troops movement
-
Russia Ukraine War: పులిని చూసిన మేకల్లా పారిపోయారు!
కీవ్: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేపట్టిన రష్యాకు కీవ్ సైన్యం ప్రతిఘటన ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. దీంతో ఆక్రమించుకున్న కీలక నగరాలను విడిచి వెనక్కి వెళ్తున్నాయి రష్యా సేనలు. ఇటీవలే ఖేర్సన్ నగరాన్ని తమ బలగాలు ఖాళీ చేసినట్లు రష్యా ప్రకటించింది. మాస్కో బలగాలు తిరిగి వెళ్లిపోయిన క్రమంలో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేసిన ఓ పౌరుడు.. రష్యా సేనలు పులిని చూసిన మేకల వలే పారిపోయాయని ఓ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ‘పుతిన్ మమ్మల్ని చంపాలనుకున్నాడు. కానీ తన సొంత దేశాన్ని నాశనం చేసుకున్నాడు. ఖేర్సన్ నుంచి తిరిగి వెళ్లిపోవటం రష్యాకు ఘోర పరాభవం.’ అని పేర్కొన్నాడు ఖేర్సన్ పౌరుడు. మరోవైపు.. రష్యా బలగాలు వెళ్లిపోయిన క్రమంలో స్థానికులు బ్లూ అండ్ ఎల్లో ఫ్లాగ్స్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. ఖేర్సన్కు స్వతంత్రం వచ్చిందంటూ నినాదాలు చేశారు. గత శనివారం పోలీసు, టీవీ, రేడియో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. స్థానిక పరిపాలన భవనం వద్ద డ్యాన్సులు చేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఉక్రెయిన్ సాయుధ బలగాలకు చెందిన జెడ్-ఎస్-యూ అనే అక్షరాలను పలుకుతూ హోరెత్తించారు. మరోవైపు.. రష్యా బలగాలు తిరిగి వెళ్లిపోయినప్పుటికీ నగరాన్ని పునరుద్ధరించటంలో చాలా సవాళ్లు ఎదురుకానున్నాయి. రష్యాతో యుద్ధంలో ఖేర్సన్ నగరం భారీగా దెబ్బతిన్నది. నీరు, విద్యుత్తు, ఔషధాలు, ఆహారం వంటి వాటి కొరత తీవ్రంగా ఉంది. రష్యా బలగాలు వెళ్తూ వెళ్తూ కీలక మౌలిక సదుపాయాలైన సమాచార, నీటి సరఫరా, విద్యుత్తు వంటి వాటిని ధ్వంసం చేసి వెళ్లినట్లు అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఇదీ చదవండి: మోదీ ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ పేలుడు.. తప్పిన పెను ప్రమాదం! -
Russia-Ukraine war: రష్యా పీఛేముడ్!
మైకోలైవ్: ఉక్రెయిన్‌తో పోరులో రష్యాకు అవమానకరమైన రీతిలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎనిమిదిన్నర నెలల యుద్ధంలో స్వాధీనం చేసుకున్న ఏకైక ప్రాంతీయ రాజధాని ఖెర్సన్‌ను కూడా వదిలేసుకుంది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి ఖెర్సన్ నగరం సహా నీపర్ నది పశ్చిమ తీరం నుంచి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. మిలటరీ సామగ్రిని కూడా వెనక్కి తరలించినట్లు వెల్లడించింది. తాజా పరిణామాన్ని అధ్యక్షుడు పుతిన్ ఇబ్బందికరంగా భావించడం లేదని, ఖెర్సన్ ఇప్పటికీ తమదేనని రష్యా అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఖెర్సన్, మరో మూడు ప్రాంతాలు తమవేనంటూ నెల క్రితం రష్యా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. రష్యా ఆర్మీ పూర్తి స్థాయి ఉపసంహరణకు కనీసం మరో వారం పట్టొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా ఆర్మీ వెళ్లిపోయిన ఖెర్సన్‌లో పౌరులు ఉక్రెయిన్ జాతీయ జెండాలను ఎగురవేసి, హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఖెర్సన్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి కష్టతరంగా ఉందంటూ అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొనడం గమనార్హం. ఇటీవల తమ ఆర్మీ తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలపైకి రష్యా దాడులు కొనసాగుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. రష్యా బలగాలు దొంగచాటున దాడులకు పాల్పడే ప్రమాదముందని, ఖెర్సన్‌ను ల్యాండ్మైన్లతో మృత్యునగరంగా మార్చేశారని ఉక్రెయిన్ అధికారులు అంటున్నారు. ఖెర్సన్‌పై పట్టుసాధించిన ఉక్రెయిన్ ఆర్మీ రష్యా ఆక్రమణలోని క్రిమియా తదితర దక్షిణ ప్రాంతాలపైకి దృష్టి సారించనుంది. ఉక్రెయిన్ సైన్యానికి, సరఫరాల రవాణాకు తీరప్రాంత ఖెర్సన్ ఒబ్లాస్ట్ రాజధాని ఖెర్సన్ నగరం వ్యూహాత్మకంగా చాలా కీలకంగా మారింది. -
కశ్మీర్‌కు పదివేల బలగాలు
న్యూఢిల్లీ/కశ్మీర్: కశ్మీర్ లోయకు పదివేల మంది భద్రతా బలగాలను తక్షణం తరలించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు, శాంతి భద్రతల విధి నిర్వహణకు వీరిని పంపుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 100 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్)ను తక్షణం తరలించాలని కేంద్ర హోం శాఖ ఈనెల 25వ తేదీన ఉత్తర్వులు వెలువరించిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మరికొన్ని బలగాలను కూడా తరలించే యోచనలో కేంద్రం ఉందని కూడా వెల్లడించారు. ఒక సీఏపీఎఫ్ కంపెనీలో 100 మంది సిబ్బంది ఉంటారు. కశ్మీర్ లోయకు పంపే వారిలో సీఆర్పీఎఫ్కు చెందిన 50 కంపెనీలు, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) నుంచి 30, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ నుంచి పదేసి కంపెనీల చొప్పున బలగాలు ఉంటాయన్నారు. వీరందరినీ రైళ్లు, విమానాల్లో విధులు చేపట్టే ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఉగ్ర నిరోధక చర్యలతోపాటు అమర్నాథ్ యాత్రకు బందోబస్తు కల్పిస్తున్న 80 బెటాలియన్ల బలగాలకు వీరు అదనమన్నారు. ఒక్కో బెటాలియన్‌లో వెయ్యి మంది సిబ్బంది ఉంటారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపాలని యోచిస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ బలగాలను మోహరిస్తోందని భావి స్తున్నారు. బలగాలను తరలించాలన్న కేం ద్రం నిర్ణయాన్ని పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. జైషే టాప్ కమాండర్ హతం శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ అగ్రశ్రేణి జైషే మహమ్మద్ (జేఎం)కు చెందిన కమాండర్ మున్నా లాహోరిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శుక్రవారం రాత్రి సోపియాన్‌లోని బోన్బజార్ ప్రాంతం బండే మొహల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గత నెలలో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన కారు పేలు డుకు లాహోరి కారణమని పోలీసులు తెలి పారు. పాక్ జాతీయుడైన మున్నా లాహోరి కశ్మీర్లో వరుస పౌర హత్యలకు పాల్పడ్డా డని తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదుల నియా మకం కోసం లాహోరిని జైషే నియమిం చిందని, అతడు పేలుడు పరికరాల తయా రీలో సిద్ధహస్తుడని పోలీసులు తెలిపారు. -
సత్యసంధతే క్షేమం!
ఆదినుంచీ క్రమశిక్షణకు మారుపేరుగా, వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్న మన సైన్యంపై నాలుగేళ్ల క్రితం ఒక ఆంగ్ల దినపత్రికలో సంచలనాత్మక కథనం వెలువడింది. 2012 జనవరి 16న ఢిల్లీ వెలుపల సైన్యం కదలికలు ప్రభుత్వాన్ని కలవరపరిచాయన్నది ఆ కథనం సారాంశం. అప్పటినుంచీ ఆ కథనం అడపా దడపా చర్చల్లోకి వస్తూనే ఉంది. అలా వచ్చిన ప్రతిసారీ వివాదం అవుతూనే ఉంది. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ ఈసారి ఆ పుణ్యం కట్టుకున్నారు. ఎప్పట్లానే మరోసారి అది పతాక శీర్షికలకెక్కింది. హర్యానాలో ఉన్న పదాతి దళానికి చెందిన సాంకేతిక విభాగం, ఆగ్రాలో ఉన్న పారా బ్రిగేడ్ దళాలు అసాధారణ రీతిలో ఢిల్లీ వైపు కదలివచ్చాయని ఆనాటి కథనం వెల్లడించింది. అప్పట్లో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఈ కథనాన్ని తీవ్రంగా ఖండించింది. సైన్యానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ రాసే ఈ మాదిరి రాతలు దేశ క్షేమం రీత్యా సబబు కాదని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ వ్యాఖ్యానించారు. సైనిక దళాలకు రివాజుగా ఉండే విన్యాసాలే ఆ రోజూ సాగాయి తప్ప అందులో ‘అసాధారణత’ ఏం లేదని వారు చెప్పారు. సైన్యం కదలికలకు సంబంధించిన కథనంలోనే దానికి కొనసాగింపుగా ఇంకేమి పరిణామాలు చోటుచేసుకున్నాయో ఉంది. అయితే వాటికి సంబంధించిన అంశాలపై మాత్రం ఎవరూ వివరణ ఇవ్వలేదు. మన దేశంలో మొదటినుంచీ ఇదే సమస్య. దేన్నయినా సందేహాతీతంగా చెప్పడం పాలకులకు చేతకాదు. నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణం మొదలుకొని ప్రాముఖ్యతగల ప్రతి విషయాన్నీ జనం ఊహలకూ, కల్పనలకూ వదిలేయడమే అలవాటు. ఫలితంగా ఏదో దాస్తున్నారన్న అభిప్రాయం కలగడానికే ఎక్కువ ఆస్కారం ఏర్పడుతోంది. తాజాగా కాంగ్రెస్ నాయకుడు మనీశ్ తివారీ ఆ కథనం ‘దురదృష్టకరమైనదే అయినా వాస్తవం’ అని వ్యాఖ్యానించారు. ఆ విషయాన్ని అప్పట్లో రక్షణ మంత్రి త్వ శాఖ అధికారి ఒకరు ప్రైవేటు సంభాషణలో ధ్రువీకరించారని కూడా వెల్లడించారు. మళ్లీ యథాప్రకారం దానిపై ఖండనమండనలు మొదలయ్యాయి. సంబంధంలేని విషయాలు మాట్లాడొద్దని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ మనీశ్‌ను మందలించారు. ఆ సమయంలో దళాల కదలిక నిజమే అయినా రక్షణ నిర్మాణంలో అది అంతర్భాగమే తప్ప అందులో మరింకేదో వెదకడం సరికాదని వివరణనిచ్చారు. బీజేపీ కూడా మనీశ్ ప్రకటనను ఖండించడంతోపాటు మన్మోహన్, ఆంటోనీలు దీనిపై మాట్లాడాలని డిమాండ్ చేసింది. ఇలా అధికార, విపక్షాలు రెండూ ఏకమై ఖండించినంత మాత్రాన ఇది సమసిపోదు. దాన్ని అంగీకరిస్తే ఆనాటి తమ అధికారిక వివరణకు విరుద్ధమవుతుందని కాంగ్రెస్... ఈ వివాదం ముదిరి వీకే సింగ్‌ను ప్రస్తుతం మంత్రి పదవినుంచి తప్పించవలసి రావొచ్చునని బీజేపీ అనుకుంటున్నాయన్న అభిప్రాయం జనంలో కలగడానికి ఆస్కారం ఏర్పడుతుందని ఆ రెండు పార్టీలూ గుర్తించాలి. ఆంగ్ల దినపత్రిక కథనం సంచలనం కలిగించడానికి కారణాలున్నాయి. అప్పట్లో సైనిక దళాల ప్రధానాధికారిగా వ్యవహరించిన జనరల్ వీకే సింగ్ పుట్టిన తేదీకి సంబంధించిన వివాదంలో చిక్కుకున్నారు. తన సర్టిఫికెట్లలో తేదీ తప్పుగా పడటంవల్ల ముందుగా రిటైర్ కావలసివస్తున్నదని, దాన్ని సరిచేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు. ప్రభుత్వం అందుకు తిరస్కరించింది. దానిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలా ఆశ్రయించిన రోజు రాత్రే(2012 జనవరి 16) సైన్యం కదలికలపై ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రభుత్వానికి ఉప్పందించాయని ఆంగ్ల పత్రిక కథనం తెలిపింది. ఇది తెలిశాక అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి శశికాంత్ శర్మను ఆదరాబాదరగా మలేసియానుంచి రప్పించారని, ఆయన రాత్రి 11 గంటల సమయంలో తన కార్యాలయాన్ని తెరిచి, మిలిటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరల్(డీజీఎంఓ) ఏకే చౌధురిని తక్షణం రమ్మని కబురంపారని వెల్లడించింది. ఆ కదలికలను ఆపమని కూడా చౌధురికి ఆదేశాలు వెళ్లాయన్నది. పర్యవసానంగా కొన్ని గంటల్లోనే అంతా సర్దుకుందని చెప్పింది. కథనం ఉత్తదే అన్నవారు ఇలాంటి ఇతర అంశాల జోలికిపోలేదు. సరికదా నిరుడు ఏకే చౌధురి ఒక ఇంటర్వ్యూలో సైనిక దళాల కదలిక, అర్థరాత్రి కబురొస్తే తాను శశికాంత్ శర్మను కలవడం నిజమేనని ఒప్పుకున్నారు. అంతేకాదు...సైన్యానికీ, ప్రభుత్వానికీ మధ్య అపార్థాలూ లేదా కొన్ని అంశాలపట్ల విభిన్న దృక్పథాలు లేదా విశ్వాసరాహిత్యమూ ఉండొచ్చునని కూడా అన్నారు. ఈ కదలికల విషయమై ఉన్నతస్థాయిలోని వారు కలవరపడినందువల్ల వాటిని తక్షణం ఆపాలని శర్మ కోరారని చెప్పారు. నిజానికి సైనిక దళాల చీఫ్‌గా ఆ సమయంలో వీకే సింగ్ కాక మరెవరైనా ఉంటే అసలీ అపార్థాలే తలెత్తేవి కాదేమో! ఎందుకంటే వీకే సింగ్ అంతక్రితమే ‘మన రక్షణ మేడిపండు...మన దళాల సంసిద్ధత ఉత్త డొల్ల’ అంటూ ప్రధానినుద్దేశించి ఒక లేఖ రాశారు. నాసిరకం ట్రక్కుల్ని కొనుగోలు చేస్తే రూ. 14 కోట్లు ఇస్తానంటూ ఒక దళారీ తన దగ్గరకొచ్చాడని అందులో ఆయన ఆరోపించారు. సైనిక దళాల చీఫ్‌గా ఉన్నవారు ఈ స్థాయిలో ఆరోపణలు చేయడమైనా, వివాదాల్లో చిక్కుకోవడమైనా అంతక్రితంగానీ, ఆ తర్వాతగానీ లేదు. ఇప్పుడు ఈ వివాదం లేవనెత్తిన మనీశ్‌కు జవాబుగా ‘నా పుస్తకంలో వివరంగా రాశాను...చదవండి’ అని సింగ్ చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు ఏదో ఒకటి చెప్పడంకాక ప్రభుత్వమే ఉన్నదున్నట్టు తేటతెల్లం చేస్తే అప్పట్లోనే అది సద్దుమణిగేది. ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు మించిన శక్తిమంతమైన ఆయుధం మరేదీ లేదు. అందరూ మనుషులే గనుక పొరపాటో, తొందరపాటో, అపార్థాలో చోటుచేసుకోవచ్చు. వాటిని దాచిపెట్టడంకంటే కాస్త వెనకో, ముందో వెల్లడించడమే శ్రేయస్కరం. అలా చేయకపోవడంవల్లే సమస్యలొస్తున్నాయని అన్ని పక్షాలూ గుర్తించడం మంచిది.