కీవ్: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేపట్టిన రష్యాకు కీవ్ సైన్యం ప్రతిఘటన ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. దీంతో ఆక్రమించుకున్న కీలక నగరాలను విడిచి వెనక్కి వెళ్తున్నాయి రష్యా సేనలు. ఇటీవలే ఖేర్సన్ నగరాన్ని తమ బలగాలు ఖాళీ చేసినట్లు రష్యా ప్రకటించింది. మాస్కో బలగాలు తిరిగి వెళ్లిపోయిన క్రమంలో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేసిన ఓ పౌరుడు.. రష్యా సేనలు పులిని చూసిన మేకల వలే పారిపోయాయని ఓ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
‘పుతిన్ మమ్మల్ని చంపాలనుకున్నాడు. కానీ తన సొంత దేశాన్ని నాశనం చేసుకున్నాడు. ఖేర్సన్ నుంచి తిరిగి వెళ్లిపోవటం రష్యాకు ఘోర పరాభవం.’ అని పేర్కొన్నాడు ఖేర్సన్ పౌరుడు. మరోవైపు.. రష్యా బలగాలు వెళ్లిపోయిన క్రమంలో స్థానికులు బ్లూ అండ్ ఎల్లో ఫ్లాగ్స్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. ఖేర్సన్‌కు స్వతంత్రం వచ్చిందంటూ నినాదాలు చేశారు. గత శనివారం పోలీసు, టీవీ, రేడియో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. స్థానిక పరిపాలన భవనం వద్ద డ్యాన్సులు చేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఉక్రెయిన్ సాయుధ బలగాలకు చెందిన జెడ్-ఎస్-యూ అనే అక్షరాలను పలుకుతూ హోరెత్తించారు.
మరోవైపు.. రష్యా బలగాలు తిరిగి వెళ్లిపోయినప్పుటికీ నగరాన్ని పునరుద్ధరించటంలో చాలా సవాళ్లు ఎదురుకానున్నాయి. రష్యాతో యుద్ధంలో ఖేర్సన్ నగరం భారీగా దెబ్బతిన్నది. నీరు, విద్యుత్తు, ఔషధాలు, ఆహారం వంటి వాటి కొరత తీవ్రంగా ఉంది. రష్యా బలగాలు వెళ్తూ వెళ్తూ కీలక మౌలిక సదుపాయాలైన సమాచార, నీటి సరఫరా, విద్యుత్తు వంటి వాటిని ధ్వంసం చేసి వెళ్లినట్లు అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.
ఇదీ చదవండి: మోదీ ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ పేలుడు.. తప్పిన పెను ప్రమాదం!
Comments
Please login to add a commentAdd a comment