బిహార్ సీఎం అభ్యర్థి నితీశ్
అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూల సయోధ్య
* జేడీయూ నేత అభ్యర్థిత్వానికి లాలూ ఓకే
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూల మధ్య పొత్తుపై అనిశ్చితి తొలగింది. పొత్తుకు ప్రధాన అడ్డంకిగా మారిన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అంగీకారం కుదిరింది. జేడీయూ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అంగీకరించారు. ఈ ఎన్నికల్లో తానసలు పోటీ చేయబోవడం లేదని లాలూ ప్రకటించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీల కూటమి తరఫున నితీశ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు సోమవారం లాలూ, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్‌ల సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తెలిపారు. ‘నితీశ్ పేరును లాలూజీనే ప్రతిపాదించారు. ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తానన్నారు’ అని ములాయం పేర్కొన్నారు. ఈ సందర్భంగా లాలూ మాట్లాడుతూ.. ‘మతతత్వం అనే విషనాగును అంతం చేసేందుకు ఏ విషాన్నైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను.
మేమంతా కలసి ఆ విషనాగును అంతం చేస్తాం. బిహార్ నుంచి బీజేపీని తుడిచిపెట్టేస్తాం’ అని ప్రతిన బూనారు. ‘నేనీ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. నా కుటుంబం నుంచి కానీ, పార్టీ నుంచి కానీ సీఎం పదవికి పోటీ లేదు. నా భార్యాపిల్లలకు ఆ పదవిపై ఆసక్తి లేదు’ అని స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు విషయంలోనూ సామరస్యపూర్వక నిర్ణయాలుంటాయన్నారు. నితీశ్‌తో సంబంధాల గురించి మాట్లాడుతూ.. ‘నితీశ్, నేను ఒకే కుటుంబానికి చెందినవాళ్లం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాం.
పోరాటాలు చేసుకున్నాం. అయినా, రాజ్యసభ ఎన్నికల సమయంలో జేడీయూలో విభేదాలు వచ్చినప్పుడు బీజేపీ లబ్ధి పొందకుండా ఆ పార్టీకి మద్దతిచ్చాను’ అని వివరించారు. బిహార్ మాజీ సీఎం, నితీశ్ రాజకీయ శత్రువు మాంఝీతో సంబంధాలపై వివరణ ఇస్తూ.. ‘నితీశ్‌ను గద్దె దించితే.. నా నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు.నేను వారి వలలో పడలేదు’ అన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు రఘువంశ్ ప్రసాద్ సహా పలువురు ఆర్జేడీ నేతలు నితీశ్ సీఎం అభ్యర్థిత్వంపై విముఖత వ్యక్తం చేయడంపై స్పందిస్తూ.. ‘వారి అభిప్రాయాలు వారికుండొచ్చు.. కానీ నిర్ణయం తీసేసుకున్నాం’ అన్నారు.
ఎన్డీయే బలోపేతం కావడం వల్లనే..
బిహార్లో ఎన్డీయే బలోపేతం కావడం వల్లనే ఆర్జేడీ, జేడీయూలు ఒక్కటయ్యాయని బీజేపీ పేర్కొంది. మునిగిపోతున్నవారు కనిపించిన చిన్న కొమ్మనైనా పట్టుకుని బయటపడాలనుకున్నట్లుగా వారి పొత్తు ఉందని పార్టీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ తేల్చి చెప్పారు.