ఆదినుంచీ క్రమశిక్షణకు మారుపేరుగా, వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్న మన సైన్యంపై నాలుగేళ్ల క్రితం ఒక ఆంగ్ల దినపత్రికలో సంచలనాత్మక కథనం వెలువడింది. 2012 జనవరి 16న ఢిల్లీ వెలుపల సైన్యం కదలికలు ప్రభుత్వాన్ని కలవరపరిచాయన్నది ఆ కథనం సారాంశం. అప్పటినుంచీ ఆ కథనం అడపా దడపా చర్చల్లోకి వస్తూనే ఉంది. అలా వచ్చిన ప్రతిసారీ వివాదం అవుతూనే ఉంది. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ ఈసారి ఆ పుణ్యం కట్టుకున్నారు. ఎప్పట్లానే మరోసారి అది పతాక శీర్షికలకెక్కింది.
హర్యానాలో ఉన్న పదాతి దళానికి చెందిన సాంకేతిక విభాగం, ఆగ్రాలో ఉన్న పారా బ్రిగేడ్ దళాలు అసాధారణ రీతిలో ఢిల్లీ వైపు కదలివచ్చాయని ఆనాటి కథనం వెల్లడించింది. అప్పట్లో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఈ కథనాన్ని తీవ్రంగా ఖండించింది. సైన్యానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ రాసే ఈ మాదిరి రాతలు దేశ క్షేమం రీత్యా సబబు కాదని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ వ్యాఖ్యానించారు. సైనిక దళాలకు రివాజుగా ఉండే విన్యాసాలే ఆ రోజూ సాగాయి తప్ప అందులో ‘అసాధారణత’ ఏం లేదని వారు చెప్పారు. సైన్యం కదలికలకు సంబంధించిన కథనంలోనే దానికి కొనసాగింపుగా ఇంకేమి పరిణామాలు చోటుచేసుకున్నాయో ఉంది. అయితే వాటికి సంబంధించిన అంశాలపై మాత్రం ఎవరూ వివరణ ఇవ్వలేదు. మన దేశంలో మొదటినుంచీ ఇదే సమస్య. దేన్నయినా సందేహాతీతంగా చెప్పడం పాలకులకు చేతకాదు. నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణం మొదలుకొని ప్రాముఖ్యతగల ప్రతి విషయాన్నీ జనం ఊహలకూ, కల్పనలకూ వదిలేయడమే అలవాటు. ఫలితంగా ఏదో దాస్తున్నారన్న అభిప్రాయం కలగడానికే ఎక్కువ ఆస్కారం ఏర్పడుతోంది.
తాజాగా కాంగ్రెస్ నాయకుడు మనీశ్ తివారీ ఆ కథనం ‘దురదృష్టకరమైనదే అయినా వాస్తవం’ అని వ్యాఖ్యానించారు. ఆ విషయాన్ని అప్పట్లో రక్షణ మంత్రి త్వ శాఖ అధికారి ఒకరు ప్రైవేటు సంభాషణలో ధ్రువీకరించారని కూడా వెల్లడించారు. మళ్లీ యథాప్రకారం దానిపై ఖండనమండనలు మొదలయ్యాయి. సంబంధంలేని విషయాలు మాట్లాడొద్దని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ మనీశ్‌ను మందలించారు.
ఆ సమయంలో దళాల కదలిక నిజమే అయినా రక్షణ నిర్మాణంలో అది అంతర్భాగమే తప్ప అందులో మరింకేదో వెదకడం సరికాదని వివరణనిచ్చారు. బీజేపీ కూడా మనీశ్ ప్రకటనను ఖండించడంతోపాటు మన్మోహన్, ఆంటోనీలు దీనిపై మాట్లాడాలని డిమాండ్ చేసింది. ఇలా అధికార, విపక్షాలు రెండూ ఏకమై ఖండించినంత మాత్రాన ఇది సమసిపోదు. దాన్ని అంగీకరిస్తే ఆనాటి తమ అధికారిక వివరణకు విరుద్ధమవుతుందని కాంగ్రెస్... ఈ వివాదం ముదిరి వీకే సింగ్‌ను ప్రస్తుతం మంత్రి పదవినుంచి తప్పించవలసి రావొచ్చునని బీజేపీ అనుకుంటున్నాయన్న అభిప్రాయం జనంలో కలగడానికి ఆస్కారం ఏర్పడుతుందని ఆ రెండు పార్టీలూ గుర్తించాలి.
ఆంగ్ల దినపత్రిక కథనం సంచలనం కలిగించడానికి కారణాలున్నాయి. అప్పట్లో సైనిక దళాల ప్రధానాధికారిగా వ్యవహరించిన జనరల్ వీకే సింగ్ పుట్టిన తేదీకి సంబంధించిన వివాదంలో చిక్కుకున్నారు. తన సర్టిఫికెట్లలో తేదీ తప్పుగా పడటంవల్ల ముందుగా రిటైర్ కావలసివస్తున్నదని, దాన్ని సరిచేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు. ప్రభుత్వం అందుకు తిరస్కరించింది. దానిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలా ఆశ్రయించిన రోజు రాత్రే(2012 జనవరి 16) సైన్యం కదలికలపై ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రభుత్వానికి ఉప్పందించాయని ఆంగ్ల పత్రిక కథనం తెలిపింది.
ఇది తెలిశాక అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి శశికాంత్ శర్మను ఆదరాబాదరగా మలేసియానుంచి రప్పించారని, ఆయన రాత్రి 11 గంటల సమయంలో తన కార్యాలయాన్ని తెరిచి, మిలిటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరల్(డీజీఎంఓ) ఏకే చౌధురిని తక్షణం రమ్మని కబురంపారని వెల్లడించింది. ఆ కదలికలను ఆపమని కూడా చౌధురికి ఆదేశాలు వెళ్లాయన్నది. పర్యవసానంగా కొన్ని గంటల్లోనే అంతా సర్దుకుందని చెప్పింది. కథనం ఉత్తదే అన్నవారు ఇలాంటి ఇతర అంశాల జోలికిపోలేదు. సరికదా నిరుడు ఏకే చౌధురి ఒక ఇంటర్వ్యూలో సైనిక దళాల కదలిక, అర్థరాత్రి కబురొస్తే తాను శశికాంత్ శర్మను కలవడం నిజమేనని ఒప్పుకున్నారు. అంతేకాదు...సైన్యానికీ, ప్రభుత్వానికీ మధ్య అపార్థాలూ లేదా కొన్ని అంశాలపట్ల విభిన్న దృక్పథాలు లేదా విశ్వాసరాహిత్యమూ ఉండొచ్చునని కూడా అన్నారు. ఈ కదలికల విషయమై ఉన్నతస్థాయిలోని వారు కలవరపడినందువల్ల వాటిని తక్షణం ఆపాలని శర్మ కోరారని చెప్పారు.
నిజానికి సైనిక దళాల చీఫ్‌గా ఆ సమయంలో వీకే సింగ్ కాక మరెవరైనా ఉంటే అసలీ అపార్థాలే తలెత్తేవి కాదేమో! ఎందుకంటే వీకే సింగ్ అంతక్రితమే ‘మన రక్షణ మేడిపండు...మన దళాల సంసిద్ధత ఉత్త డొల్ల’ అంటూ ప్రధానినుద్దేశించి ఒక లేఖ రాశారు. నాసిరకం ట్రక్కుల్ని కొనుగోలు చేస్తే రూ. 14 కోట్లు ఇస్తానంటూ ఒక దళారీ తన దగ్గరకొచ్చాడని అందులో ఆయన ఆరోపించారు. సైనిక దళాల చీఫ్‌గా ఉన్నవారు ఈ స్థాయిలో ఆరోపణలు చేయడమైనా, వివాదాల్లో చిక్కుకోవడమైనా అంతక్రితంగానీ, ఆ తర్వాతగానీ లేదు.
ఇప్పుడు ఈ వివాదం లేవనెత్తిన మనీశ్‌కు జవాబుగా ‘నా పుస్తకంలో వివరంగా రాశాను...చదవండి’ అని సింగ్ చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు ఏదో ఒకటి చెప్పడంకాక ప్రభుత్వమే ఉన్నదున్నట్టు తేటతెల్లం చేస్తే అప్పట్లోనే అది సద్దుమణిగేది. ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు మించిన శక్తిమంతమైన ఆయుధం మరేదీ లేదు. అందరూ మనుషులే గనుక పొరపాటో, తొందరపాటో, అపార్థాలో చోటుచేసుకోవచ్చు. వాటిని దాచిపెట్టడంకంటే కాస్త వెనకో, ముందో వెల్లడించడమే శ్రేయస్కరం. అలా చేయకపోవడంవల్లే సమస్యలొస్తున్నాయని అన్ని పక్షాలూ గుర్తించడం మంచిది.
సత్యసంధతే క్షేమం!
Published Tue, Jan 12 2016 12:09 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement