జనతా పరివార్ నుంచి తప్పుకున్న ములాయం
లక్నో: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌ను ఎదుర్కొనేందుకు ఏర్పాటైన జనతా పరివార్‌లో లుక లుకలు బయటపడ్డాయి. జనతా పరివార్ కు ములాయం సింగ్ యాదవ్ ఝలక్ ఇచ్చారు. మహా కూటమి నుంచి సమాజ్ వాదీ పార్టీ తప్పుకుంది. సమాజ్ వాదీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగనుంది. కాగా సీట్ల విషయంలో తమకు అన్యాయం జరిగిందనే ఆరోపణతో జనతా పరివార్ నుంచి ఎస్పీ తప్పుకున్నట్లు సమాచారం.
కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టాలని సమాజ్ వాదీ పార్టీ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇదే జరిగితే బీజేపీకి లాభం చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆర్జేడీ, జేడీ(యూ) కలిసి ఏర్పడిన మహా కూటమికి ములాయం క్రమంగా దూరమవుతున్నారు.
సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీతో ములాయం సమావేశమైన రెండు రోజుల తర్వాత ఈ భేటీ జరగడం గమనార్హం. పాట్నాలో ఆదివారం మహాకూటమి నిర్వహించిన ర్యాలీలోనూ ములాయం పాల్గొనలేదు.