పెట్టుబడి సాయం కోసం 54 లక్షల మంది రైతులు ఎదురుచూపు
2 సీజన్లలో ఒక్కవిడత కూడా అందని సాయం
రూ. 20 వేల చొప్పున రూ.10వేల కోట్లు ఇస్తానన్న కూటమి సర్కార్..
ఇంత మోసమా.. అన్నదాతల్లో పెల్లుబికుతున్న ఆగ్రహం
ఆర్బీకేలు నిర్వీర్యం.. విత్తనాలు, ఎరువులు లేవు
కనీస మద్దతు ధర లేక రైతుల దిగాలు
సాయం లేదు.. బీమా పరిహారమూ లేదు
రైతుల పైనే పంటల బీమా ప్రీమియం భారం
దీంతో బీమాకు 36 లక్షలమంది రైతులు దూరం
సాక్షి, అమరావతి: తెలుగింట సంక్రాంతి పెద్ద పండుగ.. మరీ ముఖ్యంగా ఇది రైతన్న పండుగ. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు సంబరాలు చేసుకోవలసిన తరుణం. కానీ అన్నదాత లోగిలి కళతప్పింది. పల్లెల్లో సంక్రాంతి సందడి కానరావడం లేదు. అన్ని విధాలుగా మోసపోయిన రైతన్న దిగాలుగా కనిపిస్తున్నాడు. కొత్త సర్కారు వచ్చి ఏడు నెలలు గడిచాయి. ఖరీఫ్, రబీ రెండు సీజన్లు పూర్తయ్యాయి.
పెంచి ఇస్తామన్న పెట్టుబడిసాయం ఒక్క విడత కూడా అందలేదు. పంటలబీమా పరిహారం లేదు.. పైగా ప్రీమియం కట్టాల్సిరావడం.. కరువు సాయానికి ఎగనామం.. ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరకలేదు. తుపానులు, వరదలు దారుణంగా దెబ్బతీశాయి. దిగుబడులు ఆశించినట్లులేవు.. వాటికీ కనీస మద్దతు ధర రాలేదు.
అన్ని విధాలుగా దగా పడిన రైతన్న
ఏడు నెలలుగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తానన్న పెట్టుబడి సాయం లేదు. ఈ సాయం కోసం రాష్ట్రంలోని 54 లక్షల మందికి రూ.10వేల కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇంతమోసం చేస్తారా.. అని అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఖరీఫ్–2023 సీజన్‌కు సంబంధించి రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వలన రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది.
రబీ సీజన్‌లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు. ఇలా రైతులకు ఈ ఏడు నెలల్లో అందించాల్సిన రూ.12,563 కోట్లు ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. వీటి కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని రైతులు ఎదురు చూస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక ఈసారి పండుగకు దూరమవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. దీంతో విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడ్డారు.
రోడ్డునపడిన అన్నదాత..
ఇంటికొచ్చే కొత్త పంటతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికే రైతన్నల ఇంట ఈసారి ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదు. ప్రభుత్వ నిర్వాకానికి తోడు వరుస వైపరీత్యాల ప్రభావంతో ఓ వైపు పంటలు దెబ్బతినగా, చేతికొచ్చిన అరకొర పంటకు మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గడిచిన ఐదేళ్లుగా విత్తనాలు, ఎరువులకు ఏరోజు ఇబ్బందిపడని రైతులు గడిచిన ఖరీఫ్ సీజన్‌లో వాటి కోసం నానా అవస్థలు పడ్డారు.
మళ్లీ, మళ్లీ పెట్టుబడులు పెట్టి పండించిన వరి, పత్తి, ఉల్లి, టమోటా, మిర్చి వంటి పంటలకు మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. ఖరీఫ్ సీజన్‌లో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో తుపానులు, వరదలతో అధికారికంగా 6 లక్షల ఎకరాలలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో మరో 2 లక్షల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో 80కి పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారే తప్ప పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు.
పంటల బీమా రక్షణేది?
గతేడాది ఇదే రబీ సీజన్‌లో పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య అక్షరాల 43.82 లక్షల మంది. మరిప్పుడూ.. కేవలం 7.64 లక్షల మంది. అంటే ఆరో వంతు మందికి కూడా పంటల బీమా రక్షణ దక్కలేదు. గత ఐదేళ్లూ అన్నదాతలపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు నూరు శాతం యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ పంటల బీమా రక్షణ లభించేది.
ఈ బీమాతో ఎలాంటి విపత్తు ఎదురైనా రైతన్నలు నిశ్చింతగా ఉండే వారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో వివిధ విపత్తుల కారణంగా పంటలు దెబ్బతిన్న 54.55 లక్షల మంది రైతులకు రికార్డు స్థాయిలో రూ.7,802.05 కోట్లు పరిహారంగా అందించింది. వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు బుధవారంతో ముగుస్తుంది. మిగతా పంటలకు గత నెల 31వ తేదీనే ముగిసింది. అయినా 50.67 లక్షల ఎకరాలకు రైతులు బీమా చేయించలేదు.
చంద్రబాబు ప్రభుత్వం బీమా ప్రీమియం భారాన్ని రైతులపైనే వేయడమే ఇందుకు కారణం. ఈ భారం భరించలేక లక్షలాది రైతులు పంటల బీమా చేయించుకోలేకపోయారు. పైగా, బీమాకు అవసరమైన సర్టిఫికెట్లు, నమోదు వంటి వాటి కోసం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన దుస్థితి. దీంతో పంటల బీమా అంటేనే రైతులు భయపడిపోయారు.
17న విజయవాడలో ధర్నాకు పిలుపు
ప్రతీ రైతుకు రూ.20వేల పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలన్నీ అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఇచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీ ముఖ్యమంత్రికి గుర్తులేదా? గుర్తు ఉన్నా రైతులకు ఇవ్వటం ఇష్టం లేక అమలు చేయటం లేదా? స్పష్టం చేయాలి.
రైతులకు ఇచ్చిన హామీల అమలు, పెండింగ్ బకాయిలు చెల్లింపుతోపాటు రైతులపై భారం వేయకుండా ఉచిత పంటల బీమా పథకం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేయబోతున్నాం. – కె.ప్రభాకరరెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment