సంపాదకీయం
ఏదీ కారణం లేకుండా జరగదు. రాజకీయ పార్టీలు ఆవిర్భవించడానికైనా, విడిపోవడానికైనా, కలవడానికైనా ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం సహేతుకమా, కాదా అనేది వేరే చర్చ. గతంలో జనతాదళ్‌గా ఉండి అనంతరకాలంలో ఆరు పార్టీలుగా విడిపోయిన పార్టీలన్నీ న్యూఢిల్లీలో బుధవారం మంచి ముహూర్తం చూసుకుని విలీనమయ్యాయి. ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), నితీష్‌కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ (యూ), లాలూ ప్రసాద్ యాదవ్ అధ్యక్షుడిగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), ఓం ప్రకాశ్ చౌతాలాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్‌ఎల్‌డీ), మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు చెందిన జనతాదళ్(ఎస్), కమల్ మొరార్క నేతృత్వంలోని సమాజ్‌వాదీ జనతా పార్టీ (ఎస్‌జేపీ)లు విలీనమవుతున్నట్టు ప్రకటించాయి. ఇక పార్టీ పేరూ, జెండా, ఎజెండాల ఖరారే తరవాయి. ఈ పార్టీల నేతలు సమావేశం కావడం మొదలెట్టినప్పటినుంచీ మీడియా ‘జనతా పరివార్’ అనే మాటను వాడుకలోకి తెచ్చింది. కుటుంబాన్ని హిందీలో పరివార్ అంటారు. ఈ పార్టీలన్నిటికీ కుటుంబం అనే మాట వర్తిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే వీరంతా గతంలో రాంమనోహర్ లోహియా సిద్ధాంతాలతో, ఆచరణతో ప్రభావితమైనవారు. ఎన్నో ఉద్యమాల్లో పాలుపంచుకున్నవారు. దాదాపు అందరూ సోషలిస్టులు. అధికారానికి చేరువయ్యాక అచ్చం కుటుంబాల్లో జరిగినట్టే వీరిమధ్య పొరపొచ్చాలు రావడం, పరస్పర కలహాలతో వార్తల్లోకెక్కడం, విడిపోయి ఎవరి బతుకు వారు బతకడంవంటివన్నీ జరిగాయి. అయితే జేడీ(యూ), సమాజ్‌వాదీ జనతాపార్టీ మినహా ఈ పార్టీలన్నీ వేటికవే ఇప్పుడు కుటుంబ పార్టీలుగా మారాయి. అందరికీ వారసులొచ్చేశారు. ములాయంతో మొదలుకొని దేవెగౌడ వరకూ అందరి కుమారులూ ఆయా పార్టీల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ పార్టీల్లో బావమరుదులు, ఇతర బంధువుల పాత్ర కూడా ఎక్కువైంది. అధినేతలకున్నట్టు వారసులకు సిద్ధాంతాల బాదరబందీ ఏమీ లేదు. ఆమాటకొస్తే అధినేతలే ఆ సిద్ధాంతాలనుంచి ఎడంగా జరిగి ఇప్పటికి చాలా దూరం ప్రయాణించారు. కనుక వారసులపై వాటి ప్రభావం లేకపోవడంలో ఆశ్చర్యం లేదు.
ఇప్పుడు విలీనానికి సిద్ధపడిన పార్టీలన్నిటికీ ఎవరి రాష్ట్రాలు వారికున్నాయి. ఒక్క జేడీ (యూ), ఆర్జేడీలు మాత్రం బీహార్‌లో ఇన్నాళ్లూ ప్రత్యర్థి పక్షాలుగా ఉన్నాయి. ఈ ఆరు పార్టీలను మాత్రమే జనతా పరివార్‌గా లెక్కేస్తే కొన్ని ఇతర పక్షాలకు అన్యాయం చేసినట్టవుతుంది. జార్జి ఫెర్నాండెజ్ నాయకత్వంలో చురుకైన పాత్ర పోషించి, ప్రస్తుతం బ్రహ్మానంద మండల్, జయా జైట్లీ నేతృత్వంలో ఉన్న సమతా పార్టీ, రాంవిలాస్ పాశ్వాన్ ఆధ్వర్యంలోని లోక్ జనశక్తి పార్టీ కూడా పూర్వపు జనతాదళ్‌నుంచి వచ్చినవే. ఈ రెండు పార్టీలూ ఇప్పుడు ఎన్డీయే ఛత్రఛాయలో పనిచేస్తున్నాయి. ఇప్పుడు కలిసిన ఆరు పార్టీల్లో ఆర్జేడీ, ఆర్‌ఎల్‌డీ యూపీఏలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. ఎస్పీ, జేడీ(యూ), జేడీ(ఎస్), ఐఎన్‌ఎల్‌డీ, ఎస్‌జేపీ తృతీయ ఫ్రంట్‌లో భాగస్వాములు. ఒడిశాలోని బిజూ జనతాదళ్ కూడా ఈ ఫ్రంట్‌లో ఉన్నా విలీనంలో పాలుపంచుకోలేదు.
గతంలో తప్పులేమి చేశామో, అప్పట్లో ఎందుకు విడిపోవలసి వచ్చిందో ఆత్మావలోకనం చేసుకుని...తాము సన్నిహితం కావడానికి దోహదపడిన చారిత్రక అవసరమేమిటో చెప్పి ఈ పార్టీలన్నీ విలీనానికి సిద్ధపడితే ప్రజలకు కొత్తగా ఏర్పడబోయే పార్టీ నాలుగు కాలాలపాటు వర్థిల్లుతుందన్న విశ్వాసం ఏర్పడేది. తమ సిద్ధాంతాలేమిటో చెప్పివుంటే వీరందరివల్లా ఒక ప్రత్యామ్నాయం రూపుదిద్దుకుం టుందన్న నమ్మకం కలిగేది. కానీ సమావేశానికి హాజరైన నాయకులెవరూ గత జలసేతు బంధనానికిగానీ, ఇతర వివరాల్లోకిగానీ పోలేదు. అయితే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ పొగరుబోతుదనాన్ని బద్దలుగొడతామని మాత్రం ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదగగలమని ఎస్‌పీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా అవి పైకి చెప్పే మాటలే. ఇప్పటికి ప్రాంతీయ పార్టీలుగానే ఉన్న ఈ పక్షాలన్నీ కలిసినంతమాత్రాన ఏదో జరుగుతుందని ఎవరికీ నమ్మకం లేదు. ఈ ఏడాది చివరిలో జరగాల్సిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ఈ విలీనానికున్న తక్షణ కర్తవ్యం. వారి తదుపరి కార్యక్రమం 2017లో జరిగే యూపీ ఎన్నికల్లో విజయం సాధించడం. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో బలమైన శక్తిగా ఎదగడం అంత సాధ్యం కాకపోవచ్చునని వారికీ తెలుసు. అప్పటివరకూ కలిసి ఉండటమే వారిముందున్న పెద్ద సవాలు. ఈ విలీనానికి ఎస్‌పీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం దీన్నే సూచిస్తోంది.
జనతా పరివార్ పార్టీల సిద్ధాంతాల మాట అటుంచి, వాటి ఆచరణ ఎప్పుడూ నిలకడగా లేదు. తాత్కాలిక ప్రయోజనాలకో, ప్రలోభాలకో లోబడి నిర్ణయాలను తరచు మార్చుకోవడంవల్ల ప్రజలకు ఆ పార్టీలపై నమ్మకం క్రమేపీ సన్నగిల్లడం ప్రారంభమైంది. 542మంది సభ్యులుండే లోక్‌సభలో ఈ పార్టీలన్నిటికీ కలిపి 15 మంది సభ్యుల బలం మాత్రమే ఉండటం అందుకు నిదర్శనం.
బీహార్, యూపీల పరిమితుల్లో ఆలోచిస్తే ఈ పార్టీల ఓటు బ్యాంకు గణనీయమైనదే. అది చీలిపోకుండా ఉండే పక్షంలో సహజంగానే కొత్తగా ఏర్పడే పార్టీకి మేలు కలుగుతుంది. అంతకు మించి జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ పార్టీగా ఎదగాలంటే మాత్రం స్పష్టమైన సిద్ధాంతాలతో, ఆచరణతో జనం ముందుకు రావాల్సి ఉంటుంది. భారత-అమెరికా అణు ఒప్పందం దగ్గరనుంచి ఎఫ్‌డీఐలకు అనుకూలంగా ఓటేయడం వరకూ ఎస్‌పీకిగానీ, మిగిలిన పార్టీలకుగానీ నిలకడైన, సూత్రబద్ధమైన విధానం లేదు. ఇలాంటి ధోరణులను మార్చుకుంటే మళ్లీ ప్రజలకు చేరువకావడం కష్టమేమీ కాదు. అయితే అంతటి నిబద్ధత, దృఢచిత్తం ఈ నేతలకు ఉన్నాయా అన్నదే ప్రశ్న. కనీసం పార్టీ పేరు, జెండా, ఎజెండాల ఖరారునాటికైనా ఆ విషయంలో ఈ నేతలు స్పష్టతను సాధించాలని ఆశిద్దాం.