express way inauguration
-
‘ఉచిత హామీల’పై మోదీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
లక్నో: ఉచిత హామీలతో ఓట్లు అడిగే విధానంపై ప్రజలను హెచ్చరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అది ఒక 'స్వీట్ కల్చర్' అంటూ అభివర్ణించారు. ఉచిత హామీలు దేశాభివృద్ధికో ఎంతో ప్రమాదకరమని పేర్కొన్నారు. 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించిన అనంతరం ఉత్తర్‌ప్రదేశ్, జలాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు మోదీ. ఉత్తర్‌ప్రదేశ్‌లో గత ప్రభుత్వాలు, పాలకులపై విమర్శలు గుప్పించారు మోదీ.' వేగవంతమైన అనుసంధానతతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రధాన మార్పులు తీసుకొస్తోంది. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ద్వారా చిత్రకూట్ నుంచి దిల్లీ చేరుకునేందుకు 3-4 గంటల సమయం తగ్గుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే వాహనాల స్పీడ్ పెంచటమే కాకుండా పరిశ్రమల అభివృద్ధిని సైతం పరిగెట్టేలా చేస్తుంది. రెవారి(ఒకరకమైన స్వీట్) సంస్కృతి దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరం. దేశ ప్రజలు ముఖ్యంగా యువత దీనిని గుర్తుంచుకోవాలి. దేశాభివృద్ధి ముఖ్య ఉద్దేశం, గౌరవం అనే రెండు అంశాలపై ఆధారపడి ముందుకు సాగుతోంది. ప్రస్తుత అవసరాల కోసమే సౌకర్యాలను ఏర్పాటు చేయటం లేదు, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేస్తున్నాం' అని పేర్కొన్నారు మోదీ. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే విశేషాలు.. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల గుండా దిల్లీకి చేరుకుంటుంది. దీనిని సుమారు రూ.14,850 కోట్లు వ్యయంతో నిర్మించారు. 2020, ఫిబ్రవరి 29న శంకుస్థాపన చేయగా.. 28 నెలల్లోనే దీనిని పూర్తి చేశారు. సుమారు 296 కిలోమీటర్లు ఉంటుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిత్రకూట్ నుంచి దిల్లీకి చేరుకునేందుకు గతంతో పోలిస్తే సుమారు 3-4 గంటల సమయం ఆదా అవుతుంది. ఇదీ చూడండి: Gujarat Riots: గుజరాత్ అల్లర్ల వెనుక షాకింగ్ నిజాలు.. మోదీని గద్దె దింపేందుకే కాంగ్రెస్ ప్లాన్! -
యూపీ పీఠానికి ఎక్స్‌ప్రెస్‌వే ఇదేనా?
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలలు గడువు ఉందనగా 341 కి.మీ. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేని ప్రారంభించిన ప్రధాని మోదీ ఎన్నికల సమరశంఖం పూరించారు. తూర్పు యూపీలోని లక్నో, బారాబంకి, అమేథి, అయోధ్య, సుల్తాన్పూర్, అంబేద్కర్ నగర్, అజమ్గఢ్, మావూ, ఘాజీపూర్ జిల్లాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతాన్నే రాష్ట్రానికే ఆర్థికంగా అండదండ ఉండేలా మార్చడానికి వ్యూహరచన చేసిన బీజేపీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని ప్రారంభించింది. ఎన్నికలు ముంచుకొస్తూ ఉండడంతో ఇంకా సదుపాయాలు పూర్తిగా కల్పించకుండా ఆగమేఘాల మీద ప్రారంభోత్సవం నిర్వహించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలోని ఎనిమిది ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడర్ల నిర్మాణానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిద్ధమయ్యారు. రైతుల ఆందోళనలకు అభివృద్ధితో చెక్..! యూపీలో 403 స్థానాలకు గాను పూర్వాంచల్ ప్రాంతంలో 160 స్థానాలున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రతిపక్ష ఎస్పీ, బీఎస్పీలకే ఒకప్పుడు పట్టు ఉంది. 2017 ఎన్నికల్లో మోదీ మ్యాజిక్‌తో బీజేపీ ఈ ప్రాంతంలో మెజార్టీ సీట్లు సాధించి విపక్షాలకు చెక్ పెట్టింది. అజమ్గఢ్, అంబేద్కర్ నగర్లో ఎస్పీ, బీఎస్పీల ధాటికి నిలవలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో తన పట్టు కొనసాగించడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. ‘వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో రైతుల ఆందోళన, ఎస్పీతో రాష్ట్రీయ లోక్‌దళ్ జత కట్టడం వల్ల పశ్చిమ యూపీలో ఆశించిన స్థాయిలో సీట్లు రావనే భయం బీజేపీలో ఉంది. తూర్పున ఎవరి గాలి వీస్తే వారికే ఈ సారి యూపీ పీఠం దక్కే అవకాశం ఉంది. అందుకే బీజేపీ ఈ ప్రాంతంపైనే అత్యధికంగా దృష్టి సారించింది’ అని రాజకీయ విశ్లేషకుటు ఎస్.కె శ్రీవాస్తవ అన్నారు. ఈ ప్రాంతంలో అజంగఢ్, అంబేద్కర్ నగర్, ఘజియాపూర్, మావూ, సుల్తాన్పూర్ జిల్లాల్లో తమ పార్టీ బలహీనపడిందని బీజేపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు అజంగఢ్‌లో యూనివర్సిటీ, ఖుషీనగర్లో విమానాశ్రయం, సిద్ధార్థ్నగర్లో మెడికల్ కాలేజీ , గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్, వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎక్స్‌ప్రెస్ వే ప్రత్యేకతలు ► లక్నో– సుల్తాన్పూర్ హైవే మీదనున్న చాంద్‌సరాయ్ గ్రామం నుంచి ఈ హైవే మొదలవుతుంది. మొత్తం 341 కి.మీ. దూరం ఉన్న ఈ హైవే ఘజియాపూర్ జిల్లా హల్దారియా వరకు కొనసాగుతుంది. ► లక్నో, బారాబంకి, అమేథి, అయోధ్య, సుల్తాన్పూర్, అంబేద్కర్ నగర్, ఆజమ్గఢ్, మావూ, ఘాజీపూర్ జిల్లాల మీదుగా సాగుతుంది. ► దీని నిర్మాణానికి 2018 జులైలో ఆజంగఢ్ వద్ద మోదీ శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి రూ.22,500 కోట్లు ఖర్చు అయింది ► ఆరు లేన్లతో నిర్మించిన దీనిని ఎనిమిది లేన్లకు విస్తరించుకునే అవకాశం ఉంది. ► ఈ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి రాకపోకలు సాగిస్తే లక్నో నుంచి ఘజియాపూర్‌కు పట్టే ప్రయాణం ఆరు గంటల నుంచి 3.5 గంటలకు తగ్గిపోతుంది. ► ప్రతీ వంద కిలోమీటర్లకి ప్రయాణికులు సేదతీరడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్‌లు, టాయిలెట్ సదుపాయాలు, మోటార్ గ్యారేజ్‌లు ఏర్పాటు చేస్తారు. ► దేశ అత్యవసర పరిస్థితుల్లో వాయుసేనకు చెందిన యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ కోసం సుల్తాన్పూర్ జిల్లా కుదేబహార్‌లో 3 కి.మీ.ల పొడవైన రన్ వే నిర్మించారు ► 18 ఫ్లై ఓవర్లు, ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, ఏడు పొడవైన వంతెనలు , 104 చిన్న వంతెనలు, 13 చోట్ల ఇంటర్‌ఛేంజ్ మార్గాలు ఉన్నాయి. ఇక హైవేపై రోడ్డుకు ఇరువైపులా ప్రయాణించడానికి వీలుగా 271 అండర్‌పాసెస్ ఉన్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
Purvanchal Expressway: విమానాలకు రన్‌వేగా..
లక్నో: దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అయిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేని భారత ప్రధాని నరేంద్రమోది నవంబర్ 16న ప్రారంభించనున్నారు. పైగా లక్నోలోని చాంద్ సరాయ్లో మొదలుకొని ఈ ఎక్స్‌ప్రెస్‌వే 340 కిలోమీటర్ల పొడవుతో ఘాజీపూర్ జిల్లాలోని హైదరియా గ్రామంలో ముగుస్తుంది. అంతేకాదు ఇది అజంగఢ్, బారాబంకి, అమేథి, సుల్తాన్పూర్, అయోధ్య, అంబేద్కర్‌నగర్, ఘాజీపూర్, మౌ గుండా తదితరప్రాంతాలను కలుపుతూ వెళుతుంది. (చదవండి: ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్) ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మిక ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఈ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే భారత వైమానిక దళానికి చెందిన విమానాలకు అత్యవసర రన్‌వేగా కూడా ఉపయోగించటమే కాక అత్యవసర పరిస్థితుల్లో ఐఏఎఫ్‌కి చెందిన ఫైటర్ జెట్లకు కూడా ఎయిర్‌స్ట్రిప్( అత్యవసర ల్యాండింగ్ కోసం తాత్కాలిక స్టేషన్)గా కూడా ఉపయోగడనుంది. (చదవండి: కష్టపడేతత్వం ఉంటే చాలు... కుటుంబ నేపథ్యం, ఇంగ్లీష్ పరిజ్ఞానంతో పని లేదు) -
అడ్డంకులు, ఆలస్యం వారి నైజం
గుర్‌గ్రామ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అడ్డంకులు సృష్టించడం ద్వారా ప్రాజెక్టులను జాప్యం చేసి ప్రజలను మోసగించిందని విమర్శించారు. సోమవారం ఆయన హరియాణా రాష్ట్రం గుర్‌గ్రామ్ జిల్లాలోని 83 కిలోమీటర్ల కుండ్లి–మనేసర్–పల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. అనంతరం సుల్తాన్‌పూర్‌లో జరిగిన సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 3.2 కిలోమీటర్ల వల్లభ్‌గఢ్– ముజేసర్ మెట్రో రైల్ లింక్ ప్రారంభోత్సవం, పల్వాల్ జిల్లాలో శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘హర్యానా ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన రోజు. చేపట్టిన పనిని దృఢ సంకల్పంతో పూర్తి చేయడమనే మా ప్రభుత్వ వైఖరితోపాటు గత పాలకులు ఇదే పనిని అసంపూర్తిగా వదిలేసిన తీరును మనం ఇక్కడ గమనించాలి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 9 ఏళ్ల క్రితమే ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడల సమయంలోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు. 12 ఏళ్లు పట్టింది. అంచనా వ్యయం రూ.1,200 కోట్ల నుంచి భారీగా పెరిగిపోయింది. కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో (సీడబ్ల్యూజీ కుంభకోణం) జరిగిందే, ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలోనూ చోటుచేసుకుంది. అవాంతరాలు కల్పించడం, తప్పుదోవ పట్టించడం, ఆలస్యం చేయడం (అట్కానా, భట్కానా, లట్కానా) గత పాలకుల నైజం. దీనివల్ల రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రజల డబ్బు వృథా కావడంతోపాటు, ప్రజలకు అన్యాయం ఎలా జరిగిందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 135 కిలోమీటర్ల పొడవైన కేఎంపీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.6,400 కోట్లు వెచ్చించింది. దీనిలోని 52 కిలోమీటర్ల రహదారి 2016లోనే అందుబాటు లోకి వచ్చింది. వల్లభ్‌గఢ్– ముజేసర్ మెట్రో రైల్ లింక్ నిర్మాణానికి రూ.580 కోట్లు ఖర్చు కాగా, శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి రూ.989 కోట్లు కేటాయించారు. జాతీయ రాజధాని ప్రాంతంలోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి రావడంతో ఢిల్లీకి వాహనాల రాకపోకల రద్దీ గణనీయంగా తగ్గడంతోపాటు రాజధాని ప్రాంతంలో కాలుష్యం కూడా తగ్గుముఖం పట్టనుంది. పూర్తికాని కేఎంపీతో ముప్పు: కాంగ్రెస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అసంపూర్తి కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేను చట్టవిరుద్ధంగా ప్రారంభించి ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల సమయంలో తక్షణ లబ్ధి పొందే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఎక్స్‌ప్రెస్‌వేపై రాకపోకలను ప్రారంభించారని విమర్శించింది. -
ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన మోదీ.. విశేషాలు
న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆదివారం ఈ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఓపెన్ టాప్ కారులో ఆరు కిలోమీటర్ల దూరం రోడ్‌షో నిర్వహించారు. నిజాముద్దీన్ బ్రిడ్జ్ నుంచి ఢిల్లీ యూపీ బార్డర్ వరకు నిర్మించతలపెట్టిన ఈ ఎక్స్‌ప్రెస్ వేలో తొలి దశగా 8.360 కిలోమీటర్లను అత్యంత తక్కువకాలంలో నిర్మించి రికార్డు నెలకొల్పారు. మొదట 30 నెలలుగా ప్రాజెక్టు కాలం అంచనా వేసినా, కేవలం18 నెలల్లోనే ఈ 14 లైన్ల ఎక్స్‌ప్రెస్‌వేను పూర్తి చేయడం విశేషం. ఎక్స్‌ప్రెస్‌వే విశేషాలు.. తొలి దశ రోడ్డు నిర్మాణానికి రూ. 841.50 కోట్ల ఖర్చు మొత్తం 14 లైన్లు, అందులో 6 ఎక్స్‌ప్రెస్, 4+4 సర్వీస్ లైన్లు రహదారికి ఇరువైపుల 2.5 మీటర్ల సైకిల్ ట్రాక్‌ను కూడా నిర్మించారు. దాంతో పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. సోలార్ సిస్టమ్స్‌తో లైట్లు, డ్రిప్ సిస్టమ్స్ ద్వారా చెట్లకు నీళ్లు. ఈ ప్రాజెక్టుకు 2015 డిసెంబర్ 31న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అత్యంత వేగంగా, సురక్షితంగా ఢిల్లీ- మీరట్ల మధ్య ప్రయాణించేందుకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం పొడవు 82 కిలోమీటర్లు, మొత్తం నాలుగు దశల్లో దీన్ని పూర్తిచేయనున్నారు. 27.74 కిలోమీటర్లు 14 లైన్లు కాగా, మిగతా దూరం 6 లైన్లు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 4975.17 కోట్లు. దేశంలో సైకిల్ ట్రాక్ గల మొట్టమొదటి రహదారి ఇదే కావడం విశేషం. మొత్తం 28 కిలోమీటర్ల మేర ఢిల్లీ నుంచి దాసన్ వరకు సైకిల్ ట్రాక్.. ఈ ప్రాజెక్టులో భాగంగా 11 ఫ్లై ఓవర్లు, 5 మేజర్, 24 మైనర్ బ్రిడ్జ్‌లు, 3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు, 36 వాహన, 14 కాలినడక అండర్‌వే పాసులు నిర్మించారు. ప్రాజెక్టు మొత్తం పూర్తయితే కేవలం ఒక గంటలోనే ఢిల్లీ నుంచి మీరట్‌కు చేరుకోవచ్చు. -
ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్ : ఔటర్ రింగు రోడ్డులో భాగంగా కండ్లకోయ వద్ద నిర్మించిన 1.10 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేను తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. సుమారు రూ.125 కోట్ల వ్యయంతో నిర్మించిన కండ్లకోయ ఎక్స్‌ప్రెస్‌వేతో 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం వినియోగంలోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం రూ.6696 కోట్ల జైకా నిధులతో పూర్తి చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైంది. ఆయన హయాంలోనే దాదాపు 78 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు వినియోగంలోకి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన గొడవలతో పనుల్లో వేగం మందగించింది. తెలంగాణ ఏర్పాటై టీఆర్ఎస్ పాలనలోకి వచ్చిన తర్వాత పనులు వేగిరం పుంజుకున్నాయి. టోల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్తోపాటు, టోలు వసూలు, టోలు కనోపీలను మంత్రి ప్రారంభించారు. కండ్లకోయ ఇంటర్చేంజ్ వద్ద 8 లేన్లతో నిర్మించిన రోడ్డులో రెండు ఎంట్రీ, రెండు ఎగ్జిట్ ర్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ..కోర్టులో ఎన్ని చిక్కులు ఎదురైనా ఈ రోజు ఔటర్ రింగు రోడ్డు ప్రారంభమైందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై చాలా మంది ప్రయాణం కొనసాగిస్తున్నారని, అలాగే హైదరాబాద్ మహానగరంలో ఎస్ఆర్డీపీ పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. 19 ఇంటర్ చేంజ్‌లలో 19 టోల్ మెనేజ్మెంట్ బిల్డింగ్‌లకు ఈరోజు శంకుస్థాపన చేశామని తెలిపారు. నగరాన్ని కూడా విస్తరిస్తున్నామని, 35 రేడియల్ రోడ్డులను కూడా పూర్తి చేస్తామని వివరించారు. భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్డులో టౌన్ షిప్‌లను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ముఖ్యమైన పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ పేరుతో ఔటర్ రింగ్ రోడ్డులో మొత్తం వాటర్ సదుపాయం కల్పించామని అన్నారు. ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఇంటర్ గ్రిడ్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
హైవే మీద యుద్ధ విమానాల హడావుడి
ఎక్కడైనా ఎక్స్‌ప్రెస్ వేని ప్రారంభించాలంటే రిబ్బన్ కట్ చేస్తారు. కానీ, లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం మాత్రం ధూమ్ ధామ్‌గా జరిగింది. ఒకటి కాదు.. రెండు కాదు.. భారతీయ వైమానిక దళానికి చెందిన ఆరు జెట్ విమానాలు ఆ ఎక్స్‌ప్రెస్ వే మీద ల్యాండ్ అయ్యాయి. ఆ రహదారిని సమాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడు, రక్షణ శాఖ మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ ప్రారంభించారు. మొత్తం 302 కిలోమీటర్ల పొడవున్న ఈ ఎక్స్‌ప్రెస్ వేలో 3.3 కిలోమీటర్ల రోడ్డును అత్యవసర సమయాల్లో జెట్ విమానాల ల్యాండింగ్‌కు కూడా ఉపయోగించుకోవచ్చు. విమానాలు ఒకదాని వెంట ఒకటి వచ్చి రోడ్డు మీద దిగుతుంటే.. వేలాది మంది గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల వాళ్లు కూడా ఆశ్చర్యంగా చూశారు. అయితే.. విమానాలు దాదాపు దిగినంత పని చేశాయి గానీ, వాటి చక్రాలు మాత్రం రోడ్డుమీద ఆనుకోలేదని, అలా ఆనుకుంటే చక్రాలు పాడవుతాయని వైమానిక దళం అధికారులు చెప్పారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ వే మీదుగా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఈ జెట్ విమానాలు వెళ్లాయి. ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి మొత్తం రూ. 13,200 కోట్ల ఖర్చయింది. కేవలం 22 నెలల్లోనే 302 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేశారు. వచ్చే సంవత్సరం నుంచి దీనిమీదకు వాహనాలను అనుమతిస్తారు. ఇది దేశంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అవుతుంది. ప్రస్తుతం ఆరు లేన్లే అయినా, అవసరాన్ని బట్టి 8 లేన్లకు కూడా విస్తరించుకోవచ్చు. లక్నో నుంచి ఢిల్లీకి రోడ్డుమార్గంలో వెళ్లాలంటే ప్రస్తుతం 11 గంటలు పడుతుండగా, ఈ ఎక్స్‌ప్రెస్ వే వచ్చిన తర్వాత అది సరిగ్గా సగం.. అంటే ఐదున్నర గంటలకు తగ్గిపోతుంది. లక్నో నుంచి ఉన్నవ్, కనౌజ్, ఇటావా, మైన్‌పురి, ఫిరోజాబాద్ మీదుగా ఇది ఆగ్రా చేరుకుంటుంది.