టీడీపీ కూటమి ప్రభుత్వం ముంచేసింది! | TDP coalition government has drowned Farmers | Sakshi
Sakshi News home page

టీడీపీ కూటమి ప్రభుత్వం ముంచేసింది!

Published Mon, Dec 2 2024 4:42 AM | Last Updated on Mon, Dec 2 2024 3:06 PM

TDP coalition government has drowned Farmers

శ్రీకాకుళం జిల్లా పెద్దబొడ్డపాడులో నీటి మునిగిన వరి పనలను గట్టుకు చేరుస్తున్న రైతులు

రైతు సేవా కేంద్రాల్లో నిరాశ తప్ప.. భరోసా కరువు 

తుపాను హెచ్చరికల్లోనూ రైతులను రోడ్డుపై వదిలేసిన సర్కారు

మిల్లర్లు, దళారుల దందాతో మద్దతు ధరలో అడ్డంగా కోత 

75 కిలోల బస్తాకు రూ.300–400 వరకు నష్టపోతున్న అన్నదాతలు

వర్షాల సాకుతో ఇచ్చే రూ.1,400 రేటులోనూ మరింత దోపిడీ

ఎకరాకు రూ.8 వేల నుంచి రూ.9 వేలకు పైగా అన్నదాత కష్టం ఆవిరి 

వర్షాల్లో యుద్ధప్రాతిపదికన ధాన్యం తరలించకుండా సర్కారు చోద్యం  

ధాన్యం తడుస్తుంటే పట్టించుకునే దిక్కులేక రైతులు గగ్గోలు 

తూ.గోదావరి, కోనసీమ, ప.గోదావరి మిల్లులకు తరలించుకోవాలని ఉచిత సలహా 

సిండికేట్‌గా మారిన మిల్లర్లు, దళారులతో రైతుల నిలువు దోపిడీ 

వాట్సాప్‌లో ‘హాయ్‌’ పెడితే గంటల్లో సరుకు తరలిస్తామన్నది ఉట్టిదే 

కనీసం గోనె సంచులు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్నదాతలను టీడీపీ కూటమి ప్రభుత్వం ముంచేసింది. తుపాను హెచ్చరికలున్నా ముందుస్తు చర్యలు చేపట్టకుండా వారిని నడిరోడ్డుపై వదిలేసింది. కోసిన పంటను కొనుగోలు చేసే దిక్కులేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాలకు కళ్లెదుటే తడిసిపోతున్న ధాన్యాన్ని కాపాడుకోలేక నిస్సహాయ స్థితిలో కుంగిపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన తిండి గింజలను అమ్ముకోవడానికి హీనమైన దుస్థితి అనుభవిస్తున్నారు.  

వాస్తవానికి.. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల ప్రారంభం నుంచే దళారులు, మిల్లర్ల దందాకు టీడీపీ కూటమి ప్రభుత్వం గేట్లు తెరిచింది. ఫలితంగా గ్రామాల్లో రైతుసేవా కేంద్రాలకు వెళ్లిన కర్షకులకు నిరాశ తప్ప భరోసా దక్కట్లేదు. వర్షాల సాకుతో మద్దతు ధరలో మరింత కోత పెట్టేందుకు వారు కుట్రలు చేస్తున్నా సర్కారు కళ్లుండీ కబోదిలా వ్యవహరిస్తోంది. దీంతో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా పరిస్థితి తయారైంది. 

ఫలితంగా మిల్లర్లు, దళారులు ధాన్యం కొనడం నిలిపేశారు. రైతులు బతిమాలితే నామమాత్రపు ధర ఇచ్చి సరిపెడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడచూసినా ఇలాంటి దోపిడీయే సాక్షాత్కరిస్తోంది. 75 కిలోలకు మద్దతు ధరలో కోత పెట్టడంతో పాటు అదనంగా మరో కేజీ దండుకుంటూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. మరోవైపు.. అకాల వర్షానికి ధాన్యాన్ని కాపాడుకోలేక.. రంగు మారుతుందన్న భయంతో.. మొలక వస్తుందన్న దిగులుతో రోడ్లపైనే ధాన్యం రాశుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. 

కేంద్ర ప్రభుత్వం క్వింటా సాధారణ రకం ధాన్యానికి రూ.2,300, ఏ–గ్రేడ్‌కు రూ.2,320గా మద్దతు ధర ప్రకటించింది. ఇందులో 75 కిలోల బస్తాకు సాధారణ రకం రూ.1,725, ఏ–గ్రేడ్‌కు రూ.1,740 గిట్టుబాటు ధర ఇవ్వాలి. కానీ, కూటమి ప్రభుత్వంలో రైతు 75 కేజీల బస్తాకు రూ.300 నుంచి రూ.400కి పైగా నష్టపోతున్నాడు. ఇలా ఎకరాకు సుమారు రూ.8 వేల నుంచి రూ.9 వేలకు పైగా మద్దతు ధరను దళారులు, మిల్లర్లు దోచేస్తున్నారు.

రైతుకు అన్యాయం జరుగుతోంది..
‘‘నేను టీడీపీ కార్యకర్తను. శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడి (నీటి సంఘాలు)గా పనిచేశా. కిందటేడాది మద్దతు ధరకు తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం అమ్ముకున్నాం. ఇప్పుడు రైతుకు అన్యాయం జరుగుతోంది. తేమ శాతం పేరుతో మిల్లర్లు దగా చేస్తున్నారు. నేను 20 ఎకరాలు సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను. 

తొమ్మిది ఎకరాల్లో ‘1061’ రకం సాగుచేశా. ధాన్యాన్ని రూ.1,500 (76 కిలోల బస్తా) అమ్ముకున్నా. ఇక్కడే ఒక బస్తాకు రూ.23 నష్టపోతున్నాను. మరో పదెకరాల్లో ‘1262’ రకాన్ని సాగుచేశా. ఇప్పుడు కోసి ఆరబెట్టా. దీనిని కొనేవాడు లేడు. సంచులు కూడా ఇవ్వట్లేదు. కేవలం రూ.1,400 అయితే కొంటామని బేరగాళ్లు చెబుతున్నారు. అలా అమ్ముకోవడానికి ఇష్టంలేక కాపాడుకోవడానికి నానా యాతన పడుతున్నాను’’.. 

..ఇదీ కృష్ణాజిల్లా శ్రీకాకుళం గ్రామానికి చెందిన రైతు దోనేపూడి గోపీకృష్ణ ఆవేదన. రైతుగా తనకు జరుగుతున్న నష్టాన్ని ఆయన వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తు్తన్నారు.

మాఫియాకే ‘మద్దతు’!
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం మాఫియాను తలదన్నేలా జరుగుతోంది. పేరుకే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తోంది. నిజానికి.. ప్రభుత్వమే రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తే పూర్తిగా మేలు జరుగుతుంది. కానీ, పంట కొనుగోలు చేయాలని ప్రభుత్వం దగ్గరకు రైతు వెళ్తే.. ‘సంచుల్లేవు.. కూలీల్లేరు.. ఇప్పుడు కొనలేం’.. అంటూ నిరుత్సాహపరిచే సమాధానాలు ఎదురవుతు­న్నాయి. 



పోనీ బయట అమ్ముకుందామంటే మిల్లర్లు, దళారులు మొత్తం సిండికేట్‌ అయిపోయారు. వారి ఆజ్ఞలేనిదే రైతుకు సంచులు, హమాలీలు వచ్చే పరిస్థితిలేదు. సంచులు వస్తేనే పంటను బస్తాల్లో నింపుకుని తరలించేందుకు వీలుంటుంది. వీటన్నింటివల్ల రైతులు నిస్సహాయ స్థితిలో గతిలేక దళారులు, మిల్లర్లు చెప్పిన రేటుకే పంటను అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది. 

పైగా తేమ శాతం పేరుతో కోత కూడా విధిస్తున్నారు. దళారులు మాత్రం రైతుల పేరుతోనే ప్రభుత్వానికి విక్రయించి పూర్తి మద్దతు ధరను సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు.. రైతుసేవా కేంద్రంలో తేమ శాతం సక్రమంగా ఉన్నప్పటికీ పూర్తి మద్దతు ధర వస్తుందన్న గ్యారంటీ లేదు.  

పక్క జిల్లాల మిల్లులకు తీసుకెళ్లండి
ఇదిలా ఉంటే.. ఫెంగల్‌ తుపాను దెబ్బకు కోస్తాలో అకాల వర్షాలు కురి­శాయి. ముఖ్యంగా కృష్ణాజిల్లాలోని రైతాంగం కుదేలైంది. కోసిన పంట వర్షానికి తడిసిపోగా.. కోతకొచ్చిన పంట నేలవాలిపోయింది. తుపాను హెచ్చరికలకు వారానికి ముందు కోసిన పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. విజయవాడ నగర శివారు నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారికి ఇరువైపుల సుమారు 60 కిలోమీటర్ల మేర వర్షంలో తడుస్తున్న ధాన్యపు రాశులే దర్శమిస్తున్నాయి. 

ఇక్కడ యుద్ధప్రా­తిపదికన పంటను తరలించి రైతులను ఆదుకో­వా­ల్సిన ప్రభుత్వం ప్రేక్షకపా­త్రకు పరిమితమైంది. మరోవైపు. కొన్న అరకొర ధాన్యం కాస్తా మిల్లుల బయట రోజుల తరబడి వాహనాల్లో నానుతోంది. దీంతో రైతులను తూర్పు గోదా­వరి, పశ్చిమ గోదావరి, కోనసీమ­లోని మిల్లు­లకు ధాన్యాన్ని తరలించుకోవాలని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు. వ్యయ ప్రయా­సలు కోర్చి అలా తరలించినా అక్కడ అన్‌లోడింగ్‌కు రోజులు తరబడి సమయంపడుతోంది. 

సుమారు 100 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లులకు లోడును తీసుకెళ్తే రవాణ ఖర్చు తడిసిమోపుడు అవుతోందని రైతులు వాపోతు­న్నారు. అక్కడ వెంటనే దిగుమతి చేయకుంటే వాహనానికి వెయిటింగ్‌ చార్జీలు గుదిబండలా మారుతాయని భయపడుతు­న్నారు. ఇలా పక్క జిల్లా మిల్లులకు తరలించుకుంటే నష్టం తప్ప పైసా లాభంలేదని వారు పెదవి విరుస్తున్నారు. 

ఇక కృష్ణాజిల్లాలో ధాన్యం తరలింపునకు ప్రభుత్వం అసలు కాంట్రాక్టరునే నియమించలేదని తెలుస్తోంది. ఫలితంగా రైతులు సొంతంగా లోడును తరలించుకోలేక.. మిల్లరు వాహనం పంపిస్తే.. వాళ్లు చెప్పిన ధరకే పంటను విక్రయించాల్సి వస్తోంది.

గతంలో ఎంతో మేలు..
గతంలో ప్రభుత్వం గోనె సంచులు, హమాలీలు, రవాణా నిమిత్తం రైతుకు జీఎల్టీ చెల్లించేంది. సొంత వాహనాలున్న రైతులు హాయిగా తమకు ట్యాగ్‌ చేసిన మిల్లులకు లోడును తీసుకెళ్లే వారు. వాహనాల్లేని రైతుల కోసం ప్రభుత్వం రవాణా సౌకర్యం ఏర్పాటుచేసేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం తల్లకిందులైంది. రైతే సొంతంగా మిల్లుకు ధాన్యాన్ని తోలుకుంటే జీఎల్టీ రాకపోగా పూర్తి మద్దతు ధర కూడా దక్కడంలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 39 లక్షల మంది రైతుల నుంచి రూ.68 వేల కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకు సేకరించారు.

‘హాయ్‌’ అన్నా పలకని ప్రభుత్వం..
పౌరసరఫరాల సంస్థలో వాట్సాప్‌ ద్వారా రైతులు ‘హాయ్‌’ అని సందేశం పంపి వివరాలు నమోదుచేస్తే గంటల వ్యవధిలోనే ధాన్యం కొనుగోలు చేస్తామంటూ పౌరసరఫ­రాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఇటీవల ఆర్భాటంగా  ప్రకటించారు. దీనిపై సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ, రైతులు ‘హాయ్‌’ అంటుంటే అటు నుంచి కనీస స్పందన కరువైంది. పైగా.. తమ గోడు చెప్పుకునేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌కు ప్రయత్నించినా ఉలుకూ.. పలుకూ ఉండట్లేదని రైతులు వాపోతున్నారు.

11,157 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
అత్యధికంగా 10,426 ఎకరాల్లో వరిపంటకే నష్టం
ఆ తర్వాత వేరుశనగ, అపరాలకు.. 
అంచనా వేసిన వ్యవసాయశాఖ
ఫెంగల్‌ తుపాను ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం 11,157 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంట్లో 10,426 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైనట్లు గుర్తించారు. 501 ఎకరాల్లో వేరుశనగ, 180 ఎకరాల్లో మినుము, 50 ఎకరాలల్లో కంది, పెసర, మొక్కజొన్న పంటలు ముంపునకు గుర్యయాయి. అత్యధికంగా తిరుపతి జిల్లా­లో 9,612 ఎకరాలు, నెల్లూరులో 643 ఎక­రాలు, చిత్తూరులో 522 ఎకరాలు, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.

భయమేస్తోంది..
నేను కౌలుకు సాగుచే­స్తున్నా. 40 ఎకరాల్లో వరి వేశా. ఇప్పుడు 20 ఎకరాల్లో కోత కోశాను. వర్షాలు పడుతుండడంతో పంటను మిల్లులకు తరలించా. ఇంకా 20 ఎకరాల్లో పంట కోతకు సిద్ధంగా ఉంది. రెండ్రోజులుగా తుపా­నుతో వీస్తున్న గాలులకు పంట నేలవాలింది. ఇంకా వర్షం అధికంగా వస్తుందని చెబుతున్నారు. నేలవాలిన పంటను కోత కోయడానికి ఎకరాకు పదివేల వరకు అడుగుతున్నారు. కనీసం పెట్టుబడి చేతికి రాకపోగా నష్టం వస్తుందేమోనని భయమేస్తోంది. 
– యనమదల వెంకటేశ్వరరావు, కౌలు రైతు, మద్దూరు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లా    

కొనేవారు కరువయ్యారు.. 
‘1318’ రకం ధాన్యం సాగుచేశాను. ఐదెకరాలకు పైగా పంటను కోశాను. ధాన్యం కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఇంతలో వర్షం రావడంతో తడిసిపోయింది. మిల్లర్లు కూడా స్పందించట్లేదు. రైతుసేవా కేంద్రాల దగ్గరకు వెళ్తే సంచులిస్తాం.. లారీలో మండపేటకు తీసుకెళ్లమని చెబుతున్నారు. పచ్చి ధాన్యం సంచుల్లో నింపితే రంగుమారి, మొలకలు వస్తాయి. రూ.1,400కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఎవ్వరూ కొనట్లేదు. 
– వీరంకి చెన్నకేశవులు, జుజ్జువరం, పామర్రు మండలం, కృష్ణాజిల్లా

అన్ని విధాలా నష్టపోయాం.. 
పంట కోతకు రావడంతో కోసేశాం. ఇంతలో తుపాను వచ్చింది. వడ్లను ఆరబెట్టుకునేలోగా తడిసిపోయాయి. పంటను తీసుకెళ్లే దారి లేకపోవడంతో రోడ్ల పక్కనే టార్పాలిన్లు కప్పి ఉంచాం. ఆవిరికి రంగుమారి చెడిపోయే ప్రమాదం ఉంది. ఏంచేయాలో దిక్కుతోచట్లేదు. కౌలుకు చేసుకుంటున్న మేం అన్ని విధాలా 
నష్టపోయాం.      
– నాంచారమ్మ, జుజ్జువరం, పామర్రు మండలం, కృష్ణాజిల్లా

గతంలో ఇలా ఇబ్బంది పడలేదు  
పండించిన పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వ అధికారులు సంచులు కూడా ఇవ్వలేదు. వర్షం వస్తోందని తెలిసి మిల్లరు దగ్గరకు వెళ్తే సంచులు ఇచ్చాడు. ఇప్పుడు సరుకు అక్కడికి తీసుకెళ్తేగాని రేటు చెప్పరు. ఇక తేమ ఎక్కువగా ఉంది.. ఆరబెట్టుకోండని రైతుసేవా కేంద్రంలో చెప్పారు. 

ఈ వర్షాల్లో ధాన్యాన్ని ఎక్కడ ఆరబోసుకుంటాం. ఒక్కరోజు ఆలస్యమైతే రంగుమారి పోతుంది. గతంలో మాకెప్పుడూ ఇబ్బందిలేదు. ఇప్పుడు తక్కువకు అడుగుతున్నారు. మద్దతు ధర రాకపోయినా.. అమ్ముకోక తప్పదు. మద్దతు ధర వచ్చినా రాకపోయినా కౌలు పూర్తిగా చెల్లించాలి కదా?. 
– పి. వెంకటేశ్వరరావు, రామరాజుపాలెం, గూడూరు మండలం, కృష్ణాజిల్లా   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement