ఓటమిని ముందే అంగీకరించిన కాంగ్రెస్
ముంబై:మరో మూడు విడతల పోలింగ్ జరగాల్సి వున్నప్పటికీ కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందా..? ప్రస్తుత రాజకీయ సమీకరణాలను చూస్తే ఈ విషయం మనకు అవగతమవుతోంది. కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో మరో మూడు విడతలుగా పోలింగ్ జరగాల్సి ఉన్న క్రమంలో ఆయన మాటలు రాజకీయ విశ్లేషకులతో పాటు, సామాన్య ప్రజానికాన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే తాము చాలా వెనకబడ్డట్టు కనిపిస్తోందని ఆయన తెలిపారు. దీనికి అనేక కారణాలున్నాయని, భారీ సంఖ్యలో వచ్చిన కొత్త ఓటర్లు ఈసారి ఓటింగ్ సరళిని ప్రభావితం చేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ అంటున్నారు.
ఓట్ల వేటలో కాంగ్రెస్ వెనకబడుతున్నప్పటికీ, ప్రత్యర్థి బిజెపి బలం పుంజుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే కాంగ్రెస్ సహకారంతో మూడో కూటమి కానీ, థర్డ్ ఫ్రంట్ సపోర్ట్‌తో కాంగ్రెస్ సర్కారు కానీ కేంద్రంలో ఏర్పడే అవకాశాలున్నాయని ఆయన వివరించారు. దీంతో బిజెపి సర్కార్ ఏర్పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయనదే అర్ధమవుతోంది. కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనందున, థర్డ్ ఫ్రంట్‌కే సర్కారును ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 1996 నాటి పరిస్థితులు దేశ రాజకీయాల్లో కనిపిస్తున్నాయని జనతాదళ్ యునైటెడ్ నేత ధనిష్ అలీ అన్నారు. తుది విడత పోలింగ్ జరగక మునుపే ఓటమిని కాంగ్రెస్ ఒప్పుకోవడం సిగ్గు చేటని, కాంగ్రెస్, బిజెపిల ప్రత్యామ్నాయ శక్తులకు మాత్రమే ఓటేయాల్సిందిగా వామ పక్షాలు పిలుపు నిస్తున్నాయని సిపిఐ జాతీయ నేత డి.రాజా అన్నారు.
దేశ రాజకీయాలను ఈసారి ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలు శాసించే స్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. తమిళనాడులో జయలలిత నాయకత్వంలోని అన్నా డీఎంకే, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్, పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, బీహారులో నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యునైటెడ్, యుపిలో ములాయం సింగ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, మాయావతి నాయకత్వంలోని బిఎస్‌పి, ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ, తెలంగాణాలో కొంత వరకు టిఆర్‌ఎస్ పార్టీలు ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. థర్డ్ ఫ్రంట్ సంకేతాలను స్వయంగా కాంగ్రెసే ఇస్తున్నందున పోలింగ్ సరళి కూడా ఆ దిశగానే వుంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.