Purvanchal
-
జీఎంఆర్ పవర్‌కు భారీ ఆర్డరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ పవర్ అనుబంధ సంస్థ జీఎంఆర్ స్మార్ట్ ఎలెక్ట్రిసిటీ డి్రస్టిబ్యూషన్ (జీఎస్ఈడీపీఎల్)కు పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ నుంచి రూ. 5,123 కోట్ల విలువ చేసే ఆర్డర్లు లభించాయి. వీటి కింద ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ (వారణాసి, ఆజమ్గఢ్ జోన్, ప్రయాగ్‌రాజ్, మీర్జాపూర్ జోన్)లో 50.17 లక్షల స్మార్ట్ మీటర్ల ఇన్స్టాలేషన్, నిర్వహణ పనులు చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రయాగ్‌రాజ్–మీర్జాపూర్ జోన్ కాంట్రాక్టు విలువ రూ. 2,387 కోట్లుగాను, వారణాసి–ఆజమ్గఢ్ జోన్ కాంట్రాక్టు విలువ రూ. 2,736.65 కోట్లుగాను ఉంటుందని సంస్థ తెలిపింది. త్వరలోనే దక్షిణాంచల్ (ఆగ్రా, అలీగఢ్ జోన్)లో 25.52 లక్షల స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టుకు సంబంధించి దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ నుంచి కూడా కాంట్రాక్టు లభించే అవకాశం ఉందని పేర్కొంది. -
Facebook Live: పోనీయ్.. 300 కి.మీ.లు దాటాలి
లక్నో: బీఎండబ్ల్యూ కారు.. మెరుపు వేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్.. ఫేస్బుక్ లైవ్‌లో అత్యుత్సాహం.. ఇవన్నీ కలిసి నలుగురి ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపేశాయి. 230 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతూ నలుగురు యువకులు ప్రాణాలు బలిచేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం సుల్తాన్పూర్ వద్ద జరిగింది. ఈ ప్రమాదం తాలూకు వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆనంద్ ప్రకాశ్(35), అఖిలేశ్ సింగ్(35), దీపక్ కుమార్(37), మరో వ్యక్తి బీఎండబ్ల్యూ కారులో ఎక్స్‌ప్రెస్ హైవేపై అత్యంత వేగంతో దూసుకెళ్తున్నారు. దీంతో అందులోని వ్యక్తి.. ‘ స్పీడ్ మరింత పెంచు. స్పీడ్ 300 కి.మీ.లు దాటాలి. మనం ఫేస్బుక్ లైవ్‌లో ఉన్నాం’ అని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో అన్నాడు. అప్పటికే ఆ వేగంతో భయపడిన కారులోని వ్యక్తి.. ‘మనం నలుగురం చస్తాం. నెమ్మదిగా పోనీయ్’ అని అరిచాడు. దీంతో డ్రైవర్.. భయపడే వ్యక్తిని వారిస్తూ ‘ అరవకు. నేను అంతటి వేగంతో నడిపి చూపిస్తా’ అని కోప్పడ్డాడు. ఈ వాగ్వాదం నడుమే కారు 230 కి.మీ.ల వేగంలో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టింది. కారు టాప్, ముందుభాగం పగిలిపోయి కారులోని నలుగురూ ఛిద్రమై దూరంగా పడిపోయాడు. అక్కడిక్కడే మరణించారు. -
ఘోర ప్రమాదం.. డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొని 8 మంది మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం జరిగింది. రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక సీహెచ్‌సీ హైదర్‌గఢ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని లక్నోలోని ట్రూమా సెంటర్‌కు తరలించామని వెల్లడించారు. ప్రమాదానికి గురైన రెండు బస్సులు బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు. లక్నోకు 30 కిలోమీటర్ల దూరంలో బారబంకి జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ‘లోనికాత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేంద్రపుర్ మద్రాహా గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులు బిహార్‌లోని సీతామర్హి, సుపాల్ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయి. పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ’ అని ఓ అధికారి వెల్లడించారు. #WATCH | Accident at Purvanchal expressway near Barabanki in UP leaves 6 persons dead & 18 injured after a speeding double-decker bus collided with a stationary one. 3, reported to be critical, referred to trauma centre in Lucknow. Buses were en route from Bihar to Delhi pic.twitter.com/RUELIchJh9 — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 25, 2022 ఇదీ చదవండి: Teacher recruitment scam: ‘ఆ మంత్రి డాన్‌లా ప్రవర్తిస్తున్నారు’ -
రాజకీయ రహదారి!
రహదారులు రాజకీయ రణక్షేత్రంగా మారడమంటే ఇదే! యూపీలో ప్రధాని మోదీ మంగళవారం ఆర్భాటంగా ప్రారంభించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలకు దారి తీస్తోంది. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీలో రూ. 23 వేల కోట్ల పైగా వ్యయంతో నిర్మించిన 341 కి.మీల ఈ కొత్త రహదారి చర్చనీయాంశమైంది. లక్నో నుంచి ఘాజీపూర్, అలాగే బిహార్‌లో బక్సర్ లాంటి చోట్లకు ప్రయాణ సమయాన్ని ఆరేడు గంటల నుంచి ఏకంగా మూడున్నర, నాలుగు గంటలకు తగ్గించే ఈ రహదారి ఘనత ఎవరిది? యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని అధికార బీజేపీ, అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ)లు దేనికవే ఈ ప్రాజెక్టు ఘనత తమదేనని చెప్పుకుంటున్నాయి. ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ విజయానికీ, ఆ ప్రాజెక్ట్కూ ఉన్న లంకె అలాంటిది మరి! యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 160 స్థానాలు, అంటే దాదాపు 40 శాతం సీట్లున్నది పూర్వాంచల్‌లోనే! అక్కడి గెలుపోటములను బట్టే పార్టీల అధికార భవితవ్యం! ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు పెట్టనికోటలుగా భావించే 9 జిల్లాల మీదుగా తాజా రహదారి నిర్మాణం జరగడం గమనార్హం. కేంద్రం చేసిన కొత్త రైతు చట్టాలకు యూపీ పశ్చిమ ప్రాంత రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అందుకే, మళ్ళీ అధికారంలోకి రావడానికి తూర్పు యూపీపై బీజేపీ కన్నేసింది. నిజానికి, ఈ ఎక్స్‌ప్రెస్ వే ఆలోచన ఎస్పీది. గత ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ పార్టీ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తీరా ఎన్నికల్లో ఎస్పీ ఓటమి పాలై, బీజేపీ వచ్చాక అనేక మార్పులు, చేర్పులతో, మూడేళ్ళ పైచిలుకు రికార్డు కాలంలో యోగి దీన్ని నిర్మించారు. అసలీ రోడ్డు ఆలోచన, ఆరంభం తమ ఘనతేనని అఖిలేశ్ ఇప్పుడు గోల చేస్తున్నది అందుకే. బీఎస్పీ సైతం ఈ రోడ్డు రేసులో తానూ ఉన్నానంటోంది. ‘పశ్చిమ యూపీలోని నోయిడాను తూర్పు యూపీలోని జిల్లాలతో అనుసంధానించే రహదారి ప్రణాళిక మేము అధికారంలో ఉండగా సిద్ధం చేసినదే. అప్పట్లో కేంద్రంలోని కాంగ్రెస్ అడ్డుపడడంతో మొదలెట్టలేకపోయాం’ అన్నది మాయావతి వాదన. గతంలో బీఎస్పీ సర్కారు కాలంలో నోయిడా – ఆగ్రా (యమునా) ఎక్స్‌ప్రెస్ వే వస్తే, ఎస్పీ పాలనలో ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణమైంది. ఇప్పుడు ముచ్చటగా మూడోదైన పూర్వాంచల్ రహదారి బీజేపీ ఏలుబడిలో వచ్చింది. ఈ మూడూ యుద్ధ విమానాలు దిగడానికి వీలైనవే. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు కట్టిన హైస్పీడ్ రోడ్లే అయినప్పటికీ, చుట్టుపక్కల కొత్త పట్నాలు, వసతులు వస్తే వీటి వల్ల యూపీ ఆర్థిక ముఖచిత్రమే మారనుంది. గత రెండు రహదార్లూ వాటిని నిర్మించిన పార్టీలకు రాజకీయంగా ఆట్టే కలసి రాలేదు. కానీ, తాజా రహదారి తమకు కలిసొస్తుందని బీజేపీ భావన. ‘ఎక్కడ గతుకులు, గుంతలు మొదలవుతాయో, అక్కడ నుంచి ఉత్తర ప్రదేశ్ పరిధిలోకి అడుగుపెట్టినట్టు’ అని జనవ్యవహారం! అలాంటి చోట భవిష్యత్తులో 8 లేన్లకు సైతం విస్తరించే వీలుగా, 9 జిల్లాల మీదుగా, ఆరు లేన్ల భారీ రహదారి నిర్మాణం బీజేపీ సర్కారు విజయమే. దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన తూర్పు యూపీ (పూర్వాంచల్)లో పురోభివృద్ధికీ, పెట్టుబడులు – పారిశ్రామికీకరణ – ఉపాధి కల్పనతో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరగడానికీ ఈ భారీ రహదారి తోడ్పడుతుంది. అనుబంధంగా వేసిన లింకు రోడ్లతో అంతర్జాతీయ బౌద్ధ పర్యాటకమూ పెరుగుతుందని లెక్క. ఇక, ఎక్స్‌ప్రెస్ వేలో భాగంగా సుల్తాన్పూర్ వద్ద 3.5 కి.మీ మేర నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ అత్యవసర వేళ భారత యుద్ధ విమానాల రాకపోకలకు అనువైనది కావడం విశేషం. ఈ మధ్యే కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇప్పుడీ ఎక్స్‌ప్రెస్ వేల ప్రారంభం, గోరఖ్‌పూర్‌లో ‘ఎయిమ్స్’ – ఇలా వికాస మంత్రంతో ఓటర్ల ఆకర్షణ బీజేపీ వ్యూహం. కానీ, ‘మైనారిటీలకు బీజేపీ వ్యతిరేక’మని ఎస్పీ ఆరోపిస్తోంది. ‘ఎస్పీ ఫక్తు జిన్నావాదీ పార్టీ’ అని బీజేపీ వాదిస్తోంది. ఒకవైపున ప్రియాంక సారథ్యంలో కాంగ్రెస్ ‘మహిళలకు 40 శాతం ఎమ్మెల్యే సీట్లు’ సహా అనేక ప్రకటనలతో ప్రచారం చేస్తోంది. మరోవైపున బీఎస్పీ బ్రాహ్మణవర్గాన్ని తమ వైపు తిప్పుకోవడానికి సకల ప్రయత్నాలూ చేస్తోంది. పూటకో సభ, రోజుకో ప్రదర్శన, ప్రకటనలతో అన్ని పార్టీలూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. మాటల యుద్ధమూ మొదలైపోయింది. పూర్వాంచల్ రహదారి ప్రారంభోత్సవ వేళ సాక్షాత్తూ ప్రధాని మోదీ మాటలే అందుకు నిదర్శనం. మాఫియాల చేతి నుంచి అభివృద్ధి పథానికి యూపీ ఇప్పుడు చేరుకుందంటూ రహదారి ప్రారంభాన్ని రాజకీయ వేదికగా ఆయన మలుచుకున్నారు. అఖిలేశ్ సైతం తక్కువ తినలేదు. యోగి లాంటి ‘చిల్లమ్ జీవి’ (చిలుము పీల్చి, మత్తులో జోగేవారు) వల్ల యూపీకి మేలు జరగదని వివాదం రేపారు. ఇంకోపక్క, ప్రియాంకనూ, రాహుల్‌నీ పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘ఘర్ పే లడ్కా హై. మగర్ లడ్ నహీ సక్తా’ (ఇంట్లో మగపిల్లాడున్నాడు. కానీ, పోరాడలేడు) అని బీజేపీ నేత స్మృతీ ఇరానీ వ్యంగ్యం పోయారు. సాటి మహిళపై లింగ దుర్విచక్షణతో వ్యాఖ్యలెలా చేస్తారని ప్రియాంక మండిపడుతున్నారు. వెరసి, యూపీలో వాతావరణం వేడెక్కుతోంది. ఇదిలా ఉండగా పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, గంగ– ఇలా అనేక భారీ రహదార్లతో యూపీ ఇప్పుడు ‘ఎక్స్‌ప్రెస్ వే రాష్ట్రం’ అని కొందరి మాట. మెజారిటీని సంఘటితం చేసే వ్యూహాలకు ఈ వికాస మంత్రమూ కలిసొస్తుందని యోగి నమ్మకం. మళ్ళీ అధికార పీఠం చేరడానికి ఈ రాజకీయ రహదారులు రాచబాటలవుతాయా? -
యూపీ పీఠానికి ఎక్స్‌ప్రెస్‌వే ఇదేనా?
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలలు గడువు ఉందనగా 341 కి.మీ. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేని ప్రారంభించిన ప్రధాని మోదీ ఎన్నికల సమరశంఖం పూరించారు. తూర్పు యూపీలోని లక్నో, బారాబంకి, అమేథి, అయోధ్య, సుల్తాన్పూర్, అంబేద్కర్ నగర్, అజమ్గఢ్, మావూ, ఘాజీపూర్ జిల్లాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతాన్నే రాష్ట్రానికే ఆర్థికంగా అండదండ ఉండేలా మార్చడానికి వ్యూహరచన చేసిన బీజేపీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని ప్రారంభించింది. ఎన్నికలు ముంచుకొస్తూ ఉండడంతో ఇంకా సదుపాయాలు పూర్తిగా కల్పించకుండా ఆగమేఘాల మీద ప్రారంభోత్సవం నిర్వహించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలోని ఎనిమిది ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడర్ల నిర్మాణానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిద్ధమయ్యారు. రైతుల ఆందోళనలకు అభివృద్ధితో చెక్..! యూపీలో 403 స్థానాలకు గాను పూర్వాంచల్ ప్రాంతంలో 160 స్థానాలున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రతిపక్ష ఎస్పీ, బీఎస్పీలకే ఒకప్పుడు పట్టు ఉంది. 2017 ఎన్నికల్లో మోదీ మ్యాజిక్‌తో బీజేపీ ఈ ప్రాంతంలో మెజార్టీ సీట్లు సాధించి విపక్షాలకు చెక్ పెట్టింది. అజమ్గఢ్, అంబేద్కర్ నగర్లో ఎస్పీ, బీఎస్పీల ధాటికి నిలవలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో తన పట్టు కొనసాగించడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. ‘వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో రైతుల ఆందోళన, ఎస్పీతో రాష్ట్రీయ లోక్‌దళ్ జత కట్టడం వల్ల పశ్చిమ యూపీలో ఆశించిన స్థాయిలో సీట్లు రావనే భయం బీజేపీలో ఉంది. తూర్పున ఎవరి గాలి వీస్తే వారికే ఈ సారి యూపీ పీఠం దక్కే అవకాశం ఉంది. అందుకే బీజేపీ ఈ ప్రాంతంపైనే అత్యధికంగా దృష్టి సారించింది’ అని రాజకీయ విశ్లేషకుటు ఎస్.కె శ్రీవాస్తవ అన్నారు. ఈ ప్రాంతంలో అజంగఢ్, అంబేద్కర్ నగర్, ఘజియాపూర్, మావూ, సుల్తాన్పూర్ జిల్లాల్లో తమ పార్టీ బలహీనపడిందని బీజేపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు అజంగఢ్‌లో యూనివర్సిటీ, ఖుషీనగర్లో విమానాశ్రయం, సిద్ధార్థ్నగర్లో మెడికల్ కాలేజీ , గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్, వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎక్స్‌ప్రెస్ వే ప్రత్యేకతలు ► లక్నో– సుల్తాన్పూర్ హైవే మీదనున్న చాంద్‌సరాయ్ గ్రామం నుంచి ఈ హైవే మొదలవుతుంది. మొత్తం 341 కి.మీ. దూరం ఉన్న ఈ హైవే ఘజియాపూర్ జిల్లా హల్దారియా వరకు కొనసాగుతుంది. ► లక్నో, బారాబంకి, అమేథి, అయోధ్య, సుల్తాన్పూర్, అంబేద్కర్ నగర్, ఆజమ్గఢ్, మావూ, ఘాజీపూర్ జిల్లాల మీదుగా సాగుతుంది. ► దీని నిర్మాణానికి 2018 జులైలో ఆజంగఢ్ వద్ద మోదీ శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి రూ.22,500 కోట్లు ఖర్చు అయింది ► ఆరు లేన్లతో నిర్మించిన దీనిని ఎనిమిది లేన్లకు విస్తరించుకునే అవకాశం ఉంది. ► ఈ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి రాకపోకలు సాగిస్తే లక్నో నుంచి ఘజియాపూర్‌కు పట్టే ప్రయాణం ఆరు గంటల నుంచి 3.5 గంటలకు తగ్గిపోతుంది. ► ప్రతీ వంద కిలోమీటర్లకి ప్రయాణికులు సేదతీరడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్‌లు, టాయిలెట్ సదుపాయాలు, మోటార్ గ్యారేజ్‌లు ఏర్పాటు చేస్తారు. ► దేశ అత్యవసర పరిస్థితుల్లో వాయుసేనకు చెందిన యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ కోసం సుల్తాన్పూర్ జిల్లా కుదేబహార్‌లో 3 కి.మీ.ల పొడవైన రన్ వే నిర్మించారు ► 18 ఫ్లై ఓవర్లు, ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, ఏడు పొడవైన వంతెనలు , 104 చిన్న వంతెనలు, 13 చోట్ల ఇంటర్‌ఛేంజ్ మార్గాలు ఉన్నాయి. ఇక హైవేపై రోడ్డుకు ఇరువైపులా ప్రయాణించడానికి వీలుగా 271 అండర్‌పాసెస్ ఉన్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
యూపీని ఒక్కటి చేస్తుంది
ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంత అభివృద్ధిలో బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. గత ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి పేదరికంలోకి, మాఫియా గుప్పిట్లోకి నెట్టేశాయి. – మోదీ సుల్తాన్పూర్: పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధిపరంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కటిగా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంత అభివృద్ధిలో బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందన్నారు. దేశంలోనే అత్యంత పొడవైన రహదారి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేని మంగళవారం ప్రారంభించిన అనంతరం ప్రధాని ఒక ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవానికి వాయుసేనకు చెందిన హెర్క్యులస్ సీ–130జే విమానంలో మోదీ వచ్చారు. మోదీకి గవర్నర్ ఆనందీబెన్, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మిరాజ్, జాగ్వార్, సుఖోయ్, ఏఎన్–32 యుద్ధ విమానాల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. లక్నో–ఘజియాపూర్ మధ్య 341 కి.మీ. పొడవునా ఈ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. పేదలు, మధ్యతరగతి వారు, రైతులు, వ్యాపారులు అందరికీ ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ఎనలేని లబ్ధి చేకూరుతుందని చెప్పారు. గత యూపీ సీఎంలు తమ సొంతూళ్లను అభివృద్ధి చేసి మిగిలిన ప్రాంతాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే (కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారం) సాధ్యపడుతుందని ప్రధాని అన్నారు. 2014లో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీలో చేపట్టే ప్రాజెక్టులకు అప్పడు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ మోకాలడ్డిందని ఆరోపించారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు పట్టాలెక్కాయని చెప్పారు. -
యూపీ అభివృద్ధికి ఎక్స్‌ప్రెస్ వే అతిపెద్ద నిదర్శనం: మోదీ
-
పూర్వాంచల్‌లో ఎవరిది విజయం?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ఫలితాలను పూర్వాంచల్‌గా పిలిచే తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతం ఎన్నికలు ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి. ఈ ప్రాంతంలో 27 సీట్లు ఉండగా 2014 ఎన్నికల్లో బీజేపీ తన మిత్రపక్షమైన అప్నాదళ్‌ను కలుపుకొని 26 సీట్లను గెలుచుకుంది. కనీసం పది సీట్లలో బీజేపీ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై 20 శాతం అధిక ఓట్లతో విజయం సాధించారు. వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 36 శాతం ఓట్లతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీజేపీ మొత్తంగా 71 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన అప్నాదళ్ రెండు సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు పూర్వాంచల్‌లో బీజేపీ విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువ. బద్ద వైరులైన ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపి మహా కూటమిగా పోటీ చేయడమే అందుకు కారణం. గత ఎన్నికల ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే ఈ రెండు పార్టీలకు వచ్చిన పోలింగ్ శాతం మొత్తం బీజేపీకన్నా ఎక్కువ. గత ఎన్నికల్లో మొత్తంగా బీజేపీకి 42.23 శాతం ఓట్లు రాగా, ఎస్పీకి 20.82 శాతం, బీఎస్పీకి 26.25 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రెండింటి ఓట్ల శాతాన్ని కలిపితే దాదాపు 47 శాతానికిపైగా ఓట్లు, అంటే బీజేపీకన్నా దాదాపు ఐదు శాతం ఓట్లు ఎక్కువ. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి అనుకూల పవనాలు పెరిగితే సాధారణంగా బీజేపీకే ఓట్ల శాతం పెరిగి, ఎస్పీ–బీఎస్పీ పార్టీల కూటమికి ఓట్ల శాతం తక్కువవుతాయి. అయితే అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతోపాటు రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. రాష్ట్రంతోపాటు దేశంలో గ్రామీణ ఆదాయం బాగా తగ్గిపోవడం, వేతనాలు పడిపోవడం, మున్నెన్నడులేని విధంగా నిరుద్యోగం పెరిగిపోవడం, పెద్ద నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా చిల్లర వ్యాపారులు నష్టపోవడం, లక్షల సంఖ్యలో కార్మికులు రోడ్డున పడడం, అభివద్ధి కార్యక్రమాలు అంతంత మాతంగానే విజయం సాధించడం ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రధాన కారణాలు. ఇక మోదీ వ్యక్తిగత ప్రతిష్ట, హిందూత్వ జాతీయ వాదం ఎంతమేరకు పనిచేస్తాయో చెప్పలేం! -
పూర్వాంచల్‌లో పోటాపోటీ
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశలో (శనివారం పోలింగ్) ఎస్పీ నేత, మాజీ సీఎం ములాయంసింగ్‌ను లోక్‌సభకు పంపిన ఆజంగఢ్, మాజీ ప్రధాని చంద్రశేఖర్ పుట్టిన బలియా, రెచ్చగొట్టే ప్రసంగాలతో పేరుమోసిన కాషాయ ఎంపీ యోగీ ఆదిత్యనాథ్(ఆర్థిక నేరాలతో జైలు జీవితం అనుభవిస్తున్న ‘సహారా శ్రీ’ సుబ్రతో రాయ్ కూడా) ఆధ్యాత్మిక పీఠమున్న గోరఖ్‌పూర్ జిల్లాలున్నాయి. నేపాల్, బిహార్‌కు సరిహద్దున ఉన్న ఈ పూర్వాంచల్‌లోని జిల్లాలతో కలిపి మొత్తం ఏడు జిల్లాల్లోని 49 సీట్లకు మార్చి నాలుగున పోలింగ్ జరుగుతుంది, బాగా వెనుకబడిన ఈ ప్రాంతంలో యాదవులు, ముస్లింలు, యాదవేతర ఎంబీసీలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ బలహీనమైందని అంటున్నారు. ప్రధాన పోటీ బీజేపీ, పాలకపక్షం సమాజ్‌వాదీ పార్టీ మధ్యనేనని అభిప్రాయపడుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ ఎస్పీ భారీ విజయాలు నమోదు చేసుకుంది. ఈ పార్టీ 27, బీఎస్పీ 9 సీట్లు కైవసం చేసుకోగా బీజేపీకి 7, కాంగ్రెస్‌కు 4, ఇతరులకు రెండు సీట్లు దక్కాయి. పూర్వాంచల్‌లో భాగమైన ఈ ఏడు జిల్లాలు నేపాల్, బిహార్, ఝార్ఖండ్‌కు విస్తరించిన భోజపురీ ప్రాంతం కిందకి వస్తాయి. ఉపాధి అవకాశాలు లేక ఈ ప్రాంత ప్రజలు ముంబై, పంజాబ్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలసపోతుంటారు. మవూ జిల్లా ‘బాహుబలి’ ముక్తార్ అన్సారీ బీఎస్పీ నుంచి పోటీ! ఇక్కడి మూడు జిల్లాల్లో పేరుమోసిన నేరగాడు ముక్తార్ అన్సారీ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరి మవూ సాదర్ నుంచి పోటీచేస్తున్నారు. ఆయన 1996 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యారు. మొదటిసారి బీఎస్పీ తరఫున, తర్వాత రెండుసార్లు ఇండిపెండెంట్‌గా గెలిచారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. పొరుగునున్న ఘాజీపూర్ జిల్లా మహ్మదాబాద్ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్ హత్యకేసులో నిందితునిగా ముక్తార్ 2005 నవంబర్ నుంచీ జైల్లోనే ఉన్నారు. ఎస్పీలో చేరడానికి ముక్తార్ ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి అఖిలేశ్ అడ్డుకోవడంతో బీఎస్పీలో చేరారు. అంతేగాదు, నాలుగుసార్లు జాతీయ షూటింగ్ చాంపియన్ అయిన కొడుకు అబ్బాస్‌ను పక్కనున్న ఘోసీ నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీ చేయిస్తున్నారు. ఈ రెండు సీట్లపై అందరి దృష్టి నిలిచింది. పది సీట్ల పెద్ద జిల్లా ఆజంగఢ్ గతంలో కేంద్ర మాజీ మంత్రి చంద్రజీత్ యాదవ్, మాజీ సీఎం రాంనరేష్ యాదవ్ వంటి హేమాహేమీలు ఈ జిల్లా నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించారు. ముస్లింలు, యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ జిల్లాలోని పది సీట్లకు బీజేపీ, ఎస్పీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీట్ల రీత్యా ఇది అతి పెద్ద జిల్లా కాగా, గోరఖ్‌పూర్(9), కుషీనగర్(8) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీజేపీ ఓట్లు చీల్చే హిందూ యువ వాహిని అభ్యర్థులు హిందువులను రెచ్చగొడుతూ, ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేసే ఎంపీ యోగీ ఆదిత్యనాథ్ కొంత అసంతృప్తితో ఉన్నా బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆశీస్సులతో పనిచేసే హిందూ యువసేన చీలికవర్గం గోరఖ్‌పూర్ జిల్లా, దాని చుట్టు పక్కల దాదాపు డజను సీట్లలో పోటీచేస్తూ బీజేపీకి నష్టం కలిగిస్తోంది. యువవాహిని రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ సింగ్‌ను ఇప్పటికే ఆదిత్యనాథ్ బహిష్కరించారు. క్షత్రియ వర్గానికి చెందిన ఈ యోగి అత్యంత వివాదాస్పద నేత. మాజీ ప్రధాని, అప్పటి కాంగ్రెస్ యంగ్‌టర్క్ గ్రూపు నేత అయిన చంద్రశేఖర్ జిల్లా బలియా. బాగా వెనుకబడిన ఈ ప్రాంతాల్లో గత ఐదేళ్లలో అభివృద్ధి జరగకపోవడంతో పరిస్థితి కొంత బీజేపీకి అనుకూలంగా ఉంది. ఎస్పీ 2012 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో సాధించిన ఫలితాలు మెజారిటీ అందించాయి. అయినా, 2014 ఎన్నికల సమయంలో పార్టీకి ‘ఊపు’ తీసుకురావడానికి ములాయం ఆజంగఢ్ నుంచి పోటీచేసి గెలిచారుగాని ఇక్కడ బీజేపీయేతర పక్షాలకు దక్కింది ఈ ఒక్క సీటే. స్వామిప్రసాద్ మౌర్యకు బీజేపీ సీనియర్ల నుంచి ఇబ్బందులు 2012 మార్చి నుంచి వరుసగా నాలుగేళ్లు బీఎస్పీ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన మాజీ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య కిందటి జూన్‌లో బీజేపీలో చేరారు. ఇప్పుడు కుషీనగర్ జిల్లా ముఖ్యపట్టణం పడరౌనా నుంచి ఆయన మూడోసారి పోటీచేస్తున్నారు. ఆయన బీఎస్పీలో ఉండగా బ్రాహ్మణులు, హిందువులను దూషిస్తూ చేసిన ప్రసంగాల్లోని మాటలతో కూడిన కరపత్రాలను హిందూ జాగరణ్ మంచ్‌లోని అసమ్మతివర్గం రహస్యంగా పంపిణీచేస్తోంది. మాయవతి కేబినెట్లో కీలకశాఖలు నిర్వహించిన మౌర్య ఫిరాయింపుతో బీజేపీకి ఎంతో ప్రయోజనం ఉంటుందని భావించారు. ఏదేమైనా పూర్వాంచల్‌లో మెరుగైన ఫలితాలు సాధిస్తేనే బీజేపీ యూపీలో 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడం సాధ్యమౌతుంది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్