
ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను తమలో విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించిన రెండు రోజుల్లోనే ఇలా జరగటంతో రష్యాకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
కీవ్: ఉక్రెయిన్‌తో గత కొన్ని నెలలుగా యుద్ధం చేస్తున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రష్యా బలగాల ఆధీనంలో ఉన్న ఖార్కీవ్‌లోని రెండో అతిపెద్ద నగరమైన లైమన్‌ను ఉక్రెయిన్ దళాలు చుట్టుముట్టాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి మాస్కో తన బలగాలను వెనక్కి రప్పించాల్సి వచ్చింది. ఇది జెలెన్‌స్కీ సేనకు వ్యూహాత్మక విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను తమలో విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించిన రెండు రోజుల్లోనే ఇలా జరగటంతో రష్యాకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ క్రమంలో మాస్కో స్వల్ప శ్రేణి అణు బాంబులను పరిశీలించాలని సూచించారు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు, చెచ్నియా నాయకుడు రామ్‌జాన్ కడిరోవ్. సరిహద్దు ప్రాంతంలో మార్షల్ చట్టాన్ని ప్రయోగించాలన్నారు.
లైమన్ నగరం నుంచి బలగాలను ఉపసంహరించినట్లు రష్యా సైతం ప్రకటన చేసింది. అయితే, ఉక్రెయిన్ దళాలు తమను చుట్టుముట్టలేదని, తామే వ్యూహాత్మకంగా వదిలేసి వచ్చామని బుకాయించే ప్రయత్నం చేసింది. లైమన్ నగరంలో రష్యా దళాలు సుమారు 5000లకుపైగా ఉన్నాయని, శత్రు దేశ బలగాలు అంతకన్నా తక్కువేనని పేర్కొంది. ‘ఉక్రెయిన్ బలగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉందన్న అంచనాలతో వ్యూహాత్మకంగా తమ బలగాలను ఉపసంహరించుకున్నాం.’ అని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. లైమన్ నగరాన్ని చుట్టుముట్టామని, తమ బలగాలు నగరంలోకి ప్రవేశించాయని ఉక్రెయిన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన రావటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: Russia-Ukraine War: ‘రష్యా రిఫరెండం’పై ఓటింగ్‌కు భారత్ దూరం