మఖానా... మా ఖానా! | Demand for makhana worldwide | Sakshi
Sakshi News home page

మఖానా... మా ఖానా!

Published Sun, Feb 23 2025 4:32 AM | Last Updated on Sun, Feb 23 2025 7:20 AM

Demand for makhana worldwide

ఈ సూపర్‌ ఫుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ 

మార్కెట్లో కేజీ ధర రూ.2,000 పైమాటే... 

అద్భుత ఆరోగ్య సుగుణాలతో పెరుగుతున్న ప్రాచుర్యం 

బడ్జెట్లో మఖానా బోర్డు ఏర్పాటు ప్రకటనతో మరింత దన్ను 

గతేడాది దేశంలో మొత్తం ఉత్పత్తి 1.2 లక్షల టన్నులు 

ఇందులో బిహార్‌ వాటానే 90,000 టన్నులు 

ప్రపంచ ఉత్పత్తిలో 90 శాతం మనదే...

పేరేమో బ్లాక్‌ డైమండ్స్‌.. లోపలున్నది వైట్‌ గోల్డ్‌! అవునండీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న సూపర్‌ ఫుడ్‌ ‘మఖానా’సంగతే ఇది. పుష్కలమైన పోషకాలతో ఆరోగ్య వరప్రదాయినిగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఫూల్‌ మఖానా క్రేజ్‌ కేక పుట్టిస్తోంది. బిహారీ రైతులకు కాసుల పంటగా మారింది. మఖానాకు తాజా కేంద్ర బడ్జెట్లో కూడా పెద్దపీట వేయడంతో దీని పేరు మరింత మార్మోగుతోంది. మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో మోదీ సర్కారు ప్రకటించింది. దీనివల్ల మార్కెటింగ్‌ సదుపాయాలు పెరగడంతో పాటు రైతులకు కూడా మరింత చేయూత లభించనుంది. 

సాక్షి, బిజినెస్‌ డెస్క్: రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ రారాజుగా నిలుస్తున్న మఖానా.. ప్రపంచ సూపర్‌ ఫుడ్స్‌ మార్కెట్‌ను షేక్‌ చేస్తోంది. ఫూల్‌ మఖానా, లోటస్‌ సీడ్స్, పఫ్డ్‌ వాటర్‌ లిల్లీ సీడ్స్, ఫాక్స్‌ నట్స్‌ వంటి పేర్లతో ప్రాచుర్యం పొందిన వీటిని అచ్చ తెలుగులో చెప్పాలంటే తామర గింజలు. సహజమైన, సమతుల్య ఆహారంతో శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఈ బ్లాక్‌ డైమండ్స్‌ వరంలా మారుతున్నాయి. ఇతర చిరుతిళ్లకు బదులు పోషకాల ఖజానా.. మఖానాను డైట్‌లో చేర్చుకుంటున్నారు. 

మిలీనియల్స్‌తో పాటు జెన్‌ జీ యువతరం కూడా ఇప్పుడు దీని వెంట పడుతున్నారు. విదేశాలకు ఎగుమతులు జోరందుకోవడంతో ‘వైట్‌ గోల్డ్‌’రేటు కూడా బంగారంలా దూసుకెళ్తోంది. మార్కెట్లో కేజీ ధర రూ.2,000 పైనే పలుకుతోంది. పెళ్లిళ్లతో పాటు ఏ పంక్షన్‌లో చూసినా మఖానా వంటకం ట్రెండింగ్‌ ఫుడ్‌గా నిలుస్తోంది! 

ఇక హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ఈ హెల్తీ స్నాక్‌ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. సోషల్‌ మీడియాలో ఫుడ్‌ వ్లాగింగ్‌ చానెల్స్‌ కూడా వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రచారం చేస్తుండటంతో మఖానాకు మాంచి డిమాండ్‌ నెలకొంది.  

బిహార్‌  హబ్‌..
ప్రపంచవ్యాప్తంగా మఖానా ఉత్పత్తిలో 90 శాతం వాటా భారత్‌దే. అందులో 85 శాతం ఒక్క బిహార్‌ నుంచే వస్తుండటం విశేషం! అంతర్జాతీయంగా ఈ సూపర్‌ ఫుడ్‌కు ఫుల్‌ డిమాండ్‌తో బిహార్‌ రైతులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మిథిలాంచల్‌ ప్రాంతం ఈ పంటకు ప్రధాన కేంద్రం. 

ఇక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో పాటు పుష్కలంగా చిత్తడి నేలలు (వెట్‌ ల్యాండ్స్‌) ఉండటం తామర పంట సాగుకు సానుకూలంగా నిలుస్తోంది. 200 ఏళ్లుగా ఇక్కడ మఖానా సాగు కొనసాగుతూనే ఉంది. మధుబనీ దీనికి పుట్టినిల్లుగా చెబుతారు. 2020లో బిహార్‌ మఖానాకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్‌) కూడా లభించడంతో ప్రపంచవ్యాప్తంగా మరింత ఖ్యాతి పొందింది.  

ఎందుకింత   రేటు? 
ఫూల్‌ మఖానా ఒక ప్రత్యేకమైన తామర పూల రకానికి చెందినది. సాధారణంగా ప్రిక్లీ వాటర్‌ లిల్లీగా పిలిచే దీని శాస్త్రీయ నామం యూరేల్‌ ఫెరాక్స్‌. ఇవి ఎక్కువగా ఆసియా ప్రాంతంలో చెరువుల్లో, చిత్తడి నేలల్లో పెరుగుతాయి. తామర పూల రెక్కలన్నీ రాలిపోయాక.. నల్లటి విత్తనాలు నీటి అడుగుకు (4–12 అడుగుల లోతు) చేరుకుంటాయి. రైతులు వీటిని వలలు, బుట్టలతో సేకరించాక, ఎండలో బాగా ఆరబెడతారు. 

తర్వాత ప్రత్యేకంగా వేయించి, జాగ్రత్తగా గింజల్ని పగలగొడితే తెల్లగా.. పఫీగా ఉండే ఫాక్స్‌ నట్స్‌ విక్రయానికి సిద్ధమవుతాయి. ఇదంతా ఎంతో శ్రమతో కూడిన ప్రక్రియ. ఇది కొన్ని ప్రాంతాల్లోనే, అది కూడా చాలా తక్కువ విస్తీర్ణంలో మాత్రమే ఈ పంట సాగవుతోంది. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతోంది. సరఫరా పరిమితంగా ఉండటం.. దేశ, విదేశాల్లో గిరాకీ భారీగా పెరిగిపోవడంతో రేటు అ‘ధర’హో అనిపిస్తోంది! 

మార్కెట్‌   రయ్‌... 
2023లో భారత్‌ మఖానా మార్కెట్‌ పరిమాణం రూ.780 కోట్లుగా నమోదైంది. 2032 నాటికి ఇది రూ.1,890 కోట్లకు వృద్ధి చెందుతుందని ఐమార్క్‌ గ్రూప్‌ అంచనా వేసింది. ఏటా ఈ మార్కెట్‌ 9.7 శాతం వృద్ధి చెందనుందని లెక్కగట్టింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి 25,130 టన్నుల మఖానా ఎగుమతులు జరిగాయి. భారత్‌ నుంచి ఫూల్‌ మఖానా ఎగుమతికి అతిపెద్ద మార్కెట్‌గా అమెరికా ఉంది. 

కెనడా, ఆ్రస్టేలియా, జపాన్, దక్షిణ కొరియా, యూరప్‌ దేశాల ప్రజలు కూడా మన మఖానాను లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే, 2024లో 15 కోట్ల డాలర్లుగా ఉన్న ఫూల్‌ మఖానా మార్కెట్‌.. 2031 నాటికి 8.5 శాతం వార్షిక వృద్ధితో 26.6 కోట్ల డాలర్లకు చేరవచ్చని కాగి్నటివ్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది.  

ఆరోగ్యమే ’మఖానా’భాగ్యం.. 
»  మఖానాలో ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కీలకమైన ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. తక్కువ క్యాలరీలు ఉండటం వల్లే ఇది గ్లోబల్‌ సూపర్‌ ఫుడ్‌గా పేరుగాంచింది. 
»      ప్రతి 100 గ్రాముల గింజల్లో 9.7 గ్రాముల ప్రొటీ­న్, 14 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ఇది శాఖాహారులకు అద్భుతమైన ప్రొటీన్‌ సోర్స్‌గా మారింది.  
»     25 గ్రాముల మఖానాలో 89 క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారు మఖానా మంత్రం జపిస్తున్నారు. 
»      గ్లూటెన్‌ అస్సలు లేకపోవడం, తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్, అధిక పీచు పదార్థం (ఫైబర్‌) ఉండటం వల్ల మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. 
»     ఇక అధిక మెగ్నీషియం, తక్కువ సోడియం కారణంగా రక్తపోటును నియంత్రించి, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement