
క్షిపణి దాడిలో ధ్వంసమైన మరియుపోల్ సైనిక స్థావరం
Russia-Ukraine War 2022: అంతా భయపడుతున్నట్లే జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు గురువారం దాడులు మొదలుపెట్టాయి. ప్రపంచ దేశాల ఆంక్షలను, హెచ్చరికలను పట్టించుకోని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధ భేరి మోగించారు. అంతటితో ఆగకుండా ఈ విషయలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే ఎన్నడూ చూడని పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ఖార్కివ్, ఒడెసా నగరాల్లో భారీ విస్ఫోటనాలు వినిపించాయి. దేశమంతా వైమానిక దాడులు, బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.
దీంతో పలువురు ఉక్రెయిన్ పౌరులు నగరాలు విడిచి పారిపోయారు. రష్యా దాడుల్లో దాదాపు 40మంది ఉక్రెయిన్ సైనికులు మరణించగా, వందల్లో గాయపడ్డారు. వందలాది మంది పౌరులు కూడా మరణించారంటున్నారు. ఉక్రెయిన్ వైమానిక బలగాలను గంటలోపే తుడిచిపెట్టామని రష్యా ప్రకటించగా, రష్యా విమానాలను కూల్చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. ప్రపంచ దేశాల నేతలు రష్యా చర్యను ఖండించారు. రష్యా దీర్ఘకాల పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలగా, చమురు, బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.
ఆంక్షలతో సరిపెట్టిన దేశాలు
రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు ప్రకటించాయే తప్ప ఉక్రెయిన్ రక్షణకు ఏ ఒక్క దేశమూ ముందుకురాలేదు. ఉక్రెయిన్ సరిహద్దుల వెంట బలగాలను పెంచాలని మాత్రమే నాటో నిర్ణయించుకుంది. అనంతరం రష్యాపై మరిన్ని ఆంక్షలు ప్రకటించవచ్చని అంచనా. తూర్పు ఉక్రెయిన్‌లోని పౌరులను కాపాడేందుకు దాడి తప్పదని పుతిన్ చేసిన ప్రకటనను∙యూఎస్, దాని మిత్ర దేశాలు తప్పుబట్టాయి. ఇది ఆక్రమణకు సాకు మాత్రమేనన్నాయి. నాటోలో ఉక్రెయిన్‌ను చేర్చుకోవద్దన్న తమ విజ్ఞప్తిని యూఎస్, మిత్రపక్షాలు పట్టించుకోలదని పుతిన్ విమర్శించారు. ఇప్పటికీ ఉక్రెయిన్‌ను ఆక్రమించే యోచన తమకు లేదని, కేవలం ఆ దేశాన్ని నిస్సైనికం చేసి, నేరాలకు పాల్పడినవారిని శిక్షించడమే తమ లక్ష్యమని చెప్పారు.
వాయు దాడులతో మొదలై..
ఉక్రెయిన్‌పై తొలుత వైమానిక దాడులను ఆరంభించిన రష్యా అనంతరం ఆర్మీని కూడా రంగంలోకి దించింది. వేలాది రష్యా సాయుధ వాహనాలు క్రిమియా నుంచి సరిహద్దులు దాటి చొచ్చుకువస్తున్నాయని ఉక్రెయిన్ బోర్డర్ గార్డ్స్ వీడియో ఫుటేజ్ విడుదల చేశారు. రష్యా తమ మిలటరీ మౌలిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. దేశంలో మార్షల్ లా విధించారు. ప్రపంచ దేశాలు పుతిన్‌ను అడ్డుకునేందుకు ముందుకురావాలని కోరారు. తాము స్వాతంత్రం కోసం పోరాడతామన్నారు. పౌరులెవరూ బయటకు రావద్దని, కంగారుపడవద్దని రాజధాని కీవ్ మేయర్ సూచించారు. తమ దేశంలో ఖార్కివ్, చెర్నిహివ్ ప్రాంతాల్లో రష్యా బలగాలు దాదాపు 5 కిలోమీటర్ల మేర చొచ్చుకువచ్చారని జెలెన్‌స్కీ సలహాదారు చెప్పారు. రష్యా దాడితో ఉక్రెయిన్ సామాజిక, ఆర్థిక వ్యవస్థలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.
రష్యా అధీనంలోకి చెర్నోబిల్
ఉక్రెయిన్లోని చెర్నోబిల్ అణు ప్లాంటును కూడా రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. రాజధాని కీవ్‌కు ఉత్తరాన 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చారిత్రక ప్లాంటు హోరాహోరీ పోరాటం అనంతరం రష్యా స్వాధీనమైనట్టు ఉక్రెయిన్ పేర్కొంది. 1986లో చెర్నోబిల్ అణు రియాక్టర్ పేలి పెను విధ్వంసం సృష్టించింది. రేడియో ధార్మికత విస్తరించకుండా ప్లాంటును పూర్తిగా మూసేశారు. తాజాగా రష్యా దళాల కాల్పుల్లో రేడియో ధార్మిక వ్యర్థాల ప్లాంటు ధ్వంసమైందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
రష్యాపై పోరాడండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు
రష్యా దాడుల నుంచి దేశాన్ని కాపాడుకొనేందుకు ప్రజలు ముందుకు రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. రష్యాపై పోరాడేందుకు సిద్ధపడినవారికి ఆయుధాలు అందిస్తామన్నారు. ఈ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని రష్యా ప్రజలను సైతం కోరారు. రష్యా నాయకత్వం వైఖరిని వ్యతిరేకిస్తూ గొంతు విప్పాలని అన్నారు. రష్యా దూకుడు చర్యల నుంచి తమ గగనతలాన్ని రక్షించుకొనేందుకు చేయూతనివ్వాలని, సైనిక సాయం అందజేయాలని ప్రపంచ దేశాల అధినేతలకు విన్నవించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, యూకే అధ్యక్షుడు జాన్సన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్, పోలాండ్ అధ్యక్షుడు అండ్రెజ్, లిథ్వేనియా అధ్యక్షుడు గిటానస్‌తో మాట్లాడానని, పరిస్థితి వివరించానని తెలిపారు. పుతిన్ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామన్నారు. రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని ప్రపంచ దేశాలను జేలెన్‌స్కీ కోరారు. ఉక్రెయిన్‌ను కాపాడుకోవడం అందరి ధర్మం అని స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ వార్నింగ్
ప్రత్యర్థులను కర్కశంగా అణిచివేస్తాడని పేరున్న పుతిన్ మరోమారు తన కర్కశత్వాన్ని చూపారు. ‘మాకు అడ్డుపడాలని ఎవరు ప్రయత్నించినా, మా దేశానికి, మా ప్రజలకు బెదిరింపులు చేసినా, రష్యా ప్రతిస్పందన తక్షణమే ఉంటుంది. మా ప్రతిస్పందన మీరు చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామాలకు దారి తీస్తుందని తెలుసుకోండి’ అని పుతిన్ ప్రకటన విడుదల చేశారు. అలాగే తమ వద్ద అణ్వాయుధాలున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘మా దేశంపై ప్రత్యక్ష దాడి జరిగితే అది దాడి చేసిన వారి వినాశనానికి, భయంకర పరిణామాలకు కారణమవుతుందనే విషయంలో ఎవరకీ సందేహం వద్దు’ అని వార్నింగ్ ఇచ్చారు. తమ దేశం రష్యాకు హానికారకం కాదని, విబేధాలను పక్కనపెట్టి శాంతికి కృషి చేద్దామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించిన కొద్దిసేపటికే పుతిన్ వార్నింగ్ వచ్చింది.
దాడుల్లో మృతి చెందిన సైనికుడు
Comments
Please login to add a commentAdd a comment