రాష్ట్ర ప్రభుత్వం 2013- 14 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్)కు సంబంధించి ధాన్యం - బియ్యం సేకరణ విధానాన్ని సోమవారం ప్రకటించింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2013- 14 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్)కు సంబంధించి ధాన్యం - బియ్యం సేకరణ విధానాన్ని సోమవారం ప్రకటించింది. క్వింటాల్ గ్రేడ్ ‘ఎ’ ధాన్యానికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) రూ.1,345గా, సాధారణ రకానికి ఎంఎస్‌పీ రూ.1,310గా పేర్కొంది. సమయానుకూలంగా కేంద్ర ప్రభుత్వం చేసే సవరణల ప్రకారం ఈ ధరలో కొంచెం వ్యత్యాసం ఉండవచ్చని తెలిపింది. ఇంత స్పష్టంగా ప్రకటన చేసిన ప్రభుత్వం సన్నరకాల ధాన్యానికి ప్రోత్సాహక ధర అంశాన్ని అసలు ప్రస్తావించకపోవడం గమనార్హం. ధాన్యం సేకరణకు సన్నద్ధతపై ఈ వారంలోనే జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున ప్రోత్సాహక ధరను అమలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. అయితే ధాన్య సేకరణ విధానంలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. ధాన్యం, బియ్యం సేకరణలో అనుసరించాల్సిన విధి విధానాలకు సంబంధించిన ఉత్తర్వులను పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి సునీల్‌శర్మ సోమవారం జారీ చేశారు. ముఖ్యమైన వివరాలిలా ఉన్నాయి..
2013-14 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి లెవీ బియ్యం, కస్టమ్ మిల్డ్(ప్రభుత్వమే ధాన్యం కొని మిల్లింగ్ చేయించడం) బియ్యం సేకరణ ధరలను ప్రభుత్వం తర్వాత తెలియజేస్తుంది. కేంద్రం ఇంకా ప్రకటించనందున ప్రస్తుతానికి రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ 2012- 13 కేఎంఎస్‌లో అమలు చేసిన లెవీ బియ్యం ధరలనే చెల్లిస్తుంది. కేంద్రం కొత్త ధరలు ప్రకటించిన తర్వాత తదనుగుణంగా ఇప్పటి కొనుగోళ్లకు కూడా చెల్లింపులను సవరిస్తుంది.
రైస్‌మిల్లర్లు ధాన్యం సేకరించి ఆడించగా వచ్చిన బియ్యంలో 75 శాతాన్ని లెవీ కింద పౌరసరఫరాల శాఖకు ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన 25 శాతం బియ్యాన్ని లెవీ ఫ్రీ కింద బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. రైస్ మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు చెక్కుల ద్వారానే చెల్లింపులు జరపాలి.
రైస్ మిల్లర్లు ఈ సీజన్‌లో (ఈనెల ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ) 80 లక్షల టన్నుల బియ్యాన్ని లెవీ కింద ఎఫ్‌సీఐ/రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కేంద్రం నిర్ణయించిన ధరకు అందించాల్సి ఉంటుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అంగీకరించిన మేరకు వారు సేకరించిన సూపర్ ఫైన్ బియ్యంలో ఒక శాతాన్ని సరసమైన ధరలకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలకు అందించాలి.
రైస్‌మిల్లర్లు ఎంఎస్‌పీకే ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లుగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల నుంచి సర్టిఫికెట్లు తీసుకోవాలి.
ధాన్యం సేకరణ ప్రగతిని కలెక్టర్లు ప్రతివారం జిల్లా స్థాయిలో సమీక్షించి పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు నివేదికలు పంపాల్సి ఉంటుంది. అలాగే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లా సేకరణ కమిటీని ఏర్పాటు చేయాలి.
4 శాతానికి మించి రంగుమారిన, 17 శాతం మించి తేమ ఉన్న ధాన్యానికి ఎంఎస్‌పీ వర్తించదు. తేమ శాతం 17కు లోపు ఉంటేనే ఎంఎస్‌పీ చెల్లించాల్సి ఉంటుంది. అంతకు మించి తేమ శాతం ఉంటే ఎంఎస్‌పీలో కోత ఉంటుంది.