![Molested Accused BSP MP Atul Rai Surrenders In Court - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2019/06/22/mp-atul.jpg.webp?itok=mmqtXorl)
లక్నో : అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న బీఎస్పీ ఎంపీ అతుల్ రాయ్ శనివారం లొంగిపోయారు. అతుల్ రాయ్ మద్దతుదారులు, పార్టీ శ్రేణులు వెంటరాగా పోలీసులు ఆయనను వారణాసి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా అతుల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ కాలేజీ విద్యార్థిని ఆయనపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఘోసి నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ సంపాదించిన ఆయన మే1 నుంచి కనిపించకుండా పోయారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపునకు చేరుకున్న దశలో ఇలాంటి పరిణామం ఎదురుకావడంతో అతుల్ తరఫున పార్టీ శ్రేణులే ప్రచారం నిర్వహించాయి.
ఇందులో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా ఆయనను గెలిపించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. బీజేపీ పన్నిన కుట్రలో అతుల్ ఇరుక్కున్నారని, ఆయనకు కచ్చితంగా ఓటు వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో మే 23న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అతుల్ రాయ్ విజయం సాధించారు. అయితే అప్పటి నుంచి కూడా అఙ్ఞాతంలో గడిపారు. అతుల్ మలేషియాలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఆయన అరెస్టుకై పోలీసులు కోర్టు అనుమతి కోరారు. అయితే తాను కోర్టులో ఎదుటే లొంగిపోతానంటూ అతుల్ విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. ఎంపీగా ఎన్నికైన ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే లొంగిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment