Black Rice
-
బ్లాక్ వర్సెస్ బ్రౌన్ రైస్: రెండింటిలో ఏదీ బెటర్ అంటే..?
మార్కెట్లో ఇప్పుడూ పోషక విలువలు కలిగిన రకరకాల రైస్‌లు వస్తున్నాయి. ఆఫ్ బాయిల్డ్ రైస్, బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం, బ్లాక్ రైస్ వంటివి ఎన్నో వస్తున్నాయి. వాటిల్లో ఇటీవల ఎక్కువమంది బ్రౌన్ రౌస్, బ్లాక్ రైస్‌లు విరివిగా వినియోగిస్తున్నారు. రెండింటిలోనూ అధిక స్థాయిలో పోషకాలు ఉంటాయి. పైగా ఆరోగ్యానికి ఈ రెండు చాలా మంచివి కూడా. అయితే వీటిలో ఏదీ మనకు బెటర్ అనే విషయానికి వస్తే.. పోషకాల పరంగా.. బ్రౌన్ రైస్ తృణధాన్యంగా బాగా ప్రసిద్ధి చెందింది. దాని బయట ఉండే ఊక పొర థయోమిన్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. దీనిలో ఫైబర్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. బ్లాక్ రైస్ వద్దకు వచ్చేటప్పటికీ దీన్ని నిషిద్ధ బియ్యంగా పిలుస్తారు. దీనిలోని ఆంథోసైనిన్ కారణంగా డీప్ కలర్లో ఉంటుంది. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది. దీనిలో కూడా చెప్పుకోదగ్గ మొత్తంలో ఐరన్, జింక్‌లు ఉన్నాయి. అలాగే పోషక సాంద్రతను మెరుగుపరుస్తుంది. ఫైబర్ కంటెంట్.. రెండూ ఫైబర్‌కి మూల వనరులు. పోలిస్తే మాత్రం బ్లాక్‌రైస్‌లో మూడు గ్రాముల ఫైబర్ ఉంటే, బ్రౌన్ రైస్‌లో 4.5 గ్రాముల ఫైబర్‌తో ముందంజలో ఉంటుంది. ఈ లక్షణం కారణంగానే బ్రౌన్ రైస్ జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా బరువును అందుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక బ్లాక్ రైస్‌లో ఫైబర తక్కవుగా ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది, స్థిరమైన శక్తిని విడుదల చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ పవర్ బ్రౌన్ రైస్‌లో ఉండే సెలీనియం, మాంగనీస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికే దోహదం చేయగా, నల్ల బియ్యం వర్ణద్రవ్యానికి కారణమైన ఆంథోసైనిన్లు ఆక్సీకరణ, ఒత్తిడి, మంట వంటి వాటి నుంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఖనిజ కంటెంట్ బ్రౌన్ రైస్‌లో ఉండే మెగ్నీషియం, ఫాస్పర్స్లు ఎముకల ఆరోగ్యం కండరాల పనితీరు, శక్తిమంతమైన జీవక్రియకు ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్ల రక్షణకు మూలమైన మాంగనీస్ కూడా తగు మోతాదులో ఉంటుంది. ఇక బ్లాక రైస్‌లో ఇనుము, జింక్ కంటెంట్లు రోగ నిరోధక పనితీరుని మెరుగుపర్చడమే గాక శరీరం మొత్తం సవ్యంగా ఆక్సిజన్ రవాణా అయ్యేలా చేస్తుంది. కార్డియోమోటబాలిక్ ఆరోగ్యం.. ఈ రెండూ కార్డియోమెటబాలిక్ శ్రేయస్సుకు దోహదం చేసేవే. బ్రౌన్రైస్లోని అధిక ఫైబర్ కొలస్ట్రాల్ నియంత్రించడంలో ఉపకరించగా, బ్లాక్‌రైస్‌లో ఉండే ఆంథోసైనిన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చి హృదయ సంబంధ వ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది. నిజానికి ఈ రెండింటిలో ఏదీ బెస్ట్ అని నిర్ణయించడం కష్టం. రెండు మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఏది ఎంచుకోవాలన్నది మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని అనుసరించి వైద్యుల సలహ మేరకు ఎంచుకుంటే మంచిది. ముఖ్యంగా ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్లకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే బ్లాక్ రైస్ ఎంచుకోవడం మంచిది. అలా కాదు రుచితో కూడిన తేలికగా ఉండే ఆహారం కావాలనుకుంటే బ్రౌన్ రైస్ మేలు. (చదవండి: షుగర్‌ని ఎంతలా స్వాహ చేసేస్తున్నామో తెలుసా? ఎలాంటి చక్కెర్లు బెటర్?) -
మిగతా వరిరకాలతో పోలిస్తే బ్లాక్ రైస్ కు మంచి ధర
-
మార్కెట్ లో మంచి ధర పలుకుతున్న నల్లబియ్యం
-
రంగుల బియ్యం రెడీ
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇప్పటివరకు నల్ల బియ్యం, ఎర్ర బియ్యం అనేవి దేశవాళీ రకాల్లోనే ఉన్నాయి. బర్మా బ్లాక్, కాలాబటీ, మణిపూర్ బ్లాక్ రకాలుగా పిలిచే వీటిని అస్సాం, మణిపూర్, మేఘాలయ తదితర రాష్ట్రాల్లోని రైతులు.. అక్కడక్కడా ఏపీ రైతులు సైతం పండిస్తున్నారు. లావు రకానికి చెందిన ఈ బియ్యాన్ని వండితే అన్నం ముద్దగా ఉంటోంది. ఎకరానికి 10 నుంచి 15 బస్తాలకు మించి దిగుబడి రావటం లేదు. ఎర్ర బియ్యంలో కేరళకు చెందిన నవారా రకం కూడా ఉన్నా.. ఇది ఎకరాకు 10 బస్తాలకు మించి దిగుబడి ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆర్గానిక్, నేచురల్ ఫార్మింగ్ విధానంలో ఈ రకాలు మన రాష్ట్రంలోనూ అరకొరగా సాగవుతున్నాయి. డిమాండ్ ఉన్నా.. దిగుబడి తక్కువగా ఉండటంతో గిట్టుబాటు కాక రైతులు వీటి సాగు వైపు మొగ్గు చూపటం లేదు. బ్లాక్, రెడ్ రైస్ ధాన్యం పైపొరలో ‘యాంతోసైనిన్’ అనే పదార్థం ఉండటం వల్ల వాటికి ఆ రంగు వస్తుంది. బియ్యాన్ని పైపొరతో కలిపి తినాలి. వీటిలో ఐరన్, జింక్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ రకాలు లావుగా ఉండి అన్నం ముద్దగా వస్తుండటంతో ప్రజలు తినడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. బాపట్ల వరి పరిశోధన స్థానంలో సన్న రకాలుగా రూపొందించిన రెడ్, బ్లాక్ రైస్ బాపట్ల శాస్త్రవేత్తల కృషి ఫలించి.. ఈ రెండింటినీ సన్నరకాలుగా ఉత్పత్తి చేస్తే ప్రజలు తినేందుకు ఆసక్తి చూపిస్తారని బాపట్ల వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు భావించారు. 2019లో పరిశోధనలు చేపట్టి బీపీటీ–2848 రకం బ్లాక్ రైస్‌ను తొలుత సృష్టించారు. దీనిని మినీ కిట్‌గా రైతులకు అందించారు. మూడేళ్లపాటు వెయ్యి కిట్లు ఇచ్చి మినీ కిట్ దశ పూర్తి చేశారు. ఈ బియ్యం అచ్చం బీపీటీ–5204 రకం మాదిరిగా సన్నబియ్యంగానే ఉన్నాయి. ప్రయోగం విజయవంతం కావడంతో బీపీటీ–2841, 3136, 3137, 3145 తదితర రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. బ్లాక్ రకంలో ఫైబర్, మాంసకృత్తులు అధికంగా ఉండగా.. రెడ్ రైస్‌లో బీపీటీ–2858, 3143, 3182, 3140, 3111, 3507 రకాలను సైతం సృష్టించారు. వీటిలో జింక్, ఐరన్, సూక్ష్మపోషకాలు అధికం. ఈ వంగడాలు అధిక దిగుబడులు ఇవ్వడంతోపాటు ప్రజలకు రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యాన్ని ఇస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విత్తనాలను మూడేళ్లపాటు ప్రయోగాత్మకంగా రైతులకు అందించి నాణ్యతా ప్రమాణాలను పరీక్షించారు. తాజాగా ఈ విత్తనాలకు నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ (న్యూఢిల్లీ) గుర్తింపు ఇచ్చింది. ఈ ఏడాది ఈ విత్తనాన్ని బాపట్ల వరి పరిశోధన స్థానం పరిధిలోని రైతులతో పాటు ఆసక్తి గల ప్రైవేట్ కంపెనీలకు అందించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. బేబీ ఫుడ్‌లా బ్లాక్ రైస్ పౌడర్ బీపీటీ–2848 రకం బ్లాక్ రైస్ పౌడర్ రూపంలో పిల్లలకు బేబీ ఫుడ్‌లా (హార్లిక్స్ తరహాలో) అందించేందుకు వివిధ కంపెనీలు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఉప్మా రవ్వ, పౌడర్, జావ, పాయసం, కేకులు, అటుకులు, వడియాలు, మరమరాలు, నూడిల్స్, సేమియా తదితర పదార్థాలుగా తయారు చేయాలని బాపట్ల పరిశోధన స్థానం ఇప్పటికే నిర్ణయించింది. ఈ బ్లాక్ రైస్ వంటకాలు తినడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడటంతోపాటు కళ్ల జబ్బులు పోతాయని, పలు రకాల అనారోగ్య సమస్యలు తొలగుతాయని పరిశోధనలో తేలినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరింతగా పోషకాలు సాధారణ రకం వడ్లను పూర్తి స్థాయిలో పాలిష్ పడితే 6 లేదా 7 శాతం మాంసకృత్తులు మాత్రమే ఉంటాయి. అదే కొత్తగా రూపొందించిన బ్లాక్, రెడ్ రైస్‌లో 10.5 శాతం మాంసకృతులు ఉన్నాయి. బీపీటీ–2841 రకంలో అత్యధికంగా 13.7 శాతం ప్రోటీన్లు ఉండటం విశేషం. మొత్తంగా ఈ రకాల్లో టోటల్ ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు సాధారణ రకాలతో పోలిస్తే 3 నుంచి 4 రెట్లు అధికం. శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రీరాడికల్స్‌ను ఇవి సమతుల్యం చేస్తాయి. దీర్ఘకాలిక రోగాలను ఎదుర్కొనే ఇమ్యూనిటీ ఇస్తాయి. ఇవి ఎకరానికి 30 బస్తాలకు తగ్గకుండా దిగుబడి ఇస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 30 బస్తాలకు తగ్గకుండా దిగుబడి బాపట్ల వరి పరిశోధన స్థానంలో బ్లాక్, రెడ్ రైస్ వంగడాలను సన్నరకాలుగా ఉత్పత్తి చేశాం. ఇప్పటికే బ్లాక్ రైస్ మినీకిట్ మూడు సంవత్సరాల దశ పూర్తయ్యింది. దీనికి నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ (న్యూఢిల్లీ) గుర్తింపు ఇచ్చింది. ఎకరాకు 30 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వస్తుంది. మనుషుల ఆరోగ్యానికి అత్యంత అనుకూలమైన రకం. చర్మ సౌందర్యంతోపాటు కళ్లకు మంచిదని పరిశోధనలో తేలింది. ఈ ఏడాది నుంచి రైతులతోపాటు ప్రైవేట్ కంపెనీలకు సీడ్ అందజేస్తాం. రెడ్ రైస్ సైతం మొదటి ఏడాది మినీ కిట్ దశ పూర్తయింది. ఆసక్తి ఉన్న రైతులకు ఇవి కూడా అందజేస్తాం. – బి.కృష్ణవేణి, ప్రధాన శాస్త్తవేత్త, బాపట్ల వరి పరిశోధన స్థానం -
బ్లాక్ రైస్ సాగులో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. యువరైతు సక్సెస్ ఫార్ములా ఇదే!
నేటి యువతరం కంప్యూటర్ కోర్సులు నేర్చుకుని ఉన్నతమైన ఉద్యోగం, వేతనాలతో ఆధునిక జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. అదేబాటలో పయనిస్తూ ఫైన్ ఆర్ట్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడిన యువ రైతు విష్ణుమూడి శశికాంత్ కోవిడ్ వల్ల వచ్చిన స్వల్ప విరామం సమయంలో వ్యవసాయంపై ఆసక్తి చూపారు. బ్లాక్ రైస్, సుగర్ ఫ్రీ రైస్, బాస్మతీ రకాలను తనకున్న సొంత క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడమే కాక అధిక దిగుబడులను సాధించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. తాడేపల్లిగూడెం రూరల్: కోవిడ్ మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెనుమార్పులను తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ వైరస్ బారిన పడ్డ వారు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెం గ్రామానికి చెందిన విష్ణుమూడి శశికాంత్ కుటుంబీకులు కోవిడ్ బారిన కోలుకోవడంతో వైద్యుల సూచన పోషకాలతో కూడిన ఆహారంపై దృష్టి సారించారు. శశికాంత్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా, కోవిడ్ సంక్షోభంలో సాఫ్ట్వేర్ రంగంలో కొంత విరామం రావడం వంటి కారణాలతో తనకున్న భూమిలోనే ప్రయోగాత్మకంగా పోషకాలతో కూడిన బ్లాక్ రైస్ సాగుపై మక్కువ చూపారు. బ్లాక్ రైస్‌లో ప్రోటీన్లు 8.16 శాతం, కొవ్వు శాతం 0.07 శాతం, బార్లీ, గోధుమల్లో లభించే గ్లూటన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని అందించడంలో ఎంతగానో ఉపకరిస్తాయి. వీటన్నింటిని గ్రహించిన శశికాంత్ బ్లాక్ రైస్ సీడ్‌ను వరంగల్ నుంచి తీసుకువచ్చి తనకున్న ఐదెకరాల విస్తీర్ణంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా బ్లాక్ రైస్ సాగు చేపట్టారు. అందులో పురుగుమందులు వినియోగించుకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడమే కాక ఎకరాకు 25 నుంచి 30 బస్తాల వరకు నాణ్యమైన దిగుబడి సాధించారు. ప్రస్తుతం ఎకరం విస్తీర్ణంలో బ్లాక్‌రైస్‌ను సాగు చేస్తున్నారు. వీటితో పాటు బాస్మతీ రైస్, సుగర్ ఫ్రీ (బీపీటీ 5420) రైస్‌ను అరెకరం చొప్పున విస్తీర్ణంలో సాగు చేశారు. బాస్మతీ రైస్ 20 బస్తాలు, సుగర్ ఫ్రీ రైస్ 25 బస్తాలు దిగుబడి లభించాయి. పశువుల వ్యర్థాలే ఎరువు పశువుల, జీవాల విసర్జిత మల, మూత్రం, వేప పొడి వంటి వాటితో ఎరువును తయారు చేసి చేనుకు అందించడం ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించారు. తద్వారా ఎరువుల ఖర్చులను దాదాపు తగ్గించుకున్నారు. రైతుకు ప్రధానంగా నష్టం చేకూర్చేది తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు. అటువంటి వాటిని సైతం దీటుగా ఎదుర్కొని నిలబడగలిగే వరి వంగడంగా ఆయన పేర్కొన్నారు. బ్లాక్ రైస్ సాగు చేపట్టిన రైతు గుండెలపై చేయి వేసుకుని ప్రశాంతంగా ఉండవచ్చని భరోసానిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు ఆదాయం బ్లాక్ రైస్‌ను తమ ఇంటి అవసరాలకు, బంధువులకు సరఫరా చేయగా, మిగిలిన వాటిని 25 కిలోల బస్తాకు రూ.3 వేలు, సుగర్ ఫ్రీ రైస్ బస్తాకు రూ.1500లకు విక్రయించారు. ఒక పక్క ఆరోగ్యం, మరో పక్క ఆదాయం కూడా బాగుందని శశికాంత్ చెబుతున్నారు. ఒత్తిడి లేని వ్యవసాయమే లక్ష్యం ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయం చేయడం అంటే ఇష్టం. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల బెడద లేకుండా ఎటువంటి ఒత్తిడి లేని వ్యవసాయాన్ని రైతుకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. వ్యవసాయ యంత్ర పరికరాలను తయారు చేసుకోవాలని భావిస్తున్నా. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో 680 రకాల రైస్ బ్రాండ్స్ ఉన్నాయి. వాటిలో మేలైన రకాలు సాగు చేపట్టి సత్ఫలితాలు సాధించాలన్నదే నా లక్ష్యం. – విష్ణుమూడి శశికాంత్, యువ రైతు, మెట్ట ఉప్పరగూడెం, తాడేపల్లిగూడెం మండలం -
యువ రైతు ప్రయోగాలు.. నవారా, బర్మా బ్లాక్ రైస్, మైసూరు మల్లిక, సిద్ధ సన్నాలు,
ఓ పల్లెటూరి కుర్రోడు బతుకు తెరువు కోసం పట్టణానికి వెళ్లాడు.. ఓ కంపెనీలో చేరి చీకూ చింతా లేకుండా కాలం గడిపేస్తున్నాడు.. ఆర్థికంగా అంతా బాగుంది. కానీ ఏదో వెలితి.. జీవితం యాంత్రికంగా సాగుతున్నట్టు ఫీలింగ్. పుట్టినూరులోనే వ్యవసాయం చేసి ఏదో సాధించాలి. ఎవరూ చేయని విధంగా సొంతంగా సాగు చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి.. ఇదే ఆలోచన ఆ యువకుడిని తాను పనిచేస్తున్న కంపెనీకి రాజీనామా ఇచ్చేలా చేసింది. రైతు బిడ్డగా కొత్త జీవితం ప్రారంభించాలనే తపన ఎన్నో ప్రయోగాలకు ఉసిగొల్పింది. రైతుగా ఆరేళ్ల ప్రయాణం కోటీశ్వరుడిని చేయకపోయినా మానసిక సంతృప్తినిచ్చిందంటాడా యువ కర్షకుడు. సాక్షి, విశాఖపట్నం(కోటవురట్ల): తంగేడు గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన ఒబ్బులరెడ్డి సతీష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం విశాఖలో ఓ కార్ల షోరూమ్‌లో చేరాడు. రెండేళ్లు పనిచేశాక సంతృప్తి కలగకపోవడంతో రైతు బిడ్డగానే ప్రయాణం కొనసాగించాలన్న ఆలోచనతో తిరిగి సొంతూరు చేరుకున్నాడు. తనకున్న రెండెకరాల పొలంలో వరిలో కొత్త వంగడాలను సాగు చేయడం ప్రారంభించాడు. ఇందుకు అనకాపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల సహకారం లభించింది. దాంతో జిల్లాలో ఎక్కడా లేని వరి రకాలు పండించాలనే తపన కొత్త ప్రయోగాలకు దారితీసింది. సాగులో భారీ లాభాలు రాకపోయినా వచ్చిన ఫలసాయాన్ని చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతుందంటాడు సతీష్. సుగర్ పేషెంట్లు, బాలింతలకు ఉపయోగపడే నవారా వరి పంట ప్రయోగాలకు తన సొంత భూమి సరిపోకపోవడంతో లీజుకు 4 ఎకరాలు తీసుకున్నాడు. అందులో చిరుధాన్యాలు, కొత్త రకాలు పండిస్తూ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఎరువులు వేయకుండా కేవలం సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తూ వచ్చిన పంటను కొంత భాగం పెట్టుబడి కోసం అమ్ముకుని.. మరికొంత భాగాన్ని మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులకు ఉచితంగా ఇస్తాడు. ‘ఇవి వాడి చూడండి.. ఆరోగ్యం బాగుంటుందం’టూ వారిని ప్రోత్సహిస్తాడు. ఈ ఏడాది నవారా, బర్మా బ్లాక్ రైస్, మైసూరు మల్లిక, సిద్ధ సన్నాలు, ఆర్ఎన్నార్ 15048 రకాలను రెండున్నర ఎకరాల పరిధిలో సాగు చేశాడు. వీటన్నిటినీ కేవలం ఎద పద్ధతిలోనే సాగు చేసినట్టు సతీష్ తెలిపాడు. ఇలా సాగు చేయడం వల్ల తక్కువ ఖర్చుతోనే ఫలసాయం వచ్చినట్టు సతీష్ తెలిపాడు. నవారా బియ్యంతో చక్కని ఆరోగ్యం నవారా రకం.. 120 రోజుల్లో ఫలసాయం వస్తుంది. దీనికి ఎకరాకు రూ.9 వేలు పెట్టుబడి కాగా ఈ బియ్యం సుగర్ పేషెంట్లు, బాలింతలకు మంచిదని సతీష్ తెలిపాడు. బ్లాక్ రైస్, మైసూరు మల్లిక, సిద్ధ సన్నాలు రకాలు 150 రోజులకు, ఆర్ఎన్నార్ 15048 రకం 120 రోజుల్లోనే ఫలసాయం వస్తుందని తెలిపాడు. తనకు వ్యవసాయంలో చోడవరానికి చెందిన పూసర్ల రామారావు అనే రైతు ఆదర్శమని, కొత్త వంగడాలు, తనకు ఆసక్తి కలిగిన రకాలు ఆయన దగ్గర నుంచే తీసుకొచ్చి సాగు చేస్తున్నట్టు తెలిపాడు. ఇక అనకాపల్లిలో ఉన్న డాట్ సెంటర్ నుంచి వ్యవసాయ శాస్త్రవేత్త ప్రదీప్ సలహాలు, సూచనలు ఇస్తుంటారని యువ రైతు సతీష్ తెలిపాడు. మానసిక సంతృప్తినిస్తోంది.. ఓ కారుల షోరూమ్‌లో మంచి ఉద్యోగమే చేసేవాడిని. కానీ సంతృప్తి లేక మానేసి సొంతూరికి వచ్చేసి వ్యవసాయం చేస్తున్నాను. ఆరేళ్లుగా వ్యవసాయంలో ఉన్నా. ఇది నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. మా గురువు పూసర్ల రామారావు, అనకాపల్లి డాట్ సెంటర్ నుంచి శాస్త్రవేత్త ప్రదీప్ సలహాలు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. చాలా మంది రైతులు నా దగ్గరకొచ్చి బర్మా బ్లాక్, నవారా రకాలు కొని పట్టుకెళుతుంటారు. విత్తనాలకు మాత్రమే ఇస్తా. మిగతా వాటిని నా సరదా కొద్దీ పంచుతా. – ఒబ్బులరెడ్డి సతీష్, రైతు, తంగేడు -
పోషకాలు మెండుగా ఉండే బ్లాక్ రైస్.. కిలో ధరెంతో తెలుసా..
నల్ల బియ్యం.. ప్రస్తుతం ప్రజల నోళ్లలో నానుతున్న పదం. పోషకాలు అధికంగా ఉన్న ఈ బియ్యాన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలో దీని సాగు మొదలైంది. ప్రస్తుతం నంద్యాల డివిజన్ పరిధిలో 75 ఎకరాల్లో పండిస్తున్నారు. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వస్తుండడంతో రైతులు ఈ పంట సాగు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సాక్షి, నంద్యాల: సహజంగా తెల్లగా ఉండే బియ్యం రకాలను చూసి ఉంటాం. కాని బ్లాక్ రైస్ మాత్రం నల్లగా ఉంటాయి. పూర్వ కాలంలో వీటిని కేవలం చక్రవర్తులు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే తినడానికి కేటాయించేవారని ప్రతీతి. దీంతో వీటికి చక్రవర్తుల బియ్యం అని పేరు వచ్చింది. సాధారణ వరి కంటే బ్లాక్ రైస్ దిగుబడి తక్కువగా ఉంటుంది. అయితే ధర మాత్రం ఎక్కువగానే ఉంది. సాధారణ రకం ధాన్యం ఎకరాకు 25–30 (75 కిలోల) బస్తాల దిగుబడి వస్తే బ్లాక్ రైస్ 10–15 బస్తాలు మాత్రమే వస్తుంది. సాధారణ రకం బియ్యం కిలో రూ.45–50 ఉంటే... బ్లాక్ రైస్ కిలో రూ.170 నుంచి రూ.180కి విక్రయిస్తున్నారు. పురుగు మందులు అవసరం లేదు.. బ్లాక్ రైస్ సాగుకు పెట్టుబడి తక్కువ అవుతుంది. సాధారణ రకం వరి సాగుకు ఎకరాకు రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి అవుతుండగా బ్లాక్ రైస్‌కు రూ.20 వేలు సరిపోతుంది. మామూలు వరికి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు తప్పని సరి. బ్లాక్‌రైస్‌కు గో ఆధారిత జీవామృతం, గోమూత్రం, ఆవుపేడ, సేంద్రియ ఎరువును వినియోగిస్తారు. ఫలితంగా తెగుళ్ల బెడద ఉండదు. పురుగుల ముందును పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. సాధారణ వరి 120 నుంచి 130 రోజుల్లో చేతికి వస్తే బ్లాక్ రైస్ 140 నుంచి 150 రోజుల సమయం పడుతుంది. చదవండి: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి సీఎం జగన్ లేఖ ప్రయోజనాలివీ.. ► ఈ బియ్యంలో యాంటి ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడుతాయి ► కేరళ రాష్ట్రంలో వీటిని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు ► ఈ బియ్యం మధుమేహం, క్యాన్సర్, గుండెజబ్బులను నియంత్రిస్తాయి ► శరీరంలోని అవనసర కొవ్వును కరిగిస్తాయి ► కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింకు వంటి ఖనిజ విలువలు అధికంగా ఉంటాయి ► ఫైబర్ కూడా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది ► అధిక రక్తపోటు సమస్య నుంచి తప్పించుకోవచ్చు ► నల్లబియ్యంలో యాంథో సైనిన్లూ అధికంగా ఉండి కంటి వ్యాధులను నయం చేస్తాయి ప్రతి 100 గ్రాముల బియ్యంలో.. బియ్యం రకం ప్రొటీన్లు ఐరన్ ఫైబర్ పాలిష్డ్ బియ్యం 6.8గ్రా 1.2గ్రా 0.6గ్రా బ్రౌన్బియ్యం 7.9గ్రా 2.2గ్రా 2.8గ్రా నల్ల బియ్యం 8.5గ్రా 3.5గ్రా 4.9గ్రా రైతులకు విత్తనాన్ని అందిస్తా నేను కొన్నేళ్లుగా 65 ఎకరాలకుపైగా వరి సాగు చేస్తున్నా. ఈ ఏడాది రెండు ఎకరాల్లో బ్లాక్ రైస్ వేశా. ఈ బియ్యంలో పోషకాలు అధికంగా ఉంటాయి. మా కుటుంబ సభ్యుల కోసం దీనిని సాగు చేస్తున్నా. వ్యవసాయాధికారుల సలహాలు పాటిస్తున్నాం. ఆసక్తి ఉన్న రైతులకు వచ్చే ఖరీఫ్‌లో విత్తనాన్ని అందిస్తా. – అనంతయ్య, రైతు, నారాయణపురం, బండిఆత్మకూరు మండలం తెగుళ్లు ఉండవు ఈ ఏడాది కొత్తగా బ్లాక్‌రైస్ సాగు చేస్తున్నా. ఈ పంటకు పురుగు మందులు వాడటం లేదు. గోమూత్రం, ఆవుపేడ, ద్విదళ గింజలతో తయారు చేసిన ఎరువును వినియోగిస్తున్నా. ఈ పంటకు తెగుళ్ల ఉండవు. పెట్టుబడి తక్కువ అని వ్యవసాయాధికారులు చెప్పారు. – నాగరాజు, రైతు, పాణ్యం సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం బ్లాక్ రైస్ సాగును ప్రభుత్వం ప్రోత్సాహిస్తోంది. మార్కెటింగ్‌కు అవసరమైన సదుపాయాలను కలి్పస్తోంది. రెండేళ్లగా ఈ పంటను నంద్యాలలో రైతులు సాగు చేస్తున్నారు. క్రిమిసంహారక మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్నారు. ఈ బియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచివి. – రాజశేఖర్, ఏడీఏ, నంద్యాల -
ఈ బియ్యం.. చక్రవర్తుల బియ్యం
వేడి వేడి అన్నం ఓ గరిటె ఎక్కువ వేసుకుందామంటే భయం. నెయ్యి, పచ్చడి, పప్పు సాహచర్యంతో మూడు పూటలా తినాలని ఉన్నా సుగర్ వస్తుందేమోనని దడ. చపాతీకి వెళ్దామంటే జిహ్వ ఊరుకోదాయె. దీనికో మార్గం వెతకాలి. అన్నం మెతుకును వదలని ఉపాయం అన్వేషించాలి. అందుకో దారుంది. ధవళ వర్ణంలో మెరిసిపోయే అన్నం కంచంలో చూడడం కామన్. కానీ అదే కంచంలో నల్లటి మెతుకులకు స్థానం కల్పిస్తే అదీ తెలివి. సాగులో ‘కాలా’నుగుణంగా వచ్చిన మార్పు ఇది. కాలాబాత్ అని పిలిచే నల్ల బియ్యం సాగు జిల్లాలోనూ అక్కడక్కడా కనిపిస్తోంది. వజ్రపుకొత్తూరు/పాలకొండ రూరల్ : పోషకాల గనిగా భావించే నల్లబియ్యం సాగుకు జిల్లాలో కొందరు ఔత్సాహికులు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు సాగును ప్రోత్సహించేలా విత్తనాల్ని అందిస్తున్నారు. ఈ పంటపై ఎందుకంత మక్కువ..? అని ప్రశ్నిస్తే ఇవి చక్రవర్తుల బియ్యం అని గర్వంగా సమాధానమిస్తున్నారు. ఆరోగ్యకరమైన సమాజానికి ఇలాంటి ఆహారం చాలా అవసరమనే ఉద్దేశంతోనే పండిస్తున్నామంటున్నారు. జిల్లాలో ఏయే ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు.. రకాలేమిటి.. ఔషధ విలువలు.. దిగుబడి సంగతులేమిటో నిపుణులు, రైతుల మాటల్లో తెలుసుకుందామా..! ఎందుకు తినాలి.. టైప్–2 మధుమేహం బారిన పడకుండా రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది. మధుమేహం, గుండె సంబంధిత, క్యాన్సర్, స్థూలకాయం వంటి రోగాలను నియంత్రించవచ్చు. ఇన్ఫెక్షన్లు రాకుండా నిరోధిస్తాయి. మూత్ర పిండాలు, కాలేయం, జీర్ణాశయం బాగా పనిచేసేలా సహకరిస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. శరీరంలో విషతుల్యమైన పదార్థాలతో శక్తివంతంగా పోరాడుతాయి. చదువు..కొలువు..సాగు.. వజ్రపు కొత్తూరు మండలం పూండి–గోవిందపురం గ్రామానికి చెందిన కర్ని సందీప్‌కు వ్యవసాయమంటే మక్కువ. ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్, ఉత్తరప్రదేశ్‌లోని ఓ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ప్రస్తుతం గ్రామ సచివాలయంలో వ్యవసాయ శాఖ సహాయకునిగా పనిచేస్తున్నారు. నల్లబియ్యం విషయం తెలుసుకున్న సందీప్ హైదరాబాద్‌లోని తన మిత్రుని వద్ద నుంచి కాలాబాత్ రకం విత్తనాలు తెచ్చి తన ఎకరా పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నారు. రూ.5 వేల పెట్టుబడితో ఎకరాకు 28 బస్తాలు దిగుబడి వస్తుండటంతో ఈ రకం సాగుకు ప్రచారం కల్పిస్తున్నారు. రైతులకు విత్తనాలు అందిస్తున్నారు. పోషకాల కోసమే పండిస్తున్నా.. పాలకొండ మండలం ఓని గ్రామానికి చెందిన కనపాక అదీప్ కుమార్ బ్లాక్‌రైస్‌లో ఉండే ఔషధ విలువల గురించి తెలుసుకున్నారు. తన పొలంలో రెండెకరాల్లో సాగు చేస్తున్నారు. విత్తనాల్ని బూర్జ మండల వ్యవసాయ అధికారుల ద్వారా ఔత్సాహికులకు అందిస్తున్నారు. సేంద్రియ విధానంలో పండించడం వల్ల అధిక దిగుబడులు సాధ్యమని చెబుతున్నారు. ఔత్సాహిక రైతులకు ప్రోత్సాహం... పాలకొండ మండలం, రుద్రిపేటకు చెందిన కండాపు ప్రసాదరావు అభ్యుదయ రైతు. ఔషధ గుణాలు కలిగిన నల్లబియ్యం సాగుకు చేయూత నందిస్తున్నారు. ఏటా కొత్తూరు, కొండాపురం, గుడివాడ, పారాపురం, విజయనగరం, విశాఖ తదితర ప్రాంతాల్లో వంద ఎకరాల్లో సాగుకు సరిపడా విత్తనాలు అందిస్తున్నారు. ఇప్పుడున్న జీవనశైలికి అద్భుతమైన ఆహారమని చెబుతున్నారు. -
బ్లాక్ రైస్‌పై క్రేజ్.. ప్రయోజనాలు మెండు
సాక్షి, అమరావతి బ్యూరో: నల్ల బియ్యం.. కొన్నాళ్లుగా జనం నోళ్లలో నానుతున్న పదం! రెండేళ్ల నుంచి కృష్ణా జిల్లాలోనూ ఈ బ్లాక్ రైస్ సాగు మొదలైంది. కేవలం అర ఎకరంతో మొదలైన ఈ పంట ఇప్పుడు 20 ఎకరాలకు పైగా చేరుకుంది. వచ్చే సీజనుకు 30 ఎకరాలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రకృతి సేద్యం ద్వారా ఈ బ్లాక్ రైస్‌ను పండిస్తున్నారు. జిల్లాలో గూడూరు మండలం పీజీలంక, తుమ్మలపాలెం, బంటుమిల్లి మండలం తుమ్మిడి, ఆగిరిపల్లి మండలం వడ్లమాను, కలిదిండి మండలం కోరుకొల్లు తదితర ప్రాంతాల్లో బ్లాక్ రైస్‌ను సాగు చేస్తున్నారు. వీటిలో కర్పుకవని, బర్మా బ్లాక్, కాలాభట్ రకాలను పండిస్తున్నారు. దిగుబడి తక్కువ.. ధర ఎక్కువ ధాన్యంలో ఇతర రకాలకంటే బ్లాక్ రైస్ దిగుబడి తక్కువగా ఉంటుంది. అయితే ధర మాత్రం ఎక్కువగానే ఉంటుంది. సాధారణ రకం ధాన్యం ఎకరానికి 25–30 (75 కిలోలు) బస్తాల దిగుబడి వస్తే బ్లాక్ రైస్ 10–15 మాత్రమే వస్తుంది. సాధారణ రకం ధాన్యం కిలో రూ.18 ఉంటే బ్లాక్ రైస్ రకం ధాన్యం రూ.100 వరకు ఉంది. వీటిని పండించిన రైతులు నల్ల బియ్యం కిలో రూ.170–180కి విక్రయిస్తుండగా మార్కెట్లో రూ.300–350 వరకు ధర పలుకుతోంది. అయితే బ్లాక్ రైస్ పొడవుగా ఎదగడం వల్ల గాలులకు నేల పడిపోతుంది. దీని సాగుకు రైతులు ఒకింత వెనకడుగు వేయడానికి ఇదో కారణమవుతోంది. పెట్టుబడీ తక్కువే.. మరోవైపు బ్లాక్ రైస్‌కు పెట్టుబడి కూడా తక్కువే అవుతుంది. సాధారణ రకం వరికి ఎకరానికి రూ.28–30 వేల వరకు పెట్టుబడి అవసరం కాగా బ్లాక్ రైస్‌కు రూ.20 వేలు సరిపోతుంది. మామూలు వరికి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు తప్పనిసరి. కానీ బ్లాక్ రైస్‌కు గోఆధారిత జీవామృతం, గోమూత్రం, ఆవుపేడ, ద్విదళ గింజలతో తయారు చేసిన ఎరువును వినియోగిస్తారు. అందువల్ల తెగుళ్లకు ఆస్కారం ఉండదు. పురుగుమందులను పిచికారీ చేయాల్సిన అవసరం రాదు. కోస్తా జిల్లాల్లో ఖరీఫ్ సీజన్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది. చౌడు నేలలు తప్ప మాగాణి నేలల్లో ఈ పంటకు వీలవుతుంది. సాధారణ వరి 120–130 రోజుల్లో పంట చేతికి వస్తే బ్లాక్ రైస్‌కు 140–150 సమయం పడుతుంది. నల్ల బియ్యంతో ప్రయోజనాలివీ.. ► ఈ బియ్యంలో ఉండే ఆంకోసైనిన్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి రోగ నిరోధక ఎంజైములను క్రియాశీలకం చేస్తుంది. ► మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులను నియంత్రిస్తుంది. ► శరీరంలో అనవసర కొవ్వును కరిగిస్తుంది. ► విటమిన్–బి, ఇ, నియాసిన్, కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజ విలువలు అధికంగా ఉంటాయి. ► ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కణాలను శుభ్రపరుస్తుంది. చదవండి: రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. -
బ్లాక్ రైస్‌కు అరుదైన గుర్తింపు
ఇంఫాల్ : 'చాఖావో'గా ప్రసిద్ధి గాంచిన మణిపూర్ బ్లాక్ రైస్‌కు అరుదైన గుర్తింపు లభించింది. మణిపూర్ బ్లాక్‌రైస్ భౌగోళిక సూచిక(జిఐ) ట్యాగ్ పొందినట్లు శుక్రవారం అధికారిక వర్గాలు ప్రకటించాయి. భౌగోళిక సూచిక తమ అధికారిక వెబ్సైట్లో మణిపూర్ బ్లాక్ రైస్ పేరిట నమోదు చేసిన నివేదికను అధికారులు ధృవీకరించారు. మణిపూర్ బ్లాక్ రైస్‌కు జిఐ ట్యాగ్ ఇవ్వాలంటూ మణిపూర్ లోని చాఖావో (బ్లాక్ రైస్) కన్సార్టియం ప్రొడ్యూసర్స్ ఏడాది కిందట దరఖాస్తు చేసింది. దీనికి వ్యవసాయ శాఖ, మణిపూర్ ప్రభుత్వంతో పాటు నార్త్ ఈస్టర్న్ రీజినల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ బృంద సభ్యుల డాక్యుమెంటేషన్‌తో సహా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఏడాదికి పైగా సమయం పట్టిందని అధికారులు వివరించారు. ఒక నిర్ధిష్ట ప్రాంతం నాణ్యత కలిగిన ఉత్పత్తి చేస్తున్న వస్తువును గుర్తించి భౌగోళిక సూచిక(జిఐ ట్యాగ్) ఇవ్వడం జరుగుతుంది. అంతేగాక వాణిజ్యంలో ప్రధానపాత్ర పోషించడానికి జిఐ ట్యాగ్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనితో పాటు సంప్రదాయంగా ఆచరిస్తున్న నైపుణ్యాలను కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇదే విషయమై ప్రాజెక్ట్ కో- ఆర్డినేటర్, మణిపూర్ అగ్రి బిజినెస్ కన్సార్టియమ్ అధికారి ఎమ్ఎస్ ఖైదెం మాట్లాడుతూ.. మణిపూర్ బ్లాక్‌రైస్ జిఐ ట్యాగ్‌ను పొందడం అరుదైన విషయమన్నారు. ఇప్పుడు బ్లాక్‌రైస్ విత్తనాలను ప్రపంచంలో ఎక్కడైనా అమ్మే శక్తి తమకు ఉందన్నారు. వాణిజ్య పరంగా మంచి అవకాశాలు ఉండే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తాము అధిక ప్రోటీన్ కంటెంట్ స్థానిక బఠానీ రకం 'హవాయి-తారక్ మఖ్యాత్ముబి' కి జిఐ ట్యాగ్ లభించే విధంగా ప్రక్రియను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఖైదెం పేర్కొన్నారు. శతాబ్దాలుగా మణిపూర్‌లో సాగులో ఉన్న చాఖవో అనే సువాసన గల గ్లూటినస్ వరి మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే విందులో వండుతారు. దీనిని 'చాఖావో ఖీర్' గా కూడా పిలుస్తుంటారు. అక్కడి వైద్య నిపుణులు చాఖావోను సంప్రదాయ వైద్యంలో విరివిగా వాడుతుంటారు. మణిపూర్ బ్లాక్‌రైస్ కిలో రూ.100 నుంచి 120 మధ్య ఇంఫాల్ స్థానిక మార్కెట్లో లభిస్తుంది. -
కెరీర్ ఉడికింది
‘‘కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బియ్యం లేని భోజనమే లేదు. అందుకే బియ్యం వ్యాపారాన్ని మొదలు పెట్టాను. పిడికెడు బియ్యం మనిషి మనుగడకు భరోసా.ఆ బియ్యమే నా బిజినెస్ కెరీర్‌కు పూజాక్షతలు’’ అంటోంది మణిపురి యువతి ముదిత. నిజమే! ముదిత అన్నట్లు కశ్మీరీ పులావ్, బిర్యానీలతో ఉత్తరాది విందులో అగ్రస్థానం బియ్యానిదే. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఇడ్లీ, దోసెల రూపంలో తెల్లవారేదే బియ్యంతో. అయితే ఇప్పుడు టెక్ ఇండియా బియ్యానికి దూరంగా జరిగిపోతోంది. ‘మనదేశాన్ని డయాబెటిక్ హబ్‌గా మారుస్తున్నది బియ్యమే..’ అని అంటున్న ఈ రోజుల్లో ఈ అమ్మాయికి బియ్యంతో తన కెరీర్‌ను ఉడికించుకోవచ్చన్న ధైర్యం ఎలా వచ్చింది! ‘‘మా ముత్తవ్వను వందేళ్లు ఆరోగ్యంగా బతికించిన బియ్యం ఇవి. చైనాలో రాజకుటుంబం కోసం గోదాముల్లో ప్రత్యేకంగా దాచిన బియ్యం ఇవి. ఇటలీలో రెస్టారెంట్లు వండేది ఈ బియ్యాన్నే’’ అంటోంది ముదిత. ఆర్థికమా? ఆహారమా? ముదిత ఢిల్లీలోని ‘జీసస్ అండ్ మేరీ కాలేజ్’లో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. లండన్‌లో 2011లో మాస్టర్స్ పూర్తి చేసే నాటికి ఆమె లక్ష్యం అర్థికరంగంలో నైపుణ్యం సాధించి గొప్ప ఆర్థికవేత్తగా ఎదగాలన్నది మాత్రమే. అందుకోసమే ఇంటర్నేషనల్ యూనివర్సిటీల్లో మరికొన్ని కోర్సులు కూడా చేసింది. ఇండియా వచ్చి పెద్ద కార్పొరేట్ కంపెనీలో డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్‌గా ఉద్యోగం కూడా సంపాదించింది. అయితే అప్పటివరకు తన చదువు, తన ఉద్యోగం అనుకుంటూ సాగిన ముదితలో తన చుట్టూ ఏం జరుగుతుందోననే గమనింపు మొదలైంది. దగ్గరి స్నేహితుల ఇళ్లలోనూ, తన బంధువుల్లో చాలా మంది డయాబెటిస్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు. అది కూడా నలభై ఐదేళ్లలోపే! ‘‘ఇవన్నీ లైఫ్‌స్టైల్ సమస్యలే. ముఖ్యంగా సరిగ్గా తినడం తెలియకపోతే వచ్చే ఇబ్బందులే. ఢిల్లీ ఇలాగుంది, కానీ మా సొంత రాష్ట్రం మణిపూర్ ఇలా లేదు. మా నానమ్మ, తాతయ్యలు బతికినంత కాలం అన్నమే తిన్నారు. పొట్టలను రసాయనాలతో నింపలేదు. మా ముత్తవ్వకి ఎటువంటి అనారోగ్యమూ లేకుండా ఏకంగా వందేళ్లు జీవించిన రికార్డ్ ఉండనే ఉంది. అంటే ఈశాన్య రాష్ట్రాల ఆహారంలోనే ఆరోగ్యం ఉందా? సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి మణిపూర్ రాష్ట్రంలో ఆరు నెలల పాటు ఉండిపోయాను. అక్కడి మార్కెట్లన్నీ తిరిగి చూశాను. రైతులతో మాట్లాడాను. అక్కడి ‘ఇమా ఖైతాల్’ (మదర్స్ మార్కెట్) లను ఇంకా నిశితంగా గమనించారు’’ అని చెప్పారు ముదిత. ఈ మదర్స్ మార్కెట్లను మొత్తం మహిళలే... ‘స్వయం సహాయక బృందాలు’గా ఏర్పడి నిర్వహిస్తారు. నానమ్మ తిన్న బియ్యం ఇటలీలో రెస్టారెంట్లన్నీ యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ బియ్యాన్నే వండుతాయి. ఈ బియ్యం మనదేశంలోకి ఇతర ఆసియాదేశాల నుంచి దిగుమతి అవుతుండేవి. ఆ బియ్యాన్ని చూసినప్పుడు మణిపూర్ రాష్ట్రంలోని మా సొంతూరు థౌంబాల్లో మా నానమ్మ తిన్న బియ్యం ఇలాగే ఉండేవి కదా అనుకున్నాను. ఈశాన్య రాష్ట్రాల్లో మనుషులు అంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం కూడా ఈ నల్లబియ్యమే. అందుకే దేశం ఆరోగ్యంగా ఉండాలన్నా, నా వ్యాపారం పరిపుష్టం కావాలన్నా ఈ నల్లబియ్యాన్ని అందరికీ పరిచయం చేయడమే మంచి మార్గం అనుకున్నాను.– ముదిత అకోయిజామ్ సింగ్, బ్లాక్ రైస్ వ్యాపారవేత్త ఆరోగ్య దేశం మణిపురి నుంచి వచ్చేశాక ఢిల్లీ కేంద్రంగా బియ్యం వ్యాపారాన్ని చేయాలనుకున్న ముదిత అందుకోసం మణిపూర్‌లో ఐదు వందల మంది రైతులను తనతో కలుపుకుంది. గత ఏడాది జనవరిలో ఆమె ఈ పని మొదలు పెట్టింది. ఈ ఏడాది కాలంలోనే ఢిల్లీలోని పెద్ద రెస్టారెంట్లు ముదిత సరఫరా చేస్తున్న నల్లబియ్యానికి బాగా అలవాటైపోయాయి! ముంబయికి కూడా విస్తరించింది. నల్లబియ్యంతోపాటు అస్సాంలో పండే హిమాలయన్ రెడ్ రైస్, నాగాలాండ్‌లో పండే వెదురుబియ్యాన్ని కూడా దేశవ్యాప్తంగా పరిచయం చేసింది ముదిత.ఆరోగ్యవంతమైన దేశం ఆరోగ్యవంతులతోనే సాధ్యం. రోగాల మీద జరిగే వ్యాపారం టర్నోవర్ వేల కోట్లయినా, లక్షల కోట్లయినా సరే అది దేశానికి ఆరోగ్యకరం కాదు.– మంజీర -
సన్న రకం బ్లాక్ రైస్ ఇదిగో..!
నాలుగేళ్లు శ్రమపడి అభివృద్ధి చేసిన రైతు శాస్త్రవేత్త మణిపూర్ బ్లాక్ రైస్‌తో బీపీటీని కలిపి రూపకల్పన ‘జీఎస్ఆర్ బ్లాక్ రైస్’గా నామకరణం పంట కాలం 120 రోజులు.. ఎకరాకు 25 బస్తాల దిగుబడి వచ్చే రబీ నాటికి రైతులకు అందుబాటులోకి విత్తనాలు ఆయనో రెండెకరాల మాగాణికి ఆసామి. వరి సాగులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆయనకూ నిత్యకృత్యమే. సమస్య లోతుపాతులు ఎరిగిన రైతుగా వాటి పరిష్కారానికి తనదైన పద్ధతిలో కృషిచేస్తూ సరికొత్త వరి వంగడాలను సృష్టిస్తూ రైతులు, శాస్త్రవేత్తల మన్ననలు పొందుతున్నారు గొర్ల సత్యన్నారాయణ రెడ్డి. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు ఆయన స్వగ్రామం. 1990 నుంచి వ్యవసాయం చేస్తూ పలు వరి వంగడాలను ఆయన రూపొందించారు. సరికొత్త వంగడాల రూపకల్పనకు, క్షేత్రస్థాయిలో వాటి పరిశీలనకు తన పొలాన్ని ప్రయోగశాలగా మార్చుకొన్నారాయన. ఈ కోవలో నాలుగేళ్ల పాటు శ్రమించి జీఎస్ఆర్ బ్లాక్ రైస్ అనే సరికొత్త వరి వంగడాన్ని ఆయన అభివృద్ధి చేశారు. బ్లాక్ రైస్‌లో ప్రత్యేకమైన ఔషధ గుణాలు, పలు పోషకాలున్నాయి. పలు రకాల వ్యాధులను నివారించగలిగే, నయం చేయగలిగే శక్తి బ్లాక్‌రైస్ సొంతమని చెబుతుంటారు. బ్లాక్ రైస్‌లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సాగులో ఉన్న బ్లాక్‌రైస్ రకాలన్నీ ముతక రకాలే. వీటి అన్నం లావుగా ఉండటం వల్ల వినియోగదారులు తినేందుకు అంతగా ఇష్టపడటం లేదు. ప్రధానంగా ఈ సమస్యను దృష్టిలో ఉంచుకున్న సత్యన్నారాయణ రెడ్డి సన్నగా, నాజూగ్గా ఉండే జీఎస్ఆర్ బ్లాక్ రైస్ వంగడాన్ని రూపొందించారు. బీపీటీ 5204 (సన్న రకం), మణిపూర్ బ్లాక్ రైస్ (దొడ్డు రకం) వంగడాలను సంకర పరిచి ఈ సన్న రకం బ్లాక్ రైస్ సూటి వంగడాన్ని ఆయన అభివృద్ధి చేశారు. సత్యన్నారాయణ రెడ్డి రూపొందించిన జీఎస్ఆర్ బ్లాక్‌రైస్ వంగడం సేంద్రియ పద్ధతుల్లో సాగుకు అనుకూలం. తక్కువ ఎత్తు పెరుగుతుంది. తీవ్ర గాలులను కూడా తట్టుకుంటుంది. సంప్రదాయ బ్లాక్ రైస్ వంగడాలలో ఎకరాకు 15 బస్తాల దిగుబడి మాత్రమే వస్తుంది. ఈ వంగడం ఎకరాకు 25 బస్తాల దిగుబడి వస్తుందని సత్యన్నారాయణ రెడ్డి చెపుతున్నారు. మణిపూర్ బ్లాక్ రైస్ ధాన్యం పొట్టు, బియ్యం రెండూ నల్లగా, కొంచెం లావుగా ఉంటాయి. జీఎస్ఆర్ బ్లాక్‌రైస్‌లో మాత్రం ధాన్యం పొట్టు తెల్లగా ఉంటుంది. బియ్యం సన్నగా, నల్లగా ఉంటాయి. ఈ పంట కాలపరిమితి 125 రోజులు. సంప్రదాయ బ్లాక్ రైస్‌లోని ఔషధ గుణాలు, పోషకాలు ఇందులోనూ ఉంటాయని ఆయన అంటున్నారు. ప్రభుత్వ రంగ వరి శాస్త్రవేత్తలు జీఎస్ఆర్ బ్లాక్ రైస్ వంగడంపై అధ్యయనం చేసి, ఔషధ విలువలు, పోషకాలు తదితర వివరాలను వెల్లడిస్తే బాగుంటుంది. – ఎం.డి. షైబుద్దీన్, సాక్షి, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా 2018 రబీకి రైతులకు ఈ విత్తనాన్ని అందిస్తా.. బ్లాక్ రైస్‌లో పలు పోషకాలుండటం వల్ల రైతులు తప్పని సరిగా తమ కుటుంబ ఆహారంలో భాగం చేసుకోవాలనేదే నా కోరిక. దీని కోసమే ఈ సన్నరకం బ్లాక్ రైస్ వంగడాన్ని అభివృద్ధి చేశాను. ప్రస్తుతం ఇది శాస్త్రవేత్తల పరిశీలనలో ఉంది. ఆసక్తి ఉన్న రైతులు వచ్చే ఖరీఫ్‌లో మా పొలానికి వచ్చి జీఎస్ఆర్ బ్లాక్‌రైస్ రకాన్ని పరిశీలించవచ్చు. 2018 రబీ నాటికల్లా ఈ సూటి రకాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తాను. – గొర్ల సత్యన్నారాయణ రెడ్డి (89199 32419),కందుకూరు, వేంసూరు మం., ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం -
సిరులు కురిపిస్తున్న నల్లబియ్యం
గువాహటి: బియ్యం ఏ రంగులో ఉంటాయి ? అదేం ప్రశ్న.. తెల్లగా ఉంటాయంటారా. అయితే మీ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. అస్సాంలోని గోల్పరా రాష్ట్రంలో రైతులు నలుపురంగు బియ్యాన్ని సాగు చేస్తూ అధిక దిగుబడి పొందుతున్నారు. సుమారు రెండు వందల మంది రైతులు ఈ పంటను పండిస్తున్నారు. అమ్గురిపరా గ్రామానికి చెందిన యువ రైతు ఉపేంద్ర కృషి ఫలితమే నల్లబియ్యం సాగు. స్థానిక కృషి విజ్ఞాన్ కేంద్ర (కేవీకే) సంస్థ సహకారంతో ఉపేంద్ర 2011లో నలుపు రంగు బియ్యం పంటని సాగు చేయడం ప్రారంభించాడు. ‘2011లో కేవీకే సంస్థకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఉత్తమ్ కుమార్ బారువా నాకు నలుపు రంగు బియ్యం విత్తనాలను అందించారు. నాకున్న కొంత స్థలంలో ఈ విత్తనాలను సాగు చేశాను. మంచి ఫలితం వచ్చింది’ అని ఈ రైతు అన్నారు. నల్లబియ్యం ఇక్కడి రైతుల జీవితాలను మార్చేసింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో బియ్యం రూ.100 పలుకుతోంది. బ్లాక్ రైస్‌లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్వీట్స్ తయారీల్లో కూడా నల్లబియ్యాన్ని ఉపయోగిస్తున్నారని ఉపేంద్ర వివరించారు. -
బ్లాక్ రైస్.. భలె.. భలే!
ఆహారమే తొలి ఔషధం అంటారు. పూర్వీకులు తమకు అవసరమైన పోషకాలు, ప్రత్యేక ఔషధ విలువలు కలిగిన ఆహార ధాన్యాల వంగడాలను సంప్రదాయ పద్ధతిలో సంకర పరిచి, తరతరాలుగా పరిరక్షించారు. ఆధునిక శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే వంగడాలను అందుబాటులోకి తేవడంతో.. ఔషధ విలువలతో కూడిన సంప్రదాయ వంగడాలు కనుమరుగయ్యాయి. అయితే, విశిష్ట ఔషధ విలువలతో కూడిన దేశీ వరి వంగడాలపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటి సాగు మళ్లీ విస్తృతమవుతోంది. అటువంటి అపురూపమైన వరి వంగడాల్లో ‘బ్లాక్ రైస్’ ఒకటి. కరువు పరిస్థితుల్లోనూ దిగుబడినివ్వడం దీని ప్రత్యేకత. బ్లాక్ రైస్ వంగడాల బియ్యం కారు నలుపులో లేదా ఊదా రంగులో ఉంటాయి. కేన్సర్‌ను నిరోధిస్తుందని దీనికి పేరు. రాజులకు ప్రియమైన ఆహారంగా దీనికి పేరు. విశ్యవ్యాప్తంగా చాలా దేశాల్లో బ్లాక్ రైస్ వంగడాలు కనిపిస్తాయి. చైనాకు చెందిన కేన్సర్ నిపుణుడు లి పుంగ్ లియో అతని బృందం జరిపిన పరిశోధనలో ముఖ్యంగా కేన్సర్ నిరోధక పదార్థాలు బ్లాక్ రైస్‌లో మెండుగా ఉన్నాయని తేలింది. మణిపూర్ సంప్రదాయ వైద్యంలో ఈ బియ్యాన్ని ఔషధంగా వాడతారు. సామూహిక ఉత్సవాల్లో బ్లాక్ రైస్‌తో వండిన ‘చాక్‌హావో’ అనే వంటకాన్ని వడ్డిస్తారు. బ్లాక్ రైస్‌లో అనేక పోషక విలువలతోపాటు విశిష్ట ఔషధ గుణాలు ఉన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. మామూలు బియ్యంతో పోలిస్తే బ్లాక్‌రైస్‌లో విటమిన్ బీ, నియాసిన్, విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్, పీచు పదార్థాలు వంటి పోషకాల మోతాదు అధికమని భారతీయ జీవ వనరులు, సుస్థిర సేద్యం అభివృద్ధి సంస్థ (ఐబీఎస్‌డీ) అధిపతి దీనబంధు సాహూ అంటున్నారు. మణిపూర్‌లో బ్లాక్ రైస్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ నడుం బిగించింది. బ్లాక్ రైస్ వంగడం కరవు పరిస్థితులను తట్టుకొని పెరుగుతుందని మణిపూర్‌కు చెందిన అభ్యుదయ రైతు పోత్సగంభం దేవకాంత అంటున్నారు. వందకు పైగా సంప్రదాయ వంగడాలను ఆయన సాగు చేస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో మణిపూర్, అసోం, బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో స్వల్ప విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ అక్కడక్కడా ప్రకృతి వ్యవసాయదారులు రెడ్ రైస్‌ను సాగు చేయనారంభించారు. సేంద్రియ బ్లాక్ రైస్‌కు విదేశాల్లో మంచి ధర (కిలో రూ. 300) లభిస్తుండటంతో అసోం ప్రభుత్వం సేంద్రియ బ్లాక్ రైస్ సాగును విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తోంది. గొల్పారా జిల్లా అముగురిపారాలో రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహాలతో బ్లాక్‌రైస్‌ను ఇప్పటికే సాగు చేస్తున్నారు. బ్లాక్‌రైస్ సాగును పెంచేందుకు బెంగాల్ వ్యవసాయ శాఖ కూడా సన్నద్ధమవుతోంది. బ్లాక్‌రైస్‌లో అధికంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, కేన్సర్‌పై చాలా సమర్థవంతంగా పోరాడతాయని ఫులియాకు చెందిన వ్యవసాయ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకుడు అనుపమ్ పాల్ చెప్పారు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ నాలుగు నెలల పంట రెండేళ్ల నుంచి బ్లాక్ రైస్‌ను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కొద్ది విస్తీర్ణంలో సాగు చేస్తున్నాను. ఎకరానికి 20 బస్తాల (75 కిలోలు) వరకు దిగుబడి వస్తోంది. పంటకాలం 4 నెలలు. నేను విన్నదాన్ని బట్టి.. రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేయడం, కేన్సర్‌ను నిరోధించడం ఈ బియ్యం ప్రత్యేకత. మణిపూర్ నుంచి ఈ ఏడాది 3 బ్లాక్ రైస్ వంగడాల విత్తనాలు తెప్పించాను. వీటిల్లో సుగంధాన్నిచ్చే బ్లాక్ రైస్ కూడా ఒకటి. రెడ్ రైస్ (నవర)ను కూడా ఎకరంలో సాగు చేస్తున్నాను. - రాంమోహన్‌రెడ్డి (98667 60498), పెనుబల్లి, బుచ్చిరెడ్డిపాలెం మం, నెల్లూరు జిల్లా