
కీవ్: ఉక్రెయిన్‌లో హోరాహోరి పోరు కొనసాగుతోంది. రష్యా బలగాలు ఉక్రెయిన్‌లో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. వారి దాడులను ఉక్రెయిన్ సైన్యం తిప్పికొడుతున్నప్పటికీ అక్కడ తీవ్ర నష్టం జరుగుతోంది.
తాజాగా రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని అతిపెద్ద నగరం ఖార్కీవ్‌లో దాడులు కొనసాగిస్తున్నాయి. రష్యా యుద్ద విమానాల దాడుల్లో మంగళవారం ఖార్కీవ్ నగర పరిపాలనా భవనం ఫ్రీడమ్ స్వ్కేర్ కుప్పకూలిపోయింది. మరోవైపు రష్యా బలగాలు ఖార్కీవ్‌లోని ఓ ఆసుపత్రిపై దాడులు చేసినట్టు ఉక్రెయిన్ సైన‍్యం పేర్కొంది. రష్యా వైమానిక బలగాలు ఖార్కీవ్‌లోకి ప్రవేశించాయి. వారు స్థానిక ఆసుపత్రులపై దాడులు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎదురు దాడులు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ ఆర్మీ మంగళవారం ప్రకటించింది.
మరోవైపు ఫ్రీడమ్ స్క్వేర్ కూల్చివేత, ఆసుపత్రిపై దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. ఈ దాడి రష్యా ప్రభుత్వ ఉగ్ర చర్య అని జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని ఎవరూ క్షమించలేరంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. తమ బలమేంటో నిరూపించుకుంటామని రష్యాకు వార్నింగ్ ఇచ్చారు.