సర్కారు నిర్వాకంతో తడిసిముద్దయిన ధాన్యం రాశులు.. అన్నదాత అగచాట్లు | Cyclone Storm Fengal Effect to Farmers cheated by coalition govt | Sakshi
Sakshi News home page

సర్కారు నిర్వాకంతో తడిసిముద్దయిన ధాన్యం రాశులు.. అన్నదాత అగచాట్లు

Published Sun, Dec 1 2024 4:50 AM | Last Updated on Sun, Dec 1 2024 4:50 AM

Cyclone Storm Fengal Effect to Farmers cheated by coalition govt

శ్రీకాకుళం జిల్లా పెద్దవెంకటాపురంలో ధాన్యం కుప్ప వద్ద వర్షపు నీటిని తోడుతున్న అన్నదాత

కోసిన పంట కళ్లెదుటే ఫెంగల్‌ తుపాను పాలు

కూటమి ప్రభుత్వం చేతిలో రైతులు దగా

ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిన వైనం

కనీస మద్దతు ధర లేదు.. బస్తాకు రూ.500 వరకు నష్టం 

నాలుగురోజుల క్రితమే తుపాను హెచ్చరికలున్నా సర్కారు చోద్యం 

వర్షాలతో నేలకొరిగిన వరి.. కళ్లాల్లోనే తడిసిముద్దవుతున్న పంట

ఆరబోసిన ధాన్యం ఒబ్బిడి చేసుకునేందుకు పడరాని పాట్లు 

రంగుమారుతుందని లబోదిబోమంటున్న రైతులు

బస్తాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.. 
ఎకరం 50 సెంట్లలో వరి సాగుచేశా. ఎకరాకు 54 బస్తాల దిగుబడి వచి్చంది. తేమ శాతం ఎక్కువగా ఉందని ఆరబెట్టమన్నారు. రోడ్లపై ఆరబెట్టాను. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే అమ్ముదామని అనుకున్నా. మిల్లర్లకు చేరవేస్తే క్వింటాకు రూ.1,500 ఇస్తామంటున్నారు. ఇప్పుడు బస్తాల్లోకి ఎక్కించిన ధాన్యం కాస్తా ఇలా తడిసి ముద్దయింది. ధర ఎంతొస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది. 
– అంగరాల రాంబాబు, చిట్టిగూడెం, గూడూరు మండలం, కృష్ణాజిల్లా

సాక్షి, అమరావతి: ఫెంగల్‌ తుపాను వస్తుందని నాలుగైదురోజుల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. కోతలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో బాధ్యతగల ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది..  ముందుగా కోసిన పంటను ఆఘమేఘాల మీద కొనుగోలు చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపడుతుంది. కానీ, నిత్యం సొంత డబ్బా కొట్టుకునే టీడీపీ కూటమి ప్రభుత్వం చేతగానితనంవల్ల కళ్లెదుటే తమ కష్టార్జితం తడిసిముద్దవడంతో అన్నదాతల వేదన అంతాఇంతా కాదు. 

ఇప్పటికే రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధరలేక రైతులు అల్లాడిపోతుంటే.. ఫెంగల్‌ తుపాను ప్రభావంతో వారి పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. అలాగే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడం.. తమ కష్టార్జితాన్ని దళారీలు సొమ్ము చేసుకుంటుండడంతో వారు క్వింటాకు రూ.500కు పైగా నష్టపోతున్నారు. ఇదిలా ఉంటే.. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కళ్లాల మీద ఉన్న వరిచేలు నేలకొరుగుతుంటే.. కోసిన పంట తడిసి ముద్దవుతోంది. కనీసం నష్టానికి తెగనమ్ముకుందామన్నా కూడా కొనే నాథుడు కన్పిచక రైతులు అన్నిరకాలుగా దగాకు గురవుతున్నారు.  

ఫెంగల్‌ కలవరంతో రైతులు పడరాని పాట్లు.. 
ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో విరుచుకుపడుతున్న ఫెంగల్‌ తుపాను రైతులను మరింత కలవరపెడుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే 60–70 శాతం కోతలు పూర్తయ్యాయి. కొన్ని జిల్లాల్లో 20–40 శాతం కోతలు పూర్తికాగా, మెజార్టీ జిల్లాల్లో 15–20 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి.  కోసిన పంటను కనీసం 3–4 రోజులపాటు ఆరబెడితేగాని తేమ శాతం తగ్గే అవకాశం ఉండదు. దీనికితోడు.. కూలీల కొరత, మరోవైపు సంచుల కొరత తీవ్రంగా ఉంది. 

అలాగే, తూకం వేయకుండా సంచుల్లో నింపిన ధాన్యాన్ని తరలించే దారిలేక రోడ్ల మీద, పంట పొలాల మీదే ఉంచేసారు. ఈ నేపథ్యంలో.. శనివారం కురిసిన వర్షాలకు ఈ ధాన్యం కాస్తా తడిసి ముద్దవడంతో తేమశాతం పెరగడమే కాక రంగుమారి పోయే పరిస్థితి నెలకొంది. ఈ తేమ శాతం తగ్గితేగానీ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే పరిస్థితిలేదు. ఇదే వంకతో గడిచిన మూడ్రోజులుగా ప్రైవేటు వ్యాపారులు సైతం ధాన్యం కొనేందుకు ముందుకు రావడంలేదు. అయినాసరే.. ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా ఉంది. 

ముఖ్యంగా.. ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో ఎక్కడికెళ్లినా కోసిన పంట రోడ్లపైన, కళ్లాల్లోనే కన్పిస్తోంది. ఆరబోత కోసం రోడ్లపై వేసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు.. కోసిన ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు.. అధిక శాతం పంట ఇంకా కళ్లాలు, పొలాల్లోనే ఉండడంతో కోసిన పంటను అక్కడే ఆదరాబాదరాగా కుప్పలు పెడుతున్నారు. ఇవి కనీసం నాలుగైదు రోజులు పనల మీదే ఎండాల్సి ఉంది. వాతావరణ మార్పులతో ధాన్యం రంగుమారే ప్రమాదం ఉందని రైతులు బెంబేలెత్తిపోతున్నారు.  

పీడిస్తున్న టార్పాలిన్ల కొరత.. 
ఇక టార్పాలిన్ల కొరత కూడా రైతులను పట్టిపీడిస్తోంది. అద్దెకు తెచ్చుకుని కప్పుకుంటున్నారు. అవి కూడా అరకొరగానే దొరుకుతున్నాయి. ఎకరం విస్తీర్ణంలో పండిన ధాన్యానికి కనీసం మూడ్రోజులపాటు ఆరబెట్టుకునేందుకు రూ.వెయ్యి నుంచి రెండువేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. వర్షాలు మరో నాలుగైదు రోజులు కొనసాగితే అద్దె భారం తడిసి మోపెడవక తప్పని పరిస్థితి.   

అమ్ముకోవాలంటే మండపేటకు వెళ్లండి
ఇదిలా ఉంటే.. కృష్ణాజిల్లాలో రైసుమిల్లుల వద్ద ధాన్యం లోడులతో వందలాది లారీలు బారులుతీరాయి. దీంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలేదు. పైగా.. అమ్ముకోవాలంటే మండపేట మిల్లులకు తరలించుకోవాలని రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. కృష్ణాజిల్లా నుంచి మండపేట తరలించాలంటే రైతులకు రవాణా చార్జీలు తడిసిమోపెడవుతాయి. ఒకవేళ వ్యయప్రయాసలకోర్చి తరలించినా మండపేట మిల్లుల వద్ద కూడా 3–4 రోజుల పాటు పడిగాపులు పడాల్సిన పరిస్థితులున్నాయని చెబుతున్నారు.   

జీఎల్టీ చెల్లింపుల ఊసులేదు.. 
వైఎస్‌ జగన్‌ హయాంలో హమాలీల చార్జీలు భరించడంతో పాటు రవాణా సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చేది. ఒకవేళ రైతే సొంతంగా తరలించుకుంటే గన్నీ, లేబర్, ట్రాన్స్‌పోర్టు (జీఎల్‌టీ) చార్జీలు నేరుగా రైతుల ఖాతాలో జమచేసేది. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వంలో హామీల చార్జీలు చెల్లించడంగానీ, రవాణా సౌకర్యాలు కల్పించడంగానీ ఎక్కడా జరగడంలేదు.   

మంత్రి నాదెండ్ల ప్రచారార్భాటం.. 
విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై 60 కిలోమీటర్ల పొడవునా ఇరువైపులా సర్వీవస్‌ రోడ్లలో ధాన్యం రాశులే కన్పిస్తున్నాయి. తుపాను హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం రాసులు శనివారం కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఈ వారం జిల్లా పర్యటనలో ప్రచారార్భాటానికి ఇచ్చిన ప్రాధాన్యత ధాన్యం కొనుగోళ్లపై పెట్టలేదని సాక్షాత్తు రైతులే ఆరోపించారు. నిజానికి.. రోడ్లపై ఆరబడిన ధాన్యాన్ని 48 గంటల్లోనే మిల్లులకు తరలిస్తామని మంత్రి ఆర్భాటంగా ప్రకటన చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ పరిస్థితిలేదు.  

కృష్ణా జిల్లా కంకిపాడు సమీపంలో తడిసిపోయిన వరి పనలు  

జిల్లాల్లో ఇదీ పరిస్థితి..
ఉత్తరాంధ్రలో విశాఖ, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో 50–60 శాతం కోతలు పూర్తికాగా, అనకాపల్లి జిల్లాలలో కేవలం 12 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. ఈ జిల్లాల్లో తుపాన్‌ ప్రభావం పెద్దగా ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే ధాన్యం రంగుమారి రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. 

⇒ పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో 60–70 శాతం కోతలు పూర్తయ్యాయి. కళ్లాల్లో లక్ష టన్నులకు పైగా ధాన్యం రాసులు పోసి ఉన్నాయి. దాదాపు లక్ష ఎకరాల పంట పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉంది. ఈ దశలో వర్షాలు కురిస్తే కళ్లాల్లో ఉన్న ధాన్యం రంగుమారడమే కాదు.. వర్షపు నీరు పొలాల్లో చేరి కనీసం 2–3 రోజులుంటే పక్వానికి వచ్చిన పంటకు కూడా తీవ్రనష్టం తప్పదంటున్నారు. 

⇒ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 30–40 నూరి్పడి చేసిన ధాన్యాన్ని రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పోసి ఆరబెట్టుకుంటున్నారు. ఈ డెల్టా పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోతకు వచి్చన వరి పంట నేలవాలింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మొలకలొచ్చే పరిస్థితులు కని్పస్తున్నాయి. పొలాల్లో వర్షపు నీరుచేరితే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 

⇒ గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కేవలం 15 శాతానికి మించి కోతలు పూర్తికాలేదు. కోత కోసి ఓదె మీద ఉన్నప్పుడు వర్షం వస్తే నష్టం ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతో యంత్రాలతోనే నూర్పిడికి మొగ్గు చూపుతున్నారు. ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు పడితే తాము నిండా మునిగిపోతామని రైతులు కలవరపడుతున్నారు. ఈ జిల్లాల్లో తీతకు సిద్ధంగా ఉన్న పత్తి, వాగుల వెంబడి ఉన్నా మిరప పంటలు దెబ్బతినే అవకాశం కన్పిస్తోంది. 

⇒ నెల్లూరు జిల్లాలో రైతులు ముందస్తు రబీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో ఈ జిల్లాల్లో వరి సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. పెన్నా డెల్టా, కనుపూరు కాలువల కింద వరి నారుమడుల కోసం విత్తనాలు జల్లారు. మరికొన్నిచోట్ల నారుమడులు సిద్ధంచేసుకుంటున్నారు. ఈ దశలో 2–3 రోజులు వర్షాలు కురిసి, పొలాల్లో నీరుచేరితే నష్టపోతామని రైతులు చెబుతున్నారు.  

⇒ తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో పంట 45–60 రోజుల దశలో ఉంది. ఈ జిల్లాల్లో కూడా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురిసి చేలల్లో చేరిన నీరు నిలిస్తే మాత్రం నష్టతీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement