పూర్వాంచల్‌లో పోటాపోటీ
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశలో (శనివారం పోలింగ్) ఎస్పీ నేత, మాజీ సీఎం ములాయంసింగ్‌ను లోక్‌సభకు పంపిన ఆజంగఢ్, మాజీ ప్రధాని చంద్రశేఖర్ పుట్టిన బలియా, రెచ్చగొట్టే ప్రసంగాలతో పేరుమోసిన కాషాయ ఎంపీ యోగీ ఆదిత్యనాథ్(ఆర్థిక నేరాలతో జైలు జీవితం అనుభవిస్తున్న ‘సహారా శ్రీ’ సుబ్రతో రాయ్ కూడా) ఆధ్యాత్మిక పీఠమున్న గోరఖ్‌పూర్ జిల్లాలున్నాయి. నేపాల్, బిహార్‌కు సరిహద్దున ఉన్న ఈ పూర్వాంచల్‌లోని జిల్లాలతో కలిపి మొత్తం ఏడు జిల్లాల్లోని 49 సీట్లకు మార్చి నాలుగున పోలింగ్ జరుగుతుంది, బాగా వెనుకబడిన ఈ ప్రాంతంలో యాదవులు, ముస్లింలు, యాదవేతర ఎంబీసీలు గణనీయ సంఖ్యలో ఉన్నారు.
ఇక్కడ మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ బలహీనమైందని అంటున్నారు. ప్రధాన పోటీ బీజేపీ, పాలకపక్షం సమాజ్‌వాదీ పార్టీ మధ్యనేనని అభిప్రాయపడుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ ఎస్పీ భారీ విజయాలు నమోదు చేసుకుంది. ఈ పార్టీ 27, బీఎస్పీ 9 సీట్లు కైవసం చేసుకోగా బీజేపీకి 7, కాంగ్రెస్‌కు 4, ఇతరులకు రెండు సీట్లు దక్కాయి. పూర్వాంచల్‌లో భాగమైన ఈ ఏడు జిల్లాలు నేపాల్, బిహార్, ఝార్ఖండ్‌కు విస్తరించిన భోజపురీ ప్రాంతం కిందకి వస్తాయి. ఉపాధి అవకాశాలు లేక ఈ ప్రాంత ప్రజలు ముంబై, పంజాబ్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలసపోతుంటారు.
మవూ జిల్లా ‘బాహుబలి’ ముక్తార్ అన్సారీ బీఎస్పీ నుంచి పోటీ!
ఇక్కడి మూడు జిల్లాల్లో పేరుమోసిన నేరగాడు ముక్తార్ అన్సారీ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరి మవూ సాదర్ నుంచి పోటీచేస్తున్నారు. ఆయన 1996 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యారు. మొదటిసారి బీఎస్పీ తరఫున, తర్వాత రెండుసార్లు ఇండిపెండెంట్‌గా గెలిచారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. పొరుగునున్న ఘాజీపూర్ జిల్లా మహ్మదాబాద్ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్ హత్యకేసులో నిందితునిగా ముక్తార్ 2005 నవంబర్ నుంచీ జైల్లోనే ఉన్నారు. ఎస్పీలో చేరడానికి ముక్తార్ ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి అఖిలేశ్ అడ్డుకోవడంతో బీఎస్పీలో చేరారు. అంతేగాదు, నాలుగుసార్లు జాతీయ షూటింగ్ చాంపియన్ అయిన కొడుకు అబ్బాస్‌ను పక్కనున్న ఘోసీ నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీ చేయిస్తున్నారు. ఈ రెండు సీట్లపై అందరి దృష్టి నిలిచింది.
పది సీట్ల పెద్ద జిల్లా ఆజంగఢ్
గతంలో కేంద్ర మాజీ మంత్రి చంద్రజీత్ యాదవ్, మాజీ సీఎం రాంనరేష్ యాదవ్ వంటి హేమాహేమీలు ఈ జిల్లా నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించారు. ముస్లింలు, యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ జిల్లాలోని పది సీట్లకు బీజేపీ, ఎస్పీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీట్ల రీత్యా ఇది అతి పెద్ద జిల్లా కాగా, గోరఖ్‌పూర్(9), కుషీనగర్(8) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
బీజేపీ ఓట్లు చీల్చే హిందూ యువ వాహిని అభ్యర్థులు
హిందువులను రెచ్చగొడుతూ, ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేసే ఎంపీ యోగీ ఆదిత్యనాథ్ కొంత అసంతృప్తితో ఉన్నా బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆశీస్సులతో పనిచేసే హిందూ యువసేన చీలికవర్గం గోరఖ్‌పూర్ జిల్లా, దాని చుట్టు పక్కల దాదాపు డజను సీట్లలో పోటీచేస్తూ బీజేపీకి నష్టం కలిగిస్తోంది. యువవాహిని రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ సింగ్‌ను ఇప్పటికే ఆదిత్యనాథ్ బహిష్కరించారు. క్షత్రియ వర్గానికి చెందిన ఈ యోగి అత్యంత వివాదాస్పద నేత. మాజీ ప్రధాని, అప్పటి కాంగ్రెస్ యంగ్‌టర్క్ గ్రూపు నేత అయిన చంద్రశేఖర్ జిల్లా బలియా. బాగా వెనుకబడిన ఈ ప్రాంతాల్లో గత ఐదేళ్లలో అభివృద్ధి జరగకపోవడంతో పరిస్థితి కొంత బీజేపీకి అనుకూలంగా ఉంది. ఎస్పీ 2012 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో సాధించిన ఫలితాలు మెజారిటీ అందించాయి. అయినా, 2014 ఎన్నికల సమయంలో పార్టీకి ‘ఊపు’ తీసుకురావడానికి ములాయం ఆజంగఢ్ నుంచి పోటీచేసి గెలిచారుగాని ఇక్కడ బీజేపీయేతర పక్షాలకు దక్కింది ఈ ఒక్క సీటే.
స్వామిప్రసాద్ మౌర్యకు బీజేపీ సీనియర్ల నుంచి ఇబ్బందులు
2012 మార్చి నుంచి వరుసగా నాలుగేళ్లు బీఎస్పీ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన మాజీ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య కిందటి జూన్‌లో బీజేపీలో చేరారు. ఇప్పుడు కుషీనగర్ జిల్లా ముఖ్యపట్టణం పడరౌనా నుంచి ఆయన మూడోసారి పోటీచేస్తున్నారు. ఆయన బీఎస్పీలో ఉండగా బ్రాహ్మణులు, హిందువులను దూషిస్తూ చేసిన ప్రసంగాల్లోని మాటలతో కూడిన కరపత్రాలను హిందూ జాగరణ్ మంచ్‌లోని అసమ్మతివర్గం రహస్యంగా పంపిణీచేస్తోంది. మాయవతి కేబినెట్‌లో కీలకశాఖలు నిర్వహించిన మౌర్య ఫిరాయింపుతో బీజేపీకి ఎంతో ప్రయోజనం ఉంటుందని భావించారు. ఏదేమైనా పూర్వాంచల్‌లో మెరుగైన ఫలితాలు సాధిస్తేనే బీజేపీ యూపీలో 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడం సాధ్యమౌతుంది.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్