కీవ్: ఆహార సంక్షోభాన్ని అడ్డుకునేందుకు నల్ల సముద్రం మీదుగా ఆహార ధాన్యాలను చేరవేసేలా రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అయితే.. ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఆ మరుసటి రోజే ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టుపై రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేందుకు ఈ నౌకాశ్రయమే కీలకం కాగా.. దానిపైనే దాడులు జరగటం గమనార్హం. శుక్రవారం నాటి ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్‌లో నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సాతో పాటు మరో రెండు రేవుల నుంచి ఎగుమతులు ప్రారంభంకావాల్సి ఉంది.
తాజాగా ఆయా ఓడ రేవులపై మాస్కో క్షిపణులు దాడి చేశాయంటూ స్థానిక ఎంపీ ఒలెక్‌సీ గొంచరెంకో విమర్శలు చేశారు. మొత్తం నాలుగు మిసైల్స్ ప్రయోగించగా.. వాటిలో రెండింటిని అడ్డుకున్నట్లు చెప్పారు. ఒడెస్సా పోర్టుపై దాడి ఘటనలో పలువురు గాయపడినట్లు వెల్లడించారు. ఒడెస్సాలో ఆరు పేలుడు ఘటనలు జరిగాయన్నారు. ‘ఒడెస్సా పోర్టుపై మాస్కో దళాలు దాడులు చేశాయి. ఒప్పందం చేసుకుని ఒక్క రోజు గడవకముందే ఈ ఘటన జరగటంతో ఒప్పందాల విషయంలో రష్యా వైఖరి స్పష్టమవుతోంది. ఒడెస్సాను కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయండి. రష్యాకు బలప్రదర్శన మాత్రమే అర్థమవుతుంది.’ అని ట్వీట్ చేశారు.
మరోవైపు.. ధాన్యం ఎగుమతుల ఒప్పందం విషయంలో ఏదైనా విఘాతం కలిగితే.. తద్వారా ఏర్పడే ఆహార సంక్షోభానికి రష్యాదే పూర్తి బాధ్యత అని ఉక్రెయిన్ విదేశాంగ ప్రతినిధి ఓలెగ్ నికొలెంకో పేర్కొన్నారు. ఐరాస, తుర్కియేలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడేందుకు రష్యాకు 24 గంటలూ పట్టలేదంటూ మండిపడ్డారు. మరోవైపు.. ఈ దాడిని ఖండించారు ఐరోపా సమాఖ్య విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి జోసెప్ బోరెల్. ఒప్పందం జరిగిన మరుసటి రోజునే కీలక పోర్ట్‌పై దాడి చేయటం అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల పట్ల రష్యా వైఖరి స్పష్టమవుతోందన్నారు.
ఇదీ చదవండి: రెండేళ్ల క్రితమే మృతి.. ప్రతినెలా ఓనర్‌కు రెంట్ చెల్లిస్తున్న మహిళ!
Comments
Please login to add a commentAdd a comment