సాక్షి, న్యూఢిల్లీ: 2024లో కేంద్రంలో నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రిగా చేయాలంటే.. 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ గెలిపించి, యోగి ఆదిత్యనాథ్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన యూపీ రాజధాని లక్నోలో పర్యటించారు. ‘మేరా పరివార్–బీజేపీ పరివార్’ పేరిట సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు.
రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా మార్చేందుకు మరో ఐదేళ్లు బీజేపీ అధికారంలో ఉండడం అవసరమని చెప్పారు. రాష్ట్రంలో మాఫియాను తరిమికొట్టే అతిపెద్ద పనిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేశారని ప్రశంసించారు. 1.43 లక్షల మందికి పైగా పోలీసు సిబ్బంది నియామకంలో ఎక్కడా ఎలాంటి అవినీతి జరగలేదని గుర్తుచేశారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తి, వరదల సమయంలో అఖిలేష్ యాదవ్, రాహుల్‌గాంధీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. యూపీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 300 సీట్లకు పైగా గెలుచుకోవాలని బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
1.5 కోట్ల నూతన కార్యకర్తలే లక్ష్యం: యోగి
ఏక్ భారత్, శ్రేష్ట భారత్ కలను ప్రధాని మోదీ సాకారం చేశారని సీఎం యోగి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలో కొత్త చైతన్యం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు 1.5 కోట్ల మంది కొత్త కార్యకర్తలను తయారు చేసుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా నేతృత్వంలో అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరుగుతుండడంపై ప్రజలంతా గర్వపడుతున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment