బరిలో దూకేది మా వాడే
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడానికి ఏకమైన ఆరుపార్టీల కూటమి ఇపుడు మరో అడుగు ముందుకేసింది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ప్రకటించారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ స్వగృహంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత లాలు ప్రసాద్, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పాల్గొన్న ఈ భేటీలో లాలూ చేసిన ఈ ప్రతిపాదనకు నేతలు తమ ఆమోదం తెలిపారు. తనను అభ్యర్థిగా ప్రతిపాదించిన లాలూకి కృతజ్ఞతలు చెప్పిన సీఎం నితీష్, ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు.
మరోవైపు భారతీయ జనతా పార్టీకి అడ్డుకోవడం తమ ప్రధాన లక్ష్యమని ఆర్జేడీ అధినేత లాలూ తెలిపారు. ఆర్జేడీ నుంచి ముఖ్యమంత్రి పోటీకి ఎవరూ ఆసక్తిగా లేరని ప్రకటించారు. తమ పార్టీ నుంచి గానీ, తన కుటుంబం నుంచి గానీ ఎవరూ పోటీకి సిద్ధంగా లేరు కాబట్టే తాను నితీష్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. జేడీ (యూ) కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ, ఇతర పార్టీలు కలసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు గతంలోనే జేడీయూ నేత శరద్ యాదవ్ వెల్లడించారు. కాగా ఎన్డీఎ ప్రభుత్వానికి దీటుగా ఆరు పార్టీలు ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, ఎస్‌జెపి, జేడీ(ఎస్), ఐఎన్‌ఎల్‌డిల నేతలు జనతా పరివార్‌గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే