సీఎం రేవంత్ ఆదేశం
ప్రత్యేకాధికారులకు ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యతలు
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, రైతుల ఇబ్బందులపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రైతులకు ఇబ్బందులు ఎదురవకుండా సాఫీగా జరిగేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రాధాన్యతాంశంగా ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యం, రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడంపై సీఎం సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వార్తా కథనాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
కాగా ఉమ్మడి జిల్లాలకు గతంలో నియమించిన ప్రత్యేకాధికారులకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1న ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమించిన విషయం తెలిసిందే.
జిల్లాల ప్రత్యేకాధికారులు వీరే:
ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల : కృష్ణ ఆదిత్య
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల : ఆర్వీ కర్ణన్
నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట : అనితా రామచంద్రన్
నిజామాబాద్, కామారెడ్డి : డాక్టర్ ఎ.శరత్
రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి : డి.దివ్య
మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ : ధరావత్ రవి
వరంగల్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ : టి.వినయ కృష్ణారెడ్డి
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట : హరిచందన దాసరి
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం : కె.సురేంద్ర మోహన్
Comments
Please login to add a commentAdd a comment