బాబు పాలనలో ధాన్యం సేకరణ, మద్దతు ధర రెండూ లేవు
పాలన చేతకాక మాపై నిందలు వేస్తున్నారు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు (బారకాసు): ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని, రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని సీఎం చంద్రబాబు చెబితే... ఈ రోజు కొన్ని పత్రికలు మాత్రం మాట మార్చి ‘అవకతవకలు, తప్పులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ, అవి గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల..’ అంటూ వారి చేతకానితనాన్ని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆక్షేపించారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు.
‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా రూ.13,500కు బదులు రూ.20 వేలు ఇస్తామన్న హామీ ఇప్పటివరకు అమలు చేయలేదు. వారు చెప్పిన అన్నదాత సుఖీభవ అనేది చివరికి చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా మారింది. మద్దతు ధర దక్కకపోవడానికి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పిన మీ మాటలే నిజమైతే... ఈ ఆరు నెలలు ప్రక్షాళన చేయకుండా గాడిదలు కాస్తున్నారా? రైతులకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకి లేకపోవడం వల్లే సమస్యలు పునరావృతం అవుతున్నాయి. ఆ నెపాన్ని గత ప్రభుత్వం, అధికారులపై నెట్టివేసి పబ్బం గడుపుతున్నారు.
వైఎస్ జగన్ హయాంలోనే రైతులకు గిట్టుబాటు ధర లభించిందని టీడీపీ సానుభూతిపరులు కూడా అంగీకరించారు. అప్పట్లో ధాన్యం సేకరణ విధానాలు బాగున్నాయని వారు చెప్పారు. రైతుల ఇబ్బందులపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరించారు. చిత్తశుద్ధితో పని చేసిన సీఎం జగన్ అయితే... ప్రెస్‌మీట్లు పెట్టి ఏమీ చేయకుండానే ఆహా.. ఓహో.. అని తన భుజాలను తానే తట్టుకునే సీఎం చంద్రబాబు’ అని కాకాణి అన్నారు.
ఇవిగో వాస్తవ గణాంకాలు...
‘జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 2019–24 మధ్య ధాన్యం కొనుగోళ్లు 18 లక్షల టన్నులు తగ్గిందని చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారు. కానీ, వాస్తవాలు చూస్తే ధాన్యం సేకరణ నుంచి అమ్మకం వరకు అన్ని విభాగాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మెరుగ్గా పని చేసింది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 17.94 లక్షల మంది రైతుల నుంచి 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, వారికి రూ.40,236 కోట్లు చెల్లించారు.
అదే 2019–23 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 37.70 లక్షల మంది రైతుల నుంచి 3,40,24,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.65,255 కోట్లు చెల్లించాం.’ అని కాకాణి వివరించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల వాస్తవ పరిస్థితిని గుర్తించి, సజావుగా జరిగేలా చూడాలి. రైతులకు తప్పనిసరిగా కనీస మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేసి అన్ని జిల్లాల కలెక్టరేట్లకు వెళ్లి కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment