సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ఫలితాలను పూర్వాంచల్‌గా పిలిచే తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతం ఎన్నికలు ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి. ఈ ప్రాంతంలో 27 సీట్లు ఉండగా 2014 ఎన్నికల్లో బీజేపీ తన మిత్రపక్షమైన అప్నాదళ్‌ను కలుపుకొని 26 సీట్లను గెలుచుకుంది. కనీసం పది సీట్లలో బీజేపీ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై 20 శాతం అధిక ఓట్లతో విజయం సాధించారు. వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 36 శాతం ఓట్లతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీజేపీ మొత్తంగా 71 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన అప్నాదళ్ రెండు సీట్లను గెలుచుకుంది.
ఇప్పుడు పూర్వాంచల్‌లో బీజేపీ విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువ. బద్ద వైరులైన ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపి మహా కూటమిగా పోటీ చేయడమే అందుకు కారణం. గత ఎన్నికల ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే ఈ రెండు పార్టీలకు వచ్చిన పోలింగ్ శాతం మొత్తం బీజేపీకన్నా ఎక్కువ. గత ఎన్నికల్లో మొత్తంగా బీజేపీకి 42.23 శాతం ఓట్లు రాగా, ఎస్పీకి 20.82 శాతం, బీఎస్పీకి 26.25 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రెండింటి ఓట్ల శాతాన్ని కలిపితే దాదాపు 47 శాతానికిపైగా ఓట్లు, అంటే బీజేపీకన్నా దాదాపు ఐదు శాతం ఓట్లు ఎక్కువ. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి అనుకూల పవనాలు పెరిగితే సాధారణంగా బీజేపీకే ఓట్ల శాతం పెరిగి, ఎస్పీ–బీఎస్పీ పార్టీల కూటమికి ఓట్ల శాతం తక్కువవుతాయి. అయితే అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతోపాటు రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది.
రాష్ట్రంతోపాటు దేశంలో గ్రామీణ ఆదాయం బాగా తగ్గిపోవడం, వేతనాలు పడిపోవడం, మున్నెన్నడులేని విధంగా నిరుద్యోగం పెరిగిపోవడం, పెద్ద నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా చిల్లర వ్యాపారులు నష్టపోవడం, లక్షల సంఖ్యలో కార్మికులు రోడ్డున పడడం, అభివద్ధి కార్యక్రమాలు అంతంత మాతంగానే విజయం సాధించడం ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రధాన కారణాలు. ఇక మోదీ వ్యక్తిగత ప్రతిష్ట, హిందూత్వ జాతీయ వాదం ఎంతమేరకు పనిచేస్తాయో చెప్పలేం!
Comments
Please login to add a commentAdd a comment