మంగళవారం సుల్తాన్‌పూర్ వద్ద పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై దిగిన మిరేజ్–2000 ఫైటర్ జెట్
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలలు గడువు ఉందనగా 341 కి.మీ. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేని ప్రారంభించిన ప్రధాని మోదీ ఎన్నికల సమరశంఖం పూరించారు. తూర్పు యూపీలోని లక్నో, బారాబంకి, అమేథి, అయోధ్య, సుల్తాన్‌పూర్, అంబేద్కర్ నగర్, అజమ్‌గఢ్, మావూ, ఘాజీపూర్ జిల్లాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతాన్నే రాష్ట్రానికే ఆర్థికంగా అండదండ ఉండేలా మార్చడానికి వ్యూహరచన చేసిన బీజేపీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని ప్రారంభించింది. ఎన్నికలు ముంచుకొస్తూ ఉండడంతో ఇంకా సదుపాయాలు పూర్తిగా కల్పించకుండా ఆగమేఘాల మీద ప్రారంభోత్సవం నిర్వహించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలోని ఎనిమిది ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడర్ల నిర్మాణానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిద్ధమయ్యారు.
రైతుల ఆందోళనలకు అభివృద్ధితో చెక్..!
యూపీలో 403 స్థానాలకు గాను పూర్వాంచల్ ప్రాంతంలో 160 స్థానాలున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రతిపక్ష ఎస్‌పీ, బీఎస్‌పీలకే ఒకప్పుడు పట్టు ఉంది. 2017 ఎన్నికల్లో మోదీ మ్యాజిక్‌తో బీజేపీ ఈ ప్రాంతంలో మెజార్టీ సీట్లు సాధించి విపక్షాలకు చెక్ పెట్టింది. అజమ్‌గఢ్, అంబేద్కర్ నగర్‌లో ఎస్పీ, బీఎస్‌పీల ధాటికి నిలవలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో తన పట్టు కొనసాగించడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. ‘వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో రైతుల ఆందోళన, ఎస్‌పీతో రాష్ట్రీయ లోక్‌దళ్ జత కట్టడం వల్ల పశ్చిమ యూపీలో ఆశించిన స్థాయిలో సీట్లు రావనే భయం బీజేపీలో ఉంది. తూర్పున ఎవరి గాలి వీస్తే వారికే ఈ సారి యూపీ పీఠం దక్కే అవకాశం ఉంది.
అందుకే బీజేపీ ఈ ప్రాంతంపైనే అత్యధికంగా దృష్టి సారించింది’ అని రాజకీయ విశ్లేషకుటు ఎస్.కె శ్రీవాస్తవ అన్నారు. ఈ ప్రాంతంలో అజంగఢ్, అంబేద్కర్ నగర్, ఘజియాపూర్, మావూ, సుల్తాన్‌పూర్ జిల్లాల్లో తమ పార్టీ బలహీనపడిందని బీజేపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు అజంగఢ్‌లో యూనివర్సిటీ, ఖుషీనగర్‌లో విమానాశ్రయం, సిద్ధార్థ్‌నగర్‌లో మెడికల్ కాలేజీ , గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్, వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎక్స్‌ప్రెస్ వే ప్రత్యేకతలు
► లక్నో– సుల్తాన్‌పూర్ హైవే మీదనున్న చాంద్‌సరాయ్ గ్రామం నుంచి ఈ హైవే మొదలవుతుంది. మొత్తం 341 కి.మీ. దూరం ఉన్న ఈ హైవే ఘజియాపూర్ జిల్లా హల్‌దారియా వరకు కొనసాగుతుంది.
► లక్నో, బారాబంకి, అమేథి, అయోధ్య, సుల్తాన్‌పూర్, అంబేద్కర్ నగర్, ఆజమ్‌గఢ్, మావూ, ఘాజీపూర్ జిల్లాల మీదుగా సాగుతుంది.
► దీని నిర్మాణానికి 2018 జులైలో ఆజంగఢ్ వద్ద మోదీ శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి రూ.22,500 కోట్లు ఖర్చు అయింది
► ఆరు లేన్లతో నిర్మించిన దీనిని ఎనిమిది లేన్లకు విస్తరించుకునే అవకాశం ఉంది.
► ఈ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి రాకపోకలు సాగిస్తే లక్నో నుంచి ఘజియాపూర్‌కు పట్టే ప్రయాణం ఆరు గంటల నుంచి 3.5 గంటలకు తగ్గిపోతుంది.
► ప్రతీ వంద కిలోమీటర్లకి ప్రయాణికులు సేదతీరడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్‌లు, టాయిలెట్ సదుపాయాలు, మోటార్ గ్యారేజ్‌లు ఏర్పాటు చేస్తారు.
► దేశ అత్యవసర పరిస్థితుల్లో వాయుసేనకు చెందిన యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ కోసం సుల్తాన్‌పూర్ జిల్లా కుదేబహార్‌లో 3 కి.మీ.ల పొడవైన రన్ వే నిర్మించారు
► 18 ఫ్లై ఓవర్లు, ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, ఏడు పొడవైన వంతెనలు , 104 చిన్న వంతెనలు, 13 చోట్ల ఇంటర్‌ఛేంజ్ మార్గాలు ఉన్నాయి. ఇక హైవేపై రోడ్డుకు ఇరువైపులా ప్రయాణించడానికి వీలుగా 271 అండర్‌పాసెస్ ఉన్నాయి.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment