లక్నో : సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో బీఎస్పీకి చెందిన ఎంపీ అభ్యర్థి అతుల్ రాయ్ మిస్సయ్యారు. తనపై అత్యాచార కేసు నమోదైన నాటి నుంచి ఆయన అఙ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పార్టీ కార్యకర్తలే ఆయన తరఫున ప్రచార సభలు నిర్వహిస్తూ.. అతుల్ రాయ్‌ను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా యూపీలో ఎస్పీ-బీఎస్పీ జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ఈ కూటమి సీట్ల పంపకంలో భాగంగా ఘోసి నియోకవర్గ ఎంపీ టికెట్‌ను బీఎస్పీ నేత అతుల్ రాయ్ దక్కించుకున్నారు. అయితే అతుల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ కాలేజీ విద్యార్థిని ఆయనపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మే1 నుంచి అతుల్ కనిపించకుండా పోయారు.
ఈ నేపథ్యంలో అతుల్ తరఫున పార్టీ శ్రేణులే ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం నాటి కార్యక్రమానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. అతుల్ రాయ్‌ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క కార్యకర్తకు ఉందన్నారు. బీజేపీ పన్నిన కుట్రలో అతుల్ ఇరుక్కున్నారని, ఆయనకు కచ్చితంగా ఓటు వేయాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. కాగా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అతుల్ మలేషియాకు పారిపోయినట్లు సమాచారం. ఈ మేరకు ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక మే 23 వరకు అతుల్ అరెస్టును వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ అతడి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మే 17న అతుల్ అభ్యర్థనపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపనుంది. కాగా సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్‌లో భాగంగా ఘోసిలో మే 19న ఎన్నికలు జరుగున్ను సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment