సాగులో ఉన్న బీపీటీ–2858 బ్లాక్ రైస్ పైరు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇప్పటివరకు నల్ల బియ్యం, ఎర్ర బియ్యం అనేవి దేశవాళీ రకాల్లోనే ఉన్నాయి. బర్మా బ్లాక్, కాలాబటీ, మణిపూర్ బ్లాక్ రకాలుగా పిలిచే వీటిని అస్సాం, మణిపూర్, మేఘాలయ తదితర రాష్ట్రాల్లోని రైతులు.. అక్కడక్కడా ఏపీ రైతులు సైతం పండిస్తున్నారు. లావు రకానికి చెందిన ఈ బియ్యాన్ని వండితే అన్నం ముద్దగా ఉంటోంది. ఎకరానికి 10 నుంచి 15 బస్తాలకు మించి దిగుబడి రావటం లేదు. ఎర్ర బియ్యంలో కేరళకు చెందిన నవారా రకం కూడా ఉన్నా.. ఇది ఎకరాకు 10 బస్తాలకు మించి దిగుబడి ఇవ్వడం లేదు.
ప్రస్తుతం ఆర్గానిక్, నేచురల్ ఫార్మింగ్ విధానంలో ఈ రకాలు మన రాష్ట్రంలోనూ అరకొరగా సాగవుతున్నాయి. డిమాండ్ ఉన్నా.. దిగుబడి తక్కువగా ఉండటంతో గిట్టుబాటు కాక రైతులు వీటి సాగు వైపు మొగ్గు చూపటం లేదు. బ్లాక్, రెడ్ రైస్ ధాన్యం పైపొరలో ‘యాంతోసైనిన్’ అనే పదార్థం ఉండటం వల్ల వాటికి ఆ రంగు వస్తుంది. బియ్యాన్ని పైపొరతో కలిపి తినాలి. వీటిలో ఐరన్, జింక్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ రకాలు లావుగా ఉండి అన్నం ముద్దగా వస్తుండటంతో ప్రజలు తినడానికి పెద్దగా ఇష్టపడటం లేదు.
బాపట్ల వరి పరిశోధన స్థానంలో సన్న రకాలుగా రూపొందించిన రెడ్, బ్లాక్ రైస్
బాపట్ల శాస్త్రవేత్తల కృషి ఫలించి..
ఈ రెండింటినీ సన్నరకాలుగా ఉత్పత్తి చేస్తే ప్రజలు తినేందుకు ఆసక్తి చూపిస్తారని బాపట్ల వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు భావించారు. 2019లో పరిశోధనలు చేపట్టి బీపీటీ–2848 రకం బ్లాక్ రైస్‌ను తొలుత సృష్టించారు. దీనిని మినీ కిట్‌గా రైతులకు అందించారు. మూడేళ్లపాటు వెయ్యి కిట్లు ఇచ్చి మినీ కిట్ దశ పూర్తి చేశారు. ఈ బియ్యం అచ్చం బీపీటీ–5204 రకం మాదిరిగా సన్నబియ్యంగానే ఉన్నాయి.
ప్రయోగం విజయవంతం కావడంతో బీపీటీ–2841, 3136, 3137, 3145 తదితర రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. బ్లాక్ రకంలో ఫైబర్, మాంసకృత్తులు అధికంగా ఉండగా.. రెడ్ రైస్‌లో బీపీటీ–2858, 3143, 3182, 3140, 3111, 3507 రకాలను సైతం సృష్టించారు. వీటిలో జింక్, ఐరన్, సూక్ష్మపోషకాలు అధికం.
ఈ వంగడాలు అధిక దిగుబడులు ఇవ్వడంతోపాటు ప్రజలకు రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యాన్ని ఇస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విత్తనాలను మూడేళ్లపాటు ప్రయోగాత్మకంగా రైతులకు అందించి నాణ్యతా ప్రమాణాలను పరీక్షించారు.
తాజాగా ఈ విత్తనాలకు నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ (న్యూఢిల్లీ) గుర్తింపు ఇచ్చింది. ఈ ఏడాది ఈ విత్తనాన్ని బాపట్ల వరి పరిశోధన స్థానం పరిధిలోని రైతులతో పాటు ఆసక్తి గల ప్రైవేట్ కంపెనీలకు అందించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.
బేబీ ఫుడ్‌లా బ్లాక్ రైస్ పౌడర్
బీపీటీ–2848 రకం బ్లాక్ రైస్ పౌడర్ రూపంలో పిల్లలకు బేబీ ఫుడ్‌లా (హార్లిక్స్ తరహాలో) అందించేందుకు వివిధ కంపెనీలు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఉప్మా రవ్వ, పౌడర్, జావ, పాయసం, కేకులు, అటుకులు, వడియాలు, మరమరాలు, నూడిల్స్, సేమియా తదితర పదార్థాలుగా తయారు చేయాలని బాపట్ల పరిశోధన స్థానం ఇప్పటికే నిర్ణయించింది. ఈ బ్లాక్ రైస్ వంటకాలు తినడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడటంతోపాటు కళ్ల జబ్బులు పోతాయని, పలు రకాల అనారోగ్య సమస్యలు తొలగుతాయని పరిశోధనలో తేలినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరింతగా పోషకాలు
సాధారణ రకం వడ్లను పూర్తి స్థాయిలో పాలిష్ పడితే 6 లేదా 7 శాతం మాంసకృత్తులు మాత్రమే ఉంటాయి. అదే కొత్తగా రూపొందించిన బ్లాక్, రెడ్ రైస్‌లో 10.5 శాతం మాంసకృతులు ఉన్నాయి. బీపీటీ–2841 రకంలో అత్యధికంగా 13.7 శాతం ప్రోటీన్లు ఉండటం విశేషం. మొత్తంగా ఈ రకాల్లో టోటల్ ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు సాధారణ రకాలతో పోలిస్తే 3 నుంచి 4 రెట్లు అధికం. శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రీరాడికల్స్‌ను ఇవి సమతుల్యం చేస్తాయి. దీర్ఘకాలిక రోగాలను ఎదుర్కొనే ఇమ్యూనిటీ ఇస్తాయి. ఇవి ఎకరానికి 30 బస్తాలకు తగ్గకుండా దిగుబడి ఇస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
30 బస్తాలకు తగ్గకుండా దిగుబడి
బాపట్ల వరి పరిశోధన స్థానంలో బ్లాక్, రెడ్ రైస్ వంగడాలను సన్నరకాలుగా ఉత్పత్తి చేశాం. ఇప్పటికే బ్లాక్ రైస్ మినీకిట్ మూడు సంవత్సరాల దశ పూర్తయ్యింది. దీనికి నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ (న్యూఢిల్లీ) గుర్తింపు ఇచ్చింది. ఎకరాకు 30 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వస్తుంది. మనుషుల ఆరోగ్యానికి అత్యంత అనుకూలమైన రకం. చర్మ సౌందర్యంతోపాటు కళ్లకు మంచిదని పరిశోధనలో తేలింది. ఈ ఏడాది నుంచి రైతులతోపాటు ప్రైవేట్ కంపెనీలకు సీడ్ అందజేస్తాం. రెడ్ రైస్ సైతం మొదటి ఏడాది మినీ కిట్ దశ పూర్తయింది. ఆసక్తి ఉన్న రైతులకు ఇవి కూడా అందజేస్తాం.
– బి.కృష్ణవేణి, ప్రధాన శాస్త్తవేత్త, బాపట్ల వరి పరిశోధన స్థానం
Comments
Please login to add a commentAdd a comment