Russia attacks
-
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి
కీవ్: ఉక్రెయిన్ సైనిక మౌలిక వసతులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా శుక్రవారం 93 క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడికి తెగబడింది. ఏకంగా 200 డ్రోన్లతో దాడి చేసింది. గత మూడేళ్లలో రష్యా ఒకే రోజులో చేసిన అతిపెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా నుంచి దూసుకొచ్చిన వాటిల్లో 11క్రూయిజ్ క్షిపణులుసహా 81 మిస్సైళ్లను పశి్చమదేశాలు అందించిన ఎఫ్–16 యద్ధవిమానాల సాయంతో నేలమట్టంచేశామని ఆయన చెప్పారు. ‘‘ పెనుదాడులతో ఉక్రేనియన్లను భయపెడుతున్న రష్యాకు, పుతిన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. పెద్ద ప్రతిఘటన, భారీ ఎదురుదాడితో రష్యా ఉగ్రచర్యలను అడ్డుకుందాం’’ అని జెలెన్స్కీ తన టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా చెప్పారు. ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామికవాడల్లో ఇంధన, శక్తి వనరులు, మౌలిక వసతులను ధ్వంసంచేయడమే లక్ష్యంగా తమ సైన్యం దాడులు చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమ బొగ్గు విద్యుత్ ఉత్పత్తికేంద్రాలకు భారీ నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రైవేట్ విద్యుత్ సంస్థ డీటెక్ తెలిపింది. ఉక్రెయిన్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారీని నిలువరించడమే లక్ష్యంగా ఇంధన వ్యవస్థలపైనే రష్యా తరచూ దాడులుచేస్తుండటం తెల్సిందే. నవంబర్ 28న చేసిన ఇలాంటి దాడిలో 200 మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. నాటి నష్టం కారణంగా 10 లక్షల కుటుంబాలు అంధకారంలో ఉండిపోయాయి. -
యుద్ధానికి తెర దించేందుకు..రష్యా రెడీ!
రెండున్నరేళ్లు దాటిన యుద్ధం. కనీవినీ ఎరగని విధ్వంసం. ఇరువైపులా లెక్కకైనా అందనంత ఆస్తి, ప్రాణనష్టం. యుద్ధంలో నిజమైన విజేతలంటూ ఎవరూ ఉండరని ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నిరూపిస్తోంది. అగ్ర రాజ్యపు అపార ఆర్థిక, సాయుధ సంపత్తి ముందు ఏ మూలకూ చాలని ఉక్రెయిన్ యుద్ధంతో కకావికలైంది. ఆర్థికంగా, సైనికంగా మాత్రమే గాక జనాభాపరంగా, అన్ని రకాలుగానూ దశాబ్దాలు గడిచినా కోలుకోలేనంతగా నష్ట పోయింది. అమెరికా, యూరప్ దేశాల ఆర్థిక, సాయుధ దన్నుతో నెట్టుకొస్తున్నా ట్రంప్ రాకతో ఆ సాయమూ ప్రశ్నార్థకంగా మారేలా కన్పిస్తోంది. అదే జరిగితే చేతులెత్తేయడం మినహా దాని ముందు మరో మార్గం లేనట్టే. ఇంతటి యుద్ధం చేసి రష్యా కూడా సాధించిన దానికంటే నష్టపోయిందే ఎక్కువ. అందులో ముఖ్యమైనది సైనిక నష్టం. యుద్ధంలో ఇప్పటికే ఏకంగా 2 లక్షల మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి! దీనికి తోడు కనీసం మరో 5 లక్షల మంది సైనిక విధులకు పనికిరానంతగా గాయపడ్డట్టు సమాచారం. ఇది ఆ దేశానికి కోలుకోలేని దెబ్బే. యువతను నిర్బంధంగా సైన్యంలో చేర్చుకునే ప్రయత్నాలూ పెద్దగా ఫలించడం లేదు. యుద్ధ భూమికి పంపుతారనే భయంతో రష్యా యువత భారీ సంఖ్యలో వీలైన మార్గంలో దేశం వీడుతోంది. దాంతో సైనికుల కొరత కొన్నాళ్లుగా రష్యాను తీవ్రంగా వేధిస్తోంది. మరో దారి లేక సైన్యం కోసం ఉత్తర కొరియా వంటి దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి! దీనికి తోడు సుదీర్ఘ యుద్ధం కారణంగా ప్రధానమైన ఆయుధ నిల్వలన్నీ దాదాపుగా నిండుకోవడంతో రష్యాకు ఎటూ పాలుపోవడం లేదు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ఇంకా కొనసాగించే విషయంలో స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే రుజువైంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి ఏదో రకంగా తెర పడాలని ఉక్రెయిన్‌తో పాటు రష్యా కూడా కోరుకుంటున్నట్టు సమాచారం. ఇటీవలి పుతిన్ ఉన్నత స్థాయి భేటీలో ఈ అంశమూ చర్చకు వచ్చిందంటున్నారు.ఇవీ షరతులు...→ భూతల యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యానికి గతంలోలా కొన్నాళ్లుగా పెద్దగా ప్రతిఘటన ఎదురవడం లేదు.→ దాంతో నెనెట్స్క్ తదితర ఉక్రెయిన్ భూభాగాల్లోకి రష్యా నానాటికీ మరింతగా చొచ్చుకుపోతోంది.→ కానీ ఇందుకు చెల్లించుకోవాల్సి వస్తున్న సైనిక, ఆయుధ మూల్యం తదితరాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆలోచనలో పడేసినట్టు వార్తలొస్తున్నాయి. ఏదోలా ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెర దించేందుకే ఆయన మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.→ కొన్ని ప్రధాన షరతులకు ఉక్రెయిన్ అంగీకరించే పక్షంలో యుద్ధా్దన్ని నిలిపేసేందుకు పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.→ ఆక్రమిత ప్రాంతాలకు తోడు మరింత భారీ భూభాగాన్ని ఉక్రెయిన్ తమకివ్వాలని పుతిన్ పట్టుబడుతున్నారు.→ అది కనీసం అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన వర్జీనియా పరిమాణంలో ఉండాలని కోరుతున్నారు.→ ఉక్రెయిన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో సభ్యత్వం ఇవ్వరాదని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ డిమాండ్‌ను నాటో పరిగణనలోకే తీసుకోవద్దని కోరుతున్నారు. యుద్ధంలో మరణించిన రష్యా సైనికులు: 1.5 లక్షల నుంచి 2లక్షలుగాయపడ్డ సైనికులు: 5 లక్షల పైచిలుకువామ్మో సైన్యం!రష్యా యువతలో వణుకుసైన్యంలో చేరడమనే ఆలోచనే రష్యా యువతకు పీడకలతో సమానం! కొత్తగా చేరేవారిని వేధించడంలో రష్యా సైనికుల ట్రాక్ రికార్డు సాధారణమైనది కాదు! రిటైరైన తర్వాత కూడా వాటిని గుర్తుకు తెచ్చుకుంటూ వణికిపోయే పరిస్థితి! వాటి బారిన పడే బదులు బతికుంటే బయట బలుసాకైనా తినొచ్చని రష్యా యూత్ భావిస్తుంటారు. డెడొవ్షినా అని పిలిచే ఈ వేధింపుల జాఢ్యం ఇప్పటిది కాదు. రష్యా సైన్యంలో 17వ శతాబ్దం నుంచే ఉందని చెబుతారు. దీనికి భయపడి రష్యా యువత సైన్యంలో చేరకుండా ఉండేందుకు వీలైనంతగా ప్రయత్నిస్తుంటుంది. ఉక్రెయిన్ యుద్ధంలో కనీవినీ ఎరగనంత సైనిక నష్టం జరుగుతుండటంతో భారీగా రిక్రూట్మెంట్కు రష్యా రక్షణ శాఖ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. యువతీ యువకులకు వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా సైన్యంలో చేరాలని పేర్కొనే ‘డ్రాఫ్ట్ నోటీస్’ పంపిస్తోంది. దాంతో సైనిక జీవితాన్ని తప్పించుకునేందుకు రష్యా యువత లక్షలాదిగా విదేశాల బాట పట్టారు. అలా వెళ్లలేని వారిలో చాలామంది ఫేక్ మెడికల్‌గా అన్‌ఫిట్ సర్టిఫికెట్లు సమర్పిస్తుంటారు. ఆ క్రమంలో అవసరమైతే తమ ఎముకలు తామే విరగ్గొట్టుకుంటారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! దాంతో చెచెన్యా, యకుట్జియా, దగెస్తాన్ వంటి సుదూర ప్రాంతాల నుంచి సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన యువతను రక్షణ శాఖ కొన్నాళ్లుగా ప్రధానంగా టార్గెట్ చేస్తోంది. ఖైదీలను నిర్బంధంగా సైన్యంలో చేరుస్తోంది. ఇలాంటి వారిని సైన్యంలో దారుణంగా చూస్తున్నారు. చనిపోతే మృతదేహాలను గుర్తించి గౌరవప్రదంగా కుటుంబీకులకు అప్పగించే పరిస్థితి కూడా ఉండటం లేదు! దీనికి తోడు రష్యాలో మామూలుగానే సైనికులు దారుణమైన పరిస్థితుల్లో పని చేయాల్సి ఉంటుంది. వారికి అత్యంత అవసరమైన పౌష్టికాహారానికే దిక్కుండదు! పైగా సరైన వైద్య సదుపాయమూ అందదు. సంక్షేమం దేవుడెరుగు, చివరికి సైనికుల భద్రతకు కూడా ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యమివ్వదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మామూలు సమయాల్లోనే పరిస్థితి ఇలా ఉంటుందంటే ఇక యుద్ధ సమయాల్లోనైతే సైనికుల భద్రత, సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ సర్కారు అక్షరాలా గాలికే వదిలేస్తుంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
15 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. కారణం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న మొత్తం 275 కంపెనీలకు సంబంధించి ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా భారత్, చైనా, స్విట్జర్లాండ్, తుర్కియేకు చెందిన సంస్థలుండడం గమనార్హం.ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సైనికపరంగా ప్రత్యేక్షంగా, పరోక్షంగా సాయం చేస్తున్న కంపెనీలపై అమెరికా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 275 కంపెనీలు రష్యాకు సహకరిస్తున్నాయని అమెరికా భావిస్తోంది. దాంతో ఉక్రెయిన్‌కు నష్టం వాటిల్లుతున్నట్లు అమెరికా అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టినట్లు యూఎస్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: డ్రోన్ కొనుగోలుకు రూ.8 లక్షలు సాయంఅమెరికా ఆంక్షలు విధించిన భారత్‌కు చెందిన 15 కంపెనీల జాబితాను విడుదల చేశారు. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.అభర్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్డెన్వాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ఎమ్సిస్టెక్గెలాక్సీ బేరింగ్స్ లిమిటెడ్ఆర్బిట్ ఫిన్‌ట్రేడ్ ఎల్ఎల్పీఇన్నోవియో వెంచర్స్కేడీజీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ఖుష్బూ హోనింగ్ ప్రైవేట్ లిమిటెడ్లోకేష్ మెషీన్స్ లిమిటెడ్పాయింటర్ ఎలక్ట్రానిక్స్ఆర్ఆర్జీ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్షార్ప్లైన్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్శ్రీఘీ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్శ్రేయ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ -
గూగుల్ ఆస్తులమ్మినా తీరనంత జరిమానా!
గూగుల్‌కు రష్యా కోర్టు భారీ షాకిచ్చింది. 20 డెసిలియన్ డాలర్లు (20,000,000,000,000,000,000,000,000,000,000,000 డాలర్లు) జరిమానా చెల్లించాలని మాస్కో కోర్టు టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌ను ఆదేశించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభ సమయంలో సంస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఇందుకు కారణమని కోర్టు తెలిపింది. ఈమేరకు రష్యా మీడియా సంస్థ ఆర్బీసీ(రాస్బైజెన్స్ కన్సల్టింగ్) వివరాలు వెల్లడించింది.ఆర్బీసీ తెలిపిన వివరాల ప్రకారం..‘మాస్కో కోర్టు గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. కంపెనీ 20 డెసిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ రష్యాకు చెందిన 17 టీవీ ఛానెళ్లు, మీడియా ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022లో ఉక్రెయిన్‌పై దాడికి ఆదేశించిన తర్వాత ఈ ఛానెళ్లపై వేటు వేశారు. అందుకు వ్యతిరేకంగా మీడియా ఛానళ్లు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు న్యాయపరమైన అంశాలకు లోబడి గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. కోర్టు తీర్పు ప్రకారం గూగుల్ బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లను తొమ్మిది నెలల్లోపు పునరుద్ధరించవలసి ఉంటుంది’ అని పేర్కొంది.‘గూగుల్ మరింత మెరుగవ్వాలి’క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ అంశంపై మాట్లాడారు. ‘గూగుల్‌పై నిర్దిష్టంగా ఎంతమొత్తం జరిమానా విధించారో కచ్చితంగా చెప్పలేను. గూగుల్ మా దేశ కంపెనీలపై ఆంక్షలు విధించడం సరైన విధానం కాదు. మీడియా సంస్థలు, బ్రాడ్కాస్టర్ల హక్కులను హరించకూడదు. కోర్టు నిర్ణయంతో గూగుల్ తన పరిస్థితిని మరింత మెరుగు పరుచుకునేందుకు వీలుంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.2020లోనే కొన్ని ఛానెళ్లపై వేటుగూగుల్ రష్యాలోని ప్రైవేట్ మిలిటరీ సంస్థ వాగ్నర్ గ్రూప్ మెర్సెనరీ చీఫ్ ప్రిగోజిన్, ఒలిగార్చ్ మలోఫీవ్లకు చెందిన ఛానెళ్లను 2020లో బ్లాక్ చేసినట్లు రష్యాకు చెందిన ఎన్బీసీ న్యూస్ ఛానల్ తెలిపింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో యూట్యూబ్ మరిన్ని ఛానెళ్లను నిషేధించిందని పేర్కొంది.రష్యా గూగుల్ ఎల్ఎల్సీ దివాలా!గూగుల్ మార్కెట్ విలువ మొత్తంగా అక్టోబర్ నాటికి 2.15 ట్రిలియన్ డాలర్లు(రూ.179 లక్షల కోట్లు)గా ఉంది. కానీ కంపెనీకి విధించిన జరిమానా చాలా రెట్లు ఎక్కువ. గూగుల్ రష్యాలోని తన అనుబంధ సంస్థ ‘గూగుల్ ఎల్ఎల్సీ’ దివాలా కోసం జూన్ 2022లో దాఖలు చేసింది. కానీ దాని పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కోర్టు పేర్కొంది.(Apple: భారత్‌లో కొత్తగా నాలుగు అవుట్లెట్లు!)గూగుల్ స్పందన ఇదే..‘రష్యాతో కొన్ని చట్టపరమైన అంశాలపై చర్చించాల్సి ఉంది. బ్లాక్ చేసిన ఛానెళ్లకు సంబంధించి కోర్టు కాంపౌండింగ్ పెనాల్టీలను విధించింది. అదే తుది నిర్ణయంగా జరిమానా కట్టాలని పేర్కొంటుంది. దీనిపై రష్యా జ్యుడిషియరీలో చర్చించాల్సి ఉంది. ఈ అంశాలు కంపెనీ విధానాలపై ఎలాంటి ప్రభావం చూపవు’ అని తెలిపింది. -
ఉక్రెయిన్‌పై దాడులు.. పుతిన్ దళంలోకి ‘కిమ్’ సైన్యం
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండేళ్లకు పైగా సాగుతున్న దాడుల్లో రెండు దేశాల సైన్యం వీరోచితంగా పోరాడుతూనే ఉంది. ఇప్పటికే ఈ యుద్ధంలో ఎంతో మంది చనిపోయారు. ఈ పోరులో ఉక్రెయిన్ సైన్యం.. రష్యా భూభాగంలో అడుగుపెట్టింది. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు ఇప్పటికే పలు దేశాలు ముందుకు వచ్చాయి. మరోవైపు.. రష్యాకు సాయం చేసేందుకు ఉత్తర కొరియా బలగాలు రంగంలోకి దిగాయి.ఉక్రెయిన్‌తో యుద్ధంలో మరింతగా పోరాడేందుకు ఉత్తర కొరియా తన బలగాలను రష్యాలోకి తరలిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా నాటో వెల్లడించింది. ఇప్పటికే రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కిమ్ బలగాలను మోహరించినట్లు నాటో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో కొన్ని బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మీడియాకు తెలిపారు. ఇక, ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఇది రెండు మధ్య యుద్ధాన్ని మరింత ప్రోత్సహిస్తుందని అన్నారు.NATO confirms North Korean troops have been sent to Russia to support its war in Ukraine. This marks a dangerous escalation, violating UN resolutions and risking global security. As Putin turns to Pyongyang for military aid, democracies must unite to uphold peace and security.… pic.twitter.com/kHT1g57y68— Pete (@splendid_pete) October 28, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉత్తర కొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే పుతిన్.. ఉక్రెయిన్‌పై పోరుకు నార్త్ కొరియా సాయం కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. అందులో భాగంగానే ఉత్తర కొరియా సైన్యం రష్యాకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కొద్ది రోజుల క్రితమే ఉత్తర కొరియా సైన్యంలోకి భారీగా యువత వచ్చి చేరారు.మరోవైపు.. రష్యాలోకి కిమ్ సేన ప్రవేశించే అంశంపై ఇటీవల అమెరికా స్పందించింది. ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. కచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోనుందో అనే చర్చ కూడా జరుగుతోంది. -
రష్యా యుద్ధం ఆగాలంటే అదొక్కటే మార్గం: జెలెన్ స్కీ
కీవ్: ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రష్యాపై ఉక్రెయిన్ సైన్యం దాడులను తీవ్రతరం చేసింది. ఇదే సమయంలో రష్యా బలగాలు కూడా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్క్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం వారి దాడులను ఆపగలిగే అవకాశముందని చెప్పుకొచ్చారు.ఇక, తాజాగా ఓ వీడియోలో జెలెన్ స్కీ మాట్లాడుతూ.. రష్యాపై దాడులను తీవ్రతరం చేసి ఆస్తులను ధ్వంసం చేసినప్పుడు మాత్రమే వారు వెనక్కి తగ్గుతారు. అప్పుడు యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. రష్యా భూభాగంలో సైనిక లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఉక్రెయిన్ సైన్యానికి అనుమతించాలని అమెరికాను కోరారు. రష్యాలో సుదూర క్షిపణులు ప్రయోగించడానికి తమకు అనుమతి ఇవ్వాలన్నారు. ఈ విషయమై తమ భాగస్వామ్య దేశాలతో చర్చిస్తున్నామని, వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కూడా ప్రస్తావించారు. ఈనెల 30వ తేదీన ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడిలో ఆరుగురు పౌరులు మరణించారు. 97 మంది గాయపడ్డారని చెప్పారు. Il discorso del Presidente d’Ucraina Volodymyr Zelenskyy. pic.twitter.com/5UzBII0WdS— Ukr Embassy to Italy (@UKRinIT) September 1, 2024 ఇదిలా ఉండగా.. ఆగస్టు 30-31 తేదీల్లో ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్టెమ్ ఉమరోవ్ వాషింగ్టన్లో అమెరికా అధికారులు, నిపుణులతో సమావేశమయ్యారు. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు కావాల్సిన ఆయుధాలు గురించి చర్చించారు. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్ సైన్యం రష్యా భూభాగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. -
Russia-Ukraine war: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా
కీవ్: దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. సోమవారం ఉదయం నుంచి పలు నగరాల్లోని మౌలిక వనరులు, విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా వివిధ రకాలైన 40 వరకు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో కనీసం 31 మంది చనిపోగా మరో 154 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కీవ్‌లోని చిన్నారుల ఆస్పత్రి సహా పలు నివాస ప్రాంతాలపై క్షిపణులు పడటంతో భారీగా పేలుళ్లు సంభవించాయి. పలు చోట్ల మంటలు వ్యాపించాయి. రాజధాని కీవ్‌లోని 10 జిల్లాలకు గాను ఏడు జిల్లాల్లో జరిగిన దాడుల్లో 14 మంది చనిపోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మూడంతస్తుల నివాస భవనం పూర్తిగా ధ్వంసమైంది. మరో నగరం క్రివ్యి రిహ్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 47 మంది గాయపడ్డారు. కీవ్‌లోని రెండంతస్తుల చిన్నారుల ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఆపరేషన్ థియేటర్, ఆంకాలజీ విభాగం దెబ్బతిన్నాయి. ఆస్పత్రిలోని పదంతస్తుల ప్రధాన భవనం కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ఘటన నేపథ్యంలో ఆస్పత్రిలో వారందరినీ ఖాళీ చేయిస్తున్నారు. ఆస్పత్రిపై దాడిలో ఏడుగురు చిన్నారులు సహా 16 మంది గాయపడినట్లు మేయర్ విటాలి క్రిట్్చకో చెప్పారు. ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగల హైపర్సోనిక్ కింఝాల్ మిస్సైళ్లు కూడా ఉన్నాయని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. మొత్తం 40 క్షిపణుల్లో 30 వరకు కూల్చి వేశామని, వీటిలో కింఝాల్ రకానివి 11 ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించేందుకు గల అవకాశాల్ని పరిశీలించేందుకు వాషింగ్టన్లో నాటో దేశాలు మంగళవారం భేటీ అవుతున్న వేళ రష్యా భారీ దాడులకు పూనుకుందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రిపై దాడిని జర్మనీ, చెక్ రిపబ్లిక్ తీవ్రంగా ఖండించాయి. అయితే, తాము ఉక్రెయిన్ రక్షణ, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని రష్యా ఆర్మీ పేర్కొంది. ఉక్రెయిన్ క్షిపణి రక్షణ వ్యవస్థల వల్లే ఆస్పత్రికి నష్టం వాటిల్లినట్లు తెలిపింది. -
G7 Summit 2024: జీ7 ప్యాకేజీ ఎప్పుడు? ఎలా?
28 నెలలుగా కొనసాగుతున్న రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ చాలావరకు ధ్వంసమైంది. యుద్ధం ఆగేదెన్నడో, ఉక్రెయిన్ పునరి్నర్మాణం మొదలయ్యేదెప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జీ7 దేశాల కూటమి 50 బిలియన్ డాలర్ల (రూ.4.17 లక్షల కోట్లు) రుణ ప్యాకేజీని ప్రకటించడం ఉక్రెయిన్‌కు ఎంతగానో ఊరట కలిగించే పరిణామం అనే చెప్పాలి. వివిధ దేశాల్లో ఉన్న రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయం నుంచే ఈ ప్యాకేజీని ఉక్రెయిన్‌కు ఇవ్వనున్నట్లు జీ7 దేశాలు వెల్లడించాయి. దీనిపై ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ విజేతగా నిలవడానికి ఈ సాయం ఒక గొప్ప ముందడుగు అని అభివరి్ణంచారు. ఈ నేపథ్యంలో జీ7 ప్రకటించిన రుణ ప్యాకేజీ, ఉక్రెయిన్‌కు కలిగే లబ్ధి, ఇందులో ఇమిడి ఉన్న ఇబ్బందులు, వివిధ దేశాలు స్తంభింపజేసిన రష్యా ఆస్తుల గురించి తెలుసుకుందాం. 2022 ఫిబ్రవరిలో రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై హఠాత్తుగా దాడికి దిగింది. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ సైతం ఎదురుదాడి ప్రారంభించింది. ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. వేలాది మంది సామాన్య ప్రజలు, సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలంటూ పశి్చమ దేశాలు హెచ్చరించినా రష్యా లెక్కచేయడం లేదు. దీంతో రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టడానికి తమ దేశంలో ఉన్న రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను పశి్చమ దేశాలు స్తంభింపజేశాయి. ఈ ఆస్తుల విలువ 300 బిలియన్ డాలర్ల (రూ.25.06 లక్షల కోట్లు) వరకు ఉంటుంది. వీటిపై ప్రతి సంవత్సరం 3 బిలియన్ డాలర్ల (రూ.25 వేల కోట్లు) వడ్డీ, ఆదాయం లభిస్తోంది. రష్యా ఆస్తులు చాలావరకు ఐరోపా దేశాల్లో ఉన్నాయి. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నందుకు రష్యా పరిహారం చెల్లించాల్సిందేనని అమెరికా సహా పశి్చమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు రష్యా ఒప్పుకోవడం లేదు. దాంతో రష్యా ఆస్తులపై వస్తున్న వడ్డీని, ఆదాయాన్ని పరిహారం కింద ఉక్రెయిన్‌కు ఇవ్వాలని తాజాగా జీ7 దేశాలు నిర్ణయించాయి. ఇబ్బందులు ఏమిటి? విదేశాల్లో ఉన్న ఆస్తులు ఒకవేళ మళ్లీ రష్యా నియంత్రణలోకి వస్తే రుణాన్ని తిరిగి చెల్లించడం కష్టమే. స్తంభింపజేసిన రష్యా ఆస్తులను శాంతి చర్చల్లో భాగంగా విడుదల చేయాల్సి వస్తే రుణాన్ని చెల్లించడానికి జీ7 దేశాలు మరో మార్గం వెతుక్కోవాలి. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రష్యా ఆస్తులపై కొన్నిసార్లు అనుకున్నంత వడ్డీ గానీ, ఆదాయం గానీ రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులెదురవుతాయి. అలాగే రుణ భారాన్ని జీ7 దేశాలన్నీ పంచుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మరో వారం రోజుల్లో తుది ప్రణాళికను ఖరారు చేయనున్నారు. యూరప్‌లోని రష్యా ఆస్తులపై ఆంక్షలను కొనసాగించడానికి ప్రతిఏటా యూరోపియన్ యూనియన్(ఈయూ)లో ఓటింగ్ జరుగుతోంది. ఈయూలోని ఏ ఒక్క సభ్యదేశం వీటో చేసినా ఆంక్షలు రద్దవుతాయి. ఆస్తులు రష్యా అ«దీనంలోకి వెళ్లిపోతాయి. ఈయూలోని హంగేరీ దేశం ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోంది. ఒకవేళ హంగేరీ వీటో చేస్తే ఉక్రెయిన్ రుణ ప్యాకేజీ ప్రణాళికలు మొత్తం తలకిందులవుతాయి. తమ ఆస్తులపై వచ్చే వడ్డీని, ఆదాయాన్ని పశి్చమ దేశాలు మింగేస్తామంటే రష్యా చూస్తూ కూర్చోదు కదా! కచ్చితంగా ప్రతీకార చర్యలకు దిగుతుంది. రష్యాలోనూ పశి్చమ దేశాల ఆస్తులున్నాయి. వాటిని రష్యా ప్రభుత్వం గతంలోనే స్తంభింపజేసింది. తమ ఆస్తులపై వడ్డీని కాజేసినందుకు ప్రతిచర్యగా పశ్చిమదేశాల ఆస్తులపై వడ్డీని సైతం రష్యా లాక్కొనే అవకాశం లేకపోలేదు. హక్కులు బదిలీ చేయడం సాధ్యమేనా? రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయాన్ని నష్టపరిహారంగా ఉక్రెయిన్‌కు ఇవ్వాలనుకోవడం బాగానే ఉన్నప్పటికీ ఇందులో చట్టపరమైన అవరోధాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రష్యా అంగీకారం లేకుండా ఇలా చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంటున్నారు. మొండిగా ముందుకెళ్తే తీవ్ర వివాదానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తొలుత న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఒక దేశానికి సంబంధించిన ఆస్తులను స్తంభింపజేసిప్పటికీ వాటిపై హక్కులను ఇతర దేశాలకు బదిలీ చేయడం సాధ్యం కాదు. అవి ఎప్పటికైనా సొంత దేశానికే చెందుతాయి. భౌగోళికంగా తమ దేశంలో ఉన్న ఇతర దేశాల ఆస్తులను ఆయా దేశాల అనుమతి లేకుండా స్వా«దీనం చేసుకొని అనుభవిస్తామంటే కుదరదు. రష్యా ఆస్తులను ఎలా వాడుకోవచ్చు? రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్‌కు ఇచ్చేసే అవకాశం లేదు. జీ7లోని ఏ దేశమైనా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకొని ఆ సొమ్మును ఉక్రెయిన్‌కు ఇవ్వొచ్చు. రుణాన్ని తీర్చేయడానికి రష్యా ఆస్తులపై వస్తున్న వడ్డీ, ఆదాయాన్ని చెల్లించవచ్చు. తమకు అందే సొమ్మును ఆయుధాలు కొనుగోలు చేయడానికి, దేశ పునరి్నర్మాణానికి ఉక్రెయిన్ ఉపయోగించుకొనేందుకు ఆస్కారం ఉంది. జీ7 నుంచి రుణ ప్యాకేజీ ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌కు చేరే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి రాబోయే పదేళ్లలో 486 బిలియన్ డాలర్లు (రూ.40.58 లక్షల కోట్లు) అవసరం. ఇది ముమ్మాటికీ దొంగతనమే: పుతిన్ రష్యా ఆస్తులపై వచ్చే ఆదాయంతో ఉక్రెయిన్‌కు ప్యాకేజీ ఇవ్వాలన్న జీ7 దేశాల నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ దొంగతనమేనని చెప్పారు. చోరులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తమ ఆస్తుల జోలికి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. పుతిన్ శుక్రవారం రష్యా విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జీ7 దేశాల నిర్ణయంపై చర్చించారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా దొంగతనం కచ్చితంగా దొంగతనమే అవుతుందన్నారు. జీ7 దేశాల నిర్ణయాన్ని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా శుక్రవారం ఖండించారు. ఈ నిర్ణయం చట్టపరంగా చెల్లదని తేలి్చచెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Russia-Ukraine war: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో దాడులు..
కీవ్: ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమణలో ఉన్న ఖెర్సన్, లుహాన్స్క్లపై జరిగిన దాడుల్లో కనీసం 28 మంది మృతి చెందారు. ఖెర్సన్‌లోని సడోవ్ పట్టణంపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన గైడెడ్ బాంబు, క్షిపణి దాడుల్లో 22 మంది చనిపోగా మరో 15 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. అదేవిధంగా, లుహాన్స్క్ నగరంపై శుక్రవారం జరిగిన దాడిలో మరో రెండు మృతదేహాలు బయటపడటంతో మరణాల సంఖ్య ఆరుకు చేరిందని స్థానిక అధికారులు శనివారం వెల్లడించారు. దీంతోపాటు, కుబాన్, అస్ట్రఖాన్,, తుల, క్రిమియా ప్రాంతాల్లో ఉక్రెయిన్ ప్రయోగించిన 25 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఆక్రమిత జపొరిఝియాకు 900 కిలోమీటర్ల దూరంలోని కాకసస్ నార్త్ ఒస్సేతియాలోని సైనిక స్థావరం లక్ష్యంగా ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్‌ను ధ్వంసం చేసినట్లు వివరించింది. -
Russia-Ukraine war: ఆక్రమిత ఉక్రెయిన్‌పై దాడి.. 28 మంది మృతి
మాస్కో: ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత లిసిచాన్స్క్ నగరంలోని ఓ బేకరీపై జరిగిన దాడిలో 28 మంది మృతి చెందారు. రష్యా నియమించిన స్థానిక అధికారి ఈ విషయం వెల్లడించారు. బేకరీ కుప్పకూలిపోవడంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన మరో 10 మందిని కాపాడినట్లు చెప్పారు. ఘటనపై ఉక్రెయిన్ అధికారులు స్పందించలేదు. ఈ శీతాకాలంలో సుమారు 930 మైళ్ల మేర విస్తరించి ఉన్న యుద్ధ క్షేత్రంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. రష్యా, ఉక్రెయిన్ సైన్యాలు ఎక్కువగా దీర్ఘ శ్రేణి దాడులపైనే ఆధారపడ్డాయి. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో రష్యా బలగాలు పలు ప్రాంతాల్లో తమ సేనలపైకి పదేపదే దాడులతో ఒత్తిడి తీవ్రతరం చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. -
ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ఖచ్చితంగా ఉత్తర కొరియా మిసైల్!
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంపై మిసైల్ దాడి చేసింది. ఖార్కివ్‌పై రష్యా ప్రయోగించిన మిసైల్ ఆ దేశానికి చెందినది కాదని ఉక్రెయిన్ ప్రతినిధి డిమిట్రో చుబెంకో అన్నారు. జనవరి 2 తేదీని ఖార్కివ్ నగరంపై దాడి చేసిన రష్యా మిసైల్ గమనిస్తే.. రష్యా దేశానికి చెందినది కాదని తెలుస్తోందని పేర్కొన్నారు. గతంలో రష్యా ప్రయోగించిన మిసైల్ కంటే పెద్దదిగా ఉందని అన్నారు. దాని తయారి విధానం చూస్తే.. అధునాతనమైనదిగా లేదని చెప్పారు. గతంలో ఖార్కివ్‌పై రష్యా ప్రయోగించిన మిసైల్.. ఇప్పటి మిసైల్‌ను పరిశీలిస్తే అది ఉత్తర కొరియాకు చెందినదిగా నిర్థారించడానికి అవకాశలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నాజిల్, ఎలక్ట్రికల్ వైండింగ్స్, పలు పరికారలు కూడా చాలా వ్యత్యాసంతో ఉన్నాయని తెలిపారు. ఇది ఖచ్చితంగా ఉత్తర కొరియా మిసైల్ అని తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నట్లు కూడా డిమిట్రో చుబెంకో తెలిపారు. అందుకే రష్యా వేసిన మిసైల్ ఉత్తర కొరియా నుంచి సరఫరా చేసినట్లుగా అనుమానం కలుగుతోందని తెలిపారు. రష్యా ఖార్కివ్ నగరంపై చేసిన మిసైల్ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 60 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. చదవండి: Hamas Attackers: ‘వాళ్లు మనుషులు కాదు.. పెద్దగా నవ్వుతూ రాక్షస ఆనందం’ -
ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులు
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నూతన సంవత్సరాని స్వాగతం పలికే కొన్ని గంటల మందు రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడులకు తెగపడింది. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో సుమారు రష్యా 90 డ్రోన్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ సోమవారం తెలిపంది. Shahed drone attack on Odessa has been underway in New Year's Eve for more than two hours. Debris of kamikaze drones caused several fires in residential buildings so far. At least one person was killed. pic.twitter.com/kX1lxLijvj — Olga Klymenko (@OlgaK2013) January 1, 2024 ఈ డ్రోన్ దాడుల్లో 15 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు ఉక్రెయిన సైన్యం పేర్కొంది. డ్రోన్ దాడుల్లో సమారు ఏడుగురు తీవ్రంగా గాపడినట్లు తెలిపింది. రష్యా చేసిన షాహెద్ డ్రోన్ దాడులతో ఒడెస్సాలోని పలు భవనాల్లో భారీగా మంటల్లో కాలిపోయాయి. అయితే ఉక్రెయిన్ సైతం తమపై దాడులు చేస్తోందని రష్యా ప్రకటించింది. చదవండి: జపాన్‌లో సునామీ హెచ్చరికలు -
జెలెన్స్కీ సొంత నగరంపై క్షిపణి దాడులు
కీవ్: రష్యా సోమవారం ఉదయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరం క్రివి్వ్యరిహ్పై రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో పదేళ్ల బాలిక సహా ఆరుగురు చనిపోయారు. ఈ దాడుల్లో ఓ అపార్టుమెంట్, నాలుగంతస్తుల యూనివర్సిటీ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పదేళ్ల బాలిక, ఆమె తల్లి సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 64 మంది గాయాలపాలయ్యారని నీప్రో గవర్నర్ సెర్హీ లిసాక్ తెలిపారు. ఇంకా కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెప్పారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు. రష్యా పాక్షికంగా ఆక్రమించిన డొనెట్స్క్ ప్రావిన్స్‌లో జరిగిన దాడిలో ఇద్దరు చనిపోగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడికి కారణమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. కాగా, మాస్కోపైకి ఆదివారం డ్రోన్లను ప్రయోగించిన ఉక్రెయిన్ సోమవారం రష్యాలోని బ్రియాన్స్క్పై డ్రోన్ దాడి జరిపింది. ఎవరూ చనిపోయినట్లు సమాచారం లేదని స్థానిక గవర్నర్ చెప్పారు. ఖరీ్కవ్, ఖెర్సన్, డొనెట్స్్కలపై రష్యా శతఘ్ని కాల్పుల్లో ముగ్గురు చనిపోగా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. -
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. 8 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్ వ్యాప్తంగా రష్యా సాగించిన దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. డొనెట్స్క్లోని నియు–యోర్క్‌పై రష్యా సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కొస్టియాంటీనివ్కాపై జరిగిన రాకెట్ల దాడిలో 20 వరకు ఇళ్లు, కార్లు, గ్యాస్ పైప్‌లైన్ ధ్వంసం కాగా ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. చెరి్నహివ్పై రష్యా క్రూయిజ్ మిస్సైళ్లు పడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జపొరిఝియా అణు ప్లాంట్ పొరుగునే ఉన్న పట్టణంపై రష్యా దాడిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఇలా ఉండగా, నల్ల సముద్రం ధాన్యం రవాణా ఒప్పందాన్ని రద్దు చేసిన రష్యా ఉక్రెయిన్ నౌకా తీర ప్రాంతం ఒడెసాను లక్ష్యంగా చేసుకుంది. రష్యా మిలటరీ ప్రయోగించిన రెండు క్రూయిజ్ మిస్సైళ్లు గిడ్డంగులపై పడటంతో మంటలు చెలరేగి పరికరాలు ధ్వంసమయ్యాయని, 120 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు బూడిదయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది. క్రిమియాపై దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడినట్లు రష్యా తెలిపింది. ఈ పరిణామంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్లను పశ్చిమదేశాలు నెరవేర్చి, ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని సూచించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ చేసి మాట్లాడతానని, వచ్చే నెలలో తుర్కియేలో ఆయనతో భేటీ ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. కాగా, రష్యా ఆక్రమిత క్రిమియాలో వారం వ్యవధిలో రెండోసారి డ్రోన్ పేలింది. క్రాస్నోవార్డిస్క్‌లోని ఆయిల్ డిపో, ఆయుధ గిడ్డంగిలను డ్రోన్ బాంబులతో పేల్చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. సోమవారం ఉక్రెయిన్ జరిపిన దాడిలో రష్యాను కలిపే కీలకమైన క్రిమియా వంతెన కొంతభాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా, జపొరిఝియా ప్రాంతంలో ఉక్రెయిన్ శతఘ్ని కాల్పుల్లో రియా వార్తా సంస్థకు చెందిన రష్యా జర్నలిస్టు ఒకరు మృతి చెందారు. -
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం శనివారం ఉదయం జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగినట్లు ఉక్రెయిన్ తెలిపింది. డొనెట్స్క్ ప్రాంతంలోని బఖ్ముత్, లీమాన్, మరింకా నగరాల పరిసరాల్లో రెండు సైన్యాలకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఇలా ఉండగా, ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాలను వెళ్లగొట్టేందుకు జరుగుతున్న పోరాటంలో తుది వరకు యూరప్‌తోపాటు ఈయూ మద్దతుగా నిలుస్తాయని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ హామీ ఇచ్చారు. శనివారం ఈయూ అధ్యక్ష బాధ్యతలను స్పెయిన్ చేపట్టిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. -
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు: 22 మంది దుర్మరణం
కీవ్: రష్యా దాడుల్లో శుక్రవారం 22 మంది ఉక్రేనియన్లు దుర్మరణం పాలయ్యారు. ఉమాన్‌లో 9 అంతస్తుల నివాస భవనంపై క్షిపణి దాడిలో ముగ్గురు చిన్నారులతో పాటు 20 మంది చనిపోయారు. ఇప్పటిదాకా యుద్ధ చాయలు కనిపించని ఈ నగరంపై రష్యా తొలిసారి లాంగ్రేంజ్ క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు 2 నెలల తర్వాత రాజధాని కీవ్‌లోని ఓ నివాస భవనంపై క్షిపణి దాడి జరిగింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన 21 క్రూయిజ్ మిస్సైళ్లను, రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. నీప్రో నగరంలోని నివాస ప్రాంతాలపై రష్యా బలగాల దాడిలో రెండేళ్ల చిన్నారి, ఆమె తల్లి చనిపోగా మరో నలుగురు గాయపడినట్లు గవర్నర్ చెప్పారు. ఈ దాడులతో ఉద్దేశపూర్వకంగా బెదిరించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ అంటుండగా తమ దీర్ఘ శ్రేణి క్షిపణులు లక్ష్యాలను ఛేదించినట్లు రష్యా చెబుతోంది. రష్యా ఆక్రమిత డొనెట్స్క్పై ఉక్రెయిన్ బలగాల రాకెట్ దాడిలో ఏడుగురు పౌరులు దుర్మరణం చెందినట్లు నగర మేయర్ చెప్పారు. -
ఉక్రెయిన్ చేతికి ‘పేట్రియాట్’
కీవ్: అమెరికా అత్యాధునిక పేట్రియాట్ గైడెడ్ క్షిపణి వ్యవస్థ ఉక్రెయిన్ చేతికొచ్చింది. దీంతో రష్యా యుద్ధమూకలను మరింత దీటుగా ఎదుర్కొంటామని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ బుధవారం ట్వీట్‌చేశారు. ‘ భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ రాకతో మా గగనతలానికి మరింత రక్షణ చేకూరింది’ అని ఆయన అన్నారు. శత్రు సేనల నుంచి దూసుకొచ్చే క్షిపణులు, స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైళ్లను ఈ వ్యవస్థతో కూల్చేయొచ్చు. క్రూయిజ్ క్షిపణులు, స్వల్ప శ్రేణి మిస్సైళ్లతోనే ఉక్రెయిన్ పౌర మౌలిక వసతులు ముఖ్యంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలను రష్యా ధ్వంసం చేస్తున్న విషయం విదితమే. అందుకే జనావాసాలు, మౌలిక వసతుల రక్షణ కోసం కొంతకాలంగా పేట్రియాట్ సిస్టమ్స్ సరఫరా చేయాలని అమెరికాను ఉక్రెయిన్ కోరుతోంది. ఇన్నాళ్లకు అవి ఉక్రెయిన్ చేతికొచ్చాయి. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ కోసం ఏడ్చేవాళ్లెవరు?
(ఎస్.రాజమహేంద్రారెడ్డి) : సరిగ్గా ఏడాది క్రితం యముని మహిషపు లోహపు గంటల గణగణలు విని ప్రపంచం యావత్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ గణగణలు దిక్కులు పిక్కటిల్లేలా భూగోళమంతా మారుమోగుతాయేమోనని ఆందోళన పడింది. రష్యా సమరనాదం ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేసి అనివార్యంగా ప్రపంచ దేశాలను రెండుగా చీల్చడం ఖాయమని పరిశీలకులూ భయంభయంగానే అంచనా వేశారు. మిత్ర దేశం బెలారస్ భుజం మీద ట్యాంకులను మోహరించి ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగింది. చిరుగాలికే వొణికిపోయే చిగురుటాకులా ఉక్రెయిన్ తలవంచడం ఖాయమనే అనుకున్నారంతా! యుద్ధమంటేనే చావులు కదా. మృతదేహాల ఎర్రటి తివాచీ మీద నుంచే విజయం నడిచో, పరుగెత్తో వస్తుంది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ, ప్రపంచం దృష్టంతా రణక్షేత్రంపైనే నిలిచింది. అయ్యో అన్నవాళ్లున్నారు, రెండు కన్నీటి చుక్కలతో జాలి పడ్డవారూ ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైరి పక్షాల వైపు నిలిచిన దేశాలు మాట సాయమో, మూట సాయమో, ఆయుధ సాయమో చేసి తమ వంతు పాత్రను పోషిస్తూనే ఉన్నాయి. తటస్థంగా ఉన్నవాళ్లూ ఉన్నారు. చమురు కోసమో, తిండిగింజల కోసమో రష్యాపై ఆధారపడ్డ దేశాలు ఇప్పుడెలా అని తల పట్టుకుని ఆలోచనలో పడ్డాయి. ఒకవైపు రష్యా వైఖరిని వ్యతిరేకిస్తూ మరోవైపు దిగుమతులను స్వాగతించడం ఎలాగన్నదే వాటిముందు నిలిచిన మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇండియాకు ఇవేమీ పట్టలేదు. ఉక్రెయిన్‌లో వైద్యవిద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకు రావడాన్నే యుద్ధం తొలినాళ్లలో లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే భారత్ తటస్థ ధోరణికే కట్టుబడింది. నెలలు గడిచి యేడాది పూర్తయ్యేసరికి రెండు దేశాలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. మిగతా దేశాలు తమ సమస్యలను తమదైన రీతిలో, రష్యా మీద ఆధారపడాల్సిన అవసరం లేనంతగా పరిష్కరించుకున్నాయి. ఇప్పుడు యుద్ధం హాలీవుడ్ వార్ సినిమాయే.. ప్రాణ నష్టం గణాంకాలే! యుద్ధం కూడా రోజువారీ దినచర్యలా రొటీన్‌గా మారిపోయినప్పుడు ఒక్క కన్నీటి బొట్టయినా రాలుతుందా? అయినా ఉక్రెయిన్ కోసం ఏడ్చేవాళ్లెవరు? తండ్రినో, భర్తనో, కొడుకునో కోల్పోయిన అభాగ్యులు తప్ప! పక్కింటి గొడవ స్థాయికి... యుద్ధం తొలినాళ్లలో ఇకపై చమురెలా అన్నదే యూరప్‌ను వేధించిన ప్రశ్న. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు తమ చమురు అవసరాల్లో దాదాపు 40 శాతం రష్యాపైనే ఆధారపడేవి. సహాయ నిరాకరణలో భాగంగా ఆ దిగుమతులను నిలిపివేయక తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో జర్మనీ నుంచి ఇటలీ దాకా, పోలండ్ దాకా తమ దిగుమతుల పాలసీని మార్చుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. అధిక ధరకు చము రును ఇతర దేశాల నుంచి కొనాల్సి వచ్చినా, పొదుపు మంత్రంవేసి కుదుటపడ్డాయి. ప్రత్యామ్నా య మార్గం దొరికే వరకు యుద్ధం తమ గుమ్మం ముందే కరాళ నృత్యం చేస్తోందన్నంతగా హడలిపోయి ఉక్రెయిన్ పట్ల కాస్త సానుభూతిని, కాసిన్ని కన్నీటి బొట్లను రాల్చిన ఈ దేశాలన్నీ ఒక్కసారిగా కుదుటపడి ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పుడు యుద్ధం ఈ దేశాలకు పక్కింటి గొడవే..! ఇక భారత్ విషయానికొస్తే నాటో దేశాల సహాయ నిరాకర ణతో లాభపడిందనే చెప్పాలి. బ్యారెళ్లలో మూలుగుతున్న చమురును ఏదో ఒక ధరకు అమ్మేయాలన్న వ్యాపార సూత్రాన్ని అనుసరించి రష్యా భారత్‌కు డిస్కౌంట్ ఇస్తానని ప్రతిపాదించింది. ఫలితంగా గత ఏడాది మార్చి 31 దాకా రష్యా చమురు ఎగుమతుల్లో కేవలం 0.2 శాతంగా ఉన్న భారత్ వాటా ఈ ఏడాది ఏకంగా 22 శాతానికి చేరింది! యుద్ధమంటే బాంబుల మోత, నేలకొరిగిన సైనికులు, ఉసురు కోల్పోయిన సామాన్య పౌరులు మాత్రమే కాదు, కొందరికి వ్యాపారం కూడా! భారత్‌కు చమురు లాభమైతే ఆయుధ తయారీ దేశాలకు వ్యాపార లాభం. యుద్ధమంటే ఆయుధ నష్టం కూడా. జర్మనీ, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, పోలండ్ లాంటి దేశాలు సరిగ్గా దీన్నే తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఆయుధ ఉత్పత్తిని పెంచి, సొమ్ము చేసుకుంటున్నాయి. ఏడాది తిరిగేసరికి యుద్ధం చుట్టూ పరిస్థితులు ఇంతలా మారితే కదనరంగంలో పిట్టల్లా రాలుతున్న వారి గురించి ఎవరాలోచిస్తారు? ప్రాథమ్యాల జాబితాలో యుద్ధం ఇప్పుడు చిట్టచివరి స్థానానికి నెట్టివేతకు గురైంది. రణక్షేత్రంలోని వైరి పక్షాలకు తప్ప మిగతా దేశాలకు ఇప్పుడది కేవలం ఒక వార్త మాత్రమే! బావుకున్నదేమీ లేదు మిత్ర దేశాలు, శత్రు దేశాలు, తటస్థ దేశాలను, వాటి వైఖరులను పక్కన పెడితే వైరి పక్షాలైన రష్యా, ఉక్రెయిన్ కూడా బావుకున్నదేమీ లేదు. ప్రాణనష్టం, ఆయుధ నష్టాల్లో హెచ్చుతగ్గులే తప్ప రెండు దేశాలూ తమ పురోగతిని ఓ నలభై, యాభై ఏళ్ల వెనక్కు నెట్టేసుకున్నట్టే! శ్మశాన వాటికలా మొండి గోడలతో నిలిచిన ఉక్రెయిన్ మునుపటి స్థితికి చేరుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో యుద్ధం ముగిస్తే తప్ప అంచనా వేయలేం. యుద్ధం వల్ల పోగొట్టుకున్న పేరు ప్రతిష్టలను, కోల్పోయిన వీర సైనికులను రష్యా వెనక్కు తెచ్చుకోగలదా? ఏడాదైనా ఉక్రెయిన్‌పై పట్టు బిగించడంలో ఘోరంగా విఫలమైన రష్యా సైనిక శక్తి ప్రపంచం దృష్టిలో ప్రశ్నార్థకం కాలేదా? నియంత పోకడలతో రష్యాను జీవితాంతం ఏలాలన్న అధ్యక్షుడు పుతిన్ పేరు ప్రతిష్టలు యుద్ధంతో పాతాళానికి దిగజారలేదా? ఆయన తన రాజ్యకాంక్షను, తన అహాన్ని మాత్రమే తృప్తి పరచుకోగలిగారే తప్ప... ప్రపంచాన్ని కాదు, తన ప్రజలను కానే కాదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరిస్థితి కూడా పుతిన్‌కు భిన్నంగా ఏమీ లేదు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్టు జెలెన్స్కీ హాస్య నటుడి నుంచి హీరో అయ్యారు. రష్యా క్షిపణి దాడుల్లో దేశం వల్లకాడులా మారుతున్నా జెలెన్స్కీపై మాత్రం పొగడ్తల వర్షం కురుస్తూనే ఉంది. ఆయన ఎక్కడికెళ్లినా రాచ మర్యాదలతో స్వాగతం పలుకుతున్నారు. సాహసివంటూ పొగుడుతున్నారు. దేశం నాశనమవుతోందని బాధ పడాలో, ఎగురుతున్న తన కీర్తిబావుటాను చూసి సంతోషించాలో జెలెన్స్కీకి అర్థం కావడం లేదు. బహుశా ఆయన త్రిశంకుస్వర్గంలో ఉండి ఉంటారు. కొసమెరుపు కదనరంగంలో గెలుపోటములు ఇప్పుడప్పుడే తేలే అవకాశమే లేదు. ఎవరిది పైచేయి అంటే చెప్పడం కూడా కష్టమే. స్థూలంగా చెప్పాలంటే రష్యా ఆక్రమించుకున్న భూభాగంలో 54 శాతాన్ని ఉక్రెయిన్ మళ్లీ తన అధీనంలోకి తెచ్చుకుంది. అన్ని రోజులూ ఒక్కరివి కాదంటారు కదా! ఒకరోజు రష్యాదైతే మరో రోజు ఉక్రెయిన్‌ది..అంతే! ఇప్పుడు ఈ యుద్ధం ప్రపంచానిది ఎంతమాత్రం కాదు, రష్యా–ఉక్రెయిన్లది మాత్రమే. కొనసాగించడంతో పాటు ముగించడం కూడా ఆ రెండు దేశాల చేతుల్లోనే ఉంది. అయినా ఈ యుద్ధాన్ని ఎవరు పట్టించుకుంటున్నారిప్పుడు? -
Russia-Ukraine war: క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడులు తీవ్రతరం చేసింది. కీలక పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్‌పై గురి పెట్టింది. లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రావిన్స్‌లతోపాటు రాజధాని కీవ్, లీవ్‌పైనా క్షిపణి దాడులు జరిగాయని ఉక్రెయిన్ సైనిక వర్గాలు తెలిపాయి. ‘‘గురువారం సాయంత్రం నుంచి 71 క్రూయిజ్ క్షిపణులను, 35 ఎస్–300 క్షిపణులను, 7 షహెడ్ డ్రోన్లను ప్రయోగించారు. 61 క్రూయిజ్ మిస్సైళ్లు, 5 డ్రోన్లను కూల్చేశాం’’ అని చెప్పింది. విద్యుత్ వ్యవస్థలపై దాడులతో కొన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఖర్కీవ్‌లో క్షిపణి దాడిలో ఏడుగురు గాయపడినట్లు అధికారులు చెప్పారు. జపొరిజియాపై గంట వ్యవధిలోనే 17సార్లు క్షిపణి దాడులు జరిగాయి. ఐదు క్షిపణులను, 5 షాహెద్ కిల్లర్ డ్రోన్లను కూల్చివేశామన్నారు. రష్యా క్షిపణులు రెండు రొమేనియా, మాల్దోవా గగనతలంలోకి వెళ్లినట్లు ఉక్రెయిన్ సైనిక జనరల్ ఒకరు చెప్పారు. నిరసనగా మాల్దోవా తమ దేశంలోని రష్యా రాయబారికి సమన్లు పంపింది. డొనెట్స్క్లో రష్యా అదనంగా బలగాలను రంగంలోకి దించింది. లుహాన్స్క్ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు రష్యా ఆర్మీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
కీవ్‌పై మరోసారి పేట్రేగిన రష్యా
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ శనివారం ఉదయం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. డ్నిప్రొవ్స్కీ ప్రాంతంలోని కీలకమైన మౌలిక వసతులే లక్ష్యంగా రష్యా ఈ దాడులకు ఒడిగట్టినట్లు భావిస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. క్షిపణి దాడులతో పలు ప్రాంతాల్లో 18 వరకు భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల మంటలు లేచాయి. ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది. కీవ్‌పై జనవరి ఒకటో తేదీ తర్వాత రష్యా దాడులు జరపడం ఇదే ప్రథమం. అంతకుముందు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌లోని పారిశ్రామిక ప్రాంతంపై రష్యా రెండు ఎస్–300 క్షిపణులను ప్రయోగించిందని ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. కీలక నగరం సొలెడార్ తమ అధీనంలోకి వచ్చిందంటూ రెండు రోజుల క్రితం రష్యా ప్రకటించగా, ఉక్రెయిన్ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. రాజధాని కీవ్, ఇతర నగరాలను లక్ష్యంగా చేసుకొని రష్యా క్షిపణి దాడులకు తెగబడుతుండడంతో ఉక్రెయిన్‌కు అండగా నిలవడానికి బ్రిటన్ ముందుకొచ్చింది. ట్యాంకులు, శతఘ్ని వ్యవస్థలను ఉక్రెయిన్‌కి పంపిస్తామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శనివారం నాడు హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో సునాక్ మాట్లాడారు. అనంతరం బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఛాలెంజర్ 2 ట్యాంకులు, ఇతర శతఘ్ని వ్యవస్థ సాయంగా అందిస్తామని సునాక్ హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే ఎన్ని ట్యాంకులు పంపిస్తారో, ఎప్పటిలోగా అవి ఉక్రెయిన్ చేరుకుంటాయో వెల్లడించలేదు. బ్రిటీష్ ఆర్మీ చాలెంజర్ 2 ట్యాంకులు నాలుగు వెంటనే పంపిస్తారని, మరో ఎనిమిది త్వరలోనే పంపిస్తారంటూ బ్రిటన్ మీడియా తెలిపింది. ఉక్రెయిన్‌లో మౌలికసదుపాయాలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులకు తెగబడుతోంది. -
రష్యా క్రూరత్వం.. ఉక్రెయిన్‌పై ఒకేసారి 120 మిసైల్స్‌తో అటాక్!
కీవ్: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై కొద్ది నెలలుగా భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. ప్రధాన వనరులను ధ్వంసం చేస్తూ ఉక్రేనియన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరోమారు క్షిపణుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఒకేరోజు 120 మిసైల్స్‌ను ప్రయోగించింది. ఏ వైపు నుంచి బాంబులు పడతాయోనని అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేలా చేసింది. భారీ స్థాయిలో మిసైల్స్ ప్రయోగించినట్లు ఉక్రెయిన్ మిలిటరీ వెల్లడించింది. ‘డిసెంబర్ 29. భారీ స్థాయిలో మిసైల్స్‌తో దాడి జరిగింది. ఆకాశం, సముద్రం నుంచి శుత్రు దేశం ఉక్రెయిన్ను చుట్టుముట్టి మిసైల్స్‌తో విరుచుకుపడింది. ’అని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది ఉక్రెయిన్ వైమానిక దళం. మరోవైపు.. 120 మిసైల్స్ ప్రయోగించినట్లు అధ్యక్షుడి సహాయకుడు మైఖైలో పోడోల్యాక్ తెలిపారు. గురువారం ఉదయమే ఉక్రెయిన్ వ్యాప్తంగా రాజధాని కీవ్‌తో పాటు ప్రధాన నగరాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ క్రమంలోనే విద్యుత్తుకు అంతరాయం ఏర్పడొచ్చని, ప్రజలు నీటిని నిలువ చేసుకోవాలని కీవ్ మేయర్ విటాలి క్లిట్స్కో అప్రమత్తం చేశారు. అలాగే.. రెండో పెద్ద నగరం ఖార్కివ్‌లోనూ వరుస పేలుళ్లు జరిగాయి. ఇదీ చదవండి: క్యాసినో హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది సజీవ దహనం.. -
రష్యా మాస్టర్ ప్లాన్.. చలికి గడ్డకట్టుకుపోతున్న ఉక్రేనియన్లు!
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా 76 క్షిపణులతో జరిపిన దాడుల బీభత్సం అంతా ఇంతా కాదు. విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని రష్యా చేసిన దాడులతో పలు నగరాలు అంధకారంలో మగ్గిపోయాయి. గడ్డకట్టించే చలిలో విద్యుత్ సదుపాయం లేకుండా చేస్తే ఆ చలిని తట్టుకోలేక సైనికులు, పౌరులు ఉక్రెయిన్ వీడి వెళ్లిపోతారన్న వ్యూహంతో రష్యా ఈ దాడులకు దిగింది. 76 క్షిపణుల్లో ఎన్నింటిని ఉక్రెయిన్ వాయు సేన అడ్డుకోగలిగిందో స్పష్టమైన అంచనాలు లేవు. క్రివీయ్ రియా ప్రాంతంలో రాకెట్ దాడిలో ఒక ఇల్లుపూర్తిగా ధ్వంసం కావడంతో అందులో ఉన్న కుటుంబసభ్యులు నలుగురు మరణించారు. వారిలో ఏడాదిన్నర వయసున్న బాలుడు ఉండడం అందరినీ కంట తడిపెట్టిస్తోంది. నికోపోల్, మార్హానెట్స్, చెర్వోనోహ్రిహోరి్వకా వంటి నగరాల్లో విద్యుత్ లైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా నగరాల్లో జీరో కంటే తక్కువకి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. విపరీతమైన చలి వణికిస్తూ ఉన్న సమయంలో విద్యుత్ లేకపోవడంతో హీటర్లు పని చేయక ప్రజలు గడ్డకట్టుకుపోతున్నారు. ప్రస్తుతం అధికారులు విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. మరోవైపు రష్యా మరిన్ని క్షిపణి దాడులు చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఇదీ చదవండి: చైనాలో వచ్చే ఏడాది కోవిడ్‌తో 10 లక్షల మంది మృతి? -
ఉక్రెయిన్‌పై 100 మిసైల్స్‌తో విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా పట్టుకోల్పోతోందనే వాదనల వేళ మాస్కో సేనలు రెచ్చిపోయాయి. ఉక్రెయిన్‌పై మంగళవారం మిసైల్స్ వర్షం కురిపించాయి. విద్యుత్తు రంగాలే లక్ష్యంగా రష్యా బలగాలు 100కుపైగా క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. దీంతో తమ దేశంలో మరోమారు విద్యుత్తుకు అంతరాయం ఏర్పడి అంధకారంలోకి వెళ్లినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ‘100కుపైగా మిసైల్స్‌ను రష్యా బలగాలు ప్రయోగించాయి. అక్టోబర్ 10వ తేదీన అత్యధికంగా 84 మిసైల్స్‌ను ప్రయోగించగా.. ఆ సంఖ్యను మంగళవారం దాటేశాయి మాస్కో సేనలు. వారి ప్రాథమిక టార్గెట్ కీలకమైన మౌలిక సదుపాయాలు. కొన్ని క్షిపణులను కూల్చివేశం. అయితే వాటి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ ప్రతినిధి యూరీ ఇగ్నాత్. ఇదీ చదవండి: చైనా అధ్యక్షుడికి చిరునవ్వుతో షేక్ హ్యండ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఇదే తొలిసారి! -
ఎట్టకేలకు పుతిన్ సేనలకు ఊహించని పరాభవం.. ఫుల్ జోష్‌లో ఉక్రేనియన్లు
ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా సేనలు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా రష్యా సైన్యం.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. బాంబు దాడులతో ఉక్రెయిన్ సేనలను, ఆ దేశ పౌరులను భయభాంత్రులకు గురిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఉక్రెయిన్ యుద్ధం తీరు క్రమక్రమంగా మారిపోయింది రష్యాపై ఉక్రెయిన్ సైన్యం ఆధిపత్యం కొనసాగించే స్థితికి చేరుకుంది. ఇప్పటికే పలు నగరాలను ఆక్రమించుకున్న రష్యా సేనలను తరిమికొట్టి ఉక్రెయిన్ సైనం వారి దేశంలోని కీలక నగరాలను మరలా స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సైన్యం మరో విజయం సాధించింది. ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన ఖేర్సన్ నగరాన్ని ఉక్రెయిన్ తిరిగి ఆక్రమించుకుంది. కాగా, తాజాగా రష్యా దళాలు ఖేర్సన్ను వీడుతున్నాయి. ఖేర్సన్ దాని పరిసర ప్రాంతాల నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ మేరకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు రష్యా పేర్కొంది. నిప్రో నది పశ్చిమ తీరం నుంచి బలగాలను పూర్తిగా వెనక్కు తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే నగరంలోకి ప్రవేశించిందని ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. ఈ పరిణామాన్ని ‘కీలక విజయంగా’ అభివర్ణించింది. Video of the occupation of Kherson before its liberation Kherson is forever Ukraine🇺🇦#Kherson #Ukraine #KhersonisUkraine #Україна #Херсон pic.twitter.com/SUq4SvPZuJ — Ukraine-Russia war (@UkraineRussia2) November 12, 2022 ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ స్పందించారు. ఈ సందర్భంగా ‘ఖేర్సన్ నగరం ఇక మాదే’ అంటూ ప్రకటించారు. ‘మన ప్రజలు, మన ఖేర్సన్’ అంటూ టెలిగ్రామ్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతానికి ఉక్రెయిన్ బలగాలు నగర శివార్లలో ఉన్నాయని, ప్రత్యేక విభాగాలు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయని తెలిపారు. రష్యా సేనలు పేలుడు పదార్థాలను వదిలిపెట్టాయన్న అనుమానంతో వాటిని తొలగించేందుకు సంబంధిత నిపుణులు రంగంలోకి దిగినట్లు చెప్పారు. ఇక, ఈ విజయంతో ఉక్రెయిన్ సైన్యం, పౌరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చి.. ఉక్రెయిన్ జెండాలను ఎగురవేస్తూ విజయం మాదే అంటూ సంబురాలు జరుపుకుంటున్నారు. After months of occupation #Ukrainians come to the streets & central squares of their villages & cities with Ukrainian flags to meet 🇺🇦soldiers and feel the relief, because people of #Ukraine are born to be free. 🎵Kalush Orchestra & The Rasmus#Kherson #StandWithUkraine️ pic.twitter.com/GEG76odo96 — MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) November 11, 2022 ఇది కూడా చదవండి: బ్రిటన్ రాజు చార్లెస్-3కు ఊహించని షాక్ -
ఉక్రెయిన్‌పై రష్యా రాకెట్ల వర్షం.. ఆ నగర ప్రజలకు హెచ్చరిక!
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. తమ దేశంపై రష్యా బలగాలు అర్ధరాత్రి రాకెట్లతో విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. ప్రముఖంగా విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. దాని ద్వారానే దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందన్నారు. పవర్ కట్‌తో కీవ్ సహా చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. ‘మా దేశంపై ఉగ్రవాద చర్యలను రష్యా తీవ్రతరం చేసింది. రాత్రి మా శత్రుదేశం భారీ స్థాయిలో దాడి చేసింది. 36 రాకెట్లు ప్రయోగించింది. అయితే, అందులో చాలా వరకు కూల్చేశాం. కీలకమైన మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులపై దాడులు చేస్తోంది. ఇవి ఉగ్రవాద వ్యూహాలే.’ అని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు జెలెన్స్కీ. ఖేర్సన్ నగరాన్ని వీడండి.. రష్యా విలీనం చేసుకున్న ఉక్రెయిన్‌లోని దక్షిణ ప్రాంతం ఖేర్సన్ నగరాన్ని వీడి ప్రజలు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రష్యా అనుకూల అధికారులు హెచ్చరించారు. ఉక్రెయిన్ ప్రతిదాడులు పెంచిన క్రమంలో ఈ మేరకు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన కారణంగా నగరంలోని ప్రజలంతా నైపెర్ నదికి అవతలివైపు వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: ‘బ్రిటన్ ప్రధానిగా బోరిస్ సరైన వ్యక్తి’.. భారత సంతతి ఎంపీ మద్దతు