కీవ్: ఉక్రెయిన్‌పై కొన్ని నెలలుగా సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ క్రమంలోనే నాలుగు కీలక ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఆ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అయితే.. ఉక్రెయిన్ తెగువకు రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పుతిన్ సేనలను చుట్టుముడుతూ.. ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది ఉక్రెయిన్. కీవ్ వ్యూహరచనతో రష్యా సేనలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కీలక ప్రాంతాలను వదిలి వెనక్కి మళ్లుతున్నట్లు రష్యా సైతం ఒప్పకోవటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
తాజాగా మరో రష్యాకు గట్టి షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. క్రెమ్లిన్ విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించిన నాలుగు ప్రాంతాల్లోని 400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకున్నట్లు ప్రకటించింది. ‘అక్టోబర్ నెల మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఖేర్సన్ ప్రాంతంలో సుమారు 400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.’ అని ఉక్రేనియన్ దక్షిణ ఆర్మీ కమాండ్ ప్రతినిధి నటాలియా గుమెనియుక్ వెల్లడించారు. మరోవైపు.. ఈ వాదనలను తోసిపుచ్చింది రష్యన్ ఆర్మీ. రష్యా సరిహద్దు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సేనలను మరింత వెనక్కి పంపించినట్లు పేర్కొంది. దడ్చనీ, సుఖనోవ్, కడాక్, బ్రుస్కినస్కో ప్రాంతాల్లో చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. తమ బలగాలు అడ్డుకుంటున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: విలీనానికి రష్యా చట్టసభ సభ్యుల ఆమోదం
Comments
Please login to add a commentAdd a comment