నష్టం..రూ.7కోట్లు
నల్లగొండ, న్యూస్‌లైన్ : అకాల వర్షాల కారణంగా జిల్లాలో భారీ నష్టమే వాటిల్లింది. కొద్ది రోజులుగా జిల్లాలో కురిసిన వర్షాల వల్ల 1520 హెక్టార్లలో వరి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. దీంతో రైతాంగానికి సుమారు రూ.7కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా శుక్రవారం కురిసిన వర్షానికే 340 హెక్టార్లలో చేతికొచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. దీంతోపాటు ఐకేపీ కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. దీని వల్ల ఇటు రైతాంగానికి, కొనుగోలు చేసిన మహిళా సంఘాలకు నష్టం రాకుండా ఉండేందుకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జిల్లా వ్యవసాయ శాఖ తెలిపింది.