీల పరిమితుల్లో ఆలోచిస్తే ఈ పార్టీల ఓటు బ్యాంకు గణనీయమైనదే. అది చీలిపోకుండా ఉండే పక్షంలో సహజంగానే కొత్తగా ఏర్పడే పార్టీకి మేలు కలుగుతుంది. అంతకు మించి జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ పార్టీగా ఎదగాలంటే మాత్రం స్పష్టమైన సిద్ధాంతాలతో, ఆచరణతో జనం ముందుకు రావాల్సి ఉంటుంది. భారత-అమెరికా అణు ఒప్పందం దగ్గరనుంచి ఎఫ్‌డీఐలకు అనుకూలంగా ఓటేయడం వరకూ ఎస్పీకిగానీ, మిగిలిన పార్టీలకుగానీ నిలకడైన, సూత్రబద్ధమైన విధానం లేదు. ఇలాంటి ధోరణులను మార్చుకుంటే మళ్లీ ప్రజలకు చేరువకావడం కష్టమేమీ కాదు. అయితే అంతటి నిబద్ధత, దృఢచిత్తం ఈ నేతలకు ఉన్నాయా అన్నదే ప్రశ్న. కనీసం పార్టీ పేరు, జెండా, ఎజెండాల ఖరారునాటికైనా ఆ విషయంలో ఈ నేతలు స్పష్టతను సాధించాలని ఆశిద్దాం. -
వచ్చేవారం జనతా పరివార్ విలీన ప్రకటన!
న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్న జనతా పరివార్ విలీన ప్రకటన వచ్చేవారంలో వెలువడే అవకాశముంది. ప్రధాన అంశాలపై చర్చలు కొలిక్కి రావడంతో త్వరలోనే జనతా పరివార్ పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), ఆర్జేడీ, జేడీయూ, జేడీఎస్, ఐఎన్ఎల్డీ, సమాజ్‌వాదీ జనతాపార్టీల విలీనంపై ప్రకటన వెలువడే వీలుందని జేడీయూ ఆదివారం తెలిపింది. జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘విలీనం జరగాల్సి ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా అది జరిగి తీరుతుంది’ అని పేర్కొన్నారు. జనతా పరివార్‌లోని పార్టీల్లో ఎస్పీకే పార్లమెంటులో అత్యధిక ఎంపీలున్నందున ఆ పార్టీ అధినేత అయిన ములాయంసింగ్ యాదవే కొత్త పార్టీకి అధ్యక్షునిగా వ్యవహరించొచ్చని జేడీయూ వర్గాలు తెలిపాయి. లోక్‌సభలో ఎస్పీకి ఐదుగురు, ఆర్జేడీకి నలుగురు, జేడీయూ, జేడీఎస్, ఐఎన్ఎల్డీలకు ఇద్దరు చొప్పున మొత్తం 15 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఎస్పీకి 15 మంది, జేడీయూకు 12 మంది, ఐఎన్ఎల్డీ, జేడీఎస్, ఆర్జేడీలకు ఒక్కొక్కరు చొప్పున మొత్తం 30 మంది ఉన్నారు. కాగా, జేడీయూ ప్రధాన కార్యదర్శి కె.సి.త్యాగి మాట్లాడుతూ ఇప్పటికే జనతా పరివార్ పార్టీల విలీనంపై ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీలమధ్య ఏకాభిప్రాయం వచ్చిందని, ఐఎన్ఎల్డీ చీఫ్ ఓంప్రకాశ్ చౌతాలా, జేడీఎస్ చీఫ్ దేవెగౌడలతో కూడా మాట్లాడిన అనంతరం ములాయం ఒకటి, రెండు రోజుల్లో విలీన ప్రణాళికను ఖరారు చేస్తారని వివరించారు. ఏదేమైనా వచ్చేవారంలో దీనిపై ప్రకటన వెలువడే అవకాశముందని తెలిపారు. -
ఎన్నికల హామీలేమయ్యాయి?
కేంద్రంపై ‘జనతా పరివార్’ నేతల ధ్వజం ఢిల్లీలో మహాధర్నా చేతులు కలిపిన ములాయం, లాలూ, నితీశ్, శరద్‌యాదవ్ సాక్షి, న్యూఢిల్లీ: పాత మిత్రులు ఏకమయ్యారు.. విభేదాలను పక్కనపెట్టి ఒకే వేదికపై కొలువుదీరారు.. గతంలో ‘జనతా పరివార్’లో కీలక భూమిక పోషించిన ఆరు పార్టీలు సోమవారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించాయి. ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, ఆ పార్టీ ముఖ్యనేత నితీశ్ కుమార్, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ, ఐఎన్ఎల్డీ నాయకుడు దుష్యంత్ చౌతాలా, ఎన్సీపీ నేతలు తారిక్ అన్వర్, డీపీ త్రిపాఠిలతోపాటు సమాజ్‌వాదీ జనతాపార్టీ(ఎస్జేపీ) నాయకుడు కమల్ మొరార్కా తదితరులు పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన మద్దతును తెలుపుతూ పార్టీ నేత డెరిక్ ఓబ్రీన్ ద్వారా ఒక లేఖను పంపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో గుప్పించిన హామీలను విస్మరించి విభజన రాజకీయాలకు పాల్పడతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. సర్కారును దీటుగా ఎదుర్కోవాలంటే ఒక్కతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని అన్ని పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. కేంద్రంపై విమర్శల జడి: విభేదాలను పక్కనపెట్టి బలమైన ప్రతిపక్షంగా ఏర్పడేందుకు ఇతర పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం ఉందని జేడీయూ నేత నితీశ్ కుమార్ అన్నారు. ‘‘మనమంతా ఒకే పార్టీగా ఏర్పడాలి. ఇందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరింది. ములాయంసింగ్ విధివిధానాలు రూపొందించాల్సి ఉంది. ఇతర పార్టీలనూ కలుపుకొని పోదాం.’’ అని అన్నారు. లాలూ ప్రసాద్ మాట్లాడుతూ..‘‘నల్లధనాన్ని వెనక్కి తెస్తే ఒక్కో పేదవాడికి రూ.15 లక్షలు ఇవ్వొచ్చని వీరు చెప్పారు. ఆ హామీ ఎటు పోయిందో అడగండి.’’ అంటూ మండిపడ్డారు. శరద్ యాదవ్ మత మార్పిళ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రతి ఒక్కరూ ఒకే మతాన్ని ఆచరించాలని అనుకుంటే దానిపైనే మళ్లీ ఎన్నికలకు రావాలంటూ మోదీకి సవాలు విసిరారు. గతంలో రెండుసార్లు ఆరు పార్టీల నేతలు సమావేశమై కొత్త కూటమికి పెట్టాల్సిన పేరు, జెండాపై చర్చించారు. ‘సమాజ్‌వాది జనతాదళ్’గా నామకరణం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
ఈ కూడికలు ఇక చెల్లవు!
సాంఘిక శాస్త్రం మారిన సామాజిక-రాజకీయ నేపథ్యంలో బీజేపీ భావజాలానికి భిన్నమైన ప్రత్యామ్నాయ విధానాలు కలిగిన ప్రతిపక్షం మాత్రమే నిలబడగలదు తప్ప అతుకుల బొంత ప్రయోగాలు ప్రత్యామ్నాయం కాజాలవు. కాంగ్రెస్‌గానీ, కమ్యూనిస్టులుగానీ అలాంటి ప్రత్యామ్నా యంగా నిలవాలంటే అవి తమ సమాధుల్లోంచి లేచి నిలబడి, తమను తాము సంస్కరించు కోవాలి. లేదా ప్రాంతీయ పార్టీలన్నీ సూత్రబద్ధమైన ఫెడరల్ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మూడూ సాధ్యం కానివే. కాబట్టి కొంతకాలం పాటూ దేశం బీజేపీ సామ్రా జ్యంగా, రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల సామంత రాజ్యాలుగా ‘సుస్థిర’ పాలన తప్పక పోవచ్చు. జనతా పరివారం పునరేకీకరణ ముచ్చట మళ్లీ తెర ముందుకు వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొట్టిన దెబ్బకు గింగిరాలు తిరిగిపడ్డ ఈ పార్టీలు ఈసారి నిజాయితీగానే ఏకీకరణ ప్రయత్నాల్లో పడ్డాయి. ఉనికికి సంబంధించిన సమస్య కనుక మొన్న సమావేశమైన ఆరు పార్టీలు త్వరలో ఒకే పార్టీగా అవతరించడం దాదాపు ఖాయమే అనుకోవచ్చు. ఈ ఆరు పార్టీల్లో ప్రధానమైనది ములాయంసింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ). దేశంలోని అతి పెద్ద రాష్ర్టమైన ఉత్తరప్రదేశ్‌లో అది అధికారంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా దెబ్బతిని, తమ పార్టీ గణనీయమైన సంఖ్యలో సీట్లను గెలిస్తే... చిన్న పార్టీల సహకారంతో ప్రధాని కావచ్చని ములాయం కలలు కన్నారు. ఆయన ఆశించినట్టే కాంగ్రెస్ దెబ్బతింది. కానీ ఊహించని విధంగా ఎస్పీ కూడా చతికిలబడింది. యూపీలో ఐదు సీట్లను మాత్రమే దక్కించుకోగలిగింది. బిహార్‌లోని అధికార పార్టీ జనతా దళ్ యునెటైడ్ (జేడీయూ), బీజేపీ పొత్తుతో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్‌కుమార్ మంచి పరిపాలనా దక్షునిగా, నీతిమంతునిగా పేరు తెచ్చుకున్నారు. ఇక బీజేపీ అండలేకుండానే తన పార్టీ బిహార్‌లో నిలదొక్కుకుంటుందని ఆయన భావించారు. ఎన్నికలకు ముందు బీజేపీ తమ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ పేరును ప్రకటించడం సాకుగా నితీష్ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. దీంతో తన సెక్యులర్ ఇమేజ్ పెరిగి నాలుగు ఓట్లు కలిసొస్తాయని ఆయన ఊహించారు. ఆ ధైర్యంతోనే ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. కానీ, కథ అడ్డం తిరిగి జేడీ(యూ) రెండు సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. బిహార్‌కే చెందిన మరో నాయకుడు లాలూప్రసాద్ యాదవ్‌దీ అదే కథ. ప్రధానమంత్రి కావాలని ఆయనా ఒకప్పుడు కలలు కన్నవారే. కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసినా ఆయన పార్టీ ఆర్జేడీకి దక్కింది నాలుగు సీట్లే. ఇక కర్ణాటకలోని జేడీ(ఎస్)... గతంలో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన దేవెగౌడ సొంత పార్టీ. అది గత ఎన్నికల్లో రెండు లోక్‌సభ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక హరియాణా పార్టీ ఇండియన్ యూనియన్ లోక్‌దళ్ (ఐఎన్ ఎల్డీ). చరణ్‌సింగ్ తర్వాత అంతటి పేరున్న జాట్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని చౌధురీ దేవీలాల్ సుపుత్రుడు చౌటాలా నేతృత్వంలోని ఆ పార్టీకి కూడా దక్కింది రెండు లోక్‌సభ సీట్లే. ఆరోదైన సమాజ్‌వాదీ జనతా పార్టీ(ఎస్జేపీ) అక్షరాలా ఆరో వేలే. అది మాజీ ప్రధాని చంద్రశేఖర్ రాజకీయ ఉనికి కోసం చివరి రోజుల్లో పెట్టుకున్న లెటర్ ప్యాడ్ పార్టీ. రాజస్థాన్ బనియా పారిశ్రామిక వేత్త కమల్ మొరార్కా ఆ లెటర్‌ప్యాడ్‌ను కాపాడుకొస్తున్నారు. ఈ ఆరు పార్టీలు ఏకమవడం వల్ల మహా అయితే ములాయం వ్యక్తిగత ప్రతిష్ట కొంత పెరుగుతుంది. ఆయన మూడు, నాలుగు రాష్ట్రాలకు విస్తరించిన పార్టీకి అధ్యక్షుడవుతారు. లోక్‌సభలో ఐదుగురికి బదులు పదిహేను మందికి నేతృత్వం వహిస్తారు. బిహార్‌లో కొత్త పార్టీయే బలమైన పార్టీ అవుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా గెలవచ్చు. అంతకు మించి ఈ పార్టీ ప్రభావాన్ని ఎక్కువగా అంచనా వేయలేం. ఇంకా పుట్టని ఈ సరికొత్త పార్టీ నేతల్లో అత్యధికులు రామ్ మనోహర్ లోహియా ఆలోచనాస్రవంతితో ప్రభావితమైన మాజీ సోషలిస్టులు. కర్పూరీ ఠాకూర్ శిష్యులు. లోహియా వైశ్యుడు. కర్పూరీ ఠాకూర్ క్షురక కుటుంబం నుంచి వచ్చిన వారు. వీరి ప్రభావంతో వెనుకబడిన వర్గాల నుంచి పలువురు నాయకులుగా ఎదిగారు. వారంతా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, ఆచార్య జేబీ కృపలానీల ఆశీస్సులతో జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత అధికారం రుచి మరిగి, పాత సోషలిస్టు భావజాలాన్ని చాలా వరకు వదిలించుకున్నారు. మైనారిటీ ఓట్ల మీది మమకారంతో సెక్యులరి జాన్ని మాత్రం వీడటం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడే జనతా పరివార్ పార్టీ రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలవగలిగే అవకాశం లేదు. మారిన సామాజిక-రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ భావజాలానికి భిన్నమైన ప్రత్యామ్నాయ విధానాలు కలిగిన ప్రతిపక్షం మాత్రమే నిలబడగలదు తప్ప, అతుకుల బొంత ప్రయోగాలు ప్రత్యామ్నాయమూ కావు, సమీప భవిష్యత్తులో అధికారంలోకీ రాలేవు. 1977 ఎన్నికలను భారత రాజకీయాల్లో తొలి ప్రధాన మలుపుగా భావించ వచ్చు. అంతకు మించిన ప్రభావాన్ని చూపిన ముఖ్య మలుపుగా 2014ను భవిష్యత్తు తరాలు గుర్తిస్తాయి. ఈ మలుపు అర్థం కావాలన్నా, ప్రత్యామ్నాయ రాజకీయాల అవతరణను ఊహించాలన్నా మన రాజకీయ, సామాజిక వ్యవస్థల్లో వచ్చిన మార్పులను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. ఎన్ని రాజకీయ పార్టీలు, సంస్థలూ ఉన్నా భారత రాజకీయాలను మూడు ప్రధాన స్రవంతులుగా విభజించవచ్చు. అవి: మితవాదం, మధ్యేమార్గం, అతివాదం లేదా వామపక్షం. ఈ మూడు స్రవంతులు స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం సంస్థానాలు కోల్పోయిన రాజాలు, జమీం దార్లు, జాగీర్దార్లు పెట్టుకున్న ‘స్వతంత్ర పార్టీ’, హిందూ మత లేదా జాతి పునర్వికాసం పేరుతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆశీస్సులతో ఏర్పాటైన ‘భారతీయ జనసంఘ్’లను మితవాద రాజకీయ పక్షాలుగా పరిగణించారు. ఫ్యూడల్ దోపిడీలో నలుగుతున్న రైతులు, కూలీల కోసం, పట్టణ కార్మికుల కోసం పోరాటాలు చేసిన కమ్యూనిస్టులు ఒక పక్క, వెనుకబడిన జాతుల రాజకీయాధికారం కోసం కృషి చేసిన సోషలిస్టులు మరో పక్క కలసి అతివాద రాజకీయ స్రవంతిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన పార్టీగా, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం విహించేదిగా కాంగ్రెస్ పార్టీ మధ్యేమార్గ పార్టీ గుర్తింపుతో చాలా కాలమే అధికారం చలాయించగలిగింది. భిన్న వర్గాలు, జాతులు, భాషలు, సంస్కృతుల వైవిధ్యభరిత భారత సమాజానికి కాంగ్రెస్ పార్టీ గంగా- యమునా తెహజీబ్లా కనిపించింది. అన్ని మతాల వారికి ప్రాతినిథ్యం కల్పించగల రాజకీయ పక్షం అవతారంలో కాంగ్రెస్ తనను తాను ఆవిష్కరింప చేసుకోగలిగింది. అవసరాలనుబట్టి, సందర్భాలనుబట్టి ‘వామపక్ష మధ్యేవాది’ గానూ, ‘మితవాదపక్ష మధ్యేవాది’గానూ కూడా వ్యవహరించింది. అన్ని వర్గాల ప్రయోజనాలను తానే కాపాడగలనన్న భ్రమలను చాలా కాలమే అది కలిగించ గలిగింది. అదే సమయంలో వారసత్వ ఆధిపత్యం కారణంగా ప్రజాస్వామిక లక్షణాలను కోల్పోయింది. ప్రాంతీయ ఆకాంక్షలను, నేతలను ఇముడ్చుకోలే క ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి కారణమైంది. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌లాగే మధ్యేమార్గ విధానాలను పుణికిపుచ్చుకున్నవి కావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్న కొద్దీ ఈ ప్రాంతీయ పార్టీలు బలపడుతుండ టాన్ని మనం గమనిస్తున్నాము. ప్రాంతీయ పార్టీలు బలపడ్డ ప్రతి చోటా కాంగ్రెస్ నిరర్థక పార్టీగా మారుతూవస్తోంది. దానికి పునాది వర్ణాలుగా ఉంటున్న దళిత, గిరిజన, మైనారిటీలు ప్రాంతీయ పార్టీల ప్రభావంలోకి పోయిన ప్రతిచోటా కాంగ్రెస్‌కు మరణమే శరణ్యం. ఇప్పుడు మొత్తంగానే ఆ పార్టీ మరణశయ్యపై ఉంది. అది బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా అవతరించడం అసాధ్యం. మితవాద రాజకీయ స్రవంతి ప్రస్థానం ఇందుకు భిన్నంగా సాగింది. ఆదిలోనే అంతర్థానమైన స్వతంత్ర పార్టీ శక్తులలో అధిక భాగాన్ని తనలో ఇముడ్చుకున్న జనసంఘ్ 1977 నాటి జనతా పార్టీలో విలీనమై, భారతీయ జనతా పార్టీగా పునర్జన్మ ఎత్తింది. అనేక కొత్త కొత్త శక్తులను, వ్యక్తులనూ తనలో ఇముడ్చుకొంటూ, ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థాయికి ఎదిగింది. ఎవరూ శాశ్వత పీఠాధిపతులుగా మారకుండా క్రమం తప్పకుండా నాయకత్వ శ్రేణులను మార్పు చేసుకుంటూ నిత్యనూతనంగా నిలవడమే ఆ పార్టీ ఎదుగుదలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంలా కనిపించే ఈ పరిణామం వెనుక అడుగడుగునా ఉన్న ఆర్ఎస్ఎస్ మార్గ నిర్దేశకత్వం విస్మరించరానిది. ఆర్ఎస్ఎస్ కృషి ఫలించి బీజేపీకి పార్లమెంట్లో పూర్తి మెజారిటీ లభించింది. ఇక ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై ఉంది. సంఘ్ కలలుగనే సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక ఎజెండాను మోదీ ప్రభుత్వం అమలు చేయబోతోంది. సందేహం లేదు. సోషలిస్టు పార్టీ అనతికాలంలోనే ముక్కచెక్కలైంది. జనతాపార్టీలో విలీనమై ఏకమైంది. ఆ తర్వాత తిరిగి అనేక ప్రాంతీయ పార్టీలుగా చీలిపోయి అంతర్థానమైంది. కమ్యూనిస్టు పార్టీలే ప్రధాన వామపక్ష శక్తులుగా ఉనికిని కాపాడుకొస్తున్నాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత కమ్యూనిస్టుల సైద్ధాంతిక పునాది పగుళ్లు బారింది. ఈ నేపథ్యంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకోవడంలో అవి విఫలమయ్యాయి. కాబట్టే దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్న చోట కూడా అవి తమదైన ఒక అభివృద్ధి నమూనాను రూపొందించలేకపోయాయి. చివరికి అవసాన దశకు చేరువయ్యాయి. మూడు స్రవంతుల రాజకీయ ప్రస్థానాలు ఇలా సాగుతుండగా... 2014 నాటికి దేశంలో విద్యావంతులతో కూడిన మధ్యతరగతి బలీయమైన, ప్రభావ శీలమైన వర్గంగా రూపుదాల్చింది. సోషల్ మీడియా ఈ వర్గానికి దన్నుగా నిలిచింది. ఆర్థిక, సామాజిక నిర్వచనాల ప్రకారం ఈ వర్గం జనాభా సుమారు 30 కోట్లు. అమెరికా జనాభాకు సమానం! ఈ వర్గానికి మంచి ఉద్యోగాలు, ఆదాయ మార్గాలు కావాలి. విలాసవంతమైన జీవనం కావాలి. వినియోగ సంస్కృతి కావాలి. వాటిని అందించగల అభివృద్థి నమూనా కావాలి. సార్వత్రిక ఎన్నికల నాటికి కొంత ఆరోగ్యకరమైనదిగా కనిపిస్తున్న బీజేపీ.. మోదీ రూపంలో ఒక ‘అభివృద్ధి నమూనా’ను ఈ వర్గం ముందు నిలిపింది. రాజకీయ పార్టీగా విఫలమైన కాంగ్రెస్ పరిపాలనలోనూ సున్నా మార్కులు తెచ్చుకోగా, వామపక్షాలకు తమదైన అభివృద్ధి ఎజెండానే లేదు. దీంతో ఈ మధ్యతరగతి వర్గాలు బీజేపీ వెనుక సమీకృతమయ్యాయి. సహజంగానే వీరి ప్రభావం మిగతా సమాజంపైనా గణనీయంగా పడింది. మోదీ గుజరాత్ అభివృద్ధి నమూనా, ఇప్పుడు కేంద్రంలో అమలు చేయబోయే అభివృద్ధి నమూనా రెండింటిది ఒకే మితవాద సైద్ధాంతిక ప్రాతిపదిక. పైగా అవేమీ లోపరహితమైనవి కావు. వ్యవసాయరంగంలో జీవనాధారాన్ని కోల్పోతున్న రైతులు, కూలీలకూ, అడవులు, కొండల నుంచి గెంటేస్తే నిర్వాసితులవుతున్న ఆదివాసీలు, గిరిజనులకూ, తీరప్రాంతాల నుంచి తరిమేస్తున్న మత్స్యకారులకూ, నిరుద్యోగులవుతున్న వృత్తిపని వారికీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు లభించక ఆశాభంగం చెందే మధ్యతరగతికి ఆలంబనగా నిలిచే ఓ ప్రత్యామ్నాయం నేడు అవసరం. కాంగ్రెస్‌గానీ, కమ్యూనిస్టులుగానీ అలాంటి ప్రత్యామ్నాయంగా నిలవాలంటే తమ సమాధుల్లోంచి లేచి, నిలబడి తమను తాము సంస్కరించుకోవాలి. లేదా ప్రాంతీయ పార్టీలన్నీ సూత్రబద్ధ మైన, విశాలమైన ఫెడరల్ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి. ఈ మూడూ సాధ్యం కానివే. కాబట్టి కొంతకాలం పాటూ దేశం బీజేపీ సామ్రాజ్యంగా, రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల సామంత రాజ్యాలుగా ‘సుస్థిర’ పాలన తప్పక పోవచ్చు. అయితే అభివృద్ధికి అవసరమైన మార్పును చరిత్ర తన గర్భంలో నిక్షిప్తం చేసుకునే ఉంటుంది. ‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానల మెంతో... ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో...’ -
జనతా పార్టీల విలీనం!
ఐక్య శక్తిగా అవతరించేందుకు 6 పార్టీల అంగీకారం న్యూఢిల్లీ: ‘జనతా పరివార్’ పార్టీల ఏకీకరణకు రంగం సిద్ధమైంది. గతంలో విడిపోయిన 6 పార్టీలు విలీనమై ఐక్య శక్తిగా అవతరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈమేరకు గురువారం ఢిల్లీలో సమాజ్‌వాదీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ నివాసంలో నిర్వహించిన సమావేశంలో జనతాదళ్(లౌకిక), ఆర్జేడీ, జేడీయూ, ఐఎన్ఎల్డీ, సమాజ్‌వాదీ జనతా పార్టీ నేతలు పాల్గొన్నారు. విలీనంపై విధి విధానాలు, కొత్త పార్టీ ఎజెండాను ఖరారు చేసే అధికారాన్ని ములాయంసింగ్ యాదవ్‌కు అప్పగించారు. లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, రాం గోపాల్ యాదవ్, దేవెగౌడ, దుష్యంత్ చౌతాలా, కమల్ మొరాకా భేటీకి హాజరయ్యారు. లెఫ్ట్‌తో కలసి పనిచేస్తాం: నితీష్ పార్లమెంట్ బయట ఆరు పార్టీల ఐక్య పోరులో తొలి అడుగు పడింది. విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించటంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఢిల్లీలో ఈనెల 22న ధర్నా చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. రైతుల సమస్యలు, నిరుద్యోగాన్ని అరికట్టటంపై కేంద్రం విఫలమైందని నేతలు ధ్వజమెత్తారు. విలీనంపై విధివిధానాల ఖరారు బాధ్యతను ములాయంకు అప్పగించినట్లు అనంతరం జేడీయూ నేత నితీష్‌కుమార్ విలేకరులకు తెలిపారు. తమ విధానాలు, సూత్రాలలో సారూప్యం ఉన్నందున ఒకే పార్టీగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రధాని అంటే భయంతోనే జనతా పరివార్ పార్టీలు విలీనానికి సిద్ధమయ్యాయన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఒక వేదికను సిద్ధం చేయటమే తమ ఉద్దేశమన్నారు.