BSP: మాయావతి కీలక నిర్ణయం | UP: Mayawati Says BSP Pulls Out Of Panchayat Polls For This Reason | Sakshi
Sakshi News home page

BSP: ఆ ఎన్నికల్లో పోటీ చేయం.. ఎందుకంటే!

Published Mon, Jun 28 2021 9:00 PM | Last Updated on Mon, Jun 28 2021 9:23 PM

UP: Mayawati Says BSP Pulls Out Of Panchayat Polls For This Reason - Sakshi

లక్నో: బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ జిల్లా పంచాయత్‌ ఎన్నికల్లో తాము పోటీచేయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టి సారించాలనుకుంటున్నామని, అందుకే స్థానిక ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మాయావతి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో బీఎస్పీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నానన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా.. ‘‘ఉత్తర్‌ప్రదేశ్‌ రక్షణే ధ్యేయం’’ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. 

ఈ నేపథ్యంలో జిల్లా పంచాయత్‌ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కూడా నియోజకవర్గాలపై దృష్టి సారించి, కేడర్‌ బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాయావతి వెల్లడించారు. నిజానికి, ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగి ఉంటే పోటీ చేసే విషయం గురించి ఆలోచించే వాళ్లమని, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా మాయావతి నిర్ణయంపై స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ, అధికార బీజేపీకి సహకరించేందుకే మాయావతి పంచాయత్‌ ఎన్నికల బరిలో నిలవడం లేదని ఆరోపించింది. 

ఈ మేరకు... యూపీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అశోక్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా... ‘‘బీజేపీకి ఎప్పుడు సాయం కావాలన్నా మాయావతి ఈ విధంగా ఎన్నికల నుంచి తప్పుకొంటూ ఉంటారు. జిల్లా పంచాయత్‌ ఎన్నికల్లో పోటీ చేయం అన్న ప్రకటన కూడా ఈ కోవకు చెందినదే’’ అని విమర్శించారు. ఇందుకు స్పందనగా... బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జిల్లా పంచాయతీ సభ్యులు చచ్చినట్లు తమ పార్టీలో చేరతారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాయావతి బదులిచ్చారు. కాగా జూలై 3న యూపీలో జిల్లా పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా... ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 3 వేల మంది సభ్యులు జిల్లా పంచాయతీ చీఫ్‌లను ఎన్నుకోనున్నారు.

చదవండి: ఎంఐఎంతో పొత్తుండదని మాయావతి స్పష్టీకరణ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement