హైవే మీద యుద్ధ విమానాల హడావుడి
Published Mon, Nov 21 2016 3:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
ఎక్కడైనా ఎక్స్‌ప్రెస్ వేని ప్రారంభించాలంటే రిబ్బన్ కట్ చేస్తారు. కానీ, లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం మాత్రం ధూమ్ ధామ్‌గా జరిగింది. ఒకటి కాదు.. రెండు కాదు.. భారతీయ వైమానిక దళానికి చెందిన ఆరు జెట్ విమానాలు ఆ ఎక్స్‌ప్రెస్ వే మీద ల్యాండ్ అయ్యాయి. ఆ రహదారిని సమాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడు, రక్షణ శాఖ మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ ప్రారంభించారు. మొత్తం 302 కిలోమీటర్ల పొడవున్న ఈ ఎక్స్‌ప్రెస్ వేలో 3.3 కిలోమీటర్ల రోడ్డును అత్యవసర సమయాల్లో జెట్ విమానాల ల్యాండింగ్‌కు కూడా ఉపయోగించుకోవచ్చు.
విమానాలు ఒకదాని వెంట ఒకటి వచ్చి రోడ్డు మీద దిగుతుంటే.. వేలాది మంది గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల వాళ్లు కూడా ఆశ్చర్యంగా చూశారు. అయితే.. విమానాలు దాదాపు దిగినంత పని చేశాయి గానీ, వాటి చక్రాలు మాత్రం రోడ్డుమీద ఆనుకోలేదని, అలా ఆనుకుంటే చక్రాలు పాడవుతాయని వైమానిక దళం అధికారులు చెప్పారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ వే మీదుగా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఈ జెట్ విమానాలు వెళ్లాయి.
ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి మొత్తం రూ. 13,200 కోట్ల ఖర్చయింది. కేవలం 22 నెలల్లోనే 302 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేశారు. వచ్చే సంవత్సరం నుంచి దీనిమీదకు వాహనాలను అనుమతిస్తారు. ఇది దేశంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అవుతుంది. ప్రస్తుతం ఆరు లేన్లే అయినా, అవసరాన్ని బట్టి 8 లేన్లకు కూడా విస్తరించుకోవచ్చు. లక్నో నుంచి ఢిల్లీకి రోడ్డుమార్గంలో వెళ్లాలంటే ప్రస్తుతం 11 గంటలు పడుతుండగా, ఈ ఎక్స్‌ప్రెస్ వే వచ్చిన తర్వాత అది సరిగ్గా సగం.. అంటే ఐదున్నర గంటలకు తగ్గిపోతుంది. లక్నో నుంచి ఉన్నవ్, కనౌజ్, ఇటావా, మైన్‌పురి, ఫిరోజాబాద్ మీదుగా ఇది ఆగ్రా చేరుకుంటుంది.
Advertisement
Advertisement