Food grains
-
రూ.1.25 లక్షల కోట్లతో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం
న్యూఢిల్లీ: దేశంలో సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం అమలుకు రూ.1.25 లక్షల కోట్లకుపైగా నిధులు వెచి్చంచనున్నారు. అలాగే వచ్చే ఐదేళ్లలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించనున్నారు. ఇందులో భాగంగా 11 రాష్ట్రాల్లో 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీ) పరిధిలో నిర్మించిన 11 గోడౌన్లను మోదీ ప్రారంభించారు. రాబోయే ఐదేళ్లలో వేలాది గోదాములు నిర్మించబోతున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 500 పీఏసీల పరిధిలో గోదాముల నిర్మాణానికి, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. 18,000 పీఏసీలను కంప్యూటీకరించే ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలో ఆహార ధాన్యాల నిల్వకు సరైన సదుపాయాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ సమస్యను గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని తప్పుపట్టారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.1.25 లక్షల కోట్లలో వ్యయంతో రాబోయే ఐదేళ్లలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం సృష్టించే పథకానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. రైతులు తమ పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చని, వాటిపై రుణం పొందవచ్చని, మార్కెట్లో సరైన ధర లభించినప్పుడు పంటలు విక్రయించుకోవచ్చని తెలియజేశారు. కేబినెట్ భేటీకి యాక్షన్ ప్లాన్‌తో రండి కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన లోక్‌సభ ఎన్నికలు మరో 100 రోజులలోపే జరుగనున్న నేపథ్యంలో మార్చి 3వ తేదీన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ భేటీని ఆయన కీలకంగా భావిస్తున్నారు. స్పష్టమైన, ఆచరణ యోగ్యమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని కేబినెట్ సమావేశానికి హాజరు కావాలని మంత్రులకు ఆయన సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు శనివారం వెల్లడించాయి. కేబినెట్ భేటీలో మంత్రులంతా వారి యాక్షన్ ప్లాన్ సమరి్పంచాలని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు తెలియజేశాయి. -
MS Swaminathan: ఆకలి లేని సమాజమే ఆయన కల
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన(1947) తర్వాత దేశంలో వ్యవసాయ రంగం నిస్తేజంగా మారింది. బ్రిటిష్ వలస పాలనలో ఈ రంగంలో అభివృద్ధి నిలిచిపోయింది. వనరులు లేవు, ఆధునిక విధానాలు లేవు. తిండి గింజలకు కటకటలాడే పరిస్థితి. గోధుమలు, బియ్యం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప ప్రజలకు నాలుగు మెతుకులు అందించలేని దురవస్థ ఉండేది. ఇలాంటి తరుణంలో స్వామినాథన్ రంగ ప్రవేశం వేశారు. హరిత విప్లవానికి బీజం చేశారు. మొదట పంజాబ్, హరియాణా, పశి్చమ ఉత్తరప్రదేశ్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టారు. రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే వంగడాలు సరఫరా చేశారు. ప్రభుత్వ సాయంతో తగిన సాగు నీటి వసతులు కలి్పంచారు. ఎరువులు అందించారు. కొద్ది కాలంలోనే సత్ఫలితాలు రావడం మొదలైంది. 1947లో దేశంలో గోధుమల ఉత్పత్తి ఏటా 60 లక్షల టన్నులు ఉండేది. 1962 నాటికి అది కోటి టన్నులకు చేరింది. 1964 నుంచి 1968 దాకా వార్షిక గోధుమల ఉత్పత్తి కోటి టన్నుల నుంచి 1.70 కోట్ల టన్నులకు ఎగబాకింది. దాంతో దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. మనకు అవసరమైన ఆహారాన్ని మనమే పండించుకోగలమన్న నమ్మకం పెరిగింది. గోధుమల తర్వాత స్వామినాథన్ నూతన వరి వంగడాలపై తన పరిశోధనలను కేంద్రీకరించారు. అమెరికాతోపాటు ఐరోపా దేశాల్లో విద్యాసంస్థలతో కలిసి పనిచేశారు. 1954లో కటక్‌లోని సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. నూతన వరి వంగడాలను సృష్టించారు. దేశీయ రకాలను సంకరీకరించి, కొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. స్వామినాథన్ పలువురు మాజీ ప్రధానమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. హరిత విప్లవాన్ని విజయంతం చేయడానికి శ్రమించారు. గోధుమ వంగడాల అభివృద్ధి కోసం ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్తోనూ స్వామినాథన్ కలిసి పనిచేశారు. సుస్థిర ఆహార భద్రత విషయంలో ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందారు. సివిల్ సరీ్వసు వదులుకొని వ్యవసాయం వైపు.. మాన్‌కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జని్మంచారు. ఆయన తండ్రి డాక్టర్ ఎం.కె.సాంబశివన్ వైద్యుడు. తల్లి పార్వతీ తంగమ్మల్ గృహిణి. 11వ ఏట తండ్రిని కోల్పోయారు. తన మామయ్య సంరక్షణలో పెరిగిన స్వామినాథన్ కుంభకోణంలో మెట్రిక్యులేషన్, త్రివేండ్రంలో జంతుశాస్త్రంలో డిగ్రీ చేశారు. తర్వాత కోయంబత్తూరు అగ్రికల్చరల్ కాలేజీ నుంచి అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ సాధించారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీజీ పూర్తి చేశారు. యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరి, బంగాళదుంప జన్యు పరిణామంపై అధ్యయనం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యు శాస్త్రవేత్తగా ఎదిగి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరారు. స్వామినాథన్ తొలుత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కానీ, తండ్రి బాటలో వైద్య వృత్తిలో అడుగుపెట్టాలని భావించారు. అయితే, అప్పట్లో ఆకలి చావులను చలించిపోయారు. వ్యవసాయ పరిశోధనా రంగంలో అడుగుపెట్టారు. ఆకలి లేని సమాజాన్ని కలగన్నారు. ప్రజల ఆకలి తీర్చడమే కాదు, పౌష్టికాహారం అందించాలని సంకలి్పంచారు. కరువు పరిస్థితులు చూసి.. వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడానికి కారణాలను స్వామినాథన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘1942–43లో బెంగాల్లో భయంకరమైన కరువు సంభవించింది. తిండి లేక దాదాపు 30 లక్షల మంది చనిపోయారు. దేశం కోసం నేనేమీ చేయలేనా? అని ఆలోచించా. ప్రజల ఆకలి బాధలు తీర్చాలంటే వ్యవసాయ రంగమే సరైందని నిర్ణయానికొచ్చా. మెడికల్ కాలేజీకి వెళ్లడానికి బదులు కోయంబత్తూరులో వ్యవసాయ కళాశాలలకు చేరిపోయా. వ్యవసాయ పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టా. ఎక్కువ మందికి ఆహారం అందించాలంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలు కావాలి. అందుకే జెనెటిక్స్, బ్రీడింగ్‌పై పరిశోధనలు చేశా. కరువు పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించా. వీటితో రైతులు లాభం పొందారు. ప్రజలకు తగినంత ఆహారం దొరికింది’ అని స్వామినాథన్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధరపై కీలక సిఫార్సు స్వామినాథన్ 2004 నుంచి 2006 దాకా ‘నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్’ అధినేతగా వ్యవహరించారు. పంటలకు కనీస మద్దతు ధరపై ప్రభుత్వానికి విలువైన ప్రతిపాదనలు చేశారు. పంటల ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతాన్ని కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని సూచించారు. ఎన్నో పదవులు కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. ► 1981 నుంచి 1985 దాకా ఫుడ్ అండ్ అగ్రిక ల్చరల్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ స్వతంత్ర చైర్మన్ ► 1984 నుంచి 1990 దాకా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అధ్యక్షుడు ► 1982 నుంచి 1988 దాకా ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ► 1989 నుంచి 1996 దాకా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(ఇండియా) అధ్యక్షుడు ► ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ వరించిన అవార్డులు ► 1967లో పద్మశ్రీ ► 1971లో రామన్ మెగసెసే ► 1972లో పద్మభూషణ్ ► 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ► 1989లో పద్మవిభూషణ్ ► ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్లు నేల సారాన్ని కాపాడుకోకపోతే ఎడారే హరిత విప్లవం వల్ల లాభాలే కాదు, నష్టాలూ ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. నూతన వంగడాలతో సంపన్న రైతులకే లబ్ధి చేకూరుతోందన్న వాదనలు వినిపించాయి. వీటితో నేల సారం దెబ్బతింటోందని, సంప్రదాయ దేశీయ వంగడాలు కనుమరుగైపోతున్నాయని నిపుణులు హెచ్చరించారు. పురుగు మందులు, ఎరువుల వాడకం మితిమీరుతుండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. హరిత విప్లవం ప్రతికూలతలను స్వామినాథన్ 1968లోనే గుర్తించారు. ఆధునిక వంగడాలతోపాటు సంప్రదాయ వంగడాల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. నేల సారాన్ని కాపాడుకోకుండా విచ్చలవిడిగా పంటలు సాగుచేస్తే పొలాలు ఎడారులవుతాయని చెప్పారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంపై నియంత్రణ ఉండాలన్నారు. అంతేకాకుండా భూగర్భ జలాల పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. 8 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్ వ్యాప్తంగా రష్యా సాగించిన దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. డొనెట్స్క్లోని నియు–యోర్క్‌పై రష్యా సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కొస్టియాంటీనివ్కాపై జరిగిన రాకెట్ల దాడిలో 20 వరకు ఇళ్లు, కార్లు, గ్యాస్ పైప్‌లైన్ ధ్వంసం కాగా ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. చెరి్నహివ్పై రష్యా క్రూయిజ్ మిస్సైళ్లు పడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జపొరిఝియా అణు ప్లాంట్ పొరుగునే ఉన్న పట్టణంపై రష్యా దాడిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఇలా ఉండగా, నల్ల సముద్రం ధాన్యం రవాణా ఒప్పందాన్ని రద్దు చేసిన రష్యా ఉక్రెయిన్ నౌకా తీర ప్రాంతం ఒడెసాను లక్ష్యంగా చేసుకుంది. రష్యా మిలటరీ ప్రయోగించిన రెండు క్రూయిజ్ మిస్సైళ్లు గిడ్డంగులపై పడటంతో మంటలు చెలరేగి పరికరాలు ధ్వంసమయ్యాయని, 120 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు బూడిదయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది. క్రిమియాపై దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడినట్లు రష్యా తెలిపింది. ఈ పరిణామంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్లను పశ్చిమదేశాలు నెరవేర్చి, ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని సూచించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ చేసి మాట్లాడతానని, వచ్చే నెలలో తుర్కియేలో ఆయనతో భేటీ ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. కాగా, రష్యా ఆక్రమిత క్రిమియాలో వారం వ్యవధిలో రెండోసారి డ్రోన్ పేలింది. క్రాస్నోవార్డిస్క్‌లోని ఆయిల్ డిపో, ఆయుధ గిడ్డంగిలను డ్రోన్ బాంబులతో పేల్చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. సోమవారం ఉక్రెయిన్ జరిపిన దాడిలో రష్యాను కలిపే కీలకమైన క్రిమియా వంతెన కొంతభాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా, జపొరిఝియా ప్రాంతంలో ఉక్రెయిన్ శతఘ్ని కాల్పుల్లో రియా వార్తా సంస్థకు చెందిన రష్యా జర్నలిస్టు ఒకరు మృతి చెందారు. -
రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ. 10,084
సాక్షి, హైదరాబాద్: దేశంలో రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.10,084 అని నాబార్డు తేల్చింది. 2012–13లో ఇది రూ.6,426 కాగా, 2018–19 నాటికి రూ.10,084కు పెరిగిందని తెలిపింది. అయితే సన్న చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతుల ఆదాయం మాత్రం అంతగా లేదని పేర్కొంది. ఈ మేరకు పరిశోధనాత్మక అధ్యయన నివేదికను తాజాగా విడుదల చేసింది. పంటలు, పశు సంపద, వ్యవసాయేతర వ్యాపారం వంటి అంశాలను కూడా అధ్యయనంలో పరిశీలించారు. ‘మొత్తంగా పంటల సాగు ద్వారా వచ్చే ఆదాయం వాటా 38 శాతం కాగా, పశు సంపద ద్వారా వచ్చే ఆదాయం వాటా 16 శాతంగా ఉంది. వ్యవసాయేతర రంగాల ద్వారా కూడా ఆదాయం సమకూరుతోంది. కాగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన పంజాబ్, హరియాణాతో పాటు జార్ఖండ్, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రైతుల నెలవారీ ఆదాయం అత్యధికంగా ఉంది. భూ పరిమాణం పెరిగినప్పుడు, వ్యవసాయ కార్యకలాపాల (పంటల ఉత్పత్తి, జంతువుల పెంపకం) ద్వారా రైతు కుటుంబాల ఆదాయం పెరుగుతోంది. పెద్ద రైతులకు అంటే 25 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న రైతులకు వ్యవసాయ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 91 శాతం, కాగా చిన్న సన్నకారు రైతులకు ఇలా వచ్చే ఆదాయం కేవలం 28 శాతమే. ఈ విధంగా రైతు భూ పరిమాణాన్ని బట్టి ఆదాయంలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఓబీసీ, ఇతర వర్గాల ఆదాయంతో పోలిస్తే, ఎస్సీ, ఎస్టీ రైతు కుటుంబాల ఆదాయం తక్కువగా ఉంది..’అని నాబార్డు నివేదిక వెల్లడించింది. భవిష్యత్ తరాలు వ్యవసాయానికి దూరం ‘భవిష్యత్ తరాలు వ్యవసాయం వైపు మొగ్గు చూపడం లేదు. 63 శాతం మంది రైతులు తమ భవిష్యత్ తరం వ్యవసాయంలో ఉండాలని కోరుకోవడం లేదు. వ్యవసాయం లాభసాటి వృత్తి కాదని భావిస్తున్నారు. అందుకే కొత్త తరం వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయం చేయడం రిస్‌్కగా వారు భావిస్తున్నారు. వ్యవసాయ భూపరిమాణం తగ్గడం, పెట్టుబడి ఖర్చులు పెరగ డం వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నాయి. అలాగే వ్యవసాయానికి కీలకమైన కూలీల కొరత కూడా అనాసక్తికి కారణంగా ఉంది. మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి కూడా భవిష్యత్ తరం వ్యవసాయానికి దూరంగా ఉండటానికి కారణంగా కన్పిస్తోంది. వ్యవసాయంలో సరైన ఆదాయం రాకపోవడంతో, మెరుగైన భవిష్యత్తు కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయి. అంతేకాదు గౌరవం, సామాజిక హోదా కూడా ఉండటం లేదు..’అని పేర్కొంది. లాభదాయకం కాదనే భావన.. ‘వ్యవసాయం లాభదాయకం కాదని రైతులు భావిస్తున్నారు. మార్కెటింగ్ సహా పటిష్టమైన సేకరణ వ్యవస్థ లేకపోవడం, మద్దతు ధరలు సరిగా లేకపోవడంతో వ్యవసాయంపై అనాసక్తి చూపిస్తున్నారు. 62 శాతం మంది రైతులు ఇప్పటికీ తక్కువ ధరకు స్థానిక విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. 50 ఏళ్ల వయస్సున్న రైతుల్లో 70 శాతం మంది వరి సాగును కొనసాగిస్తున్నందున పంటల సాగులో వైవిధ్యం ఉండటం లేదు. కూరగాయలు, పండ్ల సాగు ద్వారా రైతుల్లో ఆదాయ ఉత్పత్తి గత 30 సంవత్సరాలలో తక్కువగా ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది..’అని నాబార్డు తెలిపింది. -
పుష్కలంగా ఆహార ధాన్యాలు
సాక్షి, అమరావతి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 9.3 శాతం వృద్ధి నమోదైంది. సాగువిస్తీర్ణం స్వల్పంగా తగ్గినప్పటికీ ఆహారధాన్యాల ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 9.3 శాతం వృద్ధి నమోదైనట్లు 2022–23 రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ధాన్యం ఉత్పత్తిలో కూడా 9.8 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక ఏడాది ఖరీఫ్, రబీలో కలిపి 121.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 2022–23 ఆర్థిక ఏడాదిలో 133.65 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని తొలి ముందస్తు అంచనాల్లో సర్వే పేర్కొంది. డిసెంబర్ ఆఖరు వరకు రాష్ట్రంలో 109.33 లక్షల మెట్రిక్ టన్నుల పాలు, 7,34,157 మెట్రిక్ టన్నుల మాంసం, 1784.01 లక్షల గుడ్లు ఉత్పత్తి జరిగినట్లు సర్వే పేర్కొంది. 2021–22లో రాష్ట్రం 2645.03 లక్షల గుడ్ల ఉత్పత్తితో అగ్రస్థానంలో, 1025.59 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తితో రెండో స్థానంలో, 154.03 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తితో ఐదో స్థానంలో నిలిచిందని సర్వే స్పష్టం చేసింది. 2021–22లో రాష్ట్రంలో 48.13 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరిగితే, 2022–23 ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు 37.18 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందని చెప్పింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.1,66,390 కోట్లు వ్యవసాయ వార్షిక రుణ ప్రణాళికగా నిర్ణయించినట్లు నివేదిక పేర్కొంది. ఇది గత ఆర్థిక ఏడాదితో పోల్చితే పది శాతం అదనం అని తెలిపింది. 2023–24లో రూ.1,395.45 కోట్ల వ్యయంతో కొత్తగా 1.50 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని మైక్రో ఇరిగేషన్ కిందకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఇందులో రూ.1,171.81 కోట్లు సబ్సిడీగా ఉంటుందని వెల్లడించింది. -
మనకు తిండి.. రైతుకుతిప్పలు
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్) దేశం వ్యవసాయపరంగా అభివృద్ధి సాధిస్తోంది. గత ఆరేళ్లలో దేశం నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులు బాగా పెరిగాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇలా వృద్ధి సాధించడం ఏ దేశానికికైనా శుభసూచకమే. ఈ ఎగుమతులతో రైతులు బాగుపడితే, వారి ఆర్థిక పరిస్థితి మెరుగైతే అది శుభం. కానీ దేశంలోని రైతాంగం పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. వేల కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నా.. ఆ ప్రయోజనం అన్నదాతలకు అందడం లేదు. పైగా అప్పుల పాలవుతున్నారు. ఎందుకంటే చాలా వరకు ప్రైవేట్ సంస్థలే ఎగుమతులు చేస్తున్నాయి. ఆ లాభాన్ని వ్యాపారులే పొందుతున్నారు. ఇలా ఎగుమతులు పెరిగిన కొద్దీ ఆహార ధాన్యాల ధరలు మండుతున్నాయి. ఈ లాభమూ దళారులకే వెళ్తుంటే... వినియోగదారులపై భారం పడుతోంది. మార్కెట్ మాయాజాలంతో.. ఐదారేళ్లుగా దేశమంతటా వర్షాలు విస్తారంగా కురవడంతో పంటల దిగుబడులు విపరీతంగా పెరిగాయి. ఇదే సమయంలో ఆహార ధాన్యాల ఎగుమతులు పెరుగుతూ వస్తున్నాయి. వరి, గోధుమ, పప్పు దినుసులు, నూనె గింజలు. కాఫీ. జనపనార (జ్యూట్), చెరుకు, తేయాకు, పొగాకు, వేరుశనగ, డెయిరీ పదార్థాలు, పళ్లు ఎగుమతి అవుతున్నాయి. అయితే దేశంలో ఎగుమతులు, దిగుమతులకు సంబం«ధించి సరైన విధానం లేని కారణంగా రైతులకు నష్టం జరుగుతోంది. మార్కెట్లోకి ఆహార ధాన్యాలు రావడానికి ముందు దిగుమతులను పెంచడం, రైతుల నుంచి ఆహార ధాన్యాలు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాక దిగుమతులు నిలిపేసి, ఎగుమతులకు అవకాశం ఇవ్వడం వల్ల వ్యాపారులకే లబ్ధి జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. మధ్యలో దళారీ వ్యవస్థ రెండు చేతులా సంపాదిస్తోంది. గణనీయంగా ఎగుమతులు.. ప్రస్తుతం దేశం నుంచి బియ్యం ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. 2021–22 సంవత్సరంలో జరిగిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో బియ్యం వాటా 19 శాతం. తర్వాత చక్కెర (9 శాతం), స్పైసెస్ (8శాతం), మాంసం (7శాతం) ఉన్నట్టు భారత పరిశ్రమలు, వాణిజ్య శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఇక గోధుమల ఎగుమతులు కూడా పెరుగుతున్నా యి. 2020–21లో వీటి ఎగుమతుల విలువ 568 మిలియన్ డాలర్లు కాగా.. 2021–22లో ఏకంగా 2.1 బిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం. ఇదే సమయంలో తొలిసారిగా కాఫీ పొడి ఎగుమతులు బిలియన్ డాలర్లు దాటాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కాఫీ తోటల వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. చేపల ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి. సముద్ర తీరం అధికంగా ఉన్న పశ్చిమబెంగాల్, ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ల నుంచి ఏకంగా 7.7 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు జరుగుతున్నాయి. ఆరుగాలం కష్టపడే రైతులు.. మనకు అన్నం పెడుతున్నారు.. ఆహార ధాన్యాల ఎగుమతులతో ఇతర దేశాలకూ తిండి పెడుతున్నారు.. లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులతో దేశ ఆర్థికవ్యవస్థకు ఊతంగా నిలుస్తున్నారు.. కానీ వారు మాత్రం అప్పుల్లో కూరుకుపోతున్నారు. అవి తీర్చలేక, కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏయే దేశాలకు ఎగుమతులు? భారత్ నుంచి ఆహార ధాన్యాలు ఎక్కువగా తీసుకుంటున్న దేశాల్లో అమెరికా, బంగ్లాదేశ్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాం, ఇండోనేసియా, సౌదీ అరేబియా, ఇరాన్, నేపాల్, మలేసియా దేశాలు ప్రధానంగా ఉన్నాయి. వీటితోపాటు కొరియా, జపాన్, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్ తదితర దేశాలూ మన నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే మన దేశం నుంచి అత్యధికంగా ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్న దేశం అమెరికా. మన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏకంగా 11.5 శాతం ఒక్క అమెరికాకే వెళ్తున్నాయి. వాటి విలువ 5.7 బిలియన్ డాలర్లు. విదేశాల్లోని భారత ఎంబసీల్లో అగ్రిసెల్స్తో.. భారత వ్యవసాయ, దాని అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి వీలుగా.. కేంద్రం వియత్నాం, అమెరికా, బంగ్లాదేశ్, నేపాల్, యూఏఈ, ఇరాన్, సౌదీ అరేబియా, మలేషియా, ఇండోనేసియా, సింగపూర్, చైనా, అర్జెంటీనాల్లోని భారత ఎంబసీల్లో అగ్రిసెల్స్ను ఏర్పాటు చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కృషి చేయడంతోపాటు వ్యాపార, పర్యాటక, సాంకేతిక, పెట్టుబడుల ప్రోత్సాహానికి ఈ విభాగాలు పనిచేస్తున్నాయి. రైతుల పరిస్థితి మారడం లేదు రైతులు బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి వ్యవసాయ వృద్ధికి దోహదం చేస్తున్నారు. 2021–22లో బ్యాంకులు రూ.16 లక్షల కోట్లు రుణాలు ఇస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. కానీ రూ.8 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చారు. సేవలు, పారిశ్రామిక రంగాల్లో వేల పరిశ్రమలు మూతపడినా.. వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది. దేశంలో 2022–23కు సంబంధించి వానాకాలంలో 11 కోట్ల ఎకరాల్లో వరి వేయాల్సి ఉంటే.. 10 కోట్ల ఎకరాల్లోనే వేశా రు. ఆశించిన దిగుబడి రావట్లేదు అదే జరిగితే ఇబ్బందే. దేశవ్యాప్తంగా 2021–22లో 12,600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. – సారంపల్లి మల్లారెడ్డి, అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకుడు ఎగుమతులున్నా.. గిట్టుబాటు ధర ఏది? దేశం నుంచి ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నాయి. కానీ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతులు ధాన్యం అమ్మేశాక ఎగుమతుల నిర్ణయాలు తీసుకుంటున్నారు. తద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎగుమతుల విధానం సరిగా లేదు. భారీ వర్షాల కారణంగా ఈసారి పంటల దిగుబడి తగ్గుతుంది. పత్తికి సంబంధించి కాటన్ అడ్వయిజరీ బోర్డు సమావేశంలో పత్తి ఉత్పత్తి, నిల్వ, ఎగుమతులను సమీక్షించేవారు. ఇప్పుడా అడ్వయిజరీ బోర్డు లేక సమస్య తలెత్తింది. పత్తిధర తగ్గిపోయింది. – దొంతి నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయరంగ నిపుణుడు -
క్లిష్ట సమయంలోనూ వీడని ఔదార్యం: ఉక్రెయిన్ చేయూత
రష్యా దాడులతో సతమతమవుతున్న ఉక్రెయిన్ ఆఫ్రికన్ దేశాలు ఎదుర్కొంటున్న ఆహార కొరతకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్ స్కీ తీవ్ర కరువును ఎదుర్కొంటున్న దేశాలకు సుమారు 150 మిలియన్ల డాలర్లు ఖరీదు చేసే ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేందుకు గ్రెయిన్ ఫ్రమ్ ఉక్రెయిన్ పథకాన్ని ప్రారంభించారు. ఉక్రెయిన్ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశించే మిలియన్ల మంది ప్రజలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 1923-33 శీతాకాలంలో మిలియన్ల మంది ఉక్రెయిన్లను పొట్టనబెట్టుకున్న రష్యా యుగం నాటి కరువు హోలోడోమోర్ కోసం జరిగిన ఉక్రెయిన్ వార్షిక స్మారక దినం సందర్భంగా ఈ ఫథకాన్ని ప్రారంభించారు. తమతో యుద్ధానికి దిగి ఆఫ్రికాలో ఆహార తీవ్ర ఆహార కొరతకు కారణమైందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయంటూ రష్యా రకరకాల కథనాలను వెలువరిస్తుంది. దీంతో వాటన్నింటిని తిప్పికొట్టేలా తాజాగా ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది ఉక్రెయిన్. ఈ మేరకు ఇథియోఫియా, సూడాన్, సౌత్‌సూడాన్, సోమాలియా, యెమెన్‌లతో సహా దేశాలకు ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం యూరోపియన్ యూనియన్‌తో సహా 20కి పైగా దేశాల నుంచి సుమారు రూ.150 మిలయన్ డాలర్లను సేకరించిందని జెలెన్స్కీ చెప్పారు. కరువు ముప్పును ఎదుర్కొంటున్న దేశాలకు ఉక్రెనియన్ ఓడరేవుల నుంచి కనీసం 60 నౌకలను పంపాలని ప్లాన్ చేస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధానిలో లక్షలాది మంది విద్యుత్ కొరతను ఎదుర్కొటున్నారని చెప్పారు. అంతేగాక ఉక్రెయిన్‌లోని 27 ప్రాంతాలలో 14 ప్రాంతాల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. అదీగాక మాస్కో దళాలు ఖేర్సన్ నగరం నుంచి వైదొలగినప్పటికీ షెల్లింగ్ దాడులు కొనసాగిస్తూనే ఉందని, ఈ దాడిలో సుమారు 32 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఏదీఏమైనా రష్యా ఉక్రెయిన్‌పై పదేపదే ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా యూఎన్ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ నల్ల సముద్రపు ఓడరేవుల నుంచి ఎగుమతి చేసిన ఆహారం అత్యంత తీవ్ర స్థాయిలో ఆహార కొరతను ఎదుర్కొంటున్న దేశాలకు చేరడం లేదంటూ రష్యా తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో జెలెన్స్కీ ఈ పథకాన్ని ప్రకటించారు. (చదవండి: ఉక్రెయిన్‌కి సునాక్ మద్దతు హామీ) -
రాష్ట్రంలో గోదాములు ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ బియ్యం బస్తాలతో నిండుగా కనిపించే గోదాములు స్టాక్ లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. వాటి ముందు ‘గోదాములు కిరాయికి ఇవ్వబడును’అనే బ్యానర్లు వెలుస్తున్నాయి. దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఎఫ్‌సీఐ రాష్ట్రంలోని గోడౌన్లలో ఉన్న బియ్యాన్ని అవసరమైన రాష్ట్రాలకు పంపుతోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎఫ్‌సీఐ గోదాములకు చేరాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం దాదాపు నాలుగు నెలలుగా సరిగా రావడం లేదు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన మిల్లర్లు.. వివిధ కారణాలతో మిల్లింగ్ ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గోడౌన్లు ఖాళీగా ఉంటున్నాయి. వీటిని అవసరమైన వ్యాపారులు, సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు వేర్ హౌజింగ్ కార్పొరేషన్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. గోదాముల్లో స్టాక్ 43 శాతమే.. భారత ఆహార సంస్థ లెక్కల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌సీఐ, సీడబ్ల్య్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోడౌన్లతోపాటు ప్రైవేటు వ్యక్తులకు చెందిన గోదాములు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అందులో ఎఫ్‌సీఐ తన సొంత గోదాములతోపాటు రాష్ట్ర, కేంద్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ల పరిధిలోనివి, ప్రైవేటుకు చెందినవి కలిపి 43 ప్రాంతాల్లోని గోదాములను లీజుకు తీసుకొని నిర్వహిస్తోంది. ఎఫ్‌సీఐ లెక్కల ప్రకారం 13.58 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న ఈ గోదాములలో ప్రస్తుతం 5.83 లక్షల టన్నుల స్టాక్ మాత్రమే ఉంది. ఇది పూర్తి సామర్థ్యంలో 42.94 శాతం మాత్రమే. ఇవికాకుండా ప్రైవేటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద కొన్ని, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే మరికొన్ని గోదాములు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. మిల్లుల నుంచి బియ్యం రాకపోవడంతో ఎఫ్‌సీఐ ఖాళీచేసిన గోదాములను ఇతర వ్యాపారులకు, సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు పని లేకపోవడంతో ఈ గోదాముల్లోని హమాలీలు ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడి గోదాములు బియ్యానికే పరిమితం రాష్ట్రంలో ఎఫ్‌సీఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన గోదాములన్నీ బియ్యం నిల్వ చేయడానికి ఉద్దేశించినవే. ఎఫ్‌సీఐ అప్పుడప్పుడూ గోధుమలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ చేస్తుంది. ప్రస్తుతం గోదాముల్లో ఉన్న నిల్వల్లో గోధుమలు, ఇతర ఆహార పదార్థాలు కలిపి అంతా 5 శాతంలోపేనని.. మిగతా 95 శాతం బియ్యమేనని ఎఫ్‌సీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ బియ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు సెంట్రల్ పూల్ కింద ఇతర రాష్ట్రాలకు పంపిస్తుండడంతో ఖాళీలు ఏర్పడుతున్నాయని వివరించారు. మిల్లుల్లోనే 65 లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో సుమారు ఆరు నెలలుగా కస్టమ్ మిల్లింగ్ సజావుగా సాగడం లేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. మిల్లర్లు తమ సొంత అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే విమర్శలున్నాయి. ఎఫ్‌సీఐ చర్యలకు దిగినప్పుడు మాత్రమే సీఎంఆర్ అప్పగిస్తున్నట్టు హడావుడి చేస్తున్న మిల్లర్లు.. తర్వాత తమ సొంత అవసరాల మేరకే మిల్లింగ్ జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది వానాకాలం ధాన్యం ఇప్పటికీ 15 లక్షల టన్నుల వరకు మిల్లర్ల వద్ద ఉండగా.. గత యాసంగికి సంబంధించిన 50లక్షల టన్నులు టార్పాలిన్ల కింద మగ్గిపోతోంది. అంటే 65 లక్షల టన్నుల ధాన్యం ఇంకా మిల్లర్ల వద్దే ఉంది. దీన్ని మిల్లింగ్ చేస్తే 40 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి అందుతుంది. ఆ బియ్యాన్ని గోడౌన్లకు తరలించి నిల్వ చేయనున్నారు. -
రష్యా అనుహ్య నిర్ణయం...తగ్గమని ఈయూ వేడుకోలు
ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతికి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసే షాకింగ్ నిర్ణయాన్ని రష్యా తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో యూరోపియన్ యూనియన్ దయచేసి ఈ విషయంలో వెనక్కి తగ్గమంటూ వేడుకున్నాయి. ఈ మేరకు రష్యాను మధ్యవర్తిత్వ ఒప్పందం నుంచి వైదొలగాలన్న తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ఈయూ పిలుపునిచ్చింది. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచే ఉక్రెయిన్ నుంచి ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాల ఎగుమతి నిలిచిపోయింది. ఐతే ఐక్యరాజ్యసమతి జోక్యం చేసుకోవడంతో ఉక్రెయిన్ నుంచి ఎగుమతులకు రష్యా ఒప్పుకుంది. కానీ ఇప్పుడు రష్యా అనుహ్యంగా నల్లసముద్రం ఒప్పందంలో భాగస్వామ్యాన్ని నిలిపేస్తున్నట్లు నిర్ణయించడంతో ప్రపంచదేశాలు ఆందోళ చెందుతున్నాయి. ఎందుకంటే ఈ ఒప్పందం ప్రపంచ ఆహార సంక్షోభాన్ని, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఉపకరించింది. ఐతే రష్యా తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ దేశాల ఆగ్రహాన్ని రేకెత్తించే చర్య. పైగా మాస్కో ఇది తన ప్రధాన నౌకదళంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి ప్రతీకార చర్య అని చెబుతోంది. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన ధాన్యం, ఎరువులకు సంబంధించిన ప్రధాన ఎగుమతిని ప్రమాదంలో పడేస్తుందని ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెట్ ట్విట్టర్ తెలిపారు. అందువల్ల రష్యాను దయచేసి ఈ విషయంలో వెనక్కితగ్గమని జోసెఫ్ కోరారు. (చదవండి: ఎగుమతి ఒప్పందం రద్దు చేస్తాం: రష్యా) -
Ukraine-Russia War: ఎగుమతి ఒప్పందం రద్దు చేస్తాం: రష్యా
కీవ్: ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతికి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేయబోతున్నట్లు రష్యా రక్షణ శాఖ శనివారం ప్రకటించింది. రష్యా దండయాత్ర ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ నుంచి ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాల ఎగుమతి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో ఉక్రెయిన్ నుంచి ఎగుమతులకు రష్యా అంగీకరించింది. ఈ మేరకు ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఉక్రెయిన్ 9 మిలియన్ టన్నులకుపైగా ఆహార ధాన్యాలను విదేశాలకు ఎగుమతి చేసింది. దీనివల్ల పలు దేశాల్లో ఆహారం ధరలు దిగివచ్చాయి. ఉక్రెయిన్‌పై ప్రతీకారంగానే ఎగుమతుల ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు మళ్లీ ఆగిపోవడం ఖాయం. -
FCI data: ఐదేళ్ల కనిష్టానికి ఆహార ధాన్యాల నిల్వలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆహార ధాన్యం నిల్వలు ఏడాదిలో భారీగా తగ్గాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సెంట్రల్ ఫూల్ కింద సేకరించి పెట్టిన గోధుమ, బియ్యం నిల్వలు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు అక్టోబర్ గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్ల క్రితం 2017లో బియ్యం, గోధుమల మొత్తం నిల్వలు 4.33 కోట్ల మెట్రిక్ టన్నుల కనిష్టానికి పడిపోగా, ప్రస్తుతం అదేరీతిన నిల్వలు 5.11 కోట్ల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. గత ఏడాది నిల్వలు 8.16 కోట్లతో పోల్చినా 37 శాతం నిల్వలు తగ్గడం, ఇందులో ముఖ్యంగా గోధుమల నిల్వలు ఏకంగా 14 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది. ఉచితంతో బియ్యం.. దిగుబడి తగ్గి గోధుమలకు దెబ్బ.. దేశంలో కరోనా నేపథ్యంలో కేంద్రం 2020 ఏప్రిల్ నుంచి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 81 కోట్ల జనాభాకు ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇప్పటికే ఆరు విడతలుగా అమలు చేసిన బియ్యం పథకం కింద 11.21 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింది. ప్రస్తుత అక్టోబర్ నుంచి మరో మూడు నెలలు ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం చేసింది. ఈ మూడు నెలల కాలానికి మరో 1.22 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరాలు ఉంటాయని అంచనా వేసింది. ఉచిత బియ్యం పథకం నేపథ్యంలో ఎన్నడూ లేనంతగా బియ్యం నిల్వలు కేంద్రం వద్ద తగ్గాయి. గత ఏడాది కేంద్రం వద్ద అక్టోబర్‌లో 3.47 కోట్ల బియ్యం నిల్వలు ఉండగా, అది ఈ ఏడాది 2.83 కోట్లకు పడిపోయింది. అయితే బియ్యం నిల్వలు తగ్గినంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏం లేదని, కేంద్ర పథకాల కొనసాగింపునకు ఇదేమీ అడ్డుకాదని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే ఖరీఫ్ పంటల కోతలు ఆరంభం అయినందున వీటితో మళ్లీ నిల్వలు పెంచుకునే అవకాశం ఉందని అంటోంది. అయితే గోధుమల పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. గోధుమల నిల్వలు గతంతో పోల్చితే తీవ్రంగా తగ్గాయి. 2017లో గోధుమల నిల్వలు 2.58 కోట్ల టన్నులు, 2018లో 3.56 కోట్లు, 2019లో 3.93 కోట్లు, 2020లో 4.37 కోట్లు, 2021లో 4.68 కోట్ల టన్నుల మేర నిల్వలు ఉండగా, అవి ఈ ఏడాది ఏకంగా 2.27 కోట్ల టన్నులకు తగ్గాయి. కరోనా పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా కరువు పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇతర దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి. ఎగుమతులు పెరగ్గా, దేశంలో అతివృష్టి కారణంగా పంటలు దారుణంగా దెబ్బ తినడంతో దిగుబడులు తగ్గాయి. దీంతో కేంద్రం వద్ద నిల్వలు తగ్గాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ ఏడాది మే నెలలో గోధుమల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. అయినప్పటికీ మే నుంచి అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోధుమ పంట దిగుమతులు తగ్గాయి. దీంతో అనుకున్న స్థాయిలో కేంద్రం నిల్వలు సేకరించలేకపోయింది. డిమాండ్‌ను గుర్తించి వ్యాపారులు ముందస్తు నిల్వలు చేశారు. ఈ ప్రభావం స్టాక్‌లపై పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపారుల గోధుమ నిల్వలను బహిర్గతం చేయాలని ఆదేశాలివ్వడం, దేశీయ లభ్యతను పెంచడానికి స్టాక్ పరిమితులను విధించడం వంటి చర్యలను కేంద్రం పరిగణించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
సమగ్ర విధానం లేకనే ఆహార ధాన్యాల కొరత
సాక్షి, హైదరాబాద్: సమగ్ర విధానం లేకపోవడం వల్లే దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందని, ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యమని మంత్రి కేటీ రామారావు విమర్శించారు. 140 కోట్ల జనాభా కలిగిన దేశానికి ఆహార భద్రత లేకపోవడం వెనుక బీజేపీ ప్రభుత్వానికి ముందు చూపులేదని అర్థమవుతోందన్నారు. దేశ వ్యవసాయ రంగం, ఆహార అవసరాల కోసం స్పష్టమైన విధానం రూపొందించి, ‘వన్ నేషన్–వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ’ని అమలు చేయాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించి కొరత లేకుండా చూడాలని కేటీఆర్ సూచించారు. ‘తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే తొందరలో మోదీ ప్రభుత్వం తాను తీసుకున్న గోతిలో తానే పడింది. దేశంలో నాలుగేళ్లకు సరిపడా గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని చెప్పిన కేంద్రం తాజాగా బియ్యం ఎగుమతులపై 20శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. గోధుమల ఆధారిత ఉత్పత్తులపై గతంలోనే ఆంక్షలు విధించిన మోదీ ప్రభుత్వం, ప్రస్తుతం నూకల ఎగుమతిపైనా నిషేధం పెట్టింది. ఎఫ్‌సీఐ గోదాముల్లో బియ్యం, నూకలు, గోధుమల నిల్వలు భారీగా తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉండటం దురదృష్టకరం ‘అవసరానికి మించి ఆహార ధాన్యాల నిల్వలున్నాయని 6 నెలల క్రితం ప్రకటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ కొరతకు కారణం చెప్పాలి. దేశంలో ఆహార ధాన్యాల అవసరాలు, వాటి సేకరణలో కేంద్రానికి స్పష్టమైన విధానం లేనందునే ప్రస్తుత కొరత తలెత్తింది. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని అవమానించిన పీయూష్ గోయల్ ఇప్పుడు నూకల ఎగుమతిని నిషేధించి వాటిని తింటారేమో. కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకపోయినా రికార్డు సమయంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి, ఉచిత కరెంటు, రైతుబంధు వంటి పథకాలతో రాష్ట్రంలో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. అయినా రైతులు వరిసాగు చేయకుండా కేంద్రం ఒత్తిడి తేవడంతో గత వానాకాలం సీజన్‌తో పోల్చితే ఈ సీజన్లో దేశవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గింది. దీంతో దేశంలో 12 నుంచి 15 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది’ అని మంత్రి కేటీ రామారావు లేఖలో పేర్కొన్నారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమంపై కనీస అవగాహన, ప్రణాళిక లేని మందబుద్ధి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండటం ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. -
ఒప్పందం జరిగి 24 గంటలు గడవనేలేదు.. ఒడెస్సా పోర్ట్‌పై రష్యా దాడి
కీవ్: ఆహార సంక్షోభాన్ని అడ్డుకునేందుకు నల్ల సముద్రం మీదుగా ఆహార ధాన్యాలను చేరవేసేలా రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అయితే.. ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఆ మరుసటి రోజే ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టుపై రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేందుకు ఈ నౌకాశ్రయమే కీలకం కాగా.. దానిపైనే దాడులు జరగటం గమనార్హం. శుక్రవారం నాటి ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్‌లో నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సాతో పాటు మరో రెండు రేవుల నుంచి ఎగుమతులు ప్రారంభంకావాల్సి ఉంది. తాజాగా ఆయా ఓడ రేవులపై మాస్కో క్షిపణులు దాడి చేశాయంటూ స్థానిక ఎంపీ ఒలెక్సీ గొంచరెంకో విమర్శలు చేశారు. మొత్తం నాలుగు మిసైల్స్ ప్రయోగించగా.. వాటిలో రెండింటిని అడ్డుకున్నట్లు చెప్పారు. ఒడెస్సా పోర్టుపై దాడి ఘటనలో పలువురు గాయపడినట్లు వెల్లడించారు. ఒడెస్సాలో ఆరు పేలుడు ఘటనలు జరిగాయన్నారు. ‘ఒడెస్సా పోర్టుపై మాస్కో దళాలు దాడులు చేశాయి. ఒప్పందం చేసుకుని ఒక్క రోజు గడవకముందే ఈ ఘటన జరగటంతో ఒప్పందాల విషయంలో రష్యా వైఖరి స్పష్టమవుతోంది. ఒడెస్సాను కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయండి. రష్యాకు బలప్రదర్శన మాత్రమే అర్థమవుతుంది.’ అని ట్వీట్ చేశారు. మరోవైపు.. ధాన్యం ఎగుమతుల ఒప్పందం విషయంలో ఏదైనా విఘాతం కలిగితే.. తద్వారా ఏర్పడే ఆహార సంక్షోభానికి రష్యాదే పూర్తి బాధ్యత అని ఉక్రెయిన్ విదేశాంగ ప్రతినిధి ఓలెగ్ నికొలెంకో పేర్కొన్నారు. ఐరాస, తుర్కియేలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడేందుకు రష్యాకు 24 గంటలూ పట్టలేదంటూ మండిపడ్డారు. మరోవైపు.. ఈ దాడిని ఖండించారు ఐరోపా సమాఖ్య విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి జోసెప్ బోరెల్. ఒప్పందం జరిగిన మరుసటి రోజునే కీలక పోర్ట్‌పై దాడి చేయటం అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల పట్ల రష్యా వైఖరి స్పష్టమవుతోందన్నారు. ఇదీ చదవండి: రెండేళ్ల క్రితమే మృతి.. ప్రతినెలా ఓనర్‌కు రెంట్ చెల్లిస్తున్న మహిళ! -
ఆహార ధాన్యాల సాగు.. బాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముగిసింది. చివర్లో ‘గులాబ్’ తుపాను గుబులు పుట్టించినప్పటికీ ఆశించిన స్థాయిలో కురిసిన వర్షాలతో సాగు సజావుగా సాగింది. గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఏడాది విస్తీర్ణంలో కాస్త తగ్గినప్పటికీ ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం మాత్రం కాస్త పెరిగింది. వరితో సహా మిరప, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్, ఉల్లి లక్ష్యానికి మించి సాగయ్యాయి. మొత్తమ్మీద 96.4 శాతం మేర సాధారణ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో నూరు శాతం అధిగమించగా, కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 99 శాతం మేర సాగయ్యాయి. ఇక విశాఖపట్నం మినహా మిగిలిన జిల్లాల్లో 90–96 శాతం మేర అయితే.. విశాఖలో మాత్రం 87 శాతం మేర మాత్రమే పంటలు సాగయ్యాయి. రాయలసీమలో ‘వరి’ సిరులు ఖరీఫ్‌లో వరి సాధారణ విస్తీర్ణం 38.40 లక్షల ఎకరాలు. 2019లో అది 38.15 లక్షల ఎకరాలు అయితే, 2020లో 38.52 లక్షల ఎకరాల్లో సాగయింది. అదే ఈ ఏడాది 39.17లక్షల ఎకరాల్లో సాగైంది. విశాఖ (95 శాతం), శ్రీకాకుళం (96 శాతం), పశ్చిమగోదావరి (97 శాతం) జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో నూరు శాతానికి మించి వరి సాగైంది. అత్యధికంగా రాయలసీమలోని చిత్తూరులో 193 శాతం, వైఎస్సార్ కడపలో 133 శాతం, అనంతపురంలో 125 శాతం, కర్నూలులో 100 శాతం మేర వరి సాగైంది. పెరిగిన మిరప, మొక్కజొన్న, అపరాలు ► గడిచిన సీజన్‌తో పోలిస్తే ఈసారి మిరప, మొక్కజొన్న రికార్డు స్థాయిలో సాగయ్యాయి. ► మిరప దాదాపు 1.24 లక్షల ఎకరాల్లో అదనంగా సాగైంది. దీని సాధారణ విస్తీర్ణం 3.40 లక్షల ఎకరాలైతే.. గతేడాది 3.43 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది ఏకంగా 4.67 లక్షల ఎకరాల్లో సాగైంది. ► ఇక మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలు కాగా.. గతేడాది 2.81 లక్షల ఎకరాల్లో సాగైంది. తొలిసారిగా ఈ ఏడాది 3.08 లక్షల ఎకరాల్లో సాగైంది. ► అపరాల సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. గత ఖరీఫ్‌లో 6.76 లక్షల ఎకరాల్లో సాగైన అపరాలు ఈసారి 7.41 లక్షల ఎకరాల్లో సాగైంది. తగ్గిన వేరుశనగ, పత్తి సాగు ఇక ఖరీఫ్‌లో నూనె గింజల సాధారణ విస్తీర్ణం 18.97 లక్షల ఎకరాలు కాగా.. గత సీజన్లో 19.22 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 17.37 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. గతేడాదితో పోలిస్తే 2 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. అలాగే, గతేడాది 18.41 లక్షల ఎకరాల్లో సాగైన వేరుశనగ ఈ ఏడాది 16.26 లక్షల ఎకరాలకే పరిమితమైంది. 14.73 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన పత్తి 12.86 లక్షల ఎకరాల్లో సాగైంది. -
కిమ్ బరువు తగ్గడం వెనక కారణమిదేనట..!
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు సంబంధించిన వీడియో ఒకటి నిన్నంత సోషల్ మీడియాలో వైరలయిన సంగతి తెలిసిందే. వీడియోలో కిమ్ గతంతో పోలిస్తే చిక్కినట్లు కనిపించాడు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా అనారోగ్య సమస్య వల్లే కిమ్ ఇలా అయ్యాడంటే.. కాదు.. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నాడు.. అందుకే ఇలా చిక్కిపోయినట్లు కనిపించాడని మరో వర్గం తెలిపింది. ఏది ఏమైనా కిమ్ బరువు తగ్గడంపై పెద్ద చర్చే నడిచింది. తాజాగా మరో ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. కరోనా కారణంగా గతేడాది నుంచి ఉత్తర కొరియాలో లాక్డౌన్ అమల్లో ఉండటంతో తీవ్ర ఆహార కొరత ఎదుర్కుంటుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఆహార కొరత వల్ల కిమ్ ఇలా చిక్కిపోయాడని ఉత్తర కొరియా వాసులు భావిస్తున్నారట. నార్త్ కొరియా అధికారక మీడియా ప్రకారం పేరు తెలియని ప్యాంగ్యాంగ్ వాసి ఒకరు కిమ్ బరువు తగ్గడంపై ఆ దేశ ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారని తెలిపాడు. ‘‘చిక్కిపోయినట్లు ఉన్న గౌరవనీయ ప్రధాన కార్యదర్శి (కిమ్ జాంగ్ ఉన్)ను చూసి మా దేశ ప్రజల గుండె బద్దలయ్యింది’’ అని తెలిపాడు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా కదలికలను గమనించే అమెరికాకు చెందిన 38 నార్త్ కొరియా డైరెక్టర్ జెన్ని టౌన్ మాట్లాడుతూ.. ‘‘కిమ్ బరువు తగ్గడం వెనక ప్రధాన కారణం తెలియదు. అనారోగ్య సమస్యలు లేదా ఫిట్‌గా మారడం కోసం ఇలా బరువు తగ్గి ఉండవచ్చు. అలా కాకుండా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆహార కొరత సమస్యపై ప్రజల్లో సానుభూతి పొందడం కోసం కిమ్ ఇలా ప్రచారం చేస్తున్నారేమో అనిపిస్తుంది’’ అన్నారు. మొత్తానికి కిమ్ బరువు తగ్గడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తుందన్నమాట. చదవండి: వీడియో వైరల్: భారీగా బరువు తగ్గిన కిమ్ జాంగ్ -
ఖరీఫ్ సాగు.. మరింత బాగు
సాక్షి, అమరావతి: ఖరీఫ్–2021 పంటల ఉత్పత్తి లక్ష్యాన్ని వ్యవసాయ శాఖ ప్రకటించింది. గడచిన ఖరీఫ్ సీజన్లో 90.86 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. ఈ ఖరీఫ్‌లో 94.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా 94.01 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేసింది. గత ఖరీఫ్‌తో పోలిస్తే.. ఈ ఖరీఫ్‌లో 3.34 లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకు రావడం ద్వారా 7.23 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా పొందాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఖరీఫ్–2021 సాగు లక్ష్యానికి అనుగుణంగా దిగుబడి అంచనాలను వ్యవసాయ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. మొత్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 94.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయించాలని నిర్ణయించగా.. అందులో వరి విస్తీర్ణం అత్యధికంగా 39.50 లక్షల ఎకరాలుగా ఉంది. 5.21 లక్షల ఎకరాల్లో తృణధాన్యాలు, 8.97 లక్షల ఎకరాల్లో అపరాలు కలిపి మొత్తం ఆహార ధాన్యాలు 53.68 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది. 19.72 లక్షల ఎకరాల్లో నూనె గింజలు, 14.81 లక్షల ఎకరాల్లో పత్తి, 3.69 లక్షల ఎకరాల్లో మిరప, లక్ష ఎకరాల్లో చెరకు, మరో 1.31 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించింది. గతం కంటే ఘనంగా.. టీడీపీ హయాంలో సగటున ఏటా ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 80.51 లక్షల టన్నులు కాగా, అందులో 73.86 లక్షల టన్నుల వరి దిగుబడి ఉంది. ఖరీఫ్–2019లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 87.77 లక్షల టన్నులు కాగా, అందులో వరి దిగుబడి 80.13 లక్షల టన్నులు. ఖరీఫ్–2020లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 86.78 లక్షల టన్నులు కాగా, ఇందులో వరి దిగుబడి 78.89 లక్షల టన్నులు. పెరగనున్న దిగుబడులు ఈ ఖరీఫ్‌లో 39.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఎకరాకు 2,156 కేజీల చొప్పున 85.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. తృణధాన్యాల దిగుబడి 6.74 లక్షల టన్నులు, అపరాల దిగుబడి 2.11 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని లెక్క వేశారు. ఈ విధంగా 53.68 లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాల దిగుబడి 94.01 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఆయిల్ సీడ్స్ 8.34 లక్షల టన్నులు, చెరకు 29.70 లక్షల టన్నులు, పత్తి 10.43 లక్షల టన్నులు, మిరప 8.48 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని లెక్కలేశారు. రానున్న ఖరీఫ్–21 సీజన్లో మొత్తంగా 94.20 లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాలతో పాటు అన్నిరకాల పంటల ద్వారా 154.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. రెండేళ్ల కంటే మిన్నగా దిగుబడులు గడచిన రెండేళ్ల కంటే మిన్నగా రానున్న ఖరీఫ్‌లో దిగుబడులు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆహార ధాన్యాలు ఖరీఫ్–2019లో 87.77 లక్షల టన్నులు, ఖరీఫ్–2020లో 86.78 లక్షల టన్నుల దిగుబడులు రాగా, ఈ ఖరీఫ్‌లో 94.01 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశాం. గత ఖరీఫ్‌లో 78.89 లక్షల టన్నుల వరి దిగుబడి రాగా, వచ్చే ఖరీఫ్‌లో 85.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అశిస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కల్లోలం రేపుతుండగా చాలా రాష్ట్రాల్లో తీవ్ర ఆంక్షలు అమల్లో ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ కూడా అమల్లో ఉంది. దీంతో పేదలు, రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక అవస్థలు పడుతున్న పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈనెల నుంచే పేదలకు ఆహార ధాన్యాలు ఐదు కిలోల చొప్పున అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మే, జూన్ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద అందించనుంది. ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున 79.88 కోట్ల మందికి ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. చదవండి: కరోనా వివాహం: నిజంగంటే ఇది బొంగుల పెళ్లి చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే -
180.54 లక్షల టన్నులు
సాక్షి, అమరావతి: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రాష్ట్రం రికార్డు సృష్టించింది. రాష్ట్ర విభజన అనంతరం ఈ స్థాయిలో ఉత్పత్తి సాధించడం ఇదే ప్రథమం. ఆహార భద్రతకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు, అనుసరించిన పద్ధతులతో ఈ రికార్డు సాధ్యమైంది. 2019–20 సంవత్సరానికి నాలుగవ, తుది ముందస్తు అంచనా ప్రకారం రాష్ట్రంలో 180.54 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి (వాణిజ్య పంటలు, నూనె గింజలు మినహా) వచ్చింది. ► గత ఏడాది కంటే ఇది 30.98 లక్షల టన్నులు ఎక్కువ కావడం గమనార్హం. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2015–16 నాటి కంటే 36.76 లక్షలటన్నులు ఎక్కువ. ► నాలుగో ముందస్తు అంచనా ప్రకారం 2019–20 ఖరీఫ్‌లో వరి దిగుబడి హెక్టార్‌కు 5,248 కిలోల చొప్పున మొత్తం 79,98,000 టన్నులు.. రబీలో హెక్టార్‌కు 5,846 కిలోల చొప్పున 59,75,000 టన్నులు.. మొత్తం 1,39,73,000 టన్నుల వరి దిగుబడి వచ్చింది. ► వరి, చిరుధాన్యాలు, తృణధాన్యాలు అన్నీ కలిపి 1,68,67,000 టన్నులు ఉత్పత్తి అయ్యాయి. పప్పు ధాన్యాలు రెండు సీజన్లలో కలిపి 11,87,000 టన్నులు వచ్చాయి. మొత్తం ఆహార ధాన్యాల దిగుబడి 1,80,54,000 టన్నులుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ► నూనె గింజల దిగుబడి 28,47,000 టన్నులుగా, పత్తి 25,12,000 బేళ్లుగా అంచనా వేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఐదేళ్ల కాలంలో ఇటువంటి దిగుబడి రాలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ► 2019–20లో మొత్తం 42.15 లక్షల హెక్టార్లలో ఆహార పంటలు సాగయ్యాయి. నూనె గింజలు 8.53 లక్షల హెక్టార్లో, ఇతర పంటలు 9.85 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. ఇదే స్ఫూర్తి కొనసాగాలి విభజనానంతర ఏపీలో ఈ స్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడి రావడం సంతోషకరం. ఇది ఆల్‌టైమ్ రికార్డ్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, కలిసివచ్చిన వాతావరణం, వానలు, రుతుపవనాలతో రైతులు సాధించిన విజయం ఇది. తెలంగాణ రాష్ట్రం కన్నా అధిక దిగుబడి నమోదైంది. ఇదే స్ఫూర్తితో అధికారులు పని చేయాలి. రైతులకు తలలో నాలుకలా ఉండాలి. ప్రభుత్వ ఆశయాన్ని సాధించాలి. అన్నదాతలకు అధిక ఆదాయం వచ్చేలా చూడాలని కోరుతున్నా. –అరుణ్‌కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ -
ఇటు ఆకలి, అటు ఆహార ధాన్యాల వృధా!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో గత జనవరి ఒకటవ తేదీ నాటికి పాడైన ఆహార ధాన్యాలు 7.2 లక్షల టన్నులు ఉండగా, మే ఒకటవ తేదీ నాటికి, అంటే నాలుగు నెలల కాలంలో అవి 71.8 లక్షల టన్నులకు చేరుకున్నాయి. అంటే దాదాపు 65 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు వృధా అయ్యాయి. లాక్డౌన్ సందర్భంగా ‘పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన’ కింద ఏప్రిల్, మే నెలల్లో పేద ప్రజలకు పంపిణీ చేసిన ఆహార ధాన్యాలకన్నా ఇవి ఎక్కువ. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పేద ప్రజలకు పంపిణీ చేసేందుకు, ఆహార కొరత ఏర్పడే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగం కోసం భారత ఆహార సంస్థ ఈ ఆహార ధాన్యాలను ఏటా సేకరిస్తోంది. అయితే ఆహార ధాన్యాలను నిల్వచేసే గిడ్డంగుల సామర్థ్యం కన్నా ఎక్కువ ధాన్యాలను సేకరించడం, ఉన్న గిడ్డంగులు ఎప్పటికప్పుడు మరమ్మతులు నోచుకోక పోవడం వల్ల దేశంలో ఏటా ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. 2018, అక్టోబర్ నెల నుంచి దేశంలో ఆహార ధాన్యాల సేకరణ ఎక్కువైంది. 2020, మే ఒకటవ తేదీ నాటికి భారత ఆహార సంస్థ గరిష్టంగా 668 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను సేకరించాల్సి ఉండగా, 878 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను సేకరించింది. ఆహార ధాన్యాల కొనుగోలుకే కాకుండా వాటి రవాణాకు, నిల్వకు భారత ఆహార సంస్థకు ఎంతో ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆ నిల్వల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద కొంత మొత్తాన్ని కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంది. గత ప్రభుత్వాలు ఆహార ధాన్యాల కొనుగోలుతో పాటు, వాటి రవాణా, నిల్వకు అయ్యే ఖర్చును కూడా భరించేవి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం ధాన్యం ధరనే చెల్లించి సరకును తీసుకుంటోంది. అదనపు నిల్వలను బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవాల్సిందిగా భారత ఆహార సంస్థను కేంద్రం ఆదేశించింది. చాలా సందర్భాల్లో బహిరంగ మార్కెట్ రేటుకన్నా ఎక్కువ మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి సేకరించడం వల్ల, తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తంలో డబ్బు రాకపోవడం ఒకటైతే, మార్కెట్లో అదనపు నిల్వలను తక్కువ ధరకు అమ్మాల్సి రావడం, అధిక మొత్తంలో నిల్వ ఉంచిన ధాన్యాలు పాడవడం వల్ల భారత ఆహార సంస్థ భారీగా నష్టపోతోంది. దాన్ని పూడ్చుకునేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. 2019, డిసెంబర్ 31వ తేదీ వరకు ఆ సంస్థకు 2.36 లక్షల కోట్ల అప్పు పేరకు పోయింది. భారత ఆహార సంస్థ నిల్వల్లో ఎక్కువగా బియ్యం, గోధుమలే ఉంటాయన్న విషయం తెల్సిందే. అదనంగా సేకరించిన దాదాపు 200 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఏం చేయాలో భారత ఆహార సంస్థకు అర్థం కావడం లేదు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి కేవలం 36 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే ఆ సంస్థ బహిరంగ మార్కెట్లో విక్రయించగలిగింది. కరోన లాక్డౌన్ సందర్భంగా రైళ్లు, బస్సుల్లోనే కాకుండా కాలి నడకన స్వగ్రామాలకు బయల్దేరిన లక్షలాది మంది వలస కార్మికులు ఆకలి కోసం అల్లాడుతుంటే, ఏటా ఎంతో మంది పేదలు ఆకలితో అలమటించి చనిపోతుంటే మరోపక్క టన్నుల కొద్ది ఆహార ధాన్యాలు వృధా అవడం గమనిస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. -
రైతులకు 2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌లో భాగంగా రెండో రోజు రూ. 3.16 కోట్ల ప్యాకేజీని గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో వలస కూలీలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, రైతులకు రాయితీపై రుణ సదుపాయం, వీధి వ్యాపారులకు పెట్టుబడి.. మొదలైనవి ఉన్నాయి. స్వస్థలాల్లో లేని వలస కూలీలకు రానున్న రెండు నెలల పాటు నెలకు ఒక్కొక్కరికి 5 కేజీల ఆహార ధాన్యాలను, కుటుంబానికి 1 కేజీ పప్పు ధాన్యాలను ఉచితంగా అందిస్తామన్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ, లేదా రాష్ట్ర ప్రభుత్వ రేషన్ కార్డు లేని సుమారు 8 కోట్ల మంది వలస కూలీలు ప్రయోజనం పొందనున్నారు. దీనికోసం దాదాపు రూ. 3500 కోట్లను ఖర్చు చేయనున్నట్లు నిర్మల చెప్పారు. ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది. రైతుల కోసం.. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రూ. 2 లక్షల కోట్లను రాయితీపై రుణంగా అందిస్తామన్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 2.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారన్నారు. పీఎం–కిసాన్ లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రాయితీపై రుణాలందించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడ్తామన్నారు. మత్స్యకారులు, పశుసంవర్థక రంగంలోని రైతులు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చన్నారు. , జూన్‌లో రైతులకు రబీ అనంతర, ప్రస్తుత ఖరీఫ్ అవసరాల కోసం నాబార్డ్ ద్వారా గ్రామీణ సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రూ. 30 వేల కోట్లు అందుబాటులోకితెస్తారు. గృహ నిర్మాణరంగానికి ఊతమిచ్చేందుకు రూ. 70 వేల కోట్లను ఆమె ప్రకటించారు. రూ. 6–18 లక్షల వార్షిక ఆదాయ వర్గాల వారికి ఇళ్ల కొనుగోలుకు సబ్సీడీ రుణ సదుపాయాన్ని ఏడాదిపెంచారు. ప్రభుత్వ నిధులతో నగరాల్లో నిర్మితమైన గృహ సముదాయాల్లో వలస కార్మికులు, పేదలు తక్కువ అద్దెతో ఉపయోగించుకునేలా ‘అఫర్డబుల్ రెంటల్ హౌజింగ్ కాంప్లెక్స్’లను ఏర్పాటు చేస్తామన్నారు. వన్ నేషన్.. వన్ రేషన్ కార్డ్ వలస కూలీలు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా అక్కడి రేషన్ షాపుల్లో తమ రేషన్‌ను పొందేందుకు ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డ్’ వీలు కల్పిస్తుందన్నారు. ఈ అంతర్రాష్ట్ర రేషన్ కార్డ్ పోర్టబిలిటీ దేశవ్యాప్తంగా మార్చి 2021 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. వలస కార్మికుల పరిస్థితిపై తమ ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్న నిర్మల.. ఇప్పటికీ తలపై తమ వస్తువులు మోసుకుంటూ, చిన్న పిల్లలతో పాటు హైవేలపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులు కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద కానీ, రాష్ట్రాల రేషన్ కార్డు ద్వారా కానీ లబ్ధి పొందనటువంటి వారికి.. ఒక్కో వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యం, ఒక్కో కుటుంబానికి కేజీ శనగపప్పు చొప్పున రెండు నెలల పాటు ఉచితంగా అందిస్తాం’ అని నిర్మల వివరించారు. ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన కింద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు ఉన్నవారికి జూన్ వరకు మూడు నెలల పాటు ఒక్కొక్కరికి 5 కేజీల ఆహార ధాన్యం, కుటుంబానికి కేజీ పప్పుధాన్యం ఉచితంగా ఇస్తున్నారు. దీని ద్వారా దాదాపు 80 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. స్వస్థలాలకు నడిచి వెళ్తున్న వారి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నాయన్నారు. ఇందుకోసం రాష్ట్రాలు సబ్సిడీ ధరలకు కేంద్రం నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఇందుకు రుణసదుపాయం కూడా ఉందన్నారు. వలస కార్మికులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ఇతర దాతృత్వ సంస్థలు కేజీకి రూ. 24 చొప్పున గోధుమలు, కేజీకి రూ. 22 చొప్పున బియ్యాన్ని సబ్సిడీ ధరకు కేంద్రం నుంచి కొనుగోలు చేయవచ్చన్నారు. భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా బుధవారం రూ. 5.94 లక్షల కోట్ల ప్రయోజనాలను ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. వీధి వ్యాపారులకు.. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు, వారు మళ్లీ తమ వ్యాపారాలను ప్రారంభించుకునేలా ఒక్కొక్కరికి రూ. 10 వేలను పెట్టుబడి రుణంగా అందిస్తామని నిర్మల తెలిపారు. ఈ భారం ప్రభుత్వంపై సుమారు రూ. 5వేల కోట్ల వరకు ఉండొచ్చన్నారు. ముద్ర–శిశు రుణ పథకం కింద రూ. 50 వేల వరకు అప్పు తీసుకున్న చిన్నతరహా వ్యాపారులకు 2% వడ్డీ రాయితీ కల్పించాలని కూడా నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తున్నవారికి ఈ వడ్డీ రాయితీ 12 నెలల పాటు కొనసాగుతుందన్నారు. దీనితో ప్రభుత్వంపై రూ. 1500 కోట్ల భారం పడుతుందన్నారు. కాంపా(కంపెన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధుల్లో ఉపాధి అవకాశాల కోసం రూ. 6 వేల కోట్లను కేటాయిస్తున్నామన్నారు. అడవుల విస్తీర్ణం పెంచే దిశగా మొక్కలు నాటేందుకు, అటవీ పరిరక్షణ కార్యక్రమాలకు స్థానికులకు ఉపాధి లభించేలా ఈ నిధులను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చన్నారు. రైతులు, కార్మికులకు ప్రయోజనకరం: ప్రధాని మోదీ కేంద్రం రెండో విడత ప్రకటించిన ప్రోత్సాహకాలు రైతులు, వలస కార్మికులకు ఎంతగానో ఉపయోగపడతాయి. సహాయక చర్యలు ముఖ్యంగా మన రైతులు, వలస కార్మికులకు తోడ్పడతాయి. అందరికీ ఆహార భద్రతతోపాటు, చిరు వ్యాపారులు, రైతులకు రుణాలు అందుతాయి. జుమ్లా ప్యాకేజీ: కాంగ్రెస్.. సీతారామన్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అంతా వట్టిదే. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి జీడీపీలో 10 శాతం, రూ.40 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ప్రధాని ఘనంగా చేసిన ప్రకటనకు ఈ ప్యాకేజీకి సంబంధం లేదు. రోడ్ల వెంట సొంతూళ్లకు నడిచి వస్తున్న వలస కార్మికుల కోసం సాయం ప్రకటిస్తారని ఎదురుచూశాం. నిరాశే మిగిలింది. పేదల పట్ల పరిహాసం ఈ ప్యాకేజీ: సీపీఎం ఆర్థికమంత్రి ప్రకటించిన ప్యాకేజీ రాజకీయ ఎత్తుగడ. దేశాన్ని పట్టిపీడిస్తున్న ఏ ఒక్క సమస్యకూ దీనితో పరిష్కారం లభించదు. వలస కార్మికులను కనీసం సొంతూళ్లకు కూడా చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదు. ఉద్యోగాలు కోల్పోయిన పేదలకు రూ.7,500 కోట్లు సాయం అందించాలి. ఆ గణాంకాలతో ఏమీ ఒరగదు: సీపీఐ ప్రోత్సాహకాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్న గణాంకాలు అర్థం లేనివి. తికమక లెక్కలు. రాజకీయ ప్రయోజనాలు తప్ప ఏమీలేదు. వేలాది మైళ్లు రోడ్ల వెంట నడిచి వెళ్తున్న వలస కార్మికుల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపలేదు. పట్టణ నిరుద్యోగం అంశాన్ని ఆమె పట్టించుకోలేదు. -
పచ్చని పండుగ
‘రైతుకు ఎంత చేసినా తక్కువే. వారు బాగుంటేనే మనందరం బాగుంటాము. అందుకే విత్తనం మొదలు.. పంట కొనుగోలు దాకా ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలబడాలన్నదే నా లక్ష్యం’ అని చెప్పే సీఎం జగన్.. తొలి నుంచీ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. వెరసి వ్యవసాయం మళ్లీ పండుగలా మారింది. అన్నదాతల లోగిళ్లు కళకళలాడుతున్నాయి. మొన్నటి దాకా కనుచూపు మేర పచ్చటి పంటలు.. ఇప్పుడు పంట కోతలు.. నూర్పిళ్లు.. ధాన్యం రాసులు.. మార్కెట్‌కు తరలింపు దృశ్యాలు..కష్టానికి ఫలితం దక్కిందన్న ఆనందం ప్రతి రైతు మొహంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సాక్షి,అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయడం వల్ల 2019–20లో రికార్డు స్థాయిలో ఆహార ధ్యాన్యాల ఉత్పత్తి సాధ్యమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయ రంగానికి, రైతులకు పెద్ద పీట వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో రెండు అడుగులు ముందుకు వేసి వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు మార్కెటింగ్, రైతుల పంటలకు కనీస మద్ధతు ధర కల్పించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 2019–20 ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల వారీగా ఉత్పత్తి గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నాడు రాజన్న రాజ్యంలో పండుగలా మారిన వ్యవసాయం.. నేడు వైఎస్ జగన్ ప్రభుత్వంలోనూ రైతులకు పండుగైంది. ఆహార ధాన్యాలు ► రాష్ట్ర ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగంలో పలు చర్యలు తీసుకుంది. రైతులకు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందించడం, సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంతో రైతుల పంట పండింది. ► రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి నమోదైంది. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 2019–20 ఆర్థిక ఏడాదిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 172 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ► గత ఐదేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఇదే రికార్డు కావడం విశేషం. 2018–19లో 150 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. ధాన్యం ► ప్రధానమైన వరి పంట సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పత్తిలోనూ 2019–20లో రికార్డు స్థాయికి చేరనుంది. 2019–20 ఆర్థిక ఏడాదిలో వరి సాగు విస్తీర్ణం 23.29 లక్షల హెక్టార్లకు చేరింది. ► ధాన్యం ఉత్పత్తి కూడా రికార్డు స్థాయికి చేరింది. 2019–20 ఆర్థిక ఏడాదిలో ధాన్యం ఉత్పత్తి 137 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. ► ధాన్యం దిగుబడి 2019–20లో హెక్టార్‌కు 5,886 కేజీలు నమోదైంది. కందులు ► కందుల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, దిగుబడి 2019–20లో రికార్డు స్థాయిలో ఉండనుంది. 2.38 లక్షల హెక్టార్లలో కంది సాగు అయింది. ఉత్పత్తి 2.01 లక్షల మెట్రిక్ టన్నులు రానుంది. ఇది 2018–19తో పోల్చి చూస్తే 136 శాతం ఎక్కువ. 2018–19లో కందుల ఉత్పత్తి కేవలం 0.46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ► హెక్టార్‌కు కందుల దిగుబడి 2019–20లో 820 కేజీలు. ఇదే 2018–19లో కేవలం 182 కేజీలే. మొక్క జొన్న ► మొక్క జొన్న సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పత్తిలో 2019–20లో రికార్డు నమోదైంది. 2.83 లక్షల హెక్టార్లలో సాగు అయింది. ► 2019–20లో మొక్కజొన్న ఉత్పత్తి 19 లక్షల మెట్రిక్ టన్నులు. హెక్టార్‌కు 6,633 కేజీలు దిగుబడి వచ్చింది. మినుములు ► 2019–20లో మినుములు 2.95 లక్షల హెక్టార్లలో సాగు అయ్యాయి. ఉత్పత్తి 2.72 లక్షల మెట్రిక్ టన్నులుగా, హెక్టార్‌కు దిగుబడి 928 కేజీలుగా అంచనా వేశారు. పెసలు ► 2019–20లో పెసలు 1.01 లక్షల హెక్టార్లలో సాగు కాగా, ఉత్పత్తి 0.85 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. హెక్టార్‌కు దిగుబడి 820 కేజీలుగా అంచనా వేశారు. శనగలు ► 2019–20లో శనగ 4.54 లక్షల హెక్టార్లలో సాగైంది. 4.84 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రానుంది. ఇది 2018–19తో పోల్చి చూస్తే 99 శాతం ఎక్కువ. 2018–19లో శనగల ఉత్పత్తి 2.43 లక్షల మెట్రిక్ టన్నులే. హెక్టార్‌కు దిగుబడి 2019–20లో 1,073 కేజీలుంటే 2018–19లో కేవలం 508 కేజీలే ఉంది. వేరుశనగ ► 2019–20లో వేరుశనగ 6.61 లక్షల హెక్టార్లలో సాగు కాగా, ఉత్పత్తి 8 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. హెక్టార్‌కు దిగుబడి 1,269 కేజీలుగా అంచనా వేశారు. 2018–19లో వేరుశనగ హెక్టార్‌కు దిగుబడి కేవలం 618 కేజీలు వచ్చింది. పత్తి ► 2019–20లో పత్తి సాగు విస్తీర్ణం, దిగుబడి బాగా పెరిగింది. 6.54 లక్షల హెక్టార్లలో సాగైంది. ఉత్పత్తి 24 లక్షల బేళ్లు. 2018–19తో పోల్చితే పత్తి ఉత్పత్తి 60 శాతం మేర పెరిగింది. ► హెక్టార్‌కు పత్తి దిగుబడి కూడా బాగా పెరిగింది. 2019–20లో హెక్టార్‌కు 622 కేజీల దిగుబడి రాగా, 2018–19లో కేవలం 409 కేజీలే. అంటే 52 శాతం మేర ఎక్కువ దిగుబడి వచ్చింది. -
తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి రైళ్లు.. ఎందుకంటే!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశంలో 21 రోజుల లాక్డౌన్ ప్రకటించిన క్రమంలో పేదవారు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం వారికి ఆహారధాన్యాలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆహారధాన్యాల కొరత ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) ప్రజా పంపిణీ ద్వారా రెండు రెట్లు అధిక ధాన్యాన్ని సరఫరా చేస్తోంది. గత రెండు రోజుల్లోనే 85 రైళ్ల ద్వారా అవసరమైన ధాన్యాన్ని ఆయా రాష్ట్రాలకు అందించింది. ఆహారధాన్యాలు అధికంగా లభిస్తున్న పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కొరత ఉన్న రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రం నుంచి అధికంగా 60 శాతం వరకు తరలించినట్లు అధికారులు తెలిపారు. లాక్డౌన్ విధించిన క్రమంలో ప్రస్తుతం ఇచ్చే 5 కేజీల ఆహారధాన్యాలకు అదనంగా మరో 5 కేజీలను ఉచితంగా అందిస్తానని మార్చి 24న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిలియన్‌టన్నులు ఆహారధాన్యాలను కొరత ఉన్న ఆయా రాష్ట్రాలకు ఎఫ్‌సీఐ సరఫరా చేస్తోంది. ఏప్రిల్‌లో అందించేందుకు కావల్సిన ధాన్యాలను ఇప్పటికే ఎఫ్‌సీఐ సరఫరా చేసింది. ఏప్రిల్ నెలలో 5 మిలియన్ టన్నుల ధాన్యాన్ని తరలించనున్నామని ఎఫ్‌సీఐ చైర్మన్ డీవీ ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం అదనంగా ఇస్తానన్న ధాన్యంతో కలిసి అన్ని రాష్ట్రాలకు సరిపడ ఆహారధాన్యాలు ఎఫ్‌సీఐ దగ్గర ఉన్నాయని ఆయన తెలిపారు. సాధారణంగా నెలకు 5 కేజీల చొప్పున సరఫరా చేయడానికి అన్ని రాష్ట్రాల వద్ద 4నుంచి 6 నెలలకు సరిపడా రేషన్ ఉందని అయితే లాక్డౌన్ కారణంగా అదనంగా అందిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. దీంతో పాటు పంజాబ్, ఒడిశా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు మూడు నెలల రేషన్‌ను ఒకేసారి అందించనున్నట్లు ప్రకటించాయి. అదేవిధంగా వినియోగదారులు ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదనంగా 5 కేజీల ధాన్యాలు ఇవ్వడానికి అంగీకరించాయి. దీనితో ఆహారధాన్యాలను ఎక్కువగా సరఫరా చేయాల్సి వచ్చిందని తెలిపారు. దీనితో పాటు ఏప్రిల్ మధ్యలో నుంచి ఆహారధాన్యాల సేకరణ మొదలుపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పేదలకు ఆహారధాన్యాలు సమకూర్చడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. -
ఆహారంపై తగ్గుతున్న వ్యయం
సాక్షి అమరావతి: దేశంలో ప్రజల సంపాదన పెరిగినప్పటికీ.. అందులో ఆహారంపై కాకుండా ఇతర రంగాలపై ఎక్కువ వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొందని కేంద్ర గణాంక శాఖ తేల్చింది. దీంతో కడుపు నిండా పౌష్టికాహారం తినలేకపోతున్నారని వెల్లడించింది. కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్లే ఆహారంపై పెట్టే ఖర్చు తగ్గిపోతోందని తెలిపింది. గత రెండు దశాబ్దాలుగా దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల ఆహార అలవాట్లలో భారీ మార్పులు వచ్చాయని వివరించింది. ఫాస్ట్ఫుడ్స్తోపాటు అనారోగ్యానికి దారితీసే ఆహారాన్ని తీసుకోవడం పెరిగిపోతోందని, దీంతో దేశంలో ఊబకాయం సమస్య పెద్ద ఎత్తున తలెత్తుతోందని స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలో ఆహార, పౌష్టికాహార భద్రతపై అధ్యయనం చేసిన కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఇటీవల కేంద్రానికి నివేదిక సమర్పించింది. అధ్యయనంలో వెల్లడైన అంశాలు.. - దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ నెలవారీ ఆదాయంలో 49 శాతం ఆహార పదార్థాలపై, మిగతా 51 శాతం ఇతర రంగాలపై వ్యయం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయంలో ఆహారంపై 39 శాతమే ఖర్చు పెడుతుండగా మిగతా మొత్తాన్ని ఇతర రంగాలకు కేటాయిస్తున్నారు. - గ్రామాల్లో పేదలకు రోజుకు 2,155 కిలో కేలరీల ఆహారానికి గాను 1,811 కిలో కేలరీలే లభ్యమవుతోంది. పట్టణాల్లో పేదలకు రోజుకు 2,090 కిలో కేలరీల ఆహారానికి గాను 1,745 కిలో కేలరీల ఆహారమే లభిస్తోంది. - 1972–73 నుంచి 2011–12 మధ్య కాలంలో ఆహారంపై పెట్టే వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 40 శాతానికి తగ్గిపోయింది. ఇదే సమయంలో ఆహారేతర వ్యయం బాగా పెరిగిపోయింది. - 2004–05 నుంచి 2011–12 మధ్య కాలంలో ఆహారంపై వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం మేర.. పట్టణ ప్రాంతాల్లో 8 శాతం మేర తగ్గిపోయింది. - గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయంలో ఆహారంపై తలసరి వ్యయం రూ.902 ఉండగా ఇతర రంగాలపై రూ.852 ఉంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఆహారంపై నెలవారీ ఆదాయంలో తలసరి వ్యయం రూ.1,336 ఉండగా, ఇతర రంగాలపై రూ.1,549 ఉంది. - ఆహార అలవాట్లలో మార్పు కారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు ప్రొటీన్లతో కూడిన శక్తిమంతమైన ఆహారం అందడం లేదు. - ఇక పేద కుటుంబాలు నెలవారీ ఆదాయంలో ఆహారంపై గ్రామీణ ప్రాంతాల్లో రూ.588 వ్యయం చేస్తుండగా ఇతర రంగాలపై రూ.395 వ్యయం చేస్తున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో పేదలు నెలవారీ ఆదాయంలో ఆహారంపై రూ.655, ఇతర రంగాలపై రూ.589 ఖర్చు పెడుతున్నారు. పోషకాలతో కూడిన పంటలను ప్రోత్సహించాలి రైతులు మరింత పోషకాలతో కూడిన పంటలను పండించేలా ప్రోత్సహించాలని కేంద్ర గణాంక శాఖ తన నివేదికలో ప్రభుత్వానికి సూచించింది. చిరుధాన్యాలు, సోయాబీన్స్ పంటలను ప్రోత్సహించేందుకు వాటికి మద్దతు ధరలను ప్రకటించడమే కాకుండా సబ్సిడీలను అందించాలని సిఫార్సు చేసింది. ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించడంతోపాటు తక్కువ వ్యయంతో అధిక ఉత్పాదకతను సాధించే సాంకేతిక పరిజ్ఞానాలను రైతులకు అందించాలని ప్రతిపాదించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పోషకాలతో కూడిన ఆహార ధాన్యాలను ప్రజలకు అందించాలంది. -
వరి పెరిగె... పప్పులు తగ్గె..
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్ల ఉత్పత్తి నాలుగో ముందస్తు అంచనాల నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ ఆదివారం విడుదల చేసింది. ఈ ప్రకారం 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.74 కోట్ల టన్నులు కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరం సీజన్లో ఏకంగా 28.49 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే అంతకుముందు ఏడాది కంటే అధికంగా ఉత్పత్తి కావడం గమనార్హం. అందులో కీలకమైన వరి 2017–18 ఖరీఫ్, రబీ సీజన్లలో 11.10 కోట్ల టన్నులు కాగా, ఈసారి 11.64 కోట్ల టన్నులకు చేరింది. అంటే అదనంగా 54 లక్షల టన్నులు పెరిగింది. ఇక కీలకమైన పత్తి దిగుబడి పడిపోయింది. 2017–18లో 3.39 కోట్ల బేల్స్ ఉత్పత్తి కాగా, 2018–19లో కేవలం 2.87 కోట్ల బేళ్లకు పడిపోయింది. ఏకంగా 52 లక్షల బేళ్ల ఉత్పత్తి తగ్గిందన్నమాట. గులాబీ పురుగు కారణంగా దేశవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి గణనీయంగా పడిపోయినట్లు కేంద్రం అంచనా వేసింది. ఇక పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా కాస్త మందగించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.39 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2.34 కోట్ల టన్నులకు పడిపోయింది. అంటే 5 లక్షల టన్నులు తగ్గింది. ఇక నూనె గింజల ఉత్పత్తి 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.98 కోట్ల టన్నులు కాగా, 2018–19లో 3.22 కోట్ల టన్నులకు పెరగడం గమనార్హం. మొక్కజొన్న 2.72 కోట్ల టన్నులు, సోయాబీన్ 1.37 కోట్ల టన్నులు, వేరుశనగ 66 లక్షల టన్నులకు పెరిగింది. చెరుకు రికార్డు స్థాయిలో 40.01 కోట్ల టన్నులు ఉత్పత్తి కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో మూడో ముందస్తు అంచనాల నివేదిక ప్రకారం 2018–19 సీజన్లో ఖరీఫ్, రబీ కలిపి ఆహార ధాన్యాల ఉత్పత్తి 91.93 లక్షల టన్నులుగా ఉంది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే 2018–19 సీజన్లలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. 2016–17లో 1.01 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండగా, 2017–18 సీజన్లో 96.20 లక్షలకు పడిపోయింది. ఈసారి ఇంకాస్త పడిపోవడం గమనార్హం. అయితే రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014–15లో తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కేవలం 72.18 లక్షల టన్నులు మాత్రమే. ఆ తర్వాత 2015–16లో ఇంకా తగ్గి 51.45 లక్షల టన్నులకు పడిపోయింది. అయితే అప్పటినుంచి పెరుగుతూనే వస్తుంది. వర్షాలు, సీజన్లను బట్టి ఉత్పత్తి వత్యాసాలు ఉన్నా, పరిస్థితి మెరుగ్గానే ఉందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. -
భారీగా తగ్గిన ఆహార ధాన్యాల దిగుబడి
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని మరాఠ్వాడలో జూన్ ఐదవ తేదీన జల్లులు కురియడంతో తొలకరి జల్లులంటూ స్థానిక పత్రికలన్నీ పెద్ద పెద్ద హెడ్డింగ్లతో వార్తను రాశాయి. 2017, ఆగస్టు 17వ తేదీ తర్వాత వర్షపు జల్లులు చూడడం వారు ఇదే మొదటి సారి. 2016 సంవత్సరం తర్వాత ఎప్పుడు భారీ వర్షాలు కురిశాయో మాత్రం అక్కడి ప్రజలకు గుర్తు కూడా లేదు. ఈసారి వర్షాలు పడకపోతే పంటను వదులుకోవాలని రైతులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆహార ధాన్యాల దిగుబడి కూడా బాగా పడిపోయింది. 2018 చలికాలపు ఆహార ధాన్యాల దిగుబడి గతేడాదితో పోలిస్తే 63 శాతం పడిపోయింది. చిరుధాన్యాలు 68 శాతం, పప్పులు 51 శాతం, నూనె గింజలు 70 శాతం, గోధుమ 61 శాతం, మొక్కజొన్నలు 75 శాతం, నువ్వుల దిగుబడి 92 శాతం పడిపోయాయి. ఈసారి దిగుబడుల గురించి ప్రశ్నించగా, పంటలు వేసే పరిస్థితులేవంటుంటే ఇంక దిగుబడులు ఎలా ఉంటాయని మెట్టసాగు వ్యవసాయంలో ఆరితేరిన కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి విజయ్ అన్నా బరేడ్ వ్యాఖ్యానించారు. ఒక్క మరాఠ్వాడలోనే కాకుండా, విదర్భ, తెలంగాణలో కూడా ఈ సారి మెట్టసాగుపై రైతులు ఆశలు వదులుకున్నారు. గతంలో రుతుపవనాల కాలంలో వర్షపాతం 80 నుంచి 90 శాతం వర్షం కురిసేదని, వాతావరణ మార్పుల కారణాల వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయని స్థానిక శాస్త్రవేత్తలు తెలిపారు.