జనతా పార్టీల విలీనం!
ఐక్య శక్తిగా అవతరించేందుకు 6 పార్టీల అంగీకారం
న్యూఢిల్లీ: ‘జనతా పరివార్’ పార్టీల ఏకీకరణకు రంగం సిద్ధమైంది. గతంలో విడిపోయిన 6 పార్టీలు విలీనమై ఐక్య శక్తిగా అవతరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈమేరకు గురువారం ఢిల్లీలో సమాజ్‌వాదీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ నివాసంలో నిర్వహించిన సమావేశంలో జనతాదళ్(లౌకిక), ఆర్జేడీ, జేడీయూ, ఐఎన్‌ఎల్‌డీ, సమాజ్‌వాదీ జనతా పార్టీ నేతలు పాల్గొన్నారు. విలీనంపై విధి విధానాలు, కొత్త పార్టీ ఎజెండాను ఖరారు చేసే అధికారాన్ని ములాయంసింగ్ యాదవ్‌కు అప్పగించారు. లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, రాం గోపాల్ యాదవ్, దేవెగౌడ, దుష్యంత్ చౌతాలా, కమల్ మొరాకా భేటీకి హాజరయ్యారు.
లెఫ్ట్‌తో కలసి పనిచేస్తాం: నితీష్
పార్లమెంట్ బయట ఆరు పార్టీల ఐక్య పోరులో తొలి అడుగు పడింది. విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించటంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఢిల్లీలో ఈనెల 22న ధర్నా చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. రైతుల సమస్యలు, నిరుద్యోగాన్ని అరికట్టటంపై కేంద్రం విఫలమైందని నేతలు ధ్వజమెత్తారు. విలీనంపై విధివిధానాల ఖరారు బాధ్యతను ములాయంకు అప్పగించినట్లు అనంతరం జేడీయూ నేత నితీష్‌కుమార్ విలేకరులకు తెలిపారు. తమ విధానాలు, సూత్రాలలో సారూప్యం ఉన్నందున ఒకే పార్టీగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రధాని అంటే భయంతోనే జనతా పరివార్ పార్టీలు విలీనానికి సిద్ధమయ్యాయన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఒక వేదికను సిద్ధం చేయటమే తమ ఉద్దేశమన్నారు.