వచ్చేవారం జనతా పరివార్ విలీన ప్రకటన!
న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్న జనతా పరివార్ విలీన ప్రకటన వచ్చేవారంలో వెలువడే అవకాశముంది. ప్రధాన అంశాలపై చర్చలు కొలిక్కి రావడంతో త్వరలోనే జనతా పరివార్ పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), ఆర్జేడీ, జేడీయూ, జేడీఎస్, ఐఎన్‌ఎల్‌డీ, సమాజ్‌వాదీ జనతాపార్టీల విలీనంపై ప్రకటన వెలువడే వీలుందని జేడీయూ ఆదివారం తెలిపింది. జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘విలీనం జరగాల్సి ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా అది జరిగి తీరుతుంది’ అని పేర్కొన్నారు. జనతా పరివార్‌లోని పార్టీల్లో ఎస్పీకే పార్లమెంటులో అత్యధిక ఎంపీలున్నందున ఆ పార్టీ అధినేత అయిన ములాయంసింగ్ యాదవే కొత్త పార్టీకి అధ్యక్షునిగా వ్యవహరించొచ్చని జేడీయూ వర్గాలు తెలిపాయి.
లోక్‌సభలో ఎస్పీకి ఐదుగురు, ఆర్జేడీకి నలుగురు, జేడీయూ, జేడీఎస్, ఐఎన్‌ఎల్‌డీలకు ఇద్దరు చొప్పున మొత్తం 15 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఎస్పీకి 15 మంది, జేడీయూకు 12 మంది, ఐఎన్‌ఎల్‌డీ, జేడీఎస్, ఆర్జేడీలకు ఒక్కొక్కరు చొప్పున మొత్తం 30 మంది ఉన్నారు. కాగా, జేడీయూ ప్రధాన కార్యదర్శి కె.సి.త్యాగి మాట్లాడుతూ ఇప్పటికే జనతా పరివార్ పార్టీల విలీనంపై ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీలమధ్య ఏకాభిప్రాయం వచ్చిందని, ఐఎన్‌ఎల్‌డీ చీఫ్ ఓంప్రకాశ్ చౌతాలా, జేడీఎస్ చీఫ్ దేవెగౌడలతో కూడా మాట్లాడిన అనంతరం ములాయం ఒకటి, రెండు రోజుల్లో విలీన ప్రణాళికను ఖరారు చేస్తారని వివరించారు. ఏదేమైనా వచ్చేవారంలో దీనిపై ప్రకటన వెలువడే అవకాశముందని తెలిపారు.