Rice crops
-
విజయవాడ : తొలకరి తెచ్చిన కోలాహలం.. రైతన్న ముఖంలో చిరునవ్వు (ఫొటోలు)
-
అల్లుడు బియ్యం అదుర్స్!
నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది.. ఔషధ విలువలున్న ఆహారం తీసుకోవడంపై ఆసక్తి పెరిగింది.. సేంద్రియ విధానంలో సాగు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.. పాత కాలం పంటలకు ప్రస్తుతం మరింత గిరాకీ వచ్చింది. ఆ క్రమంలోనే తమిళనాడుకు చెందిన అల్లుడు బియ్యం (మాపిళ్లై సాంబ) వరి వంగడం పలమనేరు మండలంలో సాగులోకి వచ్చింది. అత్యున్నత గుణాలున్న ఈ బియ్యా నికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఏడు నెలల కాల పరిమితితో చేతికందే ఈ పంట రైతుకు కాసులవర్షం కురిపించే అవకాశముంది. అలాగే పురాతన వంగడాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సాక్షి, పలమనేరు: సాధారణంగా మనం తినే బియ్యం తెలుపు రంగులో ఉంటుంది. వరి పంట కాలం కూడా నాలుగునెలలు మాత్రమే. పంట నాలుగడుగుల దాకా పెరుగుతుంది. కానీ అల్లుడు బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. దీని పంటకాలం ఏడు నెలలు. ఆరు నుంచి ఎనిమిది అడుగులు వరకు పెరుగుతుంది. ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలుండడంతో విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. గతంలో తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి ప్రాంతంలోని రైతులు శతాబ్దాల నుంచి ప్రకృతి విధానంలో సాగు చేస్తూ వస్తున్నారు. వారు కాపాడుకుంటూ రావడం వల్లే అపురూపమైన మాపిళ్లై సాంబ రకం వంగడాలు నేటి తరానికి అందుబాటులోకి వచ్చాయి. అక్కడి నుంచి విత్తనాలను తీసుకువచ్చి పలమనేరు మండలంలోని కూర్మాయి వద్ద ఓ ఔత్సాహిక రైతు చందూల్ కుమార్ ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. సేంద్రియ పద్ధతులో పంట పండిస్తున్నారు. ప్రస్తుతం పంట ఏపుగా ఎదిగింది. ఒబ్బిడికి సిద్ధంగా తయారైంది. వంగడం చరిత్ర ఇదీ.. తమిళనాడుతోపాటు కేరళలోని పలు జిల్లాల్లో సాగు చేస్తున్న పురాతన వరి వంగడమే మాపిళ్లై సాంబ రకం. తమిళంలో మాపిళ్లై అంటే పెళ్లికొడుకు, అల్లుడు అని అర్థం. పాత కాలంలో అల్లుడు దృఢంగా ఉండాలని పెళ్లికుమార్తె ఇంటి వారు ఈ రకం బియ్యాన్ని వండిపెట్టేవారట. నూతన వధూవరులకు ఈ రకం అన్నాన్నే పెట్టడం ఇప్పటికీ కన్యాకుమారి ప్రాంతంలో ఉంది. ఇందులోని ఔషధ విలువల కారణంగా పురుషులకు వీర్యపుష్టి లభిస్తుందని నమ్ముతారు. ఈ బియ్యాన్ని తింటే కాన్పు సాధారణంగా అవుతుందని విశ్వసిస్తారు. అల్లుళ్లకు ప్రత్యేకంగా వడ్డిస్తారు కనుకే ఈ రకం బియ్యాన్ని మాపిళ్లై సాంబ అని పిలుస్తుంటారు. ఏపీ, తెలంగాణాలో అల్లుడు సాంబ, పెళ్లికొడుకు సాంబ, కేరళలో వరణ్సాంబ, కర్ణాటకలో వర సాంబ, ఉత్తరాది రాష్ట్రాల్లో దుల్హా సాంబగా పేర్లున్నాయి. ఆన్లైన్లో ఈ రకం బియ్యానికి బ్రైడ్‌గ్రూమ్ రైస్ అని పిలుస్తున్నారు. ఇది రాయలసీమలోని బైరొడ్లును పోలి ఉంటుంది. పలు సమస్యలకు ఔషధమే! ఈ రకం కిలో బియ్యంలో ఓ గ్రాము ఫ్యాట్, 80 గ్రాముల కార్బొహ్రైడ్రేట్, 7 గ్రాముల ఫైబర్, 7 గ్రాముల ప్రొటీన్, 50.8 గ్రాముల కాల్షియం, 90.4 గ్రాముల పోషకాలు, 5.47 గ్రాముల ఐరన్ పోషకాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిర్ధారించారు. ఈ బియ్యంతో వండిన ఆహారాన్ని భుజిస్తే రక్తశుద్ధితోపాటు మల బద్దకం, పైల్స్ సమస్యలు తలెత్తవు. అలాగే మధుమేహం బారిన పడినవారికి కూడా మేలు చేస్తుంది. రూ.200 పైమాటే.. దుకాణాల్లో ఈ రకం బియ్యం పెద్దగా అందుబాటులో లేదు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీలు కిలో నుంచి మూడు, ఐదు కిలోల బ్యాగుల్లో వీటిని ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. డీమార్ట్, బిగ్ బాస్కెట్లాంటి మాల్స్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. రూ.160 నుంచి రూ.250 దాకా కంపెనీలను బట్టి ధరలున్నాయి. దేశావాళి వరి వంగడాల్లో అగ్రస్థానం.. హరిత విప్లవం తర్వాత పలు రకాల హైబ్రిడ్ వరి వంగడాలు సృష్టించబడ్డాయి. సుమారు 2వేల దాకా వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం దేశవాళీ రకాలు వంశపారంపర్యంగా సాగులో ఉన్నాయి. అందులో అత్యంత పోషకాలు కలిగినవిగా రత్నబోడి, నవారా, కులాకర్, తాజముడి, కుజిపాటియాలా, మైసూర్మల్లిగె, చిట్టి ముత్యాలు, బర్మాబ్లాక్, బహురూపి, కుంకుమసార, కాలాబాటి, కోతాంబరి లాంటివి పేరు గడించాయి. అయితే వీటన్నింటికీ మించిన రకంగా మాపిళ్లై సాంబ అగ్రస్థానంలో నిలుస్తుంది. అందుకే మార్కెట్లో దీనికంత డిమాండ్ ఏర్పడింది. అధ్యయనం చేసి సాగు చేశా కొన్నేళ్ల నుంచి ప్రకృతి సేద్యం చేస్తున్నా. పలు రకాల దేశీయ వరి వంగడాలను సాగు చేస్తున్నా. గతంలో బ్లాక్‌రైస్‌ను సాగుచేశా. కానీ అన్నింటికంటే ఎక్కువ ఔష ధ గుణాలున్న మాపిళ్లై సాంబ సాగు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, బాగా అధ్యయనం చేశా. అనంతరం సాగు ప్రారంభించా. ఈ ప్రాంత రైతులకు ఈ వంగడాన్ని పరిచయం చేసి సాగు పెంచాలని భావిస్తున్నా. – చందూల్కుమార్, రైతు, కూర్మాయి, పలమనేరు మండలం అవగాహన పెరుగుతోంది హైబ్రిడ్ వరి వంగడా ల స్థానంలో దేశవాళీ విత్తనాలపై రైతుల్లో అవగాహన పెరిగింది. ముఖ్యంగా సేంద్రి య సేద్యంపై ఎక్కవ మంది మక్కువ చూపుతున్నారు. అపురూపమైన మాపిళ్లై సాంబకు (ఏంఏపీఎస్ఏఎంబీఏ–1) మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రైతులు ఇలాంటి వరి వంగడాలను సాగు చేసేలా గ్రామాల్లో అవగాహన కలి్పస్తున్నాం. – సంధ్య, వ్యవసాయాధికారి, పలమనేరు మండలం మంచి పోషక విలువలు మన పూరీ్వకులు పండించిన ఎన్నో రకాల దేశీవంగడాలు కనుమరుగైయ్యాయి. కానీ కొందరు ఔత్సాహిక రైతులు మళ్లీ వాటిని సాగుచేస్తున్నారు. వీటిలో ఎన్నో రకాల పోషకాలున్నాయి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండడంతో మలబద్దకం సమస్య తగ్గుతుంది. అనీమియాతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది. కొలె్రస్టాల్‌ను కూడా తగ్గిస్తుంది. – యుగంధర్, మెడికల్ ఆఫీసర్, పలమనేరు -
రంగుల బియ్యం రెడీ
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇప్పటివరకు నల్ల బియ్యం, ఎర్ర బియ్యం అనేవి దేశవాళీ రకాల్లోనే ఉన్నాయి. బర్మా బ్లాక్, కాలాబటీ, మణిపూర్ బ్లాక్ రకాలుగా పిలిచే వీటిని అస్సాం, మణిపూర్, మేఘాలయ తదితర రాష్ట్రాల్లోని రైతులు.. అక్కడక్కడా ఏపీ రైతులు సైతం పండిస్తున్నారు. లావు రకానికి చెందిన ఈ బియ్యాన్ని వండితే అన్నం ముద్దగా ఉంటోంది. ఎకరానికి 10 నుంచి 15 బస్తాలకు మించి దిగుబడి రావటం లేదు. ఎర్ర బియ్యంలో కేరళకు చెందిన నవారా రకం కూడా ఉన్నా.. ఇది ఎకరాకు 10 బస్తాలకు మించి దిగుబడి ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆర్గానిక్, నేచురల్ ఫార్మింగ్ విధానంలో ఈ రకాలు మన రాష్ట్రంలోనూ అరకొరగా సాగవుతున్నాయి. డిమాండ్ ఉన్నా.. దిగుబడి తక్కువగా ఉండటంతో గిట్టుబాటు కాక రైతులు వీటి సాగు వైపు మొగ్గు చూపటం లేదు. బ్లాక్, రెడ్ రైస్ ధాన్యం పైపొరలో ‘యాంతోసైనిన్’ అనే పదార్థం ఉండటం వల్ల వాటికి ఆ రంగు వస్తుంది. బియ్యాన్ని పైపొరతో కలిపి తినాలి. వీటిలో ఐరన్, జింక్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ రకాలు లావుగా ఉండి అన్నం ముద్దగా వస్తుండటంతో ప్రజలు తినడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. బాపట్ల వరి పరిశోధన స్థానంలో సన్న రకాలుగా రూపొందించిన రెడ్, బ్లాక్ రైస్ బాపట్ల శాస్త్రవేత్తల కృషి ఫలించి.. ఈ రెండింటినీ సన్నరకాలుగా ఉత్పత్తి చేస్తే ప్రజలు తినేందుకు ఆసక్తి చూపిస్తారని బాపట్ల వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు భావించారు. 2019లో పరిశోధనలు చేపట్టి బీపీటీ–2848 రకం బ్లాక్ రైస్‌ను తొలుత సృష్టించారు. దీనిని మినీ కిట్‌గా రైతులకు అందించారు. మూడేళ్లపాటు వెయ్యి కిట్లు ఇచ్చి మినీ కిట్ దశ పూర్తి చేశారు. ఈ బియ్యం అచ్చం బీపీటీ–5204 రకం మాదిరిగా సన్నబియ్యంగానే ఉన్నాయి. ప్రయోగం విజయవంతం కావడంతో బీపీటీ–2841, 3136, 3137, 3145 తదితర రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. బ్లాక్ రకంలో ఫైబర్, మాంసకృత్తులు అధికంగా ఉండగా.. రెడ్ రైస్‌లో బీపీటీ–2858, 3143, 3182, 3140, 3111, 3507 రకాలను సైతం సృష్టించారు. వీటిలో జింక్, ఐరన్, సూక్ష్మపోషకాలు అధికం. ఈ వంగడాలు అధిక దిగుబడులు ఇవ్వడంతోపాటు ప్రజలకు రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యాన్ని ఇస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విత్తనాలను మూడేళ్లపాటు ప్రయోగాత్మకంగా రైతులకు అందించి నాణ్యతా ప్రమాణాలను పరీక్షించారు. తాజాగా ఈ విత్తనాలకు నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ (న్యూఢిల్లీ) గుర్తింపు ఇచ్చింది. ఈ ఏడాది ఈ విత్తనాన్ని బాపట్ల వరి పరిశోధన స్థానం పరిధిలోని రైతులతో పాటు ఆసక్తి గల ప్రైవేట్ కంపెనీలకు అందించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. బేబీ ఫుడ్‌లా బ్లాక్ రైస్ పౌడర్ బీపీటీ–2848 రకం బ్లాక్ రైస్ పౌడర్ రూపంలో పిల్లలకు బేబీ ఫుడ్‌లా (హార్లిక్స్ తరహాలో) అందించేందుకు వివిధ కంపెనీలు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఉప్మా రవ్వ, పౌడర్, జావ, పాయసం, కేకులు, అటుకులు, వడియాలు, మరమరాలు, నూడిల్స్, సేమియా తదితర పదార్థాలుగా తయారు చేయాలని బాపట్ల పరిశోధన స్థానం ఇప్పటికే నిర్ణయించింది. ఈ బ్లాక్ రైస్ వంటకాలు తినడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడటంతోపాటు కళ్ల జబ్బులు పోతాయని, పలు రకాల అనారోగ్య సమస్యలు తొలగుతాయని పరిశోధనలో తేలినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరింతగా పోషకాలు సాధారణ రకం వడ్లను పూర్తి స్థాయిలో పాలిష్ పడితే 6 లేదా 7 శాతం మాంసకృత్తులు మాత్రమే ఉంటాయి. అదే కొత్తగా రూపొందించిన బ్లాక్, రెడ్ రైస్‌లో 10.5 శాతం మాంసకృతులు ఉన్నాయి. బీపీటీ–2841 రకంలో అత్యధికంగా 13.7 శాతం ప్రోటీన్లు ఉండటం విశేషం. మొత్తంగా ఈ రకాల్లో టోటల్ ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు సాధారణ రకాలతో పోలిస్తే 3 నుంచి 4 రెట్లు అధికం. శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రీరాడికల్స్‌ను ఇవి సమతుల్యం చేస్తాయి. దీర్ఘకాలిక రోగాలను ఎదుర్కొనే ఇమ్యూనిటీ ఇస్తాయి. ఇవి ఎకరానికి 30 బస్తాలకు తగ్గకుండా దిగుబడి ఇస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 30 బస్తాలకు తగ్గకుండా దిగుబడి బాపట్ల వరి పరిశోధన స్థానంలో బ్లాక్, రెడ్ రైస్ వంగడాలను సన్నరకాలుగా ఉత్పత్తి చేశాం. ఇప్పటికే బ్లాక్ రైస్ మినీకిట్ మూడు సంవత్సరాల దశ పూర్తయ్యింది. దీనికి నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ (న్యూఢిల్లీ) గుర్తింపు ఇచ్చింది. ఎకరాకు 30 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వస్తుంది. మనుషుల ఆరోగ్యానికి అత్యంత అనుకూలమైన రకం. చర్మ సౌందర్యంతోపాటు కళ్లకు మంచిదని పరిశోధనలో తేలింది. ఈ ఏడాది నుంచి రైతులతోపాటు ప్రైవేట్ కంపెనీలకు సీడ్ అందజేస్తాం. రెడ్ రైస్ సైతం మొదటి ఏడాది మినీ కిట్ దశ పూర్తయింది. ఆసక్తి ఉన్న రైతులకు ఇవి కూడా అందజేస్తాం. – బి.కృష్ణవేణి, ప్రధాన శాస్త్తవేత్త, బాపట్ల వరి పరిశోధన స్థానం -
‘మైసూర్ మల్లిక’తో ఆదాయం అదుర్స్..
కోదాడ రూరల్: మైసూర్ మల్లిక అనే దేశవాళీ వరి వంగడం సాగుచేస్తూ కళ్లు చెదిరే ఆదాయం ఆర్జిస్తున్నాడు కోదాడ మండల పరిధిలోని రెడ్లకుంటకు చెందిన రైతు చండ్ర వెంకటేశ్వరరావు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి మైసూర్ మల్లిక దేశవాళీ వరి విత్తనాలను తెప్పించి ఎకరం విస్తీర్ణంలో పంట సాగుచేసేందుకు నారు పెంచాడు. ఎకరానికి 8 నుంచి 10 కేజీల విత్తనాలు సాధారణ వరి సాగు పద్ధతిలోనే నాటు వేశాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తూ ఎలాంటి పురుగు మందులు, దుక్కి మందులు వాడలేదు. అవసరమైనప్పుడు వేరుశనగ చెక్కను డ్రమ్ము నీటిలో నానబెట్టి దానిని బావిలో వదిలి ఆ నీటిని పంటకు అందించాడు. తెగుళ్ల బెడద లేదు.. దేశవాళీ వరి వంగడం కావడం, సేంద్రియ సాగుకు నేల అనుకూలంగా ఉండడంతో పంటకు ఎలాంటి తెగుళ్లు సోకలేదని రైతు చండ్ర వెంకటేశ్వర్రావు తెలిపాడు. అదేవిధంగా ఈ రకం వరికి వ్యాధినిరోధక శక్తి కూడా ఎక్కువ అని, గాలి దుమ్ముకు కూడా పంట నేలవాలలేదని పేర్కొన్నాడు. పైరు మూడున్నర అడుగుల ఎత్తు వరకు పెరిగిందని, ప్రస్తుతం వరి కోత పూర్తయ్యిందని, ఎకరంలో 19క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చిందని తెలిపాడు. ఎకరానికి రూ.లక్ష పైచిలుకు ఆదాయం మైసూర్ మల్లిక రకం బియ్యానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ఎకరానికి 19 క్వింటాళ్లు వచ్చిందని, మిల్లు పట్టిస్తే క్వింటాల్‌కు 65 కేజీల చొప్పున మొత్తంగా 11క్వింటాళ్ల పైనే బియ్యం వచ్చిందని రైతు చండ్ర వెంకటేశ్వర్రావు పేర్కొన్నాడు. ఈ బియ్యాన్ని కేజీ రూ.80 చొప్పున కోదాడలోని తన సేంద్రియ ఉత్పత్తుల షాపులోనే అమ్ముతున్నట్లు తెలిపాడు. ఎకరానికి వచ్చే 19క్వింటాళ్ల వరి ధాన్యాన్ని క్వింటాల్ రూ.8వేల చొప్పున అమ్మినా రూ.1,52,000 ఆదాయం వస్తుందని, పెట్టుబడి ఖర్చు రూ.30వేలు పోగా రూ.1.22లక్షల నికర ఆదా యం తప్పకుండా ఉంటుందని రైతు వివరించాడు. రసాయన ఎరువులు వాడలేదు గత ఐదేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. మైసూర్ మల్లిక దేశవాళీ వరి వంగడం సాగుకు ఎలాంటి రసాయన ఎరువులు వాడలేదు. ఎకరానికి 11 క్వింటాళ్ల బియ్యం దిగుబడి వచ్చింది. ఆ బియ్యాన్ని కోదాడ పట్టణంలోని నా సేంద్రియ ఉత్పత్తుల షాపులో కేజీ రూ.80 చొప్పున విక్రయిస్తున్నాను. చా లా మంది ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. –చండ్ర వెంకటేశ్వరరావు, సేంద్రియ రైతు, రెడ్లకుంట -
జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సృష్టి ‘ఆర్ఎన్ఆర్ 29235’.. సరికొత్త వరి వంగడం
వ్యవసాయ వర్సిటీ విడుదల చేసిన వరి వంగడాల్లో అత్యంత కీలకమైనది ‘ఆర్ఎన్ఆర్ 29235’ రకమే. ఇప్పటివరకు యాసంగిలో వేస్తున్న వివిధ రకాల వరి రకాల్లో నూక శాతం అధికంగా ఉంటోంది. ఇది ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కూడా కారణమైంది. ప్రస్తుతం యాసంగిలో వేస్తున్న వరి రకాలను మిల్లింగ్ చేసినప్పుడు 40% బియ్యం, 60% నూకలు వస్తున్నాయి. అదే తాజాగా విడుదల చేసిన ‘ఆర్ఎన్ఆర్ 29235’ రకం వరి అయితే బియ్యం దాదాపు 62%, నూకలు 38% వస్తాయని.. దీనివల్ల కొనుగోళ్ల వివాదానికి ఫుల్స్టాప్ పడుతుందని వర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్ తెలిపారు. కొత్తగా విడుదల చేసిన అన్ని రకాల వరి వంగడాల ద్వారా అదనంగా 10% దిగుబడి వస్తుందని వివరించారు. ఇక వరి పంటకాలం ఇప్పటివరకు 135 రోజులుగా ఉండగా.. కొత్త రకాలు 125 రోజులకే కోతకు వస్తాయని వెల్లడించారు. సాక్షి, హైదరాబాద్: తక్కువ సమయంలో దిగుబడి రావడంతోపాటు మిల్లింగ్ చేసినప్పుడు నూకలు తక్కువగా వచ్చే సరికొత్త వరి రకాన్ని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ‘ఆర్ఎన్ఆర్ 29235’ పేరిట ఈ సరికొత్త వరి వంగడాన్ని తాజాగా విడుదల చేసింది. ఇతర రకాల వరితో పోలిస్తే దీనిద్వారా దిగుబడి కూడా పది శాతం ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. దీనితోపాటు మరో 9 రకాల వరి వంగడాలు, ఇంకో ఐదు ఇతర పంటల రకాలను వ్యవసాయ వర్సిటీ విడుదల చేసింది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాలను తట్టుకునేలా, తక్కువ కాలంలోనే దిగుబడి వచ్చేలా ఈ వంగడాలను అభివృద్ధి చేసినట్టు తెలిపింది. వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని.. వచ్చే ఏడాది వానాకాలం సీజన్ నాటికి కొత్త రకాలు రైతులకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. వీటితో రైతులకు లాభసాటిగా ఉండటంతోపాటు వినియోగదారులకూ ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో..: ప్రస్తుతం అభివృద్ధి చేసిన కొత్త వంగడాల్లో ఎనిమిదింటిని జాతీయ స్థాయిలో, ఏడింటిని రాష్ట్రస్థాయిలో విడుదల చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఢిల్లీలో జరిగిన జాతీయ వంగడాల విడుదల, నోటిఫికేషన్ కమిటీ సమావేశంలో.. వరిలో ఐదు, పశుగ్రాస సజ్జలో రెండు, నువ్వుల్లో ఒక రకానికి ఆమోదం లభించింది. ఇక సెప్టెంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయిలో కొత్త వంగడాల విడుదల ఉప కమిటీ సమావేశంలో ఐదు వరి రకాలు, మినుము, నువ్వు పంటల్లో ఒక్కో రకం చొప్పున ఏడు నూతన రకాలను ఆమోదించారు. మొత్తంగా ఈ 15 వంగడాలను వ్యవసాయ వర్సిటీ తాజాగా విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక 2014 నుంచి ఇప్పటివరకు వ్యవసాయ వర్సిటీ మొత్తంగా 61 కొత్త వంగడాలను అభివృద్ధి చేసింది. ఇందులో 26 వరి రకాలు, 8 కంది రకాలు ఉన్నాయి. రైతుల ప్రయోజనమే లక్ష్యంగా: ఇన్చార్జి వీసీ రఘునందన్‌రావు రైతులకు మేలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం వ్యవసాయ శాఖ అనేక చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి, వర్సిటీ ఇన్చార్జి వీసీ రఘునందన్‌రావు, రిజి్రస్టార్ ఎస్.సుధీర్ కుమార్, రీసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. పత్తిలో నూతన రకాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అధిక సాంద్రత పత్తిపై ప్రయోగాలు జరుగుతున్నాయని.. దానిని 8,500 ఎకరాల్లో సాగు చేస్తున్నామని వివరించారు. కొత్త వంగడాల అభివృద్ధికి గతంలో 8–10 ఏళ్ల సమయం పట్టేదని, స్పీడ్ బ్రీడింగ్ బయో టెక్నాలజీ వినియోగంతో ఐదేళ్లలో ప్రయోగం పూర్తవుతోందని తెలిపారు. ఇక జన్యుమారి్పడి వంగడాలపైనా వర్సిటీ దృష్టి సారించినట్టు తెలిపారు. ఇప్పటికే మొక్కజొన్న, వరిలో ఈ తరహా పరిశోధనలు చేపట్టామని.. పత్తికి సంబంధించి కేంద్రం అనుమతి కోరామని వెల్లడించారు. జాతీయ స్థాయిలో విడుదలైన రకాలివీ.. 1) వరి–1 (ఆర్ఎన్ఆర్ 11718): కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పండించేందుకు సిఫార్సు చేశారు. ఖరీఫ్‌కు అనుకూలం. పంట కాలం 135 నుంచి 140 రోజులు. హెక్టారుకు 7 వేల నుంచి 8 వేల కిలోలు దిగుబడి వస్తుంది. చవుడు నేలల్లోనూ వేసుకోవచ్చు. 2) తెలంగాణ రైస్ 5 (ఆర్ఎన్ఆర్ 28362): ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలానికి అనుకూలం. పంట కాలం 130–135 రోజులు. దిగుబడి హెక్టారుకు 7,000–7,500 కిలోలు 3) తెలంగాణ రైస్ 6 (కేఎన్ఎం 7048): ఒడిశా, పశి్చమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల కోసం సిఫార్సు చేశారు. వానాకాలం అనుకూలం. పంట కాలం 115–120 రోజులే. దిగుబడి హెక్టారుకు 8000–8500 కిలోలు. ఇది దొడ్డురకం. 4) తెలంగాణ రైస్ 7 (కేఎన్ఎం 6965): ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు సిఫార్సు చేశారు. వానాకాలం పంట. 115–120 రోజుల్లో చేతికి వస్తుంది. దిగుబడి హెక్టారుకు 7500–8500 కిలోలు. ఇది పొడవు సన్నగింజ రకం. 5) తెలంగాణ రైస్ 8 (డబ్లు్యజీఎల్ 1487): వానాకాలం పంట. 125–130 రోజుల్లో.. హెక్టారుకు 5,600–6,000 కిలోల దిగుబడి వస్తుంది. మధ్యస్థ, సన్నరకం ఇది. ఫాస్పరాస్ తక్కువగా ఉన్న నేలలకు అనుకూలం. 6) నువ్వులు– తెలంగాణ తిల్–1 (జేసీఎస్ 3202): తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు సిఫార్సు చేశారు. పంటకాలం 91–95 రోజులే. హెక్టారుకు 820–980 కిలోలు దిగుబడి వస్తుంది. 7) తెలంగాణ పశుగ్రాసపు సజ్జ–1 (టీఎస్ఎఫ్బీ 17–7): తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్టాలకు వానాకాలం సీజన్‌కు సిఫార్సు చేశారు. పంటకాలం (5౦శాతం పూతదశ) 56–68 రోజులు. 8) తెలంగాణ పలుకోతల సజ్జ–1 (టీఎస్ఎఫ్బీ 18–1): పంటకాలం (5౦శాతం పూత దశ ) 56–68 రోజులు. రాష్ట్రస్థాయిలో విడుదలైన రకాలివీ.. 1) రాజేంద్రనగర్ వరి–3 (ఆర్ఎన్ఆర్ 15459): రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలంలో 135– 140 రోజుల పంట. దిగుబడి హెక్టారుకు 4,000– 4,500 కిలోలు వస్తుంది. సువాసన గల అతి చిన్న గింజ రకం ఇది. సాంప్రదాయ చిట్టిముత్యాల రకం వరితో పోలి్చతే చేనుపై పంట పడిపోయే అవకాశం తక్కువ. 2) రాజేంద్రనగర్ వరి–4 (ఆర్ఎన్ఆర్ 21278): రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలం, యాసంగి సీజన్లలో వేయవచ్చు. వానాకాలంలో 115–120 రోజుల స్వల్పకాలిక రకం. దిగుబడి హెక్టారుకు 6,500 కిలోలు వస్తుంది. అగ్గితెగులును మధ్యస్థంగా తట్టుకుంటుంది. పొట్టి గింజ రకం, చేనుపై పంట పడిపోదు. 3) రాజేంద్రనగర్ వరి–5 (ఆర్ఎన్ఆర్ 29235): రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాల్లో రెండు సీజన్లలో పండించొచ్చు. వానాకాలంలో 120–125 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. దిగుబడి హెక్టారుకు 7,500 కిలోలు. పొడవు, సన్నగింజ రకం. పొడవు గింజ రకాల్లో అధిక దిగుబడి ఇచ్చే రకం ఇదే. చేను పొట్టిగా ఉండి పడిపోదు. యాసంగిలో ఈ రకం ధాన్యం మిల్లింగ్ చేస్తే నూకలు తక్కువగా వస్తాయి. 4) జగిత్యాల వరి–2 (జేజీఎల్ 28545): రాష్ట్రంలోని నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలంలో 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. హెక్టారుకు 7,500 కిలోలు దిగుబడి ఇస్తుంది. 5) జగిత్యాల వరి–3 (జేజీఎల్ 27356): రాష్ట్రంలోని నీటి వసతిగల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలానికి అనుకూలం. పంట కాలం 130–135 రోజులు. దిగుబడి హెక్టారుకు 7000 కిలోలు వస్తుంది. ఇది అతి సన్నగింజ రకం ఇది. 6) మధిర మినుము–1 (ఎంబీజీ 1070): తెలంగాణ రాష్ట్రం అంతటా పండించడానికి అనుకూలం. వానాకాలం, యాసంగి, ఎండాకాలంలలోనూ పండించవచ్చు. పంటకాలం 75–80 రోజులు. హెక్టారుకు దిగుబడి 1,400–1,500 కిలోలు వస్తుంది. మధ్యస్థ దొడ్డు నలుపు గింజ రకం ఇది. 7) జగిత్యాల తిల్ –1 నువ్వులు (జేసీఎస్ 1020): పంటకాలం 85–95 రోజులు. దిగుబడి హెక్టారుకు 1,050–1,100 కిలోలు వస్తుంది. -
ఎకరం కూడా ఎండకుండా.. రైతన్న సంబరపడేలా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న, మధ్య, భారీతరహా ప్రాజెక్టుల కింద రబీలో 35.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తోంది. గతేడాది రబీలో 24 లక్షల ఎకరాలకు నీళ్లందించి రికార్డు సృష్టించిన సర్కార్.. ప్రస్తుత రబీలో అదనంగా 11.21 లక్షల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది. యాజమాన్య పద్ధతుల ద్వారా ‘ఆన్ అండ్ ఆఫ్’ విధానంలో చివరి భూములకూ సమృద్ధిగా నీరందేలా జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి, కృష్ణా డెల్టాలు, సాగర్ కుడి కాలువ, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టుల కింద వరి ఎకరానికి సగటున 40 నుంచి 45 బస్తాల దిగుబడి వస్తుండటంతో వారిలో సంతోషం వెల్లివిరుస్తోంది. చిన్న, మధ్య, భారీతరహా ప్రాజెక్టులు, ఏపీఎస్ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ) నేతృత్వంలోని ఎత్తిపోతల పథకాల కింద 1.05 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రభుత్వం అభివృద్ధి చేసింది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలతో భారీ వర్షాలు పడడంతో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా, ఏలేరు, వాగులు, వంకలు ఉప్పొంగాయి. వరద నీటిని ఒడిసి పట్టిన సర్కార్.. గతంలో ఎన్నడూ నిండని ప్రాజెక్టులను సైతం నింపింది. దీంతో ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 78 లక్షల ఎకరాలకు నీళ్లందాయి. రికార్డు స్థాయిలో రబీలో నీటి సరఫరా.. రాష్ట్ర విభజన తర్వాత.. 2014 నుంచి 2019 వరకు గరిష్టంగా 2018లో మాత్రమే రబీలో 11.23 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. అయితే గోదావరి డెల్టాలో పంటలను రక్షించడంలో నాటి సర్కార్ పూర్తిగా విఫలమైంది. గతేడాది రబీలో 24 లక్షల ఎకరాలకు నీళ్లందించిన జలవనరుల శాఖ.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 35.21 లక్షల ఎకరాలకు నీటిని అందించింది. ప్రకాశం జిల్లా మల్లవరంలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కింద రబీలో సాగుచేసిన వరిపంట కోత పనులు కృష్ణా డెల్టా చరిత్రలో తొలిసారిగా.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌లో 13.08 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేస్తారు. కానీ.. 2019 వరకు రబీలో ఈ డెల్టాకు నీటిని సరఫరా చేసిన దాఖలాలు లేవు. గతేడాది 1.50 లక్షల ఎకరాలకు రబీలో నీటిని విడుదల చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది ఏకంగా 4.26 లక్షల ఎకరాలకు నీటిని అందించి చరిత్ర సృష్టించింది. దుర్భిక్ష సీమ కళకళ.. దుర్భిక్ష రాయలసీమలో రబీలో ఆయకట్టులో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. తుంగభద్ర హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ) కింద అనంతపురం జిల్లాలో తొలిసారిగా గరిష్టంగా 1.10 లక్షల ఎకరాలకు అధికారులు నీటిని సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో తెలుగుగంగ, హెచ్చెల్సీ, పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద 2.01 లక్షల ఎకరాల్లో, కేసీ కెనాల్, తుంగభద్ర ఎల్లెల్సీ (దిగువ కాలువ) కింద 2.44 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. రికార్డు స్థాయిలో నీటి సరఫరా.. గోదావరి డెల్టాతో పోటీపడుతూ నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా, తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టులు, కాన్పూర్ కెనాల్ కింద రైతులు 7.28 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. పెన్నా వరదను ఒడిసి పట్టి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపడం వల్లే నీటిని సరఫరా చేయడం సాధ్యమైందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలకు, శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు కింద వరుసగా రెండో ఏడాది రబీలో పంటల సాగుకు నీటిని విడుదల చేశారు. గోదావరిలో సహజసిద్ధ ప్రవాహం తగ్గినా.. గోదావరి డెల్టాలో రబీలో 8,96,538 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. రబీ పంట పూర్తి కావాలంటే 94.50 టీఎంసీలను సరఫరా చేయాలని అధికారులు లెక్కలు కట్టారు. డిసెంబర్లో గోదావరిలో 26.502 టీఎంసీలుగా నమోదైన సహజసిద్ధ ప్రవాహం జనవరిలో 11.560, ఫిబ్రవరిలో 3.387, మార్చిలో 1.957 టీఎంసీలకు తగ్గింది. దీంతో సీలేరు నుంచి డిసెంబర్లో 10.260, జనవరిలో 12.668, ఫిబ్రవరిలో 13.871, మార్చిలో 18.882 టీఎంసీలను విడుదల చేసి గోదావరి డెల్టాకు సరఫరా చేశారు. మంగళవారం వరకు డెల్టాకు 92.87 టీఎంసీలను సరఫరా చేశారు. మరో పది రోజుల్లో పంట కోతలను ప్రారంభిస్తారు. సమృద్ధిగా నీటిని అందించడంతో వరి పంట రికార్డు స్థాయిలో దిగుబడులు ఇస్తోంది. చివరి భూములకూ నీళ్లందించాం.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా, ఏలేరు, నాగావళి వరద నీటిని ఒడిసి పట్టి ప్రాజెక్టులను నింపాం. ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేశాం. రబీలోనూ గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేశాం. ఆన్ అండ్ ఆఫ్ విధానంలో.. యాజమాన్య పద్ధతులను అమలు చేయడం ద్వారా చివరి భూములకు నీళ్లందేలా చేశాం. ఒక్క ఎకరంలో కూడా పంట ఎండకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ -
విశిష్ట కృషీవలురు అత్తోట రైతులు
మనం ఏనాడో మరిచిపోయిన దేశవాళీ వరి రకాలను సంరక్షించటం, అందులోని పోషకాలను, విశిష్ట ఔషధ గుణాలను నేటి తరానికి ఆహారంతోపాటు అందించడానికి కొందరు అన్నదాతల బృందం పరితపిస్తోంది. ఈ ప్రకృతి వ్యవసాయదారులది గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని అత్తోట గ్రామం. ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో పండించిన విత్తనాలతో ‘దేశవాళీ వరి విత్తన నిధి’ ఏర్పాటు లక్ష్యంతో సమష్టిగా కృషి చేస్తుండటం వీరి ప్రత్యేకత. దేశీ వరి వంగడాలలోని జీవవైవిధ్యం సంరక్షణకు తోడ్పడుతూ, అక్కడి మట్టికి కొత్త పరిమళం అద్దుతున్నారు. అధిక దిగుబడి పొందటం కన్నా ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా సంప్రదాయ వరి రకాలను మక్కువతో సమష్టిగా సాగు చేస్తున్న ఈ రైతుల బృందానికి జేజేలు! అత్తోటలో దేశవాళీ వరి వంగడాల సాగుకు ఆద్యుడు యర్రు బాపన్న. మరో ఏడుగురు స్థానిక రైతులు కలిసొచ్చారు. సమష్టిగా దేశవాళీ వరి రకాల విత్తనాభివృద్ధికి పూనుకున్నారు. కొన్నేళ్ల క్రితం 5–10 సెంట్లలో కొన్ని రకాలతో ఆరంభించారు. 2018లో చేపట్టిన వంద రకాల సాగు సత్ఫలితాన్నిచ్చింది. 2019 ఖరీఫ్‌లో అయిదు ఎకరాల్లో 180 దేశీ వరి ర కాలను సాగు చేశారు. రానున్న ఖరీఫ్‌లో మరికొంత విస్తీర్ణాన్ని పెంచి 200 రకాల వంగడాల సాగుకు సమాయత్తమవుతున్నారు. వీరి స్ఫూర్తితో గ్రామంలో మరో 60 మంది రైతులు సొంతంగా 80 రకాల వరి రకాలను సాగు చేస్తుండటం మరో విశేషం! నిలువెత్తు వెన్నుతో ‘బహురూపి’, ఏపుగా పెరిగిన ‘కాలాబట్టి’ , చినికుమిని రకం ‘భారత్ బీజ్ స్వరాజ్ మంచ్’ ప్రతినిధి శివప్రసాదరాజు నుంచి ఈ రకాల విత్తనాలను సేకరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుకు కావాల్సిన ద్రవ, ఘన జీవామృతాలు, కషాయాలను స్వయంగా తయారు చేసుకుంటున్నారు. సాధ్యపడని ఇతర రైతులు కోరితే తయారుచేసి ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ జాతీయ జన్యువనరుల బ్యూరో, వాసన్ స్వచ్ఛంద సంస్థల నుంచి అవసరమైన సాంకేతిక సహకారాన్ని పొందుతున్నారు. గత సీజనులో వర్షాలు కొంత ఇబ్బంది పెట్టినా, ఎకరాకు 25–30 బస్తాల చొప్పున దిగుబడిని తీయగలిగారు. వీరు సాగు చేసిన వరి రకాల్లో బీపీటీ తరహాలోనే రోజువారీ ఆహార వినియోగానికి వీలుగా ఉండే ‘రత్నచోళి’ ఉంది. వర్షాధారమై, ఎక్కువ పోషకాలుండే ‘సారంగనలి’ మరో రకం. వండేటపుడు చక్కని సువాసననిచ్చే పొడుగైన బియ్యం ‘ఢిల్లీ బాసుమతి’, ‘ఇంద్రాణి’ రకాలు ఉన్నాయి. గడ్డి నుంచి బియ్యం వరకు సమస్తం నలుపురంగులో ఉండి రోగనిరోధక శక్తినిచ్చే ‘కాలాబట్టి’ (బ్లాక్ రైస్) ఉంది. తెగుళ్లు, దోమకాటు దరిచేరని ‘దాసమతి’, మధుమేహాన్ని అదుపుచేసే నవారా, బలవర్ధకమైన ‘మాపిళై సాంబ’తోపాటు నెల్లూరు మొలగొలుకులు, తులసీ బాసో, బాస్మతి, బహురూపి, చినుకుమిని, కుంకుమసాలి, దురేశ్వర్, పంచరత్న, రక్తశాలి, చింతలూరి సన్నం, కుజపటాలియా... వంటివి ప్రముఖమైనవి. దిగుబడిలో హెచ్చు తగ్గులున్నా ఈ రకాలన్నీ ఆరోగ్య ప్రయోజనాలనిచ్చేవి కావటంతో వీటిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. వ్యాధినిరోధక శక్తిని కలిగించేవీ, అవయవాల ఎదుగుదలకు ఉపయోగపడేవీ, నరాల బలహీనతను తగ్గించే రకాల దేశీ వరి రకాలూ వున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పని లేకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేస్తున్నందున సురక్షితమైన సేంద్రియ ఆహారం కూడా కావడంతో వీటి విలువ తెలిసిన వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ! – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి దేశవాళీ సాగు ఎప్పుడూ దెబ్బతీయదు దేశవాళీ వరి వంగడాల్లో గణనీయమైన జన్యు వైవిధ్యాలున్నాయి. వివిధ కారణాలతో ఇవి మరుగునపడిపోయాయి. అనేక రకాలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఔషధగుణాలున్న వీటి సంరక్షణకు మా వంతు కృషి చేస్తున్నాం. దేశవాళీ వంగడాల సాగు రైతును ఎప్పుడూ దెబ్బతీయదు. అత్యంత అధ్వాన్నమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ కనీసం యాభై శాతం ఫలితాన్ని అందిస్తుంది.– యర్రు బాపన్న (9100307308), ప్రకృతి వ్యవసాయదారుడు, అత్తోట, గుంటూరు జిల్లా హైబ్రిడ్ బియ్యంతో ఆకలి అణగదు హైబ్రిడ్ బియ్యం తింటే ఆకలి అణగదు. మరో 50 శాతం అదనంగా హైబ్రిడ్ బియ్యాన్ని తినాల్సి వస్తుంది. రుచి కూడా అంత బాగుండదు. దేశవాళీ బియ్యం ఇందుకు భిన్నం. మంచి గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి వుండటంతో, కొన్ని రకాలు మధుమేహ రోగులకు ఆరోగ్య సంరక్షిణులుగా నిలుస్తున్నాయి.– నామని రోశయ్య (9666532921), ప్రకృతి వ్యవసాయదారుడు,అత్తోట, గుంటూరు జిల్లా -
ఖరీఫ్‌కు ఐదు కొత్త వరి వంగడాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో సాగు చేసేందుకు ఐదు కొత్త వరి వంగడాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. రాష్ట్ర పరిశోధనా కేంద్రాల నుంచి ఇటీవల కాలంలో 13 రకాల కొత్త వంగడాలను విడుదల చేసినప్పటికీ.. రాష్ట్రంలో సాగు చేసేందుకు ఆరు రకాలు మాత్రమే పనికొస్తాయని అంచనా వేసినట్టు విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఏఎస్ రావు ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో పనికొచ్చేవి ఐదు ► రాష్ట్ర పరిధిలో పండించేందుకు ఐదు వరి వంగడాలతోపాటు ఒకటి జొన్న వంగడం. ► వరికి సంబంధించిన ఐదు రకాల్లో ఎంటీయూ–1224 (మార్టేరు సాంబ), ఎంటీయూ–1262 (మార్టేరు మసూరి), ఎంటీయూ–1210 (సుజాత), బీపీటీ–2595 (తేజ), ఎన్‌ఎల్‌ఆర్–3354 (నెల్లూరు ధాన్యరాశి) ఉన్నాయి. ► జొన్నకు సంబంధించి వీఆర్–988 (సువర్ణ ముఖి) కొత్త వంగడం విడుదలైంది. ► దేశ పరిధిలో విడుదల చేసిన వాటిలో వరికి సంబంధించి ఎంటీయూ–1223 (వర్ష), ఎంటీయూ–1239 (శ్రావణి).. గోగు పంటకు సంబంధించి ఏఎంయూ–8, ఏఎంయూ–9 (ఆదిత్య), జొన్నకు సంబంధించి వీఆర్–929 (వేగవతి), సజ్జకు సంబంధించి ఏబీవీ–04, పత్తికి సంబంధించి ఎల్‌డీహెచ్‌పీ ఉన్నాయి. ► ఈ ఖరీఫ్‌లో కృష్ణా జోన్‌లోని రైతులు ఎంటీయూ–1061 (ఇంద్ర), బీపీటీ–5204, 2270 (భావపురి సన్నాలు), ఎంటీయూ–1075 రకాలను ఎంపిక చేసుకోవచ్చు. కొత్తగా విడుదలైన ఎంటీయూ–1224 ఎంటీయూ–1262 కూడా సాగు చేసుకోవచ్చు. ► గోదావరి జోన్‌లోని రైతులు స్వర్ణ, ఇంద్ర, ఎంటీయూ–1064, పీఎల్ఏ–1100, కొత్తగా విడుదలైన ఎంటీయూ–1262, 1224 రకాలను కూడా సాగు చేసుకోవచ్చు. ► ఉత్తర కోస్తా రైతులు స్వర్ణ, శ్రీకాకుళం సన్నాలు, బీపీటీ–5204, ఎంటీయూ–1075, శ్రీధృతితో పాటు కొత్తగా విడుదలైన ఎంటీయూ–1224, ఎంటీయూ–1210 రకాలను ఎంపిక చేసుకోవచ్చు. ► దక్షిణ మండలంలో (సౌత్ జోన్) ఎన్‌ఎల్‌ఆర్–3354, 33892తో పాటు కొత్తదైన ఎన్‌ఎల్‌ఆర్–4001, ఎంటీయూ–1224 అనువైనవి. ► తక్కువ వర్షపాత ప్రాంతాల్లో బీపీటీ–5204, ఎన్‌డీఎల్‌ఆర్–7, 8తో పాటు కొత్తవైన ఎంటీయూ–1224, బీపీటీ–2782 రకాలను సాగు చేసుకోవచ్చు. ► గిరిజన మండలాలలో స్వల్పకాలిక రకాలైన ఎంటీయూ–1153, 1156 అనువైనవి. ► ముంపు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పీఎల్ఏ–1100, ఎంటీయూ–1064 (అమర), ఎంటీయూ–1140 (భీమ) అనువైనవిగా సిఫార్సు చేశారు. చౌడు ప్రాంతాల్లో ఎంటీయూ–061తో పాటు కొత్తగా విడుదలైన ఎంసీఎం–100 వేసుకోవచ్చు. ► నాణ్యమైన విత్తనం కోసం ప్రభుత్వ లేదా ప్రభుత్వ అధీకృత సంస్థలను సంప్రదించడం మంచిది. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా నాణ్యమైన విత్తనాన్ని అందిస్తున్నది. ► స్వయంగా రైతులు తయారు చేసుకున్న విత్తనాలను కూడా వాడుకోవచ్చు. ► విత్తనం సంచి లేబుల్ మీద కనీసం 80 శాతం మొలక శాతం వుందో లేదో చూసుకోవాలి. -
'పంట' కన్నీరు
ఏలూరు మెట్రో/ఆకివీడు: అకాల వర్షం రైతులను నిండా ముంచింది. కన్నీరుమున్నీరు చేసింది. శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వివిధ దశల్లో ఉన్న పంటలను ముంచేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 8 లక్షల హెక్టార్లలో 5.50 లక్షల మంది రైతులు ప్రస్తుత సీజన్లో పంటలు సాగు చేశారు. డెల్టాలో ప్రధానంగా వరి, మెట్టలో మొక్కజొన్న, పొగాకు, వివిధ ఉద్యాన పంటలు సాగయ్యాయి. కరోనా లాక్డౌన్ కారణంగా పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి రైతులు కష్టపడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అప్రమత్తమై జిల్లాలో 338 పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. మద్దతు ధరకు ధాన్యం కొనాలని ఆదేశాలు జారీ చేసింది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా 77 ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. ఉద్యాన రైతులనూ ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. దీంతో రైతులు ఆనంద పడ్డారు. అయితే వారి ఆనందంపై అకాలవర్షం నీళ్లు జల్లింది. శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి కోత దశకు చేరిన వరి పంట 81.6 హెక్టార్లలో, కళ్లాల్లో ఉన్న ధాన్యం 54.5 హెక్టార్లలో, అమ్మకానికి సిద్ధమైన 135 హెక్టార్లలోని మొక్కజొన్న, విక్రయానికి సిద్ధంగా ఉన్న 19 హెక్టార్లలోని వేరుశెనగ, 4 హెక్టార్లలో పొగాకు, 10 హెక్టార్లలో అరటి తోటలు, 4 హెక్టార్లలో మామిడి దెబ్బతిన్నాయని వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 65శాతం వరి మాసూళ్లు పూర్తి జిల్లాలో 1.67 లక్షల హెక్టార్లలో దాళ్వా వరి సాగైంది. 15 రోజులుగా మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సుమారు 65 శాతం మాసూళ్లు పూర్తయినట్టు అంచనా. అకాల వర్షానికి పంట నష్టపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తడిచిన పంటను రక్షించుకునేందుకు, ఎండబెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వారంలో మరో తుపాను హెచ్చరిక కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రైతులు త్వరగా మాసూళ్లు పూర్తి చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 1.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నట్టు అధికారులు తెలిపారు. జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం. ఈదురుగాలుల బీభత్సం ఈదురుగాలుల బీభత్సానికి పలు చోట్ల 47 విద్యుత్ స్తంభాలు, 4 ట్రాన్స్ఫార్మర్లు, చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. భీమడోలు మండలంలో అత్యధిక వర్షపాతం భీమడోలు: భీమడోలు మండలంలోనే జిల్లాలోనే అత్యధికంగా 60.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భీమడోలు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం రేకులన్నీ ఎగిరిపోయాయి. ప్లాట్‌ఫాం షెడ్డు కూలడంతో అక్కడ నిద్రపోతున్న సాధువు బాబాజీ(56) మరణించాడు. తేమ శాతం పెరుగుతుంది అకాల వర్షం నిండా ముంచింది. ధాన్యం తడవడంతో తేమశాతం పెరుగుతుంది. పంటను ఆరబెట్టేందుకు అదనపు వ్యయం అవుతుంది. తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొంటే రైతును ఆదుకున్నట్టవుతుంది. – పైడి దాలినాయుడు, కౌలు రైతు, పెదకాపవరం ప్రాథమిక నివేదిక సిద్ధం అకాల వర్షానికి నష్టపోయిన పంటలను ప్రాథమికంగా అంచనా వేశాం. పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తాం. ధాన్యం రైతులకు సూచనలు అందిస్తున్నాం. వారికి అండగా ఉంటాం.– గౌసియా బేగం, వ్యవసాయ శాఖ జేడీ -
పాలకంకి నవ్వింది..
ధాన్యాగారంగా పేరొందిన జిల్లాలో 2019 ఖరీఫ్ కోతలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్ ప్రకృతిపరంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది. గతంలో ఎప్పుడూలేని విధంగా మూడుసార్లు భారీ వర్షాలు ఆటంకం కలిగించాయి. ముందస్తు సాగు చేపట్టిన భూముల్లో కోతలు సాగుతున్నాయి. ఆశించిన స్థాయిలో వరి దిగుబడులు లభిస్తున్నట్లు పంటకోత ప్రయోగాల ద్వారా తెలుస్తోంది. దీంతో ఎన్నో ఏళ్ల తర్వాత జిల్లాలో ఈసారి వరి పంట రైతులకు కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. నిడమర్రు: గతంలో వచ్చిన దిగుబడులు మించి ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం జిల్లాలో 30 శాతం కోతలు పూర్తయినట్లు తాడేపల్లిగుడెం ఏడీఏ తెలిపారు. అప్‌లాండ్‌లో 70 శాతం పైగా కోతలు పూర్తయ్యాయన్నారు. దిగుబడి బాగున్నట్లే.. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన పంట కోత ప్రయోగాలు చూస్తే వరిపంట దిగుబడి ఆశించిన దానికంటే బాగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాల ప్రకారం ఒక ప్రయోజన ప్రాంతంలో సగటున 18 కేజీల దిగుబడి వస్తోంది. ఇంతవరకు చేపట్టిన ఆరంభం దశ ప్రయోగాల్లో 16 నుంచి 20 కేజీలు వచ్చిన ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత లెక్కన చూస్తే ఎకరాకు సుమారు 26–30 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రయోగాలు 80 శాతం డెల్టాలోనూ మిగిలిన 20 శాతం మెట్టప్రాంతంలో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. నిర్దేశించిన మొత్తం ప్రయోగాలు పూర్తయ్యేసరికి జిల్లాలో సగటు దిగుబడి 34 బస్తాల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది కంటే తగ్గిన సాగు.. గత ఏడాది 2,27,925 హెక్టార్లులో ఖరీఫ్ వరి సాగు జరిగింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2,21,284 ఎకరాల్లో సాగు చేశారు. అంటే 5వేల ఎకరాలకు పైగా వరి సాగు తగ్గింది. ప్రస్తుతం వచ్చిన ఫలితాల ప్రకారం చూస్తే గతేడాది కంటే పంట దిగుబడి బాగా ఉన్నట్లు అర్థమవుతోంది. గత ఏడాది పంటకోత ప్రయోగాల ఆరంభంలో సగటున 14 కేజీలు మాత్రమే రావడంతో ఎకరాకు 2,268 కేజీలు దిగుబడి కనిపించింది. ప్రయోగాలు పూర్తయ్యే సరికి ఎకరాకు 32 బస్తాలు (75 కేజీలు) దిగుబడి లభించింది. ఈ ఖరీఫ్‌లో పంట పరిస్థితి, గణాంకశాఖ లెక్కలు చూస్తుంటే తక్కువలో తక్కువ 32 బస్తాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్నదాతల కష్టానికి ఫలితం రానుంది. ఒక ప్రయోగానికి 25 చదరపు మీటర్లు.. ఎంపిక చేసిన గ్రామంలో తీసుకునే యూనిట్లో రెండు నుంచి నాలుగు చోట్ల ఈ పంటకోత ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగాలు ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన కింద నిర్వహిస్తారు. ఐదు మీటర్లు పొడవు, ఐదు మీటర్లు వెడల్పు గల 25 చదరపు మీటర్లు విస్తీర్ణంలో పండే పంట దిగుబడిని కొలవటాన్ని ఒక ప్రయోగం అంటారు. ఇలా 162 ప్రయోగాల విస్తీర్ణం ఒక ఎకరా అవుతుంది. 400 ప్రయోగాల విస్తీర్ణం ఒక హెక్టారు అవుతుందని అధికారులు తెలిపారు ఏలూరు డివిజన్లో 40 బస్తాల వరకూ.. ఏలూరు డివిజన్ 16 మండలాల్లో 254 యూనిట్లలో 1016 ప్రయోగాలు చేయాల్సి ఉంది. నేటికి 350 వరకూ ప్రయోగాలు పూర్తయ్యాయి. ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమడోలు, పెంటపాడు మండలాల్లో జరిగిన ప్రయోగాల్లో 38 నుంచి 40 బస్తాల వరకూ, మెట్ట ప్రాంతాల్లో 30 బస్తాల వరకూ దిగుబడి లభించింది. – ఎ. మోహన్‌రావు, డీవైఎస్ఓ, అర్ధగణాంక శాఖ ఆశించిన స్థాయిలో దిగుబడి.. జిల్లాలో ఇప్పటి వరకూ చేపట్టిన ప్రయోగాల ద్వారా ఈ ఏడాది వరిపంట ఆశించిన స్థాయిలో లభిస్తోంది. కొవ్వూరు, నరసాపురం డివిజన్లలో ఈ ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిపై మరో 10 రోజుల్లో మరింత స్పష్టత వస్తుంది. ప్రారంభంలో వర్షాలు ఆలస్యం, పంట మధ్యలో భారీ వర్షాలతో పంటకు కొద్దిమేర ఇబ్బంది ఉన్నా గత ఏడాది కంటే ఈ ఖరీఫ్‌లో మంచి దిగుబడులు వస్తున్నాయి. – వి.సుబ్బారావు, ఏడీ, అర్ధగణాంక శాఖ -
రాష్ట్రానికి ధాన్య కళ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని రీతిలో కాస్త ఆలస్యంగా అయినా వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం సహా మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీనికి తోడు 12వేల చెరువులు వందకు వంద శాతం నిండాయి. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఖరీఫ్‌లో 40.41 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ జరగ్గా, ఈ ఏడాది అంతకు మించి మరో 15లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా సేకరించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. మొత్తంగా 55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు వీలుగా 2,544 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ధాన్యం సేకరణ విధానంపై జిల్లాల వారీగా వ్యవసాయ శాఖతో సమన్వయం చేస్తూ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగానే కొన్ని జిల్లాల్లో అంచనాకు మించి ధాన్యం దిగుబడులు రావచ్చనే అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా సాగునీటి లభ్యత పుష్కలంగా ఉన్న ఖమ్మం జిల్లాలో గత ఏడాది 1.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా, ప్రస్తుతం అక్కడ సాగైన వరి విస్తీర్ణాన్నిబట్టి 2.50 లక్షల మెట్రిక్ టన్నులు రావొచ్చని అంచనా వేశారు. ఇదే రీతిన జగిత్యాలలో గత ఏడాది 3.3 లక్షలు కొనుగోళ్లు చేయగా, ఈ ఏడాది 6.80 లక్షల టన్నులు, నల్లగొండలో గత ఏడాది 2.20 లక్షలు కొనుగోళ్లు జరగ్గా ఈ ఏడాది 4.6 లక్షలు, సిద్దిపేటలో 70వేల టన్నులు చేయగా, ఈ ఏడాది 1.80 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేయాల్సి ఉంటుందని లెక్కించారు. వీటితో పాటే సూర్యాపేట, మంచిర్యాల, వనపర్తి జిల్లాల్లోనూ అంచనాకు మించి ధాన్యం కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని తేల్చారు. మొత్తంగా తొలి అంచనాకన్నా 10లక్షల మెట్రిక్ టన్నుల మేర అధికంగా ధాన్యం కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని లెక్కగట్టారు. దీనికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను 2,544 నుంచి 3,297 కేంద్రాలకు పెంచాలని నిర్ణయించారు. మొత్తంగా ఈ ధాన్యం కొనుగోళ్లకు రూ.18వేల కోట్ల మేర వెచ్చించనున్నారు. ఇక ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు తెరిచినప్పటికీ వర్షాల కారణంగా ధాన్యం ఇంకా కేంద్రాలకు రావడం లేదు. దీపావళి తర్వాత నుంచి పెద్దఎత్తున ధాన్యం రానున్న దృష్ట్యా, కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. దీపావళి తర్వాత ముమ్మరంగా ధాన్యం సేకరణ ఆరంభం కానుంది. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అంచనాలకు మించి ధాన్యం మార్కెట్లను ముంచెత్తనుంది. విస్తారంగా కురిసిన వర్షాలు, సాగునీటి ప్రాజెక్టుల కింద పెరిగిన సాగు, చెరువుల కింద పూర్తి స్థాయిలో సాగైన పంటల కారణంగా తొలుత అంచనా వేసిన యాభై అయిదు లక్షల మెట్రిక్ టన్నులకు మించి మరో పది లక్షల మేర ధాన్యం అదనంగా సేకరించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ తాజాగా అంచనా వేసింది. దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఏడెనిమిది జిల్లాల నుంచి గత ఏడాది కన్నా రెట్టింపు ధాన్యం రావచ్చన్న అంచనాలతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. స్టోరేజీపైనా ముందస్తు జాగ్రత్తలు.. పెరుగుతున్న ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా బియ్యం నిల్వలకు అవసరమైన గోదాములను సిద్ధంచేసే అంశంపై పౌర సరఫరాల శాఖ కసరత్తులు ముమ్మరం చేసింది. ధాన్యాన్ని మరపట్టించి బియ్యంగా మార్చిన అనంతరం వాటి నిల్వలకు ఇబ్బంది లేకుండా ఎఫ్‌సీఐతో చర్చించింది. గత ఏడాది రబీకి సంబంధించిన 11 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ నుంచి తీసుకునేందుకు ఎఫ్‌సీఐ సుముఖత తెలిపింది. ముఖ్యంగా స్టోరేజీ సమస్య అధికంగా ఉన్న కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, కొత్తగూడెంలలో స్టోరేజీ సమస్యను అధిగమించే చర్యలు చేపట్టింది. -
వరి వెద సాగు.. బాగు బాగు..!
వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం, తద్వారా కాలువల్లో సాగునీరు ఆలస్యంగా విడుదలవడం వలన వరి నారు మడులు పోసుకోవడం, నాట్లు వేయడం ఆలస్యమై దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. చెరువులు, కాలువలు, బావుల కింద పండించే పంటలు కాలక్రమేణా బోర్ల ద్వారా, భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో భూగర్భ జలాలు కూడా కొరవడుతున్నాయి. వీటితోపాటు కూలీల కొరత, అధిక కూలి రేట్లు వంటి సమస్యలతో రైతాంగం ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో నేరుగా విత్తే వరి సాగు పద్ధతులు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. పొడి నేలలో పొడి వరి విత్తనాన్ని వెద బెట్టడం, దమ్ము చేసిన మాగాణులలో డ్రమ్ సీడర్‌తో మొలకెత్తిన విత్తనం వేసుకోవటం లేదా వెద జల్లడం వంటి పద్ధతుల్లో వరి సాగు చేయడం మేలని బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సి. వి. రామారావు సూచిస్తున్నారు. సార్వాలో వెద వరి పంట సకాలంలో తీసుకోగలిగితే మినుము, పెసరలను రెండో పంటగా వేసి మంచి దిగుబడులు సాధించడానికి వరి వెద పద్ధతి రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆయన తెలిపారు. ఈ పద్ధతిలో 20% నీరు ఆదా అవుతుంది. 10 రోజులు ముందుగానే కోతకొస్తుంది. పంట దిగుబడి 15% పెరుగుతుంది. అధిక నీరు అవసరమయ్యే పంట కావడంతో వరి సాగుకు వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నారుపోసి నాట్లు వేయడం కన్నా నేరుగా విత్తుకోవడం మేలు. వరి నేరుగా విత్తే విధానంలో ముఖ్యంగా రెండు పద్ధతులున్నాయి: 1 పొడి విత్తనాన్ని విత్తే పద్ధతి : పొడి విత్తనాలను పొడి నేలపై వెద జల్లడం ద్వారా గాని, డ్రిల్లింగ్ చేయడం ద్వారా గాని, వెద సాగు పరికరాల(విత్తన గొర్రు)తో గాని విత్తుతారు. వరి విత్తనాన్ని పొడి వాతావరణంలో విత్తి, తరువాత వానలు మొదలై కాలువలకు నీళ్లు వచ్చిన అనంతరం మాగాణి పంటల మాదిరిగా సాగు చేస్తారు. తొలకరి వానలు పడగానే విత్తనాలు విత్తుతారు. అటు వర్షపు నీటిని, కాలువల నీటిని ఉపయోగించుకుంటూ వరిని సాగు చేస్తారు. 2 తడి విత్తనాన్ని విత్తే పద్ధతి : ఈ పద్ధతిలో మొలకెత్తించిన విత్తనాలను దమ్ము చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా గాని లేదా డ్రమ్ము సీడర్ ద్వారా గాని విత్తుతారు. తడి విత్తనాన్ని అంటే.. నానబెట్టి, మండెకట్టి మొలకెత్తిన విత్తనాన్ని దమ్ము చేసిన మాగాణుల్లో వెదజల్లడం ద్వారా గాని, డ్రమ్ సీడరు ద్వారా గాని విత్తుతారు. విత్తన ఎంపికలో మెలకువలు ♦ పొడి విత్తనాన్ని వెద పద్ధతి ద్వారా, తడి విత్తనాన్ని డ్రమ్ సీడరు ద్వారా లేదా వెదజల్లడం ద్వారా నేరుగా విత్తే పద్ధతులను అనుసరించేటప్పుడు వరి రకాలను ఎంపికచేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ♦ సార్వాలో 140–150 రోజులు, దాళ్వాలో 120–125 రోజుల కాలపరిమితి గల రకాలను ఎంచుకోవాలి. ♦ ఈ పద్ధతిలో చేను పడిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి, కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోని రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ♦ మొక్క శాఖీయ పెరుగుదల దశలో వేగంగా పెరిగి కలుపును అణగదొక్కగల సామర్థ్యం కలిగి ఉండాలి. ♦ ఆయా ప్రాంతాల్లో అధికగా వచ్చే చీడపీడలను తట్టుకొనే శక్తిని కలిగి ఉండాలి. ♦ ఎంపిక చేసుకునే రకం 2–3 వారాలు నిద్రావస్థ కలిగినదై ఉండాలి. ♦ తక్కువగా గింజ రాలే రకాలను ఎంపిక చేసుకోవాలి. ♦ అధిక దిగుబడితో పాటు మంచి గింజ నాణ్యత కలిగి ఉండాలి. ఈ సూచనలను దృష్టిలో ఉంచుకొని రైతులు గింజ రకాలను ఎంపిక చేసుకోవాలి. పొలం తయారీ: వెద పద్ధతిలో వరి సాగు చేసేటప్పుడు వేసవిలోనే నేలను కలియదున్నాలి. నేల స్వభావాన్ని బట్టి నాలుగు మూలలు సమానంగా ఉండేటట్లు పెద్ద పెద్ద మట్టి గడ్డలు లేకుండా పొలం సమతలంగా ఉండేటట్లు చూసుకోవాలి. తడి విత్తన పద్ధతిలో సాగు చేసేటప్పుడు సాధారణ నాట్లు పద్ధతిలో ఎలాగైతే భూమిని తయారు చేస్తామో అలాగే తయారు చేయాలి. చివరి సారి దమ్ము చేసిన తర్వాత పొలమంతా ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా చదును చేయాలి. పొలాన్ని చిన్నచిన్న మడులుగా విభజించుకుంటూ చదును చేయడం వలన నీరు పెట్టడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మట్టి పేరుకున్న తరువాత బురద పదునులో ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలువలు చేయాలి. వీటి ద్వారా ఎక్కువగా నీరు, మురుగు నీరు బయటకు పోవడానికి వీలవుతుంది. విత్తన మోతాదు వెదజల్లే పద్ధతిలో అయితే రకాన్ని బట్టి ఎకరానికి 12 నుంచి 16 కిలోల విత్తనం, డ్రమ్సీడరుతో విత్తుకుంటే 10 నుంచి 12 కిలోల విత్తనం అవసరం అవుతుంది. వెదపద్ధతిలో ఎకరానికి పొడి విత్తనం 10 నుంచి 15 కిలోల విత్తనం వాడాలి. విత్తనశుద్ధి ఒక లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్‌ను కలిపి కిలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి తర్వాత మండె కట్టి మొలకవచ్చిన తర్వాత వెదజల్లడం గాని, డ్రమ్ సీడరుతో గాని విత్తుకోవాలి. వెదజల్లే పద్ధతిలో సాగు చేసేటప్పుడు ఒక కిలో విత్తనానికి 3 గ్రా. కార్బెండిజమ్‌ను కలిపి వెద పెట్టడం వల్ల విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను తక్కువ ఖర్చుతో నివారించవచ్చు. (సేంద్రియ పద్ధతిలో సాగు చేసే రైతులు బీజామృతం లేదా ఇతర పద్ధతుల్లో విత్తనశుద్ధి చేసుకోవాలి). వెద పద్ధతిలో విత్తే విధానం వెద పద్ధతిలో వరి విత్తనాలను పొలంలో చల్లడం కాక పొలంలో సాళ్లుగా విత్తితే మంచి ఫలితాలనిస్తాయి. దీనికి పొలాన్ని సాంప్రదాయ పద్ధతిలో దున్నకూడదు. విత్తన గొర్రు ఉపయోగిస్తే కనీసం 2–4 సెం.మీ. వెడల్పు, 4–7 సెం.మీ. ఎత్తు ఉండే గాడులు ఏర్పడి అందులో విత్తనాలు సమానలోతు, సమాన దూరంలో నాటుకుంటాయి. 2–3 సెం.మీ. లోతులో విత్తితే మొలక శాతం బాగుంటుంది. దీనికన్నా ఎక్కువ లోతులో విత్తితే మొలక రావడం కష్టమవుతుంది. ఈ విధానంలో పొలంలో నేల ఎక్కువ కదలికకు గురికాదు. నీరు పెట్టినప్పుడు అది సాఫీగా ప్రవహించి మొక్కలకు చేరుకుంటుంది. సాంప్రదాయ పద్ధతిలో దున్నినప్పుడు నేలంతా కదలడం వలన నీరు పెట్టినప్పుడు చాలా వరకు పీల్చుకుపోయి మొక్కకు చేరడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. వెదసాగు యంత్రంలో విత్తనాలకు, కలుపు మందుకు, ఎరువుకు విడి విడిగా అరలు ఉంటాయి. విత్తనంతో పాటే ఎరువు కూడా నేరుగా చేలో పడుతుంది. అనుభవం కలిగిన ట్రాక్టరు డ్రైవరు ఈ వెదసాగు యంత్రంతో గంటలో ఒక ఎకరాన్ని విత్తగలరు. వెదజల్లే విధానంలో విత్తేముందు పొలం వైశాల్యాన్ని బట్టి ఎన్ని మడులున్నాయో చూసుకొని ఆ ప్రకారం విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండెకట్టి, మొలకెత్తిన విత్తనాన్ని అన్ని భాగాలుగా చేసుకుంటే, విత్తనాలు సమానంగా నేలమీద పడతాయి. మొక్కల సాంద్రత సమంగా ఉంటుంది. విత్తిన రెండు వారాల తరువాత వత్తుగా ఉన్న మొక్కలను తీసివేసి పలుచగా ఉన్న చోట నాటుకోవాలి. డ్రమ్ సీడరుతో వరి విత్తే విధానం డ్రమ్ సీడరుతో విత్తేటప్పుడు విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండెకట్టి గింజల నుంచి మొలక ఆరంభదశలో వున్నప్పుడు డ్రమ్‌లలో నింపుకోవాలి. అలా కాక మొలక పొడువగా ఉంటే డ్రమ్‌లలో పోసినప్పుడు అవి అల్లుకుపోయి రంధ్రాలకు అడ్డుపడి విత్తనాలు సులువుగా రాలవు. ఈ విధంగా మొలక ఆరంభ దశలో వున్న విత్తనాలను డబ్బాలలో 3/4 వంతు వరకు నింపి ముందుగా దమ్ము చేసి చదును చేసిన పొలంలో డ్రమ్ సీడరును దానికున్న పిడి సహాయంతో లాగడం వలన చక్రాలతో పాటు డ్రమ్ములు తిరిగి డ్రమ్ములకున్న రంధ్రాల ద్వారా విత్తనాలు పొలంలో వరుసగా పడతాయి. ఇలా ఒకసారి డ్రమ్‌సీడరును లాగితే 8 వరుసలలో వరుసకు వరుసకు మధ్య 20 సెం.మీ. దూరంలో 5 నుంచి 8 గింజలు పడతాయి. వరుసలు పాడవకుండా ఉండాలంటే పొలంలో వారం వరకు బుదర పదునుగా నీరు పలుచగా ఉండాలి. అయితే, నీరు పలుచగా ఉండటం వలన కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కావున కలుపు మందును తగు మోతాదులో 6–7 రోజుల లోపు వేసుకోవాలి. ఈ డ్రమ్‌సీడరును ఉపయోగించి రోజుకు 2–3 ఎకరాలు విత్తుకోవచ్చు. ఒక ఎకరం పొలాన్ని ఇద్దరు కూలీలు రెండున్నర గంటలలో విత్తగలరు. నీటి యాజమాన్యం విత్తిన తరువాత మొక్కల మొదటి ఆకు పూర్తిగా పురి విచ్చుకొనే వరకు (అంటే సుమారు 7–10 రోజులు) ఆరు తడులను ఇవ్వాలి. మొక్కలు 4–5 ఆకులు తొడిగిన తరువాత పొలంలో పలుచగా అంటే 2–3 సెం.మీ.ల లోతు నీరుండాలి. అంతకు మించి నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు. పైరు పిలక తొడిగి దుబ్బు కట్టుట పూర్తి అయిన తరువాత నుంచి కోతకు సుమారు 10 రోజుల ముందు వరకు 5 సెం. మీ. లోతు నీరుండాలి. పంటకోత నేరుగా విత్తే పద్ధతిలో సాంప్రదాయ ఊడ్పు విధానం కన్నా పంట 7–10 రోజులు ముందే కోతకు వస్తుంది. పంటను కూలీల ద్వారా లేక కోత–నూర్పిడి యంత్రం ద్వారా కోయవచ్చు. నేరుగా విత్తే పద్ధతిలో జాగ్రత్తలు 1 పొలమంతా సమానంగా ఎత్తుపల్లాలు లేకుండా చదును చేసుకోవాలి. దీనితో పొలమంతా నీరు సమానంగా పారి ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. 2 ఎకరానికి సిఫారసు చేసిన విత్తన మోతాదు ప్రకారమే విత్తుకోవాలి. ఎక్కువ విత్తనం వాడితే మొక్కలు ఒత్తుగా, తక్కువ వాడితే పలుచగా వుండి దిగుడులు తగ్గుతాయి. నేలలో విత్తనాన్ని 3 సెం.మీ. కంటే ఎక్కువ లోతులో వెద పెట్టకూడదు. 3 విత్తనాన్ని నాటిన రెండు రోజులలోపే కలుపును అరికట్టాలి. సరైన మందులను, సరైన కాలంలో, సరైన మోతాదులో వాడాలి. 4 విత్తనం పూర్తిగా మొలకెత్తిన తరువాత మొదటి నీటి తడిని భూమి స్వభావాన్ని బట్టి 7 నుంచి 15 రోజుల తర్వాత ఇవ్వవచ్చు. 5 విత్తిన రెండు వారాల తరువాత ఒత్తుగా ఉన్నచోట మొక్కలు తీసి పలుచగా వున్నచోట నాటుకుంటే మొక్కల సాంద్రత పొలమంతా సమానంగా ఉంటుంది. 6 నానబెట్టి, మండెకట్టిన విత్తనాలకు మొలక ఎక్కువగా పెరగనివ్వకూడదు. పెరిగినట్లైతే విత్తేటప్పుడు లేదా వెదజల్లేటప్పుడు మొలక విరిగి పోయే ప్రమాదం ఉంది. 7 విత్తిన 10 రోజుల వరకు ఆరు తడులనివ్వాలి. నీరు ఎక్కువగా ఉంటే మురుగు కాల్వల ద్వారా తీసివేయాలి. లేదంటే మొలక మురిగిపోతుంది. దుబ్బు దశ నుంచి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. – డాక్టర్ సి.వి. రామారావు,(94949 97701), ముఖ్య శాస్త్రవేత్త, వరి విభాగం, బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం,ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వరిని నేరుగా విత్తితే లాభాలు 1 తొలకరి వానలు పడిన వెంటనే వరి సాగు మొదలు పెట్టుకోవచ్చు. 2 అటు వర్షపు నీరు, ఇటు కాలువ నీరును ఉపయోగించుకుంటూ పంటను పండించవచ్చు. 3 దీని వలన పంటకాలం నష్టపోకుండా సకాలంలో సాగు చేయడానికి వీలవుతుంది. 4 ఈ పద్ధతిని పాటించడం వలన కాలువలలో నీరు ఆలస్యంగా వచ్చినా వరి పంట తరువతా మినుము, పెసర వంటి పైర్లను సకాలంలో విత్తవచ్చు. 5 ఈ పద్ధతిలో తక్కువ మోతాదు విత్తనం వాడటం వల్ల విత్తన ఖర్చు, నారు పెంచడానికి, నారు తీయడానికి, నారు మోయడానికి, నాట్లు వేయడానికి అయ్యే ఖర్చు ఆదా అవుతుంది. 6 సరి అయిన సమయంలో విత్తడం వల్ల నాట్ల పద్ధతిలో కన్నా చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. అందువల్ల సస్యరక్షణ ఖర్చులు తగ్గుతాయి. 7 విత్తనం భూమిపై తక్కువ లోతులో మొలకెత్తడం వలన వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది.. పైరు నీటిని, పోషక పదార్థాలను సక్రమంగా వినియోగించుకుంటుంది. 8 నాట్ల పద్ధతిలో కన్నా ఈ విధానంలో 20% నీరు ఆదా అవుతుంది. 9 నాట్ల పద్ధతిలో కన్నా 7–10 రోజుల ముందుగా వరి పంట కోతకు వస్తుంది. నేరుగా విత్తే పద్ధతిని అనుసరించడం వలన సాగు ఖర్చు తగ్గడంతో పాటు 10–15% అదనపు దిగుబడులు కూడా సాధించవచ్చు. వరి నేరుగా విత్తే పద్ధతిలో సమస్యలు 1 సరైన లోతులో విత్తుకోవటం 2 ప్రారంభ దశలో కలుపు నిర్మూలన 3 సరైన నీటి యాజమాన్యం 4 పొలాన్ని సరిగ్గా చదును చేసుకోవడం తెలంగాణలో నేరుగా విత్తే వరి సాగుకు అనువైన రకాలు సాధారణ నాట్ల పద్ధతితో పాటు వెద పద్ధతిలో కూడా సాగు చేయడానికి అనువైన మూడు వరి రకాలు తెలంగాణ రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఆర్.ఎన్.ఆర్. 15048 (తెలంగాణ సోన) – 120 రోజుల పంట. ఖరీఫ్‌లో జూలై ఆఖరు, రబీలో డిసెంబర్ ఆఖరు వరకు విత్తుకోవచ్చు. రసాయనిక ఎరువులు మోతాదుకు మించి వాడితో పొలంలో పంట పడిపోతుంది. కె.ఎన్.ఎం. 118 (కూనారం సన్నాలు)– 120 రోజులు. మామూలుగా, ఆలశ్యంగా కూడా విత్తుకోవచ్చు. ఖరీఫ్‌లో జూన్–జూలై, రబీలో నవంబర్ ఆఖరు నుంచి డిసెంబర్ ఆఖరు వరకు విత్తుకోవచ్చు. జగిత్యాల మషూరి (జెజె 11470) – 135 రోజులు. ఖరీఫ్‌లో జూన్ 30లోగా, రబీలో నవంబర్ 30 లోగా విత్తుకోవాలి. – డా. చెన్నమాధవుని దామోదర్‌రాజు(94402 25385), ప్రధాన శాస్త్రవేత్త, వరి విభాగం, ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చీడపీడలను దరిచేరనీయని నవార వరి నవార రకం దేశీ వరిని తెలుగు రాష్ట్రాల్లో (ఖరీఫ్, రబీ) ఏ ప్రాంతంలోనైనా పండించవచ్చు. ఎకరానికి 15 కిలోల విత్తనం అవసరం. శ్రీ పద్ధతిలో 2 కిలోలు చాలు. పంటకాలం ఖరీఫ్‌లో 110–115 రోజులు, రబీలో 120–125 రోజులు. ఎకరానికి 18–20 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. నవార అన్ని రకాల చీడపీడలను తట్టుకుంటుంది. విత్తనాలు నల్లగా, బియ్యం ఎర్రగా ఉంటాయి. నవార బియ్యం తిన్నవారిలో షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఇడ్లీ, దోసెలలో ఎక్కువగా వాడుతారు. అయితే, వడగళ్ల వానకు పంట కింద పడిపోయి గింజలు రాలిపోతాయి. గడ్డిని పశువులు ఇష్టంగా తింటాయి. ఈ విత్తనాల కోసం సికింద్రాబాద్ తార్నాక నాగార్జున నగర్‌లోని సి.ఎస్.ఎ. కార్యాలయాన్ని 1800 120 3244 నంబరులో సంప్రదించవచ్చు. జూలై చివరి వరకూ విత్తుకోవచ్చని శాస్త్రవేత్త డా. రాజశేఖర్(83329 45368) తెలిపారు. అటవీ కృషిపై 30, జూలై 1 తేదీల్లో డా. ఖాదర్ వలి సదస్సులు తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటవీ కృషి పద్ధతుల్లో సిరిధాన్యాల మిశ్రమ సాగుపై స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి రైతులకు శిక్షణ ఇస్తారు. 30(ఆదివారం) ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని కొత్త రమాకాంత్ ఫంక్షన్ హాల్లో జరిగే రైతు సదస్సులో డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. అభిలభారత రైతు సమన్వయ సమితి నేత అప్పిరెడ్డి –83090 24948. నిజామాబాద్‌లోని లక్ష్మీ కల్యాణ మండపం (ఆర్మూర్ రోడ్డు)లో 30న సా. 5 గం. నుంచి సిరిధాన్యాలపై ఆరోగ్య సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. జి. దామోదర్‌రెడ్డి – 94407 02029. జూలై 1(సోమవారం)న మెదక్‌లోని వైస్రాయ్ గార్డెన్లో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉ. 10 గం. నుంచి 12 గం. వరకు డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. డా. శ్యాంసుందర్‌రెడ్డి – 99082 24649. జూలై 1(సోమవారం)న సా. 4 గం. నుంచి జనగామలోని ఎన్.ఎం.ఆర్. ఫంక్షన్ హాల్ (సూర్యాపేట రోడ్డు)లో వాలంతరి ఆధ్వర్యంలో జరిగే రైతు సదస్సులో డా. ఖాదర్‌వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. శంకరప్రసాద్ – 77029 70001. ఈ సభలకు ప్రవేశం ఉచితం. 30న సేంద్రియ మిరప, పత్తి, వరి సాగుపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు రైతు శిక్షణ కేంద్రంలో ఈ నెల 30(ఆదివారం) సేంద్రియ వ్యవసాయ విధానంలో మిరప, పత్తి, వరి సాగుపై ప్రకృతి వ్యవసాయదారులు శ్రీమతి లావణ్య, రమణారెడ్డి శిక్షణ ఇస్తారు. వివరాలకు 97053 83666. -
వరి సాగు అస్సలొద్దు..
మహబూబ్‌నగర్ రూరల్: ఈ సారి ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నట్లు అంచనా వేశాం.. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యాచరణ చేపట్టి అందుకు తగ్గట్టు అవసరమైన విత్తనాలను, ఎరువులను సిద్ధం చేసింది. రైతులు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పంటలను సాగు చేసుకొని లబ్ధి పొందాలి.. అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుచరిత సూచించారు. శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు. వాతావరణం వరికి అనుకూలించదు.. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు జిల్లాలో వరి పంట సాగుకు ఏమాత్రం అనుకూలించే విధంగా లేవు. అందువల్ల రైతులు ఆరుతడి పంటల సాగుకే ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులు పంటల సాగు విషయంలో మూస పద్ధతులు పాటిస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. పంటల సాగు విషయంలో వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారుల సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకోవాలి. భూగర్భజలాలు లేకనే.. గత ఏడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురియకపోవడం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఈ కారణంగానే వరి పంట సాగు శ్రేయస్కారం కాదు. నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటివరకు కురియాల్సిన వర్షం కురియకపోవడం వల్ల జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. ఇకముందు కూడా నమోదయ్యే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల రైతులు ఆరుతడి పంటల సాగుకే ప్రాధాన్యత ఇవ్వాలి. నెలాఖరువరకు జొన్న, కందులు వేసుకోవచ్చు.. ఈ నెలాఖరు వరకు జొన్న, కందుల విత్తనాలను విత్తుకోవచ్చు. ఆ తర్వాత జూలై 15వ తేదీ వరకు పత్తి పంటను సాగు చేసుకోవాలి. జూలై ఆఖరు వరకు ఆముదం పంటను సాగు చేసుకోవాలి. పంటల సాగు విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. రైతులు వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారుల సలహాలు తీసుకొని పంటలను సాగు చేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంది. పదును ఉన్నప్పుడే విత్తనాలు వేయండి అదునుకు తగ్గ పదును లభిస్తేనే పంటలను సాగు చేసుకోవాలి. కొద్దిపాటి వర్షపు జల్లులు కురిస్తే పంటలను సాగు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. విత్తనాలు విత్తే ముందే అన్ని రకాలుగా ఆలోచించి విత్తుకోవాలి. ఈ సంవత్సరం వర్షం సమృద్ధిగా కురియాలని రైతులతో పాటు తాము కూడా అభిలాషిస్తున్నాం. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించక వర్షం సమృద్ధిగా కురియకుంటే ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తాం. విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి గత ఖరీఫ్‌లో ఎదురైన సవాళ్లను ఎదుర్కొని ఈ సీజన్లో రైతులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగు జాగ్రత్తలను తీసుకుని ముందుకు సాగుతున్నాం. ఈ ఖరీఫ్‌లో వర్షాలు సకాలంలో కురిస్తే జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా వర్షాధార పంటలు పత్తి 35వేల హెక్టార్లు, కందులు 12వేల హెక్టార్లు, మొక్కజొన్న 39వేల హెక్టార్లు, ఆముదం వరి 17,211 హెక్టార్లు, జొన్న 8,500 హెక్టార్లు, ఆముదం 250 హెక్టార్లు, రాగులు 600 హెక్టార్లు సాగు చేసే అవకాశం ఉంది. వీటితో ఇతర పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది. సబ్సిడీపై అందిస్తున్నాం.. జిల్లాలో రైతులకు సబ్సిడీపై అందించడానికి 15,977 క్వింటాళ్ల అన్ని రకాల విత్తనాలను సిద్ధంగా ఉంచాం. జిల్లాలోని పీఏసీఎస్, ఏఆర్ఎస్కే కేంద్రాల ద్వారా సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే పత్తి విత్తనాలను డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. విత్తనాలకు ఎలాంటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. -
కనికరం ఏది?
-
రుణమే యమపాశమై..
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మీదేవీ నాయుడు చిన్న రైతు. తొలకరిలో కురిసిన వర్షంతో పత్తి, మిర్చి సాగు చేశారు. ఆ తర్వాత వరుణదేవుడు ముఖం చాటేయడంతో పంటలు నిలువునా ఎండిపోయాయి. అప్పులు పెరిగిపోయాయి. దిక్కుతోచని స్థితిలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. కనికరం లేని పాలకులు మొఖం చాటేశారే కానీ ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం భేతాళపురం గ్రామానికి చెందిన దున్న లక్ష్మీనారాయణ ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట తిత్లీ తుపానుకు ధ్వంసమైంది. ప్రభుత్వం నుంచి ఆయనకు నయా పైసా సాయం అందలేదు. అప్పుల భారం పెరిగి బతుకు భారమై పంట చేలో శవమై తేలాడు. సాక్షి, అమరావతి:రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల రైతన్నలు పెద్ద ఎత్తున బలవన్మరణాలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక వేల సంఖ్యలో అన్నదాతలు తనువు చాలిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పెదకడబూరుకు చెందిన రైతు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పురుగుల మందు తాగి ఓ రైతు తనువు చాలించగా ఆయన భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రైతు దంపతుల ఆత్మహత్యాయత్నంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలారు. ప్రకాశం జిల్లాలోనూ ఓ యువరైతు వరుసగా మూడేళ్ల పాటు అప్పుల పాలు కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరువు ప్రాంతాలకు వెళ్లని సీఎం.. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఇటీవల అన్నదాతల చావుకేకలతో మార్మోగుతోంది. పంట పొలాలు మరుభూములుగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్‌గా మారుతోంది. సీఎం చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ వర్తించకపోవడం, అరకొర మాఫీ వడ్డీలకే సరిపోక బ్యాంకులకు డిఫాల్టర్లుగా మారి దిక్కుతోచని స్థితిలో పలువురు రైతులు చనిపోతుండగా అననుకూల పరిస్థితుల్లో పంట పండించినా గిట్టుబాటు ధర రాక మరికొందరు, ప్రైవేట్ వ్యాపారుల నుంచి 4 – 5 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి సంక్షోభంలో చిక్కుకుని ఇంకొందరు రైతులు మరణిస్తుంటే ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా, పంటల బీమాను పట్టించుకోకుండా రైతులను గాలికి వదిలేసింది. ధరలలో వ్యత్యాసం కింద ఇస్తామని ప్రకటించిన స్థిరీకరణ నిధుల్ని గానీ, మొక్కజొన్న, కంది, మిర్చికి ఇస్తామన్న బోనస్ మొత్తాల్ని గానీ ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. పంటల సాగుబడి వ్యయం భారీగా పెరిగినా, వరుస కరువులు, తుపాన్లు వెంటాడుతున్నా సర్కారు కనికరం చూపడం లేదు. రైతు ఆత్మహత్యల్ని గుర్తిస్తే ఎక్కడ సాయం ఇవ్వాల్సి వస్తుందోనన్న భయంతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉన్నట్టు వృద్ధి రేటుపై గొప్పలు చెబుతోంది. నాలుగున్నరేళ్లుగా వరుస కరువులు, ప్రకృతి విపత్తులు, తుపాన్లతో రైతులు కకావికలమై ఊళ్లకు ఊళ్లు వలస వెళుతున్నా ప్రభుత్వం మొండిచెయ్యే చూపుతోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో ఇన్పుట్ సబ్సిడీ కింద ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్లలో ఇంతవరకు నయాపైసా కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఆత్మహత్యల నివారణకు చొరవ చూపించి రైతన్నల్లో మనోధైర్యం నింపాల్సిన ముఖ్యమంత్రి కనీసం కరువు పీడిత జిల్లాల్లో పర్యటించకపోవడం దురదృష్టకరమని వ్యవసాయ రంగ ప్రముఖులు విమర్శిస్తున్నారు. కనికరం ఏది? రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి కేవలం 347 మండలాలను రాష్ట్ర ప్రభుత్వమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. వాస్తవానికి అన్ని మండలాల్లోనూ కరువు తాండవిస్తోందని రైతు సంఘాలు చెబుతున్నాయి. అయితే కరువు ప్రాంతాలను ప్రకటించారే గానీ కరువు మాన్యువల్ ప్రకారం ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలను ప్రకటించలేదు. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టపోయిన రైతులకు రూ.2 వేల కోట్లను పెట్టుబడి రాయితీగా ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు ఇవ్వలేదు. పంటల బీమా లెక్కల్ని ఇంతవరకు తేల్చలేదు. ఫలితంగా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవాల్సి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా తగ్గిపోతోంది. రబీలో మొత్తం సాగు విస్తీర్ణం 23.43 లక్షల హెక్టార్లకుగానూ ఇప్పటి వరకు సగం ప్రాంతంలో కూడా విత్తనాలు పడలేదు. మరో వారంలో సీజన్ కూడా ముగియబోతోంది. రెండు సీజన్లలో కలిపి రైతులు రూ.19 వేల కోట్ల పెట్టుబడులు నష్టపోయినట్టు అనధికార అంచనా. వడ్డీకీ చాలని మాఫీ 2014లో చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం రాష్ట్రంలో సుమారు రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.15,038 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అయితే ఇది రైతులు చెల్లించాల్సిన వడ్డీలకు కూడా సరిపోకపోవడంతో వారికి సకాలంలో రావాల్సిన ఏ రుణమూ అందకుండా పోయింది. వారికి కొత్తగా అప్పులిచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. ఫలితంగా ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు తెచ్చి సాగు చేసి చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది. బీమా పరిహారానికీ మొండిచెయ్యి కరువుల్ని జయించానని, సముద్రాలను గెలిచానని తరచూ చెప్పే సీఎం చంద్రబాబు రైతుల ఇక్కట్లను పట్టించుకోకుండా అభివృద్ధి రేట్లంటూ అంకెల గారడీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది వ్యవసాయాభివృద్ధి రేటు 16.55 శాతంగా నిర్ణయించి ఆ దిశగా ముందుకు సాగుతున్నట్టు చెప్పుకోవడం గమనార్హం. ఒకవైపు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర రాక రైతులు అల్లాడిపోతున్నారు. కనీస మద్దతు ధరలకు మార్కెట్ ధరలకు ఎటువంటి పొంతన లేకుండా పోయిందనే దానికి రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే వరే ప్రత్యక్ష నిదర్శనం. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 1750 ఉంటే రూ.1,100 – రూ1,200 మించి ఎవరూ కొనడం లేదు. ఈ పరిస్థితుల్లో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో చిక్కుకుపోయి మరోమార్గం లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ దుస్థితిపై హైకోర్టు సైతం ఇటీవల స్పందిస్తూ.. రైతులు కష్టాలు చెప్పుకునేందుకు ఓ చట్టబద్ధ సంస్థ ఉండాలని సూచించినా టీడీపీ సర్కారు ఆలకించలేదు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులకు చంద్రన్న రైతు బీమా పథకం కింద ఇస్తామన్న రూ.5 లక్షలను సైతం ఇవ్వకుండా ఎగ్గొడుతూ అన్నదాతల ఆత్మహత్యలను గుర్తించడానికే ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో రైతుల్లో మనోధైర్యం నింపేలా చేయడమే తక్షణ కర్తవ్యమని రైతు సంఘాలు సూచిస్తున్నాయి. బాబు గద్దెనెక్కాక వేలల్లో రైతుల బలవన్మరణం.. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,635 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు వ్యవసాయ రంగంపై కృషి చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 2014లో ఏపీలో 164 మంది (వ్యవసాయ కూలీలు, కౌలు రైతులను కలపలేదు. వారిని కూడా కలిపితే 570 మందికి పైగా ఉంటారని అంచనా) అన్నదాతలు చనిపోయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంచనా వేసింది. 2015లో ఆ సంఖ్య 916 (వీరిలో రైతులు 516 మంది)కి పెరిగింది. 2016లో ఏపీలో 804 మంది (వీరిలో కౌలు రైతులు, రైతు కూలీలు ఉన్నారు) ఆత్మహత్యలు చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. 2017 నుంచి ఆ సంస్థ రైతుల చావుల్ని నమోదు చేయడం లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి ఇటీవల పార్లమెంటులో ప్రకటించారు. అంటే సగటున ఏటా రాష్ట్రంలో 7 వందల మంది రైతులు చనిపోతున్నారు. దీని అర్థం రాష్ట్రంలో పూటకో రైతు ఆత్మహత్య చేసుకున్నట్టని, ఈ నాలుగేళ్లలో 2,650 మంది చనిపోయారని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఖరీఫ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 163 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 46 మంది, అనంతపురం జిల్లాలో 44 మంది ఉన్నారు. అప్పుల భయంతో కుమిలిపోయాడు.. మాకు సేద్యం తప్ప వేరే ఆధారం లేదు. రెక్కలు విరిగేలా కష్టపడ్డా గట్టెక్కలేకపోయాం. అప్పుల భయానికి నా బిడ్డ ఎంతో కుమిలిపోయేవాడు. దీనికి అనారోగ్యం కూడా తోడవడంతో ప్రాణం తీసుకున్నాడు. చిన్నారులు అనాథలయ్యారు. అన్యాయం జరిగిపోయింది నాయనా.. – నాగన్న (మృతుడు పెద్ద రంగన్న తండ్రి) పెద్ద దిక్కును కోల్పోయాం.. మా ఇంట్లో అమ్మనాన్న తర్వాత కుటుంబ భారాన్ని మా అన్నే భుజాన వేసుకున్నాడు. సేద్యం చేస్తూ మమ్మల్ని బతికిస్తూ వచ్చాడు. పంటలు పండక తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యాం. ప్రాణాలు తీసుకోవడానికి అప్పులే ప్రధాన కారణం. ఇంటి పెద్దదిక్కును కోల్పోయాం. – చిన్న రంగన్న (మృతుడి తమ్ముడు) కరువు మండల మైనా ఏం లాభం? గత సెప్టెంబర్‌లో పెద్దకడబూరు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ లేదు. వరుస కరువులతో చితికిపోయిన తమను ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా కానరాక యువరైతు పెద్ద రంగన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. – వెంకటేశ్వర్లు, రైతు యువరైతు బలి యర్రగొండపాలెం: వరుసగా మూడేళ్లు పాటు పంటలు పండక అప్పుల పాలు కావడం, రుణం తీర్చే దారి కానరాక ప్రకాశం జిల్లాలో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యర్రగొండపాలెం మండలం పందివానిపల్లెకు చెందిన గోపు వెంకటరెడ్డి (35) తనకున్న 1.22 ఎకరాల పొలంతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. అదునులో వర్షాలు కురవకపోవడం, పొలంలో బోర్లు ఎండి పోవడంతో మిరప పంట చేతికి అందలేదు. తక్కువ నీటితో సాగు చేద్దామని మొక్కజొన్న వేసినా తెగులు సోకడంతో హతాశుడయ్యాడు. గత మూడేళ్లుగా పెట్టుబడికి తెచ్చిన అప్పులు కూడా తీరకపోవడం, రుణదాతల ఒత్తిడి పెరగడంతో మానసిక వ్యధకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం తన ముగ్గురు పిల్లలను పుల్లలచెరువు మండలం సి.కొత్తపల్లిలోని అత్త వారి ఇంట్లో అప్పగించి భార్యతో కలసి వరి కోతల కోసం గుంటూరు జిల్లా కారంపూడికి వెళ్లాడు. అక్కడ పని చేయలేక ఒంటరిగా తిరిగొచ్చాడు. అనంతరం పనులు ముగించుకొని పుట్టింటికి చేరుకున్న భార్య అంజమ్మ మంగళవారం ఉదయం భర్తకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పొరుగు వారికి ఫోన్ చేసింది. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా వెంకటరెడ్డి చీరతో ఉరి వేసుకొని చనిపోయినట్లు గుర్తించారు. ఆదివారం ఉదయం తరువాత వెంకటరెడ్డి గ్రామంలో కనిపించ లేదని, బహుశా అదే రోజు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్థానికులు తెలిపారు. మృతుడికి 11 ఏళ్ల వయసున్న కుమారుడు శివారెడ్డితోపాటు 9, 7 సంవత్సరాల వయసున్న కుమార్తెలు సుచిత్ర, లక్ష్మి ఉన్నారు. ఉసురు తీసిన అప్పులు.. వెంకటరెడ్డికి దాదాపు రూ.6 లక్షల మేర అప్పులు ఉన్నట్లు మృతుడి భార్య తెలిపింది. 2016లో యర్రగొండపాలెంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మృతుడు రూ.1.10 లక్షలు రుణం తీసుకున్నాడు. వడ్డీతో కలిసి ఇది దాదాపు రూ 1.50 లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ అప్పులు కూడా ఉండటం, వాటిని తీర్చాలని ఒత్తిడి పెరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ప్రాణం తీసిన అప్పులు ఆదోని/టౌన్/మంత్రాలయం/పెద్దకడబూరు: సాగు కోసం చేసిన అప్పు యమపాశమైంది. కరువు కుంగదీయగా ఏటా రుణఊబిలో కూరుకుపోవడం అన్నదాత వెన్ను విరిచింది. ఆదుకునే దిక్కు కానరాక ఆ రైతు దంపతులు పురుగుల మందు తాగారు. భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా పెద్దకడబూరులో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది. భార్య కళ్లెదుటే పురుగుల మందు తాగడంతో... పెద్దకడబూరు గ్రామానికి చెందిన కురువ పెద్ద రంగన్న తన తల్లి నారాయణమ్మ పేరుతో ఉన్న 4.50 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నాడు. వర్షాభావం కారణంగా ఏటా నష్టపోవడం మానసికంగా కుంగదీసింది. ఈ నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలి? వైద్య చికిత్స కోసం డబ్బు ఎక్కడి నుంచి తేవాలనే విషయంపై భార్య సరస్వతి అలియాస్ పద్మతో సోమవారం రాత్రి వాగ్వాదం జరిగినట్లు సమాచారం. బంధువులు వచ్చి ఇద్దరికీ సర్ది చెప్పినా పెద్దరంగన్న బలవన్మరణమే శరణ్యమని భావించాడు. మంగళవారం ఉదయం మిరప పంటను మార్కెట్‌కు తరలించేందుకు బస్తాల్లో సిద్ధం చేసిన అనంతరం ఇంటికి చేరుకుని భార్య ఎదుటే పురుగుల మందు తాగాడు. దీంతో పెద్ద రంగన్న భార్య కూడా పురుగుల మందు డబ్బాను లాక్కుని బలవంతంగా తాగింది. దీన్ని గుర్తించిన స్థానికులు వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పెద్దరంగన్న చనిపోగా పద్మ పరిస్థితి విషమంగా ఉంది. పెద్దరంగన్న మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దంపతులకు పదేళ్ల లోపు వయసున్న ముగ్గురు చిన్నారులు ఉండటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెట్టుబడులు మట్టిపాలు.. నిరుడు ఖరీఫ్‌లో ఉల్లి 90 బస్తాల దాకా దిగుబడి వచ్చినా ధరలు లేకపోవడంతో పెద్దరంగన్న దాదాపు రూ.40 వేల వరకు నష్టపోయాడు. ఎకరం పొలంలో వేసిన మిరపకు జెమిని వైరస్ సోకడంతో రూ.2 లక్షలు దాకా పెట్టుబడి మట్టి పాలైంది. వర్షాభావం, గులాబీరంగు పురుగు ఆశించడంతో పత్తి కూడా దెబ్బ తింది. దీంతో మూడు ఎకరాల్లో పత్తి పంటను గొర్రెల మేత కోసం వదిలేశాడు. పెద్ద రంగన్న స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో 2016లో పంట రుణం రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. ప్రస్తుతం వడ్డీతో కలిపి అప్పు దాదాపు రూ.1.80 లక్షలకు చేరుకుంది. ఇది కాకుండా బయట మరో రూ.4 లక్షల మేరకు అప్పు చేశాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు అఖిల (7), అజయ్ (5), ఓంకార్(3) ఉన్నారు. చెట్టంత కొడుకు తన కళ్లెదుటే శాశ్వతంగా కళ్లు మూయగా కోడలు మృత్యువుతో పోరాడుతుండటాన్ని చూసి పెద్ద రంగన్న తల్లిదండ్రులు నాగన్న, నారాయణమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
అల్పపీడనం ప్రభావంతో మారిన వాతావరణం
భీమవరం: బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లాలో అనేక ప్రాంతాల్లో మంగళవారం వర్షం జల్లులు పడడంతో రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. దీంతో వరి కోత యంత్రాలకు డిమాండ్ పెరిగి మాసూళు ధరను పెంచి వసూలు చేస్తున్నారు. ప్రధానంగా డెల్టా ప్రాంతంలోని అనేక గ్రామాల్లో వరిపంట పొలాల్లోనే ఉండగా మాసూళ్లు పూర్తిచేసిన ప్రాంతాల్లో ధాన్యం అమ్మకాలు పూర్తికాక వర్షానికి ధాన్యం తడిస్తే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 5.60 లక్షల ఎకరాల్లో సార్వా వరిసాగు చేయగా మెట్టప్రాంతాల్లో దాదాపు మాసూళ్లు పూర్తయ్యాయి. డెల్టాలోని సుమారు 2 లక్షల ఎకరాల్లో సాగుచేయగా దాదాపు 75 వేల ఎకరాల్లో మాసూళ్లు పూర్తి చేయాల్సి ఉందని అంచనా. సార్వా సీజన్ ప్రారంభం నుంచి సాగునీరు సక్రమంగా అందకపోవడం, నారుమడుల సమయంలో భారీ వర్షాల కారణంగా నారు దెబ్బతిని రెండు, మూడు పర్యాయాలు నారువేయాల్సి రావడం వంటి ఇబ్బందులతో రైతులు సతమతమయ్యారు. ఎన్నో వ్యయప్రయాసలతో పైరును పెంచి పోషించి పంట చేతికి వస్తున్న సమయంలో వాతావరణంలో మార్పుల కారణంగా రైతులకు అధిక పెట్టుబడి తప్పడం లేదని వాపోతున్నారు. నైరుతి బంగాళఖాతంలో అల్పపీడనంతో పాటు కర్ణాటక పరిసరాల్లో ఉపరితల అవర్తనం కారణంగా మోస్తరు వర్షాలు పడ్డాయని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతోపాటు బుధవారం ఆగ్నేయ బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలపడంతో రైతుల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. వాతావరణ శాఖ ప్రకటించినట్టుగానే మంగళవారం ఉదయమే వాతావరణం మేఘావృతమై చిరుజల్లులు కురవడంతో రైతులు తమ ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోడానికి హైరానా పడ్డారు. పంట పొలాల్లో పనలపైనే.. ప్రస్తుత సార్వా సీజన్లో ఎక్కువమంది పంట మాసూళ్లుకు వరి కోత యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే కొంతమంది రైతులు పశుగ్రాసం కోసం వరిగడ్డిని నిల్వ చేసుకోడానికి కూలీలతో కోతకోయించి పనలపై ఆరబెట్టిన తరువాత కుప్పనూర్పిళ్లు చేయిస్తున్నారు. ఆ విధంగా డెల్టా ప్రాంతంలో సుమారు 20 వేల ఎకరాల్లో పంట పనలపైనే ఉంది. చిరుజల్లులకు పంట తడిసిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు కూలీలను ఉపయోగించి నూర్పిళ్లు చేయించడానికి పరుగులు పెడుతున్నారు. కనీనం వరి పనలను గట్టుచేర్చి కుప్పగా వేసి వాతావరణం అనుకూలించిన తరువాత నూర్పిడి చేయించవచ్చుననే సంకల్పంతో కుప్పలు, నెట్టుకట్టడం వంటి పనుల్లో మునిగిపోయారు. వరి కోత యంత్రాలకు పెరిగిన డిమాండ్ ప్రస్తుత సార్వా సీజన్లో ఎక్కువశాతం మంది రైతులు వరికోత యంత్రాలతో మాసూళ్లు చేయిస్తుండడంతో ఇతర జిల్లాల నుంచి యంత్రాలను తీసుకువచ్చి ఎకరాకు రూ.1,800 చొప్పున వసూళ్లు చేస్తున్నారు. యంత్రాలు కూడా ఇబ్బడిముబ్బడిగా ఉండడంతో రైతులకు అనుకూలమైన ధరల్లోనే మాసూళ్లు పూర్తవుతున్నాయి. అయితే వాతావరణంలో మార్పుల కారణంగా రైతులంతా ఒకేసారి కోతలు పూర్తిచేయించడానికి కంగారు పడడంతో యంత్రాల యజమానులు ధరలను పెంచినట్టు చెబుతున్నారు. మంగళవారం ఎకరాకు రూ.2,000 వసూళు చేస్తున్నారని బుధవారం «ఇంకా పెరిగే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. కళ్లాల్లోనే ధాన్యం సార్వా మాసూళ్లు వరికోత యంత్రాలతో సాగుతుండడంతో «ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ శాతం తగ్గడానికి నాలుగైదు రోజుల పాటు ఎండబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మాసూళ్లు పూర్తి చేసిన రైతులు సైతం ధాన్యం ఎండబెట్టడానికి కళ్లాల్లోనే ఉంచడడంతో తడిసిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యంత్రంతో మాసూళ్లు చేసిన ధాన్యం వెంటనే ఎండబెట్టకపోతే రంగుమారి ముక్కపాయ వచ్చే ప్రమాదముందని రంగుమారిన ధాన్యం ధర తక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. -
అమ్మో..ఎలుకలు!
దివిసీమలో ఎలుకలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కష్టపడి పెంచుకున్న పంట మూషికపరం కావడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంటను నాశనం చేస్తున్న ఎలుకల నివారణకు బుట్టలు, మందులు పెట్టినా ప్రయోజనం లేదని కొందరు రైతులుఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా, అవనిగడ్డ : దివిసీమలో ఈ ఏడాది 97 వేల ఎకరా ల్లో రైతులు వరి సాగు చేశారు. ఘంటసాల, చల్లç ³ల్లి, మోపిదేవి మండలాల్లో ముందుగా సాగు చేసిన వరి పంట ఈనెక, పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఆలస్యంగా సాగు చేసిన అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పిలక, చిరు పొట్ట దశలో ఉంది. చిరుపొట్ట, ఈనెక దశలో ఉన్న పొలాలకు ఎలుకల బెడద ఎక్కువగా ఉంది. వర్షాలు లేకపోవడం, సాగు నీరు తక్కువుగా అందడం వల్ల ఎలుకలు పెరిగిపోయాయి. కొన్నిచోట్ల నాలుగు రోజులకొకసారి ఎలుకల నివారణకు బుట్టలు పెడుతున్నా వాటి బెడద తగ్గడం లేదని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.7 వేల వరకు ఖర్చు.. అవనిగడ్డ మండలం బందలాయిచెరువు, అశ్వరా వుపాలెం, మోదుమూడి, వేకనూరు, కోడూరు మండలం వి కొత్తపాలెం, విశ్వనాధపల్లి, పిట్ట ల్లంక, సాలెంపాలెం, మాచవరం, నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం, నంగేగడ్డ, మర్రి పాలెం, ఏటిమొగ ప్రాంతాల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో రెండు రోజులకొకసారి ఎలుకల నివారణకు మందులు, బుట్టలు పెడుతున్నారు. బుట్టలు పెడితే ఒక్కో ఎలుకకు రూ.20 తీసుకుంటున్నారు. ఎలుకల నివారణకు ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.7 వేలు ఖర్చు చేసినట్టు రైతులు చెప్పారు. కొట్టేసిన వరి దుబ్బులను కూలీలతో ఏరించేందుకు ఎకరాకు రూ.2 వేల వరకూ ఖర్చులు అవుతున్నాయని తెలిపారు. సామూహిక నివారణకు చర్యలేవీ.. ఎలుకల నివారణకు బుట్టలు పెట్టించడం, ఒకరిద్దరు రైతులు మందు పెట్టినా ప్రయోజనం ఉండటం లేదు. సామూహిక ఎలుకల నివారణ చర్యలు చేపడితేనే వాటి నివారణ సాధ్యమవుతుందని రైతులంటున్నారు. వ్యవసాయ శాఖాధికారులు సామూహిక ఎలుకల నివారణకు చర్యలు చేపట్టాలని వారుకోరుతున్నారు. రూ.17వేల ఖర్చయింది ఈ ఏడాది ఎలుకల బెడద ఎక్కువగానే ఉంది. నారుమళ్ళు పోసిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఎనిమిది సార్లు ఎలుకల బుట్టలు పెట్టించాను. మూడెకరాలకు రూ.17 వేలు ఖర్చులు అయ్యాయి. ఎలుకలు కొట్టిన వరి దుబ్బులను కూలీలతో ఏరిస్తున్నాను. సామూహిక ఎలుకల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.– గాజుల రాంబాబు (రాముడు), రైతు, బందలాయిచెరువు -
యాసంగికి రెడీ
ఖమ్మంవ్యవసాయం: రబీ(యాసంగి) సీజన్లో పంటల సాగుకు వ్యవసాయ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో ఉన్న నీటి వనరుల ఆధారంగా 53,620 హెక్టార్లలో ధాన్యం, చిరు ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, వాణిజ్య పంటలు సాగు చేసే అవకాశం ఉన్నట్లు అంచనాలు రూపొందించింది. ధాన్యపు పంటల్లో ప్రధానంగా వరి సాగు చేసే అవకాశం ఉంది. చిరు ధాన్యం పంటల్లో జొన్న, సజ్జ, మొక్కజొన్న ఉండగా.. వీటిలో ప్రధానంగా మొక్కజొన్న పంట సాగు చేసే అవకాశాలున్నాయి. ఇక పప్పు పంటల్లో పెసలు, మినుము, స్వల్పంగా కంది, ఉలవల పంటలను సాగు చేస్తారు. నూనె గింజల పంటల్లో వేరుశనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు పంటలను సాగు చేస్తున్నారు. అక్కడక్కడ వాణిజ్య పంటలుగా మిర్చి, పొగాకు తదితర పంటలను సాగు చేస్తారు. ఖరీఫ్‌లో కురిసిన వర్షాలకు జిల్లాలోని భూగర్భ జలాల ఆధారంగా రైతులు పంటలను సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆగస్టులో కురిసిన వర్షాలకు జిల్లాకు ప్రధాన నీటివనరైన నాగార్జున సాగర్‌లోకి సమృద్ధిగా నీరు చేరింది. ఆ నీటిని ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు విడుదల చేశారు. దీంతో జిల్లాలో భూగర్భ జలం కూడా ఆశాజనకంగా ఉంది. బోరు బావులు, చెరువుల కింద, జలాశయాల కింద రైతులు రబీ పంటలను సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయా వనరుల ఆధారంగానే జిల్లా వ్యవసాయ శాఖ రబీ ప్రణాళికలను సిద్ధం చేసింది. అయితే సాగర్ నుంచి నీటి విడుదల జరిగితే సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది ఆలస్యంగా కురిసిన వర్షాలతో జిల్లాలో రబీ సాగు బాగా పెరిగింది. గత ఏడాది రబీ సాగు అంచనా 43,994 హెక్టార్లు కాగా.. సాగర్ నుంచి నీరు విడుదల కావడంతో 83,440 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఈ ఏడాది కూడా వ్యవసాయ శాఖ 53,620 హెక్టార్లను అంచనా వేయగా, అంతకు మించి పంటల సాగు ఉండే అవకాశాలు ఉన్నాయి. వరి సాగు అంచనా 31,390 హెక్టార్లు.. జిల్లాలో 31,390 హెక్టార్లలో వరి సాగు చేసే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ ప్రణాళికలో పేర్కొంది. గత ఏడాది రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23,516 హెక్టార్లు కాగా.. రెట్టింపుగా 51,130 హెక్టార్లలో పంట వేశారు. ఈ ఏడాది నీటి వనరులు మెరుగుపడడంతో సాధారణ సాగు విస్తీర్ణాన్ని పెంచారు. అయితే సాగర్ నీటి విడుదల ఉంటే మాత్రం సాధారణ సాగుకు మించి వరి పంట సాగు చేసే అవకాశాలున్నాయి. అందుబాటులో విత్తనాలు, ఎరువులు రబీలో సాగు చేసే వివిధ రకాల పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచే విధంగా జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, హాకా వంటి సంస్థల నుంచి విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు పూనుకుంటోంది. వరి, వేరుశనగ, మినుము, పెసలు, పొద్దు తిరుగుడు, జనుము, మొక్కజొన్న, పిల్లి పెసర, నువ్వులు, జీలుగు, శనిగల వంటి విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లాలో పంటల సాగునుబట్టి డీఏపీ, యూరియా, పొటాష్, కాంప్లెక్స్, సింగల్ సూపర్ పాస్పేట్ వంటి ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 1,08,080 మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆరుతడికి ప్రాధాన్యం ఇవ్వండి.. రబీలో ఆదాయాన్నిచ్చే పంటలను సాగు చేసుకోవాలి. ఆరుతడి పంటల సాగు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. మిశ్రమ పంటలను సాగు చేయడం వల్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో నీటి సమస్య ఉండే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మొక్కజొన్న, జొన్న పంటలను జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తక్కువ కాలపరిమితి కలిగిన పంటలను సాగు చేసుకోవాలి. – ఎ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి -
పైరుకు ప్రాణం!
మహబూబ్‌నగర్ రూరల్ : కళ్లు కాయలు కాచేలా రైతులు ఎదురుచూసిన వానలు కాస్త ఆలస్యంగానైనా వచ్చాయి. నెల రోజులుగా వర్షాధార పంటలు వాడుపట్టిపోయాయి. పంటలపై ఆశలు వదులుకుంటున్న తరుణంలో వరుణుడు ఎట్టకేలకు రైతులపై కరుణ చూపాడు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ముసురు వర్షాలు కురుస్తుండటంతో రైతుల కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి. పలుగుపార పట్టి పొలానికి పరులుగు పెడుతున్నారు. కూలీలకు సైతం చేతినిండా పని దొరికింది. వర్షాధారమే అధికం.. సాధారణంగా జిల్లాలో ఖరీఫ్ పంటల సేద్యం ఎక్కువగా వర్షాధారంపైనే ఉంటుంది. అయితే జి ల్లాలో ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా కురియక పోవడంతో ఖరీఫ్ సేద్యం డోలాయమానంలో పడింది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఆ ప్రభావం జిల్లాపై పడి ముసురు పట్టింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఓ మోస్తారు వర్షానికి రైతన్నకు ఉపశమం కలిగించింది. మెట్ట పంటలు ప్రాణం పోసుకున్నాయి. పొలాలకు ఉరుకులు.. పరుగులు నెల రోజులుగా చినుకు రాలక వాడుపట్టిన పంటల కు ఈ వర్షం ప్రాణం పోసింది. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, కందులు పలు వాణిజ్య పంటలకు మేలు జరిగింది. కురిసిన వర్షంతో రైతన్న పొలంబా ట పట్టారు. పత్తి పంటకు ఎరువులు వేస్తున్నారు. ముఖ్యంగా కంది పైరుకు జీవం పోసింది. కానీ ఈ వర్షం వరి పంటకు ఏ మాత్రం సరిపోదు. ఇంకా వ ర్షాలు బాగా పడితేనే ప్రయోజనం చేకూరుతుంది. అత్యధికంగా బాలానగర్‌లో.. జిల్లాలో అత్యధికంగా బాలానగర్ మండలంలో 73.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇంత పెద్దమొత్తంలో ఇక్కడే వర్షం ఎక్కువగా కురిసింది. అలాగే అతితక్కువగా క్రిష్ణ మండలంలో 9.8 మి.మీ వర్షపాతం నమోదైంది. దామరగిద్ద మండలంలో 29.2 మి.మీ, నారాయణపేటలో 22.2 మి.మీ, ఊట్కూర్‌లో 15 మి.మీ, మాగనూర్‌లో 10 మి.మీ, మక్తల్‌లో 13 మి.మీ, నర్వలో 10 మి.మీ, చిన్నచింతకుంటలో 10 మి.మీ, మరికల్లో 10 మి.మీ, దేవరకద్రలో 15.2 మి.మీ, కోయిలకొండలో 14.2 మి.మీ, మద్దూరులో 31.0 మి.మీ, కోస్గిలో 50.2 మి.మీ, గండీడ్‌లో 47.6 మి.మీ. హన్వాడలో 34.0 మి.మీ, మహబూబ్‌నగర్‌లో 20.5 మి.మీ, దేవరకద్రలో 16.8 మి.మీ, అడ్డాకులలో 18.0 మి.మీ, ముసాపేటలో 20.5 మి.మీ, భూత్పూర్లో 26.2 మి.మీ, మహబూబ్‌నగర్ అర్బన్‌లో 34.6 మి.మీ, నవాబుపేటలో 59.6 మి.మీ, రాజాపూర్‌లో 63.5 మి.మీ, జడ్చర్లలో 30.2 మి.మీ, మిడ్జిల్‌లో 39.2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున సరాసరి 27.9 మి.మీ వర్షపాతం నమోదైంది. పెసరకు నష్టం ముసురు వర్షాలు మెట్ట, వరి పంటలకు మేలు చేకూరినా పెసర పంటకు మాత్రం నష్టం కలిగించేలా ఉంది. ముసురు వర్షం వస్తే పెసరకు నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పంట నారాయణపేట, దామరగిద్ద మండలాల్లో ఎక్కువ గా సాగుచేస్తారు. జిల్లాలో వేరే ప్రాంతాల్లో ఈ పం ట సేద్యం అంతగా ఉండదు. కొన్ని రోజులుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం.. చివరగా ముసురు పట్టడంతో పెసర దిగుబడి ఆశించేలా వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 33,089 హెక్టార్లలో వరి సాగుకు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 18,014 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 2,42,508 హెక్టార్లలో సేద్యం చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,27,972 హెక్టార్లలో సాగులో ఉంది. మహబూబ్‌నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో వరి నాట్లు వేస్తున్న కూలీలు అంతా దేవుడి కరుణే.. ఈ యేడు వర్షాలు సరిగా రాలేదు. నాలుగున్నర ఎకరాల్లో వరి, జొన్న పంటలు సాగు చేశాను. ఈ పంటలన్నీ ఎండిపోయినయి. కష్టమంతా పాయే..అని ఆశలు వదులుకున్నాం. కానీ వరుణదేవుడు కరుణించాడు. పంటలకు ప్రాణం పోశాడు. ఇలాంటి పెద్దవర్షం ఇంకా పడితేనే ప్రయోజనం. – జంగం దాసు, రైతు, బొక్కలోనిపల్లి -
చేతికి రాని పంట!
మోర్తాడ్(బాల్కొండ):సాధారణంగా రబీ సీజనులో ఈదురు గాలులు, అకాల వర్షం కురిసే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ కాల పరిమితిలో చేతికి వచ్చే వరి రకాలను సాగు చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో పెద్దపల్లి జిల్లా కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి చేసిన కేఎన్ఎం 118 రకం వరి వంగడాలను రుద్రూర్ పరిశోధన కేంద్రంలో సీడ్ ప్రాసెసింగ్ చేసి రైతులకు సరఫరా చేశారు. దాదాపు 900 సంచుల కేఎన్ఎం 118 రకం వరి విత్తనం ఉండటంతో ఈ విత్తనాలను రైతులకు ఈ రబీ సీజనుకు గాను పరిశోధన కేంద్రం ఉద్యోగులు విక్రయించారు. జిల్లాలోని కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల, మెండోరా, ముప్కాల్, బాల్కొండ, వేల్పూర్, జక్రాన్‌పల్లి, రెంజల్, ఎడపల్లి, నవీపేట్, బోధన్, వర్ని, కోటగిరి, రుద్రూర్ తదితర మండలాల్లోని రైతులు ఈ కొత్త రకం వరి విత్తనాన్ని కొనుగోలు చేసి సుమారు తొమ్మిది వందల ఎకరాల్లో సాగు చేశారు. 125 రోజుల్లో వరి పంట చేతికి వస్తే అకాల వర్షాలు రాక ముందే పంట కోత దశకు చేరుకుంటుందని రైతులు ఆశించారు. సాధారణంగా రబీ పంటల సాగు డిసెంబర్లోనే మొదలు పెడుతున్నారు. డిసెంబర్లో నారు పోస్తే జనవరిలో పంటను నాటుతారు. ఈ లెక్కన ఏప్రిల్ రెండో వారంలో పంట కోత దశకు చేరుకుంటుంది. నెలలు, రోజుల ప్రకారం లెక్కలు వేసిన రైతులు కేఎన్ఎం 118 రకం వరిని సాగు చేశారు. శాస్త్రవేత్తలు ప్రకటించిన ప్రకారం 125 రోజుల్లో వరి పంట చేతికి రావాల్సి ఉంది. అయితే 145 రోజులు గడుస్తున్నా ఇంకా వరి పంట కోత దశకు చేరుకోలేదు. ఈ పంట చేతికి రావాలంటే మరో 10 రోజుల సమయం పడుతుంది. వారం రోజుల నుంచి వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో పాటు అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తున్నాయి. వరి పంట ఇంకా కోత దశకు చేరుకోకపోవడంతో రైతులు తమ పంట పరిస్థితి ఏమిటని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేఎన్ఎం 118 రకం తక్కువ కాల పరిమితితో పాటు ఎకరానికి 30 క్వింటాళ్ల నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో ఈ రకం వరి వంగడాలను రైతులు కొనుగోలు చేసి సాగు చేశారు. దిగుబడి మాట ఎలా ఉన్నా పంట కోత దశకు చేరుకోకపోవడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఖరీఫ్‌లోనే తక్కువ సమయంలో చేతికి వస్తుంది కేఎన్ఎం 118 రకం ఖరీఫ్‌లోనే 125 రోజుల్లో కోతకు వస్తుంది. రబీలో 10 రోజుల కాల పరిమితి ఎక్కువ అవుతుంది. అయితే వాతావరణ పరిస్థితుల ప్రకారం ఇంకా పది రోజుల సమయం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఈ వంగడాన్ని మేము కేవలం ప్రాసెసింగ్ మాత్రమే చేశాం. ఉత్పత్తి చేసిన వారు కునారం వారు.– ప్రభాకర్‌రెడ్డి,శాస్త్రవేత్త, రుద్రూర్ పరిశోధన కేంద్రం కమ్మర్పల్లి మండలం ఉప్లూర్‌కు చెందిన రైతు బద్దం ప్రసాద్ రబీలో అకాల వర్షాలు కురుస్తాయనే ఉద్దేశంతో తక్కువ కాలపరిమితిలో చేతికి వచ్చే వరి రకాన్ని సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతలోనే రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఇచ్చిన ఒక ప్రకటన చూసి కేఎన్ఎం 118 రకం వరి విత్తనాన్ని కొనుగోలు చేసి పది ఎకరాల్లో వరిని సాగు చేశారు. కేఎన్ఎం 118 రకం సాగు చేస్తే 125 రోజుల్లో పంట కోతకు వస్తుందని పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రకటించారు. కాని బద్దం ప్రసాద్ సాగు చేసిన వరి పంటకు 145 రోజులు గడచిపోయినా పంట ఇంకా కోత దశకు చేరుకోలేదు. ఈ పంట కోత దశకు చేరుకోవాలంటే మరో పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇది ఒక బద్దం ప్రసాద్‌కు సంబంధించిన సమస్యనే కాదు. జిల్లాలో సుమారు 900 ఎకరాల్లో వరి పంటను సాగు చేసిన రైతుల పరిస్థితి ఇది. -
సాగునీరివ్వండి మహాప్రభో!
ఆత్మకూర్ (కొత్తకోట): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో వేలాది ఎకరాల్లో వరిని సాగుచేస్తున్న రైతులకు కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉన్నాయి. మరో 20రోజుల్లో పంట చేతికి వచ్చే ముందు నీటి సరఫరాను నిలిపివేయడంతో మండలంలోని ఆయకట్టు రైతులు సాగుచేసిన వరిపంటలు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారాయి. అసలే సాగునీరందక ఒకపక్క కాల్వల పరిధిలోని గ్రామాల రైతులు ఘర్షణలకు దిగుతుంటే.. మరోపక్క కాల్వలపై ఏర్పాటు చేసిన మోటార్లను అధికారులు తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. 35 వేల ఎకరాల్లో వరి.. జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ, అనుసంధానమైన డీ–6, 7 కాల్వలతోపాటు ఎడమ కాల్వ, రామన్‌పాడు రిజర్వాయర్ కింద సుమారు 35 వేల ఎకరాల్లో వరిని సాగుచేశారు. మరో మూడు తడులు అందితే ఈ పంటలు చేతికొస్తాయి. కానీ జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఉన్న కాస్త నీటిని తాగునీటి అవసరాల కోసం రామన్‌పాడు రిజర్వాయర్‌కు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తమ పంట పొలాలకు నీరు అందడం లేదని రైతులు కాల్వలపై మోటార్లను ఏర్పాటు చేసుకొని పొలాలకు నీటిని అందిస్తున్నారు. మరికొంత మంది నీళ్లు ముందుకు వెళ్లకుండా కాల్వల్లో ముళ్లపొదలు, రాళ్లు మట్టితో అడ్డుకట్టలు వేసి నీటిని తోడేసుకుంటున్నారు. ఐఏబీ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఈ నెల 15వ తేదీ నాటికి సాగునీరందిస్తామని ప్రకటించారని, ఆ మేరకు నీటిని విడుదలచేసి పంటలను కాపాడాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. తాగునీటికే ప్రాధాన్యం.. రామన్‌పాడు రిజర్వాయర్ నుంచి జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్, జడ్చర్ల, వనపర్తి తదితర ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రామన్‌పాడు రిజర్వాయర్‌లో 1021.08 సామర్థ్యానికి గాను 1014.02 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. రోజురోజుకు ఈ నీటిమట్టం సైతం తగ్గిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. తాగునీటి సరఫరా నిలిచిపోతే జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ తాగునీటి సంగతి పక్కన పెట్టి సాగునీరు విషయం మాట్లాడాలని, మరో పక్షంరోజులపాటు సాగునీరు అందిస్తేనే తాము సాగు చేస్తున్న పంటలు చేతికి వస్తాయని, లేకుంటే పంటలు ఎండిపోయి ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. -
వడగళ్ల వానతో.. రైతుకు కడగండ్లు
కేశంపేట: ఆదివారం తెల్లవారు జామున ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కురిసిన వర్షం రైతులకు కన్నీటిని మిగిల్చింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చె సమయానికి వడగళ్ల వర్షం రూపంలో రైతుకు కడగండ్లను మిగిల్చింది. ఆదివారం మండలంలో 28.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలో కురిసిన వడగండ్ల వర్షానికి వరి పూర్తిగా నీట మునిగింది. బోర్లలో నీరు ఇంకిపోవడంతో ట్యాంకర్ల ద్వారా వరి పంటను బతికించుకున్నామని, అకాల వర్షం పంటంతా తడిసిముద్దవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వాన రూపంలో పంటలు పడవడంతో పాపిరెడ్డిగూడ గ్రామంలో రైతు అబ్బి రవి కన్నీరు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఈదురు గాలులకు మామిడికాయలు నేలరాలాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కందుకూరులో భారీ వర్షం కందుకూరు: మండల పరిధిలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. 24.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా వర్షంతో పాటు ఈదురు గాలులతో లేమూరు, సరస్వతిగూడ, గూడూరు, అగర్మియాగూడ తదితర గ్రామాల పరిధిలోని తోటల్లో మామిడికాయలు నేలరాలి రైతులు నష్టపోయారు. ఈ ఏడాది అతి తక్కువగా కాత ఉండడం ప్రస్తుతం ఈదుర గాలులకు కాయలు నేల రాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా పులిమామిడి పరిసర ప్రాంతాల్లో తెల్లవారు జామున స్వల్పంగా వడగళ్లు కురిశాయి. చేసిన అప్పులు తీరేదెలా.. తలకొండపల్లి(కల్వకుర్తి): అకాలవర్షంతో రైతులు తలలు పట్టుకున్నారు. మండలవ్యాప్తంగా సుమారుగా 500 ఎకారాలకు పైగా వరిపంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తలకొండపల్లి, పడకల్, మెదక్‌పల్లి, వెల్జాల్, చంద్రధన, చుక్కాపూర్, తాళ్లగుట్టతండా, తదితర గ్రామాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో కల్లు రాజేశ్వర్‌రెడ్డి 6 ఎకరాల్లో, జబ్బార్, సేవ్య, తార్యా, హూమ్లా, శక్రు, పుల్యా, రాములు, చందు, బాటా, తదితర రైతులకు సంబందించి సుమారుగా 300 ఎకరాలకు పైగా వరి పంట దెబ్బతిందని రైతులు బావురుమంటున్నారు. వడగండ్లవానకు కళ్ల ముందే పంట నాశనమైందని, దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పంట వివరాలు సేకరించి ప్రభుత్వపరంగా నష్ట పరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
ఆగిన అన్నదాత గుండె
ఇందల్వాయి: అప్పుచేసి పెట్టుబడి పెట్టి నాలుగు నెలలుగా రేయింబవళ్లు కష్టపడుతూ కంటికిరెప్పలా కాపాడుకుంటున్న వరిపంట చివరి దశలో నీరందకపోవడంతో ఆ రైతు ఆవేదన చెందాడు.. పది రోజులుగా నిద్రాహారాలు మాని పొలంవద్దనే ఉంటూ బొట్టుబొట్టును పంటకు మళ్లిస్తున్న రైతు పంట పండుతుందో లేదో.. అప్పులు తీరుతాయో లేదో అని తీవ్ర ఆవేదన చెందాడు.. చివరికి తన పొలం వద్దే గుండె ఆగి తనువు చాలించాడు. ఇందల్వాయి మండలం లోలం గ్రామానికి చెందిన జల్లా పెద్దగంగారం తనకున్న ఎకరంనర పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కూలి పనులకు వెళ్తూ తన ఇద్దరు భార్యలు, ఒక దత్తత పుత్రుడితో జీవనం సాగించేవాడు. గతం లో కుటుంబ పోషణ నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లిన గం గారాం అక్కడ సరైన ఉపాధి దొరకక స్వగ్రామానికి తిరిగి వచ్చి ఇక్కడే ఉంటున్నాడని గ్రామస్తు లు తెలిపారు. ఈ క్రమంలో మూడేళ్లుగా సరైన వర్షాలు లేక, పంటలు చేతికి రాక రూ. 3 లక్షలదాకా అప్పు చేశాడు. ఈసారి రబీలో 25 వేలు అప్పు చేసి ఎకరంనర పొలం సాగు చేశాడు గం గారాం. తనకున్న బోరుబావి నుంచి మొదట్లో నీరు బాగా అందినా గత 15 రోజుల నుంచి పంటకు సరిగా నీరు అందకపోవడంతో మోటారును ఇంకా లోతులోకి దించేందుకు మరో 5 వేలు అప్పు చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయినా నీరు సరిపడా రాకపోవడంతో వారం రోజులనుంచి తీవ్ర ఆందోళనలో గంగారాం ఉన్నాడని అన్నం కూడా సరిగా తినక రేయింబవళ్లు పొలం వద్దనే ఉంటూ పొలానికి నీరు పెడుతున్నాడని అన్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పొలం వద్దకు వెళ్లిన గంగారాం ఉదయం ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా మంచంపైనే విగతజీవిగా పడి ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పొలం ఎండిపోతుందన్న మానసిక వేదనతో గుండెపోటుకు గురై చనిపోయాడని భావిస్తున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అనం తరం ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలానికి చేరుకు ని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వర్ష బీభత్సం
ఈదురు గాలులతో ధ్వంసమైన ఇళ్ల పైకప్పు రేకులు షాబాద్ మండలం రుద్రారంలో పిడుగుపాటుతో ఎద్దు మృతి షాబాద్ : ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం మండల పరిధిలోని హైతాబాద్, చందనవెల్లి, రుద్రారం తదితర గ్రామాల్లో జనాన్ని అతలాకుతలం చేసింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో దాదాపు 30 ఇళ్ల రేకులు దెబ్బతిన్నాయి.. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ర్లు ధ్వంసమై చెట్లు విరిగిపోయాయి. రుద్రారం గ్రామంలో రైతు జెట్ట పాపయ్య కాడి ఎద్దు పిడుగుపాటుతో మృతిచెందింది. చేతికొచ్చిన వరి పంటలు నేలవారింది. మామిడి కాయలు నేలరాలాయి. రుద్రారం గ్రామంలో యాదగిరి, సిద్ధేశ్వర్, రాంచంద్రయ్య, లక్ష్మయ్య, వెంకటయ్య, హనుమంతుతో పాటు మరి కొందరి ఇళ్ల రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చందనవెల్లిలో వెంకటయ్య, ఎల్లయ్య, మహేందర్, రా ములు, జంగయ్య, అంజయ్యకు చెందిన ఇళ్లు, హైతాబాద్ గ్రామంలో లలిత, నారాయణ, శ్రీనివాస్‌రెడ్డిల ఇళ్లు వర్షానికి కూలిపోయాయి. శంషాబాద్ మండలంలో.. శంషాబాద్ రూరల్: మండల పరిధిలోని హమీదుల్లానగర్, బహదుర్గూడ గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఇదురుగాలులు, వడగళ్ల వర్షం కురవడంతో పంటలకు తీవ్రనష్టం జరిగింది. హ మీదుల్లానగర్లో రమేష్, సత్తయ్యకు చెందిన పొలాల్లోని డెయిరీఫాం పైకప్పు రేకులు ధ్వంసమయ్యాయి. భారీ వర్షంతో వరి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి. -
నష్టం..రూ.7కోట్లు
నల్లగొండ, న్యూస్‌లైన్ : అకాల వర్షాల కారణంగా జిల్లాలో భారీ నష్టమే వాటిల్లింది. కొద్ది రోజులుగా జిల్లాలో కురిసిన వర్షాల వల్ల 1520 హెక్టార్లలో వరి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. దీంతో రైతాంగానికి సుమారు రూ.7కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా శుక్రవారం కురిసిన వర్షానికే 340 హెక్టార్లలో చేతికొచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. దీంతోపాటు ఐకేపీ కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. దీని వల్ల ఇటు రైతాంగానికి, కొనుగోలు చేసిన మహిళా సంఘాలకు నష్టం రాకుండా ఉండేందుకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జిల్లా వ్యవసాయ శాఖ తెలిపింది.