prithvi raj chavan
-
మహారాష్ట్ర సీఎం చవాన్ రాజీనామా
మరాఠా రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మద్దతు ఉపసంహరించడంతో ముఖ్యమంత్రి పదవికి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలు కావడం, నామినేషన్ల దాఖలుకు కూడా సమయం మరొక్కరోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో సీఎం చవాన్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగించింది. మహారాష్ట్రలో ఎన్నికలు కొద్ది రోజుల్లో ఉన్నాయనగా రెండు ప్రధాన కూటములలోను విభేదాలు వచ్చి రెండు కూటములు విడిపోయిన విషయం తెలిసిందే. అటు బీజేపీ - శివసేన, ఇటు కాంగ్రెస్ - ఎన్సీపీ రెండూ విడిపోయాయి. అదే తరుణంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్సీపీ తన మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో మైనారిటీలో పడిన ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం లేకపోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. -
నేటినుంచి కొనుగోలు
ముంబై: రైతుల నుంచి ధాన్యం సేకరణపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలును నిలిపివేయడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని విపక్షాలు మండిపడ్డాయి. ఉత్తర విదర్భలోని నాలుగు జిల్లాల్లో గత నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోలును పూర్తిగా నిలిపివేయడంపై ప్రతిపక్ష సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం అసెంబ్లీలో నిలదీశారు. దీనికి ఆహార, పౌరసరఫరాల మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సమాధానమిస్తూ... ‘నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉంది. కేంద్రం మార్గదర్శకాల మేరకే రాష్ట్రంలో ధాన్యం సేకరణను నిలిపివేశాం. ఈ విషయమై కేంద్ర ఆహార, పౌరసరఫరాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు మే 27న లేఖ కూడా రాశాను. ధాన్యం కొనుగోలు విషయంలో చొరవ చూపాల్సిందిగా కోరాను. కేంద్రం నుంచి సమాధానం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామ’న్నారు. విపక్షాల అభ్యంతరం దీనిపై బీజేపీ ఎమ్మెల్యే కుశాల్ బోప్చే, కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ అగర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా వెంటనే రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. జూన్ 30 వరకు ధాన్యం సేకరణ కోసం కేంద్రం నుంచి అనుమతి ఉన్నందున వెంటనే సేకరణను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం సేకరణను నిలిపివేస్తే వ్యాపారులు మద్దతు ధరకంటే తక్కువ ధరకు కొనే ప్రమాదముందని, ఇది రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. రైతుకు మద్దతు ధర దక్కకపోతే హెక్టారుకు రూ. 20,000 నష్టం వస్తుందన్నారు. త్వరగా నిర్ణయం తీసుకోండి: స్పీకర్ కేంద్రం నుంచి సమాధానం రాకపోతే రెండ్రోజుల్లో ధాన్యం సేకరణపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ దిలీప్ వల్సే పాటిల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన.. స్పీకర్ ఆదేశాల తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. రైతులపట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని నినాదాలు చేశారు. ఓ సమయంలో బీజేపీ నేత అతుల్ దేశ్కర్ స్పీకర్ మైకు లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ ఆయనను హెచ్చరించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చవాన్ కలుగజేసుకుంటూ... ధాన్యం సేకరణను బుధవారం నుంచి ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ప్రతిపక్ష నేతలు శాంతించారు. -
ఓటమిని ముందే అంగీకరించిన కాంగ్రెస్
ముంబై:మరో మూడు విడతల పోలింగ్ జరగాల్సి వున్నప్పటికీ కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందా..? ప్రస్తుత రాజకీయ సమీకరణాలను చూస్తే ఈ విషయం మనకు అవగతమవుతోంది. కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో మరో మూడు విడతలుగా పోలింగ్ జరగాల్సి ఉన్న క్రమంలో ఆయన మాటలు రాజకీయ విశ్లేషకులతో పాటు, సామాన్య ప్రజానికాన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే తాము చాలా వెనకబడ్డట్టు కనిపిస్తోందని ఆయన తెలిపారు. దీనికి అనేక కారణాలున్నాయని, భారీ సంఖ్యలో వచ్చిన కొత్త ఓటర్లు ఈసారి ఓటింగ్ సరళిని ప్రభావితం చేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ అంటున్నారు. ఓట్ల వేటలో కాంగ్రెస్ వెనకబడుతున్నప్పటికీ, ప్రత్యర్థి బిజెపి బలం పుంజుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే కాంగ్రెస్ సహకారంతో మూడో కూటమి కానీ, థర్డ్ ఫ్రంట్ సపోర్ట్‌తో కాంగ్రెస్ సర్కారు కానీ కేంద్రంలో ఏర్పడే అవకాశాలున్నాయని ఆయన వివరించారు. దీంతో బిజెపి సర్కార్ ఏర్పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయనదే అర్ధమవుతోంది. కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనందున, థర్డ్ ఫ్రంట్కే సర్కారును ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 1996 నాటి పరిస్థితులు దేశ రాజకీయాల్లో కనిపిస్తున్నాయని జనతాదళ్ యునైటెడ్ నేత ధనిష్ అలీ అన్నారు. తుది విడత పోలింగ్ జరగక మునుపే ఓటమిని కాంగ్రెస్ ఒప్పుకోవడం సిగ్గు చేటని, కాంగ్రెస్, బిజెపిల ప్రత్యామ్నాయ శక్తులకు మాత్రమే ఓటేయాల్సిందిగా వామ పక్షాలు పిలుపు నిస్తున్నాయని సిపిఐ జాతీయ నేత డి.రాజా అన్నారు. దేశ రాజకీయాలను ఈసారి ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలు శాసించే స్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. తమిళనాడులో జయలలిత నాయకత్వంలోని అన్నా డీఎంకే, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్, పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, బీహారులో నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యునైటెడ్, యుపిలో ములాయం సింగ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, మాయావతి నాయకత్వంలోని బిఎస్పి, ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ, తెలంగాణాలో కొంత వరకు టిఆర్ఎస్ పార్టీలు ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. థర్డ్ ఫ్రంట్ సంకేతాలను స్వయంగా కాంగ్రెసే ఇస్తున్నందున పోలింగ్ సరళి కూడా ఆ దిశగానే వుంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.