third front
-
‘థర్డ్ ఫ్రంట్‌కి ఛాన్సే లేదు.. మాది ఒంటరి పోరు’
ఢిల్లీ: బిజూ జనతా దళ్ పార్టీ చీఫ్, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విపక్షాలకు ఝలక్ ఇచ్చారు. 2024 ఎన్నికలకు విపక్షాలతో తన పార్టీ చేతులు కలపబోదని, ఒంటరిగానే ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్.. ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పూరిలో ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి తాను ప్రధానిని కలిశానని, అందుకు ప్రధాని కూడా సహకరిస్తానని హామీ ఇచ్చారనే విషయాన్ని ఆయన మీడియాకు తెలిపారు. అయితే.. ఎన్నికలకు ఒంటరిగా వెళ్లబోతున్నారా? అని మీడియా ప్రశ్నించగా ఆయన స్పందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేడీ విపక్షాలతో కలవదు. మా పార్టీ ఎప్పుడూ ప్రణాళిక బద్దంగానే ముందుకు సాగుతుంది అని తెలిపారు. అలాగే.. తన ఢిల్లీ పర్యటనలో ఏ రాజకీయ పార్టీతోనూ భేటీ కాబోనని వెల్లడించారాయన. తనకు తెలిసినంత వరకు థర్డ్ ఫ్రంట్ అవకాశమే లేదని పేర్కొన్నారాయన. #WATCH | Delhi: There is no possibility of a Third front as far as I am concerned: Odisha CM Naveen Patnaik after his meeting with PM Narendra Modi pic.twitter.com/dRr1fxsiYm — ANI (@ANI) May 11, 2023 ఇదిలా ఉంటే.. రెండు రోజుల కిందట బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పట్నాయక్‌తో భేటీ అయ్యారు. దీంతో పొత్తులపై భేటీ అనే ప్రచారం జరగ్గా.. పట్నాయక్ దానిని ఖండించారు. తదనంతరం ఇవాళ ఢిల్లీకి వెళ్లిన ఒడిషా సీఎం.. పలు పార్టీల నేతలతో భేటీ అవుతారనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. అయితే ఆ అంచనాలను పటాపంచల్ చేస్తూ అసలు విపక్షాలతో చేతులు కలపబోనని, థర్డ్ ఫ్రంట్‌కు ఆస్కారం ఉండబోదంటూ నవీన్ పట్నాయక్ వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు మూడో కూటమి కోసం బీహార్ సీఎం నితీశ్ కుమార్ విపరీతమైన ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపక్షాల నేతలను కలుస్తూ వస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ కావడం, మరోవైపు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. ఇలా వరుసగా నేతల భేటీ నేపథ్యంలో విపక్షాల ఆధ్వర్యంలో మూడో కూటమికి ఆస్కారం ఉందన్న చర్చ తెర మీదకు వచ్చింది. -
థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్.. 2024లో సరికొత్త చరిత్ర
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో సోమవారం నుంచి ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు బిహార్ సీఏం నితీశ్ కమార్. ఇందులో భాగంగనే బుధవారం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు మాత్రమే తాను ప్రయత్నిస్తున్నాని, ప్రధాని అభ్యర్థి కావాలనే ఆలోచన లేదని నితీశ్ స్పష్టం చేశారు. అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే 2024 ఎన్నికల్లో పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పారు. అందుకే అన్ని పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మెయిన్ ఫ్రంట్.. తాము థర్డ్ ఫ్రంట్ కోసం కాదు మెయిన్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు నితీశ్ వ్యాఖ్యానించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలతో తాను జరిపిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఏకపక్షంగా జరుగుతున్న ఎన్నికలు 2024లో భిన్నంగా ఉంటాయన్నారు. ప్రధాని మోదీకి పోటీగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరుంటారని మీడియా ప్రశ్నించగా.. నితీశ్ స్పందించారు. ప్రకటనలు, పేర్లు మార్చడం తప్ప బీజేపీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. నితీశ్ సన్నిహిత వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి విపక్షాలను ఏకం చేయడంపైనే ఆయన దృష్టిసారించినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో విపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే బీజేపీకి కలిసొచ్చిందని ఆయన భావిస్తున్నారు. విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటారనే విషయంపై ఇప్పటివరకైతే పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదర్లేదు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పేర్లను పరిశీలించే అవకాశాలు కన్పిస్తున్నాయి. నితీశ్ కుమార్ పేరును కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. చదవండి: భారత్ జోడో యాత్ర షురూ -
థర్డ్ ఫ్రంట్‌పై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిలీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ థర్డ్ ఫ్రంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ బీజేపీని ఓడించలేవని అన్నారు. కమలదళాన్ని గద్దెదించాలనుకునే ఏ పార్టీ అయినా.. రెండో ఫ్రంట్‌గా అవతరించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీని ఫస్ట్ ఫ్రంట్ అనుకుంటే.. వారిని ఎదుర్కొనేందుకు రెండో ఫ్రంట్ కావాల్సిందేనని స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మూడో ఫ్రంట్‌గా రూపుదిద్దుకునేందుకు సహకరిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఈ మేరకు పీకే జవాబిచ్చారు. మరి కాంగ్రెస్‌ను రెండో ఫ్రంట్‌గా భావిస్తున్నారా? అని ప్రశ్నించగా.. లేదని బదులిచ్చారు. కాంగ్రెస్ దేశంలో రెండో అతిపెద్ద పార్టీ అని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ఆజ్‌తక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు తన అవసరం లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికల గురించి ఆ పార్టీ పెద్దలతో కలిసి సమాలోచనలు చేశామని అన్నారు. ఆ పార్టీలో ఎందరో తలపండిన నేతలున్నారని.. సంస్కరణలు వారే సొంతంగా చేపట్టాలని పీకే పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోని పార్టీ అధిష్టానం తనను ఆహ్వానించినప్పటికీ తిరస్కరించానని చెప్పారు. పార్టీ మేలు ఏమేం చేస్తే బాగుంటుందో.. ముందుగా అనుకున్న బ్లూ ప్రింట్ కార్యరూపం దాల్చాలని ఆయన ఆకాక్షించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదని పీకే వ్యాఖ్యానించారు. అయితే, పార్టీ బలోపేతానికి భారీ మార్పులు మాత్రం అవసరమని ఆయన నొక్కి వక్కాణించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదుర్కొనేది ఎవరో తెలియదని, రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలతో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేమని చెప్పారు. -
కాంగ్రెస్ లేని కూటమితో ప్రయోజనం లేదు
జమ్మూ: కాంగ్రెస్ లేని రాజకీయ కూటమి లేదా థర్డ్ ఫ్రంట్‌తో బీజేపీని ఓడించడం సాధ్యంకాదని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. దేశ మౌలిక పునాదులను బీజేపీ పెకిలించివేస్తోందని ఆమె మంగళవారం దుయ్యబట్టారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమన్నారు. బీజేపీ ఎన్నికలు జరిపించడం ద్వారా కశ్మీర్ ప్రజలకు ఏదో మేలు చేస్తున్నంత భావనలో ఉందన్నారు. దేశాన్ని నిర్మించడంలో 70ఏళ్లపాటు కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందని, దేశంలో ఆ పార్టీకి మినహా ప్రత్యామ్నాయం లేదని ముఫ్తీ అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్న తెలంగాణ సీఎం మాటలపై ఆమె స్పందించారు. కాంగ్రెస్ లేని ఏ కూటమి బీజేపీతో యుద్ధం చేయలేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన తరుణం వచ్చిందని ముఫ్తీ చెప్పారు. దేశ లౌకిక రూపును మార్చి ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయాలని మోదీ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. చదవండి: న్యూడెమోక్రసీలో చీలిక.. ప్రజాపంథా పార్టీ ఆవిర్భావం -
మూడో ఫ్రంట్ మనగలిగేనా?
దేశంలో సమాఖ్య స్ఫూర్తికి గండి పడుతున్న క్రమంలో దానిపై రాజకీయ స్పృహ పెరుగుతోంది. దశాబ్దాలుగా ప్రబల రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ చతికిలపడింది. దాంతో బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ రహిత రాజకీయ కూటమికి ఇదే సమయంగా కనబడుతోంది. కానీ, వేర్వేరు రాష్ట్రాల్లో బలమైన శక్తులుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బలమైన కారణం లేకుండా ఒక్కతాటిపైకి వస్తాయా? అందుకే, సమాఖ్య భావనను కేసీఆర్ తలకెత్తుకున్నారు. ఎక్కువ లోక్‌సభ స్థానాలు దక్కించుకోగలిగే పార్టీలు, నామమాత్ర పార్టీలు, బలమైనవే అయినా ప్రస్తుతం కాంగ్రెస్‌తో కలిసున్న పార్టీలు... ఇవన్నీ జట్టు కట్టి, కావాల్సిన సంఖ్య తెచ్చుకోగలవా, పూర్తికాలం మనగలవా, వీటికి ఎవరు నేతృత్వం వహిస్తారు అన్నవి ప్రస్తుతానికి ప్రశ్నలే! ‘నీ ఆలోచనా శక్తి నీలో పుట్టే భావోద్వేగాల కన్నా పటిష్ఠంగా ఉంటే గెలుపు నీదే’ అన్నది గ్రీక్ తాత్వికుల కాలం నుంచీ ప్రాచుర్యంలో ఉన్న నానుడి. అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావుకూ, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకూ కొన్ని సామ్యా లున్నా... వైరుద్ధ్యాలే ఎక్కువ. ఇద్దరూ ఆవేశపరులే. కేసీఆర్ ఆవేశం గతపు వివక్ష నుంచో, వర్తమానపు అన్యాయాల నుంచో, భవిష్యత్తు అంచనాల నుంచో పురుడు పోసుకుంటుంది. భావోద్వేగాలను కార్యా చరణగా మలిచే బలమైన కసరత్తు పూర్వరంగంలో ఉంటుంది. ఇటీ వల ఆయన తరచూ మాట్లాడుతున్న ‘ఫెడరల్ ఫ్రంట్’కు నిజంగా ఆస్కారం ఉందా? ఆయన ప్రధాని అవ్వొచ్చా? ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే... సదరు ప్రతికూల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడొచ్చు. ఇదొక అంచనా! ఆ ఫలితాలతో నిమిత్తం లేకుండానే లోక్‌సభ ఎన్నికలప్పుడు యూపీ, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీకి రమారమి సీట్లు తగ్గితే ఎన్డీయే తిరిగి ప్రభుత్వం ఏర్పాటుచేయడం కష్టమే. అప్పుడు ప్రత్యామ్నాయ రాజ కీయ శక్తిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే. మరేదైనా సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనుకుంటే, అదేనా... కేసీఆర్ అంటున్న ఫెడరల్ ఫ్రంట్? దేశంలో ఏకపార్టీ స్వామ్యం పోయి సంకీర్ణ శకం మొదలయ్యాక, అంటే 1989 నుంచి, ఇటీవలి బీజేపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాల మాదిరే బీజేపీయేతర, కాంగ్రేసేతర ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పాటైన ప్రయోగాలున్నాయి. అలా ఎనభైల చివర్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడ్డ ‘నేషనల్ ఫ్రంట్’ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు లభించినట్టే, తొంభైల ద్వితీయార్ధంలో వచ్చిన ‘యునెటైడ్ ఫ్రంట్’ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతిచ్చింది. అయితే, ఆ ప్రయోగాలు విఫలమై ఆయా ప్రభుత్వాలు కూలడానికి కూడా సదరు బీజేపీ, కాంగ్రెస్‌లే కారణ మన్నది జగమెరిగిన సత్యం. కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయ డానికైనా, ఏర్పడ్డ ప్రభుత్వాలను కూల్చడానికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కావాలనే రాజకీయ వాతావరణం దేశంలో నెలకొంది. మరి కేసీఆర్ అంటున్నట్టు ‘ఫెడరల్ ఫ్రంట్’ పెట్టి, ప్రభుత్వం ఏర్పరచి, నాలుగు కాలాలు మనగలిగేలా చేయడం సాధ్యమా? సమాఖ్య వాదనకు బలం దేశంలో సమాఖ్య స్ఫూర్తికి గండి పడుతున్న క్రమంలోనే దానిపై రాజ కీయ స్పృహ పెరుగుతోంది. ఎన్డీయే కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన ప్పటికీ గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే మెజారిటీ స్థానాలు సాధిం చింది. రెండో మారు గెలుపుతో పార్టీ వైఖరి మారిపోయింది. ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ‘ఒకే’ల క్రమంలో ఒకే ప్రభుత్వం అన్న ధోరణి పెరిగింది. జీఎస్టీ నుంచి వ్యవసాయ చట్టాల వరకు, బడ్జెట్ కేటా యింపుల నుంచి నదుల అనుసంధానం వరకు... రాష్ట్రాల ప్రాధా న్యాన్ని తగ్గిస్తూ అన్నీ తానై కేంద్రం వ్యవహరిస్తోంది. రాజ్యాంగం నిర్దేశించిన మూడు జాబితాల్లోని రాష్ట్ర అంశాల్లోకి తరచూ చొరబడు తున్న కేంద్ర ప్రభుత్వపు ఒంటెద్దు పోకడల్ని చాలా రాష్ట్రాలు జీర్ణించు కోలేకపోతున్నాయి. తిరిగి తెలుగుతేజమే కేంద్రబిందువా? రెండో మారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, నాటి ముఖ్య మంత్రి ఎన్టీయార్ తన కారు డ్రైవర్‌తో, ‘లచ్చన్నా! నువ్ కూడా రెడీ అయిపో. ఢిల్లీ పోదాం. దేశ పాలన ఏమీ బాగోలేదు. ఈ చట్టాలు అవీ... మనం అక్కడి నుంచే బాగుచేయాలి’ అన్నారట! అన్నట్టుగానే, ఓ అయిదేళ్లకు ‘జాతీయ ఫ్రంట్’కు స్వయంగా నేతృత్వం వహించారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడుతుందనుకునే ఫెడరల్ ఫ్రంట్ సర్కారు లోనూ కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారేమో! కాంగ్రెస్, బీజేపీ, ఈ రెండు జాతీయస్థాయి ప్రధాన పార్టీలు దేశానికి న్యాయం చేయలేక పోయాయి. పాజిటివ్ ఓటు ఎంతో అరుదు! దిక్కుతోచని దేశ పౌరుల వ్యతిరేక అభిప్రాయంతోనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ప్రాంతీయ ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చడంలో రెండు పార్టీలు ఘోరంగా విఫలమై, పలు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేశాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. దీనికి ఏకైక విరుగుడు ‘ఫెడరల్ ఫ్రంట్ సర్కారు’ అనేది కేసీఆర్ వాదన, ప్రతిపాదన. నిజానికి ఇటువంటి యత్నం ఆయన 2019 ఎన్నికల ముందే చేసినా... కారణాంతరాల వల్ల ఫలించలేదు. ఇప్పట్నుంచి చేస్తే 2024 ఎన్నికల నాటికి ఓ రూపం వస్తుందని ఆయన లెక్క! కాంగ్రెస్‌ను కాదంటే లెక్కలు సరిపోతాయా? దేశానికి స్వాతంత్య్రం తెచ్చి, దశాబ్దాల తరబడి ప్రబల రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల చతికిలపడింది. బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ రహిత రాజకీయ కూటమికి ఇదే అత్యున్నత సమయం అని కేసీఆర్‌కు తెలుసు. కానీ, వేర్వేరు రాష్ట్రాల్లో బలమైన శక్తులుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏకరీతి ఆలోచనలతో లేవు. బలమైన కారణం, కారకం లేకుండా అవి ఒక్కతాటిపైకి వస్తాయా? అందుకే, సమాఖ్య భావనను ఆయన తలకెత్తుకున్నారు. ఎక్కువ లోక్‌సభ స్థానాలు దక్కించుకునే స్థితిలో ఉన్న మమతా బెనర్జీ (బెంగాల్), అఖిలేష్ యాదవ్ (యూపీ) ఎలా స్పందిస్తారో తెలియదు. దేవెగౌడ (కర్ణాటక), తేజస్వీ యాదవ్ (బిహార్) సాను కూలంగానే ఉన్నా... రేపు వారు దక్కించుకోగలిగే స్థానాలు పరిమితం. ఇక స్టాలిన్ (తమిళనాడు), ఉద్ధవ్ థాక్రే (మహారాష్ట్ర) కేసీఆర్ ఆలోచనలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా... వారిప్పుడు కాంగ్రెస్‌తో కలిసున్నారు. ఇక కేజ్రీవాల్ (ఆప్), శరద్ పవార్ (ఎన్సీపీ), మాయావతి (బీఎస్పీ), దుష్యంత్ చౌతాలా (జేజేపీ) భవిష్యత్తులో ఎలా వ్యవహరించనున్నారో తెలి యదు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, నవీన్ పట్నాయక్ (ఒడిషా) వంటి వారు తటస్థంగానే ఉంటున్నారు. ఇటువంటి అస్పష్ట పరిస్థి తుల్లో కాంగ్రెస్‌ను కాదని ఇతర పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకట్టి, కావాల్సిన సంఖ్య తెచ్చుకోగలవా అన్నది పెద్ద ప్రశ్న. 2014 ఎన్నికల్లో 44 స్థానాలు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ 223 చోట్ల రెండో స్థానంలో, మరో 63 చోట్ల మూడో స్థానంలో నిలిచింది. కొన్ని చోట్ల బీజేపీకి ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనే! కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, అస్సాం... ఇలా పలు రాష్ట్రాలున్నాయి. ఒక రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రాంతీయ శక్తులకు ఇంకో రాష్ట్రంలో కనీస ఉనికైనా లేదు. రాయి చెన్నైలో విసిరితే వచ్చిపడే పాండిచ్చేరీలో కూడా ద్రవిడ పార్టీల ప్రాబల్యం నామమాత్రం. కలయికలు ముందా? తర్వాతా? రాజ్యం చేయకపోయినా... ఈ దేశంలో పలు సందర్భాల్లో కమ్యూని స్టులు ఉత్ప్రేరక పాత్ర పోషించారు. యూపీఏ–1 ప్రభుత్వం 2004– 09 మధ్య పలు మంచి నిర్ణయాలు తీసుకోవడం వెనుక కమ్యూనిస్టుల ఒత్తిడి (కనీస ఉమ్మడి కార్యక్రమం) పని చేసింది. యూపీఏ–2లో ప్రజోపయోగాలు లేకపోగా సర్కారు భ్రష్టుపట్టిపోవడానికి కారణం దూరమైన కమ్యూనిస్టుల ఒత్తిడి, ఉత్ప్రేరక పాత్ర లేకపోవడమే అని విశ్లేషకులంటారు. మరి, రేపు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడితే వారి పాత్ర ఏంటి? ఒకరు ఎన్నికలు ముగిశాక చూద్దాం అంటే, ఇంకొకరు ‘బీజేపీకి వ్యతిరేకంగా మీరు పోరాడండి, మేం మీకు మద్దతుంటాం’ అంటు న్నారు. మిగతా పార్టీల్లో ఎన్నికల ముందు కలిసేదెవరు? తర్వాత కలిసేదెవరు? అన్నదొక సందేహమే. నాయకత్వం ఎవరికి అన్నది ఎప్పటికీ సమస్యే! లోగడ బీజేపీ, కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డ ప్పుడు సంఖ్య ఉన్న ప్రాంతీయ పార్టీ నేతల కన్నా ఏకాభిప్రాయం ఉన్న వీపీ సింగ్, ఐ.కె. గుజ్రాల్, దేవెగౌడ వంటి బలహీన నాయకులే ప్రధానులయ్యారు. కానీ, ఈసారి పార్లమెంటులో సంఖ్యాబలం ఉండే నాయకులు కీలక నాయకత్వ స్థానాన్ని వదులుకునే వాతావరణం కనిపించడం లేదు. అయినా... ఇప్పుడే ఆ చర్చ పెడితే, అది పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టిన చందం అవుతుందేమో! వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్; డైరెక్టర్, పీపుల్స్ పల్స్ ఈ–మెయిల్ :peoplespulse.hyd@gmail.com -
మూడో మూడ్
-
భవిష్యత్ ఎలా చెప్పగలం?
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓటర్లను మతం చుట్టూ తిప్పడం మినహా ఎలాంటి అభివృద్ధి చేయలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామన్న ప్రకటనలు ఉత్తి రాజకీయ స్టంట్ అని విమర్శించారు. గురువారం కేటీఆర్ ట్విట్టర్లో ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట నెటిజన్లతో సంభాషించారు. ట్విట్టర్లో జాతీయస్థాయి పాలిటిక్స్ కేటగిరీ ట్రెండింగ్‌లో ఈ సెషన్ తొలిస్థానంలో నిలవడం గమనార్హం. ఇందులో కేటీఆర్ ఇచ్చిన సమాధా నాలు, చెప్పిన పలు అంశాలివీ.. జాతీయ రాజకీయాలపై చెప్పలేం.. ‘దేశ శ్రేయస్సు కోసం ప్రాంతీయ పార్టీలను ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి వెళతారా?’ అని గట్ల సతీశ్ అనే నెటిజన్ ప్రశ్నించగా.. ‘‘సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే విషయాన్ని ఇప్పుడే ఎలా చెప్పగలం? భవిష్యత్తులో ఏం రాసిపెట్టి ఉందో ఎవరికి తెలుసు?..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామంటూ గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ.. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద అబద్ధం (జుమ్లా ఆఫ్ ది సెంచురీ)గా అభివర్ణించారు. ఐటీ రంగంలో తెలంగాణ కంటే మహారాష్ట్రలోని పుణే బాగా రాణిస్తోందంటూ రాష్ట్ర బీజేపీ ఎంపీలు చేస్తున్నవి మూర్ఖపు వ్యాఖ్యలని.. వాటిని వదిలేయడమే ఉత్తమమని పేర్కొన్నారు. యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా టీఆర్ఎస్ ప్రచారం చేస్తుందా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఈ విషయంలో వారితో సంప్రదింపులు జరిగాక వెల్లడిస్తామని కేటీఆర్ చెప్పారు. యూపీ బీజేపీ ప్రభుత్వం నుంచి ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు బయటికి రావడమంటే.. త్వరలో అక్కడ జరిగే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ పట్ల ఓటర్ల మొగ్గును సూచిస్తోందన్నారు. ►‘జాతీయ రాజకీయాల్లో, కేంద్ర ఐటీ మంత్రిగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం’ అని కొందరు నెటిజన్లు ప్రస్తావించగా.. రాష్ట్రంలో అందిస్తున్న సేవల పట్ల సంతోషంగా ఉన్నానని, ఇక్కడి ప్రజలకు ప్రాతినిధ్యం వహించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని కేటీఆర్ చెప్పారు. ∙టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అంశాన్ని ఓ నెటిజన్ ప్రస్తావించగా.. ‘‘రేవంత్ నాతో కాకుండా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చర్చిస్తే మంచిది. రేవంత్ లాంటి నేరస్తులు, 420లతో చర్చల్లోకి దిగ బోను.’’ అని వ్యాఖ్యానించారు. కరోనా పరిస్థితిని బట్టి లాక్డౌన్ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసుల సంఖ్య పెరగడం, లేదా వైద్యారోగ్యశాఖ అధికారులు చేసే సూచనల మేరకు లాక్డౌన్ లేదా నైట్ కర్ఫ్యూపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్ చెప్పారు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే టీఫైబర్ తొలిదశ పనులు ఏప్రిల్ నాటికి పూర్తవుతా యని తెలిపారు. ఇక వరంగల్‌లో బస్టాండ్ నిర్మాణం, ములుగు జిల్లా కమలాపురంలో బిల్ట్ పరిశ్రమ పునరుద్ధరణ, గ్రేటర్ హైదరా బాద్‌లో పారిశుధ్యం, రోడ్లు, ఫ్లైఓవర్ల అంశాలపైనా కేటీఆర్ స్పందించారు. -
మళ్ళీ తెరపైకి థర్డ్ ఫ్రంట్ - కేసీఆర్ వ్యూహం
-
మమత బెనర్జీ వ్యూహమేంటి? ప్రత్యామ్నాయం అవుతారా?
ఈ ఏడాది మార్చి– ఏప్రిల్ నెలల్లో బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ– అమిత్ షా ద్వయం మమతా బెనర్జీని ఓడించడానికి చేయని ప్రయత్నం లేదు. ఈడీ, సీబీఐ దాడులతో సహా అష్టదిగ్భందం చేశారు. ఏకాకిగా మారినా... సువేందు అధికారి, ముకుల్‌రాయ్‌లతో సహా సన్నిహితులందరూ దూరమైనా... మమత మొక్కవోని ధైర్యంతో ఎదురొడ్డి నిలిచారు. 294 సీట్లలో ఏకంగా 213 స్థానాల్లో నెగ్గి ‘హ్యాట్రిక్’ కొట్టారు. మూడోసారి సీఎంగా పదవిని చేపట్టారు. అంతే బెంగాల్ సివంగి పేరు జాతీయ రాజకీయ యవనికపై మార్మోగిపోయింది. బలమైన నాయకుడు మోదీని, బీజేపీ ‘ఢీ’ కొట్టి నిలిచే దమ్మున్న నాయకురాలిగా ఆమెను రాజకీయ పండితులు కీర్తించారు. ఈ విజయం ఇచ్చిన ఊపుతో మమత కూడా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. 2024 సార్వత్రిక ఎన్నికలపై కన్నేసి బీజేపీకి ప్రత్యామ్నాయ వేదికగా మూడో కూటమిని నిర్మించే దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. భావ సారూప్యత కలిగిన వ్యక్తుల భేటీల పేరిట రాజకీయపక్షాలనే కాకుండా, వివిధ రంగాల్లోని మేధావులు, ఉద్యమకారులను కలుస్తూ... తనను తాను ప్రత్యామ్నాయంగా ఆవిష్కరించుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు. బుధవారం రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశాక... ‘ఇక యూపీఏనే లేదు’ అంటూ ప్రకటించి... బీజేపీ వ్యతిరేక ఐక్యకూటమిని నాయకత్వం వహించాలనే తన ఆకాంక్షను విస్పష్టంగా బయటపెట్టారు. దేశవ్యాప్త రాజకీయ ఉనికిని, వందేళ్లకు పైగా చరిత్ర కలిగి జనసామాన్యంలో గుర్తింపును, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 19.5 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీని... బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించే స్థానం నుంచి తప్పించే సామర్థ్యం ‘దీదీ’కి ఉందా? కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కాగలదా? బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయగలదా? దాదాపు 200 స్థానాల్లో బీజేపీని నేరుగా ఎదుర్కొనే స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ను కాదనుకొని మమతా వెనుకనడిచే విపక్ష, ప్రాంతీయ పార్టీలు ఎన్ని? వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఇళ్లు చక్కదిద్దుకోండి... సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీని ఏడాదికి పైగా నడుపుకొస్తున్నారు. ఆమెకు ఆరోగ్య సమస్యలున్నాయి. భావినేతగా భావించిన రాహుల్‌గాంధీ సత్తా ఏంటో తేలిపోయింది. పోరాటపటిమ లోపించిందని, రాజకీయాలను సీరియస్‌గా తీసుకోరనే ముద్ర పడిపోయింది. పైగా కాంగ్రెస్ అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. సీనియర్లతో కూడిన జి–23 గ్రూపు అధినాయకత్వాన్నే ప్రశ్నిస్తోంది. అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో పంజాబ్‌లో పరువుబజారున పడింది. అమరీందర్ సింగ్‌ను పొమ్మనకుండా పొగపెట్టడంతో ఆయన సొంత పార్టీనే స్థాపించారు. దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎంగా చేసినా... పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ నిత్యం ఏదో ఒక తలనొప్పి తెస్తూనే ఉన్నారు. నాలుగు నెలల్లో ఎన్నికలు పెట్టుకొని ఈ కుమ్ములాటలు ఏంటని కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇక రాజస్తాన్‌లో సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలెట్ వర్గాల మ ధ్య ఆధిపత్యపోరు అందరికీ తెలిసిందే. చత్తీస్‌గఢ్‌లోనూ భూపేష్ బఘేల్‌పై అసంతృప్తి చాలాకాలంగా రగులుతోంది. దీదీ ఇప్పుడు సరిగ్గా ఈ పాయింట్‌నే లేవనెత్తుతున్నారు. ఇంటిని చక్కదిద్దుకోలేని వాళ్లు... ఇతరులకు ఏం నాయకత్వం వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరెవరు ఉన్నారు...? మోదీ ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌కు/ రాహుల్‌కు లేనపుడు మరెవరున్నారు? శరద్ పవార్‌కు 80 ఏళ్లు, రాజకీయ జీవితం చరమాంకంలో ఉన్నారు. ఒకప్పుడు మోదీకి ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కల చెదిరి ఎన్డీయే పంచన చేరిపోయారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా... బీసీ నాయకుడిగా (కుర్మీ) నితీశ్‌కు ఉన్న ఇమేజి నుంచి లబ్దిపొందేందుకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పుకునేందుకు కమలదళం ఆయనకు సీఎం పీఠం అప్పగించింది. 21 ఏళ్లుగా ఒడిశా సీఎంగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ (75 ఏళ్లు) ఎన్డీయే నుంచి వైదొలిగినా... ఇరుపక్షాలకు సమదూరం పాటిస్తూ తటస్థ వైఖరితో ఉన్నారు. పైగా ఆయనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు లేదు. దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తానన్న ఒకప్పటి బ్యూరోక్రాట్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ, పంజాబ్‌ను దాటి ప్రభావం చూపలేకపోయారు. వెనుకడుగు వేయకపోవడమే దీదీ బలం రాజకీయాల్లో చేరినప్పటి నుంచే మమతకు ఫైర్‌బ్రాండ్‌గా పేరుంది. పోరాటమే ఆమె ఊపిరి. ఎట్టి పరిస్థితుల్లో, ఎంతటి ప్రతికూలతలు ఎదురైనా తలవంచని నైజం. మొన్నటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో ఆమె ధీరత్వం మరింత ప్రస్పుటమైంది. మోదీని ఢీకొట్టే శక్తి ఆమెకే ఉందని జనబాహుళ్యంలో అభిప్రాయం బలపడుతోంది. మరోవైపు విపక్షాలకు రోజురోజుకు కాంగ్రెస్‌పై నమ్మకం సడలుతోంది. ఈ రెండింటినీ తనకు అనుకూలాంశాలుగా మలచుకొని... మోదీకి ప్రత్యామ్నాయంగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మమత. యూపీ (80), మహారాష్ట్ర (48) తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలున్న మూడోరాష్ట్రం బెంగాల్, 2019లో బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో (43.39 శాతం ఓట్లతో) 22 సీట్లు సాధించిన మమత... తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఓట్లశాతాన్ని 47.94 శాతానికి పెంచుకోగలిగారు. 2024కు వచ్చేసరికి బెంగాల్లో 42 సీట్లలో కనీసపక్షం 35 గెలిచినా... ఒకటి, రెండు లోక్‌సభ స్థానాలుండే ఈశాన్యరాష్ట్రాలు, గోవా లాంటి చోట్ల విస్తరిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? కాంగ్రెస్‌తో పొసగని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే ప్రస్తుతం మమతతో సన్నిహితంగా మెలుగుతోంది. 2024 ఇంకా సమయం ఉంది కాబట్టి ఇతర ప్రాంతీయ పార్టీలు వేచిచూసే ధోరణిని అవలంభిస్తాయి. ఆలోపు మాత్రం కాంగ్రెస్‌ను వీలైనంతగా దెబ్బతీసి... తనను తాన ప్రత్యామ్నాయంగా ఆవిష్కరించుకునే ప్రయత్నం మమత సీరియస్‌గా చేస్తున్నట్లు కనపడుతోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆమె అడుగులు, ఎత్తుగడలు కూడా అలాగే ఉన్నాయి. అందుకే వీలైనంతగా విపక్షనేతలను కలిసి వారితో సంబంధాలు నెరుపుతున్నారు. వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈశాన్యంలో విస్తరణపై దష్టి అఖిల భారత మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సుస్మితా దేవ్ (అస్సాం)ను టీఎంసీలో చేర్చుకున్నారు. రాజ్యసభకు పంపారు. రాయిజోర్ దళ్ నేత, ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్‌ను ఆయన పార్టీని టీఎంసీలో విలీనం చేయాలని కోరారు. అస్సాం అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే తమకు ముఖ్యమని, అందుకే విలీనానికి అంగీకరించలేదని, తృణమూల్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమేనని ఆయన ప్రకటించారు. త్రిపురలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాన్ని దష్టిలో పెట్టుకొని నాలుగైదు నెలలుగా త్రిపురలో బలపడటానికి మమత గట్టి ప్రయత్నమే చేశారు. కాకపోతే మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 334 స్థానాలకు గాను బీజేపీ 329 చోట్ల నెగ్గి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. సీట్లు రాకున్నా త్రిపురలో ఎంట్రీ ఇచ్చిన కొద్దినెలల్లోనే టీఎంసీ దాదాపు 20 శాతం ఓట్లను తెచ్చుకోవడం గమనార్హమని అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు. మేఘాలయలో కాంగ్రెస్‌కు చావుదెబ్బ మేఘాలయలో 17 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ను మమత గట్టి దెబ్బకొట్టారు. నవంబరు 24న మాజీ సీఎం ముకుల్ సంగ్మాతో సహా 12 ఎమ్మెల్యేలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా అక్కడ టీఎంసీ ప్రతిపక్షపార్టీగా అవతరించింది. 2022 ఫిబ్రవరి– మార్చి నెలల్లో జరిగే గోవా ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ప్రకటించిన టీఎంసీ వేగంగా పావులు కదిపింది. కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ సీఎం లుజిన్హో ఫలేరోను, భారత టెన్నిస్ దిగ్గజం లియాండ్ పేస్‌ను మమత అక్కున చేర్చుకున్నారు. కొద్దిరోజుల్లోనే లుజిన్హో ఫలేరోను బెంగాల్ నుంచి రాజ్యసభకు పంపారు. టీఎంసీ ఉపాధ్యక్షుడిగా కూడా నియమించారు. మేఘాలయ, త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో తృణమూల్‌కు రాష్ట్ర పార్టీగా ఇప్పటికే గుర్తింపు ఉంది. ఢిల్లీకి చెందిన మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ కీర్తీ ఆజాద్, రాహుల్‌గాంధీకి సన్నిహితుడిగా పేరున్న అశోక్ తన్వర్‌లు గత వారమే టీఎంసీలో చేరారు. జి–23 నేతల్లోనూ చాలామందితో ఆమె టచ్‌లో ఉన్నారనేది తెరపైకి వస్తున్న మరో కొత్త అంశం. ఇటీవలే జీ–23 నేతల్లో ఒకరైన గులాంనబీ ఆజాద్‌కు సన్నిహితులైన నలుగురు మాజీ కశ్మీర్ మంత్రులతో సహా 20 మంది కాంగ్రెస్ గుడ్‌బై కొట్టారు. సుస్మితాదేవ్, లుజిన్హో ఫలేరోలను పార్టీలో చేరిన వెంటనే రాజ్యసభకు పంపడం ద్వారా కాంగ్రెస్ నేతలకు తాను సముచిత స్థానం, గౌరవం ఇస్తానని మమత సంకేతాలు పంపుతున్నారు. అఖిలపక్షానికీ దూరం పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సోమవారం (నవంబరు 29) రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే చాంబర్లో అఖిలపక్ష భేటీ జరిగింది. దీనికి తృణమూల్ కాంగ్రెస్ దూరంగా ఉండటం గమనార్హం. ఆప్ కూడా డుమ్మా కొట్టింది. అలాగే 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌పై నిరసనల్లోనూ టీఎంసీ... కాంగ్రెస్‌కు దూరం పాటించింది. లోక్‌సభలో వాకౌట్ కూడా చేయలేదు. రాజ్యాంగంలో రాసుందా? నవంబరు 22న మమత ఢిల్లీకి వచ్చారు. మూడురోజులు దేశరాజధానిలో ఉన్నారు. బెంగాల్‌కు సంబంధించిన వ్యవహారాలపై ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలుస్తారని అంతా భావించినా... అలాంటిదేమీ జరగలేదు. ఇదే విషయాన్ని 24న ఓ విలేకరి ప్రశ్నిం చగా... మమత సహనం కోల్పోయారు. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ సోనియాను కలవడం తప్పనిసరా? అలాగని రాజ్యాంగంలో రాసుందా? అంటూ సదరు విలేకరిని ఎదురు ప్రశ్నించారు. నేనెవరి అపాయింట్‌మెంట్‌నూ కోరలేదు... వారు పంజాబ్ ఎన్నికల సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. వారి పార్టీ కోసం వారిని పనిచేసుకోనివ్వండి’ అని అన్నారు. దీదీకి కాంగ్రెస్ పొడగిట్టడం లేదని ఆమె మాటలు స్పష్టం చేశాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
రాహుల్ గాంధీతో పీకే కీలక భేటీ..
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అవ్వడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ ఢిల్లీ నివాసంలో మంగళవారం వీరు భేటీ అయ్యారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల గురించి వీరు చర్చించినట్లు సమాచారం. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్-నవజోత్ సింగ్ సిద్ధుల మధ్య సయోధ్య గురించి ఈ భేటీలో చర్చించారనే వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన ఈ భేటీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, హరీష్ రావత్ హాజరయ్యారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ప్రియాంక గాంధీ మంగళవారం లక్నోలో పర్యటించాల్సి ఉండగా.. దాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో పీకేతో భేటీపై పెద్ద ఎత్తున చర్చ జరగుతుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. మోదీకి ధీటైన, బలమైన ప్రధాని అభ్యర్థి కోసం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఎన్సీపీ నేత శరద్ పవార్‌తో ప్రశాంత్ కిషోర్ పలుమార్లు భేటీ అయ్యారు. ఆ తర్వాత శరద్ పవార్ నివాసంలో ఎనిమిది మంది విపక్ష పార్టీలకు చెందిన నాయకులు సమావేశం అయ్యారు. మిషన్ 2024 లక్ష్యంగా మూడో కూటమి ఏర్పాటు కోసమే వీరు భేటీ అయినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ లేకుండానే సమావేశం కొనసాగింది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా మూడో కూటమి ఏర్పాటు సాధ్యం కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్-పీకేల భేటీపై సర్వత్రా ఆసక్తి నేలకొంది. ఈ సమావేశంలో వీరు థర్డ్ ఫ్రంట్‌పై చర్చించనున్నారా లేక వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ ఎన్నికల గురించి మాత్రమే చర్చిస్తున్నారా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. -
పవార్‌తో మళ్లీ ప్రశాంత్ కిషోర్ భేటీ
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 8 విపక్ష పార్టీల నేతలు మంగళవానం పవార్ నివాసంలో ప్రత్యేకంగా సమావేశమైన మర్నాడు ఈ భేటీ చోటు చేసుకోవడం విశేషం. పవార్, ప్రశాంత్ కిషోర్ దాదాపు గంటపాటు సమావేశమయ్యారని, గత పక్షం రోజుల్లో వారిమధ్య ఇది మూడో భేటీ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్ 11న ముంబైలో పవార్ నివాసంలో ఒకసారి, ఆ తరువాత తాజాగా సోమవారం ఢిల్లీలోని పవార్ నివాసంలో రెండోసారి వారు సమావేశమయ్యారని వెల్లడించాయి. ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహలున్న విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నారన్న అంచనాల మధ్య ప్రశాంత్ కిషోర్, పవార్ల మధ్య వరుస భేటీలు జరగడం ఆసక్తికరంగా మారింది. పవార్ నివాసంలో మంగళవారం జరిగిన విపక్ష నేతల సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫెరెన్స్, లెఫ్ట్ పార్టీలు పాల్గొన్న విషయం తెలిసిందే. అది రాజకీయేతర సమావేశమని అందులో పాల్గొన్న పలువురు నేతలు పేర్కొన్నారు. -
థర్డ్ ఫ్రంట్ బీజేపీని ఓడించలేదు: ప్రశాంత్ కిషోర్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే దిశగా అడుగులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పక్షాలను ఏకం చేసేందుకు కసరత్తు జరుగుతోందన్న వాదనలకు ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రోద్బలంతో 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు వ్యూహ రచన జరుగుతోందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ను దూరంగా పెడుతూ... మిగతా విపక్షాలతో మూడోకూటమిని ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. టార్గెట్ 2024! ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో 10 రోజుల వ్యవధిలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండోసారి భేటీ అయ్యారు. దీంతో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో జోరందుకున్నాయి. అయితే సోమవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం రొటీన్‌గానే జరిగిందని ప్రశాంత్ కిషోర్ భేటీ అనంతరం తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇతర రాజకీయ పక్షాలను ఏకం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. 15 రాజకీయ పక్షాలకు ఆహ్వానాలు ప్రశాంత్ కిషోర్‌తో భేటీ తర్వాత శరద్ పవార్ మంగళవారం పలువురు విపక్ష పార్టీల నేతలు, ప్రముఖ వ్యక్తులతో సమావేశం కానున్నారు. ఢిల్లీలోని పవార్ నివాసంలో మంగళవారం కీలక భేటీ జరుగనుంది. కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా ఆధ్వర్యంలోని రాష్ట్రీయ మంచ్ తరపున 15 రాజకీయ పక్షాలకు, సమాజంలోని కీలక వ్యక్తులకు ఈ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆర్థిక అంశాలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై పోరుతో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో శరద్ పవార్‌తో పాటు ఫరూక్ అబ్లుల్లా, యశ్వంత్ సిన్హా, పవన్ వర్మ, సంజయ్ సింగ్, డి.రాజా, జస్టిస్ ఏపీ సింగ్, జావేద్ అక్తర్, కేటీఎస్ తులసి, కరణ్ థాపర్, అశుతోష్, న్యాయవాది మజీద్ మెమొన్, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌వై ఖురేషీ, కేసీ సింగ్, సంజయ్ ఝా, సుదీంధ్ర కులకర్ణి, ఆర్థికవేత్త అరుణ్ కుమార్, ఘన్‌శ్యామ్ తివారీ, సహా పలువురు పాల్గొంటారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. నాకు సంబంధం లేదు: ప్రశాంత్ కిశోర్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమి ఏర్పాటుతో తనకెలాంటి సంబంధం లేదని ప్రశాంత్ కిషోర్ ఎన్డీటీవీతో అన్నారు. ‘మూడో ఫ్రంట్... నాలుగో ఫ్రంట్లను నేను విశ్వసించను. థర్డ్ ఫ్రంట్ బీజేపీ ఓడిస్తుందనే నమ్మకం నాకు లేదు’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇంతకుమించి మాట్లాడలేదు. చదవండి: పీకేతో పవార్ భేటీ.. మిషన్ 2024 -
మూడో కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ ఖరారు
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు సంభవించాయి. మూడు పార్టీలతో ఏర్పడిన మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ‘మక్కల్ నీది మయ్యం’(ఎంఎన్ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్ పేరు ఖరారు కాగా, సీట్ల పంపకం కుదరక ఏఐఏడీఎంకే కూటమితో తెగదెంపులు చేసుకుంటున్నట్లు డీఎండీకే ప్రకటించింది. దీంతో డీఎండీకేని మూడో కూటమిలో చేర్చుకునేందుకు కమల్ ప్రయత్నాలు ప్రారంభించారు. అన్నాడీఎంకే కూటమిలో కొనసాగిన ‘ఇండియా జన నాయక కట్చి’(ఐజేకే) గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో చేరింది. ఐజేకే వ్యవస్థాపక అధ్యక్షుడు పారివేందర్ పెరంబలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నుంచి 1, 2 స్థానాలు మాత్రమే దక్కే పరిస్థితి ఎదురవడంతో కూటమి నుంచి వైదొలిగారు. తన కుమారుడు రవి పచ్చముత్తును పార్టీ అధ్యక్షునిగా చేసి మూడో కూటమి సన్నాహాలు మొదలుపెట్టారు. సీట్ల సర్దుబాటుపై పిలుపు రాకపోవడంతో అలిగిన ‘సమత్తువ మక్కల్ కట్చి’ అధ్యక్షుడు శరత్‌కుమార్ అన్నాడీఎంకే కూటమిని వీడి ఐజేకే కూటమిలో చేరారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ మినహా మరే కూటమిలోనైనా చేరేందుకు ఎదురుచూస్తున్న కమల్ ఈ కూటమిలో చేరారు. ఐజేకే కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ బరిలోకి దిగుతున్నట్లు శరత్‌కుమార్ ప్రకటించారు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఎంఎన్ఎం 154, ఎస్ఎంకే, ఐజేకే చెరో 40 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ప్రజలకు విరోధులుగా వ్యవహరించే ప్రతి ఒక్కరినీ తాము లక్ష్యంగా చేసుకుంటామని కమల్ ప్రకటించారు. అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎండీకేని కూడా కమల్ తమ కూటమిలోకి ఆహ్వానించారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కూటమిలో సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. 234 స్థానాలకు గాను డీఎంకే 186 చోట్ల పోటీ చేయనుంది. కూటమిలోని కాంగ్రెస్‌కు 25, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, వీసీకేలకు ఆరు చొప్పున, ఐయూఎంఎల్, ఎంఎంకేలకు కలిపి 5 సీట్లు కేటాయించింది. -
తమిళనాట కొలిక్కివస్తున్న పొత్తులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి కూటములైన అన్నాడీఎంకే, డీఎంకేల్లో సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కివచ్చింది. 178 స్థానాల్లో పోటీ చేయాలని డీఎంకే నిర్ణయించుకుంది. మూడో కూటమి కోసం నటుడు కమల్‌హాసన్ కసరత్తు చేస్తున్నారు. బీజేపీకి అన్నాడీఎంకే కూటమి 25 సీట్లు కేటాయించినట్లు తెలుస్తున్నా అధికారికంగా ప్రకటించలేదు. డీఎండీకే మినహా అన్ని పార్టీల్లో సీట్ల సర్దుబాటు పూర్తయింది. కూటమిలోని ప్రధాన పార్టీల్లో ఒకటైన డీఎండీకే 20–25 సీట్లు కోరుతుండగా 15 స్థానాలకు పరిమితం కావాలని అన్నాడీఎంకే సూచిస్తున్న దశలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం మరోసారి అన్నాడీఎంకే, డీఎండీకే మధ్య మళ్లీ చర్చలు జరగ్గా 18 సీట్లు ఖరారైనట్లు సమాచారం. డీఎంకే సీట్ల పంపకాలు డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయింది. మొత్తం 234 స్థానాల్లో మిత్రపక్షాలకు కేటాయించినవి పోను మిగిలిన 178 నియోజకవర్గాల్లో డీఎంకే పోటీ చేయనుంది. డీఎంకే కూటమిలో ఇండియన్ ముస్లీం లీగ్, మనిదనేయ మక్కల్ కట్చికి 2, సీపీఐకి 6, ఎండీంకేకు 6, వీసీకేకు 6 సీట్ల కేటాయింపు జరిగింది. కాంగ్రెస్‌కు 25 సీట్లను కేటాయించారు. కన్యాకుమారి లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. సీపీఐ నేతలతో స్టాలిన్ సోమవారం చర్చలు జరిపి 6 సీట్లను, తమిళగ వాళ్వురిమై కట్చికి ఒక సీటు ఖరారు చేశారు. సోమవారం వరకు జరిపిన కేటాయింపుల తరువాత 180 స్థానాలు మిగిలి ఉండగా వీటిల్లో 178 డీఎంకే నియోజకవర్గాల్లో డీఎంకే బరిలోకి దిగనుంది. ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం అమ్మముక కూటమిగా చేరి కృష్ణగిరి, శంకరాపురం, వానియంబాడి నుంచి పోటీ చేస్తోంది. చందనం స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి తమిళగ వాళ్వురిమై కట్చి(టీవీకే)పార్టీలో ఉన్నారు. వీర్పప్పన్ కుమార్తె విద్యారాణి బీజేపీలో ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ, డీఎంకే కూటమిలోని టీవీకే ద్వారా వేర్వేరు స్థానాల్లో వీరువూరు పరస్పర ప్రత్యర్ది పార్టీల నుంచి తలపడేందుకు సిద్దం అవుతున్నారు. -
మా సీఎం అభ్యర్థి కమలహాసన్
సాక్షి, చెన్నై: తమ కూటమి సీఎం అభ్యర్థిగా కమలహాసన్‌ను అంగీకరిస్తున్నట్టు ఎస్ఎంకే నేత శరత్‌కుమార్ తెలిపారు. కూటమి, అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని శరత్‌కుమార్‌కు అప్పగిస్తూ ఎస్ఎంకే కార్యవర్గం బుధవారం తీర్మానించింది. సమత్తువ మక్కల్ కట్చి రాష్ట్ర కార్యవర్గం భేటీ తూత్తుకుడి జిల్లా ద్రవ్యపురంలో జరిగింది. అసెంబ్లీ ఎన్నికల కసరత్తులు, కూటమి ఏర్పాటు, అభ్యర్థుల ఎంపిక, వన్నియర్లకు 10.5 శాతం రిజర్వేషన్ల అమలతో ఎదురయ్యే నష్టాలు ఇతర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. శరత్‌కుమార్ మాట్లాడుతూ భావితరాల శ్రేయస్సును కాంక్షిస్తూ, త్యాగాలకు సిద్ధం కావాలని ఎస్ఎంకే కేడర్‌కు పిలుపునిచ్చారు. ఓటును నోటుతో కొనేయ వచ్చన్న ధీమాతో కొందరున్నారని, వారి ప్రలోభాలకు లొంగ వద్దు అని సూచించారు. లొంగిన పక్షంలో భావితరాలకు అష్టకష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో ఈ పాలకులకు ప్రచారాలకు శరత్‌కుమార్ కావాల్సి వచ్చాడని, ఇప్పుడు శరత్‌కుమార్ అంటే ఎవరో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పాలకులకు గట్టిగా బుద్ధి చెప్పే రీతిలో ఈ ఎన్నికల్లో తన పయనం ఉంటుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందించడమే కాదు, అభ్యర్థుల గెలుపునకు శ్రమించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఐజేకే, మక్కల్ నీది మయ్యం వంటి పారీ్టలతో కలిసి కూటమిగా ఎస్ఎంకే ముందుకు సాగుతున్నదని ప్రకటించారు. ఈ కూటమి ఖరారైందని, ఈ కూటమి సీఎం అభ్యరి్థగా కమల్‌ను అంగీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో రాధికా కూడా పోటీ చేయనున్నారని తెలిపారు. అది ఏ నియోజకవర్గం అన్న కూటమిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అయితే, ఎస్ఎంకే 26 సీట్లలో తప్పకుండా పోటీ చేస్తుందని ప్రకటించారు. -
మూడో కూటమి.. నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి: కమల్
చెన్నె: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రకటన వెలువడిన తెల్లారే మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, అగ్ర నటుడు కమల్ హాసన్ రాజకీయ దూకుడు పెంచారు. ఈ సందర్భంగా తమిళనాడులో కొత్త పొత్తు ఏర్పాటుచేశారు. తనతో కలిసి వచ్చే వారిని కలుపేసుకుని వెళ్తానని ఈ సందర్భంగా కమల్ ప్రకటించాడు. ఎంఎన్ఎం పార్టీ 2018లో స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం కమల్ హాసన్ రాజకీయాల్లోకి దిగారు. అవినీతి రహిత తమిళనాడును మార్చేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. కమల్ పార్టీ స్థాపించిన అనంతరం తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో కమల్ రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తన స్నేహితుడు అగ్ర నటుడు రజనీకాంత్‌ను కలిసిన విషయం తెలిసిందే. తనకు మద్దతు పలకాలని కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై రజనీ ఇప్పటివరకు ఏం స్పందించలేదు. తాజాగా కమల్ ఆలిండియా సముత్వ మక్కల్ కట్చీ పార్టీ అధినేత, నటుడు శరత్‌కుమార్‌ను కలిశారు. ఇందిరా జననయాగ కట్చీ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి తాను మూడో కూటమిని తయారుచేస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. అయితే మూడో కూటమి సీఎం అభ్యర్థిని తానేనని కమల్ స్పష్టం చేశారు. మార్చి 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని.. మార్చి 7వ తేదీకి తొలి విడతగా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తానని కమల్ హాసన్ వివరించారు. మంచి పనుల కోసం తాను తగ్గడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు. దీనర్థం కుదిరితే అన్నాడీఎంకే, డీఎంకే, శశికళతో కూడా కలిసేందుకు సిద్ధమని పరోక్షంగా కమల్ చెప్పారు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 7వ తేదీన ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కమల్ హాసన్ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. చదవండి: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. -
చంద్రబాబు రాజకీయ వ్యభిచారి : కారుమూరి నాగేశ్వరరావు
సాక్షి, పశ్చిమ గోదావరి: చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం ఏ పార్టీతో అయినా కలిసిపోయే రాజకీయ పచ్చి వ్యభిచారని వైఎస్సార్సీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు బాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం ద్వారకా తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఈ రోజు ఒకటి మాట్లాడితే రేపు ఒకటి మాట్లాడుతున్నాడని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా పోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిస్తుంటే దానిని జగన్ కేసీఆర్ కలిసి పోటీ చేసే అంత ఇదిగా అల్లరి రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాబు స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడుతున్నారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి సుహాసిని పై గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ద్వారకా తిరుమల వస్తే ఆయనకి మీ పార్టీ జిల్లా కార్యదర్శి స్వాగతం పలకడాన్ని ఏమంటారని ప్రశ్నించారు. కేసీఆర్‌ని తెలంగాణలో కలిసి పోటీ చేద్దామని మీరు అడిగితే ఆయన ఛీ ఛీ అంటూ మిమ్మల్ని ఛీ కొట్టారని ఆయన అన్నారు. -
రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం: రామకృష్ణ
సాక్షి, ప్రకాశం: చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధాని రైతుల భూములను తాకట్టు పెట్టి పది వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రచారంలో తప్ప... రాష్ట్రంలో అభివృద్ధి ఏమి జరగలేదని అన్నారు. ఎన్నికల స్టెంట్లో భాగంగానే చంద్రబాబు తాయిలాలు ప్రకటిస్తున్నాడని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పని చేస్తున్నాడని అన్నారు. కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘అప్పుడెందుకు మద్దతిచ్చావ్ కేసీఆర్ ?’
సాక్షి, హైదరాబాద్ : సీపీఐ 93వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో సీపీఐ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్గ దోపిడీ, అసమానతలు ఉన్నంతకాలం కమ్యూనిస్ట్‌లు ఉంటారని చెప్పారు. పార్టీ ఏర్పాటు చేసినప్పుడు నిర్బంధం ఎదుర్కొన్నామన్నారు. ప్రజా ఉద్యామాలలో ఎందరినో అరెస్ట్ చేశారని తెలిపారు. జైల్లో ఉన్నవారి తరఫున జవహర్ లాల్ నెహ్రూ కేసులు వాదించారని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్‌ల పాత్ర మరువలేనిదన్నారు. ప్రస్తుత సమాజంలో కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలను ప్రలోభ పెట్టడం వల్లే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అనైక్య పరిస్థితులను విచ్చిన్నం చేయడం కోసమే తాము థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. థర్డ్ ఫ్రంట్ పేరిట ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా పర్యటనలు చేసిన కేసీఆర్ ఈ రోజు తన బాస్ మోదీకి వివరణ ఇస్తారని ఆరోపించారు. థర్డ్ ఫ్రంట్ నిర్ణయం ఎప్పుడో జరిగిందన్న కేసీఆర్ నోట్ట రద్దు, జీఎస్టీని ఎందుకు సపోర్ట్ చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ నాటకాలను ప్రజలు గుర్తిస్తారని విమర్శించారు. త్యాగాల పార్టీ సీపీఐ : చాడ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన పార్టీ సీపీఐ అన్నారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. దేశంలో రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసింది సీపీఐ పార్టీ అని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపింది కూడా సీపీఐ పార్టీనే అన్నారు. త్యాగాల పార్టీ సీపీఐ అంటూ కొనియాడారు. ప్రాంతీయ పార్టీల వల్ల కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడ్డాయని పేర్కొన్నారు. దేశంలో సెంటిమెంట్ రాజకీయాలెక్కువయ్యాయని విమర్శించారు. -
ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీబిజీ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ కూటమిని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమత బెనర్జీతో భేటీ అయి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన.. మరికాసేపట్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై మాయావతి, అఖిలేశ్‌తో చర్చల అనంతరం.. పలు జాతీయ సంఘాల ప్రతినిధులతోనూ కేసీఆర్ చర్చిస్తారు. ఇక, హస్తిన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని కేసీఆర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలుస్తారు. -
పూరీ జగన్నాథ ఆలయంలో కేసీఆర్ పూజలు
సాక్షి, ఒడిశా: ఒడిశా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. కుటుంబసభ్యలతో కలిసి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. పూరీ ఆలయంతోపాటు కోణార్క్‌లోని సూర్య దేవాలయాన్ని కూడా కేసీఆర్ సందర్శించనున్నారు. అనంతరం మధ్యాహ్నం కోల్‌కతాకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ కానున్నారు. కోల్‌కతాలోని కాళీ మందిరాన్ని ఆయన దర్శించుకోనున్నారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలోనే కేసీఆర్ మకాం వేసి.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై పలు పార్టీల నాయకులతో చర్చించనున్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా కేసీఆర్ తాజా పర్యటనను చేపట్టిన సంగతి తెలిసిందే. -
‘ప్రధాని చేసిన సూచన ప్రమాదకరం’
సాక్షి, విజయవాడ : మూడో ప్రత్యామ్నాయం(థర్డ్ ఫ్రంట్) కోసం తమ పార్టీ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటరీ విధానాన్ని దెబ్బతీయాలని కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నీతి అయోగ్ సమావేశంలో జమిలీ ఎన్నికలపై ప్రధాని చేసిన సూచన ప్రమాదకరమని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు జరగాలో ప్రజలు నిర్ణయించాలని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహార శైలి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ స్వతంత్ర ప్రతిపత్తి లేని సంస్థగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరల్ స్ఫూర్తిని కాపాడేందుకు తాము ప్రయత్నిస్తామని తెలిపారు. రాజ్యాంగబద్దంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉందన్నారు. తాము అడిగినప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజ్ కావాలన్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు హోదా కోసం డిమాండ్ చేయడం సంతోషం అన్నారు. -
థర్డ్ ఫ్రంట్ కోసం పార్టీ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు
-
పూర్వ వైభవం కోసం సినీ నటి సహకారం..
సాక్షి, నిజామాబాద్ : బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పతనం ప్రారంభమయిందని జోష్యం చెప్పారు. ఇందుకు నిదర్శనం ఇటీవల జరిగిన ఎన్నికలే అని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి మిత్ర పక్షాలు దూరమవుతున్నాయని తెలిపారు. ‘పూర్వ వైభవం కోసం సినీ నటి మాధురీదీక్షిత్ లాంటి వారి సహకారాన్ని కోరడం ద్వారా రానున్న ఎన్నికల్లో ఓటమి తథ్యమని నిరూపించుకున్నారు. ఆర్ఎస్ఎస్ సమావేశానికి చివరి నిమిషంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్లడం అవకాశవాదమే. ప్రభుత్వం వల్లే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నింటిని సీపీఐ ఏకం చేస్తుంద’ని నారాయణ తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శిఖండి పాత్ర పోషిస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. ‘ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎన్డీయేకు బీ ఫ్రంట్. బీజేపీ, టీఆర్ఎస్లకు వ్యతిరేకంగా అందర్నీ సమీకరిస్తున్నాం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రం చెబుతుంది. దీనిపై కేంద్రం మీద కేసీఆర్ ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. కేసీఆర్‌కు దమ్ముంటే కేంద్రంపై పోరాడాలి. బాంచెన్ దొర అంటూ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులను ఆదుకోవాలి. కాళేశ్వరం పేరు చెప్పి ఓట్లు పొందుదామనుకోవడం భ్రమే. తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంది. తెలంగాణను వ్యతిరేకించిన వారు క్యాబినెట్లో ఉన్నార’ని నారాయణ ధ్వజమెత్తారు. -
2019లో కేసీఆర్‌కి ఓటు వస్తే బీజేపీకి వేసినట్లే ?
సాక్షి, నల్గొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే థర్డ్ ఫ్రంట్ మొదలు పెట్టారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 2019 ఎన్నికల్లో కేసీఆర్‌కి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లింలపై దాడులు పెరిగాయన్నారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడానికే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తాని, మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్దంగా ఉన్నారని ఆరోపించారు. ముస్లింలకు ఇళ్లు, స్థాలాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని అన్నారు. జిల్లాలో 40 వేల మంది ముస్లింలు ఉంటే కేవలం 400 మందికి మాత్రమే రంజాన్ దుస్తులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. దుస్తుల పేర్లతో ముస్లింలను మోసం చేస్తున్నారని కోమిటి రెడ్డి వ్యాఖ్యానించారు. -
‘మూడో ఫ్రంట్’ పునరావృతం కాదు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ వెనక బీజేపీ ఉందన్న ప్రచారాన్ని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. ఎలాంటి మూడో, నాలుగో కూటమికీ బీజేపీ అధికారికంగానూ, అనధికారికంగానూ ఏ విధంగా కూడా సలహాదారు కాదని స్పష్టం చేశారు. 1990ల్లో దేవేగౌడ, ఐకే గుజ్రాల్ నేతృత్వంలో కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడిన ఘటనలు 2019లో పునరావృతం కాబోవని ధీమా వెలిబుచ్చారు. విపక్ష పార్టీలతో అతుకుల బొంతగా ఏర్పడే కూటములు ఎక్కువ రోజులు నిలవబోవన్నారు. బీజేపీ వంటిæ బలమైన పార్టీ నేతృత్వంలోనే సుస్థిర ప్రభుత్వం సాధ్యమవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2019లో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని నిలుపుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సాధించిన పురోగతి, విజయాలను గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భారీగా భూములు మింగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టులు ఆచరణలో సాధ్యం కావని, అందుకే దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా వాటిని పక్కన పెట్టామని చెప్పారు. ఈ విషయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ముందుకు వస్తే పరిశీలిస్తామన్నారు. ‘‘ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయిస్తేనే హైకోర్టు విభజన ప్రక్రియ సాధ్యమవుతుంది. ఏపీలో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయ్యేదాకా హైకోర్టు విభజన జరపరాదని ఆ రాష్ట్ర సీఎం హైకోర్టుకు లేఖ రాశారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి’’అని చెప్పారు. ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటములకు బీజేపీ ఆందోళనపడాల్సిన అవసరం లేదన్నారు. ‘‘విజయ్ మాల్యా, నీరవ్ మోదీ కుంభకోణాలకు గత ప్రభుత్వమే కారణం’’అని ఆరోపించారు. తాజాగా బయటపడిన ఎయిర్ ఏషియా కుంభకోణమూ గత ప్రభుత్వ హయాంలో జరిగిందేనన్నారు. తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్ర కీలకం కానుందని జోస్యం చెప్పారు. ‘‘జాతీయ వృద్ధి రేటు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వంటి అభివృద్ధికి సూచికలు నాలుగేళ్లలో బాగా పెరిగాయి. పారదర్శకతతో అవినీతిని అడ్డుకున్నాం. భారీగా రహదారులను విస్తరిస్తున్నాం. ఉజ్వల యోజన పథకాల, అటల్ యోజన, ప్రధాని జీవన్ జ్యోతి వంటి సంక్షేమ పథకాలు తెచ్చాం. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ముద్ర పథకాలతో యువతకు ఉపాధి కల్పిస్తున్నాం. నాలుగేళ్లలో 7 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలొచ్చాయి’’అని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలయ్యేదాకా పెట్రోల్ ధరలు పెరగకుండా కేంద్రం నియంత్రించిందన్న విమర్శలు అవాస్తవమన్నారు. దేశ గతిని మార్చిన మోదీ అన్ని విషయాల్లో ప్రపంచం ప్రాధాన్యమిచ్చేలా దేశ గతిని ప్రధాని నరేంద్ర మోదీ మార్చేశారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ అన్నారు. మోదీని విజ్ఞుడైన ప్రపంచ నేతగా, భారత్‌ను ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందుతున్న దేశంగా గుర్తిస్తున్నారని, ఇది భవిష్యత్తులో మన దేశం వేగంగా పురోగమించేందుకు సహకరిస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం రూపాయి విడుదల చేస్తే లబ్ధిదారుకు కేవలం 15 పైసలే చేరేవని.. ఇప్పుడు లబ్ధిదారు ఖాతాలో కేంద్రం రూ.వేయి జమ చేస్తే రూ.వేయి చేరుతోందన్నారు. ప్రస్తుత కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో దేశానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఎక్కువ పెట్టుబడులు ఆకర్షిస్తోంది భారతే.. ప్రపంచంలో ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశం భారతేనని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. 2014లో మన దేశంలో కేవలం రెండు మొబైల్ ఫోన్ తయారీ పరిశ్రమలుంటే ఇప్పుడు వాటి సంఖ్య 120కి పెరిగిందని వెల్లడించారు. అన్ని దేశాలు భారత్‌తో మైత్రిని కోరుకుంటున్నాయని, దాన్ని నిలబెట్టుకుంటూ వాటితో మన దేశం స్నేహంగా మెలుగుతోందన్నారు. భారత్ అనుసరిస్తున్న విధానాలతో పాకిస్తాన్ బెదిరిపోతోందని చెప్పారు. మోదీ నిజాయితీకిదే నిదర్శనం.. 14 ఏళ్లు గుజరాత్ సీఎంగా, నాలుగేళ్లు దేశ ప్రధానిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ మోదీ కుటుంబ సభ్యులు సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అతి సాధారణ జీవితాలను గడుపుతున్నారని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఇది ఆయన నిజాయితీకి నిదర్శమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య, ఓయూ మాజీ వీసీ తిరుపతిరావు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. -
ఎవరి కోసం థర్డ్ ఫ్రంట్?
కర్ణాటక ఎన్నికల ప్రభావం దేశ రాజకీయాలపై ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లపై ఏ విధంగా ఉంటుంది అనే అంశంతోపాటు తర చుగా వినబడుతున్న మూడో ఫ్రంట్ అసలు రూపుదిద్దుకుంటుందా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలిద్దాం. 2019లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో అధి కారం కోసం పోటీపడే రెండు ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు. కర్ణాటకలో కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి మంత్రివర్గం కొలువు తీరటం ఒక విధంగా కేసీఆర్‌కు అయిష్టం గానే ఉంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల ప్రభా వం దాని స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడితే అది తన అస్తిత్వానికే ముప్పుగా పరి ణమిస్తుందని ముందే గ్రహించిన కేసీఆర్ మూడో ఫ్రంట్ అనే నినాదాన్ని ఎన్నికల కంటే ముందే వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. మూడో ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ అని పేర్కొంటున్న కేసీఆర్ లక్ష్యం వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి కాంగ్రెస్ బీజేపీల నేతృత్వంలోని ఫ్రంట్లకు సమాంతరంగా మూడో ఫ్రంట్‌ను ఏర్పాటుచేసి 2019 లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలన్నదే. మన దేశంలో ప్రధాన జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీజేపీల అండ లేకుండా మూడో ఫ్రంట్ ఏర్పాటు అన్నది అసాధ్యం. ఏర్పడినా అది బలపడదు. బలపడినా అది ఎవరి కోసం అన్నది ప్రశ్న. అధికార పక్షమైన బీజేపీ పట్ల ప్రజల్లో సహ జంగా ఏర్పడే వ్యతిరేకత కాంగ్రెస్‌కు మూకు మ్మడిగా సానుకూలంగా మళ్లకుండా రాబోయే ఎన్నికల్లో మూడో ఫ్రంట్ రూపంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో బహుముఖ పోటీలు జరిగేలా చూస్తే బీజేపీ వ్యతిరేక ఓట్లలో చీలిక ఏర్పడి అంతి మంగా అది కాంగ్రెస్ ఓటమికి, బీజేపీ గెలుపుకు దారితీస్తుందనే రహస్య ఎజెండా మూడో ఫ్రంట్ నినాదం వెనుక దాగి ఉంది. ఈ సత్యాన్ని క్రమంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించి కేసీఆర్‌కు దూరమై కాంగ్రెస్‌కు దగ్గర అవుతున్నాయి. కుమారస్వామి ప్రమాణ స్వీకారో త్సవానికి కేసీఆర్ తప్ప అన్ని రాజకీయ పార్టీల నాయకులు చంద్రబాబుతో సహా హాజరై ఒకే వేది కపై కనిపించడం, వాళ్లంతా భవిష్యత్తులో కాంగ్రె స్తో జతకట్టి ఉమ్మడిగా బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కొనేందుకు క్రమంగా సన్నద్ధం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయిలో ఏ ఎన్నికలోనైనా సరే బీజేపీకి సరిదీటుగా పోటీ నివ్వగల సత్తా ఉన్న పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీని దేశ వ్యాప్తంగా నిర్వీర్యం చేయగలిగితే ఇక తమకు జాతీయ స్థాయిలో అవరోధాలుండవని, ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి ప్రత్యామ్నాయం లేక అనివార్యంగా తమపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుందన్నది బీజేపీ దురాలోచన. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ దేశ రాజకీయాలలోనైనా ఉండేది రెండే రెండు కూటములు. ఒకటి అధికారంలో ఉన్న పార్టీ కూటమి అయితే రెండవది ప్రతి పక్షాలతో కూడిన కూటమి. కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ ఒక కూట మికి ప్రాతినిథ్యం వహిస్తే ప్రతిపక్షాల కూటమికి కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహి స్తుంది. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు తమ భావజాలంతోపాటు వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక కూటమిలో కొనసాగుతు న్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్థానిక అంశాలతోపాటు వివిధ అంశాలను బేరీజు వేసు కుని ఏ కూటమిలో చేరకుండా తటస్థంగానైనా ఉంటారు కానీ మూడో కూటమిలో చేరరు. మూడో కూటమి వెనుక ఉన్న రహస్య ఎజెండాను క్రమంగా దేశ ప్రజలు ముఖ్యంగా మైనార్టీ సోద రులు కూడా గ్రహించి కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో మధ్యప్రదేశ్, రాజ స్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో శాసనసభ ఎన్నికలు జరు గనున్నాయి. అక్కడ పోటీ ప్రధానంగా జరిగేది కాంగ్రెస్ బీజే పీల మధ్యనే. ఆ ద్విముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి దేశంలోని లౌకిక శక్తులన్నింటికీ ఆసరాగా నిలబడుతుందని ఆశిద్దాం. -టి. జీవన్ రెడ్డి (వ్యాసకర్త శాసనసభ్యులు, జగిత్యాల), మొబైల్: 94400 71330 -
మోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా?
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించడంతో మరోసారి లోక్‌సభ ముందస్తు ఎన్నికలపై చర్చ మొదలైంది. మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది సీట్ల దూరంలో బీజేపీ నిలిచిపోయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మ్యాజిక్ చెక్కు చెదరలేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాం«ధీ నైతిక స్థైర్యాన్ని ఈ ఎన్నికలు బాగా దెబ్బతీశాయనే చెప్పాలి. గుజరాత్ ఎన్నికల్లో మోదీని దీటుగా ఎదుర్కొని సత్తా చాటిన రాహుల్ గాంధీ, కర్ణాటక విషయానికొచ్చేసరికి చతికిలపడిపోయారు. మోదీలా ఒంటి చేత్తో ఎన్నికల భారాన్ని మోసే సామర్థ్యం రాహుల్‌కి లేదని తేలిపోయింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పొత్తులే శరణ్యమని, ఇతర పార్టీలతో చేతులు కలపకుండా లోక్ సభ ఎన్నికలను ఎదుర్కోవడం ఆ పార్టీకి సులభం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి పార్టీలు చేతులు కలిపితే బీజేపీ దూకుడుని అడ్డుకోగలరని ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తేటతెల్లమైంది. అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్, లేదంటే థర్డ్ ఫ్రంట్‌కు ఒక రూపు రేఖలు రావడానికి గడువు ఇవ్వకుండా బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు ఎన్నికలు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే యోచన బీజేపీ చేస్తుందనే చర్చ జరుగుతోంది. ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీకి గడ్డు పరిస్థితులు ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలి. ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికార పార్టీగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 2003 నుంచి ఆ పార్టీ అధికారంలో ఉంది. దీంతో అక్కడ బీజేపీ గెలుపు సులభంకాదనే అంటున్నారు. ఇక రాజస్థాన్‌లో కూడా బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా లేవు. పైగా కర్ణాటక మాదిరి ప్రతీ ఎన్నికల్లో పాలకపక్షాన్ని ఓడించే సంస్కృతి రాజస్థాన్‌ది. ఆ మూడు రాష్ట్రాల్లో మోదీ మ్యాజిక్, అమిత్ షా చాణక్య వ్యూహాలు పనిచేయవనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఆ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్ని నిర్వహిస్తే బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సా«ధారణ పరిస్థితుల్లో 77 శాతం మంది ఒకే పార్టీకి ఓటు వేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. రాష్ట్రాలను కొల్లగొడుతున్నా తగ్గుతున్న బీజేపీ ప్రభ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ తనకున్న ఇమేజ్‌తో ఒంటిచేత్తో పార్టీని అత్యధిక రాష్ట్రాల్లో విజయతీరాలకు చేర్చినప్పటికీ, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందిన సీట్లను, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పరిశీలించి చూస్తే తగ్గుతూ వస్తున్నాయి. బీజేపీ హవా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను లోక్‌సభ స్థానాలుగా మార్చి చూసినప్పుడు, 2014 ఎన్నికలతో పోల్చిచూస్తే ఇప్పటివరకు బీజేపీ 45 లోక్‌సభ స్థానాలను కోల్పోయినట్టు ఎన్నికల విశ్లేషకుల అంచనా. అంతేకాదు బీజేపీ అధికారంలోకి వచ్చిన 15 రాష్ట్రాల్లో 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే బీజేపీ ఓట్ల శాతం తగ్గిపోతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆ 15 రాష్ట్రాల్లో బీజేపీకి 39 శాతం ఓట్లు వస్తే, ఆ తర్వాత అదే రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 29 శాతానికి ఆ పార్టీ ఓటు షేరు పడిపోయింది. ఇక ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీకి వచ్చే ఓట్ల శాతం మరింత పడిపోవచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే వీటితో పాటు లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు బీజేపీ సై అంటుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించడంలో సాధకబాధకాలను బీజేపీ చర్చిస్తోంది. ఈ ఏడాది చివర్లో లోక్‌సభను రద్దు చేసి తమతో కలిసొచ్చే రాష్ట్రాలతో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న చర్చ అయితే మొదలైంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు మోదీ ఇమేజ్ను కొంత డ్యామేజ్ చేసినప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా సగానికి పైగా మంది ఆయన పరిపాలనపై సంతృప్తిగా ఉన్నారని ఇటీవల సర్వేల్లో వెల్లడి కావడం కమలనాథుల్లో హుషారు నింపింది. ఇప్పుడు కర్ణాటకలో అధికారానికి కొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయినా ఈ ఫలితాలు దక్షిణాదిలోనూ సత్తా చాటగలమన్న ఆత్మవిశ్వాసాన్ని బీజేపీ శ్రేణుల్లో నింపాయి. ఇలాంటి సమయంలోనే లోక్‌సభ ఎన్నికల్ని ముందస్తుగా నిర్వహించి మరోసారి అధికార అందలాన్ని అందుకోవాలన్న వ్యూహంలో బీజేపీ ఉందనే అభిప్రాయం అయితే వినిపిస్తోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
కేసీఆర్ ఫ్రంట్.. కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు!
సాక్షి, చెన్నై : జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా, ప్రాంతీయ పార్టీలతో కూటమిని ఏర్పాటుచేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల నాయకులను ఆయన కలుస్తూ వచ్చారు. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, దేవేగౌడ, కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్ తదితరులు కలిసిన ఆయన చెన్నైకి వెళ్లి డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన తనయుడు స్టాలిన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. డీఎంకే నేతలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. డీఎంకే ఎంపీ, కరుణానిధి తనయురాలు కనిమొళితో కూడా సమావేశమై.. కేసీఆర్ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌పై స్పందించిన డీఎంకే ఎంపీ కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వదులుకునే ఆలోచనే లేదని, ఆ పార్టీతో పొత్తు కొనసాగుతుందని కనిమొళి స్పష్టం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ రహిత ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రయత్నిస్తుండగా.. కాంగ్రెస్‌కు దూరం జరగబోమని కనిమొళి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సీఎం కేసీఆర్‌తో అఖిలేశ్ ‘ఫెడరల్ భేటీ’
సాక్షి, హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అఖిలేశ్ యాదవ్‌కు మంత్రి కేటీఆర్ సాదరంగా స్వాగతం పలికారు. అటు నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లిన అఖిలేశ్.. అక్కడ సీఎం కేసీఆర్‌తో సమావేశమై.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయ పరిణామాలపై చర్చించారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్యాయ రాజకీయ కూటమి ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మమతా బెనర్జీ, దేవేగౌడ, కరుణానిధి, స్టాలిన్ వంటి నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్.. ఈ ప్రక్రియలో భాగంగా యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్‌తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో భాగంగా బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా కలిసి పనిచేసే విషయమై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. -
థర్డ్‌ఫ్రంట్ బీరాలేమయ్యాయి?
సాక్షి, హైదరాబాద్: ‘చెన్నైలో డీఎంకే అధినేత కరుణానిధితో చర్చలు బెడిసికొట్టాయో..ఏమోగాని నిన్నటి వరకు థర్డ్ ఫ్రంట్ అంటూ బీరాలు పలికిన సీఎం కేసీఆర్ ఇప్పుడది మీడియా సృష్టి అంటూ మాట మార్చారు’ అని బీజేపీ విమర్శించింది. సోమవారం ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులు సుభాష్, ప్రకాశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అధికార వ్యామోహంతో బెంగాల్, చెన్నై అంటూ పర్యటిస్తున్న కేసీఆర్‌కు ప్రగతిభవ న్ దాటి సచివాలయానికి వచ్చే సమయం ఉండదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్నతవిద్య భ్రష్టు పట్టిపోయిందని, కళాశాలలు, వర్సిటీల్లో అధ్యాపకులను కూడా నియమించటం లేదన్నారు. సీఎంగా రాష్ట్రాన్ని ఉద్ధరించలేని కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలో భూకంపం తెస్తానంటున్న ఆయన అక్కడ ఇసుక రేణువును కూడా కదల్చలేరని ఎద్దేవా చేశారు. -
కేసీఆర్ యాదృచ్ఛికంగా సీఎం అయ్యారు..
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే అనుకోకుండా అదృష్టం కొద్ది కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని, ఈ విషయాన్ని కేసీఆర్ మర్చిపోవద్దని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. అనుకోని పరిస్థితుల్లో కేసీఆర్ యాక్సిడెంటల్ సీఎం అయ్యారని, ఆయన అబద్దాలను నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లు వేశారన్నారు. మాయమాటలు చెప్పి అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీర్ మరోసారి తన అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పొన్నాల సోమవారమిక్కడ విమర్శించారు. అయితే ఈసారి కేసీఆర్ మాటలను వినడానికి ప్రజలు సిద్ధంగా లేరనే విషయం తేలుసుకుంటే మంచిదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని కేసీఆర్ అంటున్నారని, ఈ రోజు ఆయన తెలంగాణ సీఎం అయ్యారంటే అది కాంగ్రెస్ చలవతోనే అని, ఆ విషయం మర్చిపోయి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయాత్నాల గురించి పొన్నాల మాట్లాడుతూ ‘అబద్దాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అది చాలదన్నట్లు ఇప్పుడు దేశం మీద పడ్డారు. కేసీఆర్ బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోదీకి కోవర్టు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. కానీ ఆయన ఫెడరల్ ఫ్రంట్‌కు ఆదిలోనే పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. నిన్న డీఎంకే నేత స్టాలిన్ ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదని కేసీఆర్ మొహం మీదనే కాదని తేల్చేశారు. కాంగ్రసేతర ప్రత్యామ్నాయం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తేల్చి చెప్పిన స్టాలిన్, కావేరి సమస్య పై బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేస్తుండగా జేడీఎస్‌కు ( బీజేపీ , జేడీఎస్‌ల అవగాహన నేపధ్యంలో ) మద్దతు పలుకుతున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో మా మద్దతు ఎలా ఆశిస్తారు అని ప్రశ్నించారు. దీనిక కేసీఆర్ ఏం బదులిస్తారు’ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి కేసీఆర్ ...మమత బెనర్జీని కలిస్తే కాంగ్రెస్ లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయాలు ఎలా సాధ్యం అన్నారు. కేసీఆర్ హేమంత్ సొరేన్ ను కలిసిన మరుసటి రోజే ఆయన సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఇక నవీన్ పట్నాయక్ అయితే, ‘కేసీఆర్‌నును నేను ఆహ్వానించలేదు ఆయన వస్తా అంటే రమ్మన్నాను. రాజకీయాలు ఏమి లేవు’ అని కొట్టి పారేశారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి మరో అడుగు ముందుకేసి ‘కేసీఆర్ మూడో ఫ్రంట్ మూసి లాంటిది, కంపు కొడుతుంది’ అని మరింత ఘాటుగానే విమర్శించారు అని పొన్నాల ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూడో ఫ్రంట్‌ను అడ్డం పెట్టుకొని తన పార్టీలోని అంతర్గత రాజకీయాలను అధిగమించాలని కేసీర్ అడుగులు వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. -
చంద్రబాబు మంచి మిత్రుడు: కేసీఆర్
సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా రాజకీయాల్లో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదివారమిక్కడ డీఎంకే అధినేత కరుణానిధి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరిగాయని తెలిపారు. ఈ చర్చలు ఆరంభం కాదు.. ముగింపూ కాదని, చర్చలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. ఒక అభిప్రాయానికి రావడానికి రెండు, మూడు నెలలు పడుతుందన్నారు. భారతదేశం సెక్యులర్ దేశంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. వైద్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల రంగాలను రాష్ట్రాలకు కేటాయించాలని కేంద్రానికి సూచించారు. దేశ పరిరక్షణ, రక్షణ వ్యవస్థపై కేంద్రం దృష్టి సారించాలని అన్నారు. 2004లో మొదటిసారిగా కరుణానిధిని కలిశానని, 2004లో యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే, టీఆర్ఎస్ కలిసి పనిచేశాయని కేసీఆర్ గుర్తుచేశారు. మే 10 నుంచి రైతుబంధు పథకాన్ని తెలంగాణలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టాలిన్ ఆహ్వానించామన్నారు. తమ స్నేహం చాలాకాలం కొనసాగుతుందని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడించారు. థర్డ్ ఫ్రంట్ అనేది లేనేలేదని, భవిష్యత్తులోనూ చర్చలు కొనసాగుతాయని, ప్రస్తుతం అందరి అభిప్రాయాలను తెలుసుకునే పనిలో ఉన్నామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు, నేను మంచి స్నేహితులమని సీఎం కేసీఆర్ తెలిపారు. రాజకీయ కూటమి నిర్మాణంలో భాగంగా ఎవరినైనా కలిసేందుకు వెనుకాడనని చెప్పారు. -
‘ఆయనే రాజు..ఆయనే మంత్రి’
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పెట్టబోయే థర్డ్‌ఫ్రంట్ కి ఆయనే రాజు..ఆయనే మంత్రి..ఆయనే బంటు అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఎద్దేవా చేశారు. ఇతర పార్టీ నేతలు ఎవరూ కేసీఆర్‌తో కలిసి రారని జోస్యం చెప్పారు. కేసీఆర్ రాజకీయ నిలకడలేని వ్యక్తి అని, ఎన్నికల ముందు ఓ మాట ఎన్నికల తర్వాత ఓ మాటా మారుస్తాడని విమర్శించారు. దేశంలో భూకంపం సృష్టిస్తా అంటున్నాడు అంటే ప్రజలను, ప్రకృతి సర్వనాశనం చేయడమేనా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ సరిగా చేయలేదని, మద్దతు ధర కల్పించలేకపోయారని మల్లు రవి ఆరోపించారు. ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్ ఎటువంటి గుణాత్మక మార్పు తీసుకొస్తారని వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్రూం, కేజీ టూ పీజీ, దళితులకు భూమి లాంటి ఏ పథకాలను సరిగా అమలు చేయలేదని ఆరోపించారు. బీజేపీకి, టీఆర్ఎస్ కి ఓటమి తప్పదని మల్లు రవి జోస్యం చెప్పారు. -
కేసిఆర్ వ్యూహాలేంటి?
-
కేసీఆర్ ఫ్రంట్.. మూసి నది!
సాక్షి, హైదరాబాద్: సీపీఎం మహాసభల్లో రాజకీయ తీర్మానం గురించి చర్చించినట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు నగరంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీతారాం ఏచూరి గురువారం విలేకరులతో మాట్లాడారు. రెండు నెలల కిందటే రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించామని, కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చాయని ఏచూరి తెలిపారు. రాజకీయ తీర్మానంపై అందరి అభిప్రాయాలను స్వీకరించామని తెలిపారు. పార్టీ సభ్యుడు ఎవరైనా తమ ప్రతిపాదన ఇవ్వవచ్చునని, ప్రతిపాదనలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. గతంలో పార్టీ పరంగా జరిగిన లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. జస్టిస్ లోయ మృతిపై సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని చెప్పారు. ఈ కేసును ఉన్నత ధర్మాసనం సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలో సీక్రేట్ బ్యాలెట్‌కు ఆస్కారం లేదని, ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో అవగాహన ఒప్పందం ఉండబోదని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే అంశంపై కూడా మహాసభల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన అంశాలు, ప్రత్యేక హోదా విషయంలో పార్టీ సమావేశాల్లో కచ్చితంగా తీర్మానం ఉంటుందని తెలిపారు. జాతీయ ప్రత్యామ్యాయ ఫ్రంట్లలో చేరే ఆలోచన లేదని పేర్కొంటూ.. కేసీఆర్ ఫ్రంట్‌ను ఏచూరి మూసీ నదితో పోల్చారు. -
వచ్చే నెలలో సీఎం కేసీఆర్ ఒడిశా టూర్
-
కేసీఆర్ పథకాలు అద్భుతం: దేవెగౌడ
-
మాది ప్రజల ఫ్రంట్
సాక్షి, హైదరాబాద్/బెంగళూరు: దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు ఘోరంగా విఫలమయ్యాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. తమ ఫ్రంట్ చిల్లర రాజకీయాల కోసం కాదని స్పష్టంచేశారు. జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎజెండాతో ముందుకు పోతున్నామని, తమది తృతీయ ఫ్రంట్ కాదని, ప్రజలు, రైతుల ఫ్రంట్ అని పేర్కొన్నారు. దేశాన్ని, రైతులను, నిరుపేదలను, మహిళలను కాపాడటమే తమ అంతిమ లక్ష్యమన్నారు. 2019 ఎన్నికలకు ముందే రైతుల కోసం ఎజెండా తయారు చేస్తామని, జాతి ప్రయోజనాల కోసమే ఫ్రంట్ ఏర్పడుతుందని చెప్పారు. ‘‘బీజేపీ, కాంగ్రెస్ ట్రాప్‌లో ఉన్న పార్టీలన్నీ బయటకు రావాలి. దేశాన్ని, భారతమాతను కాపాడాలి. రైతులు, నిరుపేదలు, మహిళలు, న్యాయం కోరుకుంటున్న వారిని రక్షించాలి’’అని పిలుపునిచ్చారు. దేశంలో గుణాత్మక మార్పు కోసమే ఫ్రంట్ ఉద్యమిస్తుందని, దేశాభివృద్ధి కోసం ఏ పార్టీ అయినా తమతో కలిసిరావొచ్చని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు జేడీఎస్‌కు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. జేడీఎస్ నేతలు ఆహ్వానిస్తే తాను కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్ వివరించారు. కేసీఆర్ కృషిని దేవెగౌడ అభినందించారు. ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిన సీఎం.. దేవెగౌడను ఆయన నివాసంలో కలుసుకున్నారు. దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. శాలువా కప్పి సన్మానించారు. సమావేశం అనంతరం దేవెగౌడ ఇంట్లోనే మధ్యాహ్న భోజనం చేశారు. కేసీఆర్ వెంట ఎంపీలు బి.వినోద్ కుమార్, జె.సంతోష్ కుమార్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, టీఎస్ ఎండీసీ చైర్మన్ సుభాష్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తదితరులు ఈ భేటీలో ఉన్నారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. నీళ్ల కోసం కొట్టుకుంటే చోద్యం చూస్తున్నారా? తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చేందుకు నిర్వహించిన భారీ సభలో దేవెగౌడ స్వయంగా పాల్గొన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. ‘‘స్వాతంత్య్రం అనంతరం ఆరేళ్లు మినహా కాంగ్రెస్, బీజేపీలే దేశాన్ని పాలించాయి. వారి లోపభూయిష్టమైన విధానాల వల్లే దేశం సమస్యలను ఎదుర్కొంటోంది. 70 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశంలో సమస్యలను పరిష్కరించటంలో ఘోరంగా విఫలమయ్యాయి. తమిళనాడు, కర్ణాటక మధ్య ఉన్న కావేరి జల వివాదాన్ని కేంద్రం ఎందుకు పరిష్కరించడం లేదు. జల వివాదాలను పెండింగ్‌లో పెట్టి రాష్ట్రాల మధ్య కేంద్రం యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది’’అని ఆరోపించారు. దేశంలో 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని, ప్రతి ఎకరానికి సరిపడేంత సాగునీటిని అందించినా దాదాపు 30 వేల టీఎంసీల మిగులు ఉంటుందని చెప్పారు. కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి 2004లో బ్రిజేష్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తే.. 14 ఏళ్లు గడిచినప్పటికీ ట్రిబ్యునల్ పరిష్కరించలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నీళ్ల కోసం రాష్ట్రాలు కొట్టుకుంటుంటే ఢిల్లీలోని కేంద్ర పాలకులు చోద్యం చూస్తున్నారు. ఆరు నెలల్లో, కనీసం ఏడాదిలో తీర్పు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఆదేశించలేదా? ఇదంతా కాంగ్రెస్, బీజీపీ ప్రభుత్వాల అసమర్థత. వైఫల్యమే’’అని దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు, రైతుల కష్టాలు మరింత తీవ్రమయ్యాయన్నారు. కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలంతా జేడీఎస్‌కు మద్దతు పలకాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ పథకాలు భేష్: దేవెగౌడ దేశానికి స్వాతంత్య్రం తర్వాత 70 ఏళ్లుగా సమస్యలు అలాగే ఉన్నాయని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌పై తనతో, కుమారస్వామితో కేసీఆర్ చర్చలు జరిపారని వెల్లడించారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం వేచి చూస్తున్నారని పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీల్లో మిత్రపక్షాలుగా ఉన్న స్థానిక పార్టీలన్నీ తృతీయ కూటమిలో చేరాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రజాధనాన్ని దోచుకోవడం, అధికారం కోసం అడ్డదారులు తొక్కడం తప్ప ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి పట్టదని విమర్శించారు. తృతీయ కూటమికి తమ మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన పథకాలు చాలా బాగున్నా యని దేవెగౌడ కితాబిచ్చారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గర్భిణుల ఆరోగ్యం కోసం వినూత్న పథకం తీసుకొచ్చారని కొనియాడారు. రైతుల కోసం తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా పథకం అమలు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వారివి విభజన రాజకీయాలు: ప్రకాశ్‌రాజ్ సినీనటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీలు మతం, కులం, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయంటూ ఆరోపించారు. వచ్చే నెలలో జరుగనున్న ఎన్నికల్లో ప్రజలు ఓట్ల ద్వారా రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా దేశానికి కేంద్రం చేసేందేమీ లేదని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఎవరికి మద్దతిస్తే న్యాయం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. దేశంలో మార్పు కోరుకునే ప్రజలంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమ సమయంలోనే మద్దతు తెలంగాణ ఉద్యమ సమయంలో మద్దతు ఇవ్వడంతో పాటు వరంగల్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో దేవెగౌడ పాల్గొన్నారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచినందుకు దేవెగౌడకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పెట్టుబడి సాయం పథకం ప్రకటించిన సందర్భంగా కేసీఆర్ కు దేవెగౌడ ఫోన్ చేసి అభినందించారు. హైదరాబాద్‌కు వస్తానని చెప్పారు. అయితే తానే బెంగుళూరుకు వచ్చి కలిసి ఆశీర్వాదం తీసుకుంటానని నాడు కేసీఆర్ చెప్పారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సమాజం, పేదలు, అణగారిన వర్గాల కోసం పాటుపడుతున్న ప్రకాశ్‌రాజ్ రియల్ హీరో అని ప్రశంసించారు. -
దేవెగౌడతో భేటీ అయిన కేసీఆర్
సాక్షి, బెంగళూరు : టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మాజీ ప్రధానమంత్రి దేవెగౌడతో భేటీ అయ్యారు. దేవెగౌడ నివాసం అమోఘలో జరిగిన ఈ సమావేశంలో సినీనటుడు ప్రకాశ్ రాజ్, ఎంపీ వినోద్, సంతోష్ కుమార్, సుభాష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై కేసీఆర్ ఈ సందర్భంగా దేవెగౌడతో చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తో దేశ రాజకీయాలు చర్చించడం సంతోషంగా ఉందన్నారు. కుమారస్వామితో కలిసి దేశ రాజకీయాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇక జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టి.. దేశంలో గుణాత్మక మార్పుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాలంటున్న కేసీఆర్.. ఇటీవలే కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరేన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ సమావేశమయ్యారు. ఇపుడు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్, దేవెగౌడల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. దేవగౌడతో భేటీ అనంతరం ఇవాళ సాయంత్రం సీఎం హైదరాబాద్ చేరుకుంటారు. -
‘జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదాం’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీ భవన్‌కు వచ్చిన కేజ్రీవాల్, చంద్రబాబుతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు దిశగా చంద్రబాబు ఆయనతో చర్చించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని చంద్రబాబు ప్రతిపాదించినట్టు సమాచారం. ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇప్పటికే కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కూటమిపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు, కేజ్రీవాల్‌తో ఏకాంత చర్చలు జరిపారు. స్పందించని కేజ్రీవాల్ చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడాలని కేజ్రీవాల్‌ను టీడీపీ నేతలు కోరారు. కానీ ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. అయితే కేజ్రీవాల్ తమకే మద్దుతు ఇచ్చారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీడియాతో చెప్పారు. ప్రాంతీయ పార్టీల కూటమిలో చక్రం తిప్పాలని చంద్రబాబు భావిస్తున్నారంటూ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. -
నితీష్-పాశ్వాన్ దోస్తీతో బీజేపీలో గుబులు
పట్నా : జేడీ(యూ) నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ల మధ్య పెరుగుతున్న మైత్రి బీజేపీలో గుబులు రేపుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వీరు బీజేపీయేతర ఫ్రంట్‌కు చేరువవుతారనే సందేహాలు కమలనాధులను కలవరపెడుతున్నాయి. మరోవైపు లాలూ నేతృత్వంలోని మహాకూటమిలో ఎన్డీఏ పార్టీలు కొన్ని చేరతాయనే ప్రచారం ఊపందుకుంది. దేశంలో తలెత్తుతున్న మత ఘర్షణల్లో బీజేపీ దూకుడు వైఖరితో పాటు బీహార్ సర్కార్‌పై ఆర్జేడీ విరుచుకుపడుతున్న తీరుతో ముస్లింలు, దళితులు తమకు దూరమవుతారనే ఆందోళన నితీష్, పాశ్వాన్‌లను పునరాలోచనలో పడేస్తున్నాయని భావిస్తున్నారు. బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ ఇప్పటికే ఎన్డీఏను వీడి ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో చేరారు. కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ నేతృత్వంలోని ఆర్ఎల్ఎస్పీ సైతం బీజేపీని వీడుతుందనే ప్రచారం నేపథ్యంలో బీజేపీ వ్యతిరేకంగా పోరాడటంలో ఆర్జేడీ తన ప్రాబల్యాన్ని విస్తరించడం నితీష్, పాశ్వాన్లకు మింగుడుపడటం లేదు. గత ఆరు నెలల్లో పాశ్వాన్, నితీష్‌లు కనీసం నాలుగు సార్లు భేటీ అయ్యారని ఎల్జేపీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో కేంద్ర మంత్రి కుష్వాహ కూడా పాల్గొన్నారు. మరోవైపు ఏప్రిల్ 14న పాట్నాలో జరిగే దళిత్ సేన జాతీయ సమ్మేళనంలో మరోసారి వీరు కలవనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పాశ్వాన్ విడిగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తారనే వార్తలను బీజేపీ తోసిపుచ్చింది. దళిత్ సేన సమ్మేళనానికి డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీని కూడా ఆహ్వానించారని బీజేపీ చెప్పుకొచ్చింది. ఈ సమావేశం నేపథ్యంలో ప్రత్యేక ఫ్రంట్ ఏర్పాటు అవుతుందని భావించడం సరికాదని పేర్కొంది. మరోవైపు పాశ్వాన్ మహాకూటమిలో చేరతారని ఆర్జేడీ పేర్కొంటోంది. -
ఫ్రంట్ వెనుక ఏముంది?
త్రికాలమ్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) తలపెట్టిన మూడవ (ఫెడరల్) ఫ్రంట్ నిర్మాణం సాధ్యమేనా? అటువంటి ఫ్రంట్ లోక్‌సభలో మెజారిటీ స్థానాలు గెలుచుకొని స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదా? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో మూడు రోజులు మకాం పెట్టి శరద్ పవార్ సహా ముఖ్యులైన ప్రతిపక్ష నాయకులందరితోనూ సమాలోచనలు జరిపారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా కలుసుకున్నారు. సోనియాతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ, తరచూ మాట్లాడుకుంటూ ఉంటామనీ స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలు ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉన్నదని అంటూనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌లో కాంగ్రెస్ కూడా ఉంటుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో సంబం ధం లేకుండా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ ఆలోచనకు ఇది భిన్నమైనది. తన ప్రతిపాదనను ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నంలో కేసీఆర్ మొట్టమొదట సమాలోచన జరిపింది మమతా బెనర్జీతోనే. ప్రత్యేక విమానంలో కోల్‌కతా వెళ్ళి ఆమెతో సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ ఉండటం అనివార్యమని చెప్పడం కేసీఆర్ దౌత్యానికి ప్రతికూలం. అయినప్పటికీ కేసీఆర్ వచ్చే వారం ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు. మమత వ్యూహం మమత చెప్పిన మతలబు ప్రకారం ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీనే ప్రధానంగా పోటీలో ఉండాలి. ఇతర ప్రతిపక్షాలు సదరు ప్రధాన పార్టీకి సహకరించాలి. వివిధ రాష్ట్రాలలో పరిస్థితులను గమనించినట్లయితే ఈ వ్యవహారం మమతా బెనర్జీ ఊహిస్తున్నంత సరళమైనది కాదని అర్థం అవుతుంది. రెండు ప్రాంతీయ పార్టీలు సమ ఉజ్జీలుగా ఉన్న రాష్ట్రాలు–తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముఖాముఖీ తలపడే రాష్ట్రాలు–రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. బీజేపీతో ఒకటి లేదా రెండు ప్రాంతీయ పార్టీలు తలపడుతున్న రాష్ట్రాలు–ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, ఢిల్లీ. కాంగ్రెస్‌ని ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పరిగణిస్తున్న రాష్ట్రం తెలంగాణ. మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, గోవా, అసోం, కర్ణాటక, జమ్మూ–కశ్మీర్, పంజాబ్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు ఒకటి లేదా రెండు ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల ప్రమేయం లేకుండా కేవలం మూడో ఫ్రంట్‌కు చెందిన పక్షాలు మాత్రమే మెజారిటీ లోక్‌సభ స్థానాలు గెలుచుకునే పరిస్థితి లేదు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కలిసి పోటీ చేసి ఒక పార్టీ ఓట్లు మరో పార్టీకి సవ్యంగా బదిలీ అయితే ఉత్తరప్రదేశ్‌లో సగానికి పైగా లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటాయి. బిహార్‌లో బీజేపీ, జేడీ(యు) కలిసి పోటీ చేసినా ఆర్జేడీ మెజారిటీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. తమిళనాడులో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా అత్యధిక స్థానాలు డీఎంకేకి లభిస్తాయి. ఏఐడీఎంకే, కమల్ హాసన్ పెట్టిన కొత్త పార్టీ, రజనీకాంత్ పెడతారో లేదో తెలియని పార్టీ, ఇప్పటికే ఉన్న చిన్నాచితకా పార్టీలు డీఎంకే జైత్రయాత్రని నిలువరించలేవన్నది విశ్లేషకుల అభిప్రాయం. పశ్చిమ బెంగాల్లో తృణమూల్‌కి తిరుగులేదు, తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకోకపోతే టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది. తెలంగాణలో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నడుమే. బీజేపీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు లేదు. ప్రొఫెసర్ కోదండరాం పార్టీ నెలకొల్పినా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చరు. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన పార్టీ టీడీపీ అని మమతా బెనర్జీ మాటల సందర్భంలో అన్నారు. ఆమెకు క్షేత్రవాస్తవికత తెలి యదు. వచ్చే ఎన్నికలలో టీడీపీకి ఎక్కువ లోక్‌సభ స్థానాలు లభిస్తాయని టీడీపీ సమర్థకులు సైతం చెప్పలేరు. అక్కడ జాతీయ పార్టీలు రెండూ బలంగా లేవు. వైఎస్సార్సీపీ ప్రాబల్యం నానాటికీ పెరుగుతున్నది. అధికారంలో ఉన్న కారణంగా టీడీపీ పట్ల ప్రతికూలత ఉన్నది. జనసేన నిర్మాణ దశలోనే ఉంది. ఒడిశాలో బీజేపీ ఎంత ప్రయత్నించినా బిజూ జనతాదళ్పైన ఆధిక్యం సాధించలేకపోవచ్చు. అంటే ప్రాంతీయ పార్టీలు అధిక స్థానాలు గెలిచే అవకాశం ఉన్న ఈ రాష్ట్రాలలో–యూపీ (80), బిహార్ (40), తమిళనాడు (39), పశ్చిమబెంగాల్ (42), ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ (17), ఒడిశా (21)– మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య 264. ఈ స్థానాలలో సగానికి పైగా ప్రాంతీయ పార్టీలకు లభించినా కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం. ఇవి కాకుండా మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్, జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ, జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా, కర్ణాటకలో జేడీ(ఎస్), ఢిల్లీలో ఆప్, పంజాబ్‌లో అకాలీదళ్, ఈశాన్య రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో కొన్ని స్థానాలు ప్రాంతీయ పార్టీలకు రావచ్చు. అన్నీ కలిపితే ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌కు 150 స్థానాలు లభించడం గగనం. బీజేపీ, కాంగ్రెస్ నేరుగా తలబడే రాష్ట్రాలలో–మధ్యప్రదేశ్ (28), ఛత్తీస్‌గఢ్ (11), రాజస్థాన్ (25), గుజరాత్ (26),ఉత్తరాఖండ్ (5), హిమాచల్ ప్రదేశ్ (4)అరుణాచల్‌ప్రదేశ్ (2)– 75 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్లు ఉన్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలోని ఈ రెండు ఫ్రంట్లలో ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా ప్రస్తుత కూటమి నుంచి బయటికి వచ్చి మూడో ఫ్రంట్‌లో చేరదు. కేరళలో ఇప్పుడిప్పుడే ఉనికి చాటుకుంటున్న బీజేపీ ఎక్కువ లోక్‌సభ స్థానాలు ఆశించడం దురాశ. ఇటువంటి పరిస్థితులలో బీజేపీ, కాంగ్రెస్ ప్రమేయం లేకుండా కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాని పని. మూడో ఫ్రంట్ వృధాప్రయాసేనా? ఈ మాత్రం లెక్కలు కేసీఆర్‌కు తెలియవా? తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. ఎంఐఎంతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నారు కనుక బీజేపీని వ్యతిరేకించాలి. అసలు బీజేపీ అధినాయకత్వం పురమాయిస్తేనే కేసీఆర్ రంగంలోకి దిగారనీ, ఎన్డీఏ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు మూడో ఫ్రంట్ పనికి వస్తుందనీ రేవంత్‌రెడ్డి వంటి కాంగ్రెస్ నాయకులు చేసే ఆరోపణలకు ఆధారాలు లేవు. మరి మూడో ఫ్రంట్ ఆలోచన దేనికోసం? తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ని ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చోబెట్టడానికా? ఢిల్లీ దండయాత్రలో తనతోపాటు పలుకున్నవారిని కూడా తీసుకువెళ్తే కేటీఆర్‌కు అడ్డులేకుండా పోతుందనా? తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ జాతీయ రాజకీయాలలో పోరాడుతున్నాడంటే తెలంగాణ ప్రజల గుండెలు పొంగి టీఆర్ఎస్పై సమధికోత్సాహంతో ఓట్ల వాన కురిపిస్తారనే అంచనా ఫ్రంట్ ప్రతిపాదన వెనుక ఉన్నదా? పోటీతత్వం పోటెత్తినప్పుడు ఎత్తులూ, పైఎత్తులతో రాజకీయాలు రసకందాయంలో పడతాయి. ఒకే బడిలో చదివిన సహాధ్యాయులు ఇద్దరి మధ్య నువ్వా–నేనా అన్న ధోరణిలో స్పర్ధ చోటు చేసుకున్నప్పుడు రాజకీయ ఉష్ణోగ్రత పెరి గిపోతుంది. ఎవరు ఏ వ్యూహం రచించినా తమ ప్రయోజనాలే ప్రధానం. 1983–84 నుంచి 2001 వరకూ తెలుగుదేశం పార్టీలో సహచరులైన నారా చంద్రబాబునాయుడు, కేసీఆర్ సన్నిహితులు. 1995లో ఎన్‌టి రామారావును గద్దె దింపిన నాటకీయ సన్నివేశంలో కేసీఆర్ చంద్రబాబు వెంటే ఉన్నారు. ఆనక మంత్రి పదవి కాదని, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవితో సర్దుకోవాలని చెప్పడంతో కేసీఆర్ తిరుగుబాటు చేయవలసి వచ్చింది. ప్రజల హృదయాలలో నిద్రాణంగా ఉన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను తట్టిలేపారు. తెగించి పార్టీ స్థాపించారు. అనంతరం జరిగిన చరిత్ర అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసిన కారణంగా రాజదండం ధరించే అవకాశం చంద్రబాబుకు రెండు దశాబ్దాల కిందటే లభించింది. కేసీఆర్ పదమూడు సంవత్సరాలు మహోద్యమానికి సారధ్యం వహించి, తెలంగాణ రాష్ట్రం సాధించి, కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేతబట్టి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన విధానంలో హస్తిమశకాంతరం ఉంది. ఎన్‌టి రామారావు 1994 ఎన్నికలలో ఘనవిజయం సాధించి సంపాదించిన అధికారాన్ని అక్రమంగా హస్తగతం చేసుకున్న చంద్రబాబునాయుడికీ, ఉద్యమ కెరటంపై ఉప్పెనలా వచ్చి కాంగ్రెస్ పార్టీని పూర్వపక్షం చేసి సాధికారికంగా ప్రభుత్వం నెలకొల్పిన కేసీఆర్‌కీ పోలిక లేదు. పదేళ్ళు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నివసిస్తూ కొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకొని దర్జాగా వెళ్ళవలసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఓటుకు నోటు కేసు అనే అస్త్రంలో విజయవాడకు పరుగులు తీయించడం ద్వారా పోటీ రాజకీయంలో చంద్రబాబుపైlకేసీఆర్ ఆధిక్యం చాటుకున్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ నాలుగేళ్ళుగా తెలంగాణలో కేసీఆర్‌ను రాజకీయంగా సవాలు చేయగల పరిస్థితిలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేవు. ఎన్నికలు సమీపిస్తున్న దశలో కాంగ్రెస్‌లో కాస్త చలనం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రికి గట్టి పోటీ ఇస్తున్నారు. పాదయాత్రలో రోజు విడిచి రోజు జరుగుతున్న బహిరంగసభలకు వేల సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా హాజరుకావడం చంద్రబాబుకు ఆందోళన కలి గిస్తున్నది. ఎన్డీఏ భాగస్వామ్యాన్ని వదులుకోలేకా, ప్రత్యేకహోదా ఉద్యమంతో జగన్మోహన్రెడ్డికి ప్రజామోదం పెరగడాన్ని చూస్తూ ఊరుకోలేక చంద్రబాబు సతమతం అవుతున్న దశలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనే నినాదంతో జాతీయ స్థాయి రాజకీయాలలో ప్రవేశిస్తున్నట్టు ప్రకటించారు. ప్రత్యేక విమానంలో కోల్‌కతా వెళ్ళి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమాలోచనలు జరిపారు. అంతలోనే ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఉధృతం చేసిన జగన్మోహన్రెడ్డి కార్యాచరణ ప్రకటించడం ఆరంభించారు. మోదీ ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్సార్సీపీ నిర్ణయించుకున్నప్పుడు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి కేంద్ర మంత్రిమండలిలోనే ఉన్నారు. కాళ్ళ కింద నేల కదిలిపోతోందని గ్రహించిన చంద్రబాబు ఇద్దరు మంత్రులనూ ఉపసహరించుకుంటూ ఎన్డీఏలో కొనసాగుతామని చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని ధిక్కరించేందుకు చంద్రబాబు ఎందువల్లనో సంకోచిస్తున్నారనే అభిప్రాయం జనసామాన్యంలో బలపడుతున్న దశలో వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తానని అసెంబ్లీలో అన్నారు. తెల్లవారగానే ఆదరాబాదరాగా ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి తోట నరసింహం చేత అవిశ్వాస తీర్మానం ఇప్పించారు. పోటీ రాజకీయం ఫలితం. లోగడ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా పని చేసిన అనుభవం, ప్రతిపక్షాలతో సంబంధాలు ఉన్న కారణంగా జాతీయ స్థాయిలో కేసీఆర్ కంటే ఎక్కువ ప్రభావవంతమైన పాత్ర పోషించే అవకాశం చంద్రబాబుకి ఉంది. తెలంగాణ వాదానికి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ప్రతిపక్ష నాయకులను కేసీఆర్ కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించిన ధీరుడుగా కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. పాత పరిచయాలను పునరుద్ధరించి, ప్రతిపక్ష నేతలతో చర్చలు కొనసాగించాలని కేసీఆర్ ప్రయత్నం. కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ సాధ్యం కాదనే స్పష్టత చంద్రబాబుకి ఉంది. అందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ప్రాతిపదికను సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ కంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎక్కువ హాని చేసిందనే మాట పదేపదే అంటున్నది అందుకే. బీజేపీని కాంగ్రెస్ కంటే పెద్ద విలన్‌గా చిత్రించడంలోని పరమార్థం అదే. బీజేపీతో రెండు విడతల పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కాంగ్రెస్‌తో ఇంతకాలం రహస్యంగా సాగించిన సంబంధాలను బహిర్గతం చేసి పొత్తు కుదుర్చుకుంటే అవకాశవాద రాజకీయం పరాకాష్ఠకు చేరుతుంది. - కె. రామచంద్రమూర్తి -
వంచన ఇంకెన్నాళ్లు?
విశ్లేషణ ప్రత్యేక హోదాను వదులుకునేందుకు సిద్ధపడిందీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎత్తుకున్నదీ, ప్రపంచ స్థాయి మహోన్నత రాజధాని పేరుతో, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వేలాది ఎకరాలు సేకరించిందీ ఎందుకు? తనవారి, వందిమాగధుల ఎస్టేట్లు పెంచి, పోషించుకోవాలని కదా! కానీ తాడిని తన్నేవాడి తలదన్నేవాడు మరొకడు అన్నట్లయింది మోదీతో పొత్తు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌తో సరిపెట్టుకుంటే అఖిల భారతాన్నే అన్యపక్ష విముక్త భారత్ చేయాలని ఆత్రంగా ఉన్నారు మోదీ. పత్రికలలో వాణిజ్య ప్రకటనల పటాటోపం గురించి ‘సాక్షి’ వ్యాసాలలో పానుగంటి లక్ష్మీనరసింహారావు పంతులుగారు వందేళ్ల క్రితం రాసినది గుర్తు కొస్తున్నది. ‘కోతి మార్కు నల్ల పళ్లపొడి మీ దంతములను పాలవలె తెల్లగా శుభ్రపరుచును, అన్న ప్రకటనను పత్రికలో చదివినంతనే మరునాడుద యము వరకు పండ్లుండునో లేదో అన్నట్లు హడావిడి పడిపోయి కొనితెచ్చు కొందుము. మాటకున్న వేగము గాలికెక్కడిది?’ అంటూ జంఘాలశాస్త్రి చేత అనిపించారు. రోజులు మారిపోయాయి. ఏది ప్రకటనో, ఏది వార్తో గుర్తిం చలేనంతగా పరిస్థితి తయారైంది. ఇప్పుడు కొన్ని పత్రికలు తమ రాజకీయ దృక్పథం ఏమిటో స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఉదా: సాక్షి దినపత్రిక డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను ప్రచురిస్తుంది. ఒకప్పుడు మార్క్సిస్టు పార్టీ పత్రిక ప్రజాశక్తి మీద సుత్తీ కొడవలి నక్షత్రం కనిపించేవి. దీనివల్ల పాఠకుడు పత్రిక స్వభావం విషయంలో వంచనకు గురయ్యే అవకాశమే లేదు. కొన్ని పత్రికలు అలా కాదు. అవి ఎలా ఆరంభమైనప్పటికి తమది ‘నిర్భయంగా నిజాలు చెప్పే పత్రిక’ అంటూ,l‘నిష్పక్షపాతంగా’ ఉంటా మంటూ, ‘దమ్ము ధైర్యం’తో వాస్తవాలనే ప్రచురిస్తాం అని చెప్పుకుంటూ శుద్ధ వక్రీకరణలకు, అవాస్తవాలకు పెద్ద పీట వేస్తాయి. ఏదో రాజకీయ పార్టీకి ప్రకటనలనదగ్గ వార్తలను వండి ప్రజలకు వడ్డిస్తుంటాయి. నిర్భయం, నిజా యితీ వంటి మాటల మాటున అలాంటి వంచక తాటస్థ్యం జుగుప్సాకరంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితిలో నా అనుభవం ఒకటి చెబుతాను. అప్పుడు నేను ది హిందూ పత్రిక పాఠకుడిని. 1976లో అనుకుంటాను. మద్రాసును తుపాను ముంచెత్తింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ మద్రాసులో పర్యటించారు. సన్నగా చినుకులు పడుతున్నాయి. సంజయ్ ముందు నడుస్తున్నారు. ఆయన వెనుక నాటి తమిళనాడు ముఖ్య మంత్రి సుబ్రహ్మణ్యం, ఆయన మంత్రులు, ఇతర అధికారులు నడుస్తు న్నారు. ఎవరో సంజయ్‌గాంధీకి గొడుగు కూడా పడుతున్నారు. అప్పటికి సంజయ్‌కి ఎలాంటి అధికార పదవి లేదు. ఈ ఫొటోను ది హిందూ మొదటి పేజీలో ప్రచురించారు. వెంటనే ఆ పత్రిక ఎడిటర్ పేరున ఒక ఉత్తరం రాశాను. ‘ది హిందూ వంటి ప్రతిష్టాత్మకమైన పత్రిక కూడా ఇలాంటి ఫొటోను ప్రచురించడం ‘తల వంచుము ప్రభుత్వం ఆదేశిస్తే’ అంటూ సాష్టాంగ దండ ప్రమాణాలు చేసినట్టుంది అని రాశాను. తరువాత కొంత కథ నడిచింది. అది అప్రస్తుతం. అదే సమయంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అధిపతి రామనాథ్ గోయెంకాకు సంబంధించి జరిగిన ఉదంతం గురించి మాకినేని బసవపున్నయ్య ఒక సందర్భంలో చెప్పారు. ఇందిరమ్మ కుటుంబానికి విధే యంగా ఉండమని గోయెంకాపై ఒత్తిడి తెచ్చారట. అందుకు గోయెంకా ఆంధ్రప్రభ, దినమణి వంటి పత్రికలను వారి కుటుంబ సభ్యులే తీసుకోవచ్చు నని, ఒక్క ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన అధీనంలో ఉంచుకుంటానని చెప్పారట. ఈ లోకంలోకి మొలతాడు కూడా లేకుండా వచ్చాను, అలాగే మొలతాడు లేకుండానే పోతాను, అంతేగానీ తల వంచను అని గోయెంకా అన్నాడని మాకినేని చెప్పారు. నిజానికి ఈనాడు కూడా సంజయ్‌గాంధీలు ఉన్నారు. చంద్రబాబు చరిత్ర వినండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చరిత్ర ఈ తరం వారికి తెలియకపోవచ్చు. తన మామగారు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీనీ, ఎన్టీఆర్‌ను మొదట ఆయన అవహేళన చేశారు. కాంగ్రెస్ తరఫున పోటీచేసి భంగపడ్డారు. ఆ తరువాత దొడ్డిదారిన ఎన్టీఆర్ పంచన చేరారు. ఎన్టీఆర్ దగ్గర తన స్వార్థ ప్రయోజనాలు నెరవేరడం లేదని పార్టీలోనే ఉన్న కొందరి ప్రోత్సాహంతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. ఆయనను పదవీ భ్రష్టు డిని చేసి పార్టీనీ జెండానీ అప్రజాస్వామికంగా తన సొంతం చేసుకున్నారు చంద్రబాబు. నాటి స్పీకర్ (నేటి ఆర్థికమంత్రి), నాటి గవర్నర్ల అండదండ లతో దొడ్డిదారిన అందలం ఎక్కారు చంద్రబాబు. అందుకే ప్రస్తుత తెలుగు దేశం పార్టీని చంద్రబాబు తెలుగుదేశం అని ప్రత్యేకంగా పేర్కొనాలి. లేదా తెలుగుదేశం (వి) అని పిలవడం సమంజసం. కానీ చంద్రబాబును వెన్ను పోటు పొడవడానికి అల్లుడు లేడు. తన తనయుడు లోకేశ్‌నే అప్రకటిత వార సునిగా మంత్రిని చేశారు. కొడుకు అయినంత మాత్రాన అనర్హుడని కాదు. ప్రజాఉద్యమాలలో కానీ, రాజకీయాలలో గానీ ప్రమేయం లేని, కొంచెమైనా అర్హత లేని వారిని అందలం ఎక్కించడమే ప్రశ్నార్థకం. సొంత బలం హుళక్కి ఇవేమీ దృష్టిలో లేనట్టు చంద్రబాబు (వి) పార్టీనీ ఆ పార్టీ నేత చంద్ర బాబునూ రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేయగల సమర్థుడంటూ వార్తలు ప్రచు రిస్తున్న పత్రికలను ఏమనాలి? ఒక్క ఎన్నిక అంటే ఒక్క ఎన్నిక అయినా చంద్రబాబు (వి) స్వతంత్రంగా గెలిచారా? బీజేపీ, వామపక్షాలు ఇలా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోకుండా చంద్రబాబు (వి) గెలిచి అధికారం పొందిన సందర్బం లేదు. తాను 2002లో తీవ్రంగా విమర్శించిన ‘మోదీ’ నేతృత్వాన బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఇంకా రాజకీయ అరంగేట్రం పూర్తిగా చేయని ‘కొణిదల పవర్ స్టార్’ను ఇంటికి వెళ్లి మరీ బ్రతిమలాడి తెచ్చుకుని 2014లో గెలిచారు. వీటికితోడు అన్ని అబద్ధపు వాగ్దానాలు చేసి, కేవలం 1.6 శాతం ఓట్లతో గెలిచిన చంద్రబాబు రాజకీయం తెలుగు పత్రికా రంగ ప్రముఖులకు, మీడియా నేతలకు తెలియనిదా? ప్రత్యేక హోదాను వదులుకునేందుకు సిద్ధపడిందీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎత్తుకున్నదీ, ప్రపంచ స్థాయి మహోన్నత రాజధాని పేరుతో, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వేలాది ఎకరాలు సేకరించిందీ ఎందుకు? తనవారి, వందిమాగధుల ఎస్టేట్లు పెంచి, పోషించుకోవాలని కదా! కానీ తాడిని తన్నేవాడి తలదన్నేవాడు మరొకడు అన్నట్లయింది మోదీతో పొత్తు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌తో సరిపెట్టుకుంటే అఖిల భారతాన్నే అన్యపక్ష విముక్త భారత్ చేయాలని ఆత్రంగా ఉన్నారు మోదీ. ‘మోదీ–షా’ ఇరువురూ కలిసి చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్నారు. అయినా నాలుగేళ్లుగా తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ రాగలిగారు చంద్రబాబు. ఈలోపల ప్రజలు కూడా చంద్రబాబు నైజం తెలుసుకోసాగారు. ప్రతి పక్షం వైఎస్పార్సీపీ ఉద్యమం, వామపక్షాలు, పౌర సమాజం తరఫున ప్రత్యేక హోదా సాధన సమితి వాదన ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి. ప్రధానంగా వైఎస్సార్ సీపీ నేత పాదయాత్ర వలన చంద్రబాబుకు దిక్కు తోచని స్థితి ఏర్పడింది. ఇక చంద్రబాబు తాను సైతం ప్రత్యేక హోదానే డిమాండ్ చేస్తు న్నట్లు ‘నటన’ మొదలెట్టారు. ప్యాకేజీ మంచిదని చెప్పి తాను ప్రజలను మోసం చేసిన విషయం మరచిపోయి, తానే మోసానికి గురైనట్టు, బీజేపీ తనను మోసం చేసినట్టు ప్రచారం చేయించుకోసాగారు. ఇన్నాళ్లు హోదా విష యంలో ప్రజలను వంచించి, ఇప్పుడు మాట మారుస్తూ ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నానంటున్నారు. ఇప్పుడనిపిస్తుంది. సాక్షి పత్రిక, సాక్షి చానల్ లేకపోయినట్లయితే ప్రత్యేక హోదా పరిస్థితి, పోరాటం గురించిన వాస్తవాలు మాత్రమే కాదు, బాబుగారి బండారం కూడా ప్రజలకు తెలిసే అవకాశం ఉండేది కాదు. ఒకరిని మించి ఒకరు చంద్రబాబు (వి) భక్త బృందాలు పోటీపడి ప్రజలను చెవిటివారిగా, మూగవారిగా చేసే యత్నం చేశాయి. ఈ సందర్భంగా తెలుగు ప్రజల తరఫున సాక్షికి కృత జ్ఞతలు చెప్పడం నా బాధ్యతగా భావిస్తున్నాను. మీడియా కర్తవ్యం మరచిపోరాదు ఇక్కడే ఒక విషయం ప్రస్తావించాలి. మీరు మార్క్సిస్టు విశ్లేషకుడినని చెప్పు కుంటారు కదా, రేపు సాక్షి బీజేపీకి మతతత్వంతో జత కడితే ఏమంటారు? అంటూ మిత్రులు, మిత్రులు కాని వారు కూడా అడుగుతూ ఉంటారు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత ఒక స్పష్టత ఇచ్చారు. ‘ఏ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందో ఆ పార్టీకే మా మద్దతు. రేపు ఆ పని బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, ఇంకో కూటమి చేసినా వారికి మా పార్టీ మద్దతు ఉంటుంద’ని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందున్న కీలక సమస్య అది. అది నెరవేరాలంటే తెలుగు ప్రజలంతా కలసి పోరాడాలి. అందుకు కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం పెడతాం మీరూ కలసి రండి లేదా మీరు పెట్టండి మేం బలపరుస్తామని చెప్పింది వైఎస్పార్సీపీ. వైస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెడితే బలపరుస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ పది గంటలు గడచే లోపునే మాట మార్చారు. ఈ రాజకీయ పోరాటంలో తాను తన పార్టీ నాయకునిగా కాక, అనుచరుడినయ్యానని, ప్రజలలో చులకన అవుతానని అనుకున్నారో ఏమో మళ్లీ మాజీ మంత్రి సుజనా చౌదరి ద్వారా కేంద్రంతో లాలూచీ యత్నాలు చేశారు. ఈ సందర్భంలోనే చంద్రబాబు బినామీ మీడియా ఒక సూటి ప్రశ్న సంధించింది. చంద్రబాబు తప్ప మరె వరూ అడగలేడన్నట్టు బినామీ పత్రిక తాటికాయలంత అక్షరాలతో మొదటి పేజీలో ఆ ప్రశ్నను ప్రచురించింది. ఆ ప్రశ్న ఏమిటంటే రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ పక్షాన ఉన్నారా? లేదా రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తెలుగు దేశం (వి) తరుఫున ఉంటారా? మీరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటారా? పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారా అన్నట్టే ఉంది ప్రశ్న. దీనిని గ్రహించలేనంతటి అమాయకులు కారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ పరిస్థితిలో చంద్రబాబు చివరి అస్త్రం ఒకటి సంధించేందుకు యత్ని స్తున్నారు. తన వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు మరో తృతీయ ఫ్రంట్ రాదా అని ఆశతో యత్నిస్తున్నారు. ఈసారి విజయం వైఎస్సార్‌సీపీదేనని అందులో అను మానం లేదని తెలుగు ప్రజలు ఇప్పటికే గ్రహించారు. ప్రజాగ్రహంలో చంద్ర బాబుతో కలసి మసై పోవడానికి ఏ ఇతర విపక్షం సాహసించదు. అంతగా అయితే వైఎస్సార్ సీపీతో ఐక్య సంఘటన కట్టలేకపోయినా తెలుగు దేశం (వి) వ్యతిరేక ఓటు చీలకుండా ఆ పార్టీతో పరస్పర పోటీ నివారణ చేసుకునే అవగాహనకైనా అవి సిద్ధపడతాయి. ఈ పరిణామాలను, వాస్తవాలను గ్రహించడం మీడియా కర్తవ్యం. ఇప్పటికైనా మీడియా కొంత నిజాయి తీగా ఉండాలి. నాటి ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రపత్రిక స్థాయి లేకున్నా సత్యా న్వేషణ చేయడానికి, ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ఇక ముందు మన మీడియా సహకరిస్తుందనుకోవడం దురాశ కారాదు. - డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 -
కేసీఆర్‌ను కలిసిన ప్రకాష్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గురువారం సినీనటుడు ప్రకాష్‌రాజ్ కలిశారు. కేసీఆర్‌తో కలిసి అసెంబ్లీకి వచ్చిన ప్రకాష్‌రాజ్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టి.. దేశంలో గుణాత్మక మార్పుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాలంటున్న సీఎం కేసీఆర్ ఇటీవలే కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ కేసీఆర్‌తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చ జరిపినట్టు తెలుస్తోంది. కాగా, నిన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసి రాజకీయ పరిణామాలు, ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణానికి అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపై చర్చించారు. కాగా, తాను మోదీ వ్యతిరేకనని ఇప్పటికే ప్రకటించిన ప్రకాష్‌రాజ్, కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
బీజేపీ అసమ్మతి నేతలతో మమత మంతనాలు
న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూకుడు పెంచారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆమె తాజాగా బీజేపీ అసమ్మతి నేతలతో భేటీ అయ్యారు. ఢిల్లీలో బుధవారంబీజేపీ అసమ్మతి నేతలు యశ్వంత్ సింగ్, శత్రుఘ్నసిన్హా, అరుణ్ శౌరీలతో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మూడో ఫ్రంట్ అవసరాన్ని, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను వారితో చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే శరద్‌పవార్, శివసేన పార్టీ నాయకులు, టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అయిన మమతా నేడు బీజేపీ తిరుగుబాటు నాయకులతో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తృతీయ కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఆమె దానికోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
కాంగ్రెస్‌తో విభేదాలు లేవు : మమత
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీతో తనకెలాంటి విభేదాలు లేవని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మంగళవారం పార్లమెంట్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ఆమె భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మమత మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో నాకెలాంటి సమస్యలు లేవు. ఆయన్ని త్వరలోనే కలుస్తా. సోనియాగాంధీ ఆరోగ్యం బాగుపడగానే వెళ్లి వాళ్లతో మాట్లాడ్తా’ అని మమతా పేర్కొన్నారు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడగడతామని థర్డ్ ఫ్రంట్‌ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీని మించిన మతతత్వ పార్టీ లేదని.. మోదీ ప్రభుత్వం దేశ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. బీజేపీకి మరోసారి అధికారం దక్కనివ్వకూడదంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. యూపీలో అఖిలేశ్-మాయావతిలు ఏకం కావాలని ఆమె కోరారు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తుందని మమత జోస్యం చెప్పారు. ఇక ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఆమె నేడు శరద్ పవార్, శివసేన, టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అయ్యారు. రేపు కూడా ఆమె పలువురు కీలక నేతలతో భేటీ కానున్నారు. బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, శతృఘ్న సిన్హాలను కూడా ఆమె కలవబోతుండటం విశేషం. -
హస్తినలో మమత కీలక భేటీలు!
న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కసరత్తు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. ఈరోజు రాత్రి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద పవార్ ఏర్పాటు చేసిన విందుకు ఆమె హాజరవుతారు. మమతా బెనర్జీ మంగళవారం మధ్యాహ్నం పార్లమెంటుకు వచ్చి పలువురు ప్రతిపక్ష నేతలతో మాట్లడతారని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు చెప్పారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధీతో ఆమె భేటీ అయ్యే అవకాశముంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా కలవనున్నట్లు సమాచారం. కేజ్రీవాల్‌ను కలిసిన తొలి నాయకురాలు మమత బెనర్జీనే. జాతీయ రాజకీయల్లో రాణించేందుకు కేజ్రీవాల్ సలహాలు తీసుకోవాలని ఆమె భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లో బలమైన ఫ్రంట్ ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. తమ నాయకురాలు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని తృణముల్ పార్టీ నేతలు కూడా అభిలషిస్తున్నారు. -
2019 లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై విపక్షాల కసరత్తు
-
బిహార్‌లోనూ మూడో ఫ్రంట్!
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లో రెండు అసెంబ్లీ, ఒక లోక్‌సభ సీటుకు జరిగిన ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు రాష్ట్ర బీజేపీ సంకీర్ణ కూటమిలో చిచ్చు పెట్టాయి. బీజేపీ ప్రాభవం పడిపోతున్న విషయాన్ని ఈ ఫలితాల ద్వారా గ్రహించిన నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ, రామ్ విలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీలు రాష్ట్రంలో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం నాడు నితీష్ కుమార్, రామ్ విలాస్ పాశ్వాన్లు గంటకుపైగా చర్చలు జరిపారు. ఆ తర్వాత నితీష్ కుమార్ జన్ అధికార పార్టీ నాయకుడు, మధేపుర పార్లమెంట్ సభ్యుడు పప్పు యాదవ్‌తో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే తమ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కావాలంటూ జేడీయూ బుధవారం నాడు పార్లమెంట్లో డిమాండ్ చేసింది. ఆ మేరకు ఓ నోటీసును కూడా అందజేసింది. ఆ డిమాండ్‌కు మద్దతు తెలియజేస్తూ లోక్ జన్‌శక్తి పార్టీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిస్థితిని గ్రహించిన బీజేపీ సీనియర్ నాయకులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్‌లు పాశ్వాన్‌ను, బీజేపీ ముస్లిం నాయకుడు షా నవాజ్ హుస్సేన్ నితీష్ కుమార్‌ను కలుసుకొని సంప్రదింపులు జరిపారు. బీహార్‌లో మతసామరస్యాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారికి బీజేపీ నేతలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయినప్పటికీ నితీష్, పాశ్వాన్లు శాంతించలేదు. బిహార్ ఉప ఎన్నికల్లో హిందూ అగ్రవర్ణాల ఓట్ల కోసం బీజేపీ నాయకులు మత విద్వేషాలను రెచ్చగొట్టారు. ఇది నితీష్, పాశ్వాన్లకు ఎక్కువ కోపం తెప్పించింది. ఎందుకంటే వెనకబడినవారు, దళితులు, మైనారిటీలు వారి సంప్రదాయ ఓటర్లు. బిజేపీ కూటమిలో కొనసాగడం వల్ల అనవసరంగా ఈ వర్గాలను దూరం చేసుకోవాల్సి వస్తుందన్న ఆలోచనతోనే ఈ ఇరువురు నాయకులు 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. -
కేసీఆర్ ఫ్రంట్ సక్సెస్ కాదు: కారత్
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే రాష్ట్రాల వారీగా ఆ పార్టీ వ్యతిరేక ఓట్లను ఏకం చేయాలని, బీజేపీ, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు ఫలించబోవని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. పార్టీ పత్రిక పీపుల్స్ డెమొక్రసీలో ఆయన సంపాదకీయం రాస్తూ.. ‘ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు విఫలమవుతాయి. డీఎంకే, ఆర్జేడీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు సొంత రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కొనసాగుతున్నాయి. విధానాలు, స్థానిక ప్రయోజనాల దృష్ట్యా ప్రాంతీయ పార్టీల మధ్య అనేక వైరుధ్యాలు ఉండడం ఫ్రంట్ ఏర్పాటుకు అడ్డంకిగా మారనున్నాయి. అందువల్ల యూపీలో అనుసరించినట్లు బీజేపీ వ్యతిరేక ఓట్లను ఏకం చేస్తేనే ఆ పార్టీని ఓడించగలం’ అని పేర్కొన్నారు. -
కేటీఆర్ కోసమే థర్డ్‌ఫ్రంట్ డ్రామా
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు కేటీఆర్‌ను రాజకీయ వారసుడిగా చేసేందుకే సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ డ్రామా కు తెరలేపారని టీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపిం చారు. కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేయాలనే ఎత్తుగడలో భాగమే థర్డ్‌ఫ్రంట్ అని విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఫెడరల్ ఫ్రం ట్ ఏర్పాటు నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకోవడం వెనుక కేటీఆర్ రాజకీయ భవిష్యత్తే కీలకమని ఆరోపించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు ఉనికి ఉండబోదని, ఎవరూ గుర్తించే స్థాయిలో కూడా ఆయన రాజకీయ ఎత్తుగడలు లేవని, నాలుగేళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు వత్తాసుపలికి ఇప్పుడు ఒక్కసారిగా విమర్శలు చేస్తే మద్దతు ఇచ్చేయడానికి ప్రజలేమీ అమాయకులు కాదని అభిప్రాయపడ్డారు. -
ఈడ చేయనోడు.. ఢిల్లీలో ఉద్ధ్దరిస్తాడా?
డిచ్పల్లి: తెలంగాణలో ఏమి చేయలేని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశాన్ని మారుస్తానంటే నమ్మేదెవరని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో మంగళవారం రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణలో రైతులను పట్టించుకోనోడు.. దేశ రూపురేఖలు ఎలా మారుస్తాడని ప్రశ్నించారు. రైతులు మద్దతు ధర లేక రోడ్డెక్కుతూ, ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి ఢిల్లీలో మంతనాలు చేయడం ఏమిటని నిలదీశారు. దేశ చరిత్రలో థర్డ్ ఫ్రండ్ ఎవరి వల్ల సాధ్యం కాలేదని, కేసీఆర్‌తో కూడా ఏమీ కాదని పేర్కొన్నారు. తెలంగాణను తెచ్చింది ఎవరో అనుభవించడానికి కాదని చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు చూపించాల్సిన ప్రభుత్వం వారికి మొండి చేయి చూపుతోందని విమర్శించారు. మహారాష్ట్రలో వేలాది రైతులు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వారి హక్కులు సాధించుకొని రైతు పోరాటాలకు ఊపిరి పోశారని, తద్వారా అక్కడి ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేరని తెలిపారు. రైతుల కోసం బలమైన నిర్ణయం తీసుకోవడానికి జేఏసీ సిద్ధమవుతోందని, వారి తరఫున జూన్ నుంచి ప్రతి గ్రామాన పోరాటం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సమస్యలు తెలపడానికి పోతే ముఖ్యమంత్రి కనపడడు.. ఆయనకు చెప్పినా వినపడదని ఎద్దేవా చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపించాలని కోదండరాం డిమాండ్ చేశారు. -
మార్పుకు నాంది
కోల్‌కతా : దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు దిశగా, ప్రత్యామ్నాయం దిశగా నాంది పడిందని, ‘ఫెడరల్ ఫ్రంట్’వైపు అడుగులు మొదలయ్యాయని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి, ప్రత్యామ్నాయ ఎజెండా అత్యవసరమని వ్యాఖ్యానించారు. తమది ప్రజలందరి ఫ్రంట్ అని, నిజమైన సమాఖ్య స్ఫూర్తిని అందించేందుకు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. సమ్మిళిత, ఉమ్మడి నాయకత్వంలో ఫెడరల్ ఫ్రంట్ కొనసాగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ సోమవారం కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. దేశంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలతో ‘ఫెడరల్ ఫ్రంట్’ఏర్పాటు అంశంపై ఆమెతో చర్చించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం కేసీఆర్, మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. మార్పు దిశగా ప్రారంభం.. దేశంలో గుణాత్మక మార్పు దిశగా ఇది ప్రారంభమని, తాము సమాఖ్య స్ఫూర్తికి నిజమైన అర్థమిచ్చే ఫెడరల్ ఫ్రంట్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ‘‘ఈ రోజు సమావేశానికి ప్రత్యేకత ఉంది. ఇది ఫెడరల్ ఫ్రంట్‌కు, మొత్తం మార్పుకు మొదలు. ఆ దిశగా ఈ రోజు ఫలవంతమైన చర్చలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం దిశగా మాతో కలసి వచ్చే అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతాం.. దేశంలో అద్భుతమైన మార్పు రావాల్సి ఉంది. మంచి మార్పు కావాల్సి ఉంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా.. ఏదైనా అద్భుతమైన మార్పు జరుగుతుందా? జరగదు.. ఇప్పుడు దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి, ప్రత్యామ్నాయ ఎజెండా అత్యవసరం..’’అని స్పష్టం చేశారు. ఇది ప్రజల ఫ్రంట్.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ ఫ్రంట్ కడుతున్నట్లు అపార్థం చేసుకుంటున్నారని, అయితే తమది సాదాసీదా ఎన్నికల ఫ్రంటు కాదని కేసీఆర్ చెప్పారు. తమది దేశ ప్రజల కోసం ఏర్పాటు కానున్న ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. ‘‘మాది ప్రజల ఎజెండా.. ఏదో నాలుగైదు రాజకీయ పార్టీల పొత్తు కాదు. భారత ప్రజాస్వామ్య శక్తులను ఐక్యపరిచే ప్రక్రియ. దేశం గుణాత్మక దిశగా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. ఎన్నో సహజ వనరులు, యువతతో మన దేశం అద్భుతమైన అవకాశాలను కలిగి ఉంది. కానీ కాంగ్రెస్, బీజేపీల మూస పాలనతో ప్రయోజనం లేకుండా పోతోంది. అందువల్ల ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాతో కూడిన ఎజెండా కావాలి. దానిని ముందుకు తీసుకెళ్లే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావాలి. భావ సారూప్యత కలిగిన రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతాం..’’అని వెల్లడించారు. అందరితో చర్చించాక నిర్ణయం ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, తామిద్దరమే (కేసీఆర్, మమతా బెనర్జీ) అంతా నిర్ణయించలేమని కేసీఆర్ చెప్పారు. ఇంకా భావ సారూప్యత ఉన్న మిత్రులతో చర్చించాల్సి ఉందని.. అందరితో చర్చించి ఏకాభిప్రాయాన్ని సాధించాక ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. మొత్తంగా శుభారంభం జరిగిందని, దీనిని మరింత ముందుకు తీసుకుపోగలమనే విశ్వాసముందని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ పాలన అద్వితీయంగా జరుగుతోందని ప్రశంసించారు. ఇది శుభారంభం: మమతా బెనర్జీ మారుతున్న భారత రాజకీయాల నేపథ్యాన్ని, ఫ్రంట్ అంశాన్ని చర్చించామని.. ఇదొక శుభారంభమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. కేసీఆర్ అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు. ‘‘దేశంలో రాష్ట్రాలు బలంగా ఉంటే.. కేంద్రం కూడా బలంగా ఉంటుంది. ఏదో ఒక పార్టీ దేశాన్ని ఏలాలంటే.. దానికిష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తామంటే ఎలా? దేశంలో బలమైన ఫెడరల్ ఫ్రంట్ అవసరం ఉంది. మేం ఇప్పుడే చర్చను ప్రారంభించాం. ఇతర పార్టీలతో చర్చించాల్సి ఉంది. మేమందరం ఒక ఉమ్మడి కుటుంబంగా కలసి పనిచేయాల్సి ఉంది. అయితే ఇప్పుడే ఏదో జరగాలనే తొందరేమీ లేదు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను సిద్ధం చేసేందుకు, ప్రజాసంక్షేమం కోసం ముందుకు వెళతాం. ఇతర పార్టీలతో కూడా చర్చిస్తాం. దేశం కోసం కలసి పనిచేయడం కన్నా గొప్ప కార్యం ఏముంటుంది..’’అని మమత చెప్పారు. దేశంలో విప్లవాత్మకమైన మార్పు రావాల్సి ఉందని.. దేశం కోసం పనిచేసే ఉమ్మడి, ఫెడరల్ నాయకత్వం ఉండాలని పేర్కొన్నారు. కాగా.. కోల్‌కతా పర్యటనలో కేసీఆర్ వెంట ఆయన కుమార్తె, ఎంపీ కవిత, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ఉన్నారు. దీదీతో కేసీఆర్ భేటీపై ఆసక్తి! సీఎం కేసీఆర్ కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశం కావడంపై సర్వత్రా ఆసక్తి కనిపించింది. సోమవారం పార్లమెంటు లాబీల్లో చాలా మంది ఎంపీలు ఈ అంశంపైనే చర్చించుకోవడం కనిపించింది. ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలవారితోపాటు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కూడా థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్లపై అభిప్రాయాలు వెల్లడించారు. కొంతకాలంగా బీజేపీ పరిస్థితి దిగజారుతుండటం, అటు కాంగ్రెస్ పార్టీ కూడా మెరుగుపడేలా లేకపోవడం వల్ల రాజకీయ శూన్యత కనిపిస్తోందనే భావన వచ్చింది. కానీ మూడో ఫ్రంట్ అంశంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేవలం నలుగురైదుగురి నుంచి ముప్పై మంది వరకు ఎంపీలున్న ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలు కలసి ఫ్రంట్‌గా నిలవడం కష్టమని సీపీఐ ఎంపీ డి.రాజా పేర్కొన్నారు. వామపక్షాలు లేకుండా ఏర్పడే మూడో ఫ్రంట్‌కు రాజకీయ హేతుబద్ధత ఉండదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే స్థితిలో లేకపోవడంతో దేశంలో రాజకీయ అస్థిరతకు దారి తీస్తోందని బీజేడీ ఎంపీ భర్తృహరి మెహ్తాబ్ పేర్కొన్నారు. ఇక బీజేపీ ఎంపీలు మూడో ఫ్రంట్ యోచనను పూర్తిగా కొట్టిపారేశారు. అది విఫల యత్నమని త్వరలోనే వెల్లడవుతుందని వ్యాఖ్యానించారు. -
థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు దిశగా ముందడుగు పడింది
-
థర్డ్‌ఫ్రంట్ రెడీ అవుతోంది.. మమత, కేసీఆర్!
కోల్‌కతా: జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటుదిశగా ముందడుగు పడింది. జాతీయస్థాయిలో థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటుచేస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సోమవారం కోల్‌కతా వెళ్లి.. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. జాతీయస్థాయిలో మూడో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, జాతీయ రాజకీయాలపై దాదాపు రెండు గంటలపాటు చర్చించారు. సీఎం కేసీఆర్ వెంట టీఆర్ఎస్ ఎంపీలు కేకే, కవిత ఉన్నారు. ఈ భేటీ అనంతరం మమత, కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ సానుకూల ప్రకటనలు చేశారు. థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు దిశగా శుభారంభం మొదలైందని వారు పేర్కొన్నారు. ఉమ్మడి నాయకత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కానుందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఇది శుభారంభం. రాజకీయాలు ఒక నిరంతర ప్రక్రియ. దేశాభివృద్ధి లక్ష్యంగా మేం చర్చలు జరిపాం’ అని మమత తెలిపారు. రాజకీయాలు భిన్నమైన వ్యక్తులతో కలిసి పనిచేసే పరిస్థితులు కల్పిస్తాయని, రాజకీయాలను తాను విశ్వసిస్తున్నానని మమత అన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘మామూలు రాజకీయ నమూనానుకు భిన్నమైన ఏజెండాను మేం ప్రతిపాదిస్తున్నాం. ఇది ప్రజల అజెండా. భారతదేశ ప్రజల కోసమే ఈ కూటమి ఏర్పడనుంది. ఇది రాజకీయ పార్టీల కూటమి కాదు. ఇది ప్రజల కూటమి. ప్రత్యామ్నాయ కూటమి రావాల్సిన అవసరముంద’న్నారు. బెంగాల్ అభివృద్ధికి మమత ఎంతో శ్రమిస్తున్నారని కేసీఆర్ అన్నారు. గతంతో పోల్చుకుంటే కోల్‌కతా రూపురేఖలు ఇప్పుడు చాలా మారిపోయాయని ఆయన ప్రశంసించారు. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయం అవసరముందని, ఇందుకు ప్రాంతీయ పార్టీలన్ని ఏకం కావాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు -
మోదీ కోసమే థర్డ్‌ఫ్రంట్: రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, బీజేపీకి మేలు చేసేందుకే సీఎం కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌ను తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు పెరుగుతున్న మద్దతును నిలువరించేందుకే కేసీఆర్, మోదీలు థర్డ్‌ఫ్రంట్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే థర్డ్‌ఫ్రంట్‌ను మోదీయే వెనుక నుంచి నడిపిస్తున్నట్లుగా ఉందన్నారు. కేసీఆర్ పెట్టిన కష్టాలను తెలంగాణ ప్రజలు 4 ఏళ్లపాటు భరించారని, ఇక ఎంత మాత్రం ఆయన్ను విశ్వసించరని చెప్పారు. ఈ ఏడాదిని ఎన్నికల నామ సంవత్సరంగా అభివర్ణించారు. -
థర్డ్‌ఫ్రంట్ కేసీఆర్ పగటి కల!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: థర్డ్ ఫ్రంట్ అనేది కేసీఆర్ పగటికల అని.. అస్థిరత, అవినీతి, కొట్లాట తప్ప థర్డ్ ఫ్రంట్‌లో ఏమీ ఉండదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. మాజీ నక్సలైట్లు, ఆక్రమణదారులు, పాత కాంగ్రెస్ నేతల కలయికే టీఆర్ఎస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘థర్డ్‌ఫ్రంట్‌కు నాయకులు లేరు, ఓట్లు లేవు’అని అన్నారు. దేశ ప్రజలు మోదీకి, బీజేపీకి ప్రత్యామ్నాయం కోరుకోవడం లేదన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయ పరంపరను కొనసాగించిందని, ఇదే విజయ పరంపర దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఉంటుందని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ గెలుపుతో దక్షిణాది రాష్ట్రాలకు ద్వారం తెరుచుకుంటుందని మురళీధర్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో 119 స్థానాల నుంచి బీజేపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని, నేర చరిత, అవినీతి ఆరోపణలు లేని వారు, వివాదరహితులను పార్టీ బరిలో దింపుతుందని తెలిపారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ పతనానికి రాహుల్ గాంధీ వేగంగా బాటలు వేస్తున్నారని అన్నారు. ఆయన అధ్యక్షుడు అయిన తర్వాతే ఆ పార్టీ ఓటములను మూట కట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. 21వ శతాబ్దంలో దేశానికి బలమైన సుపరిపాలన ఇవ్వగలిగేది మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనని మురళీధర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డితో పాటు కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని సుగుణాకర్‌రావు పాల్గొన్నారు. -
థర్డ్ ఫ్రంట్ అనేది టీఆర్ఎస్ పగటికల మాత్రమే
-
‘థర్డ్ ఫ్రంట్.. టీఆర్ఎస్ పగటికల’
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజావ్యతిరేక విధానాల పార్టీ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నక్సలైట్లు, ఆక్రమణ దారులు, పాత కాంగ్రెస్ నేతల కలయికే టీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని ఆయన తెలిపారు. థర్డ్ ఫ్రంట్ అనేది టీఆర్ఎస్ పగటికల అని.. అస్థిరత, అవినీతి, కొట్లాట తప్ప థర్డ్ ఫ్రంట్‌లో ఏమీ ఉండదన్నారు. కర్నాటకలో బీజేపీ గెలుపుతో దక్షిణాది రాష్ట్రాల్లో ద్వారం తెరుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి, బీజేపీకి రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం లేదని, ప్రజలు కూడా ప్రత్యామ్నాయం కోరుకోవడం లేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ పతనానికి వేగం పెంచే నాయకుడు రాహుల్ గాంధీ అని ఎద్దేవా చేశారు. -
రాష్ట్రాల హక్కుల కోసమే థర్డ్ ఫ్రంట్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలపై పెత్తనా న్ని చెలాయిస్తున్న కేంద్ర వైఖరికి నిరసనగా, రాష్ట్రాల హక్కులను సాధించుకునేందుకే సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌ను ప్రతిపాదించారని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనను అన్ని పార్టీలు, వర్గాలు స్వాగతిస్తున్నాయన్నారు. జాతీయ పార్టీలకు ఎంతసేపూ అధికారాన్ని కాపాడుకోవాలన్న కాంక్షే తప్ప మరో ఆలోచన ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని తననెవరూ సంప్రదించలేదని, ఒకవేళ పిలిచినా తాను చేరబోనని డీఎస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తనను అగౌరవపరిచి బయటకు వెళ్లేలా చేసిందని పేర్కొన్నారు. తన కుమారుడి రాజకీయ జీవితం తన వ్యక్తిగతమని డీఎస్ చెప్పారు. -
మాది థర్డ్ ఫ్రంట్ కాదు..ఫస్ట్ ఫ్రంట్
-
థర్డ్ కాదు..ఫస్ట్ ఫ్రంటే
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న కూటమిని థర్డ్ ఫ్రంట్ అనాల్సిన అవసరం లేదని, దాన్నే ఫస్ట్ ఫ్రంట్ అనొచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందించలేని కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా మరో కూటమి రావాల్సిన అవసరం ఉందని గుర్తించి ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా చర్చకు శ్రీకారం చుట్టారన్నారు. ముందుముందు ఈ ఫ్రంట్ ఎలా ఏర్పాటవుతుందన్నది వేచిచూడాల్సి ఉందని, దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం ఢిల్లీలో ప్రారంభమైన 51వ స్కోచ్ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రజాకాంక్షలు నెరవేర్చడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలం... వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు పూర్తి మెజారిటీ సాధించే పరిస్థితులు లేని నేపథ్యంలో బలమైన ప్రాంతీయ పార్టీలు తమ హవా కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. దేశానికి స్వాత్రంత్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఎన్నో అవకాశాలు ఇచ్చారని, అయితే ఆ రెండు పార్టీలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. దేశంలో ఒకవైపు విద్యుత్ మిగులు ఉందని చెబుతూనే మరోవైపు ఎన్నో గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేదన్నారు. దేశవ్యాప్తంగా వివిధ నదుల్లో 75 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా వ్యవసాయానికి నీరందే పరిస్థితి లేదన్నారు. బహుముఖ పార్టీ వ్యవస్థ ఉన్న భారత్‌లో కేవలం రెండు పార్టీల మధ్యే ఎన్నికలను పోటీగా భావించడం సరికాదన్నారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రాలపై చేసిన పెత్తనంపై విస్తృత చర్చ జరగాలన్నారు. కేంద్రం గత నాలుగేళ్లలో తెలంగాణకు ఇచ్చిన రూ. 81 వేల కోట్లు కూడా కేంద్ర వాటా కింద ఇచ్చినదేనని, ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదన్నారు. కనీసం విభజన చట్టంలోని హామీలను సైతం కేంద్రం అమలు చేయలేకపోయిందని విమర్శించారు. దీనిపై ప్రధాని, కేంద్ర మంత్రులను ఎన్నిసార్లు కలసి విన్నవించినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం పురోగతి సాధిస్తుందన్న విషయాన్ని పట్టించుకోకుండా కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్డీయేలో మిగిలేది బీజేపీయే... ఎన్డీయే కూటమి నుంచి మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా బయటకు వెళ్లిపోతున్న నేపథ్యంలో ఆ కూటమిలో చివరకు మిగిలేది ఒక్క బీజేపీయేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా ఎన్డీయే నుంచి ఇప్పటికే శివసేన వైదొలగిందని, హామీలు అమలు చేయలేదని టీడీపీ కూడా కేంద్ర మంత్రులను ఉపసంహరించుకుందన్నారు. ఇక ఎన్డీయేలో ఏమాత్రం ప్రభావం చూపలేని అకాలిదళ్ లాంటి పార్టీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రత్యామ్నాయ కూటమి అవసరం ఎంతైన ఉందని గ్రహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో ముందుకు సాగుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మూడు ‘ఐ’లు... అభివృద్ధి మంత్రాలు.. రాష్ట్రాల పటిష్టతపై ఆధారపడ్డ దేశాభివృద్ధికి మూడు ‘ఐ’లు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. స్కోచ్ 51వ సమ్మిట్‌లో ఆయన ప్రసంగిస్తూ.. ఇన్‌క్లూజివ్ గ్రోత్ (సమ్మిళిత వృద్ధి), ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ (మౌలిక సదుపాయాల అభివృద్ధి), ఇన్నోవేషన్ (సృజనాత్మక ఆవిష్కరణ) అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇదే మంత్రాన్ని అనుసరించి అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తోందన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతులకు వ్యవసాయ పెట్టుబడి, ఉచితంగా చేప పిల్లల పంపిణీ, మెరుగైన పారిశ్రామిక విధానంతో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల మంజూరులో పారదర్శకత, డబుల్ బెడ్రూం ఇళ్ల వంటి వినూత్న పథకాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ చేరేలా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాలన అందిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. సాఫ్రిన్ ఏరోస్పేస్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ స్కోచ్ సమ్మిట్‌లో భాగంగా భారత్, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన భాగస్వామ్య ఒప్పందాల సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. విమానాల్లో ఎలక్ట్రికల్ పరికరాలు తయారీ చేసే సాఫ్రిన్ ఏరోస్పేస్ సంస్థతో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, ఆర్.కె. సింగ్, మంత్రి కేటీఆర్ సమక్షంలో సాఫ్రిన్ సంస్థ సీఈవో, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సాఫ్రిన్ సంస్థ ఇక నుంచి హైదరాబాద్ వేదికగా తన ఉత్పత్తులను ప్రారంభించనుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పారిశ్రామిక ప్రాంతంలో సాఫ్రిన్ సంస్థ పరిశ్రమ ఏర్పాటు చేయనుందని మంత్రి కేటీఆర్ మీడియాకు తెలిపారు. -
థర్డ్ ఫ్రంట్‌కు కేటీఆర్ సరికొత్త నిర్వచనం
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశం కేవలం రెండు పార్టీల (కాంగ్రెస్, బీజేపీ) రాజకీయ వ్యవస్థగా ఉండకూడదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయని విమర్శించారు. థర్డ్ ఫ్రంట్, ఎన్డీఏ కూటమిపై కేటీఆర్ మీడియాతో శనివారం మాట్లాడారు. మాది థర్డ్ ఫ్రంట్ కాదు.. ఫస్ట్ ఫ్రంట్. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నుంచి చాలా పార్టీలు బయటికెళ్తున్నాయని గుర్తు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, శివసేన వెళ్లిపోయిన తర్వాత కేవలం బలహీన అకాలీదళ్ మాత్రమే ఎన్డీఏలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తోందన్నారు. ఇప్పటికైనా ఎన్డీఏ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు పూర్తి మెజార్టీ సాధించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. భారతదేశం కేవలం రెండు పార్టీల వ్యవస్థ కాదని.. రెండు పార్టీల మధ్య పోరాటంగా ఉండకూడదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు మరింత బలోపేతం కావాలని కేటీఆర్ ఆక్షాంక్షించారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని నేపథ్యంలో ఏర్పడే కూటమిని థర్డ్ ఫ్రంట్ అని ఎందుకంటారు.. ఫస్ట్ ఫ్రంట్ అని అనొచ్చు కదా సూచించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి కూడా రాలేదని కేటీఆర్ పేర్కొన్నారు. -
థర్డ్‌ఫ్రంట్‌కు సీపీఎం దూరం: తమ్మినేని
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: థర్డ్‌ఫ్రంట్‌లో చేరే ఆలోచన తమకు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. శుక్రవారం ఆ పార్టీ నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, సుధాకర్ రెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్ ప్రకటన దానిలో భాగమని పేర్కొన్నారు. అయితే.. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేక కూటమి ఏర్పాటు మంచి పరిణామమని పేర్కొన్నారు. కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్ తక్షణ రాజకీయ అవసరాల కోసమా అన్నది తేలాల్సి ఉందన్నారు. నిజాయితీగా నిలబడతారా లేదా అనే విషయం స్పష్టంగా ప్రకటించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ వైదొలిగినా, ఈ నాలుగేళ్లపాటు చంద్రబాబు నోరెందుకు మెదపలేదని తమ్మినేని ప్రశ్నించారు. అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ బీజేపీని మోశారని విమర్శించారు. నికరమైన నిర్ణయం తీసుకునే ధైర్యం కేసీఆర్‌కు లేదని, జీఎస్టీ, నోట్ల రద్దు, కుంభకోణాలపై చంద్రబాబు, కేసీఆర్‌లు తప్పుబట్టలేక పోయారని తెలిపారు. రిజర్వేషన్ల వ్యవహారం న్యాయమైన డిమాండ్ అని చెప్పారు. -
థర్డ్‌ఫ్రంట్ ఓ బూటకం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడుతున్న థర్డ్‌ఫ్రంట్ నాటకం బూటకమని, అది తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆడుతున్న డ్రామా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చని సీఎం కేసీఆర్, డిసెంబర్లో జరిగే ఎన్నికలకు వెళ్తే ప్రజలు నిలదీస్తారని భావించి వారిని తప్పుదోవ పట్టించేందుకు ఫ్రంట్ పేరుతో కొత్త నాటకానికి తెర తీశారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకే కేసీఆర్ ఈ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. మోదీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని బయటికి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత ప్రజాచైతన్య బస్సుయాత్ర ముగింపుసభ గురువారంరాత్రి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కుంతియా మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలసికట్టుగా పనిచేయాలన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ను ఓడించేందుకు కలసికట్టుగా పని చేయాలని అన్నారు. విలాసవంతమైన జీవితంలో కేసీఆర్ కుటుంబం: ఉత్తమ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, థర్డ్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ బస్సుయాత్రకి ఎవరూ రావడం లేదని కేసీఆర్ అంటున్నారని, ఆయన మాటలకు హుజూరాబాద్‌లో సభే సమాధానం చెబుతుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతోందన్నారు. వ్యవసాయ పెట్టుబడి కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అని పేర్కొన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఖమ్మంలో రైతులు మిర్చి పంటకు మద్దతు ధర ఇవ్వమంటే బేడీలు వేసి జైలుకు పంపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రభుత్వాలు ప్రజల అవసరాలు తీర్చేలా ఉండాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అప్రజాస్వామిక పరిపాలన సాగిస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈటల జైలుకు వెళ్లకతప్పదు: రేవంత్ ఆదర్శాలను వల్లించే హుజూరాబాద్ ఎమ్మెల్యే, మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక, పౌరసరఫరాల శాఖలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని, కోట్ల రూపాయలను ఈటల అక్రమంగా సంపాదించుకున్నారని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కస్టమ్ మిల్లింగ్ కింద రైసుమిల్లర్లకు రా రైసుకు క్వింటాల్‌కు రూ.15, బాయిల్డ్‌కు క్వింటాల్‌కు రూ.25 చెల్లించాల్సి ఉండగా, రూ.30, రూ.50 పెంచి రూ.70 కోట్ల అదనపు భారం పడేలా చేశారని, ఇందులో పెద్దమొత్తంలో చేతులు మారాయని అన్నారు. రవాణా, ఇతర ఖర్చుల కింద మిల్లర్లకు రూ.270 కోట్లు చెల్లించారని, ఇందులోనూ పెద్ద మొత్తంలో లంచంగా తీసుకోగా, ఆడిట్ అభ్యంతరాలతో బయటపడిందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట రూ.కోట్ల కుంభకోణం జరిగితే గుడ్డిగా సంతకం చేసిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్.. కేసీఆర్‌తోపాటు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఈ సభలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, వి.హన్మంతరావు, జీవన్‌రెడ్డి, శ్రీ«ధర్‌బాబు, పొన్నం, బలరాంనాయక్, టి.సంతోష్‌కుమార్, వెంకటరమణారెడ్డి,శారద పాల్గొన్నారు. -
ఢిల్లీకెళ్లి ఏం చేస్తడు?
మహబూబాబాద్:/నర్సంపేట: రాష్ట్రంలోనే ఏ మార్పు తీసుకురాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పోయి ఏం చేస్తారని టీజేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. మంగళవారం మహబూబాబాద్‌లో జరిగిన రైతాంగ, నిరుద్యోగ సదస్సులో, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకొస్తానని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని విమర్శించారు. థర్డ్ ఫ్రంట్ పుట్టకముందే పుట్టినట్లు సంబురాలు జరుపుకోవడం హాస్యాస్పదమన్నారు. రైతాంగ సమస్యలపై ఇంటింటికి కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహిస్తామని, త్వరలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని రాజకీయాలన్నీ కమీషన్లు, కాం ట్రాక్ట్‌లు చుట్టే తిరుగుతున్నాయని, ఈ పరిస్థి తిలో మార్పు తీసుకురావాలనే పార్టీని ఏర్పా టు చేస్తున్నట్లు కోదండరాం అన్నారు. ఏప్రిల్‌లో పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తామని తెలిపారు. -
‘ఫ్రంట్’కు మద్దతు పచ్చి అబద్ధం
సాక్షి, నిర్మల్/జగిత్యాల: ‘థర్డ్ ఫ్రంట్.. ఓ పచ్చి అబద్ధం. కేసీఆర్ ఆడుతున్న కొత్త నాటకం. ఆయన వెంట ఎవరూ లేరు. తనకున్న పరిచయంతో కేశవరావు మమతాబెనర్జీకి ఫోన్ చేసి... కేసీఆర్‌తో మాట్లాడించారు. అందరూ కలిసివస్తే చూద్దామని మాత్రమే మమత చెప్పారు. ఇటు జార్ఖండ్ మాజీ సీఎం శిబూసొరేన్ కూడా కేసీఆర్‌తో మాట్లాడలేదు. ఈరోజు ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలిశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తోనే ఉంటామని ప్రకటించారు’ అని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రజాచైతన్య బస్సుయాత్రలో భాగంగా మంగళవారం నిర్మల్‌లో, జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగిన బహిరంగ సభలలో ఆయన మాట్లాడారు. కొడుకును సీఎంను చేసేందుకే కేసీఆర్ కొత్త ఫ్రంట్ నాటకం మొదలు పెట్టారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీలు గెలిచే పరి స్థితి లేదని, అలాంటప్పుడు ఇక థర్డ్ ఫ్రంట్ ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. తన ఫ్రంట్‌కు దేశవ్యాప్తంగా మద్దతు వస్తోందంటూ కేసీఆర్ పచ్చి అబద్ధాలను ప్రచారం చేసుకుంటున్నా రని మండిపడ్డారు. ఇందుకు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని చూపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.5 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో రైతు పంటకు మద్దతు ధర కోసం రూపాయి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. ఒక్క కుటుంబాన్ని కూడా సీఎం పరామర్శించలేదని తెలిపారు. మేలో ఇస్తామంటున్న పెట్టుబడి రాయితీ ఎన్నికల స్టంటేనన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత ఇచ్చావ్..? ఇంటికో ఉద్యోగం ఏమైంది..? దళితులకు మూడెకరాలు ఏమైనయ్..? డబుల్ బెడ్రూం ఎంత మందికి ఇచ్చినవ్?’ అని కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. తాము అధికారంలోకి వస్తే రైతులు రూ.2 లక్షల రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. అధికారంలోకి వచ్చి రాగానే బంగారు తెలంగాణ తెస్తా అన్న కేసీఆర్ ఇప్పుడు జై భారత్ అని నాటకం ఆడుతున్నాడని, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. నీరవ్ మోదీ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావనకు రాకుండా పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. ఏ టెంటూ లేనోళ్లదే ‘ఫ్రంట్’: రేవంత్ దేశంలో ఏ టెంటూ లేకుండా ఉన్నోళ్లదే థర్డ్ ఫ్రంట్ అంటూ కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇది కేంద్రంలోని బీజేపీ సెకండ్ ఫ్రంటేనని అభివర్ణించారు. బీజేపీ చేతి లో కేసీఆర్ కీలుబొమ్మ అని అన్నారు. తెలం గాణ ఉద్యమంలో జెండాలు మోసి.. దండాలు పెట్టి.. ప్రాణాలు తీసుకున్నోళ్లు కనుమరుగయ్యారని,, అంతా కుటుంబ పాలనే సాగుతోందన్నారు. హీరోయిన్లతోని సెల్ఫీలు దిగుడు.. క్యాట్‌వాక్‌లు చేసుడు తప్ప కేటీఆర్‌కు ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. చప్రాసీకీ అర్హత లేని కొడుకును సీఎం చేస్తామంటే ప్రజలు ఊరుకుంటారా?, తెలంగాణ కేసీఆర్ అబ్బా జాగీరా అన్ని ధ్వజమెత్తారు. బలిదానాలు చేసుకున్నోళ్లను, ఉద్యమంలో పోరాడినోళ్లను మరిచి.. సడ్డకుడి కొడుకు సంతోష్‌రావును రాజ్యసభ సభ్యున్ని చేస్తడట అని నిప్పులు చెరిగారు. నక్సల్స్ నీ పనిచేస్తరు: వీహెచ్ ‘నక్సల్స్ ఎజెండా అంటూ కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు వాళ్లనే పిట్టల్లెక్క కాల్చి పారేస్తుండు. ఇగ నక్సల్స్ నీ పనిచేస్తరు కేసీఆర్..’అని సీనియర్ నేత వి.హన్మంతరావు అన్నారు. 106 సీట్లొస్తాయని సర్వేలు చేసినోళ్లకు కాంగ్రెస్ బస్సుయాత్రను చూడగానే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.‘అబద్ధాలు చెప్పే కేసీఆర్.. నీతో మూడో ఫ్రంట్ అయితదా?’ అని ప్రశ్నించారు. ఈ సభలో శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి: జానారెడ్డి దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టడంతో పాటు అభివృద్ధి చేసింది కాంగ్రెస్ హయాంలోనేనని ఆ పార్టీ శాసనసభ పక్షనేత జానారెడ్డి అన్నారు. పేదోళ్లకు రూపాయికే కిలోబియ్యం, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాలను తీసుకొచ్చింది తమ పార్టీయేనని చెప్పారు. ప్రధాన సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ కాంగ్రెస్సే కట్టించిందన్న విషయాన్ని టీఆర్ఎస్ సర్కార్ విస్మరించవద్దన్నారు. రూ.500 కోట్ల రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామన్నారు. -
కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ సాధ్యమా?
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఏ ఫ్రంట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ లేదా బీజేపీలలో ఏదో ఒక పార్టీ మద్దతు లేకుండా ప్రధాని అయిన సందర్భం లేదని, అందరికంటే తెలివి కొంచెం ఎక్కువ ఉన్న కేసీఆర్‌కు ఆ విషయం తెలియదా అని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ సాధ్యమయ్యే ప్రసక్తే లేదని అన్నారు. నాలుగేళ్లు ప్రధాని మోదీకి బానిసగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు కుట్రపూరితంగా ఆయనకు వ్యతిరేకంగా కనిపిస్తున్నారని, ఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీ పంచనే చేరుతాడని అన్నారు. -
కేసీఆర్ ‘థర్డ్‌ఫ్రంట్’ ప్రకటన వెనక మోదీ!
సాక్షి, అమరావతి : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వత్యిరేకంగా జాతీయ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్ ప్రకటనపై ఏపీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటన వెనుక ప్రధాని నరేంద్రమోదీ ఉండి ఉండవచ్చునేమోనని ఆయన సందేహం. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ ఆయన ఈ అనుమానం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ ప్రకటనల వెనుక మోదీ ఉన్నారేమో అనిపిస్తోంది. కేసీఆర్ మాటల అలానే ఉన్నాయి’ అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం కోసమే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటన చేశారని అచ్చెన్నాయుడు విశ్లేషించారు. త్వరలో జరగనున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం దేశ రాజకీయాలపై ఉంటుందన్నారు. కర్ణాటకలో 200 శాతం సిద్ధరామయ్య గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అందరి చూపు ప్రస్తుతం కేంద్రంపైన ఉందని, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. -
'కేసీఆర్‌వి బూటకపు మాటలు'
సాక్షి, నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌వి బూటకపు మాటలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల పాలనలో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యం చెందిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతుంటే.. పక్కదారి పట్టించేందుకే థర్డ్ ఫ్రంట్ అంటూ లేని పోనీ రాజకీయాలు తెరపైకి తెస్తున్నారన్నారు. తెలంగాణ గురించి తెలియని పవన్ కళ్యాణ్.. కేసీఆర్‌కు మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్లన్నారు.. ఆ ఇండ్లు కలగానే మిగిలిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు. -
'ఆ శక్తి కేసీఆర్‌కు ఉంది'
సాక్షి, హైదరాబాద్: థర్డ్‌ఫ్రంట్ కు నాయకత్వం వహించే శక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజకీయాలను కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. దేశంలో ఆర్థిక పరిస్థితులు మారలేదని.. ప్రత్యామ్నాయం ఉంటే ప్రజలు కూడా ఆలోచిస్తారన్నారు. కాంగ్రెస్ అధికారంలో అవినీతి విచ్చలవిడిగా జరిగందని.. ఇప్పుడు నరేంద్ర మోదీ హయాంలో బ్యాంకులు లూటీలవుతున్నాయని తెలిపారు. ప్రజల సొమ్ముకు సంబంధించి మోదీ ఎందుకు పెదవి విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. బ్యాంకుల స్కాం వెనుక బీజేపీ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహ్యాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. వామపక్షాలు సిద్ధాంతాలు మార్చుకుని ఒక్కతాటికి రావాలన్నారు. -
2019లో మోదీ ప్రధానిగా ఉండబోరు!
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్టు 15న ఎర్రకోటపై నరేంద్రమోదీ చేయనున్న ప్రసంగమే ప్రధానమంత్రిగా ఆయన చివరి ప్రసంగమని, వచ్చే ఏడాది ఆయన ప్రధానిగా కొనసాగబోరని, ఇది రాసి ఇస్తానని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డెరెక్ ఒబ్రియాన్ వ్యాఖ్యానించారు. 2019లో ప్రధానిగా మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేయకుండా చూడాల్సిన సవాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల ముందు ఉందని అన్నారు. ‘ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఈ ఏడాది ఆగస్టు 15న తన చివరి ప్రసంగం చేయబోతున్నారు. ఇది సుస్పష్టమైన సంకేతం. 2019లో ఆయన ఎర్రకోట నుంచి ప్రసంగించలేరు. ఈ సవాల్‌ను తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు, అన్ని ప్రతిపక్ష పార్టీలు స్వీకరించాలి’ అని డెరెక్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా థర్డ్ ప్రంట్ ఏర్పాటుచేస్తానంటూ ప్రకటించిన తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. థర్డ్ ఫ్రంట్ ప్రకటన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసిన మమత.. భావసారూప్యమున్న పార్టీలతో కలిసి జాతీయ కూటమిగా ఏర్పడేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో డెరెక్ ఓబ్రియాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
దేశంలో ‘ఫ్రంట్’ ప్రకంపనలు
-
గుణాత్మక మార్పంటే గడీల పాలనా?
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటున్న కేసీఆర్, తెలంగాణలో తాను అనుసరిస్తున్న గడీల పాలనను దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. సంతలో పశువులను కొన్నట్టు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొన్న కేసీఆర్, అదే తరహా రాజకీయం జాతీయస్థాయిలో అవసరమని భావిస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. మాటమీద నిలబడే నేత అవసరమని చెప్తున్న ఆయన, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని.. తాను పీఠమెక్కిన తీరుకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఆదివారం లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు మెచ్చిన పాలననందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రాభవం పెరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్, అసహనానికి గురై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన ప్రతిపాదిస్తున్న టెంట్ లేని ఫ్రంట్లను జనం పట్టించుకోరని, గతంలో నేషనల్ ఫ్రంట్, థర్డ్‌ఫ్రంట్ అంటూ ఎన్నో వచ్చి.. గల్లంతైన విషయాన్ని మరచినట్టున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఈశాన్య భారతంలో విజయదుందుభి మోగించినట్టుగానే త్వరలో కర్ణాటకలో ఆ తర్వాత తెలంగాణలో కూడా బీజేపీ గెలుస్తుందని, దీన్ని ఊహించే కేసీఆర్ దిక్కుతోచని స్థితిలో మాట్లాడతున్నారని అన్నారు. మజ్లిస్ ప్రాపకం కోసమే కేసీఆర్ మోదీపై విమర్శలు చేస్తున్నారన్నారు. -
దేశంలో ‘ఫ్రంట్’ ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచన జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సి ఉందన్న కేసీఆర్ వాదనకు మద్దతు పలికారు. ‘హమ్ ఆప్ సే ఏక్ మత్ హై. ఆప్ కే సాత్ రహేంగే’(మేమే మీతో ఏకీభవిస్తున్నాం. మీతో కలసి ఉంటాం) అని మాటిచ్చారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా కేసీఆర్‌కు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు ఎంపీలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ పార్టీల ప్రతినిధులు సీఎంకు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సీఎం నిర్ణయాన్ని స్వాగతించారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తే కేసీఆర్‌కు మద్దతిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మరోవైపు ఆదివారం ఉదయాన్నే రాష్ట్రం నలుమూలల నుంచి టీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ప్రగతి భవన్ చేరుకున్నారు. టీఆర్ఎస్కు చెందిన ముఖ్య నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రగతిభవన్‌లో సందడి నెలకొంది. దేశ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీల పాత్ర పోషించాలంటూ వారంతా నిన దించారు. నాయకులు, పార్టీ శ్రేణులు.. ‘దేశ్ కా నేతా కేసీఆర్’అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వివిధ ఆలయాల పండితులు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, వివిధ మసీదుల మత గురువులు, ముస్లిం సంస్థల ప్రతినిధులు, పలు చర్చిల ఫాదర్లు, క్రైస్తవ మత పెద్దలు, సిక్కు మత గురువులు వచ్చి సీఎంను ఆశీర్వదించారు. -
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌కు జనసేన మద్దతు
సాక్షి, అమరావతి: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయ బోయే థర్డ్ ఫ్రంట్‌కు జనసేన పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పవన్ ప్రసంగ వీడియోను ఆదివారం ఆ పార్టీ కార్యా లయం మీడియాకు విడుదల చేసింది. ‘దేశ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. రాష్ట్రాల్లో చోటుచేసుకునే సున్నిత సమస్యలను అర్థం చేసుకునే కొందరు వ్యక్తుల సమూహం దేశ రాజకీయాల్లో అవసరం. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలి. కొత్త ఆలోచన రావాలి. కొత్త రక్తంతో కూడిన థర్డ్ ఫ్రంట్ కావాలి. దీనికి అంకురార్పణ చేద్దామనుకున్న కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను’ అని పవన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో మద్దతుగా మాట్లాడారని.. టీడీపీ, వైఎస్సా ర్ సీపీ పార్లమెంట్లో హోదా కోసం చేసే పోరాటంలో టీఆర్ఎస్ సహాయం కూడా తీసుకోవాలని సూచించారు. -
నన్ను ముట్టుకుంటే భస్మం అవుతారు!
సాక్షి, హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని ఏర్పాటు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు మరోసారి ఉద్ఘాటించారు. జాతీయ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరముందని, ఆ మార్పు తెలంగాణ నుంచే మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. థర్డ్‌ఫ్రంట్ గురించి నిన్న విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రగతి భవన్‌కు పెద్దసంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు దిశగా తాను ముందుకెళుతున్నానని, త్వరలోనే అందరినీ కూడగడతానని ఆయన స్పష్టం చేశారు. థర్డ్‌ఫ్రంట్‌ను అందరూ స్వాగతిస్తున్నారని, చాలామంది నేతుల తనకు ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ తనకు ఫోన్ చేసి మద్దతు పలికారని, మహారాష్ట్ర నుంచి కూడా ఫోన్లు వచ్చాయన్నారు. ప్రజల ఆకాంక్షలు గుర్తించడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయని తెలిపారు. 70 ఏళ్లలో ఆ రెండు పార్టీలు చేసిందేమీ లేదన్నారు. 10 లక్షల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతోందని, ప్రజల దీవెన ఉంటే జాతీయ రాజకీయాల్లోకి కూడా వస్తానని, దేశానికి అద్భుతమైన దిశాదశా చూపించి..మార్గనిర్దేశం చేస్తానని చెప్పారు. మనది పేరుకే సమాఖ్య వ్యవస్థ అని, అన్ని అధికారాలు కేంద్రం చేతిలో ఉన్నాయని ఆయన విమర్శించారు. కేంద్రం వద్ద పరిమిత అధికారాలు ఉండాలని సూచించారు. ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, విద్యావిధానాన్ని రాష్ట్రాలకు ఎందుకు అప్పగించరు? అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల అంశాన్ని రాష్టాలకు ఎందుకివ్వరని నిలదీశారు. ఏదీ తేల్చరు? ఏది జరగదు? ఇది కేంద్రం తీరు అని విమర్శించారు. నీళ్ల పంపకాల్లో రాష్ట్రాల మధ్య గొడవ పెడుతున్నారని కేంద్రం తీరుపై మండిపడ్డారు. అన్ని ధరలు పెంచుతున్నారు కానీ పంటల మద్దతు ధరలు పెంచలేదని మండిపడ్డారు. రైతాంగం సంక్షోభంలో ఉన్నా.. మనం ఎందుకు మాట్లాడకూడదు? అని ప్రశ్నించారు. ఒకవేళ మాట్లాడితే జైలుకు పంపుతారట. పిట్ట బెదిరింపులకు కేసీఆర్ భయపడడు. నన్ను ముట్టుకుంటే భస్మం అవుతారు’ అని కేసీఆర్ కేంద్రాన్ని హెచ్చరించారు. ‘కాంగ్రెస్ మీద కోపం వచ్చి బీజేపీని గెలిపిస్తే.. రైతులు, విద్యార్థులు, కార్మికులకు ఏం ఒరగలేదు. వాళ్ల జమానాలో మాల్యా.. వీళ్ల జమానాలో నీరవ్.. బ్యాంకులను మోసం చేసి పారిపోయారు. ఒకప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న చైనా.. ఇప్పుడు అమెరికాతో పోటీ పడుతోంది. కానీ మనం మాత్రం ఆస్థాయిలో ఎదగలేకపోతున్నాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు
-
గుజరాత్ కీలక రాజకీయ పరిణామం!
కొత్త రాజకీయ ఫ్రంట్‌ను ప్రకటించిన సీనియర్ నేత వాఘేలా కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా కూటమి! అహ్మదాబాద్: మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. గత జూలై నెలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత శంకర్‌సిన్హ్ వాఘేలా కొత్త 'రాజకీయ ఫ్రంట్'ను మంగళవారం ప్రకటించారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా తన ఫ్రంట్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. 'ఇది రాజకీయ పార్టీ కాదు. యూపీఏ, ఎన్డీయే తరహాలో రాజకీయ కూటమి. ఇది బీజేపీ 'బీ' టీం కాదు. ఇందులో ఎలాంటి మ్యాచ్ ఫీక్సింగ్ లేదు. కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం లేదు. అధికార బీజేపీ ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా అజెండాతో ఎన్నికల్లోకి వెళుతాం' అని వాఘేలా స్పష్టం చేశారు. 'జన్ వికల్ప్' పేరిట గుజరాత్లో 'ప్రజా ప్రత్యామ్నాయాన్ని' అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 182 స్థానాల్లోనూ తమ కూటమి పోటీ చేస్తుందని వెల్లడించారు. మహిళల సమస్యలు, జీఎస్టీ, నిరుద్యోగిత తదితర 20 అంశాల ఆధారంగా ఎన్నికల్లోకి వెళుతామని చెప్పారు. -
నంద్యాల నుండే మూడో ఫ్రంట్‌కు శ్రీకారం
నంద్యాల: రాష్ట్రంలో మూడో ఫ్రంట్‌కు నంద్యాల నుండే శ్రీకారం చుట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికను వేదికగా చేసుకొని మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సీపీఐ, సీపీఎం, జనసేన, ఎస్డీపీఐ, లోక్‌సత్తా, ఆవాజ్ కమిటీలతో పాటు బీసీ, ఎస్సీ సంఘాలను కూడా కలిసి చర్చిస్తున్నామన్నారు. మూడో ఫ్రంట్ తరపున నంద్యాల ఉప ఎన్నికలో అభ్యర్థిని దింపడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 8.8 శాతం జనాభా ఉన్న ముస్లింలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకోకుండా మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదన్నారు. అణగారిన వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కూడా పక్కదారి పట్టాయన్నారు. -
థర్డ్ మూడ్
-
మూడోఫ్రంట్ ముగిసిన ముచ్చట
⇒ వామపక్ష సంఘటనే లక్ష్యం ⇒ సీపీఎం ప్రధాన కార్యదర్శి కారత్ స్పష్టీకరణ (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఎన్నికలకోసం పార్టీలను ఏకం చేసే ప్రసక్తే లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. ఎన్నికల ఎత్తుగడలనేవి తాత్కాలికమేగానీ, వాటికోసమే ఏమైనా చేయాలనుకోవట్లేదని తేల్చిచెప్పారు. సమసమాజం, కమ్యూనిజమే అంతిమలక్ష్యంగా పనిచేస్తాం తప్ప స్వల్పకాలిక ప్రయోజనాలకోసం పాకులాడబోమన్నారు. పార్టీ 21వ జాతీయ మహాసభల సందర్భంగా బుధవారమిక్కడ ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. మహాసభలో చేసిన రెండు తీర్మానాల్ని విడుదల చేశారు. భూసేకరణ చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని మహాసభ పిలుపునిస్తూ తీర్మానం చేసింది. మరో తీర్మానంలో అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా దేశంలోని షెడ్యూల్డ్ కులాల సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మీడియా సమావేశంలో కారత్ చెప్పిన అంశాలివీ.. అది గతించిన గతం..: 1998 నుంచి 2008 వరకు మూడో ప్రత్యామ్నాయంకోసం ప్రయత్నించాం. అది సాధ్యం కాదని తేలిపోయింది. అది గతించిన గతం. ఇప్పుడు మాముందున్న తక్షణ కర్తవ్యం వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత. పోరాటాలు, ఉద్యమాల ప్రాతిపదికన అది ఉంటుంది. గతంలోనూ వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యసంఘటనకు పిలుపిచ్చాం. కొంతమేర కృషి జరిగింది. మధ్యలో అనేక అభిప్రాయాలొచ్చాయి. ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాం. అందులో తప్పేముంది? వామపక్ష పార్టీల్లో మాది పెద్ద పార్టీ. అంతమాత్రాన మేము చెప్పిందే నడవాలనుకోవట్లేదు. అన్ని వామపక్షాలనూ సంప్రదించాకే భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ఇప్పుడున్న ఆరు పార్టీలనే కాదు మరికొన్ని పార్టీలనూ వామపక్ష ఫ్రంట్‌లోకి తేవాలనుకుంటున్నాం. అంబేడ్కర్ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారనేది అప్రస్తుతం అంబేడ్కర్ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారనేది అప్రస్తుతం. ఏ పార్టీ ఒకే రీతిలో ఉండదు. మారుతూ ఉంటుంది. మేమూ అంతే. దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టాం. దానిలో భాగంగా అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించాలనుకుంటున్నాం. మా పార్టీ కేంద్రకమిటీలో దళితులు లేరనడంలో నిజం లేదు. మా పొలిట్‌బ్యూరోలో దళితులు లేనిమాట నిజం. నేను కార్యదర్శిగా ఏమి చేశాననేది అప్రస్తుతం. వెనక్కు తిరిగి చూడాలనుకోవట్లేదు. -
నేనే సీఎం అభ్యర్థి
రాష్ట్రంలో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు టీఎంసీ, వామపక్షాలు కసరత్తుల్లో పడ్డాయి. డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ ఫ్రంట్‌లోకి ఆహ్వానించగా, ఆయన తానే సీఎం అభ్యర్థి అన్న నిబంధనను పెట్టడం గమనార్హం. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేల తర్వాత డీఎండీకేకు ఓటు బ్యాంక్ కాస్త ఎక్కువ. లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైనా ఓటు బ్యాంక్‌ను మాత్రం ఆ పార్టీ పదిలం చేసుకుంది. దీంతో ఆ పార్టీకి మంచి డిమాండే ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే నేత విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు డీఎంకే తీవ్రంగానే ప్రయత్నిస్తున్నది. అయితే, సీఎం కావాలని కలలు కంటున్న కెప్టెన్ ఏ మేరకు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారోనన్నది ప్రశ్నార్థకం. ఈ పరిస్థితుల్లో గత వారం టీఎంసీ నేత వాసన్ ఇంట్లో సాగిన సీపీఎం నేత ఏచూరీ భేటీ విజయకాంత్‌కు కొత్త అవకాశం చేతికి చిక్కినట్టు అయింది. థర్డ్ ఫ్రంట్ : డీఎంకే, అన్నాడీఎంకేలు అవినీతి ఊబిలో కూరుకున్న దృష్ట్యా, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఓ కూటమి ఏర్పాటుకు తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) నేత వాసన్ కొన్ని నెలలుగా పావులు కదుపుతూ వస్తున్నారు. వామపక్షాలను, మైనారిటీ సామాజిక వర్గ పార్టీలను, తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే నాయకుల్ని ఆహ్వానించి తరచూ ఏదో ఒక సదస్సును ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ సదస్సుల వేదికగా మతతత్వానికి, అవినీతికి ప్రత్యామ్నాయంగా కొత్త కూటమి ఆవిర్భవించాల్సిందేనని నాయకులు వ్యాఖ్యానించి ఉన్నారు. ఈ వ్యాఖ్యల్ని కార్యరూపంలో పెట్టేందుకు వామపక్షాల నేతలు, టీఎంసీ నేత వాసన్ సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే గత వారం వాసన్ ఇంట్లో సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి భేటీ సాగినట్టుగా టీఎంసీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో థర్డ్ ఫ్రంట్ లక్ష్యంగా కసరత్తులు ఆరంభమైనా, నేతృత్వం ఎవరు వహించాలన్న అంశం చర్చకు వచ్చి ఉన్నది. వాసన్ నేతృత్వంలో కూటమి ఏర్పాటు దిశగా వామపక్షాలు ముందుకు వచ్చాయి. మైనారిటీ సామాజిక వర్గాల పార్టీలు, వీసీకే థర్ట్ ఫ్రంట్‌లోకి వచ్చే అవకాశం ఉన్నా, డీఎండీకేను తీసుకురావడం మీద నాయకులు తీవ్రంగా కుస్తీలు పడుతున్నట్టు సమాచారం. వాసన్‌కు విజయకాంత్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న దృష్ట్యా, డీఎండీకేను కూటమిలోకి తీసుకొచ్చే బాధ్యతలు ఆయన భుజానే వేశారు. తన నేతృత్వంలో కాకుండా విజయకాంత్‌తో కలసి ఉమ్మడి నేతృత్వంలో థర్ట్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా వాసన్ కసరత్తులు చేపట్టినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఎంసీ వర్గాల ఏకాభిప్రాయంతో విజయకాంత్ వద్దకు రాయభారం పంపినట్టు చెబుతున్నారు. థర్డ్ ఫ్రంట్‌ను ఆహ్వానించిన విజయకాంత్, నాయకత్వం మాత్రం తమ చేతిలోనే ఉండాలన్న నిబంధనను పెట్టినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే, థ ర్డ్ ఫ్రంట్ సీఎం అభ్యర్థిగా తన పేరును ముందుగానే ప్రకటించాలని స్పష్టం చేయడంతో వాసన్ దూతలు నోరు మెదపకుండా వెను దిరిగినట్టు సమాచారం. తనకు సీఎం అభ్యర్థిత్వం ఇస్తే థర్డ్ ఫ్రంట్‌లోకి వచ్చేందుకు సిద్ధం అని, లేని పక్షంలో ఒంటరిగా కూడా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు రెడీ అన్నట్టు వాసన్‌కు విజయకాంత్ సంకేతం పంపడం ఆలోచించ దగ్గ విషయమే. దీంతో వామపక్షాలతో చర్చించినానంతరం తదుపరి నిర్ణయాన్ని వెల్లడించే విధంగా విజయకాంత్‌కు వాసన్ సందేశం పంపినట్టుగా టీఎంసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల అనంతరం సీఎం ఎవ్వరన్నది తేల్చుకుందామని, ముందు మతత్వానికి , అవినీతికి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పాటు చేద్దామన్న లక్ష్యంతో ఉన్నట్టు విజయకాంత్‌కు నచ్చ చెప్పి దారిలోకి తెచ్చుకునేందుకు వాసన్ అస్త్రాలను ప్రయోగిస్తున్నట్లు చెబుతున్నారు. -
దాగుడుమూత.. దండాకోర్!
-
'థర్డ్ ఫ్రంట్కే మా ప్రాధాన్యత'
-
థర్డ్ ఫ్రంట్కే మా ప్రాధాన్యత: కవిత
హైదరాబాద్ : కేంద్రంలో ఎన్డీయేకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు. ఆమె గురువారమిక్కడ మాట్లాడుతూ ఫలితాలు వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే తమ ప్రాధాన్యత మాత్రం థర్డ్ ఫ్రంట్కేనని కవిత తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆమె అన్నారు. -
మూడో కూటమి సహా దేనికీ మద్దతివ్వం
ఆప్ స్పష్టీకరణ వారణాసి: సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి వచ్చే ఫలితాలు ఏవిధంగా ఉన్నప్పటికీ తృతీయ కూటమి సహా ఏ కూటమికీ మద్దతిచ్చేది లేదని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే, దీనికి ముందు ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆపార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ మాత్రం.. బీజేపీని అధికార పీఠం నుంచి నిలువరించే క్రమంలో తమ పార్టీ తృతీయ కూటమికి మద్దతిస్తుందన్నారు. అయితే, అంశాల వారీగానే ఈ మద్దతు ఉంటుందని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పోటీకి దిగినప్పటికీ ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో ఆప్ మంచి ఫలితాలు రాబడుతుందన్నారు. ఎన్నికల్లో 10 సీట్లు వచ్చినా 30 సీట్లొచ్చినా వ్యవస్థీకృత మార్పులు చేపట్టేదిశగా ప్రభుత్వంపై తాము ఒత్తిడి తెస్తామన్నారు. కాగా, రాయ్ వ్యాఖ్యలను కేజ్రీవాల్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఆప్ ఏ ఒక్కపార్టీకీ మద్దతివ్వబోదని, తృతీయ కూటమిగా ఏర్పడుతున్న పార్టీల్లో అవినీతి పరులే ఎక్కువగా ఉన్నారని.. అవినీతిపై పోరాడతామంటూ బరిలో నిలిచిన తాము ఏవిధంగా ఆయా నేతలకు మద్దతిస్తామని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో కూర్చునేందుకే ఆప్ ప్రాధాన్యమిస్తుందని ట్విట్టర్లో స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసులు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. అమేథీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆదివారం ఈ నోటీసు ఇచ్చింది. మే 13 సాయంత్రంలోగా వివరణ ఇచ్చేందుకు గడువు విధించింది. ఆ లోపుగా కేజ్రీవాల్ వివరణ ఇవ్వకపోతే ఈ అంశంపై తామే నిర్ణయం తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది. అమేథీ ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క ఓటు వేసినా అది దేశాన్ని, దైవాన్నీ మోసగించడమే అవుతుందని కేజ్రీవాల్ చెప్పిన సంగతి తెలిసిందే. -
కేసీఆర్.. ఎవ్వరికీ అర్థం కాడు!
-
కేంద్రంలో థర్డ్‌ఫ్రంట్ వస్తే ఆలోచిస్తాం: ఈటెల
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో థర్డ్‌ఫ్రంట్‌కు అవకాశం వస్తే ఆలోచిస్తామని టీఆర్ఎస్ శాసనసభాపక్ష మాజీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల అనంతర పరిస్థితులను బట్టి కేంద్రంలో ఎలాంటి వైఖరిని అనుసరించాలనేది నిర్ణయించుకుంటామన్నారు. గ్రామాల్లో తాగునీటికి, కరెంటుకు తీవ్ర ఇబ్బందులున్నా ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపించి పరిష్కరించడం లేదని ఈటెల విమర్శించారు. గవర్నరు జోక్యం చేసుకుని, పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని దుష్ర్పచారం, ప్రలోభాలు పెట్టినా టీఆర్ఎస్కు ప్రజలు పట్టంకట్టారని ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటుచేస్తుందన్నారు. నోముల నర్సింహ్మయ్య మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఎవరి ప్రయోజనాలకోసం పార్టీని పెట్టాడో తేలిపోయిందన్నారు. -
నరేంద్ర మోడీకి థర్డ్ ఫ్రంట్ భయం
జాతీయ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ బలపడితే తన పరిస్థితి ఏమిటన్న ఆలోచనే ఇప్పుడు నరేంద్రమోడీకి నిద్ర లేకుండా చేస్తోంది. ప్రాంతీయ పార్టీలను తన దారిలోకి తెచ్చుకునేందుకు నరేంద్ర మోదీ విశ్వప్రయత్నం చేశారు. శక్తిమంతంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలు సారీ చెప్పడంతో ప్రధాని కావాలన్న తన కల నెరవేరదని తెలుసుకున్న మోదీ పెద్దగా బలం లేని చిన్నా చితకా పార్టీలతో కూటమి కట్టారు. కానీ అవి కోరుకుంటున్న మేరకు బలాన్ని ఇస్తాయా అన్నది ప్రశ్నార్థకమే. బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతలుగా ఉన్న మమత బెనర్జీ, మాయావతి, జయలలితలు మోడీకి కొరకరాని కొయ్యలుగా మారారు. బెంగాల్ లో బిజెపి ఖాతా తెరవడం కష్టమేనని చెబుతున్నారు. తమిళనాట రెయిన్బో సంకీర్ణం పేరుతో బిజెపి ఏడు చిన్నా చితకా పార్టీలతో పెట్టుకున్న పొత్తు కూడా ఫలితమివ్వబోవడం లేదని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. మాయావతి ఉత్తరప్రదేశ్ లో మెజార్టీ స్థానాలు దక్కించుకుంటున్నారన్న అంచనాల నేపథ్యంలో యూపీలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనుకున్న మోదీ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒడిశాలో మోదీ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడిందని రాజకీయ అంచనాలు చెబుతున్నాయి. కీలకమైన తెలంగాణలో బిజెపి ఆశలకు టీఆర్ ఎస్ చెక్ పెట్టినట్లు అంచనాలు వస్తున్నాయి. మొత్తం 17 స్థానాల్లో బిజెపికి ఒక్కటి కూడా దక్కకపోవచ్చని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల ఏడున ఎన్నికలు జరగనున్న సీమాంధ్రలోనూ బిజెపి ఖాతా తెరవకపోవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు సహకరించారనే ఆగ్రహంతో ఉన్న ప్రజలు బాబు, మోదీలను విశ్వసించే పరిస్థితిలో లేరని సమాచారం. వీటికి తోడు ఫ్యాను గాలి ఉధృతికి బాబు, పవన్, మోదీ సేనలు కొట్టుకుపోవడం ఖాయమని వెల్లడౌతోంది. మరో వైపు దేశవ్యాప్తంగా మోదీకి కేజ్రీవాల్ చెక్ పెట్టారని తెలుస్తోంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంటలెక్చువల్ ఓటు, యువత ఓటు తమకే పడేలా ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు వ్యూహాత్మకంగా వ్యవహరించాయని తెలిసింది. దాదాపు రెండొందల స్థానాల్లో బిజెపికి పడాల్సిన ఓట్లను ఆమ్ఆద్మీ పార్టీ చీల్చిందని సమాచారం. దీంతో ప్రధాని కావాలని కలలు కంటోన్న మోదీకి ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ప్రాంతీయ పార్టీలు చెక్ పెట్టాయని సర్వేల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ నేతలు వద్దన్నా, గెలిచే అవకాశం లేదన్నా చంద్రబాబుతో చేతులు కలిపిన మోడీ ఇప్పుడు ఒకే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఏదో రకంగా జగన్‌ను అడ్డుకోవాలి, ప్రధానిగా తనకు రూటు క్లియర్ చేసుకోవాలన్న తాపత్రయంతో పనిచేస్తున్నారు. ప్రధాని పీఠం దక్కదని తేలిపోవడంతో థర్డ్‌ఫ్రంట్ నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు ఈ ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. అయితే మోదీ ప్రచార మాయలో పడకుండా ప్రాంతీయ పార్టీల నేతలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. భవిష్యత్తులో వీరి ఐక్యత మోదీ ఆశలకు చెక్ పెట్టనుందనేది స్పష్టంగా తెలుస్తోంది. -
'మూడో కూటమికి కాంగ్రెస్ మద్దతు వద్దు'
హైదరాబాద్: మూడో కూటమికి బయట నుంచి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తిరస్కరించారు. నరేంద్ర మోడీని అడ్డుకునేందుకు తృతీయ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలన్న ప్రతిపాదన తాజాగా తెరపైకి రావడంతో ఆయన స్పందించారు. అతి పెద్ద పార్టీయే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాలన్న అభిప్రాయాన్ని దిగ్విజయ్ వ్యక్తం చేశారు. డామినెంట్ పొలిటికల్ పార్టీ అయితేనే సంకీర్ణ ప్రభుత్వాన్ని సజావుగా నడపగలుతుందని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు అవసరమయితే థర్డ్ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు పృద్ధిరాజ్ చౌహాన్, సల్మాన్ ఖుర్షీద్, జైరాం రమేష్ ప్రతిపాదించిన నేపథ్యంలో దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
కాంగ్రెస్ ఓటమి ఖరారు
* దేశవ్యాప్తంగా ఇంకా ఎన్నికలు ముగియకముందే ఆ పార్టీ దీన్ని గుర్తించింది: బీజేపీ నేత నఖ్వీ * మూడో కూటమికి మద్దతు వ్యాఖ్యలు ఇందులో భాగమే * ఫలితం తెలిసిపోవడంతో మోడీపై ప్రేలాపనలు * ఎన్డీఏ 350కి పైగా సీట్లు సాధిస్తుంది సాక్షి, హైదరాబాద్: ఇంకా పోలింగ్ ముగియకున్నా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమి ఖరారైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. ఈ విషయం ఆ పార్టీ కూడా గుర్తించిందని, అందుకే దాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీ నేతలు బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై అభ్యంతరకర భాషలో విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తికాకుండానే మూడో కూటమికి మద్దతు గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారంటే ఆ పార్టీ ఓడిపోతోందనే విషయాన్ని వారు ప్రజలకు చెప్పకనే చెబుతున్నారని నఖ్వీ అన్నారు. ఈ చారిత్రాత్మక ఎన్నికల్లో ‘జీడీపీ’ ప్రధాన భూమికను పోషిస్తోందని చెబుతూ... జి అంటే గుడ్‌గవర్నెన్స్, డి అంటే డెవలప్మెంట్, పి అంటే ప్రాస్పెరిటీగా అభివర్ణించారు. యూపీఏ పదేళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే పది పనులు కూడా సాగని తరుణంలో దేశం బాగా వెనుకబడిందని జనం గుర్తించారని ఆయన చెప్పారు. దీంతో మోడీ ప్రధాని అయితేనే దేశ పురోగతి సాధ్యమనే విషయాన్ని కులమతాలకతీతంగా ప్రజలు గుర్తించారని కూడా నఖ్వీ తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్‌ను దివాళాకోరు పార్టీ అని ఆయన అభివర్ణించారు. మతిచలించి మాట్లాడుతున్న సోనియా, రాహుల్, ప్రియాంక సహా ఆ పార్టీ సీనియర్ నేతల కోసం మంచి వైద్యుల బృందాన్ని సిద్ధం చేసుకుంటే బాగుంటుందని నఖ్వీ ఎద్దేవా చేశారు. మోడీ కోసం ముందుకు వస్తున్న ప్రజలను కిరాయి మనుషులుగా పేర్కొనడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సాధారణ ప్రజలను అవమానపరుస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే ఆ పార్టీని ఓడించి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారని నక్వీ తెలిపారు. నఖ్వీ ఇంకా ఏమన్నారంటే.... * ఎన్నికలు పూర్తయిన 350 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమి స్పష్టమయింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్డీఏ 350పైగా సీట్లతో ఘనవిజయం సాధిస్తుంది. * ఎన్నికలప్పుడే మైనార్టీల జపంచేసే పార్టీలకు బుద్ధి చెప్పడానికి ముస్లింలు పెద్దసంఖ్యలో మోడీకి అనుకూలంగా ఓటేస్తున్నారు. * మోడీని ఎవరెక్కువ తిడతారో అనే ఓ ఫ్యాషన్ పరేడ్ పోటీ జరుగుతోంది. రాహుల్, ప్రియాంక, ములాయం, కేసీఆర్ తదితరులు అందులో పాల్గొంటున్నారు. వీరంతా రాజకీయంగా, నైతికంగా పతనమవుతున్నారు. * హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం పార్టీకి రాజ్యాంగంపై నమ్మకం లేదు. నిత్యం దాన్ని అవమానిస్తోంది. * ఇలాంటి రాజకీయ పార్టీలతోనే దేశం తీవ్రంగా నష్టపోతోంది, బీజేపీది అభివృద్ధితో కూడిన సెక్యులర్ విధానం. * పదేళ్లుగా ఎన్నో కుంభకోణాలకు 10 జన్‌పథ్ (సోనియా నివాసం) కేంద్రబిందువుగా మారింది. * డిప్యుటేషన్ ప్రధానిగా మన్మోహన్ ఉంటే, సూపర్ ప్రధానిగా సోనియా వ్యవహరించి దేశాన్ని నాశనం చేశారు. * కాంగ్రెస్ హయాంలోనే దేశంలో ఎక్కువ మతకలహాలు జరిగాయి. కమ్యూనల్షీట్ తెరిస్తే అది కాంగ్రెస్ పేరిటే ఉండాలి. -
కాంగ్రెస్ చేతులెత్తేసినా బీజేపీకి 'ఆ' సీన్ లేదా?
-
ఓటమిని ముందే అంగీకరించిన కాంగ్రెస్
ముంబై:మరో మూడు విడతల పోలింగ్ జరగాల్సి వున్నప్పటికీ కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందా..? ప్రస్తుత రాజకీయ సమీకరణాలను చూస్తే ఈ విషయం మనకు అవగతమవుతోంది. కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో మరో మూడు విడతలుగా పోలింగ్ జరగాల్సి ఉన్న క్రమంలో ఆయన మాటలు రాజకీయ విశ్లేషకులతో పాటు, సామాన్య ప్రజానికాన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే తాము చాలా వెనకబడ్డట్టు కనిపిస్తోందని ఆయన తెలిపారు. దీనికి అనేక కారణాలున్నాయని, భారీ సంఖ్యలో వచ్చిన కొత్త ఓటర్లు ఈసారి ఓటింగ్ సరళిని ప్రభావితం చేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ అంటున్నారు. ఓట్ల వేటలో కాంగ్రెస్ వెనకబడుతున్నప్పటికీ, ప్రత్యర్థి బిజెపి బలం పుంజుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే కాంగ్రెస్ సహకారంతో మూడో కూటమి కానీ, థర్డ్ ఫ్రంట్ సపోర్ట్‌తో కాంగ్రెస్ సర్కారు కానీ కేంద్రంలో ఏర్పడే అవకాశాలున్నాయని ఆయన వివరించారు. దీంతో బిజెపి సర్కార్ ఏర్పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయనదే అర్ధమవుతోంది. కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనందున, థర్డ్ ఫ్రంట్కే సర్కారును ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 1996 నాటి పరిస్థితులు దేశ రాజకీయాల్లో కనిపిస్తున్నాయని జనతాదళ్ యునైటెడ్ నేత ధనిష్ అలీ అన్నారు. తుది విడత పోలింగ్ జరగక మునుపే ఓటమిని కాంగ్రెస్ ఒప్పుకోవడం సిగ్గు చేటని, కాంగ్రెస్, బిజెపిల ప్రత్యామ్నాయ శక్తులకు మాత్రమే ఓటేయాల్సిందిగా వామ పక్షాలు పిలుపు నిస్తున్నాయని సిపిఐ జాతీయ నేత డి.రాజా అన్నారు. దేశ రాజకీయాలను ఈసారి ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలు శాసించే స్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. తమిళనాడులో జయలలిత నాయకత్వంలోని అన్నా డీఎంకే, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్, పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, బీహారులో నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యునైటెడ్, యుపిలో ములాయం సింగ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, మాయావతి నాయకత్వంలోని బిఎస్పి, ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ, తెలంగాణాలో కొంత వరకు టిఆర్ఎస్ పార్టీలు ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. థర్డ్ ఫ్రంట్ సంకేతాలను స్వయంగా కాంగ్రెసే ఇస్తున్నందున పోలింగ్ సరళి కూడా ఆ దిశగానే వుంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. -
అవసరమైతే ‘మూడు’కు మద్దతు
కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఫరూఖాబాద్/కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలయ్యాక అవసరమైతే కాంగ్రెస్ మూడో కూటమి మద్దతు తీసుకుంటుందని లేదంటే ఆ కూటమికే మద్దతు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తుందని కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ పరోక్షంగా చెప్పారు. శనివారం ఖుర్షీద్ ఫరూఖాబాద్‌లోని పీతౌరమ్లోను, సింఘ్వీ కోల్కతాలోను విలేకరులతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు అతి తక్కువగా ఉన్నాయని, కాంగ్రెస్ మూడో కూటమితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వీరి మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఖుర్షీద్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ బీజేపీకే పెద్ద సమస్యగా మారనున్నారని అన్నారు. సింఘ్వీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎప్పుడూ సొంత బలంతో పోరాడుతుందని, అయితే ఎన్నికల తర్వాత వచ్చే సంఖ్యాబలాన్ని బట్టే ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. అవసరమైతే లౌకికవాద పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశముందని చెప్పారు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మాత్రం మూడో కూటమికి మద్దతిచ్చే అంశాన్ని తోసిపుచ్చారు. ఎన్నికల తర్వాత యూపీఏ-3 ప్రభుత్వం కచ్చితంగా ఏర్పడుతుందని ఆయన ఉద్ఘాటించారు. ‘‘మేం గెలిచే ఉద్దేశంతో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే ఎన్నికలకు వెళుతున్నాం’’ అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : మమత సోనార్పూర్ (పశ్చిమబెంగాల్): కేంద్రంలో మూడో కూటమి అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్, బీజేపీలు కోరుకుంటున్నాయని, అందుకే ఆ పార్టీలు రెండూ కుమ్మక్కు ఆటలు ఆడుతున్నాయని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లాలో జరిగిన సభలో ఆరోపించారు. -
'కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం'
లక్నో: ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొత్త జోస్యం చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం పరిణితి చెందిందంటూనే.. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ మద్దతునే మూడో కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. బీజేపీకి తగినన్ని స్థానాలు రావని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనతకు చేరుకుంటుందన్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మూడో కూటమి మద్దతునివ్వడం ఖాయమని తెలిపారు. మూడో కూటమిలో పార్టీలకే ప్రస్తుతం అత్యధిక లోక్ సభ సీట్లు వస్తాయని అఖిలేష్ తెలిపారు. గతంలోని అనుభవాల నేపథ్యంలో మూడో కూటమి నిలబడుతుందా?అన్న ప్రశ్నకు ప్రజాస్వామ్యం ఇప్పుడు చాలా పరిణితి చెందిందన్నారు.ఎన్డీఏ, యూపీఏలు పూర్తి స్థాయి పాలనను అందిచాయని, ఈసారి మాత్రం మూడో కూటమితోనే ప్రభుత్వం ఏర్పడుతుందని పునరుద్ఘాటించారు. -
పొత్తు కుదరలేదనే మాపై ఆరోపణలు: వెంకయ్య
తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నించిందని, అది సఫలం కానందునే తమపై ఆరోపణలు చేస్తోందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాల్లోనూ బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.మూడున్నాళ్ల ముచ్చట ప్రభుత్వాలు వద్దనుకుంటే బీజేపీకి ఓటేయాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. గతంలో కూడా కేంద్రంలో ఒకసారి థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినా అది మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందన్నారు. టీఆర్ఎస్ ను ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలొ అధికారం దిశగానే బీజేపీ యత్నిస్తోందన్నారు. కేంద్రలో సుస్థిరపాలన అందించాలంటే అది ఒక్క బీజేపీకే సాధ్యమన్నారు. టికెట్ల కేటాయింపులో కొన్ని పొరపాట్లు జరిగాయన్నారు. -
'కారు' దారెటు..?
-
ఎన్డీయేతో కలవం...థర్డ్ ఫ్రంట్‌లో చేరతాం
కాంగ్రెస్‌కూ దూరమే కరీంనగర్ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ బీజేపీకి అధికారం కల్ల ఎన్డీయే కూటమికి 200 సీట్లు దాటవు ప్రాంతీయ పార్టీలదే హవా తెలంగాణలో చంద్రబాబుకేం పని ?.. ఇక్కడెందుకు దుకాణం? ఉద్యమానికి అడ్డొచ్చిండు.. ఇప్పుడు తెలంగాణలో లేకుండా పోయిండు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా కరీంనగర్లో టీఆర్ఎస్ ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున సమర శంఖం పూరించారు. సెక్యులరిజం తమ పార్టీ విధాన నిర్ణయమని ఈ సందర్భంగా ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ ఎన్డీయేకు మద్దతు పలుకుతుందని కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. ‘కేంద్రంలో ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే థర్డ్ ఫ్రంట్‌లో భాగస్వామ్యమవుతామే తప్ప ఎన్డీయేలో చేరం. ఇప్పటికే నాతో మమతా బెనర్జీ, జయలలిత, నవీన్‌పట్నాయక్ వంటి చాలా మంది నేతలు మాట్లాడారు. దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వమే రావాలని వారందరూ కోరుకుంటున్నారు. పేరుకే జాతీయ పార్టీలు కానీ.. ప్రాంతీయ పార్టీల కంటే తక్కువనే ఉన్నాయి’ అని టీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యానించారు. ఈసారి దేశంలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి 200 సీట్లు దాటదని జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమి(కాన్ఫెడరేషన్ ఆఫ్ రీజనల్ పార్టీస్) ఒక్కటే ఉపయోగకరంగా ఉంటుందని, ఇతర పార్టీలకు అధికారం దక్కదని రాజకీయ విశ్లేషకులు, నిపుణులెందరో చెబుతూనే ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రంగా ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. ‘ఇక్కడి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు.. భాయీ భాయీగా మెలగాలి. అన్ని మతాల ప్రజలు సామరస్యంగా, సంతోషంగా జీవించాలన్నదే టీఆర్ఎస్ ఆశయం’ అని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ గెలిస్తేనే తమ ఆశలు నెరవేరుతాయని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే పోటీలో ఉన్నామని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయొద్దని తెలంగాణ సమాజమే తనను ఆదేశించిందన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ తలరాతలను తామే రాసుకోబోతున్నారన్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. రేపటి తరానికి జవాబు చెప్పుకోవాల్సి వస్తుందని ఓటర్లను అప్రమత్తం చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కరీంనగర్ పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు. ‘14 ఏళ్ల కిందట ఇదే మైదానంలో తెలంగాణ ఉద్యమ జెండా ఎగరేసి సింహగర్జన సభ నిర్వహించి బయల్దేరిన. అప్పుడు మఘలో పుట్టి, పుబ్బలో పోతుందని చంద్రబాబు మాట్లాడిండు. ఉద్యమానికి ఎదురుంగ వచ్చినోళ్లు ఎందరో పోయిండ్రు. తెలంగాణ రాగానే చంద్రబాబే లేకుండా పోయిండు’ అని కేసీఆర్ ఎద్దేవా చేశా రు. ఆంధ్రోళ్లతో పంచాయితీ ఇంకా అయిపోలేదన్నారు. ‘చంద్రబాబుకు వెంకయ్యనాయడుతో దోస్తానా ఏంది? చంద్రబాబు ఇక్కణ్నే ఉంటా అంటున్నడు. తెలంగాణలో బాబుకేం పని. ఆంధ్రాకు పోక. ఇక్కడెందుకు దుకాణం పెట్టిండు. ఆంధ్ర పార్టీలతోని ఇక్కడేం అవసరం’ అని నిలదీశారు. పొన్నాల ఎన్నటికీ కేసీఆర్ కాలేడు.. టీఆర్ఎస్ మేనిఫెస్టోపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అవాకులు చెవాకులు పేలుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘నువ్ ఎంత అరిచినా.. ఎంత ఎగిరినా.. కేసీఆర్‌వి కాలేవు. నువ్ ఒకటంటే నేను రెండంటా. కేసీఆర్ అరచేతిలో స్వర్గం చూపించిండని.. అవన్నీ చేయాలంటే రూ. 8 లక్షల కోట్లు కావాలని మాట్లాడుతుండు. మీ ప్రభుత్వంలో పావలా ప్రజలకిచ్చి బారణా మింగిండ్రు’ అని టీఆర్ ఎస్ చీఫ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారని విమర్శించారు. బలహీన వర్గాలకు, పేదలకు రూ. 3 లక్షలతో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని, ఇందిరమ్మ ఇళ్ల రుణాలు మాఫీ చేస్తామని, రైతులకు లక్ష రూపాయల వరకు రుణం మాఫీ చేస్తామని, వృద్ధులు వితంతువులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛ న్ ఇస్తామని ఆయన పునరుద్ఘాటించారు. మైనారిటీలకు 12 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడో సంవత్సరం నుంచి 24 గంటల విద్యుత్‌ను అందిస్తామన్నారు. తెలంగాణలోని నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున నీరు అందించడానికి ప్రత్యేక రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపడతామన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటామని భరోసా ఇచ్చారు. ‘భర్తపోయిన బాధ గుండెల్లో ఉన్నా.. తెలంగాణ ఎప్పుడొస్తదని పోలీసు కిష్టయ్య భార్య పద్మావతి నన్ను అడిగింది. ఆమెకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’నంటూ వేదికపై కంట తడి పెట్టిన పద్మను కేసీఆర్ ఓదార్చారు. శ్రీధర్‌బాబు నియంత..: తెలంగాణ ప్రజల కష్టాలు ఎవరికి తెలుసో వారే అధికారంలోకి రావాలని, అందుకే టీఆర్ఎస్ ఎన్నికల బరిలో నిలిచిందని టీఆర్ఎస్ చీఫ్ అన్నారు. ‘తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మంథనిలో కొమురం భీం విగ్రహం పెడుదామని వెళితే.. మంత్రి శ్రీధర్‌బాబు అడ్డుకున్నడు. విగ్రహాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించిండు. ఇప్పటికీ అది పోలీస్ స్టేషన్లనే ఉంది. అటువంటి నియంత.. తెలంగాణ వ్యతిరేకిపై పులి బిడ్డను పోటికి దింపినం’ అని కేసీఆర్ ఆవేశంగా చెప్పారు. జిల్లాలో టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన లోక్‌సభ అభ్యర్థులు వినోద్‌కుమార్, బాల్క సుమన్, అసెంబ్లీ అభ్యర్థులు గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్, విద్యాసాగర్‌రావు, కొప్పుల ఈశ్వర్, సోమారపు సత్యనారాయణ, సతీష్‌బాబు, పుట్ట మధు, బొడిగె శోభ, చెన్నమనేని రమేశ్, డాక్టర్ సంజయ్, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డిని వేదికపై పేరుపేరునా ప్రజలకు పరిచయం చేశారు. వేదిక ఎక్కని కవిత, కేటీఆర్ కేసీఆర్ కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కె.తారకరామారావు, కుమార్తె, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత కరీంనగర్ శంఖారావం వేదికకు దూరంగా జనం మధ్యలో కూర్చున్నారు. కేసీఆర్ అభ్యర్థులను పరిచయం చేస్తున్న సమయంలో సైతం వీరిని వేదికపైకి పిలవలేదు. సభ ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు నేతల ప్రసంగాలు వింటూ వీరిద్దరు జనంలోనే ఉండిపోయారు. నేడు నల్లగొండకు కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సోమవారం నల్లగొండకు వెళ్లనున్నారు. నల్లగొండలో జరిగే సభలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 15న నిజామాబాద్‌లో, 16న వనపర్తి, మహబూబ్‌నగర్‌లోనూ ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
మూన్నాళ్ల ఫ్రంట్!
సంపాదకీయం: ఎన్నికల్లో ప్రజల ఆమోదాన్ని పొందదల్చుకున్న పార్టీకైనా, కూటమికైనా విశ్వసనీయత ముఖ్యం. అది నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని, ఆటుపోట్లెన్ని ఎదురైనా అందుకోసం నిలకడగా పోరాడుతుందని నమ్మకం కుదిరినప్పుడే విశ్వసనీయత లభిస్తుంది. కానీ, తృతీయ ఫ్రంట్ ప్రజల్లో అలాంటి విశ్వసనీయతను కల్పించలేకపోతున్నది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రెండు ప్రధాన కూటములు యూపీఏ, ఎన్డీఏలను ఎదుర్కొంటామని ప్రకటించిన తృతీయ ఫ్రంట్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. అదింకా పూర్తి స్వరూపాన్ని సంతరించుకోకుండానే బీటలువారిన సూచనలు కనబడుతున్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఆదరాబాదరగా ఒకచోట చేరడం, అటుతర్వాత కొన్నాళ్లకే ఆ శిబిరం మాయంకావడం రివాజైంది. కానీ, ఈసారి అందుకు భిన్నంగా ఎన్నికలకు ముందే, పుట్టిన రెండువారాలకే కనుమరుగయ్యే స్థితి ఏర్పడింది. తృతీయ ఫ్రంట్ ఆవిర్భావాన్ని ప్రకటించిన సమావేశానికి డుమ్మా కొట్టిన ఏజీపీ, బీజేడీల్లో ఒక పార్టీ బీజేపీతో పొత్తు కోసం తహతహలాడితే మరొకటి అలాంటి అవకాశానికి తలుపులు తెరిచివుంచింది. ఆ రెండూ బీజేపీతో భవిష్యత్తులో కలిసినడుస్తాయా, లేదా అన్నది వేరే విషయం. కానీ, తృతీయ ఫ్రంట్‌వైపు మాత్రం వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఫ్రంట్‌లో ముఖ్య భాగస్వామిగా ఉండగలదనుకున్న అన్నా డీఎంకే హఠాత్తుగా దారి మార్చుకుంది. వామపక్షాలతో సీట్ల సర్దుబాటు లేదని ప్రకటించింది. సమాజ్‌వాదీ పార్టీ చివరి వరకూ నిలబడుతుందన్న విశ్వాసం ఎవరికీ లేదు. ఇప్పటికే, రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో ఉంచబోమని ప్రకటించి కాంగ్రెస్‌పై ఆ పార్టీ తన భక్తిభావాన్ని చాటుకుంది. ఇక వామపక్షాల్లో ఒకటైన రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ(ఆర్ఎస్పీ) కేరళలో ఒక లోక్‌సభ స్థానం విషయంలో వచ్చిన పేచీతో కాంగ్రెస్‌తో జతకట్టాలని నిర్ణయించింది. ఈ పరిణామాలన్నీ తృతీయ ఫ్రంట్ పునాదులు ఎంత బలహీనంగా ఉన్నాయో చెప్పకనే చెబుతున్నాయి. తృతీయ ఫ్రంట్ పుట్టకముందే ఎన్నో శాపనార్థాలకు గురైంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అది ‘చవకబారు ఫ్రంట్’ అని ఎద్దేవా చేశారు. అందులో కమ్యూనిస్టులు కలిశారు గనుక...తనకు వారితో వివాదం ఉన్నది గనుక తృణమూల్ అధినేత మమతా బెనర్జీ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే, దురదృష్టమేమంటే దృఢమైన అభిప్రాయాలను ప్రకటించగలిగే పార్టీలను సమీకరించలేక వామపక్షాలు ఈ తరహా శాపనార్థాలను నిజం చేస్తున్నాయి. 11 పార్టీలు ఒక వేదికపైకి రావడం, తమది తృతీయ ఫ్రంట్ కాదని...తామే ప్రథమ ఫ్రంట్ అని చెప్పడం ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయితే కావొచ్చుగానీ, అందుకు అవసరమైన కార్యాచరణ బొత్తిగా కొరవడిందని మాత్రం ఈ పరిణామాలన్నీ తెలియజెబుతున్నాయి. తృతీయ ఫ్రంట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురవడానికి అందులో ప్రధాని పదవిపై మోజున్నవారు లెక్కకు మించి ఉండటమే కారణమన్నది బహిరంగ రహస్యం. పైగా, గతంలోవలే రాష్ట్రాల్లో ఏదో ఒక పార్టీ ఆధిపత్యమే ఉండే అవకాశాలు ఇప్పుడు లేవు. పశ్చిమబెంగాల్ ఒకప్పుడు వామపక్షాలకు కంచుకోట. ఇప్పుడక్కడ మమతా బెనర్జీ బలపడ్డారు. కనుక వామపక్షాల పలుకుబడి జాతీయస్థాయిలో ఇదివరకు ఉన్నట్టే ఇప్పుడూ ఉండటం సాధ్యంకాదు. వామపక్షాలతో కలిసి నడుస్తామని ప్రకటించిన ఎస్పీ, జేడీ(యూ)లు ఆ పార్టీలతో సీట్ల సర్దుబాటు విష యంలో ఉత్సాహం చూపకపోవడం ఇందుకు ఉదాహరణ. బీహార్‌లో సీపీఐకి రెండు లోక్‌సభ స్థానాలివ్వడానికి సిద్ధపడిన జేడీ(యూ)... సీపీఎం అడిగిన ఒక స్థానం ఉజియార్పూర్ ఇవ్వడానికి ససేమిరా అంటు న్నది. బెంగళూరులో ఫ్రంట్ తలపెట్టిన భారీ ర్యాలీ ఏ కారణంవల్లనో వాయిదాపడింది. తృతీయ ఫ్రంట్ కాక, తమ ఫెడరల్ ఫ్రంట్ మాత్రమే భవిష్యత్తు రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని మమతా బెనర్జీ లోగడే చెప్పారు. అందుకోసమనే ప్రధాని పదవికి జయలలిత అన్నివిధాలా అర్హురాలని ప్రకటించి ఆమెను తృతీయ ఫ్రంట్నుంచి బయటకు సుకురాగలిగారు. అయితే, తృతీయ ఫ్రంట్ ఆవిర్భావానికి ఇలా అవాంతరాలు ఎదురవుతున్నంత మాత్రాన అసలు జాతీయ స్థాయిలో మరో కూటమికి అవకాశం లేదని చెప్పలేం. ప్రధాన జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు రెండూ పలు రాష్ట్రాల్లో బలహీనపడ్డాయి. ఆ మేరకు కొత్త శక్తులు పుంజుకున్నాయి. ఒదిశాలో బీజేడీ, మన రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ బలంగా ఉంటే, ఢిల్లీ వంటిచోట ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భ వించింది. హర్యానాలో ఐఎన్ఎల్డీ, హర్యానా జనహిత్ కాంగ్రెస్... కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ...పంజాబ్‌లో అకాలీదళ్... మహా రాష్ట్రలో శివసేన, ఎంఎన్ఎస్,ఎన్సీపీ...యూపీలో ఎస్పీ, బీఎస్పీ...అస్సాంలో ఏజీపీ, ఏయూడీఎఫ్, బీపీఎఫ్ వంటివి ఆదరిస్తేనే జాతీయ పార్టీలకు అంతో ఇంతో మనుగడ ఉంటుంది. భిన్న పరి స్థితుల్లో, విభిన్నమైన ప్రయోజనాలకోసం, ప్రాంతీయ ఆకాంక్షల కోసం ఆవిర్భవించిన పార్టీలను ఉపేక్షించి, వాటి డిమాండ్లను కాదని జాతీయ పార్టీలు రెండూ అధికారాన్ని అందుకోవడం సాధ్యంకాదు. కనుక జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తున్నా రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. రెండు కూటములకూ వెలుపల ఉండే పార్టీలు చాలాచోట్ల విజయం సాధించడమే కాదు...జాతీయ స్థాయిలో అవి కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయి. కనుక ప్రతిసారీ ఎన్నికల అనం తరం ముగిసిపోయే తృతీయ ఫ్రంట్ కథ ఇప్పుడు ఎన్నికలకు ముందే పూర్తయినట్టు కనబడుతున్నా యూపీఏ, ఎన్డీఏలు ఏమరు పాటుగా ఉండటం సాధ్యంకాదు. -
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ !
ఇటు యూపీఏ, అటు ఎన్డీయే... లేదంటే థర్డ్ ఫ్రంట్ జత కట్టేందుకు లాభనష్టాలు బేరీజు వేస్తున్న పార్టీలు కాంగ్రెస్‌తో జతకట్టిన ఎన్సీ, ఎన్సీపీ బీజేపీతో సేన, అకాళీదళ్, ఎల్జేపీ పొత్తు సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరం ప్రాంతీయ పార్టీల సమాహారంగా మారనుంది. ఈ సమర భేరిలో ఏ పార్టీ ఏ పక్షాన చేరుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే కొన్ని పార్టీలు కాంగ్రెస్‌తో, కొన్ని బీజేపీతో, మరికొన్ని మూడో కూటమి (థర్డ్ ఫ్రంట్)గా జతకట్టాయి. మరో పది, పదిహేను రోజులకల్లా పార్టీలన్నీ గీతకు కుడి వైపో, ఎడమ వైపో చేరనున్నాయి. కొన్ని ఒంటరిగా పోటీకి దిగినా ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసే కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక సర్వేలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ముందంజలో ఉందని వెల్లడించగా.. వాటిని నమ్మొద్దని, 2004, 2009 ఎన్నికల వేళ కూడా ఇదే రీతిలో సర్వేలు వెలువడ్డాయని కాంగ్రెస్ చెబుతోంది. 2004లో 145 సీట్లు, 2009లో 206 సీట్లు సాధించిన కాంగ్రెస్... యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహించి పదేళ్లు పాలించింది. బీజేపీకి 2004లో 138, 2009లో 116 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు కూడా సొంతంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించట్లేదు. అందువల్ల అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ ప్రాంతీయ పార్టీలను, చిన్న జాతీయపార్టీలను ఆకర్షించే పనిలో పడ్డాయి. అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడితే ప్రభుత్వ ఏర్పాటు సులువవుతుందని భావిస్తున్నాయి. కనీసం 160 నుంచి 180 సీట్లు సొంతంగా సాధిస్తే ఆ దిశగా అడుగులేయవచ్చని రెండు పార్టీలూ భావిస్తున్నాయి. కానీ ప్రాంతీయ పార్టీలు సహా చిన్నచిన్న జాతీయపార్టీలు కూడా తాము ప్రాతినిథ్యం వహించే ప్రాంతాలకు గరిష్ట ప్రయోజనం సాధించుకునేందుకు గాను ఎన్నికల అనంతరమే తాము ఏ కూటమిలో చేరాలన్న నిర్ణయం తీసుకోవాలని వ్యూహరచన చేస్తున్నాయి. ఎవరు ఎటు వైపు? ఈసారి ఎన్నికల బరిలోకి దిగినవాటిలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, ఎన్సీపీ, శివసేన, డీఎంకే, ఏడీఎంకే, జేడీయూ, బీజేడీ, ఆర్జేడీ, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎండీఎంకే, పీఎంకే, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఏజీపీ, జేఎంఎం, శిరోమణి అకాళీదళ్, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఉన్నాయి. వీటిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్జేడీతో పొత్తులు కుదుర్చుకుంది. మరోవైపు బీజేపీతో శివసేన, శిరోమణి అకాళీదళ్, ఎల్జేపీ పొత్తులు కుదుర్చుకున్నాయి. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో చేరే అవకాశం ఉన్న పార్టీల్లో ఆర్ఎల్డీ, జేఎంఎం, ముస్లింలీగ్, కేరళ కాంగ్రెస్ తదితర పార్టీలు ఉన్నాయి. ఎన్నికల అనంతరం ఎన్డీఏలో పీఎంకే, ఎండీఎంకే, డీఎండీకే తదితర పార్టీలు చేరే అవకాశం ఉంది. అయితే ఇవి ఎన్నికలకు ముందే పొత్తులు కుదర్చుకునే పనిలో పడ్డాయి. మరోవైపు జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే మూడో కూటమికి వామపక్షాలు గురువారం రాంరాం చెప్పేశాయి. దీంతో అన్నాడీఎంకే ఎన్డీయేతో జట్టుకట్టే అవకాశాలు ఉన్నాయి. నరేంద్ర మోడీతో సత్సంబంధాలే జయలలితను ఎన్డీయే వైపు మళ్లిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేడీ నేత నవీన్ పట్నాయక్ సైతం మూడో కూటమి విఫలమైతే ఎన్డీయే పక్షానే చేరనున్నారు. ఇక మరో కీలకపార్టీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మూడో కూటమి విఫలమైతే యూపీఏ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల అనంతరం ఎన్డీయే వైపు మొగ్గే చూపవచ్చు. మూడో ఫ్రంట్ ముచ్చట... నాలుగు వామపక్ష పార్టీలు, ఎస్పీ, జేడీ(యూ), జేడీ(ఎస్), జేవీఎం తదితర పార్టీలు మూడో కూటమిగా జతకట్టాయి. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలన్నీ థర్డ్ ఫ్రంట్‌గా బరిలో నిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా పలు పార్టీలు ప్రయత్నిస్తున్నా అదొక తీరని కలగానే ఉంది. ఇటీవలే 11 పార్టీలతో కూడిన థర్డ్ ఫ్రంట్ సమావేశం జరిగింది. అయితే ఎన్నికల నాటికి దీని స్వరూపం ఎలా ఉండబోతోంది? ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంటుందా? అన్న అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటివరకు పొత్తులు పెట్టుకోని పలు పార్టీలు... ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే అటు వెళ్లేందుకే ఆసక్తి చూపించే అవకాశం ఉంది. -
థర్డ్ ఫ్రంట్ పార్కింగ్ ప్లేస్ లాంటింది: వెంకయ్య
దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ పార్కింగ్ ప్లేస్ లాంటిదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. థర్డ్ ఫ్రంట్ లోకి పార్టీలు వచ్చి పోయే పార్టీలే ఉంటాయన్నారు. థర్డ్ ఫ్రంట్ వల్ల ప్రభుత్వ ఏర్పాటు జరగదని.. అదోక ఎండమావి అని వెంకయ్య అన్నారు. థర్డ్ ఫ్రంట్ ను నడిపించే నేత లేరని, అందులో ప్రతి ఒక్కరు ప్రధాని కావాలనే ఆశతో ఉన్నారని ఆయన అన్నారు. యూపీఏ లో జరిగిన అవినీతిలో థర్డ్ ఫ్రంట్ పార్టీలు కూడా భాగస్వాములేనని ఆరోపించారు. థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్న లెఫ్ట్, సమాజ్ వాదీ పార్టీ యూపీఏ-1, యూపీఏ-2లో భాగస్వాములేనని ఆయన అన్నారు. కోల్ కతాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. -
థర్డ్ ఫ్రంట్‌ను చూస్తే మోడీకి జ్వరం: నారాయణ
సాక్షి, విజయవాడ: మూడో ఫ్రంట్‌ను చూస్తే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి జ్వరం వస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. మంగళవారం విజయవాడలోని వేదిక కల్యాణ మంటపంలో ‘నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి’ పై రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన నారాయణ తనను కలిసిన విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తులు పెట్టుకునేందుకు ఏ ప్రాంతీయ పార్టీలు ముందుకు రావడం లేదని వివరించారు. ఈనెల 8, 9 తేదీలలో ఢిల్లీలో జరిగే జాతీయ సదస్సులో ఈ అంశాన్ని చర్చిస్తామని తెలిపారు. రాష్ట్ర సదస్సు సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని 2000 సంవత్సరంలోనే వరంగల్ డిక్లరేషన్‌లో పేర్కొన్నామనీ, అయితే కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదన్నారు. ఆ డిక్లరేషన్ అమలుచేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదన్నారు. విభజన జరగడానికి ముందే సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందన్నారు. సీడబ్యూసీ నిర్ణయం రాగానే ఇదే విషయం తాను కిరణ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని, అయితే చివర బంతి వరకు అవకాశం ఉందంటూ ఈ ప్రాంత ప్రయోజనాలను విస్మరించారని ఆరోపించారు. రాజ్యసభలో ప్రధాని హామీ ఇచ్చినంత మాత్రాన సరిపోదని, ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిన రాష్ట్రాల్లో సైతం అభివృద్ధి నామమాత్రంగానే ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కొన్ని అంతరాష్ట్ర సమస్యలు వస్తున్నాయని వాటిని అధిగమించి, ప్రాజెక్టు నిర్మించి తీరాల్సిందేనన్నారు. ఈప్రాజెక్టు వల్ల ముంపు బాధితులకు ప్రత్యామ్నాయం చూపించాలన్నారు. ఉత్తరాంధ్రలోని పెండింగ్ నీటి పారుదల ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాడానికి వీలుగా ఒడిశాతో ఉన్న విభేదాలు పరిష్కరించాలని సూచించారు. మొదటి సంవత్సరం లోటు బడ్జెట్‌ను కేంద్రమే పూర్తి చేస్తుందని హామీ ఇచ్చిందని, దాన్ని అమలు చేసుకోవాలని, రానున్న ఐదు సంవత్సరాలు లోటు బడ్జెట్‌ను కేంద్రమే భరించాలని నారాయణ డిమాండ్ చేశారు. ప్రయివేటు పరిశ్రమలను ఆకర్షించేందుకు పది సంవత్సరాలు టాక్స్ హాలిడే ప్రకటించాలని, ఎక్సైజ్, ఆదాయ పన్నుల్లో నూరు శాతం మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని ఏర్పాటుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరించాలని, దీన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని సూచించారు. రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలనే అంశంపై తమ పార్టీలో చర్చించిన తరువాత ప్రకటిస్తామన్నారు. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని, తీరప్రాంత పర్యాటక కేంద్రాలను నెలకొల్పాలని సూచించారు. ఈ సమావేశంలో నూతన ఆంధ్రప్రదేశ్‌కు తయారు చేసిన ముసాయిదా తీర్మానాన్ని చర్చించి ఆమోదించారు. సమావేశంలో 13 జిల్లాలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
తృతీయ ఫ్రంట్ వల్ల దేశానికి హాని: మోడీ
దేశ రాజకీయాల్లో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తృతీయ ఫ్రంట్ ఏర్పాటు వల్ల దేశ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాన్ని మోడీ వ్యక్తం చేశారు. తృతీయ ఫ్రంట్ వల్ల దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని మోడీ హెచ్చరించారు. దేశ ప్రజల ఆలోచనలకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలనే అభిప్రాయాన్ని మోడీ వ్యక్తం చేశారు. రాజకీయ అవకాశవాదులు కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూర్చే విధంగా ప్రయత్నిస్తున్నారని మోడీ ఆరోపించారు. -
'ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తాం'
-
'ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తాం'
న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా కేంద్రంలో మూడో కూటమి అడుగులు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 11 పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తెలిపారు. మూడో కూటమి సమావేశం ముగిసిన తర్వాత శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలన్నీ ఇవాళ సమావేశమయ్యాయని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ విధానాల్లో పెద్ద తేడా లేదన్నారు. యూపీఏ పాలన అవినీతిమయమైందని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ అవినీతి పెచ్చురిల్లిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ఓడించడమే తమ ధ్యేయమన్నారు. ఎన్నికల తర్వాత మూడో కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని కారత్ తెలిపారు. ములాయం, జయలలిత, నితీష్ కుమార్ పేర్లు ప్రధాని అభ్యర్థులుగా చర్చకు వచ్చినట్టు సమాచారం. థర్డ్ ఫ్రంట్ భేటీకి బీజేడీ, ఏజీపీ, జేవీఎం దూరంగా ఉన్నాయి. -
కాంగ్రెస్ రక్షించడమే థర్డ్ ఫ్రంట్ ఎజెండా: మోడీ
మూడవ కూటమి(థర్డ్ ఫ్రంట్) ఏర్పాటు కోసం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కసరత్తుపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిగిపోతున్న కాంగ్రెస్ పార్టీని రక్షించడానికే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు జరుగుతోంది అని మోడీ విమర్శించారు. ఒడిశాలోని భువనేశ్వర్ లో జరిగిన ఓ బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అలాంటి ఫ్రంట్ లు ఏర్పడితే. .కాంగ్రెస్ పార్టీకి మాత్రమే లాభం జరుగుతుంది అని అన్నారు. భారత దేశంలో ఇతర ప్రాంతాలు అభివృద్ది చెందినంతగా ఒడిశా ప్రాంతం, తూర్పు ప్రాంతాలు అభివృద్ది చెందలేదని ఆయన అన్నారు. మీ ప్రాంతం బాగుపడాలంటే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న పార్టీలకు గుణపాఠం నేర్పాలని మోడీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎప్పుడ కష్టాల్లో ఉన్నా.. థర్డ్ ఫ్రంట్ రంగంలోకి దిగితుందని ఆయన ఆరోపించారు. థర్డ్ ఫ్రంట్ తో భారత రాజకీయాలు ప్రక్షాళన జరగవు అని అన్నారు. -
మూడో కూటమికి ఈ నెలలోనే రూపురేఖలు: కారత్
-
లెఫ్ట్ నేతలతో నితీష్ మంతనాలు
న్యూఢిల్లీ: కేంద్రంలో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నివాసంలో సీపీఎం, సీపీఐ, జేడీయూ నేతలు సమావేశమయ్యారు. ప్రకాష్ కారత్, ఏబీ బర్దన్లతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు నేతలు మామూలుగా కలిసారని, ఇది అధికారిక భేటీ కాదని నితీష్ కుమార్ తెలిపారు. త్వరలోనే అధికారికంగా సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత 11 పార్టీలు సమావేశమయి మూడో ఫ్రంట్ చర్చిస్తాయని దేవెగౌడ తెలిపారు. ఈ నెలాఖరు నాటికి మూడో ఫ్రంట్‌కు రూపురేఖలు వస్తాయని ప్రకాష్ కారత్ అన్నారు. -
వాటి నిర్వాకం వల్లే మూడో కూటమి అవసరం
న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీల గందరగోళ విధానాలతో దేశం ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా తృతీయ కూటమిని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ తెలిపారు. ఆ కూటమి ఏర్పాటుకు నాయకత్వ అంశం సమస్య కాబోదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దేశంలో సృష్టించిన పరిస్థితుల వల్ల అవినీతి, నిరుద్యోగం వంటి అసలు సమస్యలు మరుగున పడిపోయాయని, ఏది సరైందో, ఏది సరికాదో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. శనివారమిక్కడ వివిధ రాష్ట్రాల జేడీయూ శాఖల నేతలతో సమావేశమైన శరద్ యాదవ్ అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మూడో కూటమి ప్రధాని అభ్యర్థి అంశాన్ని ప్రస్తావించగా.. ‘మావెంట లేని ఆ రెండు పార్టీల్లో(కాంగ్రెస్, బీజేపీ) ఆ సమస్య ఉండొచ్చు.. యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే మేం వీపీ సింగ్ పేరును ప్రకటించలేదు. ఇప్పుడెందుకు ఆ సమస్య వస్తుంది?’ అని అన్నారు. థర్డ్ ఫ్రంట్‌తో దేశం అధోగతికి చేరుతుందన్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురించి ప్రస్తావిస్తూ.. ‘ఆయనకు ప్రధాని కావాలని ఉబలాటంగా ఉంటే ఎర్రకోట నమూనాను వెనక ఉంచుకుని, పీఏ సంగ్మా(ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి) ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసుకోవాలి’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి రావని, మోడీ ప్రధాని కారని అన్నారు. -
పీఎం రేసులో దేవెగౌడ లేరు
మైసూరు, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల అనంతరం తృతీయ ఫ్రంట్ అధికారంలోకి వస్తే మాజీ ప్రధాని హెచ్డీ. దేవెగౌడ ప్రధాని అభ్యర్థి కాబోరని ఆయన తనయుడు, జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్డీ. కుమారస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ తృతీయ ఫ్రంటు పునరుత్థానం కోసం దేవెగౌడ ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయన ప్రధాని అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారంపై ‘ఆలు లేదు చూలు లేదు...’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరమే ప్రధాని ఎవరనేది తేలుతుందని చెప్పారు. ఎన్నికల్లో దేవెగౌడ హాసన నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. వేరే నియోజక వర్గం నుంచి పోటీ చేసే ఆలోచన లేదన్నారు. కాగా బెంగళూరులో ఎమ్మెల్యేలకు జీ కేటగిరీ ఇంటిస్థలాల పంపకంపై ప్రభుత్వం సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూ కుంభకోణాలతో పాటు జీ కేటగిరీ నివేశనాలపై దర్యాప్తు జరిపించాల్సిందిగా ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ ఇంటి స్థలాల కేటాయింపులో ఎమ్మెల్యేల కంటే అధికారుల హస్త లాఘవమే అధికంగా కనిపిస్తోందని ఆరోపించారు. -
'థర్డ్ ఫ్రంట్ కు విధానాల్లేవు..నాయకుడూ లేడు'
ఆమ్ ఆద్మీ పార్టీ సిద్దాంతాలను గాలికి వదిలి.. దారి తప్పుతోందని యోగా గురువు రాందేవ్ బాబా విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆతర్వాత ఆపార్టీతో పొత్తును కుదుర్చుకోవడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ చేతుల్లో 'చిపిరి కట్ట'ను పెట్టిన ఆమ్ ఆద్మీ తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోక తప్పదని ఆయన అన్నారు. అవినీతి నిర్మూలన, వ్యవస్థను మార్చేస్తాం అనే నినాదాలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ తన సిద్దాంతాలకు దూరమైందని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు అని రాందేవ్ అన్నారు. ఎన్నికల తర్వాత భారత రాజకీయాల్లో తృతీయ ఫ్రంట్ అవిర్భావంపై పెదవి విరిచారు. తృతీయ ఫ్రంట్ కు విధానాల్లేవని.. అంతేకాకుండా సరియైన నాయకత్వం కూడా లేకపోవడమే ప్రధాన లోపం అని ఆయన వ్యాఖ్యానించారు. లోకసభ ఎన్నికలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ విజయానికి మద్దతుగా మార్చి 23 తేదిన న్యూఢిల్లీలో లక్షలాది మందితో యోగా క్యాంప్ ను నిర్వహిస్తానని రాందేవ్ తెలిపారు. -
‘మూడు’ కోసం 11
పదకొండు జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కూటమి ఒక్కతాటిపైకి కాంగ్రెసేతర, బీజేపీయేతర పక్షాలు కూటమిలో వామపక్షాలు, ఎస్పీ, జేడీయూ, బీజేడీ, అన్నాడీఎంకే త్వరలో కార్యాచరణ ప్రణాళిక: శరద్ యాదవ్ న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జాతీయ స్థాయిలో యూపీఏ, ఎన్డీఏలకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటానికి చేతులు కలుపుతున్నట్టు 11 కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు ప్రకటించాయి. ‘ప్రజానుకూల, మతవాద వ్యతిరేక, సమాఖ్య ఎజెండా’ సాధన కోసం తామంతా ఒక్కతాటిపైకి వస్తున్నట్టు బుధవారం ఢిల్లీలో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి మరీ పేర్కొన్నాయి. ప్రజా సమస్యలపై ఇకనుంచి పార్లమెంటులో సంయుక్తంగా గళమెత్తుతామంటూ కీలక ప్రకటన చేశాయి. సమాజ్‌వాదీ, సీపీఐ, సీపీఎం, ఆరెస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, జేడీ(యూ), అన్నాడీఎంకే, అస్సాం గణపరిషత్, జార్ఖండ్ వికాస్ మోర్చా, జేడీ(ఎస్), బిజూ జనతాదళ్ పార్టీల నేతలు ఇందులో పాల్గొన్నారు. లోక్‌సభలో సంయుక్తంగా 92 స్థానాలున్న ఈ 11 జాతీయ, ప్రాంతీ పార్టీలు ఇలా ఒక్కతాటిపైకి రావడాన్ని కీలక పరిణామంగా పరిగణిస్తున్నారు. తమ లక్ష్యసాధనలో ఇది తొలి అడుగని జేడీయూ అధినేత శరద్ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరి విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రెండో దశలో ప్రజల జీవనోపాధి, అవినీతిపై పోరాటం, లౌకిక-ప్రజాస్వామిక పునాదులను పటిష్టపరచడం తదితర లక్ష్యాలతో సంయుక్త కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. తమ భావి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అందుకోసం త్వరలో సమావేశమవుతామని చెప్పారు. ఈశాన్య ప్రాంతాల వారి భద్రత, తమిళ జాలర్లు మొదలుకుని తుపాన్లు, తెలంగాణ దాకా అన్ని అంశాలతో కూడిన అజెండాను త్వరలో రూపొందిస్తామని ప్రకటించారు. దీన్ని మూడో ఫ్రంట్‌గా పరిగణించవచ్చా అని ప్రశ్నించగా, అలా సొంత అర్థాలు తీయొద్దని ఏచూరి బదులిచ్చారు. ప్రజా సమస్యలను పార్లమెంటు లో ప్రస్తావించడమే ప్రాథమికంగా తమ కూటమి లక్ష్యమన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపును ప్రస్తావించగా, ‘ఫలానా పార్టీతో, నాయకునితో సంప్రదింపుల్లో ఉన్నామంటూ ఎవరేం చెబుతున్నా అవన్నీ వారి మాటలు మాత్రమే. కానీ మేం మాత్రం అలా కాదు. సమైక్యంగా మీడియా ముందుకొచ్చి మీ కళ్లముందే కూర్చున్నాం’ అని బదులిచ్చారు. విలేకరుల సమావేశంలో శరద్ యాదవ్, ఏచూరిలతో పాటు మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (జేడీఎస్), డి.రాజా (సీపీఐ), రామ్‌గోపాల్ యాదవ్ (ఎస్పీ), వాసుదేవ్ ఆచార్య (సీపీఎం), ఎం.తంబిదురై (అన్నాడీఎంకే), కేసీ త్యాగి (జేడీయూ), జై పండా (బీజేడీ), బీరేన్ బైశ్య (ఏజీపీ), మనోహర్ తిర్కీ (ఆర్ఎస్పీ), బరుణ్ ముఖర్జీ (ఫార్వర్డ్ బ్లాక్) పాల్గొన్నారు. గతంలో పరస్పరం మోసగించుకున్న చరిత్ర ఉన్న పార్టీల కలయికతో ఏర్పడ్డ ఈ కొత్త కూటమి భవితవ్యం ఎలా ఉండవచ్చని ప్రశ్నిం చగా, చరిత్ర పునరావృతం కావాలని ఏమీ లేదు కదా అని సీపీఐ నేత గురుదాస్ దాస్ గుప్తా బదులిచ్చారు. చర్చలకు అన్నాడీఎంకే ప్యానల్ రానున్న లోక్‌సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు కోసం భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరిపేందుకు నలుగురు సభ్యుల ప్యానల్‌ను అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలిత ఏర్పాటు చేశారు. సీపీఐ, సీపీఎంతో పొత్తుంటుందని ఆమె ప్రకటించడం తెలిసిందే. వ్యక్తులు కాదు... నితీశ్: 11 పార్టీల కొత్త కూటమిలో వ్యక్తులు ముఖ్యం కాదని బీహార్ సీఎం, జేడీయూ కీలక నేత నితీశ్‌కుమార్ అన్నారు. అంశాలకు, కార్యక్రమాలకే ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు. వృథా ప్రయాస: బీజేపీ 11 పార్టీల కూటమిని వ్యర్థ ప్రయాసగా బీజేపీ అభివర్ణించింది. ఇది లోక్‌సభ ఎన్నికలకు ముందు నిత్యం జరిగే తంతేనంటూ పెదవి విరిచింది. పెళ్లికి ముందు జరిగే తప్పనిసరి తంతు ఎలాంటిదో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదీ అలాంటిదేనని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రజల విశ్వాసం కోల్పోయిన వారి వృథా ప్రయత్నమిది. మూడో ఫ్రంట్ అన్నది గతించిన చరిత్రే’’ అన్నారు. యూపీఏకు ఢోకా లేదు: కాంగ్రెస్ కొత్త కూటమి యత్నాలను కాంగ్రెస్ తేలిగ్గా కొట్టిపారేసింది. దానితో యూపీఏకు వచ్చిన ముప్పేమీ లేదని అభిప్రాయపడింది. ‘అవినీతి బిల్లుల’ను అడ్డుకుంటాం: సీపీఎం న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల్లో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టజూస్తున్న ఆరు అవినీతి వ్యతిరేక బిల్లులు ఆమోదం పొందకుండా అడ్డుకుంటామని సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రకటించారు. అవే కాదని, ఏ బిల్లు కూడా గందరగోళం మధ్య ఆమోదం పొందకుండా ఉండేలా తమ 11 పార్టీలూ కృషి చేస్తాయని చెప్పారు. ‘లేదంటే ఈ బిల్లుల ఆమోదాన్ని పాలక కాంగ్రెస్ కూటమి తమ ఎన్నికల ప్రచారానికి ప్రారంభంగా వాడుకుంటుంది! మేమందుకు అనుమతించబోం’ అని స్పష్టం చేశారు. ‘‘నిజానికి ఆ బిల్లులను ఆమోదించాలని మేం చాలాకాలంగా కోరుతున్నాం. యూపీఏ దాన్ని పట్టించుకోకుండా, ఇప్పుడు ఎన్నికల వేళ నాటకాలాడుతోంది. వాటిపై కూలంకషంగా చర్చ జరగాలి. అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పాలక పక్షానిదే. కానీ తెలంగాణపై కాంగ్రె స్ ఎంపీలతో పాటు ఏకంగా మంత్రులు కూడా సభలో కార్యకలాపాలను అడ్డుకోవడాన్ని మనమంతా చూశాం’’ అన్నారు. -
మూడో కూటమితో దేశం పాతాళానికి: మోడీ
కోల్‌కతా: మూడో కూటమి దేశాన్ని పాతాళానికి తీసుకెళ్తుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. కోల్‌కతాలో బుధవారం నిర్వహించిన నరేంద్రమోడీ జనచేతన బహిరంగ సభకు జనం భారీగా హజరయ్యారు. ఈ సభలో మోడీ మాట్లాడుతూ.. గాలి ఎటువైపు వీస్తుందో మూడో కూటమి గమనించాలని అన్నారు. 2014 ఎన్నికల్లో రాజకీయ పండితులు ఊహించని ఫలితాలను చూస్తామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు ఇక చాలనుకుంటున్నారని మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో సీనియర్ అయిన ప్రణబ్ ముఖర్జీనీ కాకుండా మన్మోహన్ సింగ్‌ను ఎందుకు ప్రధానిని చేసిందని నిలదీశారు. ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉండాలన్నది స్వామి వివేకానందుడి కలని పేర్కొన్నారు. గుజరాత్, బెంగాల్ మధ్య అవినాభావ సంబంధం ఉందంటూ వారి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు. గుజరాత్లో జౌళి పరిశ్రమ అభివృద్ధిలో రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడి పాత్ర మరువలేమని మోడీ చెప్పారు. రవీంద్రుడు చాలా కాలం గుజరాత్‌లోనే ఉన్నారని గుర్తు చేశారు. బెంగాల్ ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. పశ్చిమబెంగాల్ ప్రజలు ఎంతో చైతన్యవంతులని ప్రశంసించారు. -
పార్లమెంట్లో థర్డ్ ఫ్రంట్ సమావేశం
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు పేర్కొనడంతో వివిధ పార్టీల నేతలు థర్డ్ ఫ్రంట్‌పై దృష్టిసారిస్తున్నారు. పార్లమెంట్లో బుధవారం పలువురు అగ్రనాయకులు సమావేశమై చర్చలు జరిపారు. మాజీ ప్రధాని దేవేగౌడ, సీపీఎం నేత సీతారాం ఏచూరి, జేడీయూ నాయకుడు శరద్ యాదవ్‌తో పాటు రాంగోపాల్, తంబిదురై తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికార యూపీఏ, ఎన్డీయేత పార్టీల నేతలు హాజరయ్యారు. నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుందుకు తగిన మెజార్టీ లభించకపోవచ్చని సర్వేలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇతర పార్టీలు కలిసొస్తే అవకాశాలుంటాయని పేర్కొన్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింటుందని సర్వేలు వెల్లడించాయి. -
థర్డ్ ఫ్రంటే లక్ష్యం!
సాక్షి, చెన్నై:లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటి పీఎం పీఠం కైవశం చేసుకోవాలన్న లక్ష్యంతో సీఎం జయలలిత ఉన్నారు. ఆ పార్టీ శ్రేణులు ఇదే నినాదంతో ముందుకెళుతున్నారు. తమ అధినేత్రిని ప్రధాని పదవిలో కూర్చోబెట్టడం తమ కర్తవ్యంగా ప్రతిన బూని మరీ ప్రజల్ని ఆకర్షించే పనిలో ఉన్నారు. రాష్ర్ట ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు శరవేగంగా పంపిణీ చేస్తూ వస్తున్నారు. 40 సీట్లను ఒంటరిగా కైవశం చేసుకోవాలని తొలుత భావించినా, అందుకు తగ్గ పరిస్థితులు రాష్ట్రంలో చోటు చేసుకుంటాయో లేదో అన్న సందిగ్ధంలో అన్నాడీఎంకే వర్గాలు పడ్డాయి. ఇదే విషయాన్ని కొందరు సీనియర్లు జయలలిత దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. వారి సూచనను పునరాలోచించిన జయలలిత కూటమికి అంగీకరించినట్టు తెలుస్తోంది. తొలుత కూటమి ఎవరితో అన్న మల్లగుల్లాలు పడ్డా, రాష్ట్రంలో సీపీఎం, సీపీఐలకు కార్మిక ఓటు బ్యాంకు ఉండటం, అదే సమయంలో జాతీయ స్థాయిలో మూడో కూటమికి ప్రయత్నాలు వేగవంతం కాడంతో పొత్తుకు సిద్ధమయ్యారు. వామపక్షాల్ని రాష్ట్రంలో ఆదరిస్తే, జాతీయ స్థాయిలో ఎన్నికల అనంతరం నెలకొనే పరిస్థితుల మేరకు తనకు ఆదరణ దక్కుతుందన్న విషయాన్ని గ్రహించారు. అందుకే థర్డ్ ఫ్రంట్ గెలుపు లక్ష్యంగా ఎన్నికల్లో దూసుకెళ్లేందుకు సిద్ధం అయ్యారు. పొత్తు: కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో లౌకిక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు శుక్రవారం సీపీఎం జాతీయ నేత కారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ బాటలో నడిచేందుకు సిద్ధ పడ్డ జయలలిత సీపీఐ నాయకులకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. జయలలిత తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోనున్నారన్న సంకేతంతో హుటాహుటిన ఢిల్లీ నుంచి జాతీయనాయకులు సుధాకర్ రెడ్డి, బర్దన్ చెన్నై చేరుకుని గంటపాటుగా జయలలితతో భేటీ అయ్యారు. ప్రధానంగా థర్డ్ ఫ్రంట్ ఆవిర్భావం లక్ష్యంగానే ఈ భేటీ సాగినట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో సీపీఐని తన కూటమిలోకి చేర్చుకోవడంతో పాటుగా, జాతీయ స్థాయిలో థర్డ్‌ఫ్రంట్‌లో చక్రం తిప్పడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో సీపీఐకి సీట్ల కేటాయింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే విషయాన్ని ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శి టీ పాండియన్ ప్రకటించారు. థర్డ్ ఫ్రంట్ లక్ష్యంగానే భేటీ సాగిందని, ఆ కూటమిలో గెలుపు ధ్యేయంగా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సీట్ల పందేరంపై ఎలాంటి చర్చ జరపలేదన్నారు. సీపీఐ పొత్తు ఖరారు చేసుకుందో లేదో, సీపీఎం జాతీయ నాయకులు రంగంలోకి దిగారు. సోమవారం పోయస్ గార్డెన్ తలుపులు తెరచుకోవడంతో చర్చలు విజయవంతం అయ్యాయి. సీపీఎంతోనూ ఒకే : ఆదివారం సీపీఐను తన కూటమిలోకి ఆహ్వానించిన జయలలిత సోమవారం సీపీఎంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణన్, ఎంపీ టికే రంగరాజన్లు మధ్యాహ్నం పోయస్ గార్డెన్‌కు వెళ్లారు. సుమారు గంట పాటుగా థర్డ్‌ఫ్రంట్ ఆవిర్భావం లక్ష్యంగా భేటీ సాగింది. భేటీ అనంతరం పొత్తు కుదిరిందంటూ జయలలిత, కారత్ ప్రకటించారు. పీఎం కుర్చీతో పనిలేదు: కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కూటమి ఆవిర్భావానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రకాష్‌కారత్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో లౌకిక ప్రత్యామ్నాయంలోకి రాబోతున్న పార్టీల వివరాల్ని ఇప్పుడే ప్రకటించబోమన్నారు. ఎన్నికల నాటికి ఆ పార్టీలను ప్రకటిస్తామన్నారు. ప్రత్యామ్నాయ రాజాకీయ శక్తిగా తమ కూటమి అవతరించబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. లౌకిక ప్రత్యామ్నాయ కూటమి అధికారంలోకి వస్తే, పీఎం అభ్యర్థి ఎవరో అని కారత్ను మీడియా ప్రశ్నించగా, సీఎం జయలలిత జోక్యం చేసుకున్నారు. పీఎం ఎవరన్నది ఇప్పుడు ముఖ్యం కాదని, జాతీయ స్థాయిలో గెలుపు లక్ష్యంగా పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం పీఎం కుర్చీ గురించి చర్చించుకుంటామని, ఇప్పుడు ఆ ప్రస్తావనకు చోటు లేదని దాట వేశారు. ఆదివారం బర్దన్ మీడియాతో మాట్లాడుతూ, తాము గెలిస్తే, జయలలిత ప్రధాని అయ్యేందుకు సహకరిస్తామని పేర్కొనడం గమనార్హం. -
మూడో కూటమి కోసం ముమ్మరంగా!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో.. మూడో ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఎన్నికల తరువాత కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదన్న అంచనాల నేపథ్యంలో.. గతంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాల్లో మిత్రపక్షాలుగా వ్యవహరించిన పలు ప్రాంతీయ పార్టీలు తృతీయ కూటమిగా కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా సంప్రదింపులు ఊపందుకున్నాయి. వాటిలో వామపక్షాలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. అందులో భాగంగానే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న ఈ నెల 5న దాదాపు 11 పార్టీల నాయకులు సమావేశం కానున్నారని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ వెల్లడించారు. అందులో సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ, జేడీఎస్, ఏఐఏడీఎంకే, బీజేడీ, ఏజీపీ, జేవీఎం సహా పలు పార్టీలు పాల్గొంటాయన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ కన్నా తమ కూటమి పెద్దదన్న విషయం ప్రజలకు తెలిసేలా సరికొత్త ప్రతిపక్షంలా రానున్న పార్లమెంటు సమావేశాల్లో వ్యవహరిస్తామని శరద్‌యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే, ‘జనతా పరివార్’లో భాగమైన పలు పార్టీలు ఈ ఆదివారం భేటీ కానున్నాయి. అందులో నవీన్ పట్నాయక్, దేవేగౌడ, ఓం ప్రకాశ్ చౌతాలా, ములాయం సింగ్ యాదవ్‌లు పాల్గొననున్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాలనుకుంటున్న వామపక్షాలు కూడా పలు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంటూ ముందుకువెళ్తున్నాయి. సీపీఐ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌తో శరద్‌యాదవ్ ఇప్పటికే సమావేశం కాగా, సీపీఎం సీతారాం యేచూరితో త్వరలో భేటీ కానున్నారు. జయలలిత పార్టీ ఏఐఏడీఎంకేతో ఇప్పటికే పొత్తు పెట్టుకున్న సీపీఐ.. మరిన్ని ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు చర్చలు కొనసాగిస్తోంది. ఎన్నికల తరువాత ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయపార్టీలదే కీలక పాత్ర అని సీపీఎం నేత బృందాకారత్ అన్నారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకుని ఈసారి కేంద్రంలో చక్రం తిప్పాలని ఎస్పీ చీఫ్ ములాయంసింగ్ ఆశిస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు మెజారిటీ సాధించలేవని, థర్డ్‌ఫ్రంట్‌దే ఈసారి విజయమని, అందులో ఎస్పీనే అతిపెద్ద పార్టీ అవుతుందని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. -
'కేంద్రంలో థర్డ్ ఫ్రంట్‌దే అధికారం'
గోండా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా బీజేపీలకు పూర్తి మెజార్టీ లభించే అవకాశాల్లేవని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములయాం సింగ్ యాదవ్ అన్నారు. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సోమవారమిక్కడ జరిగిన పార్టీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం తమ పార్టీ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని ములయాం ధీమా వ్యక్తం చేశారు. థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఇందులో సమాజ్‌వాదీ పార్టీ అతిపెద్ద పార్టీగా ఉంటుందని చెప్పారు. దేశంలోనే ఉత్తరప్రదేశ్‌లో (80) అత్యధిక ఎంపీ స్థానాలున్నాయని, ఇక్కడ విజయం సాధించకుండా ఏ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలోకి రాదని పేర్కొన్నారు. తమ పార్టీ 70 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని ములయాం అన్నారు. -
తమిళనాడులో కూటమిగా ఏర్పడ్డ సీపీఐ,అన్నాడీఎంకే
-
వచ్చేది మూడో ప్రత్యామ్నాయమే..
జహీరాబాద్, న్యూస్‌లైన్: కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి అవతరించడం ఖాయమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి జోస్యం చెప్పారు. సోమవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు జహీరాబాద్ వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారనటానికి ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని చెప్పారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి లభించిన ఆదరణతో యువత కొత్తదనాన్ని కోరుకుంటోందని వెల్లడైందని పేర్కొన్నారు. మూడో ప్రత్యామ్నాయం కోసం 14 ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు ఇటీవల ఢిల్లీలో సమావేశమయ్యారని గుర్తుచేశారు. మూడో ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, వామపక్ష పార్టీల నేతలు సుముఖంగా ఉన్నారని అన్నారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ఆయన వెంట కర్ణాటక మాజీ మంత్రి కాశీంపూర్ బండెప్ప, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నామ రవికిరణ్‌గుప్తా, జహీరాబాద్ పట్టణ ప్రముఖులు విశ్వనాథ్కోటా, విశ్వమోహన్, అశోక్చంద్రే, జి.సురేష్‌బాబు, జి.కిరణ్‌కుమార్, బెజుగం రాజేశ్వర్, బెజుగం వేణుగోపాల్, అశోక్ బెల్కేరి, బీదర్‌కు చెందిన అశోక్పాటిల్లు పాల్గొన్నారు. -
2014లో సత్తా చాటనున్న ప్రాంతీయపార్టీలు
-
మూడో కూటమంతా గందరగోళమే
టీడీపీ మేధోమథన సదస్సుల్లో చంద్రబాబు పజలు మోడీవైపు ఆకర్షితులవుతున్నారు టీడీపీ నేతలు మోడీని అనుకరించాలి ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు చేసిన నన్నపనేని హరికృష్ణకు అందని ఆహ్వానం, గైర్హాజరు కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న తృతీయ కూటమి గందరగోళంలో ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. మూడో కూటమి భాగస్వామ్యపక్షాల్లో పలు అంశాలపై స్పష్టత లేదని, వారు చివరివరకూ కలిసి ఉంటారనే నమ్మకం కూడా లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని టీడీపీ నేతలు అనుకరించాలని ఉద్బోధించారు. ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆయన సీమాంధ్ర పరిధిలోని పార్లమెంటరీ నియోజకవర్గాల నేతల మేధోమథన సదస్సులో పలుమార్లు ప్రసంగిం చారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గరివి రెడ్డి రామానాయుడు మాట్లాడుతూ... ఇటీవలి కాలం లో పార్టీపరంగా ఎదుటిపక్షం వారిపై విమర్శలు ఎక్కువయ్యాయని, వాటిని తగ్గించి మనం చేసిన పనులు చెప్పుకుంటూపోతే సరిపోతుందని సూటిగా చెప్పారు. దానిపై చంద్రబాబు స్పందిస్తూ జాతీయ రాజకీయాలతోపాటు పలు అంశాలపై మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా ఉన్న బీజేపీ ఇపుడు సమన్యాయం చేశాక విభజన విషయం లో ముందుకెళ్లాలని చెప్పటం మంచి పరిణామమన్నారు. 2008లో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి ఇచ్చిన లేఖలోనే తాము సమన్యాయం అంశాన్ని ప్రస్తావించామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాజీనామా చేసిన ఎంపీ హరికృష్ణను సదస్సుకు ఆహ్వానించలేదని సమాచారం. దీంతో ఆయన సదస్సుకు హాజరు కాలేదు. సినీ నటుడు ఏవీఎస్ మృతికి హరికృష్ణ సంతాపం ప్రకటించారు. సదస్సుల్లో ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు సీమాంధ్ర ప్రాంత మేధోమథన సదస్సుల్లో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు చేశారు. సమావేశ మందిరంలోకి వచ్చిన వెంటనే ఆమె ‘జై సమైక్యాంధ్ర’ అంటూ అందర్నీ పలకరించారు. ఇకనుంచి పార్టీ నేతలు ఎవరు కనిపించినా ఇలానే పలకరించుకోవాలని సూచించారు. కొద్దిసేపటికి సమావేశమందిరంలోకి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రవేశించగానే అందరూ ‘జై సమైక్యాంధ్ర’ అని నినదించారు. అయితే చంద్రబాబు ఎలాంటి స్పందన వ్యక్తం చేయకుండా తన సీటులో ఆశీనులయ్యారు. -
మూడో కూటమి రావాల్సిందే: అఖిలేష్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ మూడో కూటమికి సై అన్నారు. 2014 ఎన్నికల తర్వాత మతతత్వ శక్తులు అధికారంలోకి రాకుండా ఉండేందుకు థర్డ్‌ఫ్రంట్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ తప్పిదాల వల్ల బీజేపీ బలోపేతం అవుతోందని చెప్పారు. గురువారమిక్కడ ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మూడో కూటమికి ప్రధాని అభ్యర్థిగా సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఉంటారా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానమిచ్చేందుకు నిరాకరించారు. ‘ఉత్తరప్రదేశ్‌తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో మతతత్వ శక్తులకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. మూడో కూటమి మాత్రమే ఇలాంటి శక్తులను అడ్డుకోగలదు’ అని అన్నారు. పశ్చిమబెంగాల్లో తృణమూల్, కమ్యూనిస్టులు, తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే, బీహార్‌లో జేడీయూ.. ఇలా బీజేపీయేతర , కాంగ్రెసేతర పార్టీలన్నీ ఏకతాటిపై నిలవాలన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి గతంలో బీజేపీకి మద్దతిచ్చిందని, ఈసారి కూడా ఆ పార్టీతో కలిసి వెళ్లొచ్చని చెప్పారు. థర్డ్‌ఫ్రంట్‌కు మీ తండ్రి ములాయంసింగ్ ప్రధాని అభ్యర్థిగా ఉంటారా అని అడగ్గా.. రైతుల సమస్యలను అర్థం చేసుకునే వారు ప్రధాని పగ్గాలు చేపట్టాలని అన్నారు. ఎస్పీ కాంగ్రెస్‌కు మద్దతునివ్వడంపై ప్రశ్నించగా.. మతశక్తులను దూరంగా ఉంచేందుకు ఆ పార్టీకి మద్దతిస్తున్నామని వివరించారు. అలా అనడం రాహుల్‌కు తగునా? ముజఫర్‌నగర్ బాధితుల్లో కొందరిని పాక్ ఐఎస్ఐ సంప్రదించిందన్న రాహుల్ వ్యాఖ్యలను అఖిలేష్ తప్పుపట్టారు. జాతీయ పార్టీ నేతగా అలా మాట్లాడడం ఆయనకు తగదన్నారు. ఐఎస్ఐని ఎవరు సంప్రదించారని దేశం అడుగుతున్న ప్రశ్నలకు రాహు ల్ వద్ద సమాధానం లేదన్నారు. రాజకీయం చేసేందుకే ఆయన అలా మాట్లాడారో ఏమోనని చెప్పారు. లెఫ్ట్‌దే కీలక పాత్ర: సురవరం వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో వామపక్షాలు కీలకపాత్ర పోషిస్తాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి తమ పార్టీ పొత్తులు ఉంటాయని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటులో వామపక్షాలదే ముఖ్యభూమిక అని స్పష్టంచేశారు. పార్టీ జాతీయ సమితి మూడు రోజుల సమావేశాల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం అవసరమయ్యే ప్రణాళికలపై చర్చించామని తెలిపారు. అదో విఫల భావన: జైట్లీ తృతీయ కూటమి ఏర్పాటు అవకాశాలను బీజేపీ నేత అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. తృతీయ కూటమిని ఆయన ‘విఫల భావన’గా అభివర్ణించారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా 14 పార్టీలు ఏకమై సమావేశం నిర్వహించడంపై జైట్లీ విమర్శలు గుప్పించారు. -
మూడో కూటమికి ముందడుగు !
ఫాసిజానికి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఏకమవ్వాలి ‘మతతత్వ వ్యతిరేక’ సదస్సులో కీలక ప్రాంతీయ పార్టీల పిలుపు న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో మూడో కూటమిని ఏర్పాటు చేసే దిశగా.. వామపక్షాలతో కలిసి బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలు తొలి అడుగువేశాయి. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం పేరుతో లెఫ్ట్ పార్టీలతో పాటు జనతాదళ్ (యునెటైడ్), సమాజ్‌వాదీ పార్టీ, అన్నా డీఎంకే, బిజూ జనతాదళ్, జనతాదళ్ (సెక్యులర్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అసోం గణ పరిషత్, జార్ఖండ్ వికాస్మోర్చా తదితర ప్రాంతీయ పార్టీలు సదస్సుకు హాజరయ్యాయి. వామపక్ష పార్టీలు బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ‘మతతత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఐక్యత’ సదస్సులో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఎస్పీ అధినేత ములాయంసింగ్‌యాదవ్, మాజీ ప్రధాని దేవెగౌడలతో సహా 14 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. తమిళనాడు సీఎం జయలలిత, ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌లు.. మతతత్వంపై పోరాటంలో లౌకికశక్తులకు మద్దతు ప్రకటిస్తూ సందేశాలు పంపించారు. ఈ సదస్సుకు తెలుగుదేశం పార్టీని ఆహ్వానించినప్పటికీ.. ఆ పార్టీ స్పందించలేదు. తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీలు కూడా హాజరుకాలేదు. పశ్చిమబెంగాల్లో తన ప్రత్యర్థులైన వామపక్షాలు నిర్వహించిన సదస్సు కావటం వల్ల తృణమూల్, యూపీలో తన ప్రత్యర్థి అయిన ఎస్పీ సదస్సుకు హాజరుకావటం వల్ల బీఎస్పీ దూరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ సదస్సులో మాట్లాడిన ఆయా నేతలు మూడో కూటమి ప్రయత్నాలు అనే వాదనను తోసిపుచ్చినప్పటికీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ సీఎం నరేంద్రమోడీని ముందుకు తెచ్చిన క్రమంలో ఆ పార్టీతో 17 ఏళ్ల స్నేహ బంధాన్ని ఇటీవలే తెగదెంపులు చేసుకున్న నితీశ్‌కుమార్.. మూడో కూటమి అంశాన్ని తాజా సదస్సులో స్వయంగా లేవనెత్తారు. ‘కొత్త కూటమిని ఏర్పాటు చేస్తున్నారా? అని మమ్మల్ని అడుగుతున్నారు. ఈ రోజువరకూ అయితే అదేం లేదు. కానీ.. మనం ఆలోచించాల్సి ఉంది. మతతత్వానికి, ఉగ్రవాదానికి, ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులు ఐక్యం కావాల్సిన అవసరముంది’ అని ఆయన పేర్కొన్నారు. మతతత్వ శక్తులు దేశంలో మతం పేరుతో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని నితీశ్ పరోక్షంగా ఆర్ఎస్ఎస్, బీజేపీలపై ధ్వజమెత్తారు. యూపీఏ సర్కారులో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ ప్రతినిధిగా సదస్సుకు హాజరైన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్‌పటేల్.. ఇది సంకీర్ణ రాజకీయాల శకమని.. ఇతర పార్టీలతో కలిసి పనిచేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాల్సిన అవసరముందని పేర్కొన్నారు. సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి క్రికెట్ పరిభాషలో మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం మూడో కూటమి ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చారు. ‘మూడో కూటమి అనేదేమీ లేదు కానీ ఇది భారత రాజకీయాల్లో ‘దూస్రా’. మీకు క్రికెట్ తెలిస్తే.. అందులో ‘దూస్రా’ అనే పద్ధతిలో బౌలింగ్ ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ‘ఇది ఆరంభం... రాబోయే రోజుల్లో మీరు ఇంకా చాలా చూస్తారు’ అని ఎస్పీ నేత రామ్‌గోపాల్‌యాదవ్ పేర్కొన్నారు. లౌకిక జాతీయవాదులే ఉంటారు... హిందుత్వ సంస్థలు మతపరమైన అంశాలను లేవనెత్తుతున్నాయని.. తత్ఫలితంగా దేశంలో మత ఘర్షణలు తలెత్తుతున్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్ పేర్కొన్నారు. తాను హిందూ జాతీయవాదినన్న నరేంద్రమోడీ ప్రకటనను పరోక్షంగా ఖండిస్తూ.. దేశంలో కేవలం లౌకిక జాతీయవాది ఉండటానికి మాత్రమే అవకాశం ఉందని.. మరి దేనినీ తాము అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఉత్తరప్రదేశ్‌లో తన పార్టీ ఒక్కటే 1980 నుంచీ మతతత్వంపై పోరాడుతోందని, అందులో వామపక్షాలు మద్దతిస్తున్నాయని ములాయం పేర్కొన్నారు. లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. మైనారిటీలను రక్షించటానికి తామంతా ఏకం కావాల్సిన అవసరముందని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ పేర్కొన్నారు. తాము విడివిడిగా ఉన్నప్పటికీ మతతత్వంపై ఉమ్మడిగా పోరడతామని జేడీ(యూ) నేత శరద్‌యాదవ్ చెప్పారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్, ఎన్సీపీ నేత డి.పి.త్రిపాఠి, అన్నాడీఎంకే నేత తంబిదురై, సీపీఐ నేత ఎ.బి.బర్ధన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. నితీశ్.. కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారు: బీజేపీ మూడో కూటమి అనేది ఊహాజనితమేనని బీజేపీ వ్యాఖ్యానించింది. వామపక్షాల సదస్సుకు హాజరైన నితీశ్‌కుమార్ వాస్తవానికి కాంగ్రెస్‌కు దగ్గరగా జరుగుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత రవిశంకర్‌ప్రసాద్ పేర్కొన్నారు. మూడో కూటమి అనేది చరిత్రని, దానికి ఇప్పుడు ఉనికి లేదన్నారు. బీజేపీని విమర్శించే పార్టీలు చాలాఉన్నాయి: కాంగ్రెస్ వామపక్షాల సదస్సులో చాలా పార్టీలు మతత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తంచేయటం ద్వారా.. బీజేపీని, నరేంద్రమోడీని విమర్శించే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే కాదని ప్రజలకు తెలుస్తుందని కాంగ్రెస్ అధికారప్రతినిధి రాజ్‌బబ్బర్ పేర్కొన్నారు. ఆ సదస్సుకు యూపీఏ భాగస్వామ్యపక్షమైన ఎన్సీపీ హాజరుకావటాన్ని ఆయన తేలికగా కొట్టివేశారు. సదస్సులో మూడో కూటమి అనే మాట ఎవరూ మాట్లాడలేదని ఒక ప్రశ్నకు బబ్బర్ బదులిచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మూడో కూటమి ఏర్పాటు చేయాలని వామపక్షాలు చేస్తున్న యత్నాలను తృణమూల్ ఎద్దేవా చేసింది. సీపీఎం ఎక్కడుంటే అక్కడ మొత్తం నాశనం చేస్తుందని దుయ్యబట్టింది. ‘ఏవైపో టీడీపీనే తేల్చుకోవాలి’ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నింటినీ కూడగట్టడానికి, ఏకతాటిపైకి తీసుకురావడానికి తమ వంతు కృషి సాగిస్తామని సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి పేర్కొన్నారు. గతంలో మూడో కూటమిలో పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మతతత్వం, లౌకికవాదంలో ఏవైపు ఉండాలో తేల్చుకోవాలని సూచించారు. మతతత్వ వ్యతిరేక సదస్సులో పాల్గొన్న తర్వాత ఏచూరి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సదస్సుకు టీడీపీ గైర్హాజరు కావడంపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. సదస్సులో పాల్గొనాల్సిందిగా టీడీపీని తాము మొదట్లోనే కోరామని, అయితే పార్టీలో చర్చించుకుని తమ స్పందన తెలియజేస్తామన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏ సంగతీ చెప్పలేదన్నారు. మతతత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఐక్యత పేరుతో సదస్సు నిర్వహించింది ‘కాంగ్రెస్ బి’ టీం వారని బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మతాలపేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. -
మూడో కూటమికి డీఎంకే రెడీ
సాక్షి, చెన్నై: యూపీఏ నుంచి బయటకు వచ్చిన డీఎంకే అధినేత కరుణానిధి కేంద్రంపై తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. కరుణ తీరు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. డీఎంకేను పక్కన పెట్టి విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో కలసి రాష్ట్రంలో పయనించే విధంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇది కరుణానిధికి మింగుడు పడడం లేదు. కేంద్రానికి వ్యతిరేకంగా స్వరం పెంచడం, రాష్ట్రంలో తన నేతృత్వంలో మెగా కూటమి ఏర్పాటు చేయడం లక్ష్యంగా వ్యూహాలు రచించారు. వీటి అమలులో ఆటంకాలు ఎదురవుతుండడంతో బీజేపీపై దృష్టి సారించారు. ఏర్కాడు ఉప ఎన్నికను అస్త్రంగా చేసుకుని వారికి దగ్గరయ్యేందుకు చేసిన యత్నాలు మోడీరాకతో బెడిసి కొట్టాయని చెప్పవచ్చు. ఈ మొత్తం వ్యవహారంతో వృద్ధనేత డైలమాలో పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మూడో కూటమికి తాను రెడీ అని చాటే ప్రయత్నాల్లో పడ్డారు. ఆహ్వానిస్తే నిర్ణయం లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మూడో కూటమి ఏర్పాటు ప్రయత్నాలను వామపక్షాలు ప్రారంభించాయి. ఈ నెల 30న ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నాయి. ఈ సమావేశానికి హాజరుకావాలంటూ అన్నాడీఎంకేకు ఆహ్వానం వచ్చింది. అయితే డీఎంకేకు పిలుపు లేదు. ఈ విషయమై కరుణానిధిని మీడియా శుక్రవారం ప్రశ్నించింది. దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కూటమి రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే దేశ సౌభ్రాతృత్వానికి మూడో కూటమి ఆవిర్భవిస్తే ఆహ్వానించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తనకు ఆహ్వానం వస్తే పార్టీలో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటానని పరోక్షంగా వామపక్షాలకు సందేశం పంపారు. పార్టీలో చర్చ కరుణానిధి వ్యాఖ్యలతో డీఎంకేలో చర్చ మొదలైంది. తమ నేత దారి ఎటని ప్రశ్నించుకుంటున్నారు. ఓ వైపు కాంగ్రెస్‌ను విమర్శిస్తూనే మరోవైపు తమ అవసరాలకు యూపీఏను ఉపయోగించుకుంటున్నారు. మధ్యలో ఉన్నట్లుండి బీజేపీకి మద్దతు లేఖ రాశారు. ఇంతలోనే మూడో కూటమికి రెడీ అంటూ సంకేతాలు పంపారు. ఇంతకీ కరుణ ఆలోచన ఏంటనే దానిపై నేతలు చర్చించుకుంటున్నారు. వామపక్షాలు ఏర్పాటు చేయబోతున్న మూడో కూటమికి ఎవరు నేతృత్వం వహించాలన్న విషయంలో అన్నాడీఎంకే తిరకాసు పెట్టడం తథ్యమని డీఎంకే నేత ఒకరు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా చివరి క్షణంలో ఆ పార్టీ మూడో కూటమి నుంచి తప్పుకున్నా తప్పుకోవచ్చన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకునే తమ నేత ‘ఆహ్వానం’ పేరిట కొత్త అస్త్రాన్ని సంధించారని పేర్కొన్నారు. -
గౌడ స్వప్నం భగ్నం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేయాలనుకున్న జేడీఎస్ అధిపతి దేవెగౌడకు ఈ ఉప ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తమ పార్టీకి గట్టి పట్టున్న రెండు లోక్‌సభ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి గెలవడం ద్వారా తృతీయ ఫ్రంట్‌కు ఊపిరులూదాలని ఆయన కన్న కలలు కల్లలయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో గెలుపుపై తొలి నుంచే అనుమానాలున్నట్లు ఆయన వైఖరే చెప్పింది. ఉప ఎన్నికల్లో బీజేపీతో పొత్తుందని కుమారుడు కుమారస్వామి ప్రకటించినప్పుడు ఇంతెత్తు ఎగిరిన ఆయన, తిరిగి మౌనంగా ఉండిపోయారు. బెంగళూరు గ్రామీణ నుంచి పోటీ చేయడానికి కోడలు అనితా కుమారస్వామి నిరాకరించినప్పటికీ, కుటుంబ సభ్యులందరి చేత ఒత్తిడి తెప్పించి ఒప్పించారు. కుటుంబ సభ్యులు పోటీలో ఉంటే తన సామాజిక వర్గం అండగా ఉంటుందనేది ఆయన ఆలోచన. కోడలికి మద్దతు కూడగట్టడానికి అన్ని పార్టీల వారితోనూ సంప్రదింపులు జరిపారు. చన్నపట్టణ ఎస్పీ ఎమ్మెల్యే సీపీ.యోగీశ్వర్ ఇంటికి వెళ్లి ఉప ఎన్నికలో మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రతిగా భవిష్యత్తులో చన్నపట్టణలో జేడీఎస్ అభ్యర్థిని నిలపబోనని హామీ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయక ముందు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి డీకే. శివ కుమార్ మద్దతును కూడా కోరారు. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే...ఈ ప్రభావంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరి కొన్ని సీట్లను గెలుచుకోవచ్చని అంచనా వేశారు. ఈ ప్రయత్నాలన్నీ తృతీయ ఫ్రంట్ పునరుత్థానం కోసమే. కుమారస్వామి స్వయంగా, ఉప ఎన్నికల్లో జేడీఎస్ విజయం సాధిస్తే, తృతీయ ఫ్రంట్ తిరిగి ప్రాణం పోసుకుంటుందని ప్రకటించారు. అయితే అనూహ్య పరాజయంతో తృతీయ ఫ్రంట్ మాటేమో కానీ జేడీఎస్ మనుగడకే సవాలు ఎదురైంది. -
కాంగ్రెస్‌పై మండిపడ్డ దత్తాత్రేయ
కాంగ్రెస్ పార్టీపై భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ శనివారం మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఓటు నోటు రాజకీయం చేస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు ఏమీ చేయడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక కొన్ని పార్టీలు కనుమరుగుకావడం కాయంమన్నారు. దేశంలో మూడో ఫ్రంట్ అనేది అభూత కల్పనే అని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడు ఎర్రకోటపై బీజేపీ ప్రభుత్వ హయాంలోనే త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని దత్తాత్రేయ జోస్యం చెప్పారు.