dilip walse patil
-
టీకా తీసుకున్నా రెండోసారి కరోనా బారిన మహారాష్ట్ర హోంమంత్రి
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ముప్పు భయపెడుతోంది. కరోనా రష్యా, బ్రిటన్, చైనా దేశాల్లో మరోసారి కరోనా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే డెల్టాకు సంబంధించిన కొత్త వేరియంట్ ఏవై 4.2 ఉనికి దేశంలోని పలు రాష్ట్రాల్లో కనిపించడం ఆందోళన రేపుతోంది. తాజాగా మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ కరోనా బారినపడ్డారు.పాటిల్‌కు బుధవారం కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ఏడాది వ్యవధిలో ఆయనకు రెండోసారి కరోనా సోకింది. మరోవైపు ఆయన రెండు మోతాదుల టీకా కూడా తీసుకున్నారు. గత ఏడాది అక్టోబరులో పాటిల్‌కు కరోనా నిర్ణారణ అయింది. స్వల్ప కరోనా లక్షణాలతో పరీక్ష చేయించుకోవడంతో తనకు పాజిటివ్ వచ్చిందని పాటిల్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, డాక్టర్ల సలహా మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నట్టు చెప్పారు. అలాగే నాగపూర్, అమరావతి పర్యటనల్లో భాగంగా, ఇతర కార్యక్రమాల్లో తనతోపాటు పాల్గొన్న వారు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ పాటిల్ గురువారం ఉదయం ట్వీట్ చేశారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం గురువారం కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 16,156 కొత్త కేసులు నమోదు కాగా, 733 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 17,000 మంది కోలుకున్నారు. అటు మహారాష్ట్రలో కొత్తగా 1485 కేసులు, 38 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,03,536 కు చేరింది. After experiencing mild symptoms I decided to get tested for COVID-19. I have tested positive. My condition is stable and I am following my doctor’s advice. I urge all those who came in contact with me during Nagpur & Amravati tour, & other programs, to get themselves tested. — Dilip Walse Patil (@Dwalsepatil) October 28, 2021 -
నేటినుంచి కొనుగోలు
ముంబై: రైతుల నుంచి ధాన్యం సేకరణపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలును నిలిపివేయడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని విపక్షాలు మండిపడ్డాయి. ఉత్తర విదర్భలోని నాలుగు జిల్లాల్లో గత నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోలును పూర్తిగా నిలిపివేయడంపై ప్రతిపక్ష సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం అసెంబ్లీలో నిలదీశారు. దీనికి ఆహార, పౌరసరఫరాల మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సమాధానమిస్తూ... ‘నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉంది. కేంద్రం మార్గదర్శకాల మేరకే రాష్ట్రంలో ధాన్యం సేకరణను నిలిపివేశాం. ఈ విషయమై కేంద్ర ఆహార, పౌరసరఫరాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు మే 27న లేఖ కూడా రాశాను. ధాన్యం కొనుగోలు విషయంలో చొరవ చూపాల్సిందిగా కోరాను. కేంద్రం నుంచి సమాధానం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామ’న్నారు. విపక్షాల అభ్యంతరం దీనిపై బీజేపీ ఎమ్మెల్యే కుశాల్ బోప్చే, కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాల్ అగర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా వెంటనే రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. జూన్ 30 వరకు ధాన్యం సేకరణ కోసం కేంద్రం నుంచి అనుమతి ఉన్నందున వెంటనే సేకరణను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం సేకరణను నిలిపివేస్తే వ్యాపారులు మద్దతు ధరకంటే తక్కువ ధరకు కొనే ప్రమాదముందని, ఇది రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. రైతుకు మద్దతు ధర దక్కకపోతే హెక్టారుకు రూ. 20,000 నష్టం వస్తుందన్నారు. త్వరగా నిర్ణయం తీసుకోండి: స్పీకర్ కేంద్రం నుంచి సమాధానం రాకపోతే రెండ్రోజుల్లో ధాన్యం సేకరణపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ దిలీప్ వల్సే పాటిల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన.. స్పీకర్ ఆదేశాల తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. రైతులపట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని నినాదాలు చేశారు. ఓ సమయంలో బీజేపీ నేత అతుల్ దేశ్కర్ స్పీకర్ మైకు లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ ఆయనను హెచ్చరించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చవాన్ కలుగజేసుకుంటూ... ధాన్యం సేకరణను బుధవారం నుంచి ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ప్రతిపక్ష నేతలు శాంతించారు.