బ్లాక్ రైస్.. భలె.. భలే! | Black rice: Rare yet highly nutritious | Sakshi
Sakshi News home page

బ్లాక్ రైస్.. భలె.. భలే!

Published Tue, Feb 9 2016 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

బ్లాక్ రైస్.. భలె.. భలే!

బ్లాక్ రైస్.. భలె.. భలే!

ఆహారమే తొలి ఔషధం అంటారు. పూర్వీకులు తమకు అవసరమైన పోషకాలు, ప్రత్యేక ఔషధ విలువలు కలిగిన ఆహార ధాన్యాల వంగడాలను సంప్రదాయ పద్ధతిలో సంకర పరిచి, తరతరాలుగా పరిరక్షించారు. ఆధునిక శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే వంగడాలను అందుబాటులోకి తేవడంతో.. ఔషధ విలువలతో కూడిన సంప్రదాయ వంగడాలు కనుమరుగయ్యాయి. అయితే, విశిష్ట ఔషధ విలువలతో కూడిన దేశీ వరి వంగడాలపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటి సాగు మళ్లీ విస్తృతమవుతోంది. అటువంటి అపురూపమైన వరి వంగడాల్లో ‘బ్లాక్ రైస్’ ఒకటి. కరువు పరిస్థితుల్లోనూ దిగుబడినివ్వడం దీని ప్రత్యేకత.
 
బ్లాక్ రైస్ వంగడాల బియ్యం కారు నలుపులో లేదా ఊదా రంగులో ఉంటాయి. కేన్సర్‌ను నిరోధిస్తుందని దీనికి పేరు. రాజులకు ప్రియమైన ఆహారంగా దీనికి పేరు. విశ్యవ్యాప్తంగా చాలా దేశాల్లో బ్లాక్ రైస్ వంగడాలు కనిపిస్తాయి. చైనాకు చెందిన కేన్సర్ నిపుణుడు లి పుంగ్ లియో అతని బృందం జరిపిన పరిశోధనలో ముఖ్యంగా కేన్సర్ నిరోధక పదార్థాలు బ్లాక్ రైస్‌లో మెండుగా ఉన్నాయని తేలింది.

మణిపూర్ సంప్రదాయ వైద్యంలో ఈ బియ్యాన్ని ఔషధంగా వాడతారు. సామూహిక ఉత్సవాల్లో బ్లాక్ రైస్‌తో వండిన ‘చాక్‌హావో’ అనే వంటకాన్ని వడ్డిస్తారు. బ్లాక్ రైస్‌లో అనేక పోషక విలువలతోపాటు విశిష్ట ఔషధ గుణాలు ఉన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. మామూలు బియ్యంతో పోలిస్తే బ్లాక్‌రైస్‌లో విటమిన్ బీ, నియాసిన్, విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్, పీచు పదార్థాలు వంటి పోషకాల మోతాదు అధికమని భారతీయ జీవ వనరులు, సుస్థిర సేద్యం అభివృద్ధి సంస్థ (ఐబీఎస్‌డీ) అధిపతి దీనబంధు సాహూ అంటున్నారు.  
 
మణిపూర్‌లో బ్లాక్ రైస్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ నడుం బిగించింది. బ్లాక్ రైస్ వంగడం కరవు పరిస్థితులను తట్టుకొని పెరుగుతుందని మణిపూర్‌కు చెందిన అభ్యుదయ రైతు పోత్సగంభం దేవకాంత అంటున్నారు.

వందకు పైగా సంప్రదాయ వంగడాలను ఆయన సాగు చేస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో మణిపూర్, అసోం, బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో స్వల్ప విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ అక్కడక్కడా ప్రకృతి వ్యవసాయదారులు రెడ్ రైస్‌ను సాగు చేయనారంభించారు.
 
సేంద్రియ బ్లాక్ రైస్‌కు విదేశాల్లో మంచి ధర (కిలో రూ. 300) లభిస్తుండటంతో అసోం ప్రభుత్వం సేంద్రియ బ్లాక్ రైస్ సాగును విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తోంది. గొల్పారా జిల్లా అముగురిపారాలో రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహాలతో బ్లాక్‌రైస్‌ను ఇప్పటికే సాగు చేస్తున్నారు. బ్లాక్‌రైస్ సాగును పెంచేందుకు బెంగాల్ వ్యవసాయ శాఖ కూడా సన్నద్ధమవుతోంది. బ్లాక్‌రైస్‌లో అధికంగా ఉన్న  యాంటీ ఆక్సిడెంట్లు, కేన్సర్‌పై చాలా సమర్థవంతంగా పోరాడతాయని ఫులియాకు చెందిన వ్యవసాయ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకుడు అనుపమ్ పాల్ చెప్పారు.  
 - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్
 
నాలుగు నెలల పంట
రెండేళ్ల నుంచి బ్లాక్ రైస్‌ను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కొద్ది విస్తీర్ణంలో సాగు చేస్తున్నాను. ఎకరానికి 20 బస్తాల (75 కిలోలు) వరకు దిగుబడి వస్తోంది. పంటకాలం 4 నెలలు. నేను విన్నదాన్ని బట్టి.. రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేయడం, కేన్సర్‌ను నిరోధించడం ఈ బియ్యం ప్రత్యేకత. మణిపూర్ నుంచి ఈ ఏడాది 3 బ్లాక్ రైస్ వంగడాల విత్తనాలు తెప్పించాను. వీటిల్లో సుగంధాన్నిచ్చే బ్లాక్ రైస్ కూడా ఒకటి. రెడ్ రైస్ (నవర)ను కూడా ఎకరంలో సాగు చేస్తున్నాను.   
- రాంమోహన్‌రెడ్డి (98667 60498), పెనుబల్లి, బుచ్చిరెడ్డిపాలెం మం, నెల్లూరు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement