ముంబై: రైతుల నుంచి ధాన్యం సేకరణపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలును నిలిపివేయడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని విపక్షాలు మండిపడ్డాయి. ఉత్తర విదర్భలోని నాలుగు జిల్లాల్లో గత నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోలును పూర్తిగా నిలిపివేయడంపై ప్రతిపక్ష సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం అసెంబ్లీలో నిలదీశారు.
దీనికి ఆహార, పౌరసరఫరాల మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సమాధానమిస్తూ... ‘నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉంది. కేంద్రం మార్గదర్శకాల మేరకే రాష్ట్రంలో ధాన్యం సేకరణను నిలిపివేశాం. ఈ విషయమై కేంద్ర ఆహార, పౌరసరఫరాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు మే 27న లేఖ కూడా రాశాను. ధాన్యం కొనుగోలు విషయంలో చొరవ చూపాల్సిందిగా కోరాను. కేంద్రం నుంచి సమాధానం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామ’న్నారు.
విపక్షాల అభ్యంతరం
దీనిపై బీజేపీ ఎమ్మెల్యే కుశాల్ బోప్చే, కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ అగర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా వెంటనే రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. జూన్ 30 వరకు ధాన్యం సేకరణ కోసం కేంద్రం నుంచి అనుమతి ఉన్నందున వెంటనే సేకరణను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం సేకరణను నిలిపివేస్తే వ్యాపారులు మద్దతు ధరకంటే తక్కువ ధరకు కొనే ప్రమాదముందని, ఇది రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. రైతుకు మద్దతు ధర దక్కకపోతే హెక్టారుకు రూ. 20,000 నష్టం వస్తుందన్నారు.
త్వరగా నిర్ణయం తీసుకోండి: స్పీకర్
కేంద్రం నుంచి సమాధానం రాకపోతే రెండ్రోజుల్లో ధాన్యం సేకరణపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ దిలీప్ వల్సే పాటిల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన..
స్పీకర్ ఆదేశాల తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. రైతులపట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని నినాదాలు చేశారు. ఓ సమయంలో బీజేపీ నేత అతుల్ దేశ్కర్ స్పీకర్ మైకు లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ ఆయనను హెచ్చరించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చవాన్ కలుగజేసుకుంటూ... ధాన్యం సేకరణను బుధవారం నుంచి ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ప్రతిపక్ష నేతలు శాంతించారు.
నేటినుంచి కొనుగోలు
Published Tue, Jun 10 2014 10:38 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement